కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మృతదేహాన్ని భద్రపరచడం క్రైస్తవులకు

మృతదేహాన్ని భద్రపరచడం క్రైస్తవులకు

మృతదేహాన్ని భద్రపరచడం క్రైస్తవులకు

తగినదేనా?

తన మరణం ఆసన్నమైనప్పుడు విశ్వసనీయుడైన పితరుడైన యాకోబు ఈ చివరి కోరిక కోరాడు: “హిత్తీయుడైన ఎఫ్రోను భూమియందున్న గుహలో నా తండ్రులయొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే యెదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది.”​—⁠ఆదికాండము 49:​29-31.

యోసేపు తన తండ్రి కోరికను మన్నించి ఆ కాలంలో ఐగుప్తులో సామాన్యంగా పాటించబడే ఒక ఆచరణను ఆచరించాడు. ఆయన ‘సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని [“కుళ్ళిపోకుండా భద్రపరచాలని,” NW] తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను.’ ఆదికాండము 50వ అధ్యాయంలోని వృత్తాంతం ప్రకారం చూస్తే వైద్యులు శవాన్ని కుళ్ళిపోకుండా భద్రపరచడానికి ఆచారబద్ధంగా 40 రోజులు తీసుకున్నారు. యాకోబు శవాన్ని అలా భద్రపరిచే ప్రక్రియ వలన అది కుళ్ళిపోలేదు, అలా ఆ కుటుంబ సభ్యులు అలాగే ఐగుప్తులోని ఉన్నత హోదాలోనివారు అందరూ కలిసి నెమ్మదిగా ప్రయాణించే ఒంటెల బిడారుతో దాదాపు 400 కిలోమీటర్లు దూరంలో ఉన్న హెబ్రోనులో యాకోబును పాతిపెట్టడానికి వెళ్ళడం సాధ్యమైంది.​—⁠ఆదికాండము 50:​1-14.

అలా కుళ్ళిపోకుండా భద్రపరచబడిన యాకోబు శరీరం కనుగొనబడే అవకాశాలున్నాయా? అలాంటి అవకాశాలు చాలా స్వల్పం. ఇశ్రాయేలు నీరు సమృద్ధిగా ప్రవహించే ప్రాంతం, అందుమూలంగా అక్కడ కొద్ది రకాల పురాతత్త్వ వస్తువులు మాత్రమే కనుగొనబడతాయి. (నిర్గమకాండము 3:⁠8) ప్రాచీన లోహ వస్తువులు రాతి వస్తువులు సమృద్ధిగా లభిస్తాయి, కానీ బట్టలు, తోళ్ళు, కుళ్ళిపోకుండా భద్రపరచబడిన శరీరాలు వంటి సున్నితమైనవి అక్కడి తేమకు కాలగతిలోని మార్పులకు నిలువలేదు.

మృతదేహాన్ని కుళ్ళిపోకుండా భద్రపరచడం అంటే ఏమిటి? అది ఎందుకు ఆచరించబడింది? క్రైస్తవులు దాన్ని పాటించవచ్చా?

ఈ ఆచారం ఎక్కడ ప్రారంభమైంది?

కుళ్ళిపోకుండా భద్రపరచడమనేది మానవ లేదా జంతు శవాన్ని పరిరక్షించడానికి చేపట్టే ప్రక్రియ అని వివరించవచ్చు. ఈ ప్రక్రియ ఐగుప్తులో ప్రారంభమైందని, కానీ ప్రాచీన అష్షూరీయులు, పారసీకులు, సిథియన్లు కూడా ఆచరించేవారని చరిత్రకారులు ఏకీభవిస్తున్నట్లు కనిపిస్తోంది. మృతదేహాలను కుళ్ళిపోకుండా భద్రపరిచే ప్రక్రియలో మొదటిగా ఆసక్తి చూపడం, దానికి సంబంధించి ప్రయోగాలు చేయడం, ఎడారి ఇసుకలో పాతిపెట్టబడిన శరీరాలు సహజంగానే పరిరక్షించబడినట్లు కనుగొనబడడం మూలంగా ప్రారంభమైవుండవచ్చు. అలా పాతిపెట్టడం తేమను గాలిని శవం దరిచేరనీయకుండా అడ్డుకుని, తద్వారా అది కుళ్ళిపోవడాన్ని పరిమితం చేసివుండవచ్చు. ఐగుప్తులోను చుట్టుప్రక్కల ప్రాంతాల్లోను సమృద్ధిగా లభించే నేట్రన్‌ (సోడియం కార్బనేట్‌) అనే క్షారములో శరీరాలు పరిరక్షించబడుతున్నట్లు కనుగొనబడినప్పుడు మృతదేహాలను కుళ్ళిపోకుండా భద్రపరిచే ప్రక్రియ ప్రారంభమై ఉంటుందని కొందరు సిద్ధాంతీకరిస్తారు.

మరణం సంభవించిన కొద్ది గంటల్లోనే, శరీరం కుళ్ళిపోయేలా చేసే సూక్ష్మక్రిముల చర్యలు సహజంగా ప్రారంభమవుతాయి. ఆ చర్యలను ఆటంకపరచడమే శవాలను కుళ్ళిపోకుండా భద్రపరిచే వ్యక్తి లక్ష్యం. ఈ చర్యలను నివారించగలిగితే, కుళ్ళిపోవడం ఆగిపోతుంది, లేదా కనీసం కుళ్ళిపోయే వేగం చాలా తగ్గుతుంది. మూడు అంశాలు ఇందుకు అవసరం: శవాన్ని సజీవంగానే ఉన్నట్లనిపించే స్థితిలో భద్రపరచడం, కుళ్ళిపోకుండా నివారించడం, కీటకాలు శవం దరిచేరకుండా చేయడం.

ప్రాచీన ఐగుప్తీయులు ప్రాముఖ్యంగా మతపర కారణాల మూలంగా శవాలను కుళ్ళిపోకుండా భద్రపరిచేవారు. మరణానంతర జీవితం గురించిన వారి భావనల్లో, మృతులు ఈ లోకంలోని వారితో సంప్రదింపులు జరపాలన్న కోరికతో ఉంటారన్న భావన కూడా ఉంది. వారి శరీరాలు నిత్యభవిష్యత్తులోను ఉపయోగించబడతాయని, అవి మళ్ళీ సజీవంగా మారతాయని వారు నమ్మారు. మృతదేహాలను భద్రపరచడం అప్పట్లో ఎంత సాధారణంగా జరిగినా, ఆ ప్రక్రియను ఎలా చేస్తారో వివరించే వృత్తాంతం ఇప్పటి వరకు దొరకలేదు. సా.శ.పూ. ఐదవ శతాబ్దంలోని గ్రీకు చరిత్రకారుడైన హెరొడోటస్‌ వ్రాసిన వృత్తాంతమే అతి శ్రేష్ఠమైన నివేదిక. అయితే, హెరొడోటస్‌ నిర్దేశాల అనుసారంగా చేయడానికి ప్రయత్నించినప్పుడు ఫలితాలు అంత విజయవంతంగా లేవని చెబుతారు.

క్రైస్తవులు దానిని పాటించవచ్చా?

యాకోబు మత నమ్మకాలకు భిన్నమైన నమ్మకాలున్న వారిచేత ఆయన శరీరం కుళ్ళిపోకుండా భద్రం చేయబడింది. అయినా, యోసేపు తన తండ్రి శరీరాన్ని వైద్యులకు అప్పగించినప్పుడు, ఐగుప్తులో ఆ కాలంలో శవాలను కుళ్ళిపోకుండా భద్రపరచడానికి చేయబడే ప్రార్థనలు ఆచారాలు పాటించమని వారికి చెప్పివుండడు. యాకోబు యోసేపులు బలమైన విశ్వాసం ఉన్న వ్యక్తులు. (హెబ్రీయులు 11:​21, 22) యెహోవాచే ఆజ్ఞాపించబడకపోయినా, యాకోబు శరీరాన్ని భద్రపరచడం గురించి లేఖనాల్లో అనంగీకృతంగా చెప్పబడలేదు. యాకోబు శరీరం కుళ్ళిపోకుండా భద్రపరచడం అనేది అటు తర్వాత ఇశ్రాయేలు జనాంగానికీ లేదా క్రైస్తవ సంఘానికీ అనుసరించాల్సిన మాదిరిగా లేదు. నిజానికి ఆ విషయం గురించి దేవుని వాక్యంలో నిర్దిష్టమైన సూచనలేమీ లేవు. యోసేపు శరీరం కూడా ఐగుప్తులో కుళ్ళిపోకుండా భద్రపరచబడిన తర్వాత ఆ ఆచారం గురించి లేఖనాల్లో మరిక ప్రస్తావన లేదు.​—⁠ఆదికాండము 50:⁠26.

పాలస్తీనాలోని సమాధుల్లో కుళ్లిపోయివున్నట్లు కనుగొనబడిన మానవ శరీరాలు చూస్తే, మృతదేహాలను కుళ్ళిపోకుండా భద్రపరచడం అనేది హీబ్రూల ఆచారం కాదని, కనీసం దీర్ఘకాలంపాటు సంరక్షించే ఉద్దేశం కూడా ఉండేది కాదని తెలుస్తోంది. ఉదాహరణకు లాజరు దేహం కుళ్ళిపోకుండా భద్రపరచబడలేదు. ఆయన శవాన్ని బట్టలతో చుట్టినప్పటికీ, ఆయన సమాధికి అడ్డంగావున్న రాయి తొలగించబోయేటప్పుడు కొంత అభ్యంతరం వ్యక్తం చేయబడింది. లాజరు అంతకు నాలుగు రోజుల ముందే చనిపోవడంతో సమాధిని తెరిచినప్పుడు తప్పక వాసన వస్తుందని ఆయన సహోదరి భావించింది.​—⁠యోహాను 11:​38-44.

యేసుక్రీస్తు దేహం కుళ్ళిపోకుండా భద్రపరచబడిందా? దానికి సువార్త వృత్తాంతాలు మద్దతునివ్వడం లేదు. ఆ కాలంలో శవాన్ని పాతిపెట్టేముందు దానికి సుగంధ ద్రవ్యములు పరిమళ తైలములు పూయడం యూదుల మర్యాద. ఉదాహరణకు యేసు శరీరానికి అలా పూయడానికిగాను నీకొదేము పెద్ద మొత్తంలో పరిమళ ద్రవ్యాలు తీసుకువచ్చాడు. (యోహాను 19:​38-42) ఎందుకంత ఎక్కువగా తెచ్చాడు? యేసు మీద హృదయపూర్వకమైన ప్రేమ గౌరవం బహుశ ఆయన అంత మొత్తంలో తీసుకువచ్చేందుకు పురికొల్పివుండవచ్చు. ఆ పరిమళ ద్రవ్యాలు ఆయన దేహం కుళ్ళిపోకుండా భద్రపరిచే ఉద్దేశంతో ఉపయోగించబడ్డాయని మనం అనుకోనక్కరలేదు.

మృతదేహాలను కుళ్ళిపోకుండా భద్రపరిచే ప్రక్రియకు క్రైస్తవులు అభ్యంతరం తెలపాలా? వాస్తవిక దృక్కోణంలో చూస్తే అలాంటి ప్రక్రియ అనివార్యమైనది జరగకుండా కొంతకాలం ఆపడం మాత్రమే అవుతుంది. మనం మంటి నుండే వచ్చాము, మరణించినప్పుడు తిరిగి మంటికే చేరతాము. (ఆదికాండము 3:​19) కానీ, మరణించినప్పటి నుండి అంత్యక్రియలు జరిగేందుకు ఎంత సమయం పడుతుంది? చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు స్నేహితులు చాలా దూరం నుండి వస్తున్నట్లయితే, మృతదేహాన్ని చివరిసారిగా చూడాలని కోరుకుంటున్నట్లయితే, కొంతమేరకు శరీరం కుళ్ళిపోకుండా భద్రపరిచేందుకు ప్రయత్నించాలనడంలో సందేహం లేదు.

కాబట్టి లేఖనాధారంగా చూస్తే, స్థానిక చట్టాల ఆవశ్యకతల మూలంగా శరీరాన్ని భద్రపరచాల్సివుంటే లేదా కుటుంబ సభ్యులు అలా జరగాలని కోరుకుంటే అందులో అంతగా చింతించాల్సిన అవసరం లేదు. మృతులు “ఏమియు ఎరుగరు.” (ప్రసంగి 9:⁠5) వారు దేవుని జ్ఞాపకశక్తిలో ఉంటే వారు ఆయన వాగ్దానం చేసిన నూతన లోకంలో పునరుత్థానం పొందుతారు.​—⁠యోబు 14:​13-15; అపొస్తలుల కార్యములు 24:​14, 15; 2 పేతురు 3:⁠13.

[31వ పేజీలోని బాక్సు/చిత్రం]

మృతదేహాన్ని భద్రపరచే ప్రయత్నాలు​—⁠అప్పుడు, ఇప్పుడు

ప్రాచీన ఐగుప్తులో మృతదేహానికి లభించే ప్రక్రియ చనిపోయిన వ్యక్తి కుటుంబ హోదాపై ఆధారపడివుంటుంది. ధనవంతులైన వారు బహుశ ఈ క్రింది ప్రక్రియను ఎంపిక చేసుకునివుంటారు:

ముక్కు ద్వారా ఒక లోహపు ఉపకరణంతో మెదడుని బయటికి లాగుతారు. ఆ తర్వాత కపాలానికి తగిన మందులు పట్టిస్తారు. ప్రక్రియలో తర్వాతి భాగం, గుండె మూత్రపిండాలు మినహాయించి మిగతా అంతర్గత శరీర భాగాలు తీసేస్తారు. కడుపులోపలి భాగాలను తీసేందుకు శరీరాన్ని కోయాలి, కానీ అది పాపముగా దృష్టించబడుతుంది. ఈ వివాదాన్ని తప్పించుకునేందుకుగాను, ఐగుప్తులో మృతదేహాలను భద్రపరిచేవాళ్ళు శరీరంపై కోతపెట్టేందుకు కోతగాడు అనే ఒక వ్యక్తిని నియమించారు. పాపమని చెప్పబడే ఆ పని చేసినందుకు తనపై కురియబోయే శాపాలు రాళ్ళవర్షము తప్పించుకోవడానికి పని అయిపోయిన వెంటనే వాడు పారిపోయేవాడు.

ఉదర కుహరం ఖాళీ అయిన తర్వాత శుభ్రంగా కడుగుతారు. చరిత్రకారుడైన హెరొడోటస్‌ ఇలా వ్రాశాడు: “వారు ఉదర కుహరాన్ని శుద్ధమైన నలగగొట్టిన బోళము, నిమ్మగడ్డి నూనెలతోను, సాంబ్రాణి తప్ప ప్రతి విధమైన పరిమళాలతోను నింపి మళ్ళీ కుట్టేసేవారు.”

ఆ తర్వాత, 70 రోజులపాటు నేట్రన్‌లో నానబెట్టడం ద్వారా మృతదేహంలోని నీటిని తీసివేసేవారు. తర్వాత, శవాన్ని కడిగి నైపుణ్యంగా నారబట్టల్లో చుట్టిపెట్టేవారు. నారబట్టలకు చెట్ల జిగురును లేదా వేరే ఏదైనా జిగురులాంటి పదార్థాన్ని పూసి, ఆ మమ్మీని ఆడంబరంగా అలంకరించిన మానవాకారంలోని చెక్క పెట్టెలో ఉంచేవారు.

నేడు మృతదేహం కుళ్ళిపోకుండా భద్రపరిచే ప్రక్రియ కొన్ని గంటల్లో పూర్తవుతుంది. సాధారణంగా, కుళ్ళిపోకుండా భద్రపరిచే ద్రవాన్ని సరైన మోతాదులో రక్తనాళాల ద్వారా శరీరంలోకి పంపిస్తారు, అలాగే కడుపులోను ఛాతీలోను కూడా ఉంచుతారు. సంవత్సరాలుగా వేర్వేరు ద్రవాలు తయారుచేయబడి ఉపయోగించబడ్డాయి. అయితే, చవకగాను సురక్షితంగాను ఉండేందుకు చాలా తరచుగా ఉపయోగించే ద్రవం ఫార్మాల్డిహైడ్‌.

[చిత్రం]

రాజైన టుటన్‌ఖమెన్‌ యొక్క బంగారు శవపేటిక