ప్రేమచూపడానికి, సత్కార్యములు చేయడానికి పురికొల్పునిచ్చే కూటములు
“నా యొ ద్ద కు రం డి; నే ను మీ కు వి శ్రాం తి క లు గ జే తు ను”
ప్రేమచూపడానికి, సత్కార్యములు చేయడానికి పురికొల్పునిచ్చే కూటములు
టొరంటో నుండి టోక్యో వరకు, మాస్కో నుండి మాంటేవిడియో వరకు ప్రతివారం అనేకసార్లు లక్షలమంది యెహోవాసాక్షులు, వారి స్నేహితులు తమ ఆరాధనాస్థలాలకు ప్రవాహంలా తరలి వెళ్తారు. వీరిలో, పగలంతా ఉద్యోగం చేసి అలసిపోయిన, కష్టపడి పనిచేసే కుటుంబ పెద్దలు; చిన్నపిల్లలను వెంటబెట్టుకువచ్చే శ్రమించే భార్యలు, తల్లులు; రోజంతా పాఠశాలలో గడిపిన, చురుకుదనంగల యౌవనులు; నొప్పులు బాధలతో మెల్లిగా అడుగులు వేసే, బలహీనులైన వృద్ధులు; ధైర్యవంతులైన విధవరాండ్రు, అనాథలు; ఓదార్పు అవసరమైన దుఃఖితులు ఉన్నారు.
యెహోవాసాక్షులైన వీరు వివిధ రకాల ప్రయాణ సాధనాలను ఉపయోగించుకుంటారు—అత్యంత వేగంగల బుల్లెట్ ట్రెయిన్‌ల నుండి గార్దభాల వరకు; ఇరుకైన సబ్‌వేల కార్ల నుండి లారీల వరకు అన్నీ వారికి ప్రయాణ సాధనాలే. కొంతమంది మొసళ్ళతో నిండివున్న నదులను దాటి వస్తే, మరి కొందరు విపరీతమైన ఒత్తిడి కలుగజేసే పెద్ద పెద్ద నగరాల్లోని ట్రాఫిక్ మధ్య నుండి రావలసి ఉంటుంది. వీరంతా ఎందుకు అంత ప్రయాసపడుతున్నారు?
ప్రాథమికంగా, యెహోవా దేవుణ్ణి ఆరాధించడానికి క్రైస్తవ కూటాలకు హాజరు కావడం, వాటిలో పాల్గొనడం ప్రాముఖ్యమైన మార్గాలు. (హెబ్రీయులు 13:15) ‘సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు [“ప్రోత్సహించుకొనుచు,” NW], ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము’ అని వ్రాసినప్పుడు అపొస్తలుడైన పౌలు మరో అదనపు కారణాన్ని ప్రస్తావించాడు. (ఇటాలిక్కులు మావి.) (హెబ్రీయులు 10:24, 25) పౌలు ఇక్కడ, “యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని” అని పాడిన కీర్తనకర్త అయిన దావీదు భావాలను ప్రతిధ్వనింపజేస్తున్నాడు.—కీర్తన 122:1.
క్రైస్తవులు తమ కూటాలకు హాజరైనప్పుడు ఎందుకంతగా ఆనందిస్తారు? ఎందుకంటే అక్కడ హాజరై ఉన్నవారు కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు. బదులుగా, ఆ కూటాలు వారికి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి అవకాశాలను ఇస్తాయి. ప్రాముఖ్యంగా ఇలాంటి సమావేశాలు వారు కేవలం పుచ్చుకోవడానికే గాక ఇవ్వడానికీ, ప్రేమ చూపించుకునేలా సత్కార్యములలో నిమగ్నమయ్యేలా ఒకరినొకరు పురికొల్పుకోవడానికీ అవకాశాలను ఇస్తాయి. ఇది, కూటాలను ప్రోత్సాహాన్నిచ్చే సందర్భాలుగా చేయడానికి దోహదపడుతుంది. అంతేగాక, “నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును” అని తాను చేసిన వాగ్దానాన్ని యేసు నెరవేర్చే మార్గాల్లో ఒకటి, క్రైస్తవ కూటాల ఏర్పాటు.—మత్తయి 11:28.
ఓదార్పునిచ్చే, శ్రద్ధచూపించే ఆశ్రయం
యెహోవాసాక్షులు తమ కూటాలను విశ్రాంతినిచ్చేవిగా దృష్టించడానికి తగిన కారణాలున్నాయి. ఒక కారణమేమిటంటే కూటాల్లో ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా ఆధ్యాత్మిక ఆహారం తగిన వేళ అందజేయబడుతుంది. (మత్తయి 24:45) దేవుని వాక్యాన్ని నిపుణతతో, అత్యాసక్తితో బోధించేవారిగా యెహోవా సేవకులను తయారుచేయడంలో కూటాలు ప్రాముఖ్యమైన పాత్ర కూడా నిర్వహిస్తాయి. అంతేగాక రాజ్యమందిరంలో, ప్రేమ, ఆసక్తి, శ్రద్ధ గల స్నేహితులను కనుగొనవచ్చు, వారు ఒత్తిడి సమయాల్లో ఇతరులకు సహాయం చేయడానికి, ఓదార్పునివ్వడానికి సిద్ధంగా, సుముఖంగా ఉంటారు.—2 కొరింథీయులు 7:5-7.
ఫిల్లిస్ అనే విధవరాలికి అలాంటి అనుభవమే ఎదురైంది, తన కుమార్తెల్లో ఒకామెకు ఐదేళ్ళు, మరొకామెకు ఎనిమిదేళ్ళు ఉన్నప్పుడు ఆమె తన భర్తను కోల్పోయింది. క్రైస్తవ కూటాలు తనపై, చిన్నపిల్లలైన తన కుమార్తెలపై చూపించిన విశ్రాంతికరమైన ప్రభావాన్ని గురించి వర్ణిస్తూ, ఇలా అన్నది: “రాజ్యమందిరానికి వెళ్ళడం ఎంతో ఓదార్పుకరంగా ఉండేది ఎందుకంటే తోటి విశ్వాసులు ప్రేమపూర్వకంగా హత్తుకోవడం ద్వారా, లేఖనాధారిత తలంపులను పంచుకోవడం ద్వారా, లేదా నా చేతిని ప్రేమగా తమ చేతుల్లోకి తీసుకోవడం ద్వారా ఎప్పుడూ తమ ప్రేమను, శ్రద్ధను చూపించేవారు. అది, నేనెప్పుడూ ఉండాలని కోరుకున్న స్థలం.”—1 థెస్సలొనీకయులు 5:14.
మారీ ఒక పెద్ద ఆపరేషన్ చేయించుకున్న తర్వాత, ఆమె కోలుకోవడానికి కనీసం ఆరు వారాలు పడుతుందని ఆమె డాక్టర్ చెప్పాడు. ఆమె తిరిగి ఆరోగ్యం పుంజుకుంటున్న తొలి వారాల్లో, ఆమె కూటాలకు వెళ్లలేకపోయేది. మారీ మునుపటిలా ఉత్సాహంగా లేదని ఆమె డాక్టర్ గమనించాడు. ఆమె కూటాలకు వెళ్ళడం లేదని ఆయన గ్రహించినప్పుడు, వెళ్ళమని ఆమెను ప్రోత్సహించాడు. తన మతం తన భర్త మతం వేరు గనుక తన ఆరోగ్యం పట్ల శ్రద్ధతో అతడు తనను కూటాలకు వెళ్ళనివ్వడానికి ఇష్టపడడం లేదని ఆమె తెలియజేసింది. కాబట్టి ప్రోత్సాహం కోసం, ప్రోత్సాహకరమైన సహవాసం కోసం మారీని రాజ్యమందిరానికి వెళ్ళమని “ఆజ్ఞాపిస్తూ” డాక్టర్ అధికారపూర్వకంగా మందుల చీటీలో వ్రాసిచ్చాడు. చివరిగా మారీ ఇలా చెబుతోంది: “ఒక్క కూటానికి హాజరవ్వగానే నేనెంతో కోలుకున్నాను. నేను తినడం మొదలుపెట్టాను, రాత్రంతా చక్కగా నిద్రపోయాను, నేను నొప్పిని తగ్గించే మందు తరచూ తీసుకోవలసిన అవసరం ఏర్పడలేదు, మళ్ళీ నా ముఖంపై చిరునవ్వు వెలసింది!”—సామెతలు 16:24.
క్రైస్తవ కూటాల్లో నెలకొని ఉండే ప్రేమపూర్వకమైన వాతావరణం బయటివారి దృష్టిలో పడకుండా పోదు. ఒక కాలేజి విద్యార్థి తన మానవ వర్గశాస్త్ర తరగతి కోసం ఒక పరిశోధక వ్యాసం వ్రాసేందుకు యెహోవాసాక్షులను గమనించడానికి ఎంపిక చేసుకుంది. కూటాల్లో ఉండే వాతావరణం గురించి, ఆమె తన పరిశోధక వ్యాసంలో ఇలా వ్రాసింది: “నాకు హృదయపూర్వకమైన ఆహ్వానం లభించింది . . . అది నన్నెంతో ముగ్ధురాలిని చేసింది . . . యెహోవాసాక్షుల స్నేహశీలత ఎంతో ప్రధానమైన లక్షణం, అదే ఆ వాతావరణంలో అత్యంత ప్రముఖ పాత్ర వహిస్తున్నట్లు నేను భావిస్తున్నాను.”—1 కొరింథీయులు 14:25.
కష్టాలతో నిండివున్న ఈ లోకంలో, క్రైస్తవ సంఘం ఆధ్యాత్మిక ఆశ్రయస్థానం వంటిది. అది ప్రేమా సమాధానముల నెలవు. “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!” అని చెప్పిన కీర్తనకర్త మాటలు ఎంత సత్యమో కూటాలకు హాజరవ్వడం ద్వారా మీకై మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు.—కీర్తన 133:1.
[25వ పేజీలోని బాక్సు/చిత్రం]
ఒక ప్రత్యేకమైన అవసరాన్ని తీర్చడం
వినలేని వారు క్రైస్తవ కూటాల నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చు? ప్రపంచవ్యాప్తంగా, యెహోవాసాక్షులు సంజ్ఞాభాష సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. గత 13 సంవత్సరాల్లో, అమెరికాలో 27 సంజ్ఞాభాష సంఘాలు, 43 సంజ్ఞాభాష గ్రూపులు ఏర్పాటు చేయబడ్డాయి. కనీసం మరో 40 దేశాల్లో ఇప్పుడు దాదాపు 140 సంజ్ఞాభాష సంఘాలున్నాయి. క్రైస్తవ సాహిత్యాలు 13 సంజ్ఞాభాషల్లో వీడియోపై సిద్ధం చేయబడ్డాయి.
క్రైస్తవ సంఘం బధిరులు యెహోవాను స్తుతించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఫ్రాన్స్‌లో మునుపు క్యాథలిక్‌గా ఉండి, తీవ్రమైన డిప్రెషన్‌తో, ఆత్మహత్య చేసుకోవాలనే తలంపులతో బాధపడిన ఒడీల్ క్రైస్తవ కూటాల ద్వారా తాను పొందిన బైబిలు విద్య పట్ల ప్రగాఢమైన కృతజ్ఞతతో ఉంది. “నేను నా ఆరోగ్యాన్ని, జీవితానందాన్ని తిరిగి పొందాను. అన్నిటికన్నా ముఖ్యంగా నేను సత్యాన్ని కనుగొన్నాను. ఇప్పుడు నా జీవితానికొక సంకల్పం ఉంది” అని ఆమె చెబుతోంది.