కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు “సత్యస్వరూపియగు ఆత్మను” పొందారా?

మీరు “సత్యస్వరూపియగు ఆత్మను” పొందారా?

మీరు “సత్యస్వరూపియగు ఆత్మను” పొందారా?

‘మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన [తండ్రి] వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.’​—⁠యోహాను 14:16, 17.

1. మేడగదిలో తన శిష్యులతో చివరి గంటలు గడిపినప్పుడు, యేసు వారికి తెలియజేసిన ప్రాముఖ్యమైన సమాచారమేమిటి?

‘ప్రభువా, నీవెక్కడికి వెళ్తున్నావు?’ అని యేసు అపొస్తలులు ఆయనను అడిగారు. ఈ ప్రశ్న, ఆయన వారితో యెరూషలేములోని మేడగదిలో గడిపిన చివరి గంటల్లో వారు వేసిన ప్రశ్నల్లో ఒకటి. (యోహాను 13:​36) ఆ సమావేశం అలా సాగుతుండగా, నేను మిమ్మల్ని విడిచి, నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళే సమయమాసన్నమైందని వారికి యేసు తెలియజేశాడు. (యోహాను 14:​28; 16:​28) మీకు ఉపదేశమిచ్చేందుకు, మీ ప్రశ్నలకు జవాబులిచ్చేందుకు శారీరకంగా నేను ఇక మీ దగ్గర ఉండను అని తెలియజేశాడు. అయినప్పటికీ, “నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును” అని అంటూ ఆయన వారికి అభయమిచ్చాడు.​—⁠యోహాను 14:⁠16.

2. తాను వెళ్ళిపోయిన తర్వాత, తన శిష్యుల దగ్గరకు ఏమి పంపిస్తానని యేసు వాగ్దానం చేశాడు?

2 ఆ ఆదరణకర్త ఎవరో, అది తన శిష్యులకు ఎలా సహాయపడుతుందో యేసు వెల్లడిచేశాడు. “నేను మీతో కూడ ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపినవానియొద్దకు వెళ్లుచున్నాను . . . నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్లినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును. . . . . ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును” అని ఆయన చెప్పాడు.​—⁠యోహాను 16:​4, 5, 7, 13.

3. (ఎ) తొలి క్రైస్తవులకు “సత్యస్వరూపియగు ఆత్మ” ఎప్పుడు పంపించబడింది? (బి) ఆ ఆత్మ ముఖ్యంగా ఏ విధంగా వారికి “ఆదరణకర్త”గా ఉన్నాడు?

3 ఆ వాగ్దానం, సా.శ. 33 పెంతెకొస్తు రోజున నెరవేర్చబడింది. దానికి అపొస్తలుడైన పేతురు సాక్ష్యమిచ్చాడు. “ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి యున్నాడు” అని ఆయన అన్నాడు. (అపొస్తలుల కార్యములు 2:​32, 33) మనం తర్వాత చూడబోతున్నట్లు, పెంతెకొస్తు రోజున తొలి క్రైస్తవుల మీద కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ, వారు అనేక కార్యాలను నెరవేర్చడాన్ని సాధ్యపరిచింది. ‘తాను వారితో చెప్పిన సంగతులన్నిటిని’ “సత్యస్వరూపియగు ఆత్మ” ‘వారికి జ్ఞాపకము చేస్తుంది’ అని యేసు వాగ్దానం చేశాడు. (యోహాను 14:​26) యేసు పరిచర్యను, బోధలను, అంతెందుకు ఆయన పలికిన మాటలను సహితం జ్ఞాపకం చేసుకుని వాటిని వ్రాతల్లో పెట్టేందుకు ఆ ఆత్మ వారికి సహాయపడింది. మరిముఖ్యంగా, అది సా.శ. మొదటి శతాబ్దాంతంలో వృద్ధ అపొస్తలుడైన యోహానుకు సహాయపడింది. యోహాను అప్పుడే తన సువార్తను వ్రాయనారంభించాడు. ఆ సువార్త వృత్తాంతంలో, యేసు తన మరణ జ్ఞాపకార్థాన్ని స్థాపించినప్పుడు ఇచ్చిన అమూల్యమైన ఉపదేశం వుంది.​—⁠యోహాను 13 నుండి 17 అధ్యాయాలు.

4. “సత్యస్వరూపియగు ఆత్మ” తొలి అభిషిక్త క్రైస్తవులకు ఎలా సహాయపడింది?

4 ఆత్మ ‘మీకు బోధించి’ ‘మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును’ అని కూడా యేసు తన శిష్యులకు వాగ్దానం చేశాడు. లేఖనాల్లోని లోతైన విషయాలను అర్థం చేసుకునేందుకు, తలంపుల్లోను, అవగాహనలోను సంకల్పంలోను ఐక్యతను కాపాడుకునేందుకు ఆ ఆత్మ వారికి సహాయపడింది. (1 కొరింథీయులు 2:​10; ఎఫెసీయులు 4:​1, 2) కాబట్టి, ఆ తొలిక్రైస్తవులు ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అనే ఒక సమూహముగా పనిచేసేందుకు, ఒక్కో అభిషిక్త క్రైస్తవునికి “తగినవేళ” ఆధ్యాత్మిక “అన్నము” పెట్టేందుకు పరిశుద్ధాత్మ శక్తినిచ్చింది.​—⁠మత్తయి 24:⁠45.

ఆత్మ సాక్ష్యమిస్తుంది

5. (ఎ) సా.శ. 33వ సంవత్సరం, నీసాను 14 రాత్రి యేసు తన శిష్యులకు వెల్లడిచేసిన క్రొత్త నిరీక్షణ ఏమిటి? (బి) యేసు వాగ్దాన నెరవేర్పులో పరిశుద్ధాత్మ వహించే పాత్ర ఏమిటి?

5 తర్వాత తాను తన శిష్యులను పరలోకానికి తీసుకువెళ్తాడని, వారు తనతోపాటు, తన తండ్రితోపాటు నివసిస్తారని సా.శ. 33 నీసాను 14 రాత్రి యేసు సూచించాడు. “నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును” అని ఆయన వారికి చెప్పాడు. (యోహాను 13:​36; 14:​2, 3) వారు ఆయన రాజ్యములో ఆయనతోపాటు పరిపాలిస్తారు. (లూకా 22:​28-30) వారు ఆ పరలోక నిరీక్షణను కలిగివుండాలంటే, దేవుని ఆధ్యాత్మిక కుమారులుగా ‘ఆత్మమూలముగా జన్మించాలి,’ పరలోకంలో క్రీస్తుతోపాటు రాజులుగాను యాజకులుగాను సేవ చేసేందుకు వారు అభిషేకించబడాలి.​—⁠యోహాను 3:​5-8; 2 కొరింథీయులు 1:​21, 22; తీతు 3:​5-7; 1 పేతురు 1:​3, 4; ప్రకటన 20:⁠6.

6. (ఎ) పరలోక పిలుపు ఎప్పుడు మొదలైంది, ఎంతమంది ఆ పిలుపును పొందుతారు? (బి) ఆ పిలుపు పొందినవారు వేటిలోకి బాప్తిస్మం తీసుకున్నారు?

6 “పరలోకసంబంధమైన” ఈ “పిలుపు” సా.శ. 33 పెంతెకొస్తు రోజున మొదలైంది, ఈ పిలుపు 1930ల మధ్య భాగంలో దాదాపుగా ముగిసినట్లుంది. (హెబ్రీయులు 3:⁠1) ఆధ్యాత్మిక ఇశ్రాయేలులో భాగంగా ఉండేందుకు పరిశుద్ధాత్మచే ముద్రించబడిన వారి సంఖ్య 1,44,000. వారు “మనుష్యులలోనుండి కొనబడినవారు.” (ప్రకటన 7:⁠4; 14:​1-4) వారు క్రీస్తు యొక్క ఆధ్యాత్మిక శరీరములో బాప్తిస్మం పొందారు, ఆ విధంగా ఆయన సంఘంలో సభ్యులయ్యారు, ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందారు. (రోమీయులు 6:⁠3; 1 కొరింథీయులు 12:​12, 13, 27; ఎఫెసీయులు 1:​22, 23) వారు నీటి బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన తర్వాత, త్యాగపూరిత జీవనంలోకి ప్రవేశిస్తారు, అంటే తమ మరణం వరకూ యథార్థభక్తితో ఉండే జీవితాన్ని ప్రారంభిస్తారు.​—⁠రోమీయులు 6:⁠4, 5.

7. జ్ఞాపకార్థ చిహ్నాల్లో అభిషిక్త క్రైస్తవులే పాలుపొందడం సముచితమనడానికి కారణమేమిటి?

7 యెహోవాకు, “దేవుని ఇశ్రాయేలు”కు మధ్య చేయబడిన క్రొత్త నిబంధనలో, ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులుగా ఈ అభిషిక్త క్రైస్తవులు ఉన్నారు. (గలతీయులు 6:​16; యిర్మీయా 31:​31-34) ఆ క్రొత్త నిబంధన క్రీస్తు చిందించిన రక్తం చేత ధ్రువీకరించబడింది. యేసు తన మరణ జ్ఞాపకార్థాన్ని స్థాపించినప్పుడు, ఈ విషయాన్ని తెలియజేశాడు. “ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారికిచ్చి​—⁠ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని​—⁠ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన” అని ఆయన చెప్పాడని లూకా వ్రాశాడు. (లూకా 22:​19, 20) శేషము, అంటే 1,44,000 మంది సభ్యులకు చెందినవారిలో భూమిమీద మిగిలినవారే క్రీస్తు మరణ జ్ఞాపకార్థం ఆచరించే రోజున రొట్టె ద్రాక్షారసమనే చిహ్నాల్లో పాలుపొందడం సముచితం.

8. తాము పరలోక పిలుపును పొందామా లేదా అన్నది అభిషిక్తులకు ఎలా తెలుస్తుంది?

8 తమకు పరలోక పిలుపు అందినట్లు అభిషిక్తులకు ఎలా తెలుస్తుంది? వారికి పరిశుద్ధాత్మ యొక్క స్పష్టమైన సాక్ష్యం ఇవ్వబడుతుంది. అలాంటివారికి అపొస్తలుడైన పౌలు “దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు. . . . మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము” అని వ్రాశాడు. (రోమీయులు 8:​14-17) ఆత్మ ఇచ్చే సాక్ష్యం ఎంతో శక్తివంతంగా ఉంటుంది కనుక, తమకు పరలోక పిలుపు ఉందా అని ఎవరికైనా లేశమాత్రం సందేహమున్నా, తమకు ఆ పిలుపు లేదన్న నిర్ధారణకు వారు రావచ్చు. కాబట్టి వారు, జ్ఞాపకార్థ చిహ్నాలలో పాలుపొందకుండా ఉంటారు.

ఆత్మ, వేరే గొఱ్ఱెలు

9. సువార్తల్లోను, ప్రకటన గ్రంథంలోను పేర్కొనబడిన విభిన్నమైన రెండు గుంపులు ఏవి?

9 ఆధ్యాత్మిక ఇశ్రాయేలుగా రూపొందించబడే క్రైస్తవుల సంఖ్య పరిమితమై ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, యేసు వారిని ‘చిన్న మంద’ అన్నాడు, వారు క్రొత్త నిబంధన అనే “దొడ్డి”లో చేర్చబడ్డారు. అయితే, వారికి భిన్నంగా అసంఖ్యాకంగా ఉండే “వేరే గొఱ్ఱెల”ను కూడా తాను సమకూర్చాలని యేసు చెప్పాడు. (లూకా 12:​32; యోహాను 10:​16) అంత్యదినాల్లో సమకూర్చబడే వేరే గొఱ్ఱెలకు చెందినవారు, “గొప్పసమూహము”గా రూపొందుతారు, వారు పరదైసు భూమిపై సదాకాలము జీవించే నిరీక్షణతో “మహాశ్రమల”ను దాటుతారని నిర్ణయించబడింది. సా.శ. మొదటి శతాబ్దాంతమున యోహాను పొందిన దర్శనంలో, ఈ గొప్ప సమూహమూ, ఆధ్యాత్మిక ఇశ్రాయేలుకు చెందిన 1,44,000 మంది సభ్యులూ వేరుగా చూపించబడడం ఆసక్తికరమైన విషయం. (ప్రకటన 7:​4, 9, 14) వేరే గొఱ్ఱెలకు చెందినవారు కూడా పరిశుద్ధాత్మను పొందుతారా, ఒకవేళ పొందితే, అది వారి జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది?

10. “తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి” వేరే గొఱ్ఱెలు ఎలా బాప్తిస్మం పొందుతారు?

10 వేరే గొఱ్ఱెలకు చెందినవారి జీవితాల్లో పరిశుద్ధాత్మ నిజంగానే ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది. వారు తమను తాము యెహోవాకు సమర్పించుకున్నామన్న విషయాన్ని “తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి” బాప్తిస్మం తీసుకోవడం ద్వారా తెలుపుతారు. (మత్తయి 28:​19) వారు యెహోవా సర్వాధిపత్యాన్ని గుర్తిస్తారు, తమ రాజుగా, విమోచకుడుగా, క్రీస్తుకు విధేయత చూపిస్తారు, తమ జీవితాల్లో, దేవుని ఆత్మ అనే చురుకైన శక్తి కార్యవిధానానికి లోబడతారు. “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” అనే ‘ఆత్మ ఫలాలను’ అలవరచుకోవడానికి ప్రతి రోజూ ప్రయత్నిస్తారు.​—⁠గలతీయులు 5:​22, 23.

11, 12. (ఎ) అభిషిక్త క్రైస్తవులు పరిశుద్ధపరచబడిన ప్రత్యేక విధమేమిటి? (బి) వేరే గొఱ్ఱెలు ఏ విధంగా పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడతారు?

11 దేవుని వాక్యమూ, ఆయన పరిశుద్ధాత్మా తమను పవిత్రపరచేందుకు, శుద్ధిచేసేందుకు వేరే గొఱ్ఱెలు కూడా తప్పకుండా అనుమతించాలి. క్రీస్తు పెండ్లి కుమార్తెగా అభిషిక్తులు నీతిమంతులని పరిశుద్ధులని తీర్చబడి ఇప్పటికే ప్రత్యేకమైన విధంగా పవిత్రపరచబడివున్నారు. (యోహాను 17:​17; 1 కొరింథీయులు 6:​11; ఎఫెసీయులు 5:​23-27) వారిని గురించి దానియేలు ప్రవక్త, “మనుష్యకుమారుని” ఆధిపత్యం క్రింద, అంటే క్రీస్తుయేసు ఆధిపత్యం క్రింద రాజ్యమును పొందే “మహోన్నతుని పరిశుద్ధుల”ని అన్నాడు. (దానియేలు 7:​13, 14, 18, 27) “నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను” అని పూర్వము మోషే అహరోనుల ద్వారా యెహోవా ఇశ్రాయేలు జనాంగానికి ప్రకటించాడు.​—⁠లేవీయకాండము 11:⁠44.

12 “పరిశుద్ధీకరణ” అంటే ప్రాథమికంగా “యెహోవా దేవుని సేవ కోసం, ఆయన ఉపయోగం కోసం పరిశుద్ధపరచే, వేరుపరచే లేదా ప్రత్యేకపరచే చర్య లేదా ప్రక్రియ” అని అర్థం; “పరిశుద్ధము” అంటే “పవిత్రంగా ఉన్న స్థితి, పరిశుద్ధపరచబడిన, పవిత్రపరచబడిన స్థితి” అని అర్థం. “గొప్ప సమూహములో భాగమై, భూమిపై నివసించబోయేవారిలో ప్రతి ఒక్కరికి పవిత్రీకరణ [సమర్పణ] పరిశుద్ధీకరణ అవసరమని” యెహోనాదాబువారు, అంటే వేరే గొఱ్ఱెలు “తెలుసుకోవాలని” ఎన్నో సంవత్సరాల క్రితం, 1938వ సంవత్సరంలో కావలికోట పేర్కొంది. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన గొప్ప సమూహమును గురించిన దర్శనములో, వారు “గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొని” ఉన్నట్లు, యెహోవాను ‘రాత్రింబగళ్లు ఆయన ఆలయములో సేవ’ చేస్తున్నట్లు చెప్పబడింది. (ప్రకటన 7:​9, 14, 15) పరిశుద్ధతను గురించి యెహోవా కోరే ప్రమాణాల స్థాయికి చేరుకునేందుకు వేరే గొఱ్ఱెలు పరిశుద్ధాత్మ సహాయంతో తమ శాయశక్తులా కృషి చేస్తారు.​—⁠2 కొరింథీయులు 7:⁠1.

క్రీస్తు సహోదరులకు మంచి చేయడం

13, 14. (ఎ) యేసు చెప్పిన గొఱ్ఱెల మేకల ఉపమానం ప్రకారం, గొఱ్ఱెల రక్షణ దేనిపై ఆధారపడి ఉంటుంది? (బి) ఈ అంత్యదినాల్లో, వేరే గొఱ్ఱెలకు చెందినవారు క్రీస్తు సహోదరులకు ఎలా మద్దతునిచ్చారు?

13 “యుగసమాప్తి” గురించిన తన ప్రవచనంలో ఉన్న గొఱ్ఱెలు మేకల ఉపమానంలో వేరే గొఱ్ఱెలకు, చిన్న మందకు మధ్య ఉండే సన్నిహిత సంబంధాన్ని యేసు నొక్కి చెప్పాడు. వేరే గొఱ్ఱెల రక్షణ అనేది, “నా సహోదరుల”ని ఆయన పిలుస్తున్న అభిషిక్తుల పట్ల వారు ఎలా ప్రవర్తిస్తారన్న దానితో ముడిపడివుంటుందని యేసు ఆ ఉపమానంలో స్పష్టంగా చూపించాడు. “అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి​—⁠నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.  . . . మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును” అని ఆయన అన్నాడు.​—⁠మత్తయి 24:⁠3; 25:31-34, 40.

14 “మీరు చేసితిరి” అన్న మాటలు ఆత్మజనిత క్రీస్తు సహోదరులకు ప్రేమపూర్వక మద్దతునిస్తూ చేసిన చర్యలను సూచిస్తుంది. సాతాను లోకం ఆ సహోదరులతో అపరిచితులతో వ్యవహరిస్తున్నట్లుగా వ్యవహరించి, వారిలో కొందరిని కారాగారంలో కూడా వేసింది. వారికి ఆహారము, వస్త్రాలు, ఆరోగ్య సంరక్షణ కొరవడ్డాయి. (మత్తయి 25:​35, 36, NW అధఃసూచి) ఈ అంత్యదినాల్లో 1914 మొదలుకొని, అభిషిక్త క్రైస్తవుల్లో చాలా మందికి అలాంటి పరిస్థితి ఏర్పడింది. వారి నమ్మకమైన సహచరులైన వేరే గొఱ్ఱెలు ఆత్మ చేత ప్రేరేపించబడి వారికి మద్దతునిచ్చారని యెహోవాసాక్షుల ఆధునిక చరిత్ర సాక్ష్యమిస్తుంది.

15, 16. (ఎ) భూమి మీద ఉన్న క్రీస్తు అభిషిక్త క్రైస్తవులకు వేరే గొఱ్ఱెలు ముఖ్యంగా ఏ పనిలో సహాయపడ్డారు? (బి) అభిషిక్తులు వేరే గొఱ్ఱెల పట్ల తమకున్న కృతజ్ఞతను ఎలా వ్యక్తం చేశారు?

15 భూమి మీద ఉన్న క్రీస్తు అభిషిక్త సహోదరులు ఈ అంత్యదినాల్లో ముఖ్యంగా ‘ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటించాలి’ అని దేవుడిచ్చిన ఆదేశాన్ని నెరవేర్చడంలో, వేరే గొఱ్ఱెల క్రియాశీలమైన మద్దతును పొందారు. (మత్తయి 24:​14; యోహాను 14:​12) సంవత్సరాలు గడుస్తున్న కొలది, భూమి మీద ఉన్న అభిషిక్తుల సంఖ్య తగ్గుతుండగా, వేరే గొఱ్ఱెల సంఖ్య పెరిగి అక్షరార్థంగా లక్షలాదిమందిగా అయ్యారు. వీరిలో వేలాది మంది పూర్తికాల సువార్తికులుగాను, పయినీర్లుగాను, మిషనరీలుగాను సేవ చేసి, రాజ్య సువార్తను “భూదిగంతముల వరకు” వ్యాపింపజేశారు. (అపొస్తలుల కార్యములు 1:⁠8) ఇతరులు తమకు సాధ్యమైనంత మట్టుకు సాక్ష్యపు పనిలో పాల్గొంటారు, ఈ ప్రాముఖ్యమైన పనికి ఆర్థికంగా ఆనందంగా మద్దతునిస్తారు.

16 వేరే గొఱ్ఱెలు అనే తమ సహచరులు ఇచ్చే నమ్మకమైన మద్దతుకు క్రీస్తు అభిషిక్త సహోదరులు ఎంత కృతజ్ఞులైవుంటారు! వాళ్ళ భావాలు, 1986 లో దాసుని తరగతి అందించిన “సమాధానకర్తయగు అధిపతి” ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్త భద్రత (ఆంగ్లం) అనే పుస్తకంలో చక్కగా వ్యక్తీకరించబడ్డాయి. “రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పటి నుండి “యుగసమాప్తి” గురించిన యేసు ప్రవచన నెరవేర్పులో ‘వేరే గొఱ్ఱెలకు’ చెందిన ‘గొప్పసమూహము’ గొప్ప పాత్ర వహిస్తుంది. . . . కాబట్టి, మత్తయి 24:14 లో [యేసు చెప్పిన] ప్రవచన నెరవేర్పులో వివిధ భాషలకు చెందిన అంతర్జాతీయ ‘గొప్పసమూహము’ ఎంతో భాగం వహించినందుకు వాళ్ళకు చాలా కృతజ్ఞతలు చెబుతున్నాం!” అని ఆ పుస్తకం అంది.

‘మనము లేకుండ సంపూర్ణులు కారు’

17. భూమి మీద పునరుత్థానం పొందనున్న ప్రాచీన కాలపు నమ్మకస్థులు అభిషిక్తులు ‘లేకుండా సంపూర్ణులు కారు’ అన్నది ఏ భావంలో?

17 అపొస్తలుడైన పౌలు అభిషిక్తుల్లో ఒకరిగా మాట్లాడుతూ, క్రీస్తుకు పూర్వం జీవించిన నమ్మకస్థులైన స్త్రీపురుషుల గురించి చర్చిస్తూ, ‘వీరందరు తమ విశ్వాసముద్వారా సాక్ష్యము పొందినవారైనను, మనము [అంటే, అభిషిక్తులు] లేకుండ సంపూర్ణులుకాకుండు నిమిత్తము, దేవుడు మనకొరకు మరి శ్రేష్ఠమైనదానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దానఫలము అనుభవింపలేదు’ అని వ్రాశాడు. (హెబ్రీయులు 11:​35, 39, 40) వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో, పరలోకంలో క్రీస్తూ, ఆయన అభిషిక్త సహోదరులైన 1,44,000 మందీ రాజులుగా యాజకులుగా ఉంటూ భూమి మీద ఉన్నవారికి క్రీస్తు విమోచన క్రయధన బలి యొక్క ప్రయోజనాలు చేకూరేలా చేస్తారు. ఆ విధంగా వేరే గొఱ్ఱెలు శారీరకంగాను మానసికంగాను ‘సంపూర్ణులుగా చేయబడతారు.’​—⁠ప్రకటన 22:⁠1, 2.

18. (ఎ) బైబిలుపరమైన వాస్తవాలు వేరే గొఱ్ఱెలు దేనిని గ్రహించడానికి సహాయపడాలి? (బి) వేరే గొఱ్ఱెలు ఏ నిరీక్షణతో, “దేవుని కుమారుల ప్రత్యక్షత” కోసం వేచివుంటారు?

18 ఈ విషయాలన్నీ, గ్రీకు లేఖనాలు ముఖ్యంగా క్రీస్తుపైనా, ఆయన అభిషిక్త సహోదరుల పైనా, యెహోవా సంకల్ప నెరవేర్పులో వారికున్న ప్రముఖ పాత్రపైనే ఎందుకు కేంద్రీకరిస్తున్నాయన్నది అర్థం చేసుకునేందుకు వేరే గొఱ్ఱెలకు సహాయపడతాయి. కాబట్టి వేరే గొఱ్ఱెలు, సాధ్యమైనన్ని విధాల్లో అభిషిక్త దాసుని తరగతికి మద్దతునివ్వడాన్ని ఒక ఆధిక్యతగా ఎంచుతూ, అర్మగిద్దోను సమయంలోను వెయ్యేండ్ల పరిపాలనలోను “దేవుని కుమారుల ప్రత్యక్షత” కోసం వేచివుంటారు. “నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము” కోసం వాళ్ళు ఎదురు చూడగలరు.​—⁠రోమీయులు 8:​19-21.

జ్ఞాపకార్థ సమయంలో ఆత్మ ద్వారా ఐక్యమయ్యారు

19. “సత్యస్వరూపియగు ఆత్మ” అభిషిక్తులకు, వారి సహచరులకు ఏమి చేసింది, ముఖ్యంగా, మార్చి 28 సాయంకాలం వాళ్ళు ఏ విధంగా ఐక్యపరచబడతారు?

19 సా.శ. 33 నీసాను 14 రాత్రి, తాను చేసిన ముగింపు ప్రార్థనలో యేసు, “నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని . . . ప్రార్థించుచున్నాను” అన్నాడు. (యోహాను 17:​20, 21) అభిషిక్తుల రక్షణ కోసమూ, విధేయతగల మానవ లోకపు రక్షణ కోసమూ ప్రాణాన్నిచ్చేందుకు దేవుడు ప్రేమతో తన కుమారుడ్ని పంపించాడు. (1 యోహాను 2:⁠2) “సత్యస్వరూపియగు ఆత్మ” క్రీస్తు సహోదరులను, వారి సహచరులను ఐక్యపరిచింది. మార్చి 28, సూర్యాస్తమయం తర్వాత, క్రీస్తు మరణ జ్ఞాపకార్థాన్ని ఆచరించేందుకు, తన ప్రియ కుమారుడైన క్రీస్తుయేసు బలి ద్వారా యెహోవా మన కోసం చేసినవాటన్నింటిని గుర్తు చేసుకునేందుకు రెండు తరగతుల వారూ సమకూడతారు. ఆ ప్రాముఖ్యమైన సందర్భంలో వారు దానికి హాజరు కావడం వల్ల, వారి మధ్యవున్న ఐకమత్యం మరింత బలపడి, దేవుని చిత్తాన్ని చేస్తూ ఉండాలన్న వారి నిర్ణయం మరింత దృఢపడి, తద్వారా, యెహోవా ప్రేమించేవారిలో తామూ ఉండడంలో ఆనందిస్తున్నామని వారు రుజువునిచ్చుదురు గాక.

పునఃసమీక్ష

• “సత్యస్వరూపియగు ఆత్మ” తొలిక్రైస్తవుల మీదికి ఎప్పుడు పంపబడింది, అది “ఆదరణకర్త”యని ఎలా నిరూపించబడింది?

• తమకు పరలోక పిలుపు ఉందన్న విషయం అభిషిక్తులకు ఎలా తెలుస్తుంది?

• దేవుని ఆత్మ వేరే గొఱ్ఱెలపై ఏయే విధాలుగా పనిచేస్తుంది?

• వేరే గొఱ్ఱెలు క్రీస్తు సహోదరులకు ఎలా మంచి చేశారు, వారు అభిషిక్తులు లేకుండా ‘సంపూర్ణులుగా చేయబడకపోవడానికి’ కారణమేమిటి?

[అధ్యయన ప్రశ్నలు]

[21వ పేజీలోని చిత్రం]

సా.శ. 33 పెంతెకొస్తునాడు శిష్యులపై “సత్యస్వరూపియగు ఆత్మ” కుమ్మరించబడింది

[23వ పేజీలోని చిత్రాలు]

ప్రకటించమన్న దైవిక ఆదేశాన్ని నెరవేర్చడంలో వేరే గొఱ్ఱెలు క్రీస్తు సహోదరులకు మద్దతునిస్తూ వారికి మంచి చేశారు