నిర్మలమైన మనస్సాక్షి ఖరీదెంత?
నిర్మలమైన మనస్సాక్షి ఖరీదెంత?
“R$20,000 తీసుకోమని ప్రభుత్వానికి ఆజ్ఞాపించబడింది.” ఈ అసాధారణమైన శీర్షిక, కోరేయూ డూ పోవూ అనే బ్రెజీలియన్ వార్తాపత్రికలో ఇటీవల కనిపించింది. ఆ ఆర్టికల్, లూయీజ్ ఆల్‌వో డీ ఆర్ ఆయూజూ అనే స్థానిక పోస్ట్‌మ్యాన్ కథను చెప్పింది. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి తన భూమిలో కొంత భాగాన్ని అమ్మాడు. తన భూమి ఇప్పుడు ప్రభుత్వానికి చెందుతుందని తెలిపే పత్రంపై సంతకం చేసిన తర్వాత, ఒప్పందం కుదుర్చుకున్న వెల కన్నా 20,000 బ్రెజీలియన్ రియాల్‌లు (దాదాపు 8,000 అమెరికన్ డాలర్లు) ఎక్కువగా తనకు చెల్లించబడ్డాయని చూసి లూయీజ్ ఆశ్చర్యపోయాడు!
తనకు అందిన డబ్బును తిరిగి ఇవ్వడం అంత సులభం కాలేదు. లూయీజ్, ప్రభుత్వ శాఖలను అనేకసార్లు సందర్శించి విఫలుడయ్యాడు. ఆ తర్వాత, ఒక లాయర్‌ని పెట్టుకొని ఈ సమస్యను గురించి కోర్టులో పరిష్కరించుకోమని ఆయనకు సలహా ఇవ్వబడింది. ఆ డబ్బును తిరిగి తీసుకుని, కేసుకైన ఖర్చులను తిరిగి చెల్లించమని ప్రభుత్వానికి తీర్పు విధించిన జడ్జి, “ఎవరో పొరపాటు చేశారన్నది స్పష్టం. ప్రభుత్వ వ్యవహారాల్లో జరిగే అనవసరమైన జాప్యం మూలంగా, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో ఎవరికీ తెలియదు. ఇటువంటి కేసు రావడం ఇదే మొదటిసారి, ఇలాంటిది నేను మునుపెన్నడూ చూడలేదు” అని వ్యాఖ్యానించాడు.
“న్యాయబద్ధంగా నాది కాని సొమ్మును నా దగ్గరుంచుకోవడానికి బైబిలు శిక్షణ పొందిన నా మనస్సాక్షి అంగీకరించలేదు. నేను ఆ డబ్బును తిరిగి చెల్లించడానికి ప్రయత్నించవలసి వచ్చింది” అని యెహోవాసాక్షియైన లూయీజ్ వివరించాడు.
అలాంటి దృక్పథం ఎంతో అసాధారణమైనదిగా ఉందని గానీ అర్థం చేసుకోలేనిదిగా ఉందని గానీ అనేకులు అనుకోవచ్చు. కానీ, లోక అధికారులతో వ్యవహరించేటప్పుడు నిర్మలమైన మనస్సాక్షిని కాపాడుకునే విషయానికి నిజ క్రైస్తవులు అత్యధిక ప్రాముఖ్యతనిస్తారని దేవుని వాక్యం చూపిస్తోంది. (రోమీయులు 13:5) యెహోవాసాక్షులు ‘అన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింప గోరుచు మంచి మనస్సాక్షిని’ కాపాడుకోవాలన్న దృఢనిశ్చయంతో ఉన్నారు.—హెబ్రీయులు 13:18.