కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తదనుభూతి దయా కనికరాలు చూపించడానికి కీలకం

తదనుభూతి దయా కనికరాలు చూపించడానికి కీలకం

తదనుభూతి దయా కనికరాలు చూపించడానికి కీలకం

“మీరు మరొకరి బాధను తగ్గించగలిగినంత కాలం, మీ జీవితం వ్యర్థం కాదు,” అని హెలెన్‌ కెల్లర్‌ వ్రాసింది. భావోద్వేగపరమైన బాధను కెల్లర్‌ సరిగ్గా అర్థం​చేసుకుందనడంలో సందేహం లేదు. ఆమెకు 19 నెలల వయసున్నప్పుడు, వచ్చిన అనారోగ్యము, పూర్తి గ్రుడ్డితనాన్నీ చెవిటితనాన్ని కలుగజేసింది. కానీ కనికరంగల ఒక ఉపాధ్యాయురాలు, హెలెన్‌కు బ్రెయిలీ భాషలో చదవడం, వ్రాయడం, ఆ తర్వాత మాట్లాడడం కూడా నేర్పింది.

శారీరక అశక్తతతో పాట్లు పడుతున్నప్పుడు కలిగే వేదన గురించి, కెల్లర్‌ ఉపాధ్యాయురాలైన ఆన్‌ సలివాన్‌కు బాగా తెలుసు. ఆమె కూడా దాదాపు అంధురాలే. కానీ, హెలెన్‌తో సంభాషించడానికి, ఎంతో సహనంతో ఆమె చేతుల మీద పదాలను ఒక్కొక్క అక్షరంగా వ్రాసే పద్ధతిని ఆన్‌ ప్రారంభించింది. తన ఉపాధ్యాయురాలి తదనుభూతి వల్ల కదిలింపబడ్డ హెలెన్‌, అంధులకు, బధిరులకు సహాయం చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకుంది. తనకున్న అశక్తతను ఎంతో కృషిచేసి అధిగమించింది కనుక, అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారి బాధను అర్థంచేసుకుంది. ఆమె వారికి సహాయం చేయాలనుకుంది.

ఈ స్వార్థపూరిత లోకంలో “ఎంతమాత్రమును కనికరము చూప”కుండా ఉండడం, ఇతరుల అవసరాలను నిర్లక్ష్యం చేయడం సులభమేనని మీరు గమనించే ఉంటారు. (1 యోహాను 3:​17) అయితే, క్రైస్తవులకు, తమ పొరుగువారిని ప్రేమించి, ఒకరియెడల ఒకరు మిక్కుటమైన ప్రేమగలవారై ఉండమని ఆజ్ఞాపించబడింది. (మత్తయి 22:​39; 1 పేతురు 4:⁠8) ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలని మనం ఎంతో కోరుకున్నప్పటికీ, తరచూ మనం ఇతరుల బాధను తగ్గించే అవకాశాలను నిర్లక్ష్యం చేస్తామన్న వాస్తవం మీకు బహుశా తెలిసే ఉంటుంది. వారి అవసరాలు మనకు తెలియకపోవడమే దానికి కారణం కావచ్చు. మనము దయ కనికరం చూపడానికి తదనుభూతి సహాయపడగలదు.

తదనుభూతి అంటే ఏమిటి?

ఒక నిఘంటువు ప్రకారం తదనుభూతి అంటే, ఇతరుల పరిస్థితిని, మనోభావాలను, ఉద్దేశాలను గుర్తించి, వాటిని అర్థంచేసుకోవడం. వేరే వ్యక్తి స్థానంలో తనను తాను ఊహించుకోగల సామర్థ్యము అని కూడా తదనుభూతి వర్ణించ​బడింది. కాబట్టి తదనుభూతి చూపాలంటే మొదటిగా అవతలి వ్యక్తి పరిస్థితులను అర్థంచేసుకోవాలి, రెండవదిగా ఆ వ్యక్తిలో ఆ పరిస్థితులు కలిగించే మనోభావాలను మనం కూడా అనుభూతి చెందాలి. అవును, తదనుభూతి చూపడంలో, వేరే వ్యక్తి బాధను మన హృదయంలో అనుభవించడం ఉంది.

“తదనుభూతి” అనే పదం బైబిలులో లేదు, కానీ లేఖనాలు ఈ గుణాన్ని వేర్వేరు విధాలుగా నివేదిస్తున్నాయి. ‘ఒకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపంచుకొని, సహోదరప్రేమ కలిగి, కరుణాచిత్తులై’ ఉండమని పౌలు క్రైస్తవులకు ఉపదేశించాడు. (1 పేతురు 3:⁠8) “యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి” అని అనువదించబడిన గ్రీకు పదానికి, “మరొకరితో బాధను అనుభవించడం” లేక “కనికరం చూపించడం” అని భావం. “సంతోషించువారితో సంతోషించుడి; ఏడ్చువారితో ఏడువుడి” అని తోటి క్రైస్తవులకు బోధించినప్పుడు, అపొస్తలుడైన పౌలు ఇలాంటి మానసిక భావాలనే కలిగివుండమని ప్రోత్సహించాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు: “ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి.” (రోమీయులు 12:​15, 16) మనల్ని మనం మన పొరుగువాళ్ళ స్థానంలో ఉంచుకోకపోతే, మనలాగే మన పొరుగువారిని ప్రేమించడం దాదాపు అసాధ్యమని మీరు అంగీకరించరా?

దాదాపు అందరిలోను సహజంగా కొంత తదను​భూతి ఉంటుంది. హృదయాన్ని కదిలించే దృశ్యాలను అంటే, ఆకలితో అలమటిస్తున్న పిల్లలను, వ్యాకులతతోవున్న శరణార్థులను చూసినప్పుడు ఎవరి హృదయాలు చలించవు? ఏడుస్తున్న తన బిడ్డను ప్రేమగల ఏ తల్లి నిర్లక్ష్యం చేయ​గలదు? అయితే, అన్ని రకాల బాధలను మనం సులభంగా గ్రహించలేము. మానసిక కృంగుదలను, స్పష్టంగా తెలియని శారీరక ప్రతిబంధకాన్ని, ఆహారపు అలవాట్లకు సంబంధించిన రుగ్మతను అనుభవిస్తున్న ఒక వ్యక్తి మనోభావాలను అర్థంచేసుకోవడం ఎంత కష్టం! ప్రత్యేకించి మనం స్వయంగా అటువంటి బాధలను ఎన్నడూ అనుభవించకపోతే వాటిని అర్థంచేసుకోవడం కష్టంగా ఉండవచ్చు. మనం వారున్న పరిస్థితుల్లో లేకపోయినప్పటికీ, వారిపట్ల మనం సహాను​భూతిని పెంపొందించుకోగలమనీ, పెంపొందించుకోవాలనీ లేఖనాలు చూపిస్తున్నాయి.

తదనుభూతిని గురించిన లేఖనాధార ఉదాహరణలు

తదనుభూతి చూపించే విషయంలో యెహోవాయే మనకు ప్రధాన మాదిరి. ఆయన తాను పరిపూర్ణుడే అయినా, మనం పరిపూర్ణులమై ఉండాలని ఎదురుచూడడు, ఎందుకంటే “మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు.” (కీర్తన 103:​14; రోమీయులు 5:​12) అంతేకాకుండా, మన పరిమితుల గురించి ఆయనకు తెలుసు కనుక, ‘మనము సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మనలను శోధింపబడనియ్యడు.’ (1 కొరింథీయులు 10:​13) ఆ శోధనను సహించడానికి లేదా దాన్ని అధిగమించడానికి ఆయన తన సేవకుల ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు సహాయం చేస్తాడు.​—⁠యిర్మీయా 25:​4, 5; అపొస్తలుల కార్యములు 5:​32.

తన ప్రజలు అనుభవించే బాధను యెహోవా వ్యక్తి​గతంగా అనుభవిస్తాడు. బబులోనునుండి తిరిగి వచ్చిన యూదులతో, ‘మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు’ అని ఆయన చెప్పాడు. (జెకర్యా 2:⁠8) దేవుని తదనుభూతిని గురించి బాగా తెలిసిన బైబిలు రచయిత దావీదు ఆయనతో ఇలా అన్నాడు: “నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి. అవి నీ కవిలెలో కనబడును గదా.” (కీర్తన 56:⁠8) తన సేవకులు తమ యథార్థతను కాపాడుకొనే ప్రయత్నంలో కార్చిన కన్నీళ్లను, యెహోవా ఒక కవిలెలో లేదా పుస్తకములో వ్రాసివున్నట్లే గుర్తుంచుకొంటాడని తెలుసుకోవడం ఎంత ఓదార్పునిస్తుందో కదా!

తన పరలోక తండ్రివలె యేసుక్రీస్తు కూడా ఇతరుల మనోభావాలను అర్థంచేసుకోగలడు. ఆయన ఒక చెవిటి​వానిని స్వస్థపరచేటప్పుడు అతనిని ఒక ప్రక్కకు తీసుకొనివెళ్ళాడు. అద్భుత రీతిలో స్వస్థత పొందడం అతన్ని బెదిరిపోయేటట్లు, కలవరపడేటట్లు చేయకూడదని ఆయన అలా చేసివుండవచ్చు. (మార్కు 7:​32-35) మరో సందర్భంలో, తన ఏకైక కుమారుని సమాధి చేయబోతున్న ఒక విధవరాలిని యేసు గమనించాడు. ఆమె అనుభవిస్తున్న బాధను ఆయన వెంటనే గ్రహించాడు, అంత్యక్రియల కోసం తీసుకువెళ్తున్న ఆ గుంపు వద్దకు వెళ్ళి, ఆ యౌవనుడిని పునరుత్థానం చేశాడు.​—⁠లూకా 7:​11-16.

యేసు తన పునరుత్థానం తరువాత, దమస్కుకు వెళ్ళే దారిలో సౌలుకు ప్రత్యక్షమైనప్పుడు, సౌలు తన శిష్యులను ఘోరంగా హింసించడం తనమీద ఎటువంటి ప్రభావం చూపించిందో తెలియజేశాడు. “నేను నీవు హింసించుచున్న యేసును” అని అతనితో చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 9:​3-5) అనారోగ్యంగా ఉన్న తన బిడ్డ బాధను ఒక తల్లి తానుగా ఎలా అనుభవిస్తుందో అలాగే, తన శిష్యులు అనుభవిస్తున్న బాధను యేసు వ్యక్తిగతంగా అనుభవించాడు. అలాగే, మన పరలోక ప్రధాన యాజకుడిగా యేసు, “మన బలహీనతలయందు మనతో సహానుభవము” కలిగివుంటాడు.​—⁠హెబ్రీయులు 4:​15.

అపొస్తలుడైన పౌలు, ఇతరుల మనోభావాలను, వారి బాధలను అర్థంచేసుకోవడం నేర్చుకొన్నాడు. “ఎవడైనను బలహీనుడాయెనా? నేనును బలహీనుడను కానా? ఎవడైనను తొట్రుపడెనా? నాకును మంట కలుగదా?” అని ఆయన అడిగాడు. (2 కొరింథీయులు 11:​29) ఫిలిప్పీలోని చెరసాల నిర్బంధంనుండి పౌలును, సీలను ఒక దేవదూత అద్భుతరీతిలో విడిపించినప్పుడు, ఎవ్వరూ తప్పించుకొని పారిపోలేదని చెరసాల నాయకుడికి తెలియజేయాలన్నదే పౌలుకు వచ్చిన మొదటి తలంపు. చెరసాల నాయకుడు ఆత్మహత్య చేసుకొనే అవకాశం ఉందని ఆయన తదనుభూతితో గ్రహించగలిగాడు. రోమా ఆచారం ప్రకారం, ఒక ఖైదీ తప్పించుకొని పారిపోతే, ప్రత్యేకించి ఆ ఖైదీని జాగ్రత్తగా కాపలా కాయమని ఆజ్ఞాపించబడిన తర్వాత కూడా అతను తప్పించుకొని పారిపోతే, చెరసాల నాయకుడు తీవ్రంగా శిక్షించబడతాడని పౌలుకు తెలుసు. (అపొస్తలుల కార్యములు 16:​24-28) పౌలు దయతో తన ప్రాణం కాపాడినందుకు చెరసాల నాయకుడు చాలా ప్రభావితుడయ్యాడు, ఆయనా ఆయన కుటుంబం, క్రైస్తవులు అవ్వడానికి అవసరమైన చర్యలు తీసుకొన్నారు.​—⁠అపొస్తలుల కార్యములు 16:​30-34.

తదనుభూతిని ఎలా పెంపొందించుకోవాలి

మన పరలోక తండ్రిని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును అనుకరించ​మని లేఖనాలు పదే పదే మనలను ప్రోత్సహిస్తున్నాయి, కాబట్టి తదనుభూతి మనము పెంపొందించుకోవలసిన గుణం. మనం దాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు? ఇతరుల అవసరాలను, వారి మనోభావాలను అర్థం చేసుకోవడాన్ని మనం మూడు ముఖ్యమైన మార్గాల ద్వారా మెరుగుపర్చుకోవచ్చు, అవేమిటంటే, వినడం, గమనించడం, ఊహించుకోవడం.

వినండి. జాగ్రత్తగా వినడం ద్వారా ఇతరులు ఏ సమస్యలను ఎదుర్కొంటున్నారో మనం తెలుసుకుంటాము. మనం ఎంత మంచిగా వింటే, వారు తమ మనస్సు విప్పి తమ మనోభావాలను అంత ఎక్కువగా వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. “ఫలానా పెద్ద నేను చెప్పేది వింటాడు అని నమ్మకం కుదిరితేనే, నేను ఆయనతో మాట్లాడగలను,” అని మిరియమ్‌ వివరిస్తోంది. “ఆయన నా సమస్యను నిజంగా అర్థంచేసుకొన్నాడని నేను తెలుసుకోవాలనుకుంటాను. నేను చెప్పింది జాగ్రత్తగా విన్నాడని చూపించే ప్రశ్నలు ఆయన నన్ను అడిగినప్పుడు, ఆయనపై నా నమ్మకం పెరుగుతుంది.”

గమనించండి. తాము ఏమి అనుభవిస్తున్నారో, ఎలా భావిస్తున్నారో అందరూ బహిరంగంగా మనకు చెప్పరు. అయితే జాగ్రత్తగా గమనించే వ్యక్తి, తోటి క్రైస్తవుడు కలతచెందినట్టు అనిపిస్తే, ఒక యౌవనుడు ఇతరులతో మాట్లాడకపోతే, లేక ఒక చురుకైన పరిచారకుడు తన ఉత్సాహాన్ని కోల్పోతే, వెంటనే గమనించగలుగుతాడు. సమస్య ముదిరిపోకముందే దాన్ని గ్రహించే సామర్థ్యం తల్లిదండ్రులకు ఎంతో అవసరం. మారీ ఇలా చెబుతోంది: “నేను తనతో మాట్లాడకముందే, నేను ఎలా భావిస్తున్నానన్నది మా అమ్మకు ఎలాగో తెలిసిపోతుంది, కాబట్టి తనతో నా సమస్యల గురించి దాపరికం లేకుండా మాట్లాడడం నాకు సులభంగా ఉంటుంది.”

మీ ఊహాశక్తిని ఉపయోగించండి. తదనుభూతిని పెంపొందించుకోవడానికి అతి శక్తివంతమైన పద్ధతి, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవడమే: ‘నేను ఆ పరిస్థితిలో ఉంటే, ఎలా భావిస్తాను? ఎలా ప్రతిస్పందిస్తాను? నాకు ఏమి అవసరం అవుతుంది?’ యోబు వద్దకు వచ్చిన ముగ్గురు అబద్ధపు ఆదరణకర్తలు, తమను తాము యోబు స్థానంలో ఉంచుకోవడంలో విఫలమయ్యారు. అందుచేత, ఆయన చేసివుంటాడని వారు అనుకున్న ఊహాకల్పిత పాపాల కొరకు ఆయనను నిందించారు.

అపరిపూర్ణ మానవులకు, మనోభావాలను అర్థంచేసుకోవడం కంటే తప్పులను విమర్శించడం చాలా సులభం. అయినప్పటికీ, కష్టాలలో ఉన్నవారి బాధను ఊహించడానికి మనం తీవ్రంగా ప్రయత్నిస్తే, వారిని ఖండించే బదులు సానుభూతి చూపించడానికి అది సహాయపడుతుంది. “సలహాలు ఇవ్వడం ప్రారంభించే ముందు, జాగ్రత్తగా విని మొత్తం పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, నేను ఇంకా మంచి ఉపదేశాన్ని ఇస్తాను,” అని క్వాన్‌ అనే అనుభవజ్ఞుడైన పెద్ద వ్యాఖ్యానిస్తున్నాడు.

యెహోవాసాక్షులచే పంచిపెట్టబడ్డ ప్రచురణలు ఈ విషయంలో చాలా మందికి సహాయపడ్డాయి. కావలికోట, తేజరిల్లు! పత్రికలు, మానసిక క్రుంగుదల మరియు పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు వంటి క్లిష్టమైన సమస్యల గురించి కూడా చర్చించాయి. సమయానుకూలమైన ఈ సమాచారం, ఆ విధంగా బాధపడుతున్న వారి మనోభావాలను పాఠకులు గ్రహించడానికి సహాయపడుతుంది. అదే విధంగా, యువత అడిగే ప్రశ్నలు​—⁠ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) అనే పుస్తకం, తమ పిల్లలకు సంబంధించిన సమస్యలను అర్థంచేసుకోవడానికి చాలామంది తల్లిదండ్రులకు సహాయపడింది.

తదనుభూతి క్రైస్తవ కార్యకలాపాల్లో సహాయపడుతుంది

మనలో ఎవ్వరము కూడా, ఆకలితో అలమటిస్తున్న బాలుడి దురవస్థను నిర్లక్ష్యం చేయము, వాడికి పెట్టడానికి మన దగ్గర ఆహారం ఉంటే ఎంతమాత్రం అలా నిర్లక్ష్యం చేయము. మనకు తదనుభూతి ఉంటే, మనము ఒక వ్యక్తి ఆధ్యాత్మిక పరిస్థితిని కూడా వివేచిస్తాము. యేసు గురించి బైబిలు ఇలా నివేదిస్తోంది: ‘ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడ్డాడు.’ (మత్తయి 9:​36) నేడు లక్షలాది మంది ప్రజలు ఆధ్యాత్మికంగా అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు, వారికి సహాయం అవసరం.

యేసు కాలంలోవలె, కొంతమంది ప్రజల హృదయాలను చేరుకోవడానికి మనము అకారణ అయిష్టతను లేదా లోతుగా నాటుకుపోయిన ఆచారాన్ని అధిగమించాల్సి రావచ్చు. తదనుభూతిగల పరిచారకుడు తన సందేశాన్ని మరింత ఆకర్షణీయంగా ఉండేలా చేసుకునేందుకు, ఇరువురికీ అంగీకారయోగ్యమైన విషయాలను కనుగొనడానికి, ప్రజలు ఇప్పటికే ఆలోచిస్తున్న విషయాల గురించి మాట్లాడడానికి తీవ్రంగా కృషి చేస్తాడు. (అపొస్తలుల కార్యములు 17:​22, 23; 1 కొరింథీయులు 9:​20-23) తదనుభూతి చేత పురికొల్పబడి మనం చేసే దయగల కార్యాలు, ఫిలిప్పీలోని చెరసాల నాయకుని విషయంలోలాగే, మన శ్రోతలు రాజ్య సందేశాన్ని మరింత అనుకూలంగా స్వీకరించేలా చేయగలవు.

సంఘంలో ఉన్న ఇతరుల వైఫల్యాలను అంతగా పట్టించు​కోకుండా ఉండడంలో తదనుభూతి మనకు చాలా విలువైన సహకారాన్ని అందించగలదు. మన మనస్సును నొప్పించిన సహోదరుని భావాలను అర్థంచేసుకోవడానికి మనం ప్రయత్నిస్తే, అతణ్ణి క్షమించడం చాలా సులభంగా ఉంటుందని మనం తప్పకుండా గ్రహిస్తాము. మనకు కూడా అతనికి ఎదురైనటువంటి అనుభవాలే ఎదురైతే, లేక మనం కూడా అదే పరిస్థితిలో ఉంటే, బహుశా మనం కూడా అదే విధంగా ప్రతిస్పందించి వుండేవారమేమో. యెహోవాకున్న తదనుభూతి, “మనము మంటివారమని ఆయన జ్ఞాపకము” ఉంచుకొనేలా చేస్తుంది. మరి, మన తదనుభూతి, ఇతరుల అపరిపూర్ణతలను పరిగణలోకి తీసుకొని ‘వారిని క్షమించడానికి’ మనల్ని కదిలించవద్దా?​—⁠కీర్తన 103:​14; కొలొస్సయులు 3:​13.

మనము ఉపదేశం ఇవ్వాల్సివచ్చినప్పుడు, తప్పు చేసిన వ్యక్తి మనోభావాలను, అతను పడే బాధను అర్థం చేసుకుంటే, బహుశా మనం మరింత దయతో అలా చేస్తాము. తదనుభూతిగల క్రైస్తవ పెద్ద తనకు తాను ఇలా గుర్తు చేసుకుంటాడు: ‘నేను కూడా ఈ తప్పు చేసివుండేవాణ్ణే. నేను కూడా అదే పరిస్థితిలో ఉండేవాణ్ణే.’ అందుకే పౌలు ఈ సలహా ఇస్తున్నాడు: “ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసికొని రావలెను.”​—⁠గలతీయులు 6:⁠1.

తోటి క్రైస్తవుడు సహాయం అడగడానికి సంకోచించినప్పటికీ, మనకు సాధ్యమైతే, ఆచరణాత్మకమైన సహాయం అందించ​డానికి కూడా తదనుభూతి మనలను ప్రేరేపించగలదు. “ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును? . . . మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము” అని అపొస్తలుడైన యోహాను వ్రాశాడు.​—⁠1 యోహాను 3:​17, 18.

“క్రియతోను సత్యముతోను” ప్రేమించడానికి, ముందు మనం మన సహోదరుల ప్రత్యేకమైన అవసరాలను గుర్తించాలి. ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశముతో మనం వారి అవసరాలను జాగ్రత్తగా గమనిస్తామా? తదనుభూతి అంటే అదే.

సహానుభూతిని పెంపొందించుకోండి

మనం సహజంగా తదనుభూతి కలవారమై ఉండక​పోవచ్చు, అయినప్పటికీ మనం ఈ సహానుభూతిని పెంపొందించు​కోవచ్చు. మనం మరింత శ్రద్ధగా వింటే, మరింత జాగ్రత్తగా గమనిస్తే, ఇతరుల పరిస్థితిలో మనలను మనం మరింత తరచుగా ఊహించుకొంటే, మన తదనుభూతి పెరుగుతుంది. దాని ఫలితంగా, మన పిల్లలకూ ఇతర క్రైస్తవులకూ మన పొరుగు​వారికీ ఎక్కువ ప్రేమ, దయ, కనికరం చూపించడానికి మనం ప్రేరేపించబడతాము.

స్వార్థం మీ తదనుభూతిని అణచివేయడానికి ఎప్పుడూ అనుమతించకండి. “మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను” అని పౌలు వ్రాశాడు. (ఫిలిప్పీయులు 2:⁠4) యెహోవా మరియు ఆయన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు చూపే తదనుభూతి మీదే మన నిత్య భవిష్యత్తు ఆధారపడివుంది. కాబట్టి, ఈ గుణాన్ని పెంపొందించుకోవలసిన నైతిక బాధ్యత మనపై ఉంది. మెరుగైన పరిచారకులుగా, మెరుగైన తల్లిదండ్రులుగా ఉండడానికి మన తదనుభూతి మనకు శక్తినిస్తుంది. అన్నింటినీ మించి, “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అని మనము తెలుసుకోవడానికి తదనుభూతి మనకు సహాయము చేస్తుంది.​—⁠అపొస్తలుల కార్యములు 20:​35.

[25వ పేజీలోని చిత్రం]

తదనుభూతి కలిగివుండడంలో, ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వారి అవసరాలను జాగ్రత్తగా గమనించడం ఉంది

[26వ పేజీలోని చిత్రం]

ప్రేమగల తల్లికి తన బిడ్డపట్ల సహజంగా ఉండే తదనుభూతిని చూపించడాన్ని మనం నేర్చుకొంటామా?