కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒంటరితనాన్ని మీరు జయించగలరు

ఒంటరితనాన్ని మీరు జయించగలరు

ఒంటరితనాన్ని మీరు జయించగలరు

“ఒంటరి హృదయంపై గాలి వీస్తుంది, ఆ గాలికి ఆ ఒంటరి హృదయం వాడిపోతుంది.” ఐర్లాండ్‌కు చెందిన విలియమ్‌ బట్లర్‌ యీట్స్‌ అనే కవి వ్రాసిన ఈ మాటలు చూపిస్తున్నట్లుగా, ఒంటరితనం హృదయాన్ని బ్రద్దలుచేసేంత దారుణమైన దుఃఖాన్ని కలిగించగలదు.

ఒంటరితనం వల్ల కలిగే వేదనను తానెన్నడూ అనుభవించలేదని ఎవరు చెప్పుకోగలరు? ఎన్నో విషయాలు మనం ఒంటరితనంతో బాధపడేలా చేయగలవు. అయితే, అవివాహితులుగా ఉండిపోయిన లేదా విధవరాండ్రైన లేదా విడాకులు తీసుకున్న స్త్రీల ఒంటరితనం ప్రాముఖ్యంగా బహు తీవ్రమైనదిగా ఉండగలదు.

ఉదాహరణకు, ఫ్రాన్సెస్‌ అనే క్రైస్తవ యౌవనస్థురాలు ఇలా చెబుతోంది: “నాకు 23 ఏళ్ళు వచ్చేసరికి, నా స్నేహితులందరికీ పెళ్ళిళ్ళయిపోయి నేనే ఒంటరిగా మిగిలిపోయినట్లు అనిపించింది.” * సంవత్సరాలు గడుస్తూ, పెళ్ళిచేసుకోగల అవకాశాలు తగ్గిపోతుండగా ఒంటరితనపు భావన ఇంకా అధికం కావచ్చు. “నేనసలెప్పుడూ అవివాహితగా ఉండిపోవాలని కోరుకోలేదు, ఇప్పటికీ అవకాశం లభిస్తే పెళ్ళి చేసుకోవడం నాకిష్టమే,” అని 40వ పడి చివరి భాగంలో ఉన్న సాండ్రా ఒప్పుకుంటోంది. 50వ పడిలో ఉన్న ఏంజెలా ఇలా పేర్కొంటోంది: “నేను అవివాహితగా ఉండిపోవాలని ఉద్దేశపూర్వకంగా నిర్ణయించుకోలేదు, కానీ అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయంతే. నేను ప్రత్యేక పయినీరుగా నియమింపబడిన ప్రాంతంలో చాలా తక్కువమంది అవివాహిత సహోదరులు ఉండేవారు.”

చాలామంది క్రైస్తవ స్త్రీలు, “ప్రభువునందు మాత్రమే” పెళ్ళి చేసుకోవాలన్న యెహోవా ఉపదేశాన్ని యథార్థతతో లక్ష్యపెడతారు గనుక వాళ్ళు వివాహం చేసుకోకుండా ఉండిపోవడానికి ఎంపిక చేసుకుంటారు, ఇదెంతో ప్రశంసనీయమైన విషయం. (1 కొరింథీయులు 7:​39) కొందరు అవివాహిత స్థితికి చక్కగా అలవాటుపడిపోతారు, కానీ మరికొందరు పెళ్ళి చేసుకొని పిల్లలను కనాలనే కోరిక సంవత్సరాలు గడుస్తుండగా అంతకంతకూ అధికమవుతున్నట్లు కనుగొంటారు. “వివాహ భాగస్వామి లేకపోవడం వల్ల ఏర్పడిన భావోద్వేగపరమైన శూన్యమే నాకు విడువని సహచరి అయిపోయింది” అని సాండ్రా ఒప్పుకుంటోంది.

వృద్ధ తల్లిదండ్రుల గురించి శ్రద్ధ తీసుకోవడం వంటి ఇతర కారకాలు ఒంటరితనపు భావాలను అధికం చేయవచ్చు. సాండ్రా ఇలా చెబుతోంది: “నాకు పెళ్ళి కాలేదు గనుక నేను మా వృద్ధ తల్లిదండ్రుల గురించి శ్రద్ధ తీసుకోవాలని నా కుటుంబం ఆశించింది. నేను ఆరుగురు పిల్లల్లో ఒకదాన్నైనా, 20 ఏళ్ళపాటు నేనే ఆ బాధ్యతను ఎక్కువగా మోశాను. నాకు మద్దతునిచ్చే భర్త ఉండుంటే జీవితం ఎంతో సాఫీగా సాగిపోయేది.”

తన ఒంటరితనాన్ని అధికం చేసే మరో అంశం గురించి ఫ్రాన్సెస్‌ ప్రస్తావిస్తోంది. ఆమె ఇలా చెబుతోంది: “కొన్నిసార్లు, ‘నీవెందుకు పెళ్ళి చేసుకోలేదు?’ అని ప్రజలు ముఖం మీదే అడిగేస్తారు. అలాంటి మాటలు, నేను అవివాహితగా ఉండడం ఏదోవిధంగా నా లోపమేనని నేను భావించేలా చేస్తాయి. దాదాపు నేను వెళ్ళిన ప్రతి పెళ్ళిలోనూ, ‘మీ పెళ్ళెప్పుడు?’ అంటూ ఎవరో ఒకరు నేనెంతో భయపడుతున్న ప్రశ్న వేయనేవేస్తారు. ఇక దానితో నేను, ‘ఆధ్యాత్మిక దృక్పథం గల సహోదరులు నా పట్ల ఆసక్తి కలిగిలేరంటే బహుశా అవసరమైన క్రైస్తవ లక్షణాలు నాలో లేవేమో లేదా నేను ఆకర్షణీయంగా ఉండనేమో’ అని ఆలోచించడం మొదలుపెడతాను.”

ఒంటరితనపు భావాలను ఎలా అధిగమించవచ్చు? ఏదైనా చేయగలిగేదంటూ ఉంటే, సహాయం చేయడానికి ఇతరులు ఏమి చేయవచ్చు?

యెహోవాపై ఆధారపడండి

కీర్తనకర్త ఇలా పాడాడు: “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.” (కీర్తన 55:​22) “భారము” అని అనువదించబడిన హీబ్రూ పదం యొక్క అక్షరార్థ భావం “వాటా,” అది, జీవితంలో మనకున్నదాన్ని బట్టి మనం అనుభవించే చింతలు, వ్యాకులతలను సూచిస్తుంది. ఈ భారముల గురించి మరెవరికన్నా ఎక్కువగా యెహోవాకు బాగా తెలుసు, వాటితో వ్యవహరించడానికి కావలసిన శక్తిని ఆయన ఇవ్వగలడు. యెహోవా దేవునిపై ఆధారపడడం, ఒంటరితనపు భావాలతో పోరాడడానికి ఏంజెలాకు సహాయం చేసింది. తన పూర్తికాల పరిచర్య గురించి పేర్కొంటూ, ఆమె ఇలా గుర్తుచేసుకుంటోంది: “నేను పయినీరు సేవ ప్రారంభించినప్పుడు, నేనూ నా తోటి పయినీరూ సంఘానికి ఎంతో దూరంలో నివసించేవాళ్ళం, అయితే మాకు సమీపంలో ఉన్న సంఘం అదే. మేము యెహోవాపై సంపూర్ణంగా ఆధారపడడాన్ని నేర్చుకున్నాము, ఇలా ఆధారపడడం నాకు నా జీవితమంతటిలోనూ సహాయం చేసింది. నాకు ప్రతికూల తలంపులు కలిగినప్పుడు, నేను యెహోవాతో మాట్లాడతాను, ఆయన నాకు సహాయం చేస్తాడు. నాకు 23వ కీర్తన ఎప్పుడూ గొప్ప ఓదార్పునిచ్చేది, నేను దాన్ని తరచూ చదువుతాను.”

అపొస్తలుడైన పౌలు ఒక విశేషమైన భారమును భరించవలసి ఉండింది. ఆయన ‘తన శరీరములో ఉన్న ముల్లు తొలగిపోవాలని’ కనీసం మూడు సందర్భాల్లో ‘ప్రభువును వేడుకున్నాడు.’ పౌలుకు అద్భుతరీతిగా సహాయం అందజేయబడలేదు, కానీ దేవుని కృప ఆయనను బలపరుస్తుందనే ఒక వాగ్దానాన్ని ఆయన పొందాడు. (2 కొరింథీయులు 12:​7-9) పౌలు సంతృప్తితో ఉండగల రహస్యాన్ని కూడా తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆయనిలా వ్రాశాడు: “దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును; ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును, సమృద్ధి కలిగియుండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొనియున్నాను. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.”​—⁠ఫిలిప్పీయులు 4:​12, 13.

నిరుత్సాహంగా ఉన్నప్పుడు లేదా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు ఎవరైనా దేవుని శక్తిని ఎలా పొందగలరు? పౌలు ఇలా వ్రాశాడు: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి; అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.” (ఫిలిప్పీయులు 4:​6, 7) సాండ్రా ఈ సలహాను ఆచరణలో పెడుతుంది. ఆమె ఇలా వివరిస్తోంది: “అవివాహితనైనందున నేను చాలా సమయం ఒంటరిగా గడుపుతాను. యెహోవాకు ప్రార్థించడానికి ఇది నాకు తగినంత అవకాశాన్ని ఇస్తుంది. నేను ఆయనకు ఎంతో సన్నిహితమైనట్లు భావిస్తాను, నా సమస్యల గురించి ఆనందాల గురించి నేను ఆయనతో స్వేచ్ఛగా మాట్లాడగలను.” ఫ్రాన్సెస్‌ ఇలా చెబుతోంది: “ప్రతికూల తలంపులతో నేను ఒంటరిగా పోరాడడమన్నది అంతులేని పోరాటమే. కానీ నా భావాలను నిర్మొహమాటంగా యెహోవా యెదుట ఉంచడం ఎంతగానో సహాయపడుతుంది. నా ఆధ్యాత్మిక, భావోద్వేగ సంక్షేమంపై ప్రభావం చూపగల దేని గురించైనా యెహోవా ఆసక్తి కలిగివున్నాడని నేను ఒప్పించబడ్డాను.”​—⁠1 తిమోతి 5:⁠5.

‘ఒకరి భారముల నొకరు భరించండి’

క్రైస్తవ సహోదరత్వంలో, భారములను ఒంటరిగా భరించవలసిన అవసరం లేదు. “ఒకని భారముల నొకడు భరించి, యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి” అని అపొస్తలుడైన పౌలు ఉద్బోధించాడు. (గలతీయులు 6:⁠2) తోటి క్రైస్తవులతో మన సహవాసం ద్వారా, మన ఒంటరితనపు భారమును తగ్గించగల ప్రోత్సాహకరమైన “దయగల మాట”ను పొందగలుగుతాము.​—⁠సామెతలు 12:​25.

ఇశ్రాయేలీయుల న్యాయాధిపతి అయిన యెఫ్తా కుమార్తె గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయో కూడా పరిశీలించండి. శత్రు సైన్యాలైన అమ్మోనీయులపై విజయం సాధించడానికి ముందు యెఫ్తా, తనకు అభినందనలు తెలుపడానికి తన ఇంటివారిలో ఎవరు మొదట వస్తే వారిని యెహోవాకు ప్రతిష్ఠిస్తానని ప్రమాణం చేశాడు. ఆయన కుమార్తెనే మొదట వచ్చింది. (న్యాయాధిపతులు 11:​30, 31, 34-36) తాను అవివాహితగానే ఉండిపోయి, గృహిణి కావాలనే తన సహజ కోరికను వదులుకోవలసి వచ్చినప్పటికీ, యెఫ్తా కుమార్తె ఇష్టపూర్వకంగా ఈ ప్రమాణానికి కట్టుబడి, తన శేషజీవితమంతా షిలోహులోని ఆలయంలో సేవ చేసింది. ఆమె చేసిన త్యాగం ఎవరి దృష్టికి రాకుండా పోయిందా? లేదు, అందుకు భిన్నంగా: “ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు నాలుగు దినములు గిలాదుదేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధిచేయుటకద్దు.” (న్యాయాధిపతులు 11:​40) అవును, ప్రశంసించడం, దాన్ని పొందేవారిని ప్రోత్సహించగలదు. కాబట్టి, అర్హులైన వారిని తప్పక ప్రశంసిద్దాము.

యేసు మాదిరిని పరిశీలించడం కూడా మంచిది. పురుషులు స్త్రీలతో మాట్లాడడం యూదుల వాడుక కాకపోయినప్పటికీ, యేసు మరియతోనూ, మార్తతోనూ సమయం గడిపాడు. బహుశా, వారు విధవరాండ్రై ఉండవచ్చు లేదా అవివాహితులై ఉండవచ్చు. తనతో స్నేహం చేయడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలను వారిద్దరూ పొందాలని ఆయన కోరుకున్నాడు. (లూకా 10:​38-42) మనం విందులు వినోదాలు జరుపుకునేటప్పుడు, అవివాహితులైన మన ఆధ్యాత్మిక సహోదరీలను కూడా ఆహ్వానించడం ద్వారా, వారితోపాటు ప్రకటనాపనిలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా మనం యేసు మాదిరిని అనుకరించవచ్చు. (రోమీయులు 12:​13) తమపట్ల అలా శ్రద్ధ చూపించినందుకు వారు కృతజ్ఞత కలిగివుంటారా? ఒక సహోదరి ఇలా చెప్పింది: “సహోదరులు నన్ను ప్రేమిస్తారనీ, నన్ను విలువైనదానిగా పరిగణిస్తారనీ నాకు తెలుసు, కానీ వారు వ్యక్తిగతంగా నాపట్ల శ్రద్ధ చూపించినప్పుడు నేను కృతజ్ఞత కలిగివుంటాను.”

“మాకు చెందిన వారంటూ మాకెవరూ లేరు గనుక, ప్రేమించబడవలసిన, ఆధ్యాత్మిక సహోదర సహోదరీల కుటుంబంలో మేమూ భాగమన్నట్లు భావించవలసిన అవసరత మాకు ఎక్కువగా ఉంటుంది” అని సాండ్రా వివరిస్తోంది. యెహోవా అలాంటి వారి గురించి శ్రద్ధ తీసుకుంటాడన్నది స్పష్టం, కాబట్టి వారు తాము అవసరమైనవారమన్నట్లు, ప్రేమింపబడుతున్నట్లు భావించేలా చేసినప్పుడు మనం ఆయనతో సహకరిస్తాము. (1 పేతురు 5:​6, 7) అలాంటి శ్రద్ధ ఎవరి దృష్టికీ రాకుండా పోదు, ఎందుకంటే, ‘బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన [యెహోవా దేవుడు] ప్రత్యుపకారము చేయును.’​—⁠సామెతలు 19:⁠17.

“ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను”

ఇతరులు సహాయం చేయగలిగినప్పటికీ, వారి మద్దతు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ, “ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను.” (గలతీయులు 6:⁠5) అయితే, ఒంటరితనపు బరువును భరిస్తున్నప్పుడు, మనం కొన్ని ప్రమాదాల గురించి అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు, భావోద్వేగపరంగా మన చుట్టూ మనం గిరి గీసుకుంటే, ఒంటరితనం మనపై విజయం సాధిస్తుంది. మరో వైపున, ప్రేమతో మనం ఒంటరితనాన్ని జయించవచ్చు. (1 కొరింథీయులు 13:​7, 8) పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఇవ్వడం, పంచుకోవడం సంతోషాన్ని కనుగొనడానికి చక్కని మార్గాలు. (అపొస్తలుల కార్యములు 20:​35) కష్టపడి పనిచేసే ఒక పయినీరు సహోదరి ఇలా చెబుతోంది: “ఒంటరితనం గురించి ఆలోచించడానికి నాకు అంత సమయం లేదు. నేను ఏదైనా ఉపయోగకరమైన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు, నాకు ఒంటరితనం అనిపించదు.”

ఒంటరితనం, మనల్ని జ్ఞానయుక్తం కాని సంబంధాలు పెట్టుకునేలా చేయకుండా కూడా మనం జాగ్రత్త వహించాలి. ఉదాహరణకు, పెళ్ళి చేసుకోవాలనే కోరిక, అవిశ్వాసిని పెళ్ళి చేసుకోవడం మూలంగానూ ప్రాముఖ్యంగా అలాంటి దాన్ని నివారించమని ఇవ్వబడిన లేఖనాధారిత ఉపదేశాన్ని పెడచెవిన పెట్టడం మూలంగానూ తలెత్తే అనేక సమస్యలను చూడలేనంతగా మనల్ని అంధుల్ని చేయనివ్వడం ఎంత విచారకరం! (2 కొరింథీయులు 6:​14) విడాకులు తీసుకున్న ఒక క్రైస్తవ స్త్రీ ఇలా అన్నది: “అవివాహితగా ఉండడం కన్నా ఘోరమైన విషయం మరొకటుంది. అది పొసగని వ్యక్తిని పెళ్ళి చేసుకోవడం.”

పరిష్కరించబడలేని సమస్యను సహించవలసిందే, కనీసం తాత్కాలికంగా. దేవుని సహాయంతో, ఒంటరితనపు భావాలను సహించవచ్చు. మనం యెహోవా సేవ చేయడంలో కొనసాగుతుండగా, ఒకరోజున మన అవసరాలన్నీ సాధ్యమైనంత శ్రేష్ఠమైన విధంగా తీర్చబడతాయని మనం నిశ్చయత కలిగి ఉండవచ్చు.​—⁠కీర్తన 145:⁠16.

[అధస్సూచి]

^ పేరా 4 ఇక్కడ పేర్కొనబడిన స్త్రీల పేర్లు మార్చబడ్డాయి.

[28వ పేజీలోని చిత్రాలు]

ఇవ్వడం ద్వారా, పంచుకోవడం ద్వారా ఒంటరితనాన్ని జయించవచ్చు