కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆ ప్రాచీన లోకం ఎందుకు నాశనమైంది?

ఆ ప్రాచీన లోకం ఎందుకు నాశనమైంది?

ఆ ప్రాచీన లోకం ఎందుకు నాశనమైంది?

భూగోళవ్యాప్త జలప్రళయం ఒక ప్రకృతి వైపరీత్యం కాదు. అది దేవుడు తీర్చిన తీర్పు. ఈ విషయంలో హెచ్చరిక చేయబడినప్పటికీ, అది చాలామేరకు అలక్ష్యం చేయబడింది. ఎందుకు? యేసు ఇలా వివరించాడు: ‘జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, [ప్రజలు] తినుచు త్రాగుచు పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి.’(ఇటాలిక్కులు మావి.)​—⁠మత్తయి 24:​38, 39.

అభివృద్ధి చెందిన ఒక నాగరికత

కొన్ని విషయాల్లో, జలప్రళయానికి ముందున్న నాగరికత నేడు మనకు లేని ప్రయోజనాలను అనుభవించింది. ఉదాహరణకు, మానవజాతి అంతా ఒకే భాషను మాట్లాడేది. (ఆదికాండము 11:⁠1) ఇది కళల్లో, విజ్ఞానశాస్త్రాల్లో సాఫల్యాలు సాధించడాన్ని ప్రోత్సహించి ఉండేది, అలా సాధించడానికి వివిధ నైపుణ్యాలుగల అనేకమంది ప్రజల సమష్టి కృషి అవసరం. అంతేగాక, అప్పట్లో అనేకమంది ప్రజలు ధీర్ఘాయుష్షును కలిగి ఉండేవారు కాబట్టి వారు శతాబ్దాల కాలంలో నేర్చుకున్న వాటిని ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశం వారికి ఉండేది.

అప్పట్లో మానవ జీవితాయుష్షు నిజంగా అంత సుధీర్ఘమైనదై ఉండేది కాదనీ, బైబిలు వృత్తాంతంలో ప్రస్తావించబడిన సంవత్సరాలు వాస్తవానికి నెలలనీ కొందరు అంటారు. అది నిజమేనా? మహలలేలు విషయాన్ని పరిశీలించండి. బైబిలు ఇలా చెబుతోంది: “మహలలేలు అరువదియైదేండ్లు బ్రదికి యెరెదును కనెను. . . . మహలలేలు దినములన్నియు ఎనిమిదివందల తొంబదియైదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.” (ఆదికాండము 5:​15-17) ఒక సంవత్సరం గనుక ఒక నెల అయితే, మహలలేలు కేవలం ఐదు సంవత్సరాల వయస్సులోనే తన కుమారుడికి జన్మనిచ్చినట్లు! అది నిజం కాదు, అప్పట్లో ప్రజలు మొదటి మానవుడైన ఆదాము కలిగివున్న పరిపూర్ణ జీవశక్తికి దగ్గరగా ఉన్నారు. వారు నిజంగానే శతాబ్దాలపాటు జీవించారు. వారేమి సాధించారు?

జలప్రళయం రావడానికి చాలా శతాబ్దాల ముందు, ఆదాము కుమారుడైన కయీను ఒక పట్టణాన్ని కట్టించగలిగేంతగా భూమి మీద జనాభా విస్తరించింది, అతడు ఆ పట్టణానికి హనోకు అని పేరు పెట్టాడు. (ఆదికాండము 4:​17) జలప్రళయానికి మునుపటి యుగాల్లో, వివిధ రకాలైన కర్మాగారాలు వృద్ధి చెందాయి. “పదునుగల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని” చేయడానికి కొలిమిలు ఉండేవి. (ఆదికాండము 4:​22) ఈ పనిముట్లు, నిర్మాణపనికి, వడ్రంగానికి, దర్జీపనికి, వ్యవసాయానికి ఉపయోగపడేవి అనడంలో సందేహం లేదు. ఈ వృత్తులన్ని భూమిపై నివసించిన తొలి మానవులను గురించిన వృత్తాంతాల్లో ప్రస్తావించబడ్డాయి.

వారు సముపార్జించిన పరిజ్ఞానము, తర్వాతి తరాలవారు ధాతువిజ్ఞానం, వ్యవసాయశాస్త్రం, పశువుల పెంపకం, రచన, లలితకళలు వంటి ప్రత్యేకతలను వృద్ధి చేసుకోవడాన్ని సాధ్యం చేసి ఉండేది. ఉదాహరణకు, యూబాలు “సితారాను సానికను వాడుక చేయువారికందరికిని మూలపురుషుడు.” (ఆదికాండము 4:​21) నాగరికత విస్తృతంగా వృద్ధి చెందింది. అయినప్పటికీ, అంతా హఠాత్తుగా ముగింపుకు వచ్చింది. ఏమి జరిగింది?

ఏ తప్పు జరిగింది?

ఎన్నో ప్రయోజనాలు కలిగున్నప్పటికీ, జలప్రళయానికి మునుపున్న సమాజానికి మంచి ప్రారంభం లేకపోయింది. దాని స్థాపకుడైన ఆదాము దేవునిపై తిరుగుబాటు చేశాడు. నమోదు చేయబడిన మొదటి పట్టణపు నిర్మాణకుడైన కయీను తన స్వంత సహోదరుడిని హత్య చేశాడు. దుష్టత్వం విపరీతంగా పెరిగిపోయిందంటే అందులో ఆశ్చర్యం లేదు! ఆదాము తన సంతానం కోసం మిగిల్చిన దోషభరితమైన వారసత్వపు పర్యవసానాలు అంతకంతకూ విస్తరిస్తుంటాయి.​—⁠రోమీయులు 5:⁠12.

ఆ పరిస్థితి మరో 120 సంవత్సరాలపాటు కొనసాగడానికి అనుమతించాలని యెహోవా నిశ్చయించుకున్నప్పుడు, విషయాలు చరమాంకాన్ని చేరుకుంటున్నాయని స్పష్టమవుతోంది. (ఆదికాండము 6:⁠3) బైబిలు ఇలా చెబుతోంది: ‘నరుల చెడుతనము భూమిమీద గొప్పది, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డది; భూలోకము బలాత్కారముతో నిండియుండెను.’​—⁠ఆదికాండము 6:​5, 11.

చివరికి, సమస్త శరీరులను జలప్రళయములో నాశనం చేస్తానని దేవుడు నోవహుకు నిర్దిష్టంగా చెప్పాడు. (ఆదికాండము 6:​13, 17) నోవహు “నీతిని ప్రకటించి”నప్పటికీ, ప్రజలకు తమ చుట్టూ ఉన్నదంతా అంతం కాబోతోందని విశ్వసించడం కష్టమయ్యిందని స్పష్టమవుతోంది. (2 పేతురు 2:⁠5) కేవలం ఎనిమిది మంది మాత్రమే హెచ్చరికను లక్ష్యపెట్టి, రక్షించబడ్డారు. (1 పేతురు 3:​19) ఇది నేడు మనకెందుకు ప్రాముఖ్యమైనది?

మనకు ఏ ప్రాముఖ్యతను కలిగివుంది?

మనం నోవహు దినాలలాంటి కాలంలోనే జీవిస్తున్నాము. విభ్రాంతి కలిగించే స్థాయిలో జరుగుతున్న, క్రూరమైన ఉగ్రవాద చర్యలు, జాతి నిర్మూలనా దాడులు, కారణం అంటూ ఏమీ లేకుండా సాయుధులు చేసే సామూహిక హత్యలు, గృహసంబంధ దౌర్జన్యం వంటి వాటి గురించి మనం క్రమంగా వింటూనే ఉంటాము. భూమి మళ్ళీ దౌర్జన్యంతో నిండిపోయింది, మునుపటిలానే, రానున్న తీర్పు గురించి లోకానికి తెలియజేయబడుతోంది. తాను దేవుని నియమిత న్యాయాధిపతిగా వచ్చి, గొఱ్ఱెలకాపరి మేకల నుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లుగా ప్రజలను వేరుపరుస్తానని యేసు స్వయంగా చెప్పాడు. అయోగ్యులుగా కనుగొనబడినవారు, ‘నిత్యశిక్షకు పోతారని’ యేసు చెప్పాడు. (మత్తయి 25:​31-33, 46) అయితే ఈసారి, తప్పించుకునే వారు లక్షలాదిమంది ఉంటారని అంటే, ఏకైక సత్య దేవుడ్ని ఆరాధించే ఒక గొప్ప సమూహం ఉంటుందని బైబిలు చెబుతోంది. రానున్న లోకంలో, వీరు మునుపెన్నడూ అనుభవించని విధంగా శాశ్వత శాంతిభద్రతలను అనుభవిస్తారు.​—⁠మీకా 4:​3, 4; ప్రకటన 7:​9-17.

చాలామంది తీర్పును గురించిన అలాంటి బైబిలు వ్యాఖ్యానాలను, హెచ్చరికలను ఎగతాళి చేస్తారు, అయితే ఆ వ్యాఖ్యానాలు నిజమని ఆ తీర్పు చర్యనే నిరూపిస్తుంది. కానీ అలాంటి సంశయవాదులు వాస్తవాలను అలక్ష్యం చేస్తున్నారని అపొస్తలుడైన పేతురు వివరించాడు. ఆయనిలా వ్రాశాడు: ‘అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి, ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను? అని చెప్పుదురు. ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలోనుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు, ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.’​—⁠2 పేతురు 3:​3-7.

యేసు ప్రవచనార్థక ఆజ్ఞకు విధేయంగా, రానున్న ఈ తీర్పు దినమును గురించి ప్రపంచవ్యాప్తంగా ఒక హెచ్చరిక, దాని తర్వాత నిలిచే శాంతిని గురించిన సువార్త సందేశము, నేడు అత్యాసక్తితో ప్రకటించబడుతున్నాయి. (మత్తయి 24:​14) ఈ హెచ్చరికను అల్పంగా తీసుకోకూడదు. సర్వశక్తిమంతుడైన దేవుడు తన మాట నిలబెట్టుకుంటాడు.

రానున్న లోకం

రానున్న ప్రాముఖ్యమైన మార్పును పరిగణనలోకి తీసుకుంటే, మానవజాతి భవిష్యత్తు ఏమిటి? యేసు తాను కొండ మీద చేసిన ప్రఖ్యాత ప్రసంగపు ఉపోద్ఘాతములో ఇలా వాగ్దానం చేశాడు: “సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.” ఆ తర్వాత ఆయన తన శిష్యులకు, “నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని దేవునికి ప్రార్థించమని బోధించసాగాడు. (మత్తయి 5:⁠5; 6:⁠9) అవును, ఇక్కడే ఈ భూమిపైనే, నమ్మకమైన మానవజాతి కోసం అద్భుతమైన భవిష్యత్తు వేచి ఉందని యేసు స్వయంగా బోధించాడు. ఆయన దాన్ని ‘పునఃస్థితిస్థాపనం’ అని పేర్కొన్నాడు.​—⁠మత్తయి 19:​28, అధస్సూచి.

కాబట్టి మీరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు, దేవుని హెచ్చరిక గురించి మీరు సందేహించేలా చేసేందుకు అపహాసకులను అనుమతించకండి. నిజమే, మన పరిసరాలు సుస్థిరంగా కనిపించవచ్చు, ప్రస్తుత లోకానికి సుధీర్ఘమైన చరిత్రే ఉండవచ్చు. అయినా, మనం దాన్ని నమ్ముకోకూడదు. మానవ లోకం ఖండించబడింది. కాబట్టి, అపొస్తలుడైన పేతురు వ్రాసిన పత్రికలోని ఈ ముగింపు మాటల నుండి ప్రోత్సాహాన్ని పొందండి:

“ఇవన్నియు ఇట్లు లయమైపోవునవి గనుక, . . . దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను. . . . వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి.” (2 పేతురు 3:​11, 12, 14, 18) కాబట్టి, పూర్వం నోవహు దినములలో జరిగినదాని నుండి గుణపాఠం నేర్చుకోండి. దేవునికి సన్నిహితులవ్వండి. యేసుక్రీస్తును గురించిన పరిజ్ఞానములో ఎదగండి. దైవభక్తిని పెంపొందింపజేసుకుని, ఈ లోక అంతాన్ని తప్పించుకుని, రానున్న సమాధానకరమైన లోకంలో జీవించడాన్ని ఎంపిక చేసుకునే లక్షలాదిమందిలో మీరూ ఒకరై ఉండండి.

[5వ పేజీలోని చిత్రం]

జలప్రళయానికి ముందే ప్రజలకు లోహకార వృత్తి తెలుసు

[7వ పేజీలోని చిత్రం]

ఒక అద్భుతమైన భవిష్యత్తు వేచివుంది