కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

స్వీడన్‌లో ఆధునిక హతసాక్షుల సాక్ష్యం

స్వీడన్‌లో ఆధునిక హతసాక్షుల సాక్ష్యం

రాజ్య ప్రచారకుల నివేదిక

స్వీడన్‌లో ఆధునిక హతసాక్షుల సాక్ష్యం

“సాక్షి” అన్న మాటకు గ్రీకు పదం మార్టీర్‌. ఈ గ్రీకు మాట నుండే “మార్టిర్‌” అనే ఆంగ్ల పదం వచ్చింది. మార్టిర్‌ అంటే “తన మరణం ద్వారా సాక్ష్యమిచ్చే వ్యక్తి” అని అర్థం. మొదటి శతాబ్దానికి చెందిన క్రైస్తవులు అనేకులు తమ విశ్వాసం కోసం మరణించడం ద్వారా యెహోవా గురించి సాక్ష్యమిచ్చారు.

అదేవిధంగా, 20వ శతాబ్దంలో వేల కొలది క్రైస్తవులు రాజకీయ జాతీయ వివాదాల్లో తటస్థంగా ఉన్నందువల్ల, హిట్లర్‌ అనుచరుల చేతుల్లో మరణించవలసి వచ్చింది. ఈ ఆధునిక హతసాక్షుల ద్వారా కూడా శక్తివంతమైన సాక్ష్యమివ్వబడింది. ఇటీవల స్వీడన్‌లోనూ అదే జరిగింది.

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి 50 సంవత్సరాలు గడిచిన సందర్భంగా, స్వీడన్‌ ప్రభుత్వం నాజీలు చేసిన మారణహోమం గురించి దేశవ్యాప్తంగా విద్యా ప్రచారాన్ని చేసింది. ఆ విద్యా ప్రాజెక్ట్‌కు సజీవ చరిత్ర అని పేరుపెట్టారు. ఆ ప్రాజెక్ట్‌లో భాగం వహించి, తమ అనుభవాలను పంచుకోవడానికి యెహోవాసాక్షులు కూడా ఆహ్వానించబడ్డారు.

యెహోవాసాక్షులు ఆ ఆహ్వానానికి ప్రతిస్పందించి, నాజీలు చేసిన మారణహోమానికి బలై మరవబడినవారు అనే పేరుతో ఒక ప్రదర్శనను జరిపారు. స్ట్రాంగాస్‌లోని యెహోవాసాక్షుల అసెంబ్లీ హాలులో ఆ ప్రదర్శన ప్రారంభమైంది. మారణహోమం నుండి బయటపడగలిగిన సాక్షులు, ఆ ప్రదర్శన జరిగిన మొదటి రోజున హాజరైన 8,400 కన్నా ఎక్కువ మంది సందర్శకులతో తమ అనుభవాలను పంచుకున్నారు! 1999వ సంవత్సరాంతానికల్లా, ఆ ప్రదర్శన స్వీడన్‌లోని 100 కన్నా ఎక్కువ మ్యూజియమ్‌లలోను ప్రజా గ్రంథాలయాల్లోను చూపబడింది, దాదాపు 1,50,000 మంది దాన్ని చూశారు. ఆ సందర్శకులలో ప్రభుత్వాధికారులు కూడా ఉన్నారు. వారు తాము చూసిన దాని గురించి సానుకూలంగా వ్యాఖ్యానించారు.

స్వీడన్‌లో యెహోవాసాక్షుల కార్యకాలాపాలకు సంబంధించిన వేరే ఏ కార్యక్రమం కూడా ఇంత విస్తృతంగా జరగలేదు, ఇంత ప్రశంసాత్మకమైన ప్రాచుర్యాన్ని పొందలేదు. “మారణహోమానికి సంబంధించిన మీ అనుభవాలను మాతో ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదు?” అని సందర్శకులనేకులు అడిగారు.

ఒక సంఘ ప్రాంతంలో ఈ ప్రదర్శన చూపబడిన తర్వాత, గృహ బైబిలు అధ్యయనాల్లో 30 శాతం పెరుగుదల ఉన్నట్లు ఆ సంఘం నివేదించింది. ఒక సాక్షి తన సహోద్యోగిని ప్రదర్శనకు ఆహ్వానించాడు. ఆయన దానికి ఆనందంగా అంగీకరించి ఒక స్నేహితురాలిని కూడా తీసుకువచ్చాడు. తమ విశ్వాసాన్ని త్యజిస్తున్నట్లు డాక్యుమెంటుపై సంతకం పెట్టే బదులు చనిపోవడానికి సిద్ధపడేంతటి బలమైన విశ్వాసాన్ని ప్రజలు ఎలా కలిగివుండగలరన్నది అర్థం చేసుకోలేకపోతున్నానని ఆ స్నేహితురాలు తర్వాత చెప్పింది. ఆమె అలా చెప్పడం వల్ల మరి కొన్ని చర్చలు జరిగాయి, అలా ఆమెతో బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించారు.

మొదటి శతాబ్దపు హతసాక్షుల్లాగే ఈ 20వ శతాబ్దపు నమ్మకస్థులైన హతసాక్షులు కూడా యెహోవాయే అద్వితీయ సత్య దేవుడనీ, మనం ఆయన మీద అచంచల విశ్వాసాన్ని కలిగివుండడానికి, ఆయన పట్ల నమ్మకంగా ఉండడానికీ అర్హుడనీ ధైర్యంగా సాక్ష్యమిచ్చారు.​—⁠ప్రకటన 4:⁠10, 11.

[13వ పేజీలోని చిత్రసౌజన్యం]

Camp prisoner: Państwowe Muzeum Oświęcim-Brzezinka, courtesy of the USHMM Photo Archives