కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బాప్తిస్మం ఎందుకు పొందాలి?

బాప్తిస్మం ఎందుకు పొందాలి?

బాప్తిస్మం ఎందుకు పొందాలి?

‘మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేసి, వారికి బాప్తిస్మమివ్వండి.’​—⁠మత్తయి 28:​19.

1, 2. (ఎ) కొందరు ఎలాంటి పరిస్థితుల్లో బాప్తిస్మం పొందారు? (బి) బాప్తిస్మం గురించి ఎలాంటి ప్రశ్నలు తలెత్తాయి?

ఫ్రాంకిష్‌ రాజు షార్లమేన్‌, తాను జయించిన శాక్సన్లందరినీ బాప్తిస్మం పొందమని సా.శ. 775-77 లో బలవంతం చేశాడు. “వారు కేవలం ఒక నామమాత్రపు క్రైస్తవమతంలోకి మారేలా అతను బలవంతం చేశాడు” అని చరిత్రకారుడైన జాన్‌ లార్డ్‌ వ్రాశాడు. అదేవిధంగా, సా.శ. 987 లో గ్రీకు ఆర్థడాక్స్‌ యువరాణిని వివాహం చేసుకున్న తర్వాత, రష్యా పరిపాలకుడు ఒకటవ వ్లాడిమిర్‌ కూడా తన దేశ ప్రజలు “క్రైస్తవులు”గా మారాలని నిర్ణయించాడు. సామూహిక బాప్తిస్మాలు పొందమని ఆయన తన ప్రజలకు ఆజ్ఞాపించాడు​—⁠అవసరమైనప్పుడు కత్తితో బెదిరించాడు!

2 అలాంటి బాప్తిస్మాలు సరైనవేనా? వాటికి నిజమైన అర్థం ఉందా? బాప్తిస్మం ఎవ్వరైనా పొందవచ్చా?

బాప్తిస్మం​—⁠ఎలా పొందాలి?

3, 4. క్రైస్తవ బాప్తిస్మం ఇవ్వడానికి తలమీద నీళ్ళు చిలకరించడంగాని, పోయడంగాని ఎందుకు సరైనది కాదు?

3 షార్లమేన్‌, ఒకటవ వ్లాడిమిర్‌లు బాప్తిస్మం పొందమని ప్రజలను బలవంతం చేసినప్పుడు, ఆ పాలకులు దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించారు. వాస్తవానికి, తలమీద నీళ్ళు చిలకరించడము లేదా పోయడము ద్వారా ఇచ్చే బాప్తిస్మాల్లో, లేక నీటిలో పూర్తిగా ముంచి ఇచ్చే బాప్తిస్మాలైనా సరే అవి లేఖనాధార సత్యాన్ని నేర్పించకుండా ఇచ్చే బాప్తిస్మాలైతే వాటిలో ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.

4 నజరేయుడైన యేసు సా.శ. 29 లో బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గరకు వెళ్ళినప్పడు ఏమి జరిగిందో గమనించండి. యోహాను యొర్దాను నదిలో ప్రజలకు బాప్తిస్మం ఇస్తున్నాడు. వాళ్ళు బాప్తిస్మం పొందడానికి ఇష్టపూర్వకంగా ఆయన వద్దకు వచ్చారు. ఆయన ఊరకే వారిని నదిలో నిలబెట్టి వారి తలలపై కొన్ని నీళ్ళు పోయడం గాని చిలకరించడం గాని చేశాడా? యోహాను యేసుకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఏమి జరిగింది? “యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను” అని మత్తయి పేర్కొంటున్నాడు. (మత్తయి 3:​16) ఆయన నీటిలోపలికి వెళ్లొచ్చాడు, యొర్దాను నదిలో ముంచబడ్డాడు. అదే విధంగా భక్తిగల ఐతియొపీయుడైన నపుంసకుడు “నీళ్లున్న యొక చోటికి వచ్చినప్పుడు . . . నీళ్లలోనికి దిగి” బాప్తిస్మం పొందాడు. యేసు మరియు ఆయన శిష్యుల బాప్తిస్మాలు నీటిలో పూర్తిగా ముంచడం ద్వారా ఇవ్వబడ్డాయి కాబట్టి బాప్తిస్మానికి అలాంటి నీళ్ళున్న స్థలాలు అవసరమయ్యాయి.​—⁠అపొస్తలుల కార్యములు 8:​36.

5. తొలి క్రైస్తవులు ప్రజలకు ఎలా బాప్తిస్మం ఇచ్చేవారు?

5 “బాప్తిస్మమిచ్చు,” “బాప్తిస్మము” అంటూ అనువదించబడిన గ్రీకు పదాలు నీటిలో ముంచడాన్ని సూచిస్తున్నాయి. స్మిత్స్‌ బైబిల్‌ డిక్షనరీ ఇలా చెబుతోంది: “బాప్తిస్మము అంటే సరైన, అక్షరార్థ భావం మునక.” అందుకే కొన్ని బైబిలు అనువాదాలు ‘నీటి మునక యిచ్చే యోహాను’ అని అంటాయి. (మత్తయి 3:​1, అధస్సూచి, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఆగస్టస్‌ నేయాండర్‌ వ్రాసిన మొదటి మూడు శతాబ్దాల్లోని క్రైస్తవ మతం మరియు చర్చీల చరిత్ర (ఆంగ్లం) ఇలా చెబుతోంది: “బాప్తిస్మము ప్రాథమికంగా మునక ద్వారా నిర్వహించబడేది.” సుప్రసిద్ధమైన ఫ్రెంచి గ్రంథం 20వ శతాబ్దపు లరాస్‌ (పారిస్‌, 1928) ఇలా వ్యాఖ్యానిస్తోంది: “మొదటి క్రైస్తవులు నీళ్లు కనబడిన ప్రతిచోట మునక ద్వారా బాప్తిస్మం పొందారు.” న్యూ క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా (1967, సంపుటి II, 56వ పేజి) ఇలా పేర్కొంటోంది: “తొలి చర్చి మునక ద్వారానే బాప్తిస్మము ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.” అయితే నేడు, ఒక యెహోవాసాక్షిగా బాప్తిస్మం పొందాలంటే ఇష్టపూర్వకంగా ముందుకువచ్చి నీటిలో పూర్తిగా మునిగి పొందాలి.

బాప్తిస్మానికి ఒక క్రొత్త కారణం

6, 7. (ఎ) యోహాను ఏ ఉద్దేశంతో బాప్తిస్మాలు ఇచ్చాడు? (బి) యేసు అనుచరులిచ్చే బాప్తిస్మంలోని క్రొత్త విషయమేమిటి?

6 యోహాను ఇచ్చిన బాప్తిస్మాల ఉద్దేశానికి, యేసు అనుచరులు ఇచ్చిన బాప్తిస్మాల ఉద్దేశానికి తేడా ఉంది. (యోహాను 4:​1, 2) తాము ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చేసిన పాపాలకు తమ పశ్చాత్తాపాన్ని బహిరంగంగా తెలియజేయడానికి సూచనగా యోహాను ప్రజలకు బాప్తిస్మం ఇచ్చాడు. * (లూకా 3:⁠3) కాని యేసు అనుచరులు ఇచ్చే బాప్తిస్మంలో ఒక క్రొత్త విషయముంది. సా.శ. 33 పెంతెకొస్తు రోజున అపొస్తలుడైన పేతురు తన శ్రోతలకు ఇలా ఉద్బోధించాడు: “మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి.” (అపొస్తలుల కార్యములు 2:​37-41) ఆయన ఈ మాటలు యూదులకు, యూదామత ప్రవిష్టులకే చెబుతున్నప్పటికీ, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చేసిన పాపాలకు పశ్చాత్తాప సూచనగా తీసుకునే బాప్తిస్మం గురించి ఆయన మాట్లాడడం లేదు; అంతేగాక యేసు నామమున బాప్తిస్మం పొందడం పాపవిమోచనకు సూచన అని కూడా ఆయన అనలేదు.​—⁠అపొస్తలుల కార్యములు 2:​10.

7 ఆ సందర్భంలో, పేతురు ‘పరలోకరాజ్యపు తాళపుచెవులలో’ నుండి మొదటి దాన్ని ఉపయోగించాడు. ఏ ఉద్దేశం కోసం? తన శ్రోతలకు పరలోకరాజ్యములో ప్రవేశించే అవకాశముందని తెలియజేయాలన్నదే ఆయన ఉద్దేశం. (మత్తయి 16:​19) యూదులు యేసును మెస్సీయగా నిరాకరించారు కాబట్టి, వారు దేవుని క్షమాపణను కోరడము, ఆ క్షమాపణ పొందడానికి పశ్చాత్తాపపడడము, మెస్సీయను విశ్వసించడము అనేది ఒక క్రొత్త విషయమేగాక వారికది చాలా ప్రాముఖ్యమైన విషయం. వాళ్లు యేసుక్రీస్తు నామమున నీటి బాప్తిస్మం పొందడం ద్వారా అలాంటి విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించవచ్చు. ఆ విధంగా వాళ్లు క్రీస్తు ద్వారా దేవునికి చేసుకున్న తమ వ్యక్తిగత సమర్పణను సూచించేవారు. నేడు దేవుని ఆమోదం పొందాలని కోరుకునేవారందరూ, అలాంటి విశ్వాసంతోనే ఉండాలి, తమను తాము యెహోవా దేవునికి సమర్పించుకోవాలి, సర్వోన్నతుడైన దేవునికి సంపూర్ణ సమర్పణకు సూచనగా క్రైస్తవ బాప్తిస్మం పొందాలి.

ఖచ్చితమైన పరిజ్ఞానం అత్యావశ్యకం

8. క్రైస్తవ బాప్తిస్మం ఎందుకు ప్రతి ఒక్కరు పొందగలిగేది కాదు?

8 క్రైస్తవ బాప్తిస్మం పొందడానికి ప్రతి ఒక్కరూ అర్హులు కాదు. యేసు తన అనుచరులకు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.” (మత్తయి 28:​19, 20) ప్రజలు బాప్తిస్మము పొందడానికి ముందు, ‘యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని గైకొనడానికి బోధించబడాలి.’ అందువల్ల, దేవుని వాక్యములోని ఖచ్చితమైన పరిజ్ఞానం ఆధారంగా ఉండాల్సిన విశ్వాసము కొరవడిన బలవంతపు బాప్తిస్మాలు విలువలేనివేగాక, యేసు తన యథార్థ అనుచరులకు ఇచ్చిన ఆజ్ఞకు విరుద్ధమైనవి.​—⁠హెబ్రీయులు 11:⁠6.

9. ‘తండ్రి నామములోనికి’ బాప్తిస్మం పొందడం అంటే ఏమిటి?

9‘తండ్రి నామములోనికి’ బాప్తిస్మం పొందడం అంటే ఏమిటి? బాప్తిస్మం పొందే వ్యక్తి మన పరలోకపు తండ్రియొక్క స్థానమును, అధికారమును అంగీకరించాలి అని దాని అర్థం. ఆ విధంగా యెహోవా దేవుడు మన సృష్టికర్త, ‘సర్వలోకములో మహోన్నతుడు,’ విశ్వాధిపతి అని అంగీకరించబడతాడు.​—⁠కీర్తన 83:​18; యెషయా 40:​28; అపొస్తలుల కార్యములు 4:​24.

10. ‘కుమారుని నామములోనికి’ బాప్తిస్మం పొందడం అంటే ఏమిటి?

10‘కుమారుని నామములోనికి’ బాప్తిస్మం పొందడం అంటే, దేవుని ఏకైక కుమారునిగా యేసు స్థానమును, అధికారమును గుర్తించడం అని అర్థం. (1 యోహాను 4:⁠9) బాప్తిస్మానికి యోగ్యులైనవారు, దేవుడు “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము”ను ఎవరి ద్వారానైతే ఏర్పాటు చేశాడో ఆయనే యేసు అని అంగీకరిస్తారు. (మత్తయి 20:​28; 1 తిమోతి 2:​5, 6) బాప్తిస్మం పొందేవారు, దేవుడు తన కుమారుని ఘనపరచి ఆయనకిచ్చిన “ఉన్నతస్థానం”ను కూడా అంగీకరించాలి.​—⁠ఫిలిప్పీయులు 2:​8-11, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌; ప్రకటన 19:​16.

11. ‘పరిశుద్ధాత్మ నామములోనికి’ బాప్తిస్మం పొందడం దేన్ని సూచిస్తుంది?

11‘పరిశుద్ధాత్మ నామములోనికి’ బాప్తిస్మం దేన్ని సూచిస్తోంది? పరిశుద్ధాత్మ యెహోవా చురుకైన శక్తి, అది ఆయన సంకల్పానికి అనుగుణంగా విభిన్నమైన విధాలుగా ఉపయోగించబడుతుందని బాప్తిస్మం పొందేవారు గుర్తించాలని అది సూచిస్తోంది. (ఆదికాండము 1:⁠2; 2 సమూయేలు 23:​1, 2; 2 పేతురు 1:​21) బాప్తిస్మానికి యోగ్యులైనవారు, తాము “దేవుని మర్మములను” అర్థం చేసుకోవడానికి, రాజ్య ప్రకటనా పనిని కొనసాగించడానికి, “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము”ల సముదాయమైన ఆత్మఫలాన్ని కనబరచడానికి పరిశుద్ధాత్మ తమకు సహాయపడుతుందని గుర్తిస్తారు.​—⁠1 కొరింథీయులు 2:​10; గలతీయులు 5:​22, 23; యోవేలు 2:​28, 29.

పశ్చాత్తాపపడడం, పరివర్తన చెందడం యొక్క ప్రాముఖ్యత

12. క్రైస్తవ బాప్తిస్మం పశ్చాత్తాపంతో ఎలా ముడిపడి ఉంది?

12 బాప్తిస్మం దేవుడు అంగీకరించిన ఒక సూచన, పాపరహిత మానవుడైన యేసు విషయంలో తప్ప, దానికి పశ్చాత్తాపంతో సంబంధం ఉంది. మనం ఏదైనా ఒక పని చేసినందుకు లేదా చేయడంలో విఫలమైనందుకు పశ్చాత్తాపం చెందినప్పుడు చాలా గాఢంగా నొచ్చుకుంటాము, లేదా చింతిస్తాము. దేవుని ప్రీతిపరచాలనుకున్న మొదటి శతాబ్దపు యూదులు, క్రీస్తుకు విరుద్ధంగా తాము చేసిన పాపాల గురించి పశ్చాత్తాపపడ్డారు. (అపొస్తలుల కార్యములు 3:​11-19) కొరింథులోని కొందరు యూదేతర విశ్వాసులు, వ్యభిచారము, విగ్రహారాధన, దొంగతనము, మరితర గంభీరమైన పాపాల గురించి పశ్చాత్తాపపడ్డారు. వారు పశ్చాత్తాపపడినందువల్ల, యేసు రక్తంలో వాళ్ళు ‘కడుగబడ్డారు;’ ‘పరిశుద్ధపరచబడ్డారు’ లేక దేవుని సేవకోసం ప్రత్యేకించబడ్డారు; అంతేగాక వాళ్లు క్రీస్తు నామమున, దేవుని ఆత్మతో ‘నీతిమంతులుగా తీర్చబడ్డారు.’ (1 కొరింథీయులు 6:​9-11) నిర్మలమైన మనస్సాక్షిని పొందేందుకు, చేసిన పాపమును బట్టి కలిగే అపరాధ భావమునుండి దేవుడిచ్చే విముక్తిని పొందేందుకు పశ్చాత్తాపపడడం చాలా ముఖ్యమైన మెట్టు.​—⁠1 పేతురు 3:​21.

13. బాప్తిస్మానికి సంబంధించి, పరివర్తనలో ఏమి ఇమిడి ఉంది?

13 యెహోవాసాక్షులుగా మనం బాప్తిస్మం పొందడానికి ముందుగా పరివర్తన చెందాలి. పరివర్తన చెందడమంటే, క్రీస్తు యేసును అనుసరించాలని సంపూర్ణహృదయంతో నిర్ణయించుకున్నవారు స్వేచ్ఛగా తీసుకునే ఒక ఇష్టపూర్వకమైన చర్య. అలాంటి వ్యక్తులు గతంలో తాము అనుసరించిన తప్పుడు మార్గమును వదిలేసి, దేవుని దృష్టిలో సరైనదాన్నే చేయడానికి నిశ్చయించుకుంటారు. లేఖనాల్లో, పరివర్తనకు సంబంధించిన హీబ్రూ మరియు గ్రీకు క్రియాపదాలకు వెనక్కి తిరగడము, చుట్టూ తిరగడము అనే అర్థం ఉంది. ఈ చర్య తప్పుడు మార్గమును వదిలి దేవునివైపు తిరగడాన్ని సూచిస్తుంది. (1 రాజులు 8:​33, 34) పరివర్తన, ‘పశ్చాత్తాపాన్ని రుజువుపరచే క్రియలను’ కోరుతుంది. (అపొస్తలుల కార్యములు 26:​20, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) దానికి, మనం అబద్ధ ఆరాధనను వదిలేసి, దేవుని ఆజ్ఞలకు అనుగుణంగా నడుచుకొంటూ, యెహోవాను మాత్రమే అనితర భక్తితో సేవించడం అవసరం. (ద్వితీయోపదేశకాండము 30:​2, 8-10; 1 సమూయేలు 7:⁠3) పరివర్తన మన ఆలోచనల్లో, లక్ష్యాల్లో, వైఖరిలో మార్పులను తెస్తుంది. (యెహెజ్కేలు 18:​31) మనం భక్తిహీన లక్షణాల స్థానంలో నవీనస్వభావమును అలవరచుకోవడం ద్వారా దేవునివైపుకు ‘తిరుగుతాం.’​—⁠అపొస్తలుల కార్యములు 3:​20; ఎఫెసీయులు 4:​20-24; కొలొస్సయులు 3:​5-14.

పూర్ణహృదయముతో చేసే సమర్పణ ప్రాముఖ్యం

14. యేసు అనుచరుల బాప్తిస్మం దేన్ని సూచిస్తుంది?

14 యేసు అనుచరులిచ్చే బాప్తిస్మం పొందడానికి ముందు కూడా దేవునికి పూర్ణహృదయముతో తప్పకుండా సమర్పించుకోవాలి. ఈ సమర్పణ ఒక పవిత్రమైన ఉద్దేశం కోసం ప్రత్యేకపరచుకోవడాన్ని సూచిస్తుంది. ఈ మెట్టు చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి మనం యెహోవాను నిరంతరం అనితర భక్తితో సేవిస్తామన్న మన నిర్ణయాన్ని ఆయనకు ప్రార్థనలో వ్యక్తంచేయాలి. (ద్వితీయోపదేశకాండము 5:⁠9) మనం సమర్పించుకునేది సాక్షాత్తు దేవునికి, అంతేగాని ఒక లక్ష్యానికి లేక మానవునికి కాదు.

15. బాప్తిస్మ అభ్యర్థులు నీటిలో బాప్తిస్మం ఎందుకు పొందుతారు?

15 మనం క్రీస్తు ద్వారా దేవునికి సమర్పించుకునేటప్పుడు, లేఖనాల్లో పొందుపరచబడిన దేవుని చిత్తం ప్రకారం మన జీవితాన్ని గడుపుతామనే నిశ్చయాన్ని వ్యక్తం చేస్తాము. ఆ సమర్పణకు సూచనగా, బాప్తిస్మ అభ్యర్థులు నీటిలో బాప్తిస్మం పొందుతారు. యేసు కూడా దేవునికి తన సమర్పణను సూచిస్తూ, యొర్దాను నదిలో అలాగే బాప్తిస్మం పొందాడు. (మత్తయి 3:​13) చాలా ప్రాముఖ్యమైన ఆ సందర్భంలో యేసు ప్రార్థించాడన్న విషయం గమనార్హం.​—⁠లూకా 3:​21, 22.

16. ప్రజలు బాప్తిస్మం పొందుతున్నప్పుడు మనం మన సంతోషాన్ని తగిన రీతిలో ఎలా చూపించవచ్చు?

16 యేసు బాప్తిస్మం చాలా గంభీరమైనది, అయినా అది సంతోషకరమైన సంఘటన. నేటి క్రైస్తవ బాప్తిస్మం కూడా అలాంటిదే. దేవునికి తమ సమర్పణకు సూచనగా ప్రజలు బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు మనం మన సంతోషాన్ని చప్పట్ల ద్వారా, స్నేహపూర్వకమైన ప్రశంసల ద్వారా వ్యక్తం చేయవచ్చు. కానీ విశ్వాసాన్ని వ్యక్తంచేసే పవిత్రమైన ఈ సందర్భాన్నిబట్టి, కేకలువేయడం, ఈలలువేయడం, వంటి చర్యలు చేయకూడదు. మన సంతోషాన్ని గౌరవప్రదంగా తెలియజేయాలి.

17, 18. బాప్తిస్మం పొందాలనుకునే వ్యక్తులు అందుకు అర్హులా కాదా అని నిశ్చయించుకోవడానికి ఏది సహాయపడుతుంది?

17 శిశువులపై నీళ్ళు చిలకరించేవారిలా లేక లేఖనాలగురించి ఏమీ తెలియజేయకుండానే బలవంతంగా సామూహిక బాప్తిస్మాలు ఇచ్చేవారిలా, బాప్తిస్మం తీసుకొమ్మని యెహోవాసాక్షులు ఎవ్వరినీ ఎన్నడూ బలవంతపెట్టరు. వాస్తవానికి, వాళ్ళు ఆధ్యాత్మికంగా యోగ్యులుకానివారికి బాప్తిస్మం ఇవ్వరు. చివరికి ఎవరైనా బాప్తిస్మం పొందని సువార్తికుడిగా కావాలనుకున్నా, ఆ వ్యక్తి బైబిలు ప్రాథమిక బోధనలు అర్థంచేసుకున్నాడని, వాటికి అనుగుణంగా జీవిస్తున్నాడని, “యెహోవాసాక్షుల్లో ఒకరై ఉండాలని మీరు నిజంగా కోరుకుంటున్నారా?” వంటి ప్రశ్నకు దృఢమైన జవాబు ఇస్తాడని క్రైస్తవ పెద్దలు రూఢిపరచుకుంటారు.

18 కొన్ని సందర్భాల్లో తప్ప, రాజ్య ప్రకటనా పనిలో అర్థవంతంగా పాల్గొంటూ, బాప్తిస్మం పొందాలనే కోరికను వ్యక్తం చేసే వ్యక్తులతో క్రైస్తవ పెద్దలు మాట్లాడి, వారు యెహోవాకు సమర్పించుకున్న విశ్వాసులు అని, బాప్తిస్మం కోసం దేవుడు కోరేవాటికి వారు తగినవారని నిశ్చయించుకుంటారు. (అపొస్తలుల కార్యములు 4:⁠4; 18:⁠8) బైబిలు బోధలకు సంబంధించి 100 కన్నా ఎక్కువగా ఉండే ప్రశ్నలకు ఇచ్చే వ్యక్తిగత సమాధానాలు, జవాబిస్తున్న వ్యక్తికి, బాప్తిస్మం పొందడానికి కావలసిన లేఖనాధార అర్హతలు ఉన్నాయా లేదా అని నిశ్చయించుకోవడానికి పెద్దలకు సహాయపడతాయి. కొందరు అర్హులు కానప్పుడు క్రైస్తవ బాప్తిస్మానికి అనుమతించబడరు.

మిమ్మల్ని ఏదైనా ఆపుతోందా?

19. యోహాను 6:⁠44 దృష్ట్యా, ఎవరు యేసు తోటి వారసులైవుంటారు?

19 బలవంతంగా సామూహిక బాప్తిస్మం పొందినవారిలో చాలామందికి, మరణించిన తర్వాత వారు స్వర్గానికి వెళతారని చెప్పబడి ఉండవచ్చు. కాని యేసు తన అడుగుజాడల్లో నడుచుకునేవారిని సూచిస్తూ, “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు” అని అన్నాడు. (యోహాను 6:​44) యెహోవా, పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు తోటి వారసులైవుండే 1,44,000 మందిని ఆయనకు దగ్గరయ్యేలా చేశాడు. దేవుని ఏర్పాటులోని ఆ మహిమాన్వితమైన స్థానానికి అర్హులయ్యేలా, బలవంతపు బాప్తిస్మం ఎవ్వరినీ ఎన్నటికీ పరిశుద్ధపరచలేదు.​—⁠రోమీయులు 8:​14-17; 2 థెస్సలొనీకయులు 2:​13; ప్రకటన 14:⁠1.

20. ఇంకా బాప్తిస్మం పొందని కొంతమందికి ఏది సహాయపడుతుండవచ్చు?

20 ప్రత్యేకంగా 1930ల మధ్యకాలమునుండి, “మహాశ్రమలనుండి” రక్షించబడి భూమిపై నిరంతరం జీవించాలన్న నిరీక్షణగలవారు, యేసు యొక్క “వేరే గొఱ్ఱెల”లో బహుళసంఖ్యలో చేరారు. (ప్రకటన 7:​9, 14; యోహాను 10:​16) వారు బాప్తిస్మానికి అర్హులయ్యారు, ఎందుకంటే వారు తమ జీవితాలను దేవుని వాక్యానికి అనుగుణంగా మలచుకొని, ఆయనను ‘పూర్ణహృదయముతో, పూర్ణమనస్సుతో, పూర్ణశక్తితో, పూర్ణవివేకముతో’ ప్రేమిస్తున్నారు. (లూకా 10:​25-28) యెహోవాసాక్షులు ‘ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధిస్తున్నారని’ కొందరు గ్రహించినప్పటికీ, వాళ్లింకా యేసు మాదిరిని అనుకరించలేదు, బాప్తిస్మం పొందడం ద్వారా యెహోవాపట్ల తమకున్న యథార్థమైన ప్రేమను, అనితర భక్తిని బహిరంగంగా రుజువుపరచుకోలేదు. (యోహాను 4:​23, 24; ద్వితీయోపదేశకాండము 4:​24; మార్కు 1:​9-11) ప్రాముఖ్యమైన ఈ మెట్టు గురించి, హృదయపూర్వకంగా, నిర్దిష్టంగా చేసే ప్రార్థన, దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించడానికి, యెహోవా దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవడానికి, బాప్తిస్మం పొందడానికి కావలసిన స్ఫూర్తిని, ధైర్యాన్ని ఇస్తుంది.

21, 22. కొందరు సమర్పించుకోకుండా, బాప్తిస్మం పొందకుండా వెనుకాడడానికి గల కారణాలేమిటి?

21 కొందరు లోకవిషయాల్లో లీనమైపోవడంవల్ల లేక ధనార్జనలో పడిపోవడంవల్ల ఆధ్యాత్మిక విషయాల కోసం చాలా తక్కువ సమయం ఉంటుంది కాబట్టి, సమర్పించుకోవడానికి బాప్తిస్మం పొందడానికి వెనుకాడతారు. (మత్తయి 13:​22; 1 యోహాను 2:​15-17) వాళ్లు తమ దృక్పథాలను, లక్ష్యాలను మార్చుకుంటే ఎంత సంతోషంగా ఉంటారు! యెహోవాకు దగ్గరవడం వాళ్ళను ఆధ్యాత్మికంగా సంపన్నులను చేస్తుంది, చింతలను తగ్గిస్తుంది, దేవుని చిత్తం చేయడం ద్వారా కలిగే శాంతిని, సంతృప్తిని తెస్తుంది.​—⁠కీర్తన 16:​11; 40:⁠8; సామెతలు 10:​22; ఫిలిప్పీయులు 4:⁠6, 7.

22 మరి కొందరు, తాము యెహోవాను ప్రేమిస్తున్నామని అంటారు, కాని సమర్పించుకొని బాప్తిస్మం పొందరు, ఎందుకంటే ఆ విధంగా తాము దేవునికి లెక్క అప్పగించాల్సిన బాధ్యతను తప్పించుకోవచ్చునని భావిస్తారు. కాని మనలో ప్రతి ఒక్కరం దేవునికి లెక్క అప్పగించాల్సిందే. మనం యెహోవా వాక్యమును విన్నప్పుడే మనపై ఆ బాధ్యత పడింది. (యెహెజ్కేలు 33:​7-9; రోమీయులు 14:​11, 12) ‘ఏర్పరచుకొనబడిన’ ప్రజలుగా, ప్రాచీన ఇశ్రాయేలీయులు యెహోవాకు సమర్పించబడిన జనములో ఒక భాగంగా జన్మించారు, కాబట్టి ఆయన ఆజ్ఞల అనుసారంగా నమ్మకంగా ఆయన సేవ చేయవలసిన బాధ్యత వారికుంది. (ద్వితీయోపదేశకాండము 7:​6, 11) నేడు ఎవ్వరూ అలాంటి జనములో ఒక భాగంగా జన్మించలేరు, కానీ మనం ఖచ్చితమైన లేఖనాధార ఆదేశాన్ని పొందివుంటే, దాన్ని విశ్వాసంతో అనుసరించడం అవసరం.

23, 24. బాప్తిస్మం పొందకుండా ఎలాంటి భయాలు ఆపకూడదు?

23 తమకు సరిపడే పరిజ్ఞానం లేదేమోననే సందేహంతో కొందరు బాప్తిస్మానికి వెనుకాడతారు. అయితే, మనమందరమూ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, ఎందుకంటే “దేవుడు చేసేవాటన్నింటినీ మనం ఎన్నడూ పూర్తిగా తెలుసుకోలేము.” (ప్రసంగి 3:​11, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఐతియొపీయుడైన నపుంసకుడి గురించి ఆలోచించండి. ఒక యూదామత ప్రవిష్టుడిగా అతనికి లేఖనాల గురించి కాస్త తెలుసు, కానీ దేవుని సంకల్పాలకు సంబంధించిన అన్ని ప్రశ్నలకు అతను సమాధానం చెప్పలేడు. అయినప్పటికీ, యేసు విమోచన క్రయధన బలిద్వారా రక్షణ కోసం యెహోవా చేసిన ఏర్పాటు గురించి తెలుసుకొన్న తర్వాత, అతను వెంటనే నీటి బాప్తిస్మం పొందాడు.​—⁠అపొస్తలుల కార్యములు 8:​26-38.

24 కొందరు తమ సమర్పణను నెరవేర్చలేమనే భయంతో సమర్పించుకోవడానికి వెనుకాడతారు. 17 సంవత్సరాల మోనిక ఇలా అన్నది: “నేను నా సమర్పణకు తగినట్లు జీవించలేనేమోననే భయంతో బాప్తిస్మం పొందడానికి వెనుకాడాను.” అయితే, మనం యెహోవాను మన పూర్ణహృదయంతో నమ్ముకుంటే, ‘ఆయన మన త్రోవలను సరాళము చేయును.’ ఆయన నమ్మకమైన సమర్పిత సేవకుల్లాగా “సత్యమును అనుసరించి నడుచు”కోవడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు.​—⁠సామెతలు 3:​5, 6; 3 యోహాను 4.

25. ఇప్పుడు ఆలోచింపతగిన ప్రశ్న ఏమిటి?

25 యెహోవాపట్ల ప్రగాఢమైన నమ్మకం వల్ల, ఆయనపట్ల హృదయపూర్వక ప్రేమవల్ల, ప్రతి సంవత్సరం వేలాదిమంది సమర్పించుకొని బాప్తిస్మం పొందడానికి కదలింపబడుతున్నారు. సమర్పించుకున్న దేవుని సేవకులందరూ ఆయనకు యథార్థంగా ఉండాలనుకుంటారు. కానీ, మనం అపాయకరమైన కాలాల్లో జీవిస్తున్నాము, మనం విభిన్నమైన విశ్వాస పరీక్షలను ఎదుర్కొంటాము. (2 తిమోతి 3:​1-5) యెహోవాకు చేసుకున్న సమర్పణకు అనుగుణంగా జీవించడానికి మనం ఏమి చేయగలము? దీన్ని మనం తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిద్దాం.

[అధస్సూచి]

^ పేరా 6 యేసు పాపరహితుడు కాబట్టి, ఆయన పశ్చాత్తాపానికి సూచనగా బాప్తిస్మం పొందలేదు. ఆయన బాప్తిస్మం తన తండ్రి చిత్తం చేయడానికి ఆయన తనను తాను దేవునికి అర్పించుకోవడాన్ని సూచించింది.​—⁠హెబ్రీయులు 7:​26; 10:​5-10.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

• క్రైస్తవ బాప్తిస్మం ఎలా ఇవ్వబడుతుంది?

• ఒక వ్యక్తి బాప్తిస్మం పొందడానికి ఎటువంటి జ్ఞానం అవసరం?

• యథార్థ క్రైస్తవుల బాప్తిస్మానికి నడిపించే మెట్లు ఏవి?

• బాప్తిస్మం పొందడానికి కొందరు ఎందుకు వెనుకాడతారు, అయితే వారికెలా సహాయం చేయవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[14వ పేజీలోని చిత్రాలు]

‘తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములలోనికి’ బాప్తిస్మం పొందడం అంటే ఏమిటో మీకు తెలుసా?