కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రీస్తు తన సంఘాన్ని నడిపిస్తున్నాడు

క్రీస్తు తన సంఘాన్ని నడిపిస్తున్నాడు

క్రీస్తు తన సంఘాన్ని నడిపిస్తున్నాడు

‘ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.’​—⁠మత్తయి 28:⁠20.

1, 2. (ఎ) శిష్యులను చేయాలనే ఆజ్ఞ ఇస్తున్నప్పుడు, పునరుత్థానం చేయబడిన యేసు తన అనుచరులకు ఏమని వాగ్దానం చేశాడు? (బి) యేసు తొలి క్రైస్తవ సంఘాన్ని ఎలా క్రియాశీలంగా నడిపించాడు?

పునరుత్థానం చేయబడిన, మన నాయకుడైన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణం కాకముందు తన శిష్యులకు ప్రత్యక్షమై, “పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని” చెప్పాడు.​—⁠మత్తయి 23:​10; 28:​18-20.

2 యేసు తన శిష్యులకు, మరింతమంది శిష్యులను చేయాలనే జీవరక్షక పనిని అప్పగించేసి ఊరుకోలేదు, తాను వారితో ఉంటానని కూడా వాగ్దానం చేశాడు. బైబిలు పుస్తకమైన అపొస్తలుల కార్యములులో నమోదు చేయబడిన తొలి క్రైస్తవత్వపు చరిత్ర, క్రొత్తగా ఏర్పడిన సంఘాన్ని నడిపించడానికి తనకివ్వబడిన అధికారాన్ని క్రీస్తు ఉపయోగించాడని నిర్ద్వందంగా నిరూపిస్తోంది. ఆయన తన అనుచరులను బలపర్చడానికి వారి ప్రయత్నాలను సరైన దిశలో నిర్దేశించడానికి వాగ్దత్త “ఆదరణకర్త”ను, అంటే పరిశుద్ధాత్మను పంపించాడు. (యోహాను 16:⁠7; అపొస్తలుల కార్యములు 2:​4, 33; 13:​2-4; 16:​6-10) పునరుత్థానం చేయబడిన యేసు తన శిష్యులకు మద్దతునివ్వడానికి తన ఆధీనంలో ఉన్న దేవదూతలను ఉపయోగించాడు. (అపొస్తలుల కార్యములు 5:​19; 8:​26; 10:​3-8, 22; 12:​7-11; 27:​23, 24; 1 పేతురు 3:​22) అంతేగాక, పరిపాలక సభగా పనిచేసేందుకు అర్హులైన పురుషులను నియమించడం ద్వారా మన నాయకుడు సంఘానికి నడిపింపును ఇచ్చాడు.​—⁠అపొస్తలుల కార్యములు 1:​20, 24-26; 6:1-6; 8:​5, 14-17.

3. ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలు చర్చించబడతాయి?

3 అయితే “యుగసమాప్తి” అనే మన కాలం సంగతేమిటి? నేడు యేసుక్రీస్తు క్రైస్తవ సంఘాన్ని ఎలా నడిపిస్తున్నాడు? ఈ నాయకత్వాన్ని మనం అంగీకరిస్తున్నామని మనం ఎలా చూపించవచ్చు?

యజమానికి ఒక నమ్మకమైన దాసుడు ఉన్నాడు

4. (ఎ) ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడిలో’ ఎవరు భాగమైవున్నారు? (బి) యజమాని తన దాసుడికి ఏమి అప్పగించాడు?

4 తన ప్రత్యక్షతను గురించి ప్రవచిస్తున్నప్పుడు యేసు ఇలా అన్నాడు: “యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తిమీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” (మత్తయి 24:​45-47) ఈ “యజమానుడు” మన నాయకుడైన యేసుక్రీస్తే, ఆయన భూమ్మీద తనకు సంబంధించిన విషయాలన్నింటిపైనా ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడ్ని,’ అంటే భూమ్మీదవున్న అభిషిక్త క్రైస్తవుల సమూహాన్ని నియమించాడు.

5, 6. (ఎ) అపొస్తలుడైన యోహానుకు లభించిన దర్శనంలో “యేడు నక్షత్రములు,” ‘యేడు సువర్ణ దీపస్తంభములు’ వేటిని సూచిస్తున్నాయి? (బి) “యేడు నక్షత్రములు” యేసు కుడిచేతిలో ఉండడం దేన్ని సూచిస్తుంది?

5 నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు సూటిగా యేసుక్రీస్తు ఆధీనంలో ఉన్నాడని బైబిలు పుస్తకమైన ప్రకటన చూపిస్తోంది. ‘ప్రభువు దినముకు’ సంబంధించిన ఒక దర్శనంలో అపొస్తలుడైన యోహాను, ‘ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములమధ్యను మనుష్యకుమారునిపోలిన యొకనిని” చూశాడు, “ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొనియుండెను.” యోహానుకు ఈ దర్శనాన్ని వివరిస్తూ యేసు, “నా కుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ యేడు సువర్ణ దీప స్తంభముల సంగతియు” ఏమిటంటే, “ఆ యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు. ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములు” అని చెప్పాడు.​—⁠ప్రకటన 1:⁠1, 10-20.

6 ‘యేడు సువర్ణ దీపస్తంభములు,’ 1914 లో ప్రారంభమైన ‘ప్రభువు దినము’లోని నిజ క్రైస్తవ సంఘాలన్నిటినీ సూచిస్తున్నాయి. కానీ “యేడు నక్షత్రముల” సంగతేమిటి? తొలుత అవి, మొదటి శతాబ్దంలోని సంఘాల గురించి శ్రద్ధ వహిస్తున్న ఆత్మజనిత, అభిషిక్త పైవిచారణకర్తలను సూచించాయి. * పైవిచారణకర్తలు యేసు కుడిచేతిలో​—⁠ఆయన ఆధీనంలోను నిర్దేశం క్రిందను ఉన్నారు. అవును, యేసు ఆ సామూహిక దాసుడి తరగతిని నడిపించాడు. అయితే, నేడు అభిషిక్త పైవిచారణకర్తలు సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నారు. భూవ్యాప్తంగా 93,000కు పైగా ఉన్న యెహోవాసాక్షుల సంఘాలకు క్రీస్తు నాయకత్వం ఎలా వ్యాపిస్తుంది?

7. (ఎ) భూమియందంతటా ఉన్న సంఘాల్లో నాయకత్వాన్ని అందించడానికి పరిపాలక సభను యేసు ఎలా ఉపయోగించుకుంటున్నాడు? (బి) క్రైస్తవ పైవిచారణకర్తలు పరిశుద్ధాత్మచే నియమించబడుతున్నారని ఎందుకు చెప్పవచ్చు?

7 మొదటి శతాబ్దంలోలాగే నేడు కూడా, అభిషిక్త పైవిచారణకర్తల్లో అర్హులైన పురుషుల చిన్న గుంపు పరిపాలక సభగా సేవచేస్తూ, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన సామూహిక దాసుడికి ప్రాతినిధ్యం వహిస్తోంది. మన నాయకుడు, అర్హులైన పురుషులను​—⁠ఆత్మాభిషిక్తులైనా కాకపోయినా​—⁠స్థానిక సంఘాల్లో పెద్దలుగా నియమించడానికి ఈ పరిపాలక సభను ఉపయోగించుకుంటాడు. ఈ విషయంలో, పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది, దాన్ని ఉపయోగించుకోవడానికి యెహోవా యేసుకు అధికారం ఇచ్చాడు. (అపొస్తలుల కార్యములు 2:​32, 33) మొదటిగా, ఈ పైవిచారణకర్తలు పరిశుద్ధాత్మచే ప్రేరేపితమైన దేవుని వాక్యంలోని ఆవశ్యకతలను చేరుకోవాలి. (1 తిమోతి 3:​1-7; తీతు 1:​5-9; 2 పేతురు 1:​20, 21) ప్రార్థన చేసిన తర్వాత, పరిశుద్ధాత్మ నడిపింపు క్రింద సిఫార్సులు నియామకాలు జరుగుతాయి. దానికి తోడు, నియమించబడిన వ్యక్తులు ఆ ఆత్మ ఫలాన్ని ఫలిస్తున్నట్లు సాక్ష్యాధారాన్ని చూపిస్తారు. (గలతీయులు 5:​22, 23) కాబట్టి పౌలు ఇచ్చిన సలహా, అభిషిక్తులైనా కాకపోయినా, పెద్దలందరికీ ఒకే విధంగా వర్తిస్తుంది: “పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.” (అపొస్తలుల కార్యములు 20:​28) ఈ నియుక్త పురుషులు పరిపాలక సభ నుండి నిర్దేశాలను పొందుతారు, సంఘాన్ని ఇష్టపూర్వకంగా కాస్తారు. ఈ విధంగా నేడు క్రీస్తు మనతో కూడ ఉన్నాడు, అలాగే సంఘాన్ని క్రియాశీలంగా నడిపిస్తున్నాడు.

8. తన అనుచరులను నడిపించడానికి క్రీస్తు దేవదూతలను ఎలా ఉపయోగిస్తాడు?

8 నేడు తన అనుచరులను నడిపించడానికి యేసు నిజమైన దేవదూతలను కూడా ఉపయోగిస్తాడు. గోధుమలు గురుగులను గురించిన దృష్టాంతము ప్రకారము, కోతకాలము “యుగసమాప్తి”యందు వస్తుంది. అయితే కోతకోసేందుకు యజమాని ఎవరిని ఉపయోగించుకుంటాడు? “కోతకోయువారు దేవదూతలు” అని యేసు అన్నాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు: ‘మనుష్యకుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చును.’ (మత్తయి 13:​37-41) అంతేగాక, ఐతియొపీయుడైన నపుంసకుడ్ని కనుగొనేందుకు ఒక దేవదూత ఫిలిప్పును ఎలాగైతే నడిపించాడో, అలాగే నేడు యథార్థహృదయులను కనుగొనే పనిలో నిజక్రైస్తవులను నడిపించడానికి క్రీస్తు తన దేవదూతలను ఉపయోగిస్తాడనడానికి సాక్ష్యాధారాలు సమృద్ధిగా ఉన్నాయి.​—⁠అపొస్తలుల కార్యములు 8:​26, 27; ప్రకటన 14:⁠6.

9. (ఎ) క్రీస్తు నేడు క్రైస్తవ సంఘాన్ని ఏ మాధ్యమం ద్వారా నడిపిస్తున్నాడు? (బి) మనం క్రీస్తు నాయకత్వం నుండి ప్రయోజనం పొందాలంటే ఏ ప్రశ్నలను పరిశీలించాలి?

9 యేసుక్రీస్తు తన శిష్యులకు నేడు పరిపాలక సభ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, దేవదూతల ద్వారా నాయకత్వం వహిస్తాడని తెలుసుకోవడం ఎంత ధైర్యాన్నిస్తుందో కదా! హింసల మూలంగాకాని, అలాంటి మరేవైనా కారణాలచేత కాని యెహోవా ఆరాధకుల్లో కొందరు పరిపాలక సభ నుండి తాత్కాలికంగా దూరమైపోయినప్పటికీ పరిశుద్ధాత్మ ద్వారా, దేవదూతల మద్దతుద్వారా క్రీస్తు నాయకత్వం వహిస్తాడు.అయితే మనం ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తేనే దాన్నుండి ప్రయోజనం పొందుతాము. మనం క్రీస్తు నాయకత్వాన్ని అంగీకరిస్తున్నామని ఎలా చూపించగలము?

“మాట విని, వారికి లోబడియుండుడి”

10. సంఘంలో నియుక్త పెద్దల పట్ల గౌరవాన్ని మనమెలా ప్రదర్శించగలము?

10 మన నాయకుడు సంఘాలకు “మనుష్యులలో ఈవులను” ఇచ్చాడు, “కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను” ఇచ్చాడు. (ఎఫెసీయులు 4:​8, 11-13, NW) వారి పట్ల మన వైఖరి, మన ప్రవర్తన మనం క్రీస్తు నాయకత్వాన్ని అంగీకరిస్తున్నామో లేదో ఎంతో స్పష్టంగా వెల్లడిచేస్తాయి. క్రీస్తు అనుగ్రహించిన ఆధ్యాత్మికంగా అర్హులైన పురుషుల నిమిత్తం మనం “కృతజ్ఞులై” ఉండడం సముచితం. (కొలొస్సయులు 3:​15) వారు మన గౌరవాన్ని పొందడానికి కూడా అర్హులు. “బాగుగా పాలనచేయు పెద్దలను, . . . రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (1 తిమోతి 5:​17) సంఘంలోని పెద్దలు లేక పైవిచారణకర్తల పట్ల మనకున్న కృతజ్ఞతా భావాన్ని, గౌరవాన్ని మనమెలా ప్రదర్శించగలము? “మీపైని నాయకులుగా ఉన్న . . . వారి మాట విని, వారికి లోబడియుండుడి” అని పౌలు జవాబిస్తున్నాడు. (హెబ్రీయులు 13:​17) అవును, మనం వారి మాట విని వారికి లోబడివుండాలి, వారికి విధేయులమై ఉండాలి.

11. సంఘంలో క్రీస్తు చేసిన పెద్దలనే ఏర్పాటుకు గౌరవం చూపించడం, మనం మన బాప్తిస్మానికి తగినట్లు ప్రవర్తించడమేనని ఎందుకు చెప్పగలము?

11 మన నాయకుడు పరిపూర్ణుడు. ఆయన ఈవులుగా ఇచ్చిన పురుషులు పరిపూర్ణులు కారు. కాబట్టి వారు కొన్నిసార్లు పొరబాట్లు చేస్తారు. అయినా మనం క్రీస్తు చేసిన ఏర్పాటుపట్ల యథార్థతతో ఉండడం చాలా ప్రాముఖ్యం. నిజానికి, మన సమర్పణకు బాప్తిస్మానికి తగ్గట్లు జీవించడం అంటే సంఘంలో ఆత్మచే నియమించబడిన అధికారుల న్యాయబద్ధతను గుర్తించడం, వారి అధికారానికి ఇష్టపూర్వకంగా లోబడడం అని అర్థం. మనం ‘పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి’ బాప్తిస్మం తీసుకోవడమంటే, మనం పరిశుద్ధాత్మ అంటే ఏమిటో గుర్తిస్తున్నామనీ, అది యెహోవా సంకల్పాల్లో పోషించే పాత్రను గుర్తిస్తున్నామనీ బహిరంగంగా ఒప్పుకోవడమే. (మత్తయి 28:​19) మనం ఆత్మతో సహకరిస్తామని, క్రీస్తు అనుచరుల్లో అది పనిచేయకుండా ఆపే ఎటువంటి పనీ మనం చేయమని కూడా ఆ బాప్తిస్మం సూచిస్తుంది. పెద్దల సిఫారసు, వారి నియామకాల్లో పరిశుద్ధాత్మ కీలకమైన పాత్రను పోషిస్తున్నందున, సంఘంలో క్రీస్తు చేసిన పెద్దల ఏర్పాటుతో సహకరించడంలో మనం విఫలమైతే మన సమర్పణకు తగినట్లు నమ్మకంగా పనిచేస్తున్నామని అర్థమా?

12. అధికారంపట్ల అగౌరవం విషయంలో యూదా ఏ ఉదాహరణలను ఎత్తిచూపిస్తున్నాడు, అవి మనకు ఏమి బోధిస్తున్నాయి?

12 మాట వినడం, లోబడివుండడంలో ఉన్న విలువను నొక్కిచెబుతున్న ఉదాహరణలు లేఖనాల్లో ఉన్నాయి. సంఘంలో నియుక్తులైన వారి గురించి దూషణకరంగా మాట్లాడిన వారిని సూచిస్తూ, శిష్యుడైన యూదా మూడు హెచ్చరికా ఉదాహరణలను గురించి చెప్పాడు: “అయ్యో వారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి!” (యూదా 11) యెహోవా ప్రేమపూర్వకంగా ఇచ్చిన సలహాను కయీను అలక్ష్యపెట్టి హత్యకు పాల్పడేలా ద్వేషాన్ని చూపించడంలో ఇష్టపూర్వకంగా కొనసాగాడు. (ఆదికాండము 4:​4-8) దైవిక హెచ్చరికలు మళ్ళీ మళ్ళీ ఇవ్వబడినా బిలాము ఆర్థికపరమైన ప్రతిఫలాన్ని ఆశించి దేవుని ప్రజలను శపించడానికి ప్రయత్నించాడు. (సంఖ్యాకాండము 22:​5-28, 32-34; ద్వితీయోపదేశకాండము 23:⁠5) కోరహుకు ఇశ్రాయేలులో చక్కని బాధ్యత ఉంది, కానీ ఆయనకు అది సరిపోలేదు. దేవుని సేవకుడైన, భూమిమీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడైన మోషేకు విరుద్ధంగా ఆయన తిరుగుబాటును లేవదీశాడు. (సంఖ్యాకాండము 12:⁠3; 16:​1-3, 32, 33) కయీను, బిలాము, కోరహులపైకి వినాశనం వచ్చింది. యెహోవా బాధ్యతగల స్థానాల్లో ఉపయోగించుకునేవారి సలహాను వినాలని, వారిని గౌరవించాలని ఈ ఉదాహరణలు ఎంత స్పష్టంగా బోధిస్తున్నాయో కదా!

13. క్రీస్తు చేసిన పెద్దల ఏర్పాటుకు లోబడడం ద్వారా లభించే ఏ ఆశీర్వాదాల గురించి ప్రవక్తయైన యెషయా ప్రవచించాడు?

13 క్రైస్తవ సంఘంలో మన నాయకుడు స్థాపించిన గొప్ప పైవిచారణా ఏర్పాటునుండి ప్రయోజనం పొందకూడదని ఎవరు కోరుకుంటారు? ప్రవక్తయైన యెషయా ఆ ఏర్పాటు నుండి లభించే ఆశీర్వాదాలను గురించి ఇలా ప్రవచించాడు: “ఆలకించుడి, రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును అధికారులు న్యాయమునుబట్టి యేలుదురు. మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.” (యెషయా 32:​1, 2) కాపుదల భద్రత అందించే “చోటువలె” ప్రతి పెద్ద ఉండాలి. అధికారానికి లోబడడం మనకు కష్టంగా ఉన్నప్పటికీ మనం సంఘంలో దైవికంగా స్థాపించబడిన అధికారుల మాట విని, వారికి లోబడడానికి ప్రార్థనాపూర్వకంగా కృషి చేద్దాం.

పెద్దలు క్రీస్తు నాయకత్వానికి ఎలా లోబడతారు?

14, 15. సంఘంలో నాయకత్వం వహిస్తున్నవారు తాము క్రీస్తు నాయకత్వానికి లోబడుతున్నామని ఎలా చూపిస్తారు?

14 క్రీస్తు నాయకత్వాన్ని ప్రతి క్రైస్తవుడు​—⁠ప్రత్యేకించి పెద్దలు అనుసరించాలి. పైవిచారణకర్తలకు, అంటే పెద్దలకు సంఘంలో కొంత అధికారం ఉంటుంది. కానీ వారు తమ ‘సహకారుల’ జీవితాలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తూ, ‘వారి విశ్వాసము మీద ప్రభువులుగా’ ఉండడానికి ప్రయత్నించరు. (2 కొరింథీయులు 1:​24) పెద్దలు యేసు చెప్పిన ఈ మాటలను పాటిస్తారు: “అన్యజనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురనియు మీకు తెలియును. మీలో ఆలాగుండకూడదు.” (మత్తయి 20:​25-27) పెద్దలు తమ బాధ్యతలను నిర్వహిస్తూ, ఇతరులకు సేవ చేయడానికి నిజాయితీగా ప్రయత్నిస్తారు.

15 క్రైస్తవులు ఇలా ఉద్బోధించబడ్డారు: “మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి.” (హెబ్రీయులు 13:⁠7) ఈ ఆవశ్యకత ఉండడానికి కారణం పెద్దలు నాయకులని కాదు. “క్రీస్తు ఒక్కడే మీ నాయకుడు” అని యేసు అన్నాడు. (మత్తయి 23:​10, NW) మనం అనుకరించాల్సినది పెద్దల విశ్వాసాన్నే, ఎందుకంటే వారు మన అసలైన నాయకుడైన క్రీస్తును అనుకరిస్తున్నారు. (1 కొరింథీయులు 11:⁠1) పెద్దలు సంఘంలోని ఇతరులతో తమకుగల సంబంధాల విషయంలో క్రీస్తులా ఉండడానికి కృషిచేసే కొన్ని విధానాలను పరిశీలించండి.

16. తనకు ఎంతో అధికారం ఉన్నా యేసు తన అనుచరుల పట్ల ఎలా ప్రవర్తించాడు?

16 యేసు అపరిపూర్ణ మానవులకు అన్ని విధాలుగానూ ఉన్నతుడైనప్పటికీ, తన తండ్రి నుండి సాటిలేని అధికారాన్ని పొందినప్పటికీ ఆయన తన శిష్యులతో వ్యవహరించేటప్పుడు నమ్రతగా ఉన్నాడు. ఆయన తన పరిజ్ఞానాన్ని తన శ్రోతల ముందు ప్రదర్శించుకుని వారిని వెల్లువలా ముంచెత్తలేదు. యేసు తన అనుచరుల మానవీయ అవసరాలను పరిగణలోకి తీసుకుంటూ, వారిపట్ల సూక్ష్మగ్రాహ్యతను, కరుణను చూపించాడు. (మత్తయి 15:​32; 26:​40, 41; మార్కు 6:​31) తన శిష్యులు ఇవ్వగల దానికంటె ఎక్కువగా ఎన్నడూ కోరలేదు, వారు భరించగల దానికన్నా ఎక్కువ భారాన్ని ఆయన వారిపై ఎన్నడూ పెట్టలేదు. (యోహాను 16:​12) యేసు ‘సాత్వికుడిగా దీనమనస్సు గలవాడిగా’ ఉన్నాడు. కాబట్టే అనేకులు ఆయన దగ్గర విశ్రాంతిని అనుభవించారనడంలో ఆశ్చర్యం లేదు.​—⁠మత్తయి 11:​28-30.

17. సంఘంలోని ఇతరులతో తమ సంబంధం విషయంలో, పెద్దలు క్రీస్తులా నమ్రతను ఎలా కనబర్చాలి?

17 నాయకుడైన క్రీస్తే నమ్రతను ప్రదర్శిస్తే, సంఘంలో నాయకత్వం వహించే వారు ఇంకెంతగా ప్రదర్శించాలి! అవును, వారు తమకు ఇవ్వబడిన ఎలాంటి అధికారాన్నైనా దుర్వినియోగ పరచకుండా జాగ్రత్తగా ఉంటారు. అంతేకాదు, వారు ఇతరులను ఉక్కిరిబిక్కిరి చేయడానికి ప్రయత్నిస్తూ “వాక్చాతుర్యముతో” మాట్లాడరు. (1 కొరింథీయులు 2:​1, 2) బదులుగా, వారు లేఖనాధారిత సత్యాన్ని సరళంగా, నిజాయితీగా చెప్పడానికి కృషిచేస్తారు. అంతేగాక, పెద్దలు ఇతరుల నుండి తాము ఆశించేవాటి విషయంలో సహేతుకంగా ఉండడానికి, వారి అవసరాలపట్ల శ్రద్ధ కలిగివుండడానికి కృషి చేస్తారు. (ఫిలిప్పీయులు 4:⁠5) ప్రతి ఒక్కరికి పరిమితులు ఉంటాయని గుర్తుంచుకొని, తోటి విశ్వాసులతో వ్యవహరించేటప్పుడు ప్రేమపూర్వకంగా వారి పరిమితులను పరిగణలోకి తీసుకుంటారు. (1 పేతురు 4:⁠8) నమ్రతగల, సాత్వికులైన పెద్దలు నిజంగా విశ్రాంతిని అందించేవారిగా ఉండరూ? తప్పకుండా ఉంటారు.

18. యేసు పిల్లలతో వ్యవహరించిన విధానం నుండి పెద్దలు ఏమి నేర్చుకోగలరు?

18 యేసును ఇతరులు, చివరికి తక్కువస్థాయి వారు కూడా స్వేచ్ఛగా సమీపించగలిగేవారు. ఆయన శిష్యులు ‘ఆయన యొద్దకు చిన్న బిడ్డలను తీసికొని’ వచ్చినందుకు ప్రజలను గద్దించినప్పుడు యేసు ప్రతిస్పందనను పరిశీలించండి. “చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు” అన్నాడు. తర్వాత ఆయన “ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను.” (మార్కు 10:​13-16) యేసు వాత్సల్యంగల వ్యక్తిగా దయాపూర్వకమైన వ్యక్తిగా ఉన్నాడు, ఇతరులు ఆయనపట్ల ఆకర్షితులయ్యారు. యేసు అంటే ప్రజలు భయపడలేదు. చివరికి పిల్లలు కూడా ఆయన సమక్షంలో హాయిగా ఉన్నారు. అలాగే పెద్దలు కూడా సమీపించదగ్గవారిగా ఉండాలి, వారు హృదయపూర్వకమైన వాత్సల్యాన్ని దయను చూపిస్తుండగా ఇతరులు​—⁠చిన్నపిల్లలు కూడా​—⁠వారి దగ్గర హాయిని అనుభవించాలి.

19. “క్రీస్తు మనస్సు” కలిగివుండడం అంటే ఏమిటి, అందుకు ఎలాంటి ప్రయత్నం అవసరం అవుతుంది?

19 పెద్దలు క్రీస్తు యేసును ఎంతగా అనుకరించగలరన్నది వారికి ఆయన గురించి ఎంత తెలుసు అన్నదానిపై ఆధారపడివుంటుంది. “ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు?” అని పౌలు అడిగాడు. ఆయనింకా ఇలా అన్నాడు: “మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము.” (1 కొరింథీయులు 2:​16) క్రీస్తు మనస్సు కలిగివుండడం అంటే, ఫలాని పరిస్థితిలో ఆయనేమి చేస్తాడు అన్నది తెలుసుకునేంతగా ఆయన ఆలోచనా విధానాన్నీ, ఆయన వ్యక్తిత్వాన్నీ సంపూర్ణంగా తెలుసుకోవడం. మన నాయకుడ్ని అంతగా తెలుసుకోవడం గురించి ఒక్కసారి ఆలోచించండి! అవును, ఇందుకు సువార్త వృత్తాంతాలను శ్రద్ధగా చదవడం, మన మనస్సులను యేసు జీవితము ఆయన మాదిరులతో క్రమంగా నింపుకోవడం అవసరం. పెద్దలు క్రీస్తు నాయకత్వాన్ని అనుసరించడానికి అంత మేరకు కృషిచేసినప్పుడు సంఘంలోనివారు వారి విశ్వాసాన్ని అనుకరించడానికి మరింత మొగ్గు చూపుతారు. అలా, నాయకుడి అడుగుజాడల్లో ఇతరులు ఆనందంగా నడవడం చూసి పెద్దలు సంతృప్తిని పొందుతారు.

క్రీస్తు నాయకత్వం క్రింద కొనసాగండి

20, 21. వాగ్దానం చేయబడిన నూతనలోకం వైపు మనం చూస్తూ ఉండగా, మన తీర్మానం ఏమైవుండాలి?

20 మనమందరం క్రీస్తు నాయకత్వం క్రింద కొనసాగడం చాలా ప్రాముఖ్యం. ఈ విధానాంతాన్ని మనం సమీపిస్తుండగా మన పరిస్థితి, సా.శ.పూ. 1473 లో మోయాబు మైదానాల్లోని ఇశ్రాయేలీయుల పరిస్థితిలా ఉంది. వారు వాగ్దానం చేయబడిన దేశానికి ముంగిట్లో ఉన్నారు, ప్రవక్తయైన మోషే ద్వారా దేవుడు ఇలా ప్రకటించాడు: ‘యెహోవా ఈ ప్రజల కిచ్చుటకు వారి పితరులతో ప్రమాణముచేసిన దేశమునకు నీవు [యెహోషువ] వీరితోకూడ పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను.’ (ద్వితీయోపదేశకాండము 31:​7, 8) నియమించబడిన నాయకుడు యెహోషువాయే. వాగ్దానం చేయబడిన దేశంలోకి ప్రవేశించడానికి ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వానికి లోబడాల్సివుంది.

21 మనకు బైబిలు ఇలా చెబుతోంది: ‘క్రీస్తు ఒక్కడే మీ గురువు [“నాయకుడు,” NW]’ (మత్తయి 23:​10) కేవలం క్రీస్తు మాత్రమే వాగ్దానం చేయబడిన నూతనలోకంలోనికి మనలను నడిపిస్తాడు, అందులో నీతి నివసిస్తుంది. (2 పేతురు 3:​13) కాబట్టి మనం జీవితంలోని అన్ని రంగాల్లోను ఆయన నాయకత్వానికి లోబడాలని తీర్మానించుకుందాం.

[అధస్సూచి]

^ పేరా 6 ఇక్కడ “నక్షత్రములు” అక్షరార్థ దేవదూతలను సూచించడం లేదు. అదృశ్య ఆత్మ ప్రాణుల కోసమైన సమాచారాన్ని నమోదు చేయడానికి యేసు ఒక మానవుణ్ణి ఎంతమాత్రము ఉపయోగించడు. కాబట్టి, “నక్షత్రములు” సంఘాల్లోని మానవ పైవిచారణకర్తలను, అంటే పెద్దలను సూచించాలి; వారు యేసు సందేశకులుగా దృష్టించబడుతున్నారు. వారి సంఖ్య ఏడు అన్నది దైవికంగా నిర్ధారించబడిన సంపూర్ణత్వాన్ని సూచిస్తుంది.

మీకు జ్ఞాపకం ఉన్నాయా?

• క్రీస్తు తొలి సంఘాన్ని ఎలా నడిపించాడు?

• క్రీస్తు నేడు తన సంఘాన్ని ఎలా నడిపిస్తున్నాడు?

• సంఘంలో నాయకత్వం వహిస్తున్న వారికి మనం ఎందుకు లోబడాలి?

• తమ నాయకుడు క్రీస్తే అని పెద్దలు ఏయే విధాలుగా చూపించగలరు?

[అధ్యయన ప్రశ్నలు]

[15వ పేజీలోని చిత్రం]

క్రీస్తు తన సంఘాన్ని నడిపిస్తున్నాడు, పైవిచారణకర్తలను తన కుడి చేతిలో ఉంచుకున్నాడు

[16వ పేజీలోని చిత్రాలు]

“మీపైని నాయకులుగా ఉన్న . . . వారి మాట విని, వారికి లోబడియుండుడి”

[18వ పేజీలోని చిత్రం]

యేసు వాత్సల్యంగల వ్యక్తిగా సమీపించదగ్గ వ్యక్తిగా ఉన్నాడు, క్రైస్తవ పెద్దలు ఆయనలా ఉండడానికి కృషిచేస్తారు