కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఎంపిక చేసుకునే సూత్రాలు

మీరు ఎంపిక చేసుకునే సూత్రాలు

మీరు ఎంపిక చేసుకునే సూత్రాలు

మీరు నీతిసూత్రాలను అనుసరిస్తారా? లేక నీతి సూత్రాలు పాతకాలానికి సంబంధించినవి అని మీరు అనుకుంటున్నారా? వాస్తవమేంటంటే, ప్రతివ్యక్తి తాను ముఖ్యమైనవని నమ్మే ఏవో ఒక విధమైన సూత్రాలచే నడిపించబడతాడు. సూత్రాలను, “సరైన చర్య గైకొనడానికి ఒకరు అనుసరించే వ్యక్తిగత ప్రవర్తనా నియమావళి” అని నిర్వచించవచ్చు. సూత్రాలు మన నిర్ణయాలపై ప్రభావాన్ని చూపి, మన జీవితమార్గాన్ని నిర్దేశిస్తాయి. సూత్రాలు దిక్సూచిలా పనిచేయగలవు.

ఉదాహరణకు, మత్తయి 7:⁠12 నందున్న బంగారు సూత్రాన్ని పాటించమని యేసు తన అనుచరులను ప్రోత్సహించాడు. ఆ లేఖనంలో ఇలా ఉంది: “కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.” కన్‌ఫ్యూషియస్‌ అనుచరులు దయ, నమ్రత, మర్యాద, యథార్థత వంటి గుణాలతో వ్యవహరించే లీ మరియు రెన్‌ సూత్రాలను పాటిస్తారు. మతపరమైన ఆసక్తి లేని ప్రజలకు కూడా తమ ప్రవర్తనను నిర్దేశించే కొన్ని ప్రాధాన్యతలు లేదా మార్గనిర్దేశకాలు ఉంటాయి.

ఏ విధమైన సూత్రాలు ఎంపిక చేసుకోవాలి?

అయితే, సూత్రాల్లో మంచివి, చెడ్డవి ఉంటాయని మనం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు, ఇంచుమించు గత దశాబ్దం నుంచి, “నేనే-ముందు” అనే వైఖరిచే ప్రభావితమవుతున్న ప్రజల సంఖ్య పెరిగిపోతోంది. ఈ పదం గురించి చాలామందికి తెలియకపోయినప్పటికీ లేక అది తమకు వర్తించదని వారు అనుకున్నప్పటికీ, ప్రవర్తనకు సంబంధించిన ఉన్నత ప్రమాణాలను వదిలివేస్తూ అనేకులు ఆశ్రయించేది ఈ ప్రవర్తనా నియమావళినే. ఆ ప్రత్యేక పదం చేత గుర్తించబడినా, గుర్తించబడకపోయినా నేనే-ముందు అనే వైఖరి స్వార్థపరత్వాన్ని వెల్లడి చేస్తుంది, తరచూ దానితోపాటు మూర్ఖమైన ఐశ్వర్యాసక్తి ఉంటుంది. చైనాలోని ఒక టీవీ ఛానల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇలా అన్నాడు: “మాకు కేవలం రెండే సూత్రాలున్నాయి. ఒకటి డిమాండును తీర్చడం. మరొకటి ధనాన్ని కూడబెట్టుకోవడం.”

నేనే-ముందు అనే స్వభావం అయస్కాంతంలా పనిచేయగలదు. మరి అయస్కాంతం దిక్సూచిని ఎలా ప్రభావితం చేయగలదు? ఈ రెండు ప్రక్కప్రక్కన ఉన్నప్పుడు, దిక్సూచిలోని ముల్లు తప్పుదారి పడుతుంది. అదే విధంగా, నేనే-ముందు అనే వైఖరి, ఒక వ్యక్తి మిగతావాటన్నిటికన్నా తన సొంత కోరికలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేలా చేయడం ద్వారా అతని నైతిక దిక్సూచిని లేదా సత్ప్రవర్తనా నియమావళిని గందరగోళంలో పడవేయగలదు.

నేనే-ముందు అనే వైఖరి ఆధునిక దినానికి సంబంధించినది కాదని తెలుసుకోవడం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందా? ఆ వైఖరి, ఏదెను తోటలో మన మొదటి తల్లిదండ్రులు, మన సృష్టికర్త ఏర్పర్చిన ప్రవర్తనా ప్రమాణాన్ని వదిలేసినప్పుడే ప్రారంభమయ్యింది. అది వారి నైతిక దిక్సూచిని మార్చివేసింది. ఆ వైఖరికి, “నేనే-ముందు” అనే పేరు ఇటీవలనే ఇవ్వబడినప్పటికీ, దాన్ని అనుసరించడం మూలంగానే ఆదాము హవ్వల సంతానంగా మానవులు బాధలు అనుభవిస్తున్నారు.​—⁠ఆదికాండము 3:⁠6-8, 12.

ఆ వైఖరి వ్యాప్తి చెందడమనేది, “అపాయకరమైన కాలములు” ఉండే “అంత్యదినముల”ని బైబిలు ప్రవచనం పేర్కొంటున్న కాలాల్లో ప్రత్యేకంగా గమనార్హంగా ఉంది. చాలామంది ప్రజలు “స్వార్థప్రియులు,” కాబట్టి నేనే-ముందు అనే వైఖరిని అనుసరించాలన్న ఒత్తిడికి మనం గురవుతున్నామంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు.​—⁠2 తిమోతి 3:​1-5.

ఓలాఫ్‌ అనే యువకుడితో మీరు కూడా అంగీకరించవచ్చు, యూరప్‌లో ఉన్న యెహోవాసాక్షుల బ్రాంచికి అతను ఇలా వ్రాశాడు: “ప్రత్యేకించి యౌవనస్థులమైన మేము, నైతికంగా పవిత్రంగా కొనసాగటం చాలా కష్టం. బైబిలు సూత్రాలకు కట్టుబడి ఉండవలసిన అవసరతను దయచేసి మాకు గుర్తు చేస్తుండండి.”

ఓలాఫ్‌ వివేచనగల దృక్కోణాన్ని కనబర్చాడు. మనము యౌవనస్థులమైనా, వృద్ధులమైనా సరే దైవిక సూత్రాలు, మన ప్రవర్తనకు సంబంధించి ఉన్నత ప్రమాణాలను అంటిపెట్టుకుని ఉండటానికి మనకు సహాయపడగలవు. మనము “నేనే-ముందు” అనే వైఖరిని, అంటే ఆ వైఖరి ఆ పేరుతో పిలువబడినా పిలువబడకపోయినా దాన్ని నిరోధించడానికి కూడా అవి మనకు సహాయపడగలవు. బైబిలు సూత్రాలు మీకు నిజంగా ఎలా సహాయం చేయగలవనే దాని గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటే, దయచేసి తర్వాతి ఆర్టికల్‌ను పరిశీలించండి.

[4వ పేజీలోని చిత్రాలు]

నేడు చాలామంది ఇతరుల అవసరాలపై అస్సలు శ్రద్ధ చూపరు