కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నేను దేవునిసేవ చేయాలని ఆశించాను”

“నేను దేవునిసేవ చేయాలని ఆశించాను”

రా జ్య ప్ర చా ర కు ల ని వే ది క

“నేను దేవునిసేవ చేయాలని ఆశించాను”

“నాప్రజలారా, . . . దానిని విడిచి రండి.” సా.శ. మొదటి శతాబ్దంలో అపొస్తలుడైన యోహానుకు వినిపించిన దేవదూత మాటలవి. మన కాలంలో లక్షలాదిమంది యథార్థ హృదయులు దానికి ప్రతిస్పందించి, ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన “మహాబబులోను”ను విడిచి వచ్చారు. (ప్రకటన 18:​1-4) హయిటీకి చెందిన విల్నేర్‌ కూడా వారిలో ఉన్నాడు, ఆయన తన అనుభవాన్ని ఇలా చెబుతున్నాడు.

“నేను 1956 లో, హయిటీలోని సాంగ్‌ మార్క్‌ అనే చిన్న పట్టణంలో భక్తిగా ఉండే ఒక క్యాథలిక్‌ కుటుంబంలో జన్మించాను. హయిటీలోని సాంగ్‌ మీషెల్‌ డె లాటాలెలో ఉన్న సెమినరీకి హాజరు కావడానికి మా పట్టణంలోని మరో ఇద్దరితోపాటు నేను ఎంపిక చేయబడినప్పుడు మా కుటుంబం ఎంతగా ఆనందించి ఉంటుందో ఊహించండి. తర్వాత 1980 లో, మేము అదనపు తర్ఫీదు కోసం బెల్జియంలోని స్టవ్లోకు పంపించబడ్డాము. అక్కడ మేము ఒక క్యాథలిక్‌ విశ్వవిద్యాలయానికి కూడా హాజరయ్యాము.

“మొదట్లో నేను ప్రీస్టును కావాలని చాలా ఆతురతతో ఉండేవాడిని. ఒక రోజు భోజనాల గదిలో, మా గురించి శ్రద్ధ తీసుకునే ప్రీస్టు నాతో ఏదో చెప్పాలని, కొద్ది నిమిషాలు ఆగమన్నాడు. తాను నా పట్ల లైంగికంగా ఆకర్షితుడనయ్యానని అతడు నిర్మొహమాటంగా చెప్పడం నాకెంతటి దిగ్భ్రమ కలిగించి ఉంటుందో ఊహించండి! నేను అతని కోరికను నిరాకరించాను, కానీ పూర్తిగా నిరుత్సాహపడిపోయాను. నేను ఆ సంఘటన గురించి నా కుటుంబానికి వ్రాసి, వారికి ఇష్టం లేకపోయినా కొన్ని నెలల తర్వాత, ఆ సెమినరీని విడిచి వచ్చేశాను. నేను గ్రామంలో వేరే నివాసం ఏర్పరచుకుని, వేరే వృత్తిపరమైన చదువులు మొదలుపెట్టాను.

“నేను సాంగ్‌ మార్క్‌కు తిరిగి వచ్చినప్పుడు, క్యాథలిక్‌ చర్చి పట్ల నాకు నమ్మకం పోయింది. అయితే, నేను దేవుని సేవచేయాలని ఆశించాను, కానీ దాని కోసం ఏమి చేయాలో నాకు తెలియదు. నేను అడ్వెంటిస్ట్‌ చర్చికి, ఏబేనేజర్‌ చర్చికి, మార్మోన్‌ చర్చికి వెళ్లాను. నేను ఆధ్యాత్మికంగా మార్గనిర్దేశం లేని స్థితిలో ఉన్నాను.

“నేను బెల్జియంలో సెమినరీలో ఉన్నప్పుడు క్రాంపన్‌ బైబిల్‌ చదివేవాడినని నాకు గుర్తుకొచ్చింది. దానిలో, దేవునికి ఒక పేరు ఉందని నేను కనుగొన్నాను. కాబట్టి, ఆయన పేరును ఉపయోగిస్తూ, నిజమైన మతాన్ని కనుగొనడానికి నాకు సహాయం చేయమని హృదయపూర్వకంగా ప్రార్థించాను.

“ఆ తర్వాత కొద్ది కాలానికి, ఇద్దరు యెహోవాసాక్షులు మా ప్రాంతంలో నివసించడానికి వచ్చారు. వారు ప్రశాంతంగా, గౌరవనీయులుగా, మర్యాదపూర్వకంగా ఉండేవారు. వారి జీవన విధానం చూసి నేనెంతో ప్రభావితుడనయ్యాను. ఒకరోజు, ఆ ఇద్దరు సాక్షులలో ఒకరు క్రీస్తు మరణ జ్ఞాపకార్థ వార్షిక ఆచరణకు హాజరుకమ్మని నన్ను ఆహ్వానించారు. ఆ కూటములో ఎంతో ఆనందించిన నేను, సాక్షులతో క్రమంగా బైబిలు అధ్యయనం చేయడానికి అంగీకరించాను. దాదాపు ఆరు నెలల్లో, దేవునిసేవ చేయడానికి నేను సరైన మార్గాన్నే కనుగొన్నానని పూర్తి నమ్మకం కలిగింది. నేను నా జీవితాన్ని యెహోవాకు సమర్పించుకొని, 1988 నవంబరు 20న బాప్తిస్మం తీసుకున్నాను.”

కొంతకాలానికి, విల్నేర్‌ పూర్తికాల సేవను ప్రారంభించాడు. నేడు ఆయన సంఘ పెద్దగా సేవ చేస్తున్నాడు. ఆయనా, ఆయన భార్య తమ ఇద్దరు పిల్లలతో పాటు సంఘంలో ఆనందంగా సేవ చేస్తున్నారు.

[9వ పేజీలోని చిత్రం]

విల్నేర్‌ బైబిలు చదవడం ద్వారా, దేవుని నామము యెహోవా అని తెలుసుకున్నాడు