కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మంచి నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాలు

మంచి నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాలు

మంచి నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాలు

ఆయన ఒక రచయిత, కవి. ముందు ముందు మంచిరోజులు వస్తాయని గుండెల నిండా ఆశలు నింపుకున్నాడు. దాదాపు 90 సంవత్సరాల క్రితం ఆయన, “మనస్సుల్లో భయాందోళనలు లేనిచోటు, ఆత్మవిశ్వాసంతో తలెత్తుకుని తిరిగేచోటు; పరిజ్ఞానం ఉచితంగా లభించేచోటు; సంకుచిత సరిహద్దులతో లోకం ముక్కలుగా విభాగింపబడనిచోటు; సత్యసాగరంలోంచి మాటలు పుట్టే చోటు; అవిరామ కృషి పరిపూర్ణతను ఆలింగనం చేసుకునే చోటు” వస్తుందని కలలుగన్నాడు.

అలా అన్న తర్వాత ఆ రచయిత తన దేశమూ, మిగతా ప్రపంచమూ ఏదో ఒక రోజు అలాంటి చోట ఉంటుందన్న ఆశను వ్యక్తం చేశాడు. నోబుల్‌ బహుమతి పొందిన ఆ కవి ఇప్పటివరకు బ్రతికివుంటే నిజంగా చాలా నిరాశపడేవాడు. ఎంత ప్రగతి సాధించినా, ఎన్ని విప్లవాత్మక అభివృద్ధులు జరిగినా లోకం మునుపటికన్నా ఎక్కువగా ముక్కలుగా విభాగించబడి ఉంది. ఇక మనిషి భవిష్యత్తు మొత్తంగా చూస్తే నిరాశాజనకంగానే కనిపిస్తోంది.

తన దేశంలోని కొన్ని వర్గాల మధ్య అంత అకస్మాత్తుగా హింసాజ్వాలలు ఎందుకు చెలరేగాయని ఒక రైతును అడిగినప్పుడు ఆయన తనకు కనిపిస్తున్న ఒక కారణం గురించి చెప్తూ, “నాయకుల్లో భ్రష్టత్వమే అందుకు కారణం” అని అన్నాడు. మానవత్వం​—⁠ఇరవయ్యవ శతాబ్దపు నైతిక చరిత్ర (ఆంగ్లం) అనే తన పుస్తకంలో చరిత్రకారుడు జోనతన్‌ గ్లోవర్‌ అలాంటి దృక్పథాన్నే వ్యక్తం చేస్తూ ఇలా అన్నాడు: “[అదే దేశంలోని] జాతిప్రక్షాళన, అక్కడి తెగల మధ్య అప్పటికప్పుడు ఎగసిన విద్వేషజ్వాలల మూలంగా జరిగింది కాదు, అది అధికారాన్ని తమ చేతుల్లోనే ఉంచుకోవడానికి ప్రయత్నించిన ప్రజలచేత పథకం ప్రకారం జరిగించబడింది.”

1990ల తొలిభాగంలో మునుపటి యుగోస్లావియాలోని రెండు రిపబ్లిక్‌ రాష్ట్రాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పుడు ఒక విలేఖరి ఇలా ప్రశ్నించింది: “మేము ఎన్నో సంవత్సరాలపాటు సుఖసంతోషాలతో సహజీవనం చేశాము, కానీ ఇప్పుడది ఒకరి పిల్లలను మరొకరు చంపుకునే స్థాయికి దిగజారింది. మనకసలు ఏమౌతోంది?”

యూరప్‌కు ఆఫ్రికాకు వేలాది కిలోమీటర్ల దూరంలో ఇండియా ఉంది, ఈ ఆర్టికల్‌ ప్రారంభంలో పేర్కొన్న కవి జన్మించిన దేశం అదే. “ఇండియా ఒక దేశంగా మనగ్గలదా?” అనే ఒక ప్రసంగంలో ప్రణయ్‌ గుప్తే అనే రచయిత ఇలా పేర్కొన్నాడు: ‘ఇండియాలో ఉన్న గొప్ప జనాభాలో దాదాపు 70 శాతం 30 ఏండ్ల లోపువారే, అయినా వారికి ఆదర్శంగా ఉండే నాయకుడు లేడు.’

కొన్ని దేశాల్లోని నాయకులు అవినీతి ఆరోపణల మూలంగా తమ హోదాలకు రాజీనామా ఇచ్చి దిగిపోవాల్సివచ్చింది. కాబట్టి అనేక కారణాల మూలంగా లోకం నాయకత్వ సంక్షోభాన్ని అనుభవిస్తుందనిపిస్తోంది. దాదాపు 2,600 సంవత్సరాల క్రితం జీవించిన ఒక ప్రవక్త మాటల్లోని నిజాన్ని ప్రస్తుత పరిస్థితులు రుజువు చేస్తున్నాయి. ఆ ప్రవక్త ఇలా అన్నాడు: ‘తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదు. మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదు.’​—⁠యిర్మీయా 10:⁠23.

ఈ లోక వేదనల నుండి బయటపడే మార్గమేదైనా ఉందా? మానవ సమాజంలోని వేదనలు భయాలు పోయి, నిజమైన పరిజ్ఞానం ఉచితంగా ధారాళంగా లభించే, మానవజాతి పరిపూర్ణతవైపు పయనిస్తుండే లోకానికి మానవజాతిని ఎవరు నడిపించగలరు?

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

Fatmir Boshnjaku