కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సమస్త జనులను దేవుడు ఆహ్వానిస్తాడు

సమస్త జనులను దేవుడు ఆహ్వానిస్తాడు

సమస్త జనులను దేవుడు ఆహ్వానిస్తాడు

జాన్‌ మొదటిసారి మాలి అనే దేశానికి వెళ్ళినప్పుడు, మమడు, ఆయన కుటుంబము చూపించిన స్నేహపూర్వకమైన ఆతిధ్యానికి ఎంతో చలించిపోయాడు. అందరూ కలిసి ఒకే పాత్రలో తింటుండగా జాన్‌ తాను కూడా నేలపై కూర్చుని, వారితోపాటు ఎబ్బెట్టుగా తింటూ, తన ఆతిథేయితో అత్యంత అమూల్యమైన బహుమానాన్ని అంటే దేవుని వాక్యమైన బైబిలులోని రాజ్య సువార్తను పంచుకుంటే ఎంత బాగుంటుందోనని ఆలోచిస్తున్నాడు. మాలిలో మాట్లాడే ఫ్రెంచ్‌ భాష జాన్‌కు తెలిసినప్పటికీ, పూర్తిగా భిన్నమైన మతము, భిన్నంగా ఆలోచించే ధోరణి గల కుటుంబంతో ఎలా మాట్లాడాలా అని ఆయన ఆలోచిస్తున్నాడు.

జాన్‌, బైబిలులోని బాబెలు నగరపు వృత్తాంతం గురించి తలంచడంలో ఆశ్చర్యం లేదు. అక్కడ, తిరుగుబాటుదారులైన ప్రజల భాషను దేవుడు తారుమారు చేశాడు. (ఆదికాండము 11:​1-9) తత్ఫలితంగా, వివిధ భాషలు, మతాలు, ఆలోచనా విధానాలు గల ప్రజలు భూమిపైనున్న వివిధ భాగాల్లో నివసించనారంభించారు. నేడు, ప్రయాణము, వలసవెళ్ళడము సర్వసాధారణమైపోవడంతో, చాలామంది తమ ఇరుగుపొరుగున సహితం, జాన్‌ ఎదుర్కొన్నటువంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు, అదేమిటంటే, భిన్నమైన నేపథ్యానికి చెందిన ప్రజలతో బైబిలు ఆధారిత నిరీక్షణను పంచుకోవడం ఎలా?

ఒక ప్రాచీన ఉదాహరణ

ఇశ్రాయేలులోని ఇతర ప్రవక్తల్లాగే, యోనా ప్రధానంగా ఇశ్రాయేలీయులతో మాట్లాడాడు. పది గోత్రాల మతభ్రష్ట రాజ్యం, దేవుడ్ని అగౌరవపరిచే ఆచారాలలో బహిరంగంగా పాల్గొంటున్న కాలంలో ఆయన ప్రవచించాడు. (2 రాజులు 14:​23-25) తన స్వదేశాన్ని విడిచి, అష్షూరుకు వెళ్ళి భిన్నమైన మతము, సంస్కృతి గల నీనెవె నివాసులకు ప్రకటించమని యోనా ప్రత్యేక నియామకాన్ని అందుకున్నప్పుడు ఆయన ప్రతిస్పందన ఎలా ఉండి ఉంటుందో ఒకసారి ఊహించండి. యోనాకు కనీసం నీనెవె నివాసుల భాష కూడా వచ్చి ఉండకపోవచ్చు, ఒకవేళ వచ్చినా అంత ధారాళంగా మాట్లాడలేకపోవచ్చు. అయితే, యోనాకు భాష వచ్చినా రాకపోయినా, తనకు ఇవ్వబడిన నియామకం తలకు మించినదని ఆయన భావించాడని స్పష్టమవుతోంది, ఇక దానితో ఆయన పారిపోయాడు.​—⁠యోనా 1:​1-3.

యెహోవా దేవుడు పైరూపమును లక్ష్యపెట్టడు గానీ హృదయాలను పరిశోధిస్తాడని యోనా తెలుసుకోవలసిన అవసరముందని స్పష్టమవుతోంది. (1 సమూయేలు 16:⁠7) మునిగిపోతున్న యోనాను అద్భుతరీతిగా రక్షించిన తర్వాత, నీనెవె నివాసులకు ప్రకటించమని యెహోవా ఆయనకు రెండవసారి ఆజ్ఞాపించాడు. యోనా దానికి విధేయత చూపించాడు, తత్ఫలితంగా నీనెవె నివాసులందరూ పశ్చాత్తాపపడ్డారు. అయినప్పటికీ, యోనాకు సరైన దృక్కోణం లేదు. యెహోవా ఒక వాస్తవ సంఘటనను ఉదాహరణగా ఉపయోగిస్తూ, యోనా తన దృక్కోణాన్ని మార్చుకోవలసిన అవసరం ఉందని బోధించాడు. యెహోవా యోనాను ఇలా ప్రశ్నించాడు: “నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనము . . . గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా?” (యోనా 4:​5-11) నేడు మన విషయమేమిటి? భిన్నమైన నేపథ్యానికి చెందిన ప్రజలకు మనమెలా సహాయం చేయగలము?

సమరయులను, యూదేతరులను ఆహ్వానించడం

మొదటి శతాబ్దంలో, సమస్త జనులను శిష్యులనుగా చేయమని యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. (మత్తయి 28:​19) ఇది వారికంత సులభం కాలేదు. యేసు శిష్యులు యూదులు, యోనా వలె వారు కూడా తమ వంటి నేపథ్యము, సంస్కృతిగల ప్రజలతో మాత్రమే మాట్లాడేవారు. సహజంగానే, వారు కూడా తమ కాలంలో సర్వసాధారణమైవున్న అకారణమైన అయిష్టత అనే ఒత్తిడికి గురయ్యుంటారు. అయితే తన సేవకులు, వారి గురించి తనకున్న సంకల్పమేమిటో క్రమక్రమంగా గ్రహించగలిగేలా ఆయన విషయాలను నిర్దేశించాడు.

మొదటి మెట్టు, యూదులకు సమరయులకు మధ్య ఉన్న అకారణమైన అయిష్టతను తొలగించడం. యూదులకు సమరయులతో ఎలాంటి వ్యవహారాలు ఉండేవి కాదు. అయినప్పటికీ, సమరయులు భవిష్యత్తులో సువార్తను అంగీకరించడానికి యేసు పలుమార్లు మార్గాన్ని సిద్ధం చేశాడు. ఒక సమరయ స్త్రీతో మాట్లాడడం ద్వారా ఆయన తన నిష్పక్షపాతాన్ని చూపించాడు. (యోహాను 4:​7-26) మరో సందర్భంలో, ఆయన యూదులు కాని వారు కూడా తమ పొరుగువారి పట్ల ప్రేమ చూపించగలరని స్నేహశీలుడైన సమరయుని ఉపమానం ద్వారా, దైవభక్తిగల ఒక యూదునికి చూపించాడు. (లూకా 10:​25-37) యెహోవా సమరయులను క్రైస్తవ సంఘములోనికి తీసుకువచ్చే సమయం వచ్చినప్పుడు, యూదులైన ఫిలిప్పు, పేతురు, యోహానులు సమరయ నివాసులకు ప్రకటించారు. వీరి సందేశం ఆ పట్టణంలో ఎంతో సంతోషాన్ని కలిగించింది.​—⁠అపొస్తలుల కార్యములు 8:​4-8, 14-17.

వాస్తవానికి, యూదులకు దూరపు బంధువులైన సమరయులను ప్రేమించడం యూదా క్రైస్తవులకు అంత కష్టంగా ఉంటే, యూదులు తిరస్కరించే, ద్వేషించే యూదేతరుల పట్ల లేదా అన్యుల పట్ల స్నేహపూర్వకమైన ప్రేమను చూపించడం వారికి మరింత కష్టమై ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ, యేసు మరణించిన తర్వాత, యూదా క్రైస్తవులకు అన్యులకు మధ్యనున్న అడ్డుగోడ తొలగించబడింది. (ఎఫెసీయులు 2:​13, 14) ఈ క్రొత్త ఏర్పాటును అంగీకరించేలా పేతురుకు సహాయం చేసేందుకు యెహోవా ఆయనకు ఒక దర్శనమును చూపించి దానిలో, “దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైనవాటినిగా ఎంచవద్దని” చెప్పాడు. ఆ తర్వాత యెహోవా ఆత్మ ఆయనను కొర్నేలి అనే అన్యుని వద్దకు నడిపించింది. అన్యజనులకు చెందిన ఈ వ్యక్తిని దేవుడు పవిత్రపరిచాడు గనుక అతడిని నిషిద్ధమైనవాడని పిలువకూడదన్నది దేవుని దృక్కోణమని పేతురుకు అర్థమైనప్పుడు, ఆయన ప్రేరేపించబడి ఇలా అన్నాడు: “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపొస్తలుల కార్యములు 10:​9-35) దేవుడు కొర్నేలిపై ఆయన కుటుంబంపై పరిశుద్ధాత్మను కుమ్మరించడం ద్వారా, తాను వారిని అంగీకరిస్తున్నానని చూపించినప్పుడు పేతురు ఎంతగా ఆశ్చర్యపోయి ఉండవచ్చు!

పౌలు​—⁠అన్యజనుల కోసం ఏర్పరచుకోబడిన సాధనం

ప్రజలందరినీ ప్రేమించడానికీ, వారికి సహాయం చేయడానికీ యెహోవా తన సేవకులను క్రమక్రమంగా ఎలా సిద్ధం చేస్తాడనే విషయంలో పౌలు చేసిన పరిచర్య ఒక విశిష్ఠమైన ఉదాహరణ. పౌలు క్రైస్తవుడిగా మారే సమయంలో, ఆయన అన్యజనుల ఎదుట తన నామము భరించడానికి ఏర్పరచుకోబడిన సాధనముగా ఉంటాడని యేసు ఆయనకు చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 9:​15) ఆ తర్వాత పౌలు, బహుశా అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి తనను ఉపయోగించుకోవాలనే దేవుని సంకల్పం గురించి ధ్యానించడం కొరకే అరేబియాకు వెళ్ళుండవచ్చు.​—⁠గలతీయులు 1:​15-17.

తన మొదటి మిషనరీ యాత్రలో పౌలు యూదేతరులకు ప్రకటించడంలో అత్యాసక్తి చూపించాడు. (అపొస్తలుల కార్యములు 13:​46-48) యెహోవా పౌలు కార్యాన్ని ఆశీర్వదించాడు, యెహోవా ఏర్పాటు ప్రకారమే అపొస్తలుడు పనులు చేస్తున్నాడనటానికి అదే నిదర్శనం. యూదులు కాని తన సహోదరులతో సహవసించకుండా పక్షపాతం చూపిస్తున్న పేతురును పౌలు ధైర్యంగా సరిదిద్దినప్పుడు, తాను యెహోవా దృక్కోణాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నానని ఆయన చూపించాడు.​—⁠గలతీయులు 2:​11-14.

పౌలు ప్రయత్నాలకు దేవుడు నడిపింపును ఇస్తున్నాడనటానికి మరో నిదర్శనాన్ని ఆయన రెండవ మిషనరీ యాత్రలో రోము ప్రాంతమైన బితునియలో ప్రకటించకుండా పరిశుద్ధాత్మ ఆయనను ఆపుచేసినప్పుడు చూడవచ్చు. (అపొస్తలుల కార్యములు 16:​6బి, 7) వారలా వెళ్ళడానికి సముచితమైన సమయం రాలేదని స్పష్టమవుతోంది. అయితే, ఆ తర్వాత, బితునియ వాసులు కొందరు క్రైస్తవులయ్యారు. (1 పేతురు 1:⁠1) ఒక దర్శనంలో, మాసిదోనియ దేశస్థుడైన ఒక వ్యక్తి, “నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని” పౌలును వేడుకున్నాడు. దాంతో పౌలు ఆ రోమా ప్రాంతంలో సువార్త ప్రకటించేందుకు తన మార్గమును మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.​—⁠అపొస్తలుల కార్యములు 16:⁠9, 10.

పౌలు ఏథెన్సువారికి ప్రకటించినప్పుడు, పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మలచుకునే సామర్థ్యం తీవ్రమైన పరీక్షకు గురైంది. గ్రీకు, రోమా చట్టాలు విదేశీ దేవుళ్ళను, క్రొత్త మతాచారాలను ప్రవేశపెట్టడాన్ని నిషేధించాయి. పౌలుకు ప్రజలపట్ల ఉన్న ప్రేమ, వారి మతాచారాలను జాగ్రత్తగా పరిశీలించేలా ఆయనను కదిలించింది. ఏథెన్సులో ఆయన, “తెలియబడని దేవునికి” అని వ్రాయబడి ఉన్న ఒక బలిపీఠమును గమనించాడు. ఈ విశేషాన్ని పౌలు తాను సాక్ష్యమిచ్చేటప్పుడు ప్రస్తావించాడు. (అపొస్తలుల కార్యములు 17:​22, 23) తన సందేశాన్ని దయాపూర్వకమైన, గౌరవప్రదమైన విధంగా పరిచయం చేయడానికి ఎంత చక్కని మార్గం!

అన్యజనులకు అపొస్తలునిగా తన పని సాధించిన ఫలితాలను గురించి ఆలోచించినప్పుడు పౌలు తప్పకుండా ఎంతగా సంతోషించి ఉంటాడో కదా! కొరింథులో, ఫిలిప్పీలో, థెస్సలొనీకలో, గలతీయ పట్టణాల్లో అనేక మంది యూదేతర క్రైస్తవులతో రూపొందించబడిన సంఘాలను స్థాపించడానికి ఆయన సహాయం చేశాడు. ఆయన దమరి, దియొనూసి, సెర్గి పౌలు, తీతు వంటి విశ్వాసులైన స్త్రీ పురుషులకు సహాయం చేశాడు. యెహోవా గానీ, బైబిలు గానీ తెలియని ప్రజలు క్రైస్తవ సత్యమును స్వీకరించడాన్ని చూడడం ఎంతటి ఆధిక్యత! యూదేతరులు సత్యమును గురించిన పరిజ్ఞానమును పొందడానికి సహాయం చేయడంలో తాను నిర్వర్తించిన పాత్ర గురించి పౌలు ఇలా పేర్కొన్నాడు: “నేనైతే . . . ఆయననుగూర్చిన సమాచారమెవరికి తెలియజేయబడ లేదో వారు చూతురనియు, విననివారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై యుండి ఆలాగున ప్రకటించితిని.” (రోమీయులు 15:​20, 21) మన సంస్కృతికి చెందని ప్రజలకు సువార్త ప్రకటించడంలో మనం భాగం వహించగలమా?

భూమిపైనున్న ప్రజలందరికీ సహాయం చేయడం

యెరూషలేములోని ఆలయం వద్ద ఆరాధించడానికి వచ్చే ఇశ్రాయేలీయులు కాని వారి గురించి సొలొమోను యెహోవాకు ప్రార్థించాడు. ఆయనిలా వేడుకున్నాడు: “ఆకాశమను నీ నివాసస్థలమందు నీవు విని, పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తము ననుగ్రహించుము, అప్పుడు లోకములోని జనులందరును నీ నామమును . . . తెలిసికొందురు.” (ఇటాలిక్కులు మావి.) (1 రాజులు 8:​41-43) నేడు అనేక దేశాల్లో ఉన్న వేలాదిమంది రాజ్య ప్రచారకులు అలాంటి భావాలనే ప్రతిధ్వనింపజేస్తున్నారు. వారు, ఆధ్యాత్మిక విషయాల్లో ‘కుడియెడమలు ఎరుగని,’ నీనెవె నివాసుల వంటి ప్రజలను కలుస్తారు. విభిన్న దేశాలకు చెందిన సత్యారాధకులను సమకూర్చడం గురించిన ప్రవచనాల నెరవేర్పులో భాగం వహించాలని రాజ్య ప్రచారకులు ఆత్రుతతో ఉన్నారు.​—⁠యెషయా 2:​2, 3; మీకా 4:​1-3.

క్రైస్తవమత సామ్రాజ్యంలోని ప్రజలు బైబిలులోని నిరీక్షణా సందేశాన్ని అంగీకరించినట్లుగానే, ఇతర మత నేపథ్యాలుగలవారు కూడా అంగీకరిస్తున్నారు. ఇది వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎలా ప్రభావితం చేయాలి? మిమ్మల్ని మీరు యథార్థంగా పరీక్షించుకోండి. అకారణమైన అయిష్టత మీలో లోతుగా పాతుకుపోయిందని మీకు అనిపిస్తే, దాని స్థానంలో ప్రేమను వృద్ధి చేసుకోండి. * దేవుడు స్వీకరించడానికి ఇష్టపడుతున్న ప్రజలను తిరస్కరించకండి.​—⁠యోహాను 3:​16.

మరో నేపథ్యానికి చెందిన ప్రజలతో మాట్లాడే ముందు వారి గురించి పరిశోధనచేసి తెలుసుకోండి. వారి నమ్మకాలతో, ఆసక్తులతో, వారి ఆలోచనా విధానంతో సుపరిచితులవ్వండి; తర్వాత ఇరువురికి ఆసక్తికరమైన విషయాలకు సంబంధించిన ఆధారం కోసం వెదకండి. ఇతరుల పట్ల మంచితనాన్ని, దయను చూపించండి. వాదనలు పెట్టుకోకండి, పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయేలా ఉండండి, ప్రోత్సాహకరంగా మాట్లాడండి. (లూకా 9:​52-56) అలా చేయడం ద్వారా మీరు, ‘మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్న’ యెహోవాను సంతోషపరుస్తారు.​—⁠1 తిమోతి 2:⁠4.

విభిన్న నేపథ్యాలున్న ప్రజలు మన సంఘాల్లో ఉన్నందుకు మనమెంతగా ఆనందిస్తామో కదా! (యెషయా 56:​6, 7) నేడు మేరీ, జాన్‌, స్టీఫెన్‌, టామ్‌ వంటి పేర్లనే గాక మమడు, జెగన్‌, రేజా, చాన్‌ వంటి పేర్లను కూడా వినగలగడం ఎంత మనోత్తేజకరంగా ఉంటుందో కదా! నిజంగా, మనకు ‘కార్యానుకూలమైన మంచి సమయము ప్రాప్తించియున్నది.’ (1 కొరింథీయులు 16:⁠9) సమస్త జనులను ఆహ్వానించమని నిష్పక్షపాతి అయిన యెహోవా దేవుడు ఇస్తున్న ఆహ్వానాన్ని ఇతరులకు అందజేయడానికి మన ముందున్న అవకాశాలను మనం ఉపయోగించుకుందాము!

[అధస్సూచి]

^ పేరా 19 తేజరిల్లు! ఆగస్టు 8, 1996, 4-7 పేజీల్లోని, “సంభాషణను అడ్డగించే అడ్డుగోడలు” అనే ఆర్టికల్‌ను చూడండి.

[23వ పేజీలోని చిత్రాలు]

పౌలు, పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయేలా ఉండడం ద్వారా ప్రతి ప్రాంతంలోని ప్రజలతో సువార్తను పంచుకున్నాడు

. . . ఏథెన్సులో

. . . ఫిలిప్పీలో

. . . ప్రయాణించేటప్పుడు