కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విశ్వాసము తర్కంపై ఆధారపడి ఉండాలా?

విశ్వాసము తర్కంపై ఆధారపడి ఉండాలా?

విశ్వాసము తర్కంపై ఆధారపడి ఉండాలా?

“చాలామంది ‘మత విశ్వాసులు,’ తర్కాన్ని తప్పించుకోవడానికే మతాచారాలను ఖచ్చితంగా పాటించేవారిగా మారుతారు” అని అమెరికాలోని ఒక థియోలాజికల్‌ సెమినరీ అధ్యక్షుడు వ్రాశాడు. “వాళ్ళు ప్రతిదాన్ని కేవలం ‘విశ్వాసం మీదే’ గ్రుడ్డిగా అంగీకరించాలనుకుంటారు” అని కూడా ఆయన అంటున్నాడు.

దానర్థం, మత విశ్వాసులము అని చెప్పుకునే చాలామంది, తాము నమ్మేదాన్ని ఎందుకు నమ్ముతున్నామనిగానీ తమ విశ్వాసానికి తగిన ఆధారముందా అనిగానీ ఎంత మాత్రం ఆలోచించరు. అందుకే చాలామందికి, మతమంటే చర్చించడానికి ఇష్టంలేని ఒక అంశంగా మారిందనడంలో ఆశ్చర్యంలేదు.

విచారకరంగా, మత విగ్రహాలను ఉపయోగించడం, కంఠస్థం చేసిన ప్రార్థనలను వల్లించడంలాంటి ఆచారాలు కూడా తర్కాన్ని ప్రోత్సహించవు. ఈ అలవాట్లతోపాటు ఆకర్షణీయమైన భవన నిర్మాణశైలి, వైభవోపేతంగా రంగులువేసిన అద్దాల కిటికీలు, ఆకట్టుకునే సంగీతంలాంటివి కోట్లమంది ప్రజల మతపరమైన జ్ఞానస్థాయి ఏమిటో కొంతమటుకు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని చర్చీలు తమ విశ్వాసం బైబిలుపై ఆధారపడి ఉందని చెప్పుకుంటునప్పటికీ, ‘యేసును నమ్ముకో నీవు రక్షించబడతావు’ అనే వారి సందేశం ఆలోచనాత్మకమైన బైబిలు అధ్యయనాన్ని ప్రోత్సహించడంలేదు. ఇతరులు సామాజిక సమస్యలను లేదా రాజకీయ సమస్యలను పరిష్కరించడానికి క్రైస్తవ సూత్రాల అన్వయింపును ప్రకటిస్తారు. వీటన్నింటి ఫలితమేమిటి?

ఉత్తర అమెరికాలోని పరిస్థితి గురించి, ఒక మత రచయిత ఇలా అన్నాడు: “క్రైస్తవత్వం . . . నామమాత్రంగానే ఉండడానికి మొగ్గుచూపుతోంది, దాన్ని అవలంబించేవారికి విశ్వాసం గురించి చాలా తక్కువ తెలుసు.” ప్రజాభిప్రాయంపై సర్వే జరిపే ఒక ప్రతినిధి, అమెరికా “బైబిలు విషయంలో నిరక్షరాస్యుల దేశం” అని వర్ణించేంత వరకు వెళ్ళాడు. నిజం చెప్పాలంటే, ఈ వ్యాఖ్యానాలు నామమాత్రపు క్రైస్తవత్వం ప్రబలంగా ఉన్న ఇతర దేశాలకు కూడా వర్తిస్తాయి. ఇదేవిధంగా, అనేక క్రైస్తవేతర మతాలు కూడా తార్కికమైన, నిర్మాణాత్మకమైన ఆలోచనకు బదులుగా లయబద్ధమైన గీతాలు, నిష్టతో కూడిన ప్రార్థనలు, మిస్టిసిజమ్‌ ఉన్న పలురకాల ఆధ్యాత్మిక ధ్యానములకు ప్రాముఖ్యతనిస్తూ తర్కాన్ని నిరుత్సాహపరుస్తున్నాయి.

కానీ, తమ మతపరమైన విశ్వాసాల ఖచ్చితత్వం గురించి గాని, సత్యం గురించి గాని ఏ మాత్రం పట్టించుకోని ఈ ప్రజలే, తమ దైనందిన జీవితంలో, ఇతర విషయాల గురించి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఏదో ఒకనాడు చెత్త కుప్పలో కలిసిపోయే ఒక కారును కొనడానికే చాలా విస్తృత పరిశీలన చేసే ఒక వ్యక్తి, తన మతం గురించి, ‘అది నా తల్లిదండ్రులకు తృప్తికరంగా ఉందంటే, నాక్కూడా తృప్తికరమే’ అని అంటే మీకు విచిత్రం అనిపించదా?

మనం నిజంగా దేవుణ్ణి ప్రీతిపరచాలని అనుకుంటే, ఆయన గురించి మనం నమ్ముతున్నదాని ఖచ్చితత్వం గురించి గంభీరంగా ఆలోచించవద్దా? అపొస్తలుడైన పౌలు తన రోజుల్లోని, భక్తిపరులైన కొందరి గురించి మాట్లాడుతూ, ‘వారు దేవుని యందు ఆసక్తిగలవారు, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు’ అని అన్నాడు. (రోమీయులు 10:⁠2) అలాంటి వాళ్ళను, ఒక పెయింటరుతో పోల్చవచ్చు. అతను చాలా కష్టపడి ఇంటికి రంగులు వేస్తాడు కానీ, ఆ ఇంటి యజమాని సూచనలను వినకపోవడం వలన, అతను ఆ ఇంటి యజమాని కోరిన రంగులను కాక వేరే రంగులను వేస్తాడు. ఆ వ్యక్తికి తను చేసిన పని సంతోషాన్ని ఇవ్వవచ్చు, కానీ అది ఇంటి యజమానికి అంగీకృతమేనా?

సత్యారాధన విషయంలో దేవునికి అంగీకృతమైనది ఏమిటి? దానికి బైబిలు ఇలా జవాబిస్తోంది: “ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది. ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.” (1 తిమోతి 2:​3, 4) నేటి అనేక మతాల్లో అలాంటి పరిజ్ఞానాన్ని కనుగొనడం అసాధ్యమని కొందరు అనుకుంటుండవచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ప్రజలు సత్యమును గురించిన ఖచ్చితమైన పరిజ్ఞానం పొందాలని దేవుడు ఇష్టపడుతున్నట్లయితే, ఆయన అన్యాయంగా ఆ జ్ఞానమును వారినుండి గుప్తంగా ఉంచుతాడా? బైబిలు చెబుతున్నదాని ప్రకారం ఆయన అలా చేయడు. అది ఇలా చెబుతోంది: ‘నీవు [దేవుణ్ణి] వెదకిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును.’​—⁠1 దినవృత్తాంతములు 28:⁠9.

దేవుని కోసం యథార్థంగా వెదకేవారికి ఆయన తనను తాను ఎలా బయలుపరచుకుంటాడు? తర్వాతి ఆర్టికల్‌ దీనికి జవాబు ఇస్తుంది.