వాళ్ళు తమ వయస్సుకు తగ్గట్లు జ్ఞానులుగా ఉంటారు
వాళ్ళు తమ వయస్సుకు తగ్గట్లు జ్ఞానులుగా ఉంటారు
“పెద్దల దగ్గర జ్ఞానముంది, అలాగే పిల్లలు కూడా వాళ్ళ వయస్సుకు తగ్గట్లు జ్ఞానులుగా ఉంటారు” అన్నది నైజీరియాలోని ఒక సామెత. నైజీరియాలో క్రైస్తవ పెద్దగా సేవచేస్తున్న ఎడ్విన్ అది నిజమని కనుగొన్నాడు.
ఒకరోజు, ఎడ్విన్‌కి ఇంట్లో తన బల్ల క్రింద ఒక ఇనుప పెట్టె కనిపించింది.
“ఇది ఎవరిది?” అని ఎడ్విన్ తన ముగ్గురు పిల్లలను అడిగాడు.
“అది నాది” అని ఎనిమిదేండ్ల ఇమ్మాన్వెల్ జవాబిచ్చాడు. చతురస్రాకారంలో ఐదు చదరపు అంగుళాల ఆ తుప్పు పట్టిన ఇనుప పెట్టె మీద పొడవైన రంధ్రం ఉంది. అది యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త పనికోసమైన చందా వేయడానికని వాడు హడావిడిగా చెప్పాడు. “నేను ప్రతి రోజూ రాజ్య మందిరానికి వెళ్ళడం లేదు కదా, టిఫిన్ కొనుక్కోవడానికి నాకు ఇచ్చిన డబ్బును నేను వాడనప్పుడల్లా వేసివుంచేందుకు ఒక చిన్న పెట్టె చేసుకోవాలని నిర్ణయించుకున్నాను” అని వాడు వివరంగా చెప్పాడు.
వార్షిక జిల్లా సమావేశానికి హాజరయ్యేందుకు అవసరమయ్యే డబ్బు కూడబెట్టుకోవడానికి ఇమ్మాన్వెల్ వాళ్ళ నాన్నగారికి ఇంట్లో ఒక పెట్టె ఉంది. కానీ కుటుంబంలో అత్యవసరం ఏర్పడినప్పుడు దానిలో ఉన్న డబ్బును ఉపయోగించుకున్నారు. తన చందా డబ్బును వేరే దేనికీ వాడకుండా ఉండేందుకని, ఇమ్మాన్వెల్ ఒక పాత డబ్బాను తీసుకుని దాన్ని మూసేందుకు ఒక వెల్డర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డబ్బా దేని కోసమో తెలుసుకున్న ఆ వెల్డర్ తుక్కు ఇనుముతో ఇమ్మాన్వెల్ కోసం ఒక పెట్టె తయారు చేశాడు. ఇమ్మాన్వెల్ తమ్ముడికి ఐదేండ్లు, పేరు మైఖేల్, తనకు కూడా ఒక పెట్టె కావాలని మైఖేల్ కోరాడు.
పిల్లలు చేసినది చూసి ఆశ్చర్యపోయిన ఎడ్విన్, పెట్టెలను ఎందుకు చేయించుకున్నారని పిల్లలను అడిగాడు. “నేను చందా వేయాలనుకుంటున్నాను!” అని మైఖేల్ అన్నాడు.
ఇమ్మాన్వెల్, మైఖేల్, తొమ్మిదేండ్ల వయస్సు గల వాళ్ళ అక్క ఉచే, తాము భోజనం కొనుక్కోవడానికి ఇచ్చిన డబ్బులో ఆదా అయిన డబ్బును తమ తల్లిదండ్రులకు తెలియకుండా తమ పెట్టెల్లో వేస్తూ వచ్చారు. వాళ్ళకు ఆ ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది? రాజ్య మందిరంలోని చందా పెట్టెలో కొంత డబ్బు చందా వేయాలని, ఆ పిల్లలు తమ చేతిలో డబ్బులు ఉంచుకోగల వయస్సు రాగానే, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు నేర్పారు. తమకు నేర్పిన పాఠాన్ని వాళ్ళు చక్కగా నేర్చుకున్నారని స్పష్టమవుతుంది.
ఆ పెట్టెలు నిండినప్పుడు, వాటిని కోసి, తెరిచారు. వాళ్ళు ఆదా చేసిన మొత్తం డబ్బు 3.13 డాలర్లు. సగటు సాంవత్సరిక ఆదాయం దాదాపు కొన్ని వందల డాలర్లు మాత్రమే ఉన్న ఆ దేశంలో అది చిన్న మొత్తమేమీ కాదు. అలాంటి స్వచ్ఛంద విరాళాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 235 దేశాల్లో యెహోవాసాక్షులు చేస్తున్న ప్రకటనా పనికి మద్దతునిస్తున్నాయి.