కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భ్రష్టత్వాన్ని కలుగజేసే దేనికైనా దూరంగా పరిశుభ్రంగా ఉండండి

భ్రష్టత్వాన్ని కలుగజేసే దేనికైనా దూరంగా పరిశుభ్రంగా ఉండండి

భ్రష్టత్వాన్ని కలుగజేసే దేనికైనా దూరంగా పరిశుభ్రంగా ఉండండి

పరిశుభ్రంగా ఉండాలన్న కోరిక మనలో సహజంగానే ఉంటుంది, కానీ మనకు దేవునితోగల అనుబంధం విషయానికి వస్తే, ఆయన్ను సంతోషపరచడానికి పరిశుభ్రత ఒక ఆవశ్యకత. పరిశుభ్రమైన వాటిని స్వచ్ఛమైన వాటిని వర్ణించడానికీ, అలాగే మలినం, కల్తీ, లేదా భ్రష్టత్వము కలిగేలా చేసే ఏదీ లేని స్థితికి దోషరహితమైన, నిష్కళంకమైన స్థితికి మళ్ళీ తీసుకువచ్చే శుద్ధీకరణా చర్యను వర్ణించడానికీ హీబ్రూలోను గ్రీకులోను అనేక పదాలు ఉన్నాయి. ఆ పదాలు శారీరక పరిశుభ్రతను మాత్రమే కాక, తరచుగా నైతిక లేక ఆధ్యాత్మిక పరిశుభ్రతను కూడా వర్ణిస్తాయి.

శారీరక పరిశుభ్రత. ఇశ్రాయేలు జనాంగం 40 సంవత్సరాలు అరణ్యంలో సంచరించినప్పటికీ, వారి అలవాట్ల మూలంగా వారు ఇతరులతో పోలిస్తే చాలామట్టుకు ఆరోగ్యవంతులుగా ఉన్నారు. పాళెములో ఉన్నప్పుడు వారిని నియంత్రించే దేవుని నియమాలు అందుకు దోహదపడ్డాయనడంలో సందేహం లేదు. ఉదాహరణకు వ్యాధి నిర్ధారణలు జరగాలి, వాటికి చికిత్సలు జరగాలి అనే నియమాలు వారికి ఉన్నాయి. ఈ ఏర్పాటు క్రింద, పరిశుభ్రమైన నీటి యొక్క ప్రాముఖ్యత నొక్కిచెప్పబడింది.

యేసు కూడా శారీరక పరిశుభ్రతకు సంబంధించిన ఒక సూత్రం ఆధారంగా పరిసయ్యుల ఆధ్యాత్మిక అపరిశుభ్రతను, వారి వేషధారణను ఎత్తిచూపించాడు. మోసపూరితమైన వారి ప్రవర్తనను, గిన్నెని లేదా పళ్ళాన్ని వెలుపట శుద్ధిచేసి లోపల చేయకుండా ఉండడంతో పోల్చాడు. (మత్తయి 23:​25, 26) చివరి పస్కా పండుగ సమయంలో తన శిష్యులతో మాట్లాడేటప్పుడు ఇస్కరియోతు యూదా కూడా ఉండగా యేసు అలాంటిదే మరొక దృష్టాంతాన్ని ఉపయోగించాడు. వారు స్నానం చేసినందునా, వారి పాదాల్ని వారి యజమాని కడిగినందునా వారు శారీరకంగా ‘కేవలము పవిత్రులయ్యారు’ అయితే, ఆధ్యాత్మికంగా “మీలో అందరు పవిత్రులు కారని” యేసు అన్నాడు.​—⁠యోహాను 13:​1-11.

సహజమే అయినా అపవిత్రము​—⁠ఎందుకు?

ఋతుక్రమము, భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధము, శిశుజననము వంటివి సహజమైనవే యుక్తమైనవే అయినా ధర్మశాస్త్రములో అవి “అపవిత్రమైనవిగా” ఎందుకు దృష్టించబడ్డాయి? అలా దృష్టించడం ద్వారా ఏర్పడిన ఒక ఫలితం ఏమిటంటే, వివాహంలోని అత్యంత సన్నిహిత సంబంధాలు పవిత్రత స్థాయి వరకు ఉన్నతపరచబడ్డాయి. భార్యాభర్తలిరువురికి ఆత్మనిగ్రహం, జననేంద్రియాలపట్ల ఉన్నతమైన భావం, జీవము రక్తముల పవిత్రత పట్ల గౌరవము ఉండాలని బోధించింది. ఆ నియమాలను నిష్ఠగా పాటించడం వల్ల లభించే ఆరోగ్యకర ప్రయోజనాల గురించి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే, ఈ విషయంలో మరో అంశం ఇమిడివుంది.

ఆదియందు దేవుడు తొలి స్త్రీపురుషులలో లైంగిక ప్రేరణలను, జనన శక్తులను సృష్టించి, వారు సహజీవనం చేస్తూ పిల్లలను కనాలని ఆజ్ఞాపించాడు. కాబట్టి పరిపూర్ణులైన ఆ జత లైంగిక సంబంధాలు కలిగివుండడం ఏమాత్రం పాపంకాదు. కానీ, ఆదాము హవ్వలు లైంగిక సంబంధాల విషయంలో కాక, నిషేధించబడిన ఫలాన్ని తినడం ద్వారా దేవునికి అవిధేయులైనప్పుడు ప్రచండమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అకస్మాత్తుగా వారి పాపభరిత మనస్సాక్షులు తాము దిగంబరంగా ఉన్నామని వారికి గుర్తుచేశాయి, వెంటనే వారు దేవుని దృష్టిలో పడకుండా తమ జననాంగాలను కప్పుకున్నారు. (ఆదికాండము 3:​7, 10, 11) అప్పటినుండి పురుషులు పిల్లలను కనాలన్న ఆజ్ఞను పరిపూర్ణంగా నెరవేర్చలేకపోయారు, బదులుగా పాపమనే కళంకము, మరణశిక్ష తల్లిదండ్రుల నుండి పిల్లలకు వంశపారంపర్యంగా వచ్చాయి. ఎంత నీతిగా దైవభక్తితోవున్న తల్లిదండ్రులైనా పాపపంకిలమైన పిల్లల్నే కంటారు.​—⁠కీర్తన 51:⁠5.

జననేంద్రియాల ఉపయోగానికి సంబంధించి ధర్మశాస్త్రంలోని ఆవశ్యకతలు స్త్రీపురుషులకు స్వయం క్రమశిక్షణను, కోరికల సంబంధంగా నిగ్రహాన్ని, సంతానాన్ని వృద్ధిచేయడానికి దేవుడు ఉపయోగించే మాధ్యమంపట్ల గౌరవాన్ని నేర్పించాయి. మానవునికి వారసత్వంగా వచ్చిన పాపానికి జ్ఞాపికగా, తమ శరీరాలు సహజ విధులను నిర్వర్తించేటప్పుడు వెలువడే జననేంద్రియ సంబంధిత స్రావాలు స్రవిస్తున్నప్పుడు కొంతకాలం అపవిత్రులుగా ఉండడం యుక్తమే. కొన్ని లోపాల కారణంగా అసహజమైన రీతిలో స్రావాలు ఎక్కువకాలం స్రవిస్తే, ఇంకా ఎక్కువకాలంపాటు అపవిత్రులుగా ఉండాలి; చివర్లో, అలాగే తల్లి ప్రసవించిన తర్వాత కూడా, స్నానం చేయడానికి తోడు, ఒక పాపపరిహారార్థబలి అర్పించాల్సివుంటుంది, అప్పుడు దేవుని యాజకుడు ఆ వ్యక్తి పక్షాన ప్రాయశ్చిత్తం చేస్తాడు. యేసు తల్లి మరియ తన తొలి ప్రసవం తర్వాత, వారసత్వంగా వచ్చిన పాపాన్ని ఆ విధంగానే ఒప్పుకుని, తను పాపరహితురాలు కాదని, పరిపూర్ణురాలు కాదని గుర్తిస్తూ ప్రాయశ్చిత్తార్థ బలిని అర్పించింది.​—⁠లూకా 2:​22-24.

క్రైస్తవులు, పరిశుద్ధతా

యేసు భూమ్మీద ఉన్నప్పటి రోజుల్లో ధర్మశాస్త్రము, దాని ఆచారాలు అమలులో ఉన్నా క్రైస్తవులు దాని క్రింద, అందులోని పరిశుభ్రతా నియమాల క్రింద లేరు. (యోహాను 11:​55) ధర్మశాస్త్రము “రాబోవుచున్న మేలుల ఛాయగలది”గా ఉంది; “నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది.” (హెబ్రీయులు 10:⁠1; కొలొస్సయులు 2:​17) కాబట్టి పౌలు ఈ శుద్ధీకరణ విషయాల గురించి ఇలా వ్రాశాడు: “ఏలయనగా మేకలయొక్కయు, ఎడ్లయొక్కయు రక్తమును, మైలపడిన వారిమీద ఆవుదూడ బూడిదె చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినయెడల, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.”​—⁠హెబ్రీయులు 9:​13, 14, 19-23.

కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే క్రైస్తవులను సమస్త పాపముల నుండి, సమస్త దుర్నీతి నుండి పవిత్రులనుగా చేస్తుంది. (1 యోహాను 1:​7, 9) క్రీస్తు తన సంఘము కళంకములేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను ఉండేలా, ‘సత్‌క్రియలయందాసక్తిగల, తన సొత్తైన ప్రజలుగా’ ఉండేలా దాన్ని “ప్రేమించి, . . . వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.” (ఎఫెసీయులు 5:​25-27; తీతు 2:​14) కాబట్టి ఈ క్రైస్తవ సంఘంలోని ప్రతి సభ్యుడు ‘తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోక’ దేవుని ఆత్మఫలాన్ని ప్రదర్శిస్తూ, ‘ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను [దేవుడు] తీసివేయును’ అని గుర్తుంచుకోవాలి.​—⁠2 పేతురు 1:​5-9; యోహాను 15:​2, 3.

ఉన్నతమైన పరిశుభ్రతా ప్రమాణాలను పాటించండి

కాబట్టి క్రైస్తవులు ‘శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి’ దూరంగా ఉంటూ, శారీరక, నైతిక, ఆధ్యాత్మిక పరిశుభ్రతకు సంబంధించి ఉన్నతమైన ప్రమాణాలను పాటించాలి. (2 కొరింథీయులు 7:⁠1) ‘వెలుపలినుండి లోపలికి పోయేవి కాదుగాని, లోపలినుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేస్తాయి’ అని యేసు చెప్పినదాని దృష్ట్యా, క్రీస్తు రక్తం అందించే పవిత్రత నుండి ప్రయోజనం పొందే వీరు ఆధ్యాత్మిక పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. వారు దేవుని ఎదుట, “పవిత్ర హృదయము” “పవిత్రమైన మనస్సాక్షి” కలిగివుంటారు. (మార్కు 7:​15, 16; 1 తిమోతి 1:⁠5; 3:⁠9; 2 తిమోతి 1:⁠3) అలా పవిత్రమైన మనస్సాక్షి గలవారికి “అన్నియు పవిత్రములే,” దానికి భిన్నంగా, అపవిత్రమైన మనస్సాక్షిగలవారికి “ఏదియు పవిత్రమైనది కాదు.” (తీతు 1:​15) హృదయము పవిత్రంగా, నిర్మలంగా ఉండాలని కోరుకునేవారు యెషయా 52:11 లోని సలహాను పాటిస్తారు, అందులో ఇలా ఉంది: “అపవిత్రమైన దేనిని ముట్టకుడి; . . . యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి.” (కీర్తన 24:⁠4; మత్తయి 5:⁠8) ఇలా చేయడంద్వారా వారి ‘చేతులు’ సూచనార్థకంగా పరిశుభ్రమయ్యాయి, దేవుడు వారు పవిత్రులన్నట్లే వ్యవహరిస్తాడు.​—⁠యాకోబు 4:⁠8; 2 సమూయేలు 22:​27; కీర్తన 18:​26; దానియేలు 11:​35; 12:⁠10.

ఒక సందర్భంలో అపొస్తలుడైన పౌలు ధర్మశాస్త్రం క్రింద లేకపోయినా దేవాలయంలో ఆచారబద్ధంగా శుద్ధి చేసుకుని ధర్మశాస్త్ర నియమాలను పాటించాడు. ఆయన పరస్పర విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడా? పౌలు ధర్మశాస్త్రానికి లేదా అందులోని ఆచారాలకు విరుద్ధంగా పోరాడలేదు; వాటిని పాటించాలని దేవుడు క్రైస్తవులను కోరడంలేదని మాత్రం చూపించాడు. ధర్మశాస్త్రంలోని ఆచారాలు క్రొత్త క్రైస్తవ సత్యాలను ఉల్లంఘించనంత వరకు, దేవుడు ధర్మశాస్త్రం కోరినవాటిని చేయడంలో అంత అభ్యంతరమేమీ లేదు. పౌలు అలా ప్రవర్తించడానికి కారణం, యూదులు యేసుక్రీస్తును గురించిన సువార్తను వినకుండా వారికి అనవసరంగా ఆటంకాన్ని కలిగించకూడదనుకోవడమే. (అపొస్తలుల కార్యములు 21:​24, 26; 1 కొరింథీయులు 9:​20) దీనంతటిలోను పౌలు ఇతరుల రక్షణపట్ల ఎంతో శ్రద్ధను కనపర్చాడు, రక్షణ సాధ్యమయ్యేలా చేసేందుకు తన శక్తి మేరకు ఆయన చేశాడు. అందుకే ఆయనిలా చెప్పగలిగాడు: “ప్రజలందరి రక్తము నుండి నేను శుద్ధుడను.” (అపొస్తలుల కార్యములు 20:​26; 18:⁠6, NW) మనం శారీరకంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా పరిశుభ్రంగా ఉండేందుకు గట్టిగా కృషి చేద్దాము. అలా చేయడం ద్వారా మనకు దేవుని అంగీకారం లభిస్తుంది.