కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిబ్బరమైన హృదయముతో యెహోవాను సేవిస్తుండండి

నిబ్బరమైన హృదయముతో యెహోవాను సేవిస్తుండండి

నిబ్బరమైన హృదయముతో యెహోవాను సేవిస్తుండండి

“నా హృదయము నిబ్బరముగా నున్నది దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది.”​—⁠కీర్తన 57:⁠7.

1. దావీదుకున్నటువంటి దృఢ నమ్మకముతోనే మనం కూడా ఎందుకు ఉండవచ్చు?

మనం తన సమర్పిత సేవకులవలె యథార్థ క్రైస్తవత్వాన్ని అంటిపెట్టుకొని ఉండగలిగేలా, యెహోవా మనల్ని క్రైస్తవ విశ్వాసంలో స్థిరపరుస్తాడు. (రోమీయులు 14:⁠4) దాన్నిబట్టి, మనం కూడా “దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది” అని పాడడానికి కదిలింపబడిన కీర్తనకర్త దావీదుకు ఉన్నటువంటి గట్టి నమ్మకముతో ఉండవచ్చు. (కీర్తన 108:⁠1) మన హృదయము నిబ్బరముగా ఉంటే, మనం దేవునికి చేసుకున్న సమర్పణకు అనుగుణంగా జీవించడానికి ప్రేరేపించబడతాము. నడిపింపు కోసం, బలం కోసం ఆయనవైపు చూడడం ద్వారా, ‘ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులమై’ ఉండి మనం నిశ్చలమైనవారిమనీ, స్థిరనిర్ణయము, నమ్మకముగల నిజాయితీపరులమనీ రుజువుపరచుకోగలుగుతాము.​—⁠1 కొరింథీయులు 15:​58.

2, 3. పౌలు 1 కొరింథీయులు 16:​13 లో ప్రబోధించిన మాటలు ఏమి సూచిస్తున్నాయి?

2 ప్రాచీన కొరింథులోని యేసు అనుచరులకు అపొస్తలుడైన పౌలు, “మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారై యుండుడి, బలవంతులై యుండుడి” అని ప్రబోధించాడు, అయితే ఆ మాటలు నేటి క్రైస్తవులకూ వర్తిస్తాయనడంలో సందేహం లేదు. (1 కొరింథీయులు 16:​13) గ్రీకు భాషలో వాటిలోని ప్రతి ఆదేశము వర్తమానకాలంలో ఉంది, ఆ విధంగా అవి నిర్విరామమైన చర్యను ప్రేరేపిస్తున్నాయి. ఈ హెచ్చరిక ఏమని సూచిస్తోంది?

3 అపవాదిని ఎదిరించి దేవునికి లోబడి ఉండడం ద్వారా మనం ఆధ్యాత్మికంగా ‘మెలకువగా ఉండ’గలము. (యాకోబు 4:​7, 8) యెహోవామీద ఆధారపడడం ద్వారా మనం ఐక్యంగా ఉండి, మన క్రైస్తవ ‘విశ్వాసమందు నిలుకడగా ఉండ’గలుగుతాము. మన మధ్య ఉన్న అనేకమంది స్త్రీలతోపాటు, మనం రాజ్య ప్రచారకులుగా దేవుణ్ణి ధైర్యంగా సేవించడం ద్వారా ‘పౌరుషముగలవారిగా’ ఉంటాము. (కీర్తన 68:​11) మన పరలోకపు తండ్రి చిత్తం చేయడానికి మనకు కావలసిన బలం కోసం, మనం ఆయన వైపు నిర్విరామంగా చూడడం ద్వారా ‘బలవంతులం’ అవుతాము.​—⁠ఫిలిప్పీయులు 4:​13.

4. క్రైస్తవులుగా బాప్తిస్మం పొందడానికి మనల్ని ఏమి నడిపించింది?

4 మనం యెహోవాకు పూర్తిగా సమర్పించుకొని దానికి సూచనగా నీటి బాప్తిస్మం పొందినప్పుడు మనం సత్యాన్ని అంగీకరిస్తున్నామని చూపించాము. కాని మనల్ని బాప్తిస్మానికి నడిపించింది ఏమిటి? మొదట మనం దేవుని వాక్యంలోని ఖచ్చితమైన జ్ఞానమును పొందాము. (యోహాను 17:⁠3) అది మనలో విశ్వాసం పుట్టించి, గతంలోని మన చెడు కార్యాలనుబట్టి పశ్చాత్తాపపడేలా చేసింది. (అపొస్తలుల కార్యములు 3:​20; హెబ్రీయులు 11:⁠6) ఆ తర్వాత పరివర్తన చెందాము, దేవుని చిత్తానికి అనుగుణమైన జీవితాన్ని కొనసాగించడానికి మనం చెడు అలవాట్లను వదిలేశాము. (రోమీయులు 12:⁠2; ఎఫెసీయులు 4:​23, 24) దీని తర్వాత, ప్రార్థనలో యెహోవాకు పూర్ణహృదయంతో సమర్పించుకున్నాము. (మత్తయి 16:​24; 1 పేతురు 2:​21) మనం నిర్మలమైన మనస్సాక్షి కోసం దేవుణ్ణి వేడుకొని, ఆయనకు మనం చేసుకున్న సమర్పణను సూచించడానికి బాప్తిస్మం పొందాము. (1 పేతురు 3:​21) ఈ మెట్లను మనసులో ఉంచుకోవడం, మన సమర్పణకు అనుగుణంగా జీవించడానికి నిర్విరామంగా ప్రయత్నించాల్సిన అవసరతపై మనస్సు పెట్టేందుకు, నిబ్బరమైన హృదయంతో యెహోవాను నిరంతరం సేవించేందుకు మనకు సహాయపడుతుంది.

ఖచ్చితమైన జ్ఞానం కోసం నిర్విరామంగా వెదకండి

5. లేఖనాధారిత పరిజ్ఞానమును మనం నిరంతరం ఎందుకు వృద్ధి చేసుకోవాలి?

5 దేవునికి చేసుకున్న మన సమర్పణకు అనుగుణంగా జీవించడానికి, విశ్వాసాన్ని బలపరిచే లేఖనాధారిత పరిజ్ఞానాన్ని మనం నిరంతరం వృద్ధి చేసుకోవాలి. మనం మొదటిసారిగా దేవుని సత్యం తెలుసుకున్నప్పుడు, ఆధ్యాత్మిక ఆహారం తీసుకోవడం మనకు ఎంత ఆనందాన్నిచ్చిందో కదా! (మత్తయి 24:​45-47) ఆ “భోజనాలు” రుచికరంగా ఉండేవి, అవి మనకు ఆధ్యాత్మికంగా మంచి పోషణనిచ్చాయి. మనం యెహోవా సమర్పిత సేవకుల్లా నిబ్బరమైన హృదయాన్ని కాపాడుకోవాలంటే, నిరంతరం పుష్టికరమైన ఆధ్యాత్మిక ఆహారం తీసుకోవడం చాలా అవసరం,

6. బైబిలు సత్యంపట్ల హృదయపూర్వక కృతజ్ఞతను పెంచుకోవడానికి మీకు ఎలా సహాయం చేయబడింది?

6 లేఖనాధారిత పరిజ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి కృషి చేయాల్సిన అవసరముంది. అది దాచబడిన ధనం కోసం వెదకడంలాంటిది, దానికి ఎంతో కృషి అవసరం. కానీ, “దేవుని గూర్చిన విజ్ఞానము” పొందడం ఎంత ప్రతిఫలదాయకం! (సామెతలు 2:1-6) రాజ్యాన్ని ప్రకటించే వ్యక్తి మీతో మొదటిసారి బైబిలు అధ్యయనం చేసినప్పుడు, అతను లేక ఆమె నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకమును ఉపయోగించి ఉండవచ్చు. ప్రతి అధ్యాయమును చర్చించడానికి చాలా సమయాన్ని తీసుకొని ఉండవచ్చు, బహుశా ఒకటికంటే ఎక్కువ భాగాలుగా చేసి చర్చించి ఉండవచ్చు. అందులో పేర్కొన్న లేఖనాలను చదివి చర్చించినప్పుడు మీరు ప్రయోజనం పొందారు. ఏదైనా అంశం అర్థం చేసుకోవడానికి కష్టమైనప్పుడు అది మీకు వివరించబడింది. మీతో బైబిలు అధ్యయనం నిర్వహించినవారు బాగా సిద్ధపడి, దేవుని ఆత్మ కోసం ప్రార్థించి, సత్యంపట్ల హృదయపూర్వక కృతజ్ఞతను పెంచుకొనేందుకు మీకు సహాయపడ్డారు.

7. దేవుని సత్యాన్ని ఇతరులకు బోధించడానికి ఒక వ్యక్తిని యోగ్యుడిగా చేసేదేమిటి?

7 ఈ కృషి సముచితమైనదే, అందుకే పౌలు, “వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను” అని వ్రాశాడు. (గలతీయులు 6:⁠6) ఇక్కడ దేవుని వాక్యపు బోధలు ‘ఉపదేశము పొందువాడి’ మనస్సు, హృదయాలపై ముద్రించబడ్డాయి అని గ్రీకు మూలపాఠం సూచిస్తోంది. మీరు అలా ఉపదేశం పొందడం, ఇతరులకు బోధించేలా మిమ్మల్ని యోగ్యులను చేస్తుంది. (అపొస్తలుల కార్యములు 18:​25) మీ సమర్పణకు తగిన విధంగా ఉండాలంటే, నిరంతరం దేవుని వాక్యం అధ్యయనం చేయడం ద్వారా ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని, స్థిరత్వాన్ని కాపాడుకోవాలి.​—⁠1 తిమోతి 4:​13; తీతు 1:​13; 2:⁠2.

మీ పశ్చాత్తాపాన్ని, పరివర్తనను గుర్తుంచుకోండి

8. దైవిక ప్రవర్తనను ఎలా కొనసాగించగలం?

8 మీరు సత్యం తెలుసుకుని, పశ్చాత్తాపపడి, ఆ తర్వాత యేసు విమోచన క్రయధనబలిపై విశ్వాసం ఆధారంగా దేవుని క్షమాపణను పొందిన అనుభూతి కలిగినప్పుడు మీరనుభవించిన ఉపశమనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోగలరా? (కీర్తన 32:​1-5; రోమీయులు 5:⁠8; 1 పేతురు 3:​18) మీరు నిశ్చయంగా మళ్ళీ పాపభరితమైన జీవితంవైపు తిరగడానికి ఇష్టపడరు. (2 పేతురు 2:​20-22) మిగతా విషయాలతో పాటు, యెహోవాకు క్రమంగా చేసే ప్రార్థన మీరు దైవిక ప్రవర్తనలో కొనసాగడానికి, మీ సమర్పణకు అనుగుణంగా జీవించడానికి, యెహోవాను నమ్మకంగా సేవించడానికి మీకు సహాయపడుతుంది.​—⁠2 పేతురు 3:​11, 12.

9. పాపభరిత అలవాట్లను వదిలేసిన తర్వాత, మనం ఏ మార్గమును అనుసరించాలి?

9 పాపభరిత అలవాట్లను వదిలేసి పరివర్తన చెంది, మీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోవడానికి దేవుని సహాయం కోసం నిరంతరం వెదకండి. నిజానికి, సరైనదికాని మార్గంలో వెళ్తున్న మీరు, నమ్మదగిన మ్యాపును చూసి సరైన మార్గంలో ప్రయాణించడం ఆరంభించారు. ఇప్పుడు మీ త్రోవ తప్పిపోకండి. దేవుని నడిపింపుపై ఆధారపడుతూ, జీవమార్గంలోనే నిలిచి ఉండాలని నిశ్చయించుకోండి.​—⁠యెషయా 30:​20, 21; మత్తయి 7:​13, 14.

మీ సమర్పణను, బాప్తిస్మమును ఎన్నటికీ మరచిపోకండి

10. దేవునికి మనం చేసుకున్న సమర్పణ విషయంలో ఏ అంశాలను మనం మనస్సులో ఉంచుకోవాలి?

10 మీరు నిత్యం యథార్థంగా సేవ చేయాలనే ఉద్దేశంతో, యెహోవాకు ప్రార్థనలో సమర్పించుకున్నారన్న విషయం గుర్తుంచుకోండి. (యూదా 20, 21) సమర్పణ అంటే ఒక పవిత్రమైన ఉద్దేశం కోసం ప్రత్యేకపరచుకోవడము లేదా వేరుచేసుకోవడము. (లేవీయకాండము 15:​31; 22:⁠2) మీ సమర్పణ తాత్కాలిక ఒప్పందమూ కాదు, మనుష్యులతో చేసుకున్న నిబద్ధతా కాదు. అది విశ్వాధిపతికి చేసుకున్న శాశ్వతమైన సమర్పణ, దానికి అనుగుణంగా జీవించాలంటే జీవితాంతం దేవునికి యథార్థంగా ఉండాలి. అవును, “మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమై యున్నాము.” (రోమీయులు 14:​7, 8) ఆయన చిత్తానికి లోబడి ఉండడంపై, నిబ్బరమైన హృదయంతో నిర్విరామంగా ఆయనను సేవించడంపై మన సంతోషము ఆధారపడివుంటుంది.

11. మీ బాప్తిస్మాన్ని, దాని ప్రాముఖ్యతను మీరెందుకు గుర్తుంచుకోవాలి?

11 మీరు పూర్ణహృదయంతో దేవునికి చేసుకున్న సమర్పణకు సూచనగా పొందిన బాప్తిస్మమును ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అది బలవంతపు బాప్తిస్మం కాదు, ఎందుకంటే మీరు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నారు. మీరు ఇప్పుడు, మీ శేష జీవితమంతా దేవుని చిత్తానికి అనుగుణంగా మీ చిత్తాన్ని అన్వయించుకోవడానికి నిశ్చయించుకున్నారా? మీరు నిర్మలమైన మనస్సాక్షి కోసం దేవుణ్ణి వేడుకొని, ఆయనకు మీరు చేసుకున్న సమర్పణకు సూచనగా బాప్తిస్మం పొందారు. మీ సమర్పణకు అనుగుణంగా జీవిస్తూ ఆ నిర్మలమైన మనస్సాక్షిని కాపాడుకోండి, అప్పుడు యెహోవా గొప్ప ఆశీర్వాదాలను మీరు పొందుతారు.​—⁠సామెతలు 10:​22.

మీ చిత్తానికి ఒక పాత్ర ఉంది

12, 13. మన సొంత చిత్తానికి సమర్పణ, బాప్తిస్మాలతో ఎలాంటి సంబంధముంది?

12 వాస్తవానికి, సమర్పణ మరియు బాప్తిస్మం, భూవ్యాప్తంగా లక్షలాదిమందికి గొప్ప ఆశీర్వాదాలను తెచ్చాయి. మనం దేవునికి చేసుకున్న సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా సూచించినప్పుడు, మన పూర్వపు జీవన విధానం విషయంలో మరణిస్తాము కానీ మన చిత్తం విషయంలో కాదు. సరైన జ్ఞానం పొందిన విశ్వాసులవలె, మన ఇష్టపూర్వకంగానే ప్రార్థన ద్వారా దేవునికి సమర్పించుకొని బాప్తిస్మం పొందాము. మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని బాప్తిస్మం పొందాలంటే, ముందుగా మనం దేవుని చిత్తమేమిటో ధ్రువీకరించుకొన్న తర్వాత ఆ చిత్తాన్ని చేయడానికి ఇష్టపూర్వకంగా ఎంపిక చేసుకోవాలి. (ఎఫెసీయులు 5:​17) ఆ విధంగా మనం యేసును అనుకరిస్తాము, ఆయన తన సొంత చిత్తంతోనే వడ్రంగి పనిని వదిలేసి, బాప్తిస్మం పొంది తన పరలోకపు తండ్రి చిత్తం చేయడానికి తనను తాను పూర్తిగా అంకితం చేసుకున్నాడు.​—⁠కీర్తన 40:​7, 8; యోహాను 6:​38-40.

13 యెహోవా దేవుడు తన కుమారుణ్ణి ‘శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయడానికి’ సంకల్పించాడు. కాబట్టి యేసు తన చిత్తానుసారంగానే అలాంటి శ్రమలను నమ్మకంగా సహించాడు. అందుకే ఆయన, “మహా రోదనముతోను కన్నీళ్లతోను, . . . ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను.” (హెబ్రీయులు 2:​10, 18; 5:​7, 8) మనం దేవునిపట్ల అలాంటి భయభక్తులనే చూపిస్తే, మనం కూడా తప్పక ‘అంగీకరించబడతాము,’ యెహోవా తన సమర్పిత సాక్షులుగా మనల్ని నిబ్బరము గలవారిగా చేస్తాడని మనం నిశ్చయతతో ఉండవచ్చు.​—⁠యెషయా 43:​10.

మీరు నిబ్బరమైన హృదయాన్ని కాపాడుకోవచ్చు

14. మనం ప్రతిరోజు బైబిలు ఎందుకు చదవాలి?

14 నిబ్బరమైన హృదయాన్ని కాపాడుకొంటూ, దేవునికి చేసుకున్న మీ అర్పణకు అనుగుణంగా జీవించడానికి మీకు ఏమి సహాయపడుతుంది? నిత్యం వృద్ధిచెందే దేవుని వాక్యం గురించిన పరిజ్ఞానం పొందే ఉద్దేశంతో ప్రతిరోజూ బైబిలు చదవండి. అలా చేయమని మనల్ని ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ ఎల్లవేళలా ఉద్బోధిస్తున్నాడు. మనం మన సమర్పణకు అనుగుణంగా జీవించడానికి దేవుని సత్యంలో ఎల్లప్పుడూ నడుస్తుండాలి కాబట్టే మనకు అలాంటి సలహా ఇవ్వబడింది. యెహోవా సంస్థ ఉద్దేశపూర్వకంగా తప్పుడు బోధలను ధ్రువపరిచేదే అయితే, అది యెహోవాసాక్షులకు, వారు ప్రకటిస్తున్నవారికి బైబిలు చదవమని సలహా ఇచ్చేదే కాదు.

15. (ఎ) నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏమి ఆలోచించాలి? (బి) ఒక క్రైస్తవుని జీవితంలో ఉద్యోగము కేవలం ద్వితీయ స్థానంలోనే ఉంటుందని ఎందుకనవచ్చు?

15 నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అవి మీరు యెహోవాకు చేసుకున్న సమర్పణను నెరవేర్చడంపై ఎలాంటి ప్రభావం చూపించగలవోనని ఎల్లప్పుడూ ఆలోచించండి. ఇది మీ ఉద్యోగ విషయంలో కూడా వర్తిస్తుండవచ్చు. మీ ఉద్యోగం మీరు సత్యారాధనలో కొనసాగడానికి సహాయంగా ఉండేలా ప్రయత్నిస్తున్నారా? సాధారణంగా సమర్పిత క్రైస్తవులు నమ్మదగినవారు, దక్షతగలవారు అని ఉద్యోగ యజమానులకు తెలుసు, అంతేగాక యెహోవాసాక్షులు లోకంలో అగ్రగామిగా ఉండాలనే అత్యాశగలవారు కాదని అత్యంత లాభదాయకమైన స్థానాల కోసం వారు ఇతరులతో పోటీపడరని కూడా గమనించారు. ఎందుకంటే సాక్షుల లక్ష్యం, సంపదలను, కీర్తిని, ప్రతిష్టలను, లేక అధికారాన్ని సంపాదించడం కాదు. దేవునికి తాము చేసుకున్న సమర్పణకు అనుగుణంగా జీవించేవారికి అత్యంత ప్రాముఖ్యమైన విషయం, దేవుని చిత్తం చేయడమే. జీవితావసరాలను పొందేందుకు సహాయపడే ఉద్యోగం వారి జీవితాల్లో ప్రథమ స్థానాన్ని పొందదు గానీ అది కేవలం ద్వితీయ స్థానంలోనే ఉంటుంది. అపొస్తలుడైన పౌలులాగే, క్రైస్తవ పరిచర్యే వారి జీవితాల్లో ప్రథమ స్థానం వహిస్తుంది. (అపొస్తలుల కార్యములు 18:​3, 4; 2 థెస్సలొనీకయులు 3:​7, 8; 1 తిమోతి 5:⁠8) మీరు మీ జీవితంలో రాజ్యాసక్తులను మొదట ఉంచుతున్నారా?​—⁠మత్తయి 6:​25-33.

16. అధిక చింత మనం దేవునికి చేసుకున్న సమర్పణకు అనుగుణంగా జీవించడం కష్టమయ్యేలా చేస్తే మనం ఏమి చేయాలి?

16 కొందరు సత్యం తెలుసుకోకముందు పలువిధాల చింతల కారణంగా కృంగిపోయుండవచ్చు. కాని వాళ్ళు రాజ్య నిరీక్షణను పొందిన తర్వాత వారి హృదయం సంతోషము, కృతజ్ఞత, దేవునిపై ప్రేమతో ఎంత ఉప్పొంగిపోయిందో కదా! అప్పటినుండి వారు పొందిన ఆశీర్వాదాలను మననం చేసుకోవడం, యెహోవాకు తాము చేసుకున్న సమర్పణకు అనుగుణంగా జీవించడానికి వారికి సహాయం చేయగలదు. మరో ప్రక్కన, మొక్కలు ఫలాలనిచ్చే స్థితికి చేరకుండా ముళ్ళు వాటి ఎదుగుదలకు అడ్డుపడవచ్చు, అలాగే ఈ విధానంలోని జీవితంలో సర్వసాధారణంగా వచ్చే సమస్యలను గురించిన అధిక చింత “దేవుని వాక్యము”ను అణచివేసే ప్రమాదం తలెత్తితే ఎలా? (లూకా 8:​7, 11, 14; మత్తయి 13:​22; మార్కు 4:​18, 19) మీకుగానీ మీ కుటుంబానికిగానీ అలా జరగడం ఆరంభమైందని మీరు గ్రహిస్తే, మీ చింతలను యెహోవామీద వేసి, ప్రేమ కృతజ్ఞతలను అభివృద్ధి చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేయండి. మీరు మీ భారమును యెహోవామీద మోపితే, ఆయన మిమ్మల్ని ఆదుకొని, మీరు ఆయనను సంతోషంగా నిబ్బరమైన హృదయంతో నిరంతరం సేవించేందుకు కావలసిన బలమిస్తాడు.​—⁠కీర్తన 55:​22; ఫిలిప్పీయులు 4:​6, 7; ప్రకటన 2:⁠4.

17. తీవ్రమైన పరీక్షలను ఎలా ఎదుర్కోవచ్చు?

17 మీరు యెహోవా దేవునికి సమర్పించుకునేటప్పుడు ప్రార్థించినట్లే ఆయనకు క్రమంగా ప్రార్థన చేస్తుండండి. (కీర్తన 65:⁠2) మనసు చెడు చేసేందుకు పురికొల్పబడినప్పుడు లేక ఒక తీవ్రమైన పరీక్షకు గురైనప్పుడు దేవుని మార్గదర్శకం కోసం అర్థించి, ఆ మార్గంలో నడిచేందుకు కావలసిన సహాయాన్ని ఇవ్వమని వేడుకోండి. విశ్వాసం ఆవశ్యకమని మనస్సులో ఉంచుకోండి, ఎందుకంటే శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: ‘మీలో ఎవనికైనను [ఏదైనా ఒక శ్రమను సహించడానికి కావలసిన] జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు.’ (యాకోబు 1:​5-8) ఏదైనా ఒక పరీక్ష కృంగదీసేదిగా ఉంటే, మనం ఈ విషయంలో నిశ్చయతతో ఉండవచ్చు: “సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.”​—⁠1 కొరింథీయులు 10:​13.

18. నిగూఢమైన ఒక గంభీరమైన పాపము దేవుని సమర్పణకు అనుగుణంగా జీవించాలనే మన నిర్ణయాన్ని బలహీనపరుస్తుంటే మనం ఏమి చేయవచ్చు?

18 రహస్యంగా చేసిన ఒక గంభీరమైన పాపము మీ మనస్సాక్షిని పీడిస్తూ, దేవునికి చేసుకున్న సమర్పణకు అనుగుణంగా జీవించాలనే మీ నిర్ణయాన్ని బలహీనపరుస్తుంటే ఎలా? మీరు పశ్చాత్తాపపడితే, “విరిగి నలిగిన హృదయమును” యెహోవా ‘అలక్ష్యము చేయడు’ అని తెలుసుకొని మీరు ఊరట పొందవచ్చు. (కీర్తన 51:​17) ప్రేమపూర్వకమైన క్రైస్తవ పెద్దల సహాయం తీసుకోండి, యెహోవాను అనుకరిస్తూ, మీ పరలోకపు తండ్రితో సత్సంబంధాన్ని పునఃస్థాపించుకోవాలనే మీ కోరికను వాళ్ళు అలక్ష్యం చేయరు. (కీర్తన 103:​10-14; యాకోబు 5:​13-15) అప్పుడు పునరుజ్జీవింపబడిన ఆధ్యాత్మిక శక్తితో, నిబ్బరమైన హృదయముతో, మీరు మీ పాదములకు మార్గములను సరాళము చేసుకోగలుగుతారు, దేవునికి చేసుకున్న సమర్పణకు అనుగుణంగా జీవించడం సాధ్యమేనని తెలుసుకోగలుగుతారు.​—⁠హెబ్రీయులు 12:​12, 13.

నిబ్బరమైన హృదయముతో సేవిస్తుండండి

19, 20. మనం నిరంతరం మన సమర్పణకు అనుగుణంగా జీవించడం ఎందుకంత ప్రాముఖ్యం?

19 ఈ అపాయకరమైన కాలాల్లో, మన సమర్పణకు అనుగుణంగా జీవించడానికి, యెహోవాను నిబ్బరమైన హృదయముతో ఎల్లప్పడూ సేవించడానికి మనం ఎంతో కృషి చేయాలి. యేసు ఇలా అన్నాడు: “అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.” (మత్తయి 24:​13) మనం “అంత్యదినములలో” జీవిస్తున్నాము కాబట్టి, అంతం ఎప్పుడైనా రావచ్చు. (2 తిమోతి 3:⁠1) అంతేగాక, మనం రేపు జీవించి ఉంటామని మనలో ఎవ్వరూ నిశ్చయత కలిగి ఉండలేరు. (యాకోబు 4:​13, 14) కాబట్టి మనం నేడే మన సమర్పణకు అనుగుణంగా జీవించడం ఆవశ్యకం!

20 అపొస్తలుడైన పేతురు తన రెండవ పత్రికలో ఈ విషయాన్ని నొక్కి చెప్పాడు. భక్తిహీనులు జలప్రళయంలో నశించిపోయినట్లే, ఆలంకారిక భూమి, లేక దుష్ట మానవ సమాజం కూడా “ప్రభువు దినమున” నాశనమవుతుందని ఆయన చూపించాడు. అందుకే పేతురు ఇలా అన్నాడు: “మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను!” ఆయన వారిని ఇంకా ఇలా ఉద్బోధించాడు: ‘ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు [అబద్ధ బోధకులు, దైవభక్తిలేని వ్యక్తులచే] తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి.’ (2 పేతురు 3:​5-17) బాప్తిస్మం పొందిన ఒక వ్యక్తి గనుక దారి తప్పిపోయి, నిబ్బరమైన హృదయాన్ని కాపాడుకోలేక తన జీవితాన్ని కోల్పోవడం ఎంత విషాదకరమో కదా!

21, 22. కీర్తన 57:7 లోని మాటలు దావీదు విషయంలోను, నిజ క్రైస్తవుల విషయంలోను ఎలా నిజమయ్యాయి?

21 సంతోషకరమైన మీ బాప్తిస్మ దినమును మనస్సులో పెట్టుకొని, మీ మాటలు చర్యలు దేవుని హృదయాన్ని సంతోషపరిచేలా ఉండేందుకు, ఆయన సహాయాన్ని అర్థించినప్పుడు, దేవునికి చేసుకున్న మీ సమర్పణకు అనుగుణంగా జీవించాలనే మీ నిశ్చయం దృఢపరచబడుతుంది. (సామెతలు 27:​11) యెహోవా తన ప్రజలను ఎన్నడూ నిరుత్సాహపరచడు, కాబట్టి మనం తప్పకుండా ఆయనకు విశ్వసనీయంగా ఉండాలి. (కీర్తన 94:​14) ఆయన శత్రువుల యోచనలను భంగపరచి దావీదును రక్షించడంలో సానుభూతి జాలి చూపించాడు. దానికి కృతజ్ఞతగా దావీదు తన రక్షకునిమీదున్న ప్రేమ యొక్క స్థిరత్వాన్ని, నిశ్చలతను వ్యక్తం చేశాడు. ప్రగాఢమైన భావాలతో ఆయన ఇలా పాడాడు: “నా హృదయము నిబ్బరముగా నున్నది దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను.”​—⁠కీర్తన 57:⁠7.

22 నిజ క్రైస్తవులు దేవునికి చేసుకున్న తమ సమర్పణ విషయంలో, దావీదులాగే స్థిరంగా ఉన్నారు. వాళ్ళు నిబ్బరమైన హృదయములతో, తమ విడుదలను రక్షణను యెహోవాకే ఆపాదిస్తారు, వాళ్ళు ఆయనకు సంతోషంగా స్తుతిగీతాలు పాడతారు. మీ హృదయం నిబ్బరంగా ఉంటే, అది దేవునిమీదే ఆధారపడి ఉంటుంది, ఆయన సహాయంతో మీరు మీ సమర్పణను నెరవేర్చగలుగుతారు. అవును, “వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు” అని కీర్తనకర్త ఎవరి గురించైతే పాడాడో ఆ “నీతిమంతుల”లాగే మీరూ ఉండగలుగుతారు. (కీర్తన 112:​6, 7) దేవునిపై విశ్వాసంతో, ఆయనపై పూర్తిగా ఆధారపడితే, మీరు మీ సమర్పణకు అనుగుణంగా జీవిస్తూ, నిబ్బరమైన హృదయముతో యెహోవాను సేవించడంలో కొనసాగగలుగుతారు.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

• మనం బైబిలు గురించిన ఖచ్చితమైన పరిజ్ఞానమును నిరంతరం ఎందుకు వృద్ధి చేసుకోవాలి?

• మనం మన పశ్చాత్తాపాన్ని పరివర్తనను మనస్సులో ఎందుకు ఉంచుకోవాలి?

• మన సమర్పణను బాప్తిస్మమును జ్ఞాపకం ఉంచుకోవడంవల్ల మనమెలా ప్రయోజనం పొందుతాము?

• యెహోవాను నిబ్బరమైన హృదయముతో సేవిస్తూ ఉండడానికి మనకు ఏది సహాయపడుతుంది?

[అధ్యయన ప్రశ్నలు]

[18వ పేజీలోని చిత్రాలు]

క్రైస్తవ పరిచర్యను మన ముఖ్యమైన పనిగా చేసుకోవడం, యెహోవాను నిబ్బరమైన హృదయముతో సేవించడానికి సహాయపడుతుంది

[18వ పేజీలోని చిత్రం]

దేవుని వాక్యం ప్రతిరోజు చదవడం ద్వారా మీ ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారా?