కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

బంధువులను వివాహం చేసుకోవడానికి సంబంధించి ధర్మశాస్త్రం చెబుతున్న పరిమితులు నేడు క్రైస్తవులకు ఎంత మేరకు వర్తిస్తాయి?

ఇశ్రాయేలు జనాంగానికి యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రము వివాహ సంబంధిత ఆచారాల గురించి పద్ధతుల గురించీ ఏమీ చెప్పడం లేదు. అయితే, కొన్ని వివాహ సంబంధాలపై ఆంక్షలను విధించింది. ఉదాహరణకు, లేవీయకాండము 18:6-20 లో సంబంధాలు పెట్టుకోకూడని “రక్తసంబంధుల” పట్టికను చూడవచ్చు. ఆ భాగం, ఎటువంటి రక్తసంబంధంగల వారు ఒకరితోనొకరు లైంగిక సంబంధం కలిగివుండకూడదన్నది ఎంతో వివరంగా చెబుతోంది. నిజమే, క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రం క్రింద గానీ, దాని ఆజ్ఞల క్రింద గానీ లేరు. (ఎఫెసీయులు 2:​14; కొలొస్సయులు 2:​13-15) మనం ధర్మశాస్త్రం క్రింద లేనంత మాత్రాన, అందులో పేర్కొన్న విషయాలు వివాహ భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు నిర్లక్ష్యం చేయవచ్చని కాదు. అలా నిర్లక్ష్యం చేయకూడదనడానికి అనేక కారణాలు ఉన్నాయి.

మొదటిగా, దగ్గరి బంధువులను వివాహం చేసుకోవడాన్ని నియంత్రించే ప్రభుత్వ చట్టాలున్నాయి, క్రైస్తవులు నిజానికి తాము నివసించే దేశపు చట్టాలను అనుసరించ బద్ధులై ఉన్నారు. (మత్తయి 22:​21; రోమీయులు 13:⁠1) నిజమే, అలాంటి చట్టాలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి. ఈ రకమైన ఆధునిక చట్టాల్లో అనేకము, ముఖ్యంగా, జన్యుపరమైన కారణాలను పరిగణనలోకి తీసుకుని చేయబడ్డాయి. దగ్గరి బంధువులను చేసుకుంటే పిల్లలు అంగ వైకల్యాలతోను వ్యాధులతోను జన్మించే సాధ్యత ఎక్కువగా ఉందన్నది జగమెరిగిన సత్యం. పిల్లలు అలా పుట్టే సాధ్యత ఉన్నందువల్ల, అలాగే క్రైస్తవులు “పై అధికారులకు లోబడి” ఉంటున్నందు వల్ల, వారు స్థానిక వివాహ చట్టాలను అనుసరించి వివాహం చేసుకుంటారు.

అంతేకాక, మనం ఉంటున్న సమాజంలో ఏది అంగీకారయోగ్యమైనది, ఏది కాదు అన్నది కూడా చూడాలి. దాదాపు అన్ని సంస్కృతుల్లోను దగ్గరి రక్తసంబంధీకులను వివాహం చేసుకోవడాన్ని వావి వరుసలు తప్పిన సంబంధంగా నిషిద్ధమైనదిగా దృష్టిస్తూ దానిని ఖండించే నియమాలూ సాంప్రదాయాలు ఉన్నాయి. వివిధ సంస్కృతులు వేర్వేరు రక్తసంబంధాలను నిషేధిస్తుండవచ్చు. అయినప్పటికీ, “వ్యక్తుల మధ్య ఉన్న జన్యు సంబంధం ఎంత దగ్గరిదైతే, అలాంటి వాళ్ళ మధ్య లైంగిక సంబంధం ఉండకూడదని నిరుత్సాహపరిచే నిషేధం అంత బలంగా అంత తీవ్రంగా ఉంటుంది” అని ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెబుతుంది. కాబట్టి క్రైస్తవులు బంధువులను వివాహం చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఆ సంబంధం వావివరుసలు తప్పినది కాకపోయినా సమాజంలో స్థిరపడిన ఆచారాలనూ న్యాయమైన మనోభావాలనూ నిర్లక్ష్యం చేయరు, ఆ విధంగా క్రైస్తవ సంఘానికి గానీ, దేవుని నామానికి గానీ నింద తీసుకురాకుండా ఉంటారు.​—⁠2 కొరింథీయులు 6:⁠3.

దేవుడు మనకు ఇచ్చిన మనస్సాక్షి, మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రజలందరూ తప్పొప్పుల గురించి మంచి చెడ్డల గురించిన స్పృహతో పుట్టారు. (రోమీయులు 2:​15) మనస్సాక్షి తప్పుదోవ పట్టకుండా, భ్రష్టమైన ఆచారాల చేత మొద్దుబారి పోకుండా ఉన్నంత వరకు, ఏది సాధారణమైనది, సముచితమైనది, ఏది అసహజమైనది, అభ్యంతరకరమైనది అన్నది అది వారికి చెబుతుంది. ఈ వాస్తవాన్ని పరోక్షంగా సూచిస్తూ, దగ్గరి రక్తసంబంధీకులను పెళ్ళి చేసుకోకూడదన్న చట్టాన్ని యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. “మీరు నివసించిన ఐగుప్తు దేశాచారములచొప్పున మీరు చేయకూడదు; నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారములచొప్పున మీరు చేయకూడదు; వారి కట్టడలనుబట్టి నడవకూడదు” అని మనం చదువుతాము. (లేవీయకాండము 18:⁠3) క్రైస్తవులు బైబిలు ఆధారిత మనస్సాక్షిని ఎంతో విలువైనదిగా ఎంచుతారు, తప్పొప్పులను గురించి ప్రజలకున్న వక్రీకరించబడిన తలంపుల చేత తప్పుదారి పట్టడానికి వారు దానిని అనుమతించరు.​—⁠ఎఫెసీయులు 4:​17-19.

మరి అయితే, మనం ఏ నిర్ధారణకు రావచ్చు? క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రం క్రింద లేకపోయినప్పటికీ, తండ్రీ, కూతురూ; తల్లీ, కుమారుడూ; సహోదరుడూ, సహోదరీ వంటి దగ్గరి రక్తసంబంధీకులను పెళ్ళి చేసుకోవడమన్నది క్రైస్తవ సమాజంలో బొత్తిగా అంగీకారయోగ్యమైనది కాదని వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకు స్పష్టంగా చెబుతుంది. * రక్త సంబంధీకుల సంఖ్య పెరుగుతున్న కొలది, చట్టబద్ధమైన పెళ్ళిళ్ళకు సంబంధించిన చట్టాలు నియమాలు ఉన్నాయని, సామాజికంగాను సంస్కృతిపరంగాను అంగీకారయోగ్యమైన ప్రమాణాలు ఉన్నాయని క్రైస్తవులు గుర్తిస్తారు. మనం వాటినన్నింటిని తప్పకుండా జాగ్రత్తగా పరిగణనలోనికి తీసుకోవాలి. అలాగైతేనే “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా . . . ఉండవలెను” అని లేఖనాలు ఆధికారికంగా ఇచ్చిన ఆదేశానికి పొందికగా మనం జీవించగలం.​—⁠హెబ్రీయులు 13:⁠4.

[అధస్సూచి]

^ పేరా 7 ఈ అంశంపై విపులమైన చర్చ కోసం, దయచేసి, కావలికోట (ఆంగ్లం), మార్చి 15, 1978, 25-6 పేజీల్లోని, “వావివరుసలు తప్పిన వివాహాలు​—⁠క్రైస్తవులు వాటినెలా దృష్టించాలి?” అనే ఆర్టికల్‌ను చూడండి.