కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రీస్తు నాయకత్వం మీకు వాస్తవమైనదిగా ఉందా?

క్రీస్తు నాయకత్వం మీకు వాస్తవమైనదిగా ఉందా?

క్రీస్తు నాయకత్వం మీకు వాస్తవమైనదిగా ఉందా?

‘మీరు గురువులని [“నాయకులని,” NW] పిలువబడవద్దు; క్రీస్తు ఒక్కడే మీ గురువు [“నాయకుడు,” NW].’​మత్తయి 23:​10.

1. నిజ క్రైస్తవుల ఏకైక నాయకుడు ఎవరు?

అది మంగళవారం, నీసాను 11వ తారీఖు. మూడు రోజుల తర్వాత యేసుక్రీస్తు చంపబడబోతున్నాడు. ఆయన దేవాలయానికి రావడం అది చివరిసారి. ఆ రోజు అక్కడ గుమికూడిన జనసమూహాలకు, తన శిష్యులకు యేసు ఒక ప్రాముఖ్యమైన బోధను చేశాడు. ఆయనిలా అన్నాడు: ‘మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు. మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని [“నాయకులని,” NW] పిలువబడవద్దు; క్రీస్తు ఒక్కడే మీ గురువు [“నాయకుడు,” NW].’ (మత్తయి 23:​8-10) నిజంగా, యేసుక్రీస్తే నిజ క్రైస్తవుల నాయకుడు.

2, 3. యెహోవా చెప్పేవాటిని వినడం, ఆయన నియమించిన నాయకుడిని స్వీకరించడం మన జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది?

2 యేసు నాయకత్వాన్ని మనం అంగీకరిస్తే అది మన జీవితాలపై ఎంతటి ప్రయోజనకరమైన ప్రభావాలను చూపుతుందో కదా! ఈ నాయకుడి రాక గురించి ప్రవచిస్తూ యెహోవా దేవుడు ప్రవక్తయైన యెషయా ద్వారా ఇలా ప్రకటించాడు: ‘దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. . . . నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైనదానియందు సుఖింపనియ్యుడి. . . . ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించితిని జనములకు రాజుగాను [“నాయకునిగాను,” క్యాతలిక్‌ అనువాదము] అధిపతిగాను [“సర్వసేనానిగాను,” ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌] అతని నియమించితిని.’​—⁠యెషయా 55:​1-4.

3 మనం యెహోవా చెప్పేవాటిని విన్నప్పుడు, ఆయన దయచేసిన నాయకుడ్ని సర్వసేనానిని అనుసరించినప్పుడు మన వ్యక్తిగత జీవితాలు ఎలా ప్రభావితం చెందుతాయో చూపించడానికి యెషయా, పాలు, నీళ్ళు, ద్రాక్షారసం అనే సాధారణ ద్రవాలను అలంకారికంగా ఉపయోగించాడు. అలా విని, అనుసరించిన ఫలితంగా మనం పునరుత్తేజాన్ని పొందుతాము. అది ఎండలో నుండి వచ్చిన తర్వాత చల్లని మంచినీరు త్రాగినట్లుగా ఉంటుంది. నీతి సత్యాల కోసం మనకున్న దప్పిక తీరుతుంది. పాలు శిశువులకు బలాన్నిచ్చి వారి ఎదుగుదలకు ఎలాగైతే తోడ్పడతాయో, అలాగే ‘వాక్యమనే పాలు’ మనల్ని దృఢపరచి, దేవునితో మనకుగల అనుబంధం ఆధ్యాత్మికంగా గట్టిపడేందుకు దోహదపడతాయి. (1 పేతురు 2:​1-3) ఉల్లాసభరిత సందర్భాల్లో ద్రాక్షారసం ఆనందాన్ని అధికం చేయదని ఎవరు అనగలరు? అదే విధంగా, సత్య దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన నియమించిన నాయకుడి అడుగుజాడల్లో అనుసరించడం మన జీవితాల్లో ‘నిశ్చయంగా సంతోషాన్ని’ తీసుకువస్తుంది. (ద్వితీయోపదేశకాండము 16:​15) కాబట్టి మనందరికీ, యౌవనులమైనా వృద్ధులమైనా, స్త్రీలమైనా పురుషులమైనా క్రీస్తు నాయకత్వం మనకు వాస్తవమైనదిగా ఉందని చూపించడం చాలా ప్రాముఖ్యం. అయితే మన దైనందిన జీవితాల్లో మెస్సీయా మన నాయకుడని మనం ఎలా చూపించగలము?

యౌవనులారా​—⁠‘జ్ఞానమందు వర్ధిల్లుతూ’ ఉండండి

4. (ఎ) యేసు 12వ ఏట పస్కా పండుగ సమయంలో యెరూషలేమును సందర్శించినప్పుడు ఏమి జరిగింది? (బి) 12 ఏండ్ల వయస్సులోనే యేసుకు విషయ పరిజ్ఞానం ఎంత ఉంది?

4 మన నాయకుడు యౌవనస్థులకు ఎలాంటి మాదిరిని ఉంచాడో పరిశీలించండి. యేసు బాల్యం గురించి మనకు తెలిసింది చాలా తక్కువే అయినా ఒక సంఘటన మాత్రం ఎన్నో విషయాలను వెల్లడిచేస్తుంది. యేసుకు 12 ఏండ్ల వయస్సున్నప్పుడు తల్లిదండ్రులు ఆయనను ప్రతి సంవత్సరం తీసుకెళ్ళినట్లే పస్కా పండుగకు యెరూషలేముకు తీసుకువెళ్ళారు. ఈసారి ఆయన లేఖనాలపై చర్చలో మునిగిపోయాడు, కుటుంబ సభ్యులు మాత్రం ఆయన ఉన్నాడో లేదో చూసుకోకుండా వెళ్ళిపోయారు. మూడు రోజుల తర్వాత చింతాక్రాంతులై ఉన్న ఆయన తల్లిదండ్రులైన యోసేపు మరియలకు యేసు దేవాలయంలో “బోధకుల మధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు” కనిపించాడు. అంతేకాదు, “ఆయన మాటలు వినినవారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయ మొందిరి.” ఒక్కసారి ఆలోచించండి, కేవలం 12 ఏండ్ల వయస్సులో యేసు ఆలోచింపజేసే ప్రశ్నలు ఆధ్యాత్మిక విషయాలను గురించిన ప్రశ్నలు అడగడమే కాక సూక్ష్మబుద్ధితో జవాబులను ఇచ్చాడు! ఆయన తల్లిదండ్రులు ఆయనకు మంచి శిక్షణనిచ్చారనడంలో సందేహం లేదు.​—⁠లూకా 2:​41-50.

5. యౌవనస్థులు కుటుంబ బైబిలు అధ్యయనం పట్ల తమ వైఖరిని ఎలా పరిశీలించుకోవచ్చు?

5 మీరు యౌవన దశలో ఉండవచ్చు. మీ తల్లిదండ్రులు అంకిత భావంగల దేవుని సేవకులైతే, మీ ఇంట్లో కుటుంబ బైబిలు అధ్యయన కార్యక్రమం క్రమంగా కొనసాగుతుండవచ్చు. మరి కుటుంబ అధ్యయనం పట్ల మీ వైఖరి ఎలా ఉంది? ఈ ప్రశ్నల గురించి ఎందుకు ఆలోచించకూడదు: ‘నేను నా కుటుంబంలో బైబిలు అధ్యయన ఏర్పాటుకు పూర్ణ హృదయంతో మద్దతునిస్తున్నానా? ఆ క్రమానికి ఆటంకం ఏర్పడే విధంగా ఏమీ చేయకుండా, నేను దానికి సహకరిస్తున్నానా?’ (ఫిలిప్పీయులు 3:​16) ‘నేను అధ్యయనంలో చురుకుగా పాల్గొంటున్నానా? యుక్తమైనప్పుడు అధ్యయనం చేస్తున్న ఆర్టికల్‌ల గురించి ప్రశ్నలు వేస్తున్నానా, దాని అన్వయింపుపై వ్యాఖ్యానాలు చేస్తున్నానా? నేను ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి సాధిస్తుండగా, ‘వయస్సు వచ్చిన వారికి తగిన బలమైన ఆహారము’ పట్ల రుచిని పెంపొందించుకుంటున్నానా?’​—⁠హెబ్రీయులు 5:⁠13, 14.

6, 7. అనుదిన బైబిలు పఠన కార్యక్రమం యౌవనస్థులకు ఎంత విలువైనదిగా ఉండగలదు?

6 అనుదిన బైబిలు పఠనం కూడా చాలా విలువైనది. కీర్తనకర్త ఇలా పాడాడు: “దుష్టుల ఆలోచన చొప్పున నడువక . . . యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.” (కీర్తన 1:​1, 2) మోషే తర్వాత నాయకుడైన యెహోషువ ‘ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించాడు.’ అలా చేయడం ఆయన జ్ఞానయుక్తంగా చర్యలు తీసుకుని, దేవుడిచ్చిన నియామకాన్ని నిర్వర్తించడంలో విజయం సాధించేందుకు సహాయపడింది. (యెహోషువ 1:⁠8) మన నాయకుడైన యేసుక్రీస్తు ఇలా అన్నాడు: ‘మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని యెహోవా నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నది.’ (మత్తయి 4:⁠4) మనకు భౌతిక ఆహారం అనుదినము అవసరమైనట్లైతే, క్రమమైన పద్ధతిలో ఆధ్యాత్మిక ఆహారం ఇంకెంత ఎక్కువగా అవసరమో కదా!

7 తన ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించిన 13 ఏండ్ల నీకోల్‌ ప్రతిరోజు బైబిలు చదవడం ప్రారంభించింది. * ఇప్పుడు ఆమెకు 16 ఏండ్లు, ఆమె పూర్తి బైబిలును ఒకసారి చదివింది, రెండవసారి చదవడం ప్రారంభించి మధ్య వరకు వచ్చింది. ఆమె అనుసరించే పద్ధతి చాలా సులువైంది. “ప్రతి రోజు ఒక్క అధ్యాయాన్ని చదవాలని నిశ్చయించుకున్నాను” అంటుందామె. బైబిలును అనుదినం చదవడం ఆమెకు ఎలా సహాయపడింది? ఆమె ఇలా జవాబిస్తోంది: “నేడు చెడు ప్రభావాలు చాలా ఉన్నాయి. స్కూల్లోను, బయటా నా విశ్వాసాన్ని సవాలు చేసే ఒత్తిళ్ళను అనుదినం ఎదుర్కొంటాను. ఈ ఒత్తిళ్ళను నిరోధించేలా ప్రోత్సహించే బైబిలు ఆజ్ఞలను సూత్రాలను వెంటనే జ్ఞాపకం చేసుకోవడానికి బైబిలును అనుదినం చదవడం నాకు సహాయపడింది. తత్ఫలితంగా, నేను యెహోవాకు యేసుకు సన్నిహితంగా ఉన్నట్లు భావిస్తాను.”

8. సమాజమందిరం విషయంలో యేసుకు ఎలాంటి అలవాటు ఉండేది, యౌవనస్థులు ఆయనను ఏ విధంగా అనుకరించగలరు?

8 సమాజమందిరంలో లేఖనాలు చదవడం, చదవబడుతుండగా వినడం యేసుకు అలవాటు. (లూకా 4:​16; అపొస్తలుల కార్యములు 15:​21) బైబిలు చదవబడి అధ్యయనం చేయబడే క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరు కావడం ద్వారా ఆయన మాదిరిని అనుకరించడం యౌవనస్థులకు ఎంత మంచిది! అలాంటి కూటాల పట్ల తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ 14 ఏండ్ల రిచర్డ్‌ ఇలా అంటున్నాడు: “కూటాలు నాకెంతో అమూల్యమైనవి. ఏది మంచి ఏది చెడు, ఏది నైతికమైనది ఏది అనైతికమైనది, ఏది క్రీస్తును పోలినది, ఏది అందుకు విరుద్ధమైనది అన్నవి అక్కడ నాకెల్లప్పుడు జ్ఞాపకం చేయబడతాయి. నాకై నేనుగా చేదైన అనుభవాల ద్వారా తెలుసుకోవలసిన అవసరం లేదు.” అవును, ‘యెహోవా శాసనము [“జ్ఞాపిక,” NW] నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.’ (కీర్తన 19:⁠7) నీకోల్‌ కూడా ప్రతి వారం ఐదు సంఘ కూటాలకూ హాజరుకావాలన్న కృతనిశ్చయంతో ఉంటుంది. ఆమె వాటికి సిద్ధపడడానికి రెండు నుండి మూడు గంటలు వెచ్చిస్తుంది.​—⁠ఎఫెసీయులు 5:​15, 16.

9. యౌవనస్థులు ‘జ్ఞానమందు’ ఎలా క్రమంగా ‘వర్ధిల్లగలరు’?

9 ‘అద్వితీయుడైన సత్యదేవుణ్ణి, ఆయన పంపిన యేసుక్రీస్తును’ గురించి తెలుసుకోవడానికి యౌవనదశ చాలా మంచి సమయం. (యోహాను 17:⁠3) బొమ్మల పుస్తకాలు చదవడానికి, టీవీ చూడడానికి, వీడియో గేములు ఆడడానికి, లేదా ఇంటర్‌నెట్‌ సర్ఫింగ్‌ చేయడానికి ఎంతో సమయాన్ని వెచ్చించే యౌవనస్థులు మీకు తెలిసివుండవచ్చు. మన నాయకుడి పరిపూర్ణమైన మాదిరిని అనుకరించే అవకాశం ఉండగా మీరు వారినెందుకు అనుకరించాలి? బాలుడిగా ఉన్నప్పుడు ఆయన యెహోవాను గురించి తెలుసుకోవడంలో ఆహ్లాదాన్ని అనుభవించాడు. దాని ఫలితమేమిటి? ఆధ్యాత్మిక విషయాలంటే తనకున్న ఇష్టత మూలంగా యేసు క్రమంగా ‘జ్ఞానమందు వర్ధిల్లుచుండెను.’ (లూకా 2:​52) మీరు కూడా అలా వర్ధిల్లవచ్చు.

“ఒకనికొకడు లోబడియుండుడి”

10. కుటుంబ జీవితంలో శాంతిసంతోషాలను అనుభవించాలంటే ఏది సహాయపడుతుంది?

10 గృహం అటు శాంతికి సంతృప్తికి నిలయంగా ఉండగలదు, లేదా ఇటు తగవులాటలు వివాదాలు జరిగే యుద్ధరంగంగా ఉండగలదు. (సామెతలు 21:​19; 26:​21) క్రీస్తు నాయకత్వాన్ని అంగీకరించడం కుటుంబంలో శాంతిసంతోషాలకు దోహదపడుతుంది. నిజానికి యేసు మాదిరి కుటుంబ సంబంధాల్లో ఆదర్శవంతమైనది. లేఖనాలిలా పేర్కొంటున్నాయి: “క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి. స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై యున్నాడు. . . . పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, . . . దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.” (ఎఫెసీయులు 5:​21-25) కొలొస్సయిలోని సంఘానికి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రులమాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది.”​—⁠కొలొస్సయులు 3:​18-20.

11. క్రీస్తు నాయకత్వం తనకు వాస్తవమైనదిగా ఉన్నట్లు ఒక భర్త ఎలా చూపించగలడు?

11 ఆ సలహాలను అనుసరించడం అంటే, భర్తలు కుటుంబంలో నాయకత్వం వహించాలి, భార్య ఆయనకు యథార్థతతో మద్దతునివ్వాలి, పిల్లలు తమ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. అయితే పురుషుడి శిరస్సత్వం సరైన రీతిలో అన్వయించినప్పుడే సంతోషకరమైన ఫలితాలు వస్తాయి. జ్ఞానియైన భర్త తన శిరస్సు, నాయకుడు అయిన క్రీస్తు యేసును అనుకరించడం ద్వారా కుటుంబ శిరస్సుగా తనకున్న అధికారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి. (1 కొరింథీయులు 11:⁠3) యేసు అటు తర్వాత ‘సమస్తముపైని సంఘమునకు శిరస్సు’ అయ్యాడు, అయినా ఆయన భూమిమీదికి “పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు” వచ్చాడు. (ఎఫెసీయులు 1:​22; మత్తయి 20:​28) అదే విధంగా, క్రైస్తవ భర్త కుటుంబ శిరస్సుగా తనకున్న అధికారాన్ని స్వప్రయోజనాల కోసం కాదు గానీ తన భార్యాపిల్లల పట్ల​—⁠అవును, పూర్తి కుటుంబంపట్ల శ్రద్ధ వహించడానికి ఉపయోగిస్తాడు. (1 కొరింథీయులు 13:​4, 5) ఆయన తన శిరస్సైన యేసుక్రీస్తు ప్రదర్శించిన దైవిక లక్షణాలను అనుకరించడానికి ప్రయత్నిస్తాడు. ఆయన యేసులా సాత్వికుడిగా దీనమనస్సుగలవాడిగా ఉంటాడు. (మత్తయి 11:​28-30) ఆయన తప్పు చేసినప్పుడు, “నన్ను క్షమించు” లేదా “నువ్వు చెప్పిందే నిజం” వంటి మాటలు ఆయన నోట్లోనుండి రావడం ఆయనకు కష్టంగా ఉండదు. ఆయన చూపించే చక్కని మాదిరి, ఆయన భార్య ఆయనకు “సాటియైన సహాయము”గా ఆయన “తోటిదై” ఉండడానికి ఆమెకు సులభమయ్యేలా చేస్తుంది. ఆయన దగ్గర నేర్చుకుంటూ, ఆయనతో భుజాభుజాలు కలిపి పనిచేయడానికి ఆమెకు సులువుగా ఉంటుంది.​—⁠ఆదికాండము 2:​20; మలాకీ 2:⁠14.

12. శిరస్సత్వ సూత్రానికి లోబడివుండడానికి ఒక భార్యకు ఏమి సహాయపడుతుంది?

12 భార్య విషయంలో చూస్తే ఆమె తన భర్తకు లోబడివుండాలి. అయితే, ఆమె లోకాత్మచే ప్రభావితమైతే, శిరస్సత్వ సూత్రం పట్ల ఆమెకు చులకన భావం ఏర్పడుతుండవచ్చు, ఒక పురుషుడికి లోబడివుండడం అన్న తలంపు అంత రుచించకపోవచ్చు. పురుషుడు అధికారం చెలాయించాలని లేఖనాలు సూచించడం లేదు, కానీ భార్యలు తమ భర్తలకు లోబడాలని మాత్రం అవి చెబుతున్నాయి. (ఎఫెసీయులు 5:​24) భర్తలు లేదా తండ్రులు కుటుంబ విషయాలకు సంబంధించి బాధ్యత వహించాలని బైబిలు కోరుతుంది, అందులోని సలహాలను అన్వయించుకున్నప్పుడు కుటుంబంలో శాంతి సమాధానాలు ఏర్పడతాయి.​—⁠ఫిలిప్పీయులు 2:⁠5.

13. లోబడే విషయంలో పిల్లలకు యేసు ఎలాంటి మాదిరిని ఉంచాడు?

13 పిల్లలు తమ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఈ విషయంలో యేసు అద్భుతమైన మాదిరిని ఉంచాడు. దేవాలయంలో 12 ఏండ్ల యేసు మూడు రోజుల పాటు విడిచిపెట్టబడిన సంఘటన తర్వాత ‘ఆయన [తల్లిదండ్రులతో] కూడ బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడియుండెను.’ (లూకా 2:​51) పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడివుండడం ద్వారా కుటుంబంలో శాంతి సామరస్యాలు ఉంటాయి. కుటుంబంలో ప్రతి సభ్యుడు క్రీస్తు నాయకత్వానికి లోబడినప్పుడు ఒక సంతోషభరిత కుటుంబం ఏర్పడుతుంది.

14, 15. ఇంట్లో కష్టతరమైన పరిస్థితి ఎదురైనప్పుడు విజయవంతంగా వ్యవహరించడానికి మనకు ఏమి సహాయం చేస్తుంది? ఒక ఉదాహరణ ఇవ్వండి.

14 ఇంట్లో కష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా యేసును అనుకరించి ఆయన నడిపింపును అంగీకరించడమే విజయానికి కీలకం. ఉదాహరణకు, 35 ఏండ్ల జెర్రీ, యౌవనస్థురాలైన ఒక కూతురున్న లానాను వివాహం చేసుకున్నప్పుడు భార్యభర్తలిరువురికీ ఊహించనటువంటి సవాలు ఎదురైంది. జెర్రీ ఇలా వివరిస్తున్నాడు: “కుటుంబానికి మంచి శిరస్సుగా ఉండాలంటే, ఇతర కుటుంబాల్లో సఫలతను సాధించే బైబిలు సూత్రాలనే నేనూ అన్వయించుకోవలసిన అవసరం ఉందని నాకు తెలుసు. కానీ నేను మరింత జ్ఞానయుక్తంగా వివేచనాపూర్వకంగా వాటిని అన్వయించుకోవాలని నాకు త్వరలోనే అర్థమైంది.” ఆ కూతురు, తనకు తన తల్లికి మధ్య వచ్చిన వ్యక్తిగా ఆయనను దృష్టించి, ఆయనను తీవ్రంగా ద్వేషించింది. ఇది, ఆ అమ్మాయి చెప్పే విషయాలను చేసే పనులను ప్రభావితం చేస్తోందని గ్రహించడానికి జెర్రీకి చాలా వివేచన అవసరమైంది. ఆయన ఆ పరిస్థితితో ఎలా వ్యవహరించాడు? జెర్రీ ఇలా చెబుతున్నాడు: “కనీసం కొంతకాలంపాటు తన కూతురుకు క్రమశిక్షణనిచ్చే పనిని లానా మాత్రమే నిర్వర్తిస్తుందని, నేను ఆ అమ్మాయితో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకునేందుకు ప్రయత్నించాలని నేనూ లానా నిర్ణయించుకున్నాము. కొంతకాలానికి, ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయి.”

15 ఇంట్లో కష్టతరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు, కుటుంబ సభ్యులు ఆయా విధాలుగా ఎందుకు మాట్లాడతారో ఆయా విధాలుగా ఎందుకు ప్రవర్తిస్తారో తెలుసుకోవడానికి మనకు వివేచన అవసరమవుతుంది. దైవిక సూత్రాలను సరైన రీతిలో అన్వయించుకోవడానికి మనకు జ్ఞానం కూడా అవసరం. ఉదాహరణకు యేసు, రక్తస్రావముగల స్త్రీ తనను ఎందుకు ముట్టుకుందో స్పష్టంగా అర్థం చేసుకున్నాడు, ఆమెతో జ్ఞానయుక్తంగాను కరుణతోను వ్యవహరించాడు. (లేవీయకాండము 15:​25-27; మార్కు 5:​30-34) జ్ఞాన వివేచనలు మన నాయకుడి గుర్తింపు చిహ్నాలు. (సామెతలు 8:​12) ఆయన ప్రవర్తించే విధానంలో మనం ప్రవర్తించగలిగితే మనం ధన్యులం.

‘రాజ్యమును మొదట వెదకుడి’

16. మన జీవితాల్లో ఏది కేంద్రస్థానాన్ని ఆక్రమించుకోవాలి, యేసు దాన్ని తన మాదిరి ద్వారా ఎలా చూపించాడు?

16 తన నాయకత్వాన్ని స్వీకరించేవారి జీవితాల్లో ఏది ప్రధమ స్థానాన్ని పొందాలన్న దాంట్లో యేసు ఎలాంటి సందేహాన్నీ మిగల్చలేదు. ఆయనిలా అన్నాడు: ‘కాబట్టి మీరు ఆయన [దేవుని] రాజ్యమును నీతిని మొదట వెదకుడి.’ (మత్తయి 6:​33) అది ఎలా చేయాలో తను స్వయంగా చేసి చూపించాడు. యేసు తన బాప్తిస్మం తర్వాత 40 రోజులపాటు ఉపవాసం ఉండి, ధ్యానించి, ప్రార్థన చేసిన తర్వాత ఆయనకు ఒక శోధన ఎదురైంది. అపవాదియైన సాతాను ఆయనకు “లోకరాజ్యములన్నిటి” పైనా పరిపాలనాధికారాన్ని ఇవ్వజూపాడు. అపవాది ప్రతిపాదనను స్వీకరించి ఉంటే యేసు అనుభవించగల జీవితం గురించి ఆలోచించండి! కానీ, క్రీస్తు తన తండ్రి చిత్తాన్ని చేయడంపై దృష్టి కేంద్రీకరించాడు. సాతాను లోకంలో అలాంటి జీవితం అల్పకాలికమని కూడా ఆయన గ్రహించాడు. ఆయన వెంటనే, ఇలా అంటూ అపవాది ప్రతిపాదనను తిరస్కరించాడు: ‘నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నది.’ ఆ తర్వాత వెంటనే యేసు, “పరలోకరాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.” (మత్తయి 4:​2, 8-10, 17) తన మిగతా భూజీవితంలో క్రీస్తు దేవుని రాజ్యాన్ని పూర్తికాలం ప్రకటించాడు.

17. రాజ్యానికి సంబంధించిన విషయాలు మన జీవితాల్లో ప్రధమ స్థానంలో ఉన్నాయని ఎలా చూపించగలము?

17 పెద్ద పెద్ద జీతాలొచ్చే ఉద్యోగాలు సంపాదించడమే, సిరిసంపదలు తెచ్చే జీవిత విధానాలను వెంబడించడమే మన జీవిత ప్రధాన లక్ష్యాలుగా చేసుకునేందుకు ప్రలోభపెట్టేలా మనం సాతాను లోకాన్ని అనుమతించకుండా మన నాయకుణ్ణి అనుకరించడం మనకు శ్రేయస్కరము. (మార్కు 1:​17-21) రాజ్యానికి సంబంధించిన విషయాలు రెండవ స్థానానికి వెళ్ళిపోయేంతగా ఈ లోక వ్యవహారాల్లో మునిగిపోవడం ఎంత మూర్ఖత్వమో కదా! యేసు మనకు రాజ్య ప్రకటనా పనిని శిష్యులను చేసే పనిని అప్పగించాడు. (మత్తయి 24:​14; 28:​19, 20) నిజమే, మనకు కుటుంబ బాధ్యతలు మరితర బాధ్యతలు ఉండవచ్చు, కానీ సాయంకాలాలు వారాంతాలు ప్రకటనా బోధనా పనుల్లో పాల్గొనడానికి మనం ఆనందించమా? 2001వ సేవా సంవత్సరంలో దాదాపు 7,80,000 మంది పూర్తికాల పరిచారకులుగా, లేదా పయినీర్లుగా సేవచేయడం ఎంత ప్రోత్సాహకరమైన విషయం!

18. పరిచర్యలో ఆనందాన్ని పొందడానికి మనకు ఏమి సహాయపడుతుంది?

18 సువార్త వృత్తాంతాలు యేసును కార్యశూరుడిగానూ, కోమలభావాలుగల వ్యక్తిగానూ చిత్రిస్తాయి. తన చుట్టూ ఉన్నవారి ఆధ్యాత్మిక అవసరాలను చూసి ఆయన వారి మీద కనికరపడి ఆసక్తితో వారికి చేయూతనిచ్చాడు. (మార్కు 6:​31-34) ఇతరుల పట్ల ప్రేమతో, వారికి సహాయం చేయాలన్న నిజమైన కోరికతో మనం పరిచర్యలో పాల్గొన్నప్పుడు ఆ పరిచర్య చాలా ఆనందాన్నిస్తుంది. కానీ మనం అలాంటి కోరికను ఎలా ఉత్పన్నం చేసుకోగలము? జేసన్‌ అనే యౌవనస్థుడు, “నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు పరిచర్యలో అంతగా ఆనందించేవాడిని కాదు” అంటున్నాడు. ఈ పనిలో ఆనందాన్ని పెంపొందించుకునేందుకు ఆయనకు ఏది సహాయపడింది? జేసన్‌ ఇలా జవాబిస్తున్నాడు: “శనివారం ఉదయాల్లో మా కుటుంబ సభ్యులందరూ క్షేత్ర సేవలో పాల్గొనేవారు. అది నాకు మంచిదే అయింది ఎందుకంటే నేను పరిచర్యకు ఎంత ఎక్కువగా వెళ్తే అది సాధించే మంచిని అంత స్పష్టంగా చూడగలిగాను, అంత ఎక్కువగా ఆనందించగలిగేవాడిని కూడా.” మనం కూడా పరిచర్యలో క్రమంగా శ్రద్ధగా పాల్గొనాలి.

19. క్రీస్తు నాయకత్వం సంబంధంగా మనం ఏమని కృతనిశ్చయం చేసుకోవాలి?

19 క్రీస్తు నాయకత్వాన్ని అంగీకరించడం నిజంగా పునరుత్తేజాన్ని ప్రతిఫలాన్నిస్తుంది. మనం అలా అంగీకరించినప్పుడు యౌవనదశ పరిజ్ఞానములోను జ్ఞానములోను పురోభివృద్ధి సాధించే దశగా ఉంటుంది. కుటుంబ జీవితం శాంతి సంతోషాలనిచ్చేదిగా అవుతుంది, పరిచర్య ఆనందాన్ని సంతృప్తిని తీసుకువచ్చేదిగా అవుతుంది. కాబట్టి మన దైనందిన జీవితంలోను, మనం తీసుకునే నిర్ణయాల ద్వారాను, క్రీస్తు నాయకత్వం మనకు వాస్తవమైనదిగా ఉందని మనం తప్పకుండా చూపిద్దాం. (కొలొస్సయులు 3:​23, 24) అయితే, యేసుక్రీస్తు తన నాయకత్వాన్ని మరో విధంగా అందించాడు​—⁠అదే క్రైస్తవ సంఘం. ఈ ఏర్పాటు నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చో తర్వాతి ఆర్టికల్‌ చర్చిస్తుంది.

[అధస్సూచి]

^ పేరా 7 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

మీకు జ్ఞాపకం ఉన్నాయా?

• దేవుడు నియమించిన నాయకుడిని అనుసరించడం మనకెలా ప్రయోజనం చేకూరుస్తుంది?

• తాము యేసు నాయకత్వాన్ని అనుసరించాలని కోరుకుంటున్నట్లు యౌవనస్థులు ఎలా చూపించగలరు?

• క్రీస్తు నాయకత్వానికి లోబడేవారి కుటుంబ జీవితంపై ఆయన నాయకత్వం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది?

• క్రీస్తు నాయకత్వం మనకు వాస్తవమైనదిగా ఉన్నట్లు మన పరిచర్య ఎలా చూపించగలదు?

[అధ్యయన ప్రశ్నలు]

[9వ పేజీలోని చిత్రాలు]

దేవుని గురించి ఆయన నియమించిన మన నాయకుడిని గురించి పరిజ్ఞానం పొందడానికి యౌవనకాలం మంచి సమయం

[10వ పేజీలోని చిత్రం]

క్రీస్తు నాయకత్వానికి లోబడడం కుటుంబంలో సంతోషాన్ని తీసుకువస్తుంది

[12వ పేజీలోని చిత్రాలు]

యేసు రాజ్యాన్ని మొదట వెదికాడు. మీరు వెదుకుతున్నారా?