కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వెలుగు చీకటిని పారద్రోలుతుంది!

దేవుని వెలుగు చీకటిని పారద్రోలుతుంది!

దేవుని వెలుగు చీకటిని పారద్రోలుతుంది!

“యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును.”​—⁠2 సమూయేలు 22:⁠29.

1. వెలుగుకు జీవానికి మధ్య ఏ సంబంధం ఉంది?

“దేవుడు​—⁠వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.” (ఆదికాండము 1:⁠3) ఆ మహత్తరమైన మాటలతో ఆదికాండములోని సృష్టివృత్తాంతం వెలుగుకు మూలం యెహోవా అని తెలియజేస్తుంది; వెలుగు లేనిదే భూమిపై జీవమనుగడ అసాధ్యం. ఆధ్యాత్మిక వెలుగుకు కూడా యెహోవాయే మూలం, మనల్ని జీవమార్గంలో నడిపించడానికి ఆ వెలుగు అత్యావశ్యకం. (కీర్తన 43:⁠3) “నీయొద్ద జీవపు ఊట కలదు; నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము” అని వ్రాసినప్పుడు దావీదు రాజు ఆధ్యాత్మిక వెలుగుకు, జీవానికి ఉన్న దగ్గరి సంబంధాన్ని చూపించాడు.​—⁠కీర్తన 36:⁠9.

2. పౌలు చూపించినట్లుగా వెలుగుకు దేనితో దగ్గరి సంబంధం ఉంది?

2 దావీదు కాలానికి దాదాపు 1,000 సంవత్సరాల తర్వాత అపొస్తలుడైన పౌలు సృష్టి వృత్తాంతాన్ని గురించి పేర్కొన్నాడు. కొరింథులోని క్రైస్తవ సంఘానికి వ్రాస్తూ ఆయనిలా అన్నాడు: ‘అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికినది దేవుడే.’ ఆ తర్వాత పౌలు, ఆధ్యాత్మిక వెలుగుకు యెహోవా నుండి వచ్చే జ్ఞానానికి దగ్గరి సంబంధం ఉందని చూపిస్తూ ఇలా అన్నాడు: “తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.” (2 కొరింథీయులు 4:​5, 6) ఈ వెలుగు మనకు ఎలా చేరుతుంది?

బైబిలు​—⁠వెలుగు ప్రసారిణి

3. యెహోవా, బైబిలు ద్వారా ఎలాంటి వెలుగును అందజేస్తాడు?

3 ఆధ్యాత్మిక వెలుగును యెహోవా ప్రాధమికంగా తన ప్రేరేపిత వాక్యమైన బైబిలు ద్వారా అందజేస్తాడు. కాబట్టి, మనం బైబిలు అధ్యయనం చేస్తూ దేవుని పరిజ్ఞానాన్ని పొందుతున్నప్పుడు, ఆయన వెలుగు మనవైపు ప్రసరించడానికి అనుమతిస్తున్నామన్నమాట. బైబిలు ద్వారా యెహోవా తన సంకల్పాలపై వెలుగును ప్రసరింపజేస్తున్నాడు, మనం ఆయన చిత్తాన్ని ఎలా చేయగలమో వివరిస్తున్నాడు. ఇది మన జీవితాలకు ఒక సంకల్పాన్ని ఇచ్చి, మన ఆధ్యాత్మిక అవసరాలను తీర్చుకునేందుకు సహాయపడుతుంది. (ప్రసంగి 12:⁠1; మత్తయి 5:​3, NW) మనం మన ఆధ్యాత్మిక అవసరాలపట్ల శ్రద్ధ కలిగివుండాలని, మోషే ధర్మశాస్త్రాన్ని ఉల్లేఖిస్తూ యేసు ఇలా నొక్కిచెప్పాడు: ‘మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నది.’​—⁠మత్తయి 4:⁠4; ద్వితీయోపదేశకాండము 8:⁠3.

4. యేసు ఏ రీతిలో “లోకమునకు వెలుగు”?

4 ఆధ్యాత్మిక వెలుగుతో యేసుకి చాలా దగ్గరి సంబంధం ఉంది. నిజానికి ఆయన తనను తాను “లోకమునకు వెలుగు”గా చెప్పుకుంటూ, “నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని” అన్నాడు. (యోహాను 8:​12) యెహోవా సత్యాన్ని మానవజాతికి అందించడంలో యేసు కలిగివున్న కీలక పాత్రను అర్థం చేసుకోవడానికి ఆ మాటలు మనకు సహాయం చేస్తాయి. మనం చీకటికి దూరంగా ఉంటూ దేవుని వెలుగులో నడవాలనుకుంటే, బైబిలులో నమోదు చేయబడినట్లుగా యేసు చెప్పినదంతా వింటూ ఆయన మాదిరిని, ఆయన బోధలను సూక్ష్మంగా అనుకరించాలి.

5. యేసు మరణం తర్వాత ఆయన అనుచరులపై ఏ బాధ్యత పడింది?

5 యేసు, తన మరణానికి కొద్ది రోజులు ముందు మళ్ళీ తనను తాను వెలుగుగా సంబోధించుకుంటూ తన శిష్యులతో ఇలా అన్నాడు: ‘ఇంక కొంతకాలము వెలుగు మీమధ్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడువుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడి.’ (యోహాను 12:​35, 36) వెలుగు సంబంధులుగా మారినవారు బైబిలులోని “ఆరోగ్యముగల వాక్య ప్రమాణమును” నేర్చుకున్నారు. (2 తిమోతి 1:​13, 14, అధస్సూచి.) ఆ తర్వాత వారు ఇతర యథార్థ హృదయులను చీకటిలోనుండి దేవుని వెలుగులోనికి తీసుకువచ్చేందుకు ఆ ఆరోగ్యముగల వాక్యాలను ఉపయోగించారు.

6. వెలుగు చీకట్లకు సంబంధించిన ఏ ప్రాధమిక సత్యాన్ని మనం 1 యోహాను 1:5 లో చూస్తాము?

6 అపొస్తలుడైన యోహాను, “దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు” అని వ్రాశాడు. (1 యోహాను 1:⁠5) ఇక్కడ వెలుగుకు చీకటికి గల తేడాను గమనించండి. ఆధ్యాత్మిక వెలుగు యెహోవా నుండి వస్తుంది, అయితే ఆధ్యాత్మిక చీకటితో మాత్రం ఆయనకు ఎలాంటి సంబంధమూ లేదు. మరైతే చీకటికి మూలం ఎవరు?

ఆధ్యాత్మిక చీకటి​—⁠దానికి మూలం

7. లోకంలోని ఆధ్యాత్మిక చీకటికి ఎవరు కారణం, అతను ఎలా ప్రభావితం చేస్తున్నాడు?

7 అపొస్తలుడైన పౌలు “ఈ యుగసంబంధమైన దేవత” గురించి మాట్లాడాడు. ఆయన మాట్లాడుతున్నది అపవాదియైన సాతాను గురించే. ఇతడు “దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, . . . అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను” అని కూడా ఆయన అన్నాడు. (2 కొరింథీయులు 4:⁠4) చాలామంది దేవునిపై నమ్మకం ఉందని చెప్పుకుంటారు కానీ వారిలో అపవాది లేడని నమ్మేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వారెందుకలా నమ్ముతారు? ఒక దుష్టశక్తి లేక ఏదో మానవాతీత శక్తి ఉండగలదని, అది తమ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేయగలదని వారు ఒప్పుకోవడానికి సుముఖంగా లేరు. అయినా, పౌలు చెబుతున్నట్లు అపవాది నిజంగానే ఉనికిలో ఉన్నాడు, ప్రజలు సత్య ప్రకాశాన్ని చూడకుండేలా వారిని ప్రభావితం చేస్తున్నాడు. మానవుల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసే శక్తి సాతానుకు ఉందన్నది, ఆయన ‘సర్వలోకమును మోస పుచ్చుచున్నాడు’ అన్న ప్రవచనార్థక వర్ణనలో తెలుస్తుంది. (ప్రకటన 12:⁠9) సాతాను కార్యకలాపాల ఫలితంగా, ప్రవక్తయైన యెషయా ప్రవచించిన పరిస్థితి యెహోవా సేవకులకు తప్ప ప్రస్తుత మానవజాతికంతటికీ వర్తిస్తుంది: “చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటికచీకటి జనములను కమ్ముచున్నది.”​—⁠యెషయా 60:⁠2.

8. ఆధ్యాత్మిక చీకటిలో ఉన్నవారు తాము తికమకపడుతున్నామని ఏయే విధాలుగా చూపిస్తారు?

8 కటిక చీకటిలో మనకేమీ కనిపించదు. ఎవరైనా కొద్దిసేపటికే దారితప్పిపోతారు, లేదా తికమకపడిపోతారు. అలాగే, ఆధ్యాత్మిక చీకటిలో ఉన్నవారికి గ్రహణశక్తి కొరవడుతుంది, త్వరలోనే వారు ఆధ్యాత్మిక భావంలో తికమకపడిపోతారు. వారు సత్యానికి అసత్యానికీ, మంచికి చెడుకీ మధ్యనున్న తేడాను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోగలరు. “కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొనువారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొనువారికి శ్రమ” అని ప్రవక్తయైన యెషయా వ్రాసినప్పుడు అలాంటి చీకటిలో ఉన్నవారి గురించే చెబుతున్నాడు. (యెషయా 5:​20) ఆధ్యాత్మిక చీకటిలో నివసించేవారు చీకటి దేవుడైన అపవాదియగు సాతానుచేత ప్రభావితులవుతున్నారు, తత్ఫలితంగా వారు వెలుగుకు జీవానికి మూలం అయినవాని నుండి దూరమౌతున్నారు.​—⁠ఎఫెసీయులు 4:​17-19.

చీకట్లో నుండి వెలుగులోకి రావడం​—⁠ఒక సవాలు

9. తప్పిదస్థులకు చీకటితో అక్షరార్థంగాను, ఆధ్యాత్మికంగాను ఎలాంటి దగ్గరి సంబంధం ఉందో వివరించండి.

9 “వ్యభిచారి​—⁠ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుకు వేసికొని సందె చీకటి కొరకు కనిపెట్టును” అని విశ్వసనీయుడైన యోబు అన్నప్పుడు ఆయన తప్పిదస్థులకు అక్షరార్థ చీకటితో ఉండే దగ్గరి సంబంధం గురించే చెబుతున్నాడు. (యోబు 24:​15) తప్పిదస్థులు ఆధ్యాత్మిక చీకటిలో కూడా ఉన్నారు, అలాంటి చీకటి చాలా శక్తివంతమైనదై ఉండగలదు. లైంగిక అనైతికత, దొంగతనం, లోభత్వం, త్రాగుబోతుతనం, దూషించడం, దోచుకోవడం వంటివి ఆ చీకటిలో చిక్కుకున్నవారి అలవాట్లని అపొస్తలుడైన పౌలు అన్నాడు. కానీ దేవుని వాక్య వెలుగులోనికి వచ్చేవారు మారే అవకాశం ఉంది. అలాంటి మార్పు సాధ్యమని పౌలు తాను కొరింథీయులకు వ్రాసిన పత్రికలో స్పష్టం చేశాడు. కొరింథులోని క్రైస్తవులు చాలామంది ఒకప్పుడు అలవాటుగా చీకటి పనులే చేసేవారు, అయితే పౌలు వారితో ఇలా అన్నాడు: “ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి.”​—⁠1 కొరింథీయులు 6:​9-11.

10, 11. (ఎ) యేసు, తాను కంటిచూపు తెప్పించిన వ్యక్తి పట్ల ఎలా శ్రద్ధ చూపాడు? (బి) చాలామంది వెలుగును ఎందుకు ఎంపిక చేసుకోరు?

10 ఒక వ్యక్తి చిమ్మచీకటిలో నుండి వెలుగులోనికి వచ్చినప్పుడు, ఆయన కళ్ళు ఆ వెలుగుకు అలవాటు పడడానికి కాస్త సమయం పడుతుంది. బేత్సయిదాలో యేసు ఒక అంధుడ్ని స్వస్థపరిచాడు, కానీ ఒకేసారి కాక క్రమక్రమంగా ఆయనను స్వస్థపరిచాడు. “ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యిపట్టుకొని ఊరివెలుపలికి తోడుకొని పోయి, వాని కన్నులమీద ఉమ్మివేసి, వానిమీద చేతులుంచి​—⁠నీకేమైనను కనబడుచున్నదా? అని వానినడుగగా, వాడు కన్నులెత్తి​—⁠మనుష్యులు నాకు కనబడుచున్నారు; వారు చెట్లవలెనుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతట ఆయన మరల తన చేతులు వాని కన్నులమీద నుంచగా, వాడు, తేరిచూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను.” (మార్కు 8:​23-25) ఆ వ్యక్తి ప్రకాశమానమైన సూర్యకిరణాలకు అలవాటుపడగలిగేలా, యేసు అతని కంటిచూపును క్రమేణా తెప్పించివుంటాడన్న విషయం స్పష్టంగా ఉంది. ఆ వ్యక్తి చూడగలిగినప్పుడు ఎంతటి ఆనందాన్ని అనుభవించివుంటాడో మనం ఊహించవచ్చు.

11 అయితే, ఆ వ్యక్తి పొందిన ఆనందం, ఆధ్యాత్మిక చీకట్లో నుండి సత్యపు వెలుగులోనికి క్రమేణా రావడానికి సహాయం పొందినవారు అనుభవించే ఆనందానికి ఏమాత్రం సాటిరాదు. మనం అలాంటివారి ఆనందాన్ని చూసినప్పుడు, ఇంకా ఎక్కువమంది వెలుగు వైపు ఎందుకు ఆకర్షితులు కావడంలేదా అని ఆశ్చర్యపోతుండవచ్చు. అందుకుగల కారణాన్ని యేసు ఇస్తున్నాడు: “తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకురాడు.” (యోహాను 3:​19, 20) అవును, చాలామందికి లైంగిక అనైతికతలో పాల్గొనడం, ఇతరుల్ని అణగద్రొక్కడం, అబద్ధాలు చెప్పడం, మోసాలు దొంగతనాలు చేయడం వంటి “దుష్కార్యము”లు అలవాటుగా చేయడం చాలా ఇష్టం. తమకిష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి సాతాను యొక్క ఆధ్యాత్మిక చీకటి వారికి సరిగ్గా సరిపోయే వాతావరణం.

వెలుగులో పురోభివృద్ధి సాధించడం

12. వెలుగులోకి రావడం ద్వారా మనం ఏయే విధాలుగా ప్రయోజనం పొందాము?

12 మనం సత్య పరిజ్ఞానాన్ని పొందినప్పటి నుండి వ్యక్తిగతంగా మనలో ఎలాంటి మార్పులను మనం చూశాము? కొన్నిసార్లు గతంలోకి చూసుకుని మనం సాధించిన ఆధ్యాత్మిక పురోభివృద్ధిని విశ్లేషించుకోవడం మంచిది. మనం ఎలాంటి దురలవాట్లను వదిలివేశాం? మన జీవితంలో ఎలాంటి సమస్యలను పరిష్కరించుకోగలిగాం? మన భవిష్యత్‌ ప్రణాళికలు ఎలా మారిపోయాయి? మనం యెహోవా శక్తితో, ఆయన పరిశుద్ధాత్మ సహాయంతో మన వ్యక్తిత్వంలోను ఆలోచనా విధానంలోను, వెలుగుకు స్పందిస్తున్నామని రుజువుచేసే మార్పులు చేసుకుంటూ ఉండగలము. (ఎఫెసీయులు 4:​23, 24) పౌలు దాన్నిలా వివరిస్తున్నాడు: “మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు. వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక . . . వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి.” (ఎఫెసీయులు 5:​8-10) మనల్ని మనం యెహోవా వెలుగుచేత నడిపించబడేందుకు అనుమతించుకోవడం ద్వారా మన జీవితాలకు ఒక నిరీక్షణ, ఒక సంకల్పం లభిస్తుంది, మన చుట్టూ ఉన్నవారు కూడా మన మూలంగా ఆహ్లాదాన్ని అనుభవిస్తారు. మనం అలాంటి మార్పులను చేసుకోవడం యెహోవా హృదయాన్ని ఎంత ఆనందపరుస్తుందో ఆలోచించండి!​—⁠సామెతలు 27:⁠11.

13. యెహోవా వెలుగుపట్ల మనం కృతజ్ఞతను ఎలా చూపించగలము, అందుకు ఏమి అవసరమవుతుంది?

13 సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నందుకు, యెహోవా వెలుగును ప్రతిఫలించడం ద్వారా, అంటే, బైబిలు నుండి మనం నేర్చుకున్నవాటిని మన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, పొరుగువారితో పంచుకోవడం ద్వారా మనం ఆయనకు కృతజ్ఞత చూపిస్తాము. (మత్తయి 5:​12-16; 24:​14) వినడానికి నిరాకరించేవారికి, మన ప్రకటనా పనీ అలాగే మన ఆదర్శవంతమైన క్రైస్తవ జీవన విధానమూ ఖండనగా ఉంటాయి. పౌలు ఇలా వివరిస్తున్నాడు: “ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, . . . నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారైయుండక వాటిని ఖండించుడి.” (ఎఫెసీయులు 5:​10, 11) ఇతరులు చీకటి నుండి బయటికి వచ్చి, వెలుగును ఎంపిక చేసుకునేటట్లు వారికి సహాయం చేయడానికి మనకు ధైర్యం అవసరమవ్వచ్చు. దానికన్నా ముఖ్యంగా ఇతరులపట్ల కరుణ, శ్రద్ధ అవసరం, వారి నిత్య ప్రయోజనార్థం వారితో సత్య వెలుగును పంచుకోవాలన్న హృదయపూర్వక కోరిక అవసరం.​—⁠మత్తయి 28:⁠19, 20.

మోసపూరిత వెలుగు విషయమై జాగ్రత్త!

14. వెలుగు సంబంధమైన ఏ హెచ్చరికను మనం లక్ష్యపెట్టాలి?

14 రాత్రుళ్ళు సముద్ర ప్రయాణం చేస్తున్నవారికి ఎలాంటి వెలుగును చూసినా ఆనందంగానే ఉంటుంది. గతంలో ఇంగ్లాండులో, తుపాను నుండి ఆశ్రయం ఎక్కడ లభిస్తుందన్నది తీరంలోని కొండచరియలపై మంటలు రగిల్చి సూచించేవారు. నౌకా సిబ్బంది కృతజ్ఞతాభావం ఉప్పొంగుతుండగా ఆ వెలుగుల దిశలో ప్రయాణించి రేవులను చేరుకునేవారు. అయితే కొన్ని మంటలు మోసపరిచేవి. రేవువైపు వెళ్ళడానికి బదులుగా చాలా నౌకలు తప్పు మార్గానికి మళ్ళించబడేవి. అవి తీరప్రాంతంలోని రాతిదిబ్బలకు ఢీకొని బ్రద్దలయ్యేవి, అక్కడ వాటిలోని సరకు దొంగిలించబడేది. ఈ మోసపూరిత లోకంలో మన ఆధ్యాత్మిక ఓడ బ్రద్దలయ్యేలా చేసే మోసపూరిత వెలుగు వైపు మనం ఆకర్షితులం కాకుండా జాగ్రత్తపడాలి. “సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు” అని మనకు చెప్పబడుతుంది. అలాగే మతభ్రష్టులతోసహా వాని సేవకులు ‘నీతి పరిచారకుల వేషము’ కూడా ‘ధరించుకునే మోసగాండ్రగు పనివారై యున్నారు.’ అలాంటివారి అబద్ధపు వాదనలు వింటూవుంటే యెహోవా సత్యవాక్యమైన బైబిలుపై మన నమ్మకం క్షీణించవచ్చు, మన విశ్వాసం మృతం కావచ్చు.​—⁠2 కొరింథీయులు 11:​13-15; 1 తిమోతి 1:⁠19.

15. జీవమునకు పోవు దారిలోనే ఉండేందుకు మనకేమి సహాయపడుతుంది?

15 కీర్తనకర్త ఇలా వ్రాశాడు: “నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.” (కీర్తన 119:​105) అవును, ‘జీవమునకు పోయే సంకుచితమైన దారి’ మన ప్రేమపూర్వక దేవుడైన యెహోవాచే ప్రకాశవంతం చేయబడింది, “ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.” (మత్తయి 7:​13, 14; 1 తిమోతి 2:⁠4) బైబిలు సూత్రాలు అన్వయించుకోవడం, మనం ఆ సంకుచితమైన దారి నుండి దూరంగా చీకటి మార్గాలవైపు పోకుండా కాపాడుతుంది. పౌలు ఇలా వ్రాశాడు: “దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.” (2 తిమోతి 3:​16) మనం ఆధ్యాత్మికంగా పెరుగుతుండగా మనకు దేవుని వాక్యం బోధించబడుతుంది. దేవుని వాక్య వెలుగులో మనల్ని మనం ఖండించుకోగలము, అవసరమైతే సంఘంలోని ప్రేమపూర్వక కాపరులచే ఖండించబడతాము. అదేవిధంగా, మనం మన తప్పు దిద్దుకుని, జీవమార్గంలో కొనసాగేందుకుగాను నమ్రతగా నీతియుక్తమైన క్రమశిక్షణను స్వీకరించగలము.

వెలుగులో కృతజ్ఞతాభావంతో నడవండి

16. వెలుగు అనే అద్భుతమైన ఏర్పాటును చేసినందుకు మనం యెహోవాపట్ల కృతజ్ఞతను ఎలా వ్యక్తపరచగలము?

16 వెలుగు అనే అద్భుతమైన ఏర్పాటును చేసినందుకు యెహోవా ఎడల మనకున్న కృతజ్ఞతను ఎలా వ్యక్తపరచగలము? యేసు ఒక పుట్టుగ్రుడ్డివాడిని బాగుచేసినప్పుడు ఆ వ్యక్తి తన కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసేందుకు కదిలించబడ్డాడని యోహాను 9వ అధ్యాయం చెబుతోంది. అతను దాన్ని ఎలా వ్యక్తంచేశాడు? యేసు, దేవుని కుమారుడని ఆయన విశ్వసించి, “ప్రవక్త” అని బహిరంగంగా ఒప్పుకున్నాడు. అంతేగాక యేసు చేసిన అద్భుతాన్ని చులకన చేయడానికి ప్రయత్నించిన వారికి విరుద్ధంగా ఆయన ధైర్యంగా మాట్లాడాడు. (యోహాను 9:​17, 30-34) అపొస్తలుడైన పేతురు క్రైస్తవ సంఘంలోని అభిషిక్త సభ్యులను “దేవుని సొత్తయిన ప్రజలు” అని పిలుస్తున్నాడు. ఎందుకని? ఎందుకంటే పుట్టుగ్రుడ్డి అయిన వ్యక్తి తాను స్వస్థపరచబడినప్పుడు కనపర్చినటువంటి కృతజ్ఞతా భావాన్నే వారూ కలిగివున్నారు. “చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి . . . పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము” చేయడం ద్వారా వారు తమ ఉపకారియైన యెహోవాకు కృతజ్ఞతను తెలియజేస్తారు. (1 పేతురు 2:⁠9; కొలొస్సయులు 1:​13) భూనిరీక్షణ ఉన్నవారు కూడా అలాంటి కృతజ్ఞతాపూర్వక స్వభావాన్నే కలిగివున్నారు, వారు యెహోవా “గుణాతిశయములను” ప్రచురము చేయడంలో తమ అభిషిక్త సహోదరులకు మద్దతునిస్తారు. అపరిపూర్ణ మానవులకు దేవుడు ఎంతటి అమూల్యమైన ఆధిక్యతను అందజేస్తున్నాడో కదా!

17, 18. (ఎ) ప్రతి వ్యక్తి బాధ్యత ఏమిటి? (బి) ప్రతి క్రైస్తవుడు తిమోతిని అనుకరిస్తూ ఎలాంటి పని చేయకుండా ఉండాలని ప్రోత్సహించబడుతున్నాడు?

17 సత్య వెలుగు పట్ల హృదయపూర్వకమైన కృతజ్ఞతాభావం కలిగివుండడం అత్యావశ్యకం. గుర్తుంచుకోండి, మనలో ఎవరమూ సత్యం తెలుసుకునే పుట్టలేదు. కొందరు సత్యాన్ని పెద్దయిన తర్వాత తెలుసుకుంటారు, చీకటి కన్నా వెలుగు ఎంత ఉత్తమమైనదో వారు వెంటనే గ్రహిస్తారు. కొందరికి దైవభయంగల తల్లిదండ్రుల కాపుదలలో పెరిగే అత్యద్భుతమైన అవకాశం ఉంటుంది. అలాంటి వారు వెలుగును చులకనగా తీసుకోవచ్చు. యెహోవాను సేవిస్తున్న తల్లిదండ్రులకు పుట్టిన ఒక సాక్షి, తనకు బాల్యం నుండే నేర్పించబడిన సత్యాల పూర్తి ప్రాధాన్యతను ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఎంతో సమయమూ కృషీ అవసరమయ్యాయని ఒప్పుకుంటోంది. (2 తిమోతి 3:​14, 15) పిల్లలమైనా, పెద్దలమైనా మనమందరమూ యెహోవా వెల్లడిచేసిన సత్యం పట్ల ప్రగాఢమైన కృతజ్ఞతాభావాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఉంది.

18 యౌవనస్థుడైన తిమోతికి ‘పరిశుద్ధలేఖనములు’ బాల్యం నుండి నేర్పించబడ్డాయి, కానీ ఆయన తన పరిచర్యలో గట్టిగా కృషి చేయడం ద్వారానే పరిణతిగల క్రైస్తవుడిగా తయారయ్యాడు. (2 తిమోతి 3:​14, 15) అప్పుడాయన అపొస్తలుడైన పౌలుకు సహాయం చేయగల స్థాయికి చేరుకున్నాడు. పౌలు ఆయన్నిలా ఉద్బోధించాడు: “దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము.” తిమోతివలే మనమందరం, మనమంటే మనమే సిగ్గుపడేలా, యెహోవా కూడా సిగ్గుపడేలా చేసే ఎలాంటి పనీ చేయకుందాము!​—⁠2 తిమోతి 2:⁠15.

19. (ఎ) దావీదులా మనందరం ఏమి అనడానికి తగినన్ని కారణాలున్నాయి? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి చర్చించబడుతుంది?

19 తన సత్య వెలుగును మనకిచ్చిన యెహోవాను స్తుతించేందుకు మనకు ఎన్నెన్నో కారణాలున్నాయి. దావీదు రాజులా మనమిలా చెబుతాము: “యెహోవా, నీవు నాకు దీపమై యున్నావు యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును.” (2 సమూయేలు 22:​29) అయినా మనం సంపూర్ణ సంతృప్తితో ఉండడం మంచిదికాదు, ఎందుకంటే అది మనం ఏ చీకటిలోంచైతే కాపాడబడ్డామో మళ్ళీ అదే చీకట్లోకి జారిపోయేలా చేయగలదు. కాబట్టి, తర్వాతి ఆర్టికల్‌ మన జీవితాల్లో దైవిక సత్యానికి మనమిచ్చే ప్రాముఖ్యతను విశ్లేషించుకునేందుకు సహాయం చేస్తుంది.

మీరు ఏమి నేర్చుకున్నారు?

• యెహోవా ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని ఎలా అందజేస్తాడు?

• మన చుట్టూ ఆవరించివున్న ఆధ్యాత్మిక చీకటి ఎలాంటి సవాలును మనముందుంచుతుంది?

• మనం ఎలాంటి ప్రమాదాలను నివారించాలి?

• సత్య వెలుగుపట్ల మనకున్న కృతజ్ఞతాభావాన్ని మనమెలా ప్రదర్శించగలము?

[అధ్యయన ప్రశ్నలు]

[8వ పేజీలోని చిత్రం]

యెహోవా భౌతిక, ఆధ్యాత్మిక వెలుగుకు మూలము

[10వ పేజీలోని చిత్రం]

యేసు ఒక గ్రుడ్డివాడిని క్రమేణా స్వస్థపరిచినట్లే, మనం ఆధ్యాత్మిక చీకటిలో నుండి బయటికి రావడానికి ఆయన సహాయం చేస్తాడు

[11వ పేజీలోని చిత్రం]

సాతాను యొక్క మోసపూరిత వెలుగు ఆధ్యాత్మిక భావంలో ఓడ బ్రద్దలయ్యేందుకు నడిపిస్తుంది