కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మాకు సహనాన్నీ పట్టుదలనూ నేర్పాడు

యెహోవా మాకు సహనాన్నీ పట్టుదలనూ నేర్పాడు

జీ వి త క థ

యెహోవా మాకు సహనాన్నీ పట్టుదలనూ నేర్పాడు

ఆరిస్టాట్లీస్‌ ఆపొస్టోలీడీస్‌ చెప్పినది

ఖనిజం కలిసివున్న నీటి ఊటలకు ప్రశాంతమైన వాతావరణానికి పేరుగాంచిన పీయటిగరస్క్‌ అనే నగరం రష్యాలో కాకసస్‌ పర్వతాల దిగువనున్న కొండ ప్రాంతాల్లో ఉంది. నేను ఇక్కడే 1929 లో జన్మించాను, అప్పట్లో నా తల్లిదండ్రులు గ్రీకు శరణార్థులు. పది సంవత్సరాల తర్వాత, స్టాలినిస్టుల ప్రక్షాళనం, ఉగ్రవాదం, జాతి ప్రక్షాళనాలు అనే భయానక సంఘటనలు జరిగాక మేము తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి గ్రీసుకు వలసవెళ్ళవలసి రావడంతో మళ్ళీ శరణార్థులమయ్యాం.

గ్రీసులోని పైరీయస్‌కి తరలివెళ్ళాక, అక్కడ “శరణార్థులు” అన్న మాటకు పూర్తిగా క్రొత్త భావమున్నట్లు మాకు అనిపించింది. మేము అక్కడ పూర్తిగా అపరిచితులమని అనిపించింది. అన్నదమ్ములమైన మా ఇద్దరి పేర్లు, ప్రసిద్ధ గ్రీకు తత్త్వవేత్తల పేర్లయిన సోక్రటీస్‌, అరిస్టాటిల్‌ అయినప్పటికీ, మేము ఆ పేర్లను అంతగా వినలేదు. అందరూ మమ్మల్ని చిన్నారి రష్యన్లు అనేవారు.

రెండవ ప్రపంచ యుద్ధం మొదలైన కొన్నాళ్ళకు మా ప్రియమైన అమ్మ చనిపోయింది. అమ్మే మా ఇంటిలో కేంద్ర బిందువుగా ఉండింది కాబట్టి తను లేకపోవడం ఎంతో బాధాకరం. అమ్మ కొంత కాలంగా అనారోగ్యంగా ఉండింది కనుక, నాకు ఇంటి పనులు చాలా నేర్పింది. ఆ తర్ఫీదు నాకు తర్వాతి జీవితంలో చాలా ఉపయోగపడింది.

యుద్ధమూ, స్వాతంత్ర్యమూ

రెండవ ప్రపంచ యుద్ధం, నాజీల ఆక్రమణ, మిత్ర రాజ్యాల సైన్యాలు నిర్విరామంగా బాంబులు కురిపించడం మూలంగా, ప్రతి రోజూ ఇదే చివరి రోజని అనిపించేది. దుర్భరమైన పేదరికం ఉండేది, ప్రజలు ఆకలితో అలమటించడము, మరణించడము జరిగేవి. 11వ ఏట మొదలుకొని, మా ముగ్గురి పోషణ కోసం నేను నాన్నగారితోపాటు కష్టపడి పనిచేయవలసి వచ్చింది. నాకు గ్రీకు భాష అంతగా రానందువల్ల, యుద్ధమూ, దాని పర్యవసానాల వల్ల నా విద్యాభ్యాసం కుంటుపడింది.

1944 అక్టోబర్‌లో జర్మన్‌లు గ్రీసును ఆక్రమించడం ఆపేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు, నేను యెహోవాసాక్షులను కలిశాను. నిరాశ నిస్పృహలతో ఉన్న ఆ సమయంలో, దేవుని ప్రభుత్వం క్రింద ఉజ్జ్వలమైన భవిష్యత్తును కలిగివుండవచ్చన్న నిరీక్షణ నా హృదయాన్ని స్పర్శించింది. (కీర్తన 37:​29) ఈ భూమి మీద శాంతియుతమైన పరిస్థితుల్లో అంతం లేని జీవితాన్నిస్తానని దేవుడు చేసిన వాగ్దానం నా మనస్సుకు కలిగిన గాయాలకు ఔషధ తైలములా పనిచేసింది. (యెషయా 9:⁠7) నేనూ మా నాన్నా 1946 లో యెహోవాకు సమర్పించుకున్నామన్న దానికి సూచనగా బాప్తిస్మం తీసుకున్నాం.

తర్వాతి సంవత్సరం, పైరీయస్‌లో సంస్థీకరించబడిన రెండవ సంఘంలో ప్రకటనా సేవకుడిగా (తర్వాత పత్రికా సేవకుడు అని పిలువడం మొదలుపెట్టారు) సేవచేసే నియామకాన్ని అందుకుని ఆనందించాను. మా టెరిటరీ, పైరీయస్‌ మొదలుకొని దాదాపు 50 కిలోమీటర్ల దూరాన ఉన్న ఇలూసస్‌ వరకు ఉంది. అప్పట్లో, ఆ సంఘంలో ఆత్మాభిషిక్త క్రైస్తవులు అనేకులు సేవచేస్తున్నారు. వారితో పరిచర్య చేసి, వారి నుండి నేర్చుకునే ఆధిక్యత నాకు లభించింది. ప్రకటనా పనిని చేయడానికి తీవ్రంగా కృషి చేయవలసివుంటుందని చెప్పడానికి వాళ్ళ దగ్గర లెక్కలేనన్ని అనుభవాలుండేవి కనుక నేను వాళ్ళ సహవాసాన్ని ఆనందించాను. యెహోవాను నమ్మకంగా సేవించేందుకు చాలా సహనమూ పట్టుదలా అవసరమని వాళ్ళ జీవన విధానం నుండి స్పష్టమయ్యింది. (అపొస్తలుల కార్యములు 14:​22) నేడు ఈ ప్రాంతంలో యెహోవాసాక్షుల సంఘాలు 50 కన్నా ఎక్కువ ఉన్నందుకు నాకెంత సంతోషంగా ఉంది!

ఎదురుచూడని సవాలు

కొంతకాలం తర్వాత, పాట్రాస్‌ నగరంలో ఎలెనీ అనే అందమైన, ఆసక్తిగల క్రైస్తవ యువతిని కలిశాను. మేము 1952వ సంవత్సరాంతమున నిశ్చితార్థం చేసుకున్నాం. అయితే కొన్ని నెలల తర్వాత, ఎలెనీ తీవ్ర అనారోగ్యానికి గురైంది. డాక్టర్లు ఆమె మెదడులో కంతి ఉందని, ఆమె పరిస్థితి విషమకరంగా ఉందని కనుగొన్నారు. ఆమెకు వెంటనే శస్త్రచికిత్స జరగాలి. ఎంతో ప్రయత్నం చేసిన తర్వాత, ఏథెన్సులో ఒక డాక్టర్‌ని కలుసుకోగలిగాము. అప్పట్లో కావలసినన్ని సదుపాయాలు లేకపోయినప్పటికీ, మన మత నమ్మకాలతో సహకరిస్తూ రక్తం ఎక్కించకుండా ఆమెకు శస్త్రచికిత్స చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. (లేవీయకాండము 17:​10-14; అపొస్తలుల కార్యములు 15:​28, 29) డాక్టర్లు ఆ ఆపరేషన్‌ తర్వాత, నేను పెళ్ళి చేసుకోబోతున్న అమ్మాయి భవిష్యత్తు గురించి మరీ ఎక్కువగా భయపడనవసరం లేదన్న ఆశావాదంతో ఉన్నారు. అలాగని, కంతి మళ్ళీ రాగల సాధ్యతను వారు కొట్టిపారేయనూ లేదు.

ఈ పరిస్థితిలో నేనేమి చేయాలి? మారిన పరిస్థితుల దృష్ట్యా, మా వివాహ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని, స్వతంత్రుడనవ్వాలా? లేదు! నిశ్చితార్థం ద్వారా మాటిచ్చాను కనుక నేను అవును అన్నది అవునుగా ఉండాలని కోరుకున్నాను. (మత్తయి 5:​37) నేను ఒక్క క్షణం కూడా వేరే విధంగా ఆలోచించడానికి ఇష్టపడలేదు. ఎలెనీ తన అక్క సంరక్షణలో పాక్షికంగా కోలుకుంది. మేము 1954 డిసెంబరులో వివాహం చేసుకున్నాం.

మూడు సంవత్సరాల తర్వాత, ఆమెకు ఆ జబ్బు మళ్ళీ వచ్చింది. ముందు ఆపరేషను చేసిన డాక్టరే రెండవ ఆపరేషన్‌ కూడా చేయవలసి వచ్చింది. ఈ సారి కంతిని పూర్తిగా తీసివేసేందుకు ఆమె మెదడులో ఇంకొంచెం లోతుగా ఆపరేషన్‌ చేయవలసి వచ్చింది. దాని వల్ల, ఆమెకు పాక్షికంగా పక్షవాతం వచ్చింది. ఆమె మెదడులోని మాటలకు సంబంధించిన నాడీ మండలం బాగా దెబ్బ తింది. ఇప్పుడు మాకు మరి క్రొత్తవైన మరింత కష్టమైన సవాళ్ళు ఎదురయ్యాయి. అతి చిన్న పని కూడా నా ప్రియమైన భార్యకు చాలా పెద్ద అడ్డంకులా అయింది. విషమించిపోతున్న ఆమె పరిస్థితి, మా దైనందిన జీవితంలో తీవ్రమైన మార్పులను చేసుకోవలసిన అవసరాన్ని ఏర్పరచింది. అన్నింటికంటే ముఖ్యంగా చాలా సహనమూ పట్టుదలా అవసరమయ్యాయి.

మా అమ్మ నాకు ఇచ్చిన తర్ఫీదు ఎంతో ఉపయోగకరమైంది ఈ సమయంలోనే. ప్రతి రోజు ఉదయం, వంటకు కావలసినవన్నీ సిద్ధం చేసేవాడ్ని, ఎలెనీ వండేది. మేము తరచూ అతిథులను ఆహ్వానించేవాళ్ళం. అతిథుల్లో పూర్తికాల పరిచారకులు, మేము బైబిలు అధ్యయనం నిర్వహించిన విద్యార్థులు, సంఘంలో అవసరాల్లో ఉన్న తోటి క్రైస్తవులు ఉండేవారు. మా వంట నిజంగా చాలా రుచిగా ఉందని వాళ్ళందరూ ఒప్పుకునేవారు! ఇతర ఇంటి పనులు కూడా నేను ఎలెనీ కలిసి చేసేవాళ్ళం. కాబట్టి మా ఇల్లు శుభ్రంగా ఉండేది, వస్తువులు వాటి వాటి స్థానంలో ఉండేవి. ఎంతో కష్టమైన ఈ పరిస్థితి 30 సంవత్సరాలు కొనసాగింది.

అశక్తురాలైనా ఆసక్తురాలే

నా భార్యకు యెహోవా మీదున్న ప్రేమను, సేవ మీదున్న ఆసక్తినీ ఏదీ తగ్గించలేదని చూడడం నాకూ ఇతరులకూ ఎంతో పురికొల్పుగా ఉండేది. పట్టువదలని ప్రయత్నం ద్వారా ఎలెనీ కొంత కాలానికి తన భావాలను కొన్ని మాటలతో వ్యక్తం చేయడం మొదలుపెట్టగలిగింది. వీధిలో ప్రజల దగ్గరికి వెళ్ళి బైబిలు నుండి సువార్తను పంచుకోవడానికి ఆమె ఎంతో ఇష్టపడేది. నేను వ్యాపారం మీద ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు, ఆమెను నాతోపాటు తీసుకెళ్ళి, అక్కడ దగ్గర్లో చాలా మంది ప్రజలు నడుస్తున్న దారికి ప్రక్కన కారు పార్కు చేసేవాడ్ని. ఆమె కారు కిటికీ తెరిచి, దారిలో వెళ్తున్న వారిని కావలికోట, తేజరిల్లు! పత్రికలను తీసుకోమని ఆహ్వానించేది. ఒకసారి, రెండు గంటల్లో 80 ప్రతులను అందించింది. తరచూ ఆమె, సంఘంలో లభ్యమయ్యే పాత పత్రికలనన్నింటినీ ఉపయోగించేది. ఎలెనీ ఇతర విధాలైన ప్రకటనా పనిలోను క్రమంగా పాల్గొనేది.

ఆమె అనారోగ్యంగా ఉన్న సంవత్సరాలన్నింటిలోను నాతోపాటు ఎల్లప్పుడూ కూటాలకు వచ్చేది. ఆమె ఎప్పుడూ ఒక్క సమావేశానికి గానీ అసెంబ్లీకి గానీ హాజరు కాకుండా ఉండలేదు. గ్రీసులో యెహోవాసాక్షులు హింసించబడుతున్నందువల్ల, విదేశాలకు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు కూడా ఆమె రాకుండా ఉండలేదు. ఆమెకు పరిమితులున్నప్పటికీ, ఆస్ట్రియా, జర్మనీ, సైప్రస్‌, మరితర దేశాల్లో జరిగిన సమావేశాలకు సంతోషంగా హాజరైంది. యెహోవా సేవలో నాకు బాధ్యతలు పెరగడంతో ఆమెకు పరిస్థితులు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు సహితం, ఆమె ఎన్నడూ ఫిర్యాదు చేయనూ లేదు, తన మీద ఎక్కువ శ్రద్ధ చూపాలని కోరనూ లేదు.

నాకు ఈ పరిస్థితి సహనము, పట్టుదలల విషయంలో దీర్ఘకాల తర్ఫీదునిచ్చింది. యెహోవా సహాయ హస్తాన్ని నేను అనేకసార్లు అనుభవపూర్వకంగా గుర్తించాను. సహోదరులు సహోదరీలు, తమకు సాధ్యమైన విధంగా మాకు సహాయం చేసేందుకు నిజంగా ఎన్నో త్యాగాలు చేశారు, డాక్టర్లు ఎంతో దయతో మాకు మద్దతునిచ్చారు. మాకున్న విషమకరమైన పరిస్థితుల మూలంగా నేను పూర్తికాల ఉద్యోగం చేయడం సాధ్యం కాకపోయినప్పటికీ, ఎంతో కష్టంగా ఉన్న ఆ సంవత్సరాల్లో అత్యవసరమైనవి మాకు ఎన్నడూ కొరవడలేదు. యెహోవా ఆసక్తులకు, సేవకే మేము ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాము.​—⁠మత్తయి 6:⁠33.

ఎంతో విషమకరమైన ఆ పరిస్థితులను తట్టుకునేలా మాకు సహాయం చేసినదేమిటని అనేకులు అడిగారు. నేను ఇప్పుడు గతాన్ని వెనుదిరిగి చూస్తే, బైబిలును వ్యక్తిగతంగా అధ్యయనం చేయడము, దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థన చేయడము, క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరు కావడము, ప్రకటనా పనిలో ఆసక్తిగా పాల్గొనడము, మా సహనాన్ని పట్టుదలను మరింత పటిష్ఠం చేశాయని గుర్తిస్తున్నాను. “యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము . . . యెహోవానుబట్టి సంతోషించుము . . . నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును” అని కీర్తన 37:3-5 లో ఉన్న ప్రోత్సాహకరమైన మాటలు మాకు ఎప్పుడూ గుర్తు చేయబడేవి. “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు” అని కీర్తన 55:22 లో ఉన్న మాటలు కూడా మాకెంతో సహాయకరంగా ఉండేవి. ఒక పిల్లవాడు తన తండ్రి మీద సంపూర్ణ నమ్మకాన్ని ఉంచినట్లుగానే, మేము మా భారాలను యెహోవా మీద మోపడమే గాక, వాటిని ఆయనకే వదిలేసేవాళ్ళం.​—⁠యాకోబు 1:⁠6.

1987 ఏప్రిల్‌ 12న, నా భార్య మా ఇంటి ముందు నిలబడి ప్రకటిస్తుండగా, అకస్మాత్తుగా ఆమె వెనుకనున్న ఇనుప తలుపు విసురుగా మూసుకోవడంతో ఆమె ఫుట్‌పాత్‌ మీద పడిపోయింది, ఆమెకు పెద్ద దెబ్బ తగిలింది. దాని మూలంగా, ఆమె తర్వాతి మూడు సంవత్సరాలు కోమాలో ఉండి, 1990 తొలి భాగంలో మరణించింది.

యెహోవాను నా శాయశక్తులా సేవించడం

1960 లో, పైరీయస్‌లోని నికేయాలో సంఘ సేవకుడుగా నియమించబడ్డాను. అప్పటినుండి, పైరీయస్‌లోని అనేక సంఘాల్లో సేవ చేసే ఆధిక్యత నాకు లభించింది. నాకు పిల్లలు లేకపోయినప్పటికీ, ఆధ్యాత్మిక పిల్లలు అనేకులు సత్యంలో స్థిరపడేందుకు సహాయపడడంలో ఆనందించగలిగాను. ఇప్పుడు, వారిలో కొందరు సంఘ పెద్దలుగాను, పరిచర్య సేవకులుగాను, పయినీరు పరిచారకులుగాను, బేతేలు కుటుంబ సభ్యులుగాను సేవచేస్తున్నారు.

1975 లో గ్రీసులో ప్రజాస్వామ్యం పునఃస్థాపించబడిన తర్వాత, యెహోవాసాక్షులు ఇక మీదట అడవుల్లో దాగివుండనవసరం లేకుండా తమ సమావేశాలను స్వేచ్ఛగా జరుపుకోగలుగుతున్నారు. మాలో కొందరం విదేశాల్లో సమావేశాలను సంస్థీకరించడంలో సంపాదించిన అనుభవం, ఇప్పుడు ఎంతో సహాయకరంగా ఉంది. అలా, అనేక సంవత్సరాలు వివిధ సమావేశ కమిటీలలో సేవచేసే ఆధిక్యతను ఆనందాన్ని పొందగలిగాను.

తర్వాత, 1979 లో, గ్రీసులోని ఏథెన్స్‌ శివార్లలో, మొదటి అసెంబ్లీ హాల్‌ నిర్మాణ పథకాలు వేయబడ్డాయి. ఈ బృహత్తరమైన నిర్మాణ పథకాన్ని సంస్థీకరించి నిర్వహించడంలో సహాయపడే నియమాకం నాకు లభించింది. ఈ పనికి కూడా ఎంతో సహనమూ పట్టుదలా అవసరమయ్యాయి. స్వయంత్యాగ స్ఫూర్తిగల వందలాది సహోదర సహోదరీలతో నేను మూడు సంవత్సరాలు కలిసి పనిచేసినప్పుడు మా మధ్య ప్రేమ ఐక్యతల బలమైన అనుబంధం ఏర్పడింది. ఈ ప్రాజెక్టు స్మృతులు నా హృదయంపై చెక్కు చెదరని ముద్ర వేశాయి.

ఖైదీల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడం

కొన్ని సంవత్సరాల తర్వాత, క్రొత్త అవకాశమనే ద్వారం తెరువబడింది. గ్రీసులోకెల్లా అత్యంత పెద్ద కారాగారాల్లో ఒక కారాగారం, కొరీడాలోస్‌లో ఉన్న మా సంఘపు టెరిటరీకి దగ్గర్లో ఉంది. 1991 ఏప్రిల్‌ మొదలుకొని, యెహోవాసాక్షుల పరిచారకుడిగా నేను ప్రతివారం ఆ కారాగారాన్ని సందర్శించాలన్న నియామకం లభించింది. నేను అక్కడ ఆసక్తిగల ఖైదీలతో బైబిలు అధ్యయనాలను, క్రైస్తవ కూటాలను నిర్వహించడానికి అనుమతించబడ్డాను. వాళ్ళలో చాలా మంది గొప్ప మార్పులు చేసుకుని, దేవుని వాక్యపు ప్రచండ శక్తికి రుజువునిచ్చారు. (హెబ్రీయులు 4:​12) అది, కారాగార సిబ్బందినీ, తోటి ఖైదీలను ముగ్ధులను చేసింది. నేను బైబిలు అధ్యయనం నిర్వహించిన ఖైదీల్లో కొందరు విడుదలై, ఇప్పుడు సువార్త ప్రచారకులుగా ఉన్నారు.

ముగ్గురు కుప్రసిద్ధ మాదకద్రవ్య వ్యాపారులతో నేను కొంతకాలంపాటు అధ్యయనం నిర్వహించాను. వాళ్ళు ఆధ్యాత్మిక పురోగతి సాధించడం ప్రారంభించారు, ఒక రోజు బైబిలు అధ్యయనానికి చక్కగా గడ్డం గీసుకుని, శుభ్రంగా తల దువ్వుకుని, షర్టు మీద టై కట్టుకుని వచ్చారు, గ్రీసులో అత్యంత వేడిగా ఉండే మూడు నెలల్లో ఒకటైన ఆగస్టు నెల అది! ఆ కారాగారం డైరెక్టరు, చీఫ్‌ వార్డన్‌, మరి కొందరు ఉద్యోగస్థులు ఆ అసాధారణ దృశ్యాన్ని చూడడానికి తమ ఆఫీసుల నుండి పరుగెట్టుకు వచ్చారు. వారు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు!

స్త్రీలుండే కారాగార బ్లాక్‌లో, ప్రోత్సాహకరమైన మరో అనుభవం కలిగింది. హత్య చేసినందువల్ల, యావజ్జీవ కారాగార శిక్షననుభవిస్తున్న ఒక స్త్రీతో బైబిలు అధ్యయనం ప్రారంభించబడింది. ఆమె తన తిరుగుబాటు విధానాలకు పేరుగాంచింది. అయినప్పటికీ, ఆమె నేర్చుకుంటున్న బైబిలు సత్యాలు ఆమెలో ఎంత గమనార్హమైన మార్పులను తీసుకువచ్చాయంటే, సింహంలాంటి ఆమె ఇప్పుడు గొఱ్ఱెపిల్లలా మారిందని చాలా మంది అన్నారు! (యెషయా 11:​6, 7) ఆమె త్వరలోనే ఆ కారాగారం డైరెక్టరు గౌరవాన్ని నమ్మకాన్ని సంపాదించుకుంది. ఆమె ఆధ్యాత్మికంగా మంచి పురోగతిని సాధించి, యెహోవాకు తనను తాను సమర్పించుకునే స్థాయికి చేరుకోవడం చూసి నేను చాలా సంతోషించాను.

అశక్తులకు వృద్ధులకు సహాయపడటం

నా భార్య అనారోగ్యంతో చేసిన దీర్ఘకాల పోరాటాన్ని చూశాను గనుక, మా మధ్యనున్న రోగుల వృద్ధుల అవసరాలను నేను వెంటనే పసిగట్టగలను. మన ప్రచురణల్లో, అలాంటి వ్యక్తుల దగ్గరకు వెళ్ళి వాళ్ళకు ప్రేమపూర్వక తోడ్పాటునివ్వమని ప్రోత్సహించే ఆర్టికల్‌లు వచ్చినప్పుడెల్లా నాకు ఆసక్తి పెరిగేది. నేను అలాంటి ఆర్టికల్‌లను ఎంతో విలువైనవిగా ఎంచి ఒక దగ్గరికి సేకరించాను. కొన్ని సంవత్సరాల తర్వాత నూరు కన్నా ఎక్కువ పేజీలు గల ఒక ఫోల్డర్‌ని తయారుచేసుకున్నాను. ఆ ఫోల్డర్‌లో, కావలికోట జూలై 15, 1962 (ఆంగ్లం) సంచికలోని, “వృద్ధులకు, వేదననుభవిస్తున్నవారికి శ్రద్ధనివ్వడం” అనేది మొదటి ఆర్టికల్‌. ప్రతి సంఘమూ, రోగులకు వృద్ధులకూ సంస్థీకృత సహాయాన్ని అందజేయడం ప్రయోజనకరంగా ఉంటుందని ఈ ఆర్టికల్‌లు అనేకము చూపిస్తున్నాయి.​—⁠1 యోహాను 3:17, 18.

మా సంఘంలో రోగుల వృద్ధుల అవసరాలను చూసుకునేందుకు అందుబాటులో ఉండేందుకు సిద్ధపడిన సహోదర సహోదరీల గుంపును పెద్దలు రూపొందించారు. ఆ స్వచ్ఛంద సేవకులను పగలు సహాయం చేయగలవారు, రాత్రులు సహాయం చేయగలవారు, రవాణా సౌకర్యం ఇవ్వగలవారు, 24 గంటలు సహాయపడగలవారు అని వివిధ జట్టులుగా సంస్థీకరించాం. చివరి కోవకు చెందినవారు ఎటువంటి అత్యవసర పరిస్థితిలోనైనా సమయానికి రాగలవారితో రూపొందించబడింది.

అలాంటి ప్రయత్నాల ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఉదాహరణకు, అనారోగ్యంగా ఉన్న ఒంటరిగా నివసిస్తున్న ఒక సహోదరిని ప్రతిరోజూ సందర్శిస్తున్నట్లు ఆరోజు కూడా సందర్శించగా, ఆమె నేలమీద స్పృహ తప్పి పడిపోయివుంది. దగ్గర్లోనే నివసిస్తున్న కారున్న ఒక సహోదరికి ఈ విషయం తెలిపాము. ఆ సహోదరి వచ్చి ఆమెను చాలా తక్కువ సమయంలో అంటే పది నిమిషాల్లో దగ్గరున్న ఆసుపత్రికి తీసుకువెళ్ళింది! అది ఆమె ప్రాణాన్ని కాపాడిందని డాక్టర్లు చెప్పారు.

అశక్తులు వృద్ధులు ఈ గుంపు సభ్యులకు చూపే కృతజ్ఞతా భావం చాలా సంతృప్తినిస్తుంది. దేవుని క్రొత్త విధానంలో ప్రస్తుత పరిస్థితికి భిన్నమైన పరిస్థితుల్లో ఈ సహోదర సహోదరీలతో కలిసి జీవించవచ్చన్న నిరీక్షణ ఎంతో ఆనందకరమైనది. వారు బాధననుభవిస్తున్న సమయంలో వారికి లభించిన మద్దతు మూలంగా వారు ఆ బాధలను సహించగలిగారని తెలుసుకోవడం కూడా ఒక మంచి ప్రతిఫలమే.

పట్టుదల వల్ల ఫలితాలు లభించాయి

నేను ఇప్పుడు, పైరీయస్‌లోని ఒక సంఘంలో ఒక పెద్దగా సేవ చేస్తున్నాను. వయస్సు పైబడినప్పటికీ, ఆరోగ్య సమస్యలున్నప్పటికీ, నేను సంఘ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనగలుగుతున్నందుకు సంతోషిస్తున్నాను.

అనేక సంవత్సరాల పాటు ఎంతో విషమకరమైన పరిస్థితులను, క్లిష్టమైన సవాళ్ళను, అనుకోని సంఘటనలను తాళుకునేందుకు మొండి ధైర్యమూ పట్టుదలా అవసరమయ్యాయి. అయినప్పటికీ, నేనీ సమస్యలను అధిగమించేందుకు కావలసిన బలాన్ని యెహోవా నాకు ఎల్లప్పుడూ ఇస్తూనే వచ్చాడు. “నా కాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది” అని కీర్తనకర్త చెప్పిన మాటలు సత్యమని నేను మళ్ళీ మళ్ళీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.​—⁠కీర్తన 94:18, 19.

[25వ పేజీలోని చిత్రం]

1957 లో నా భార్య ఎలెనీకి రెండవ ఆపరేషన్‌ జరిగిన తర్వాత నేను ఆమె

[26వ పేజీలోని చిత్రం]

1969 లో జర్మనీలోని న్యూరెంబర్గ్‌లో జరిగిన సమావేశంలో

[28వ పేజీలోని చిత్రం]

రోగులకు వృద్ధులకు సహాయం చేసిన సహోదర సహోదరీల గుంపు