కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని నియమాలు మన ప్రయోజనార్థమే

దేవుని నియమాలు మన ప్రయోజనార్థమే

దేవుని నియమాలు మన ప్రయోజనార్థమే

“నీ నియమము నాకెంతో ప్రియముగానున్నది.”​—⁠కీర్తన 119:⁠97.

1. దేవుని నియమాలకు విధేయత చూపే విషయంలో ఎలాంటి వైఖరి ప్రబలంగా ఉంది?

దేవుని నియమాలను పాటించడం అంటే నేడు ప్రజలు అంత ఇష్టపడరు. అదృశ్యమైన ఉన్నతాధికారానికి లోబడడం చాలామందికి అర్థరహితంగా కనిపిస్తోంది. వేర్వేరు ప్రజలకు వేర్వేరు ప్రమాణాలు అవసరమని దృష్టించే యుగంలో, మంచి చెడుల మధ్య తేడాలు అస్పష్టమైపోయి ఇది మంచి ఇది చెడు అని నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితులు ఉన్నాయని భావించే యుగంలో మనం ఉన్నాము. (సామెతలు 17:​15; యెషయా 5:​20) “అమెరికన్లలో అత్యధికులు ఏది మంచిది, ఏది సరైనది, ఏది అర్థవంతమైనది అనేవి తమకు తామే నిర్ణయించుకోవాలని కోరుకుంటున్నారని” ఇటీవల జరిగిన ఒక అభిప్రాయ సేకరణ తెలియజేసింది, అది అనేక లౌకికవాద సమాజాల్లో సర్వసాధారణమై ఉన్న ఆలోచనా విధానాన్ని ప్రతిధ్వనిస్తోంది. “మెత్తని దేవుడు కావాలి. కఠినమైన నియమాలు వద్దు. నైతికపరంగానైనా మరే విధంగానైనా ఉన్నత ప్రమాణాలున్న ఉన్నతాధికారులు వద్దు” అని వారు అంటున్నారు. నేడు “మంచి జీవితం, నీతిగల జీవితం అంటే అర్థమేమిటో ప్రజలు తమకు తామే నిర్ణయించుకుంటారని ఆశించబడుతోంది” అని ఒక సామాజిక విశ్లేషకుడు చెబుతున్నాడు. “ఏ రకమైన ఉన్నతాధికారమైనా అసలైన ప్రజల అవసరాలకు అనుగుణంగా తమ ఆజ్ఞలను మార్చుకోవాల్సిందే” అని కూడా ఆయన చెబుతున్నాడు.

2. బైబిలులో నియమం గురించిన మొట్టమొదటి ప్రస్తావన, దైవిక ఆశీర్వాదాలతో దైవిక ఆమోదంతో ఎలా దగ్గరి సంబంధం కలిగివుంది?

2 యెహోవా నియమాల విలువను అంతమంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి, ఆయన నియమాలు మన ప్రయోజనార్థమే ఇవ్వబడ్డాయన్న నిశ్చయతను మనం దృఢపరచుకోవాలి. బైబిలులో మొదటిసారిగా నియమము గురించి పేర్కొనబడిన వృత్తాంతాన్ని పరిశీలించడం ఆసక్తికరంగా ఉంటుంది. దేవుడు పలికిన మాటలను ఆదికాండము 26:5వ వచనంలో మనమిలా చదువుతాము: ‘ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెను.’ అబ్రాహాము వంశస్థులకు వివరణాత్మకమైన ధర్మశాస్త్ర నియమావళిని ఇవ్వడానికి శతాబ్దాల పూర్వం యెహోవా ఆ మాటలు పలికాడు. అబ్రాహాము తనకూ, తన నియమాలకూ చూపిన విధేయతకు దేవుడు ఆయనకు ఎలాంటి ప్రతిఫలమిచ్చాడు? యెహోవా ఇలా వాగ్దానం చేశాడు: “భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును.” (ఆదికాండము 22:​18) దీన్ని బట్టి చూస్తే, దేవుని నియమాలకు విధేయత చూపించడం దైవిక ఆశీర్వాదాలు, దైవిక ఆమోదం పొందడానికి కీలకం అని స్పష్టమవుతోంది.

3. (ఎ) యెహోవా నియమాల పట్ల ఒక కీర్తనకర్త ఎలాంటి భావాన్ని వ్యక్తం చేశాడు? (బి) ఏ ప్రశ్నలను మనం పరిశీలించాలి?

3 కీర్తనకర్తల్లో ఒక వ్యక్తి​—⁠బహుశ భవిష్యత్తులో రాజు కాబోయే ఒక యూదా రాకుమారుడైవుండవచ్చు​—⁠నియమాల గురించి సాధారణంగా మనం తలంచని ఒక భావాన్ని వ్యక్తం చేశాడు. ఆయన దేవునితో ఇలా అన్నాడు: ‘నీ ధర్మశాస్త్రము [“నియమావళి,” NW] నాకెంతో ప్రియముగానున్నది.’ (కీర్తన 119:​97) ఇది భావావేశంతో పలికిన మాట కాదు. అది దేవుని నియమావళిలో వివరించబడిన దేవుని చిత్తం మీద ఆయనకుగల ప్రేమ యొక్క వ్యక్తీకరణ. దేవుని పరిపూర్ణ కుమారుడైన యేసుక్రీస్తు కూడా అలాంటి భావాలనే వ్యక్తపరిచాడు. యేసు ఇలా చెబుతున్నట్లు ప్రవచనాత్మకంగా వర్ణించబడింది: ‘నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము [“నియమావళి,” NW] నా ఆంతర్యములోనున్నది.’ (కీర్తన 40:⁠8; హెబ్రీయులు 10:⁠9) మరి, మన విషయం ఏమిటి? మనం దేవుని చిత్తాన్ని చేయడంలో ఆనందాన్ని అనుభవిస్తున్నామా? యెహోవా నియమాలు ఉపయోగకరమైనవని ప్రయోజనకరమైనవని నమ్మేలా మనం ఒప్పించబడ్డామా? దేవుని నియమాలకు విధేయత చూపించడం మన ఆరాధనలో, దైనందిన జీవితంలో, నిర్ణయాలు తీసుకోవడంలో, ఇతరులతో మన సంబంధాల్లో ఎలాంటి స్థానాన్ని కలిగివుంది? దేవుని నియమాలను ప్రేమించాలంటే, వాటిని తయారుచేసి అమలు చేసే హక్కు దేవునికి ఎందుకుందో అర్థంచేసుకోవడం మంచిది.

యెహోవా​—⁠నియమాలు ఇచ్చే హక్కుగలవాడు

4. నియమాలు తయారు చేసే సంపూర్ణ హక్కు యెహోవాకు మాత్రమే ఎందుకు ఉంది?

4 సృష్టికర్తగా ఈ విశ్వంలో యెహోవాకు మాత్రమే నియమాలు తయారుచేసే సంపూర్ణ హక్కు ఉంది. (ప్రకటన 4:​10-11) ప్రవక్తయైన యెషయా ఇలా చెప్పాడు: “యెహోవా మన శాసనకర్త.” (యెషయా 33:​22) సకల చరాచర సృష్టిని నియంత్రించే భౌతిక నియమాలను ఆయన స్థాపించాడు. (యోబు 38:​4-38; 39:​1-12; కీర్తన 104:​5-19) దేవుడైన యెహోవా సృష్టించిన ప్రాణిగా మనుష్యుడు, ఆయన ఏర్పరచిన భౌతిక నియమాల అధీనంలో ఉన్నాడు. మనుష్యుడు స్వేచ్ఛా చిత్తంగల వాడైనప్పటికీ, తనంతట తానుగా తార్కికంగా ఆలోచించగల సామర్థ్యం ఉన్నప్పటికీ, దేవుని నైతిక ఆధ్యాత్మిక నియమాలకు తనను తాను బద్ధుణ్ణి చేసుకుంటేనే ఆనందంగా ఉండగలడు.​—⁠రోమీయులు 12:⁠1; 1 కొరింథీయులు 2:​14-16.

5. గలతీయులు 6:7 లోని సూత్రము దైవిక నియమాల విషయంలో సత్యమని ఎలా రుజువవుతుంది?

5 యెహోవా చేసిన భౌతిక నియమాలను ఉల్లంఘించడం అసంభవం, అది మనకు తెలుసు. (యిర్మీయా 33:​20, 21) ఒక వ్యక్తి గురుత్వాకర్షణ శక్తి వంటి ఏదైనా భౌతిక నియమాన్ని అతిక్రమించడానికి ప్రయత్నిస్తే దాని పరిణామాలను అనుభవించాల్సివుంటుంది. అదే విధంగా దేవుని నైతిక నియమాలు కూడా మార్చడానికి వీలులేనివే, కుయుక్తితో వాటిని తప్పించుకోవడానికి ప్రయత్నించి లేదా వాటిని ఉల్లంఘించి శిక్షను తప్పించుకోలేము. ప్రకృతి నియమాలు ఎంత ఖచ్చితంగా అమలు అవుతాయో అవి కూడా అంతే ఖచ్చితంగా అమలుపరచబడతాయి, అయితే పర్యవసానాలు అంత త్వరగా అనుభవించాల్సిరాకపోవచ్చు. “మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.”​—⁠గలతీయులు 6:⁠7; 1 తిమోతి 5:⁠24.

యెహోవా నియమాల విస్తృతి

6. దేవుని నియమాలు ఎంత విస్తృతంగా ఉన్నాయి?

6 మోషే ధర్మశాస్త్రము లేదా నియమావళి, దేవుని నియమాలకు ఒక ఉత్కృష్టమైన వ్యక్తీకరణ అని చెప్పవచ్చు. (రోమీయులు 7:​12) ఆ తర్వాత కొంతకాలానికి, దేవుడు మోషే ధర్మశాస్త్రం లేదా నియమావళి స్థానంలో “క్రీస్తు నియమము”ను ఇచ్చాడు. * (గలతీయులు 6:⁠2; 1 కొరింథీయులు 9:​21) “స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమము” క్రింద ఉన్న క్రైస్తవులముగా మనం, దేవుడు తన నిర్దేశాలను కేవలం మన జీవితంలోని కొన్ని అంశాలకు మాత్రమే పరిమితం చేయడని అర్థంచేసుకుంటాము. అంటే ఉదాహరణకు కేవలం సిద్ధాంతపర నమ్మకాలకు లేదా ఆచారవ్యవహారాలకు మాత్రమే వాటిని పరిమితం చేయడు. ఆయన ప్రమాణాలు జీవితంలోని అన్ని అంశాలకు వర్తిస్తాయి, అంటే కుటుంబ వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు, స్త్రీపురుషులు ఒకరితో ఒకరు ప్రవర్తించవలసిన విధానం, తోటి క్రైస్తవుల పట్ల వైఖరి, సత్యారాధనలో పాల్గొనడం వంటి విషయాలకు కూడా అవి వర్తిస్తాయి.​—⁠యాకోబు 1:​25, 27.

7. ప్రాముఖ్యమైన దైవిక నియమాలకు ఉదాహరణలివ్వండి.

7 ఉదాహరణకు బైబిలు ఇలా చెబుతోంది: “జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుషసంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.” (1 కొరింథీయులు 6:​9, 10) అవును, జారత్వము, వ్యభిచారము అనేవి కేవలం “ప్రేమ వ్యవహారాలు” కావు. లేదా సలింగ సంయోగులు పాల్గొనే కార్యకలాపాలు కేవలం “ప్రత్యామ్నాయ జీవన పద్ధతి” అవలంబించడం కాదు. అవి యెహోవా నియమాలను ఉల్లంఘించడమే. దొంగతనాలు, అబద్ధాలాడడం, అపనిందలు వేయడం వంటివి కూడా ఆ కోవకు చెందినవే. (కీర్తన 101:⁠5; కొలొస్సయులు 3:⁠9; 1 పేతురు 4:​15) యాకోబు డంబాలు పలకడాన్ని ఖండించాడు, పౌలు పోకిరి మాటలు మాట్లాడడాన్ని సరసోక్తులు పలుకడాన్ని మానుకోమని మనకు సలహా ఇచ్చాడు. (ఎఫెసీయులు 5:⁠4; యాకోబు 4:​16) క్రైస్తవులకు, ఈ ప్రవర్తనా నియమాలన్నీ దేవుని యథార్థమైన నియమాల్లో భాగమే.​—⁠కీర్తన 19:⁠7.

8. (ఎ) యెహోవా నియమాల స్వభావం ఏమిటి? (బి) “ధర్మశాస్త్రము” అనే పదానికిగల హీబ్రూ పదం వెనుకనున్న ప్రాధమిక అర్థమేమిటి?

8 యెహోవా వాక్యంలోని అలాంటి ప్రాథమిక నిబంధనలు, ఆయన నియమాలు కేవలం శాసనపరమైన చట్టాలు మాత్రమే కావని వెల్లడిచేస్తున్నాయి. అవి సమతుల్యమైన, ఫలవంతమైన జీవితానికి ఆధారంగా ఉన్నాయి, వాటి వల్ల ప్రతి విధమైన ప్రవర్తనా మెరుగుపడుతుంది. దైవిక నియమము పురోభివృద్ధికరంగా ఉంది, నీతిమంతమైనది, ఉపదేశాత్మకమైనది. (కీర్తన 119:​72) కీర్తనకర్త ఉపయోగించిన “ధర్మశాస్త్రము” అనే పదం తోరహ్‌ అనే హీబ్రూ పదం నుండి అనువదించబడింది. ఒక బైబిలు విద్వాంసుడు ఇలా చెబుతున్నాడు: “ఈ పదం నిర్దేశించు, నడిపించు, లక్ష్యం పెట్టుకొను, ముందుకు సాగు అని అర్థమిచ్చే ఒక క్రియతో రూపొందించబడింది. కనుక . . . ప్రవర్తనా నియమావళి అన్నదే దాని అర్థం.” కీర్తనకర్త ఉద్దేశంలో ధర్మశాస్త్రము దేవుడిచ్చిన ఒక కానుక. అది మన జీవిత విధానాన్ని రూపుదిద్దేందుకు అనుమతిస్తూ, మనం కూడా అలాగే ఎంచవద్దా?

9, 10. (ఎ) మనకి ఆధారపడగల నిర్దేశం ఎందుకు అవసరం? (బి) ఆహ్లాదంతో నిండిన, విజయవంతమైన జీవితం మనకు ఏవిధంగా మాత్రమే దక్కుతుంది?

9 సృష్టి ప్రాణులన్నింటికీ ఆధారపడగల నిర్దేశము, నమ్మగల నడిపింపూ అవసరము. మనుషులకన్నా ఉన్నతస్థాయిలో ఉన్న యేసుకు, మరితర దూతలకు కూడా అవి అవసరమే. (కీర్తన 8:⁠5; యోహాను 5:​30; 6:​38; హెబ్రీయులు 2:⁠7; ప్రకటన 22:​8, 9) ఈ పరిపూర్ణ ప్రాణులే దైవిక నడిపింపు నుండి ప్రయోజనం పొందారంటే, అపరిపూర్ణ మానవులు ఇంకెంత ఎక్కువ ప్రయోజనం పొందుతారు! మానవ చరిత్ర, మన స్వంత అనుభవం, ప్రవక్తయైన యిర్మీయా మాటల నిజత్వాన్ని నిరూపించాయి: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.”​—⁠యిర్మీయా 10:⁠23.

10 ఆహ్లాదంతో నిండిన, విజయవంతమైన జీవితం మనకు కావాలంటే మనం నడిపింపు కోసం దేవునివైపు చూడాలి. దైవిక నడిపింపు లేకుండా వ్యక్తిగత ప్రమాణాలకు అనుగుణంగా జీవించడంలోని ప్రమాదాన్ని సొలొమోను రాజు గుర్తించాడు: “ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును.”​—⁠సామెతలు 14:⁠12.

యెహోవా నియమాలను అమూల్యంగా ఎంచడానికి కారణాలు

11. మనం దేవుని నియమాలను అర్థం చేసుకోవాలని ఎందుకు కోరుకోవాలి?

11 యెహోవా నియమాలను అర్థంచేసుకోవాలన్న ప్రగాఢమైన కోరికను పెంపొందించుకోవడం ద్వారా మనకు మేలు కలుగుతుంది. కీర్తనకర్త, “నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము” అని అన్నప్పుడు అలాంటి అభిలాషనే వ్యక్తం చేశాడు. (కీర్తన 119:​18) మనం దేవుణ్ణి, ఆయన విధానాలను ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, యెషయా వ్రాసిన ఈ మాటల నిజత్వాన్ని అంత బాగా అర్థం చేసుకుంటాము: “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను.” (యెషయా 48:​17, 18) తన ప్రజలు తన ఆజ్ఞలకు అవధానాన్ని ఇవ్వడం ద్వారా ప్రమాదాలను నివారించుకుంటూ జీవితాన్ని అనుభవించాలన్నదే యెహోవా హృదయాభిలాష. మనం దేవుని నియమాలను అమూల్యంగా ఎంచడానికి గల కొన్ని ప్రధాన కారణాలను పరిశీలిద్దాము.

12. మన గురించి యెహోవాకు తెలిసిన విషయాలను బట్టి చూస్తే ఆయనే అత్యుత్తమ శాసనకర్త అని ఎలా తెలుస్తోంది?

12దైవిక నియమాలు మన గురించి సర్వమూ తెలిసిన వ్యక్తి నుండి వస్తున్నాయి. యెహోవా మన సృష్టికర్త గనుక మానవుల్లోని అణువణువు ఆయనకు తెలుసన్నది సహేతుకమైన విషయం. (కీర్తన 139:​1, 2; అపొస్తలుల కార్యములు 17:​24-28) సన్నిహిత స్నేహితులకు, బంధువులకు, చివరికి తల్లిదండ్రులకు కూడా తెలియనంత బాగా మన గురించి కేవలం యెహోవాకే తెలుసు. అంతెందుకు, మన గురించి మనకన్నా దేవునికే బాగా తెలుసు! మన సృష్టికర్తకు మన ఆధ్యాత్మిక, భావోద్రేక, మానసిక, శారీరక అవసరాల విషయంలో అసామాన్యమైన గ్రహింపు ఉంది. ఆయన మనవైపు అవధానాన్ని మళ్ళించినప్పుడల్లా, మన నిర్మితి విషయంలో, మన కోరికల విషయంలో, మన అభిలాషల విషయంలో తనకున్న ఎంతో సునిశితమైన అవగాహనను ఉపయోగిస్తాడు. యెహోవా మన పరిమితులను అర్థంచేసుకుంటాడు, కానీ మనలోగల మేలు చేసే సామర్థ్యం గురించి కూడా ఆయనకు తెలుసు. కీర్తనకర్త ఇలా అంటున్నాడు: “మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు.” (కీర్తన 103:​14) కాబట్టి, మనం ఆయన నియమాల బాటలో నడవడానికి కృషి చేసినప్పుడు, దైవిక నడిపింపుకు ఇష్టపూర్వకంగా లోబడినప్పుడు మనం ఒక విధమైన ఆధ్యాత్మిక భద్రతా భావాన్ని అనుభవిస్తాము.​—⁠సామెతలు 3:​19-26.

13. యెహోవా మనకు ప్రయోజనకరమైన దాని గురించి శ్రద్ధకలిగి ఉన్నాడని మనమెందుకు నమ్మకం కలిగివుండగలము?

13దైవిక నియమాలు మనల్ని ప్రేమించే వ్యక్తి నుండి వస్తున్నాయి. దేవుడు మన నిత్య సంక్షేమాన్ని గురించి ఎంతో శ్రద్ధ కలిగివున్నాడు. ఆయన ఎంతో త్యాగం చేసే కదా తన కుమారుణ్ణి “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా” ఇచ్చాడు! (మత్తయి 20:​28) మనం ‘సహింపగలిగినంతకంటె ఎక్కువగా మనల్ని శోధింపబడనివ్వను’ అని యెహోవా వాగ్దానం చేయలేదూ? (1 కొరింథీయులు 10:​13) ఆయన ‘మనల్ని గూర్చి చింతించుచున్నాడు’ అని బైబిలు మనకు హామీనివ్వడం లేదూ? (1 పేతురు 5:⁠7) మానవ సృష్టికి ప్రయోజనకరమైన నిర్దేశాలు ఇవ్వాలన్న ప్రేమపూర్వక ఆసక్తి యెహోవాకు ఉన్నంతగా మరెవరికీ లేదు. మనకేది మంచిదో, ఏది సంతోషాన్నిస్తుందో ఏది దుఃఖాన్ని కలిగిస్తుందో ఆయనకు తెలుసు. మనం అపరిపూర్ణులుగా తప్పులు చేస్తున్నప్పటికీ నీతిని వెంబడిస్తున్నట్లైతే మనకు జీవము ఆశీర్వాదాలు లభించే విధంగా ఆయన తన ప్రేమను చూపిస్తాడు.​—⁠యెహెజ్కేలు 33:⁠11.

14. దేవుని నియమాలు మానవ తలంపులకు ఏ ప్రాముఖ్యమైన విధానంలో భిన్నంగా ఉన్నాయి?

14దేవుని నియమాలు మార్పులేనివి, అవి భరోసాత్మకమైనవి. మనం జీవిస్తున్న సంక్షుభిత కాలాల్లో యెహోవా, రాతిబండలా స్థిరంగా దృఢంగా ఉన్నాడు, యుగయుగాలుగా ఉనికిలో ఉన్నాడు. (కీర్తన 90:⁠2) అయినా ఆయన తనను గురించి తాను ఇలా చెప్పుకున్నాడు: “యెహోవానైన నేను మార్పులేనివాడను.” (మలాకీ 3:⁠6) బైబిలులో నమోదు చేయబడినట్లుగా దేవుని ప్రమాణాలు పూర్తిగా నమ్మదగ్గవి​—⁠తరచుగా మారుతుండే మానవుల తలంపుల ఊబిలాంటివి కావు. (యాకోబు 1:​17) ఉదాహరణకు పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఏమాత్రం కఠినంగా ఉండకూడదని మనస్తత్వ శాస్త్రజ్ఞులు కొన్ని సంవత్సరాలపాటు బోధించారు, కానీ తర్వాత తమ మనస్సులు మార్చుకుని తమ సలహా తప్పని ఒప్పుకున్నారు. ఈ విషయంలో ప్రపంచంలోని ప్రమాణాలు నిర్దేశాలు గాలికి అల్లల్లాడుతున్నట్లుగా అటు ఇటు ఊగుతుంటాయి. అయితే యెహోవా వాక్యము అచంచలమైనది. శతాబ్దాలుగా బైబిలు పిల్లలను ప్రేమతో ఎలా పెంచాలో చెప్పింది. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ఎఫెసీయులు 6:⁠4) మనం యెహోవా ప్రమాణాలపై ఆధారపడగలమనీ, అవి ఎన్నడూ మారవనీ తెలుసుకోవడం ఎంతటి భరోసానిస్తుందో!

దేవుని నియమాలకు విధేయులయ్యేవారికి ఆశీర్వాదాలు

15, 16. (ఎ) మనం యెహోవా ప్రమాణాలను అన్వయించుకున్నప్పుడు ఏమి జరుగుతుంది? (బి) దేవుని నియమాలు వివాహంలో స్థిరమైన నడిపింపును ఎలా ఇవ్వగలవు?

15 తన ప్రవక్తయైన యెషయా ద్వారా దేవుడిలా చెప్పాడు: “నా నోటనుండి వచ్చు వచనము . . . నేను పంపిన కార్యమును సఫలముచేయును.” (యెషయా 55:​10, 11) అదే విధంగా మనం ఆయన వాక్యంలోని ప్రమాణాలను పాటించడానికి గట్టిగా కృషిచేసినప్పుడు మన కార్యాలు కూడా సఫలమవుతాయి, మంచిని సాధిస్తాయి, తద్వారా మనం సంతోషాన్ని అనుభవిస్తాము.

16 విజయవంతమైన వివాహ జీవితానికి దేవుని నియమాలు స్థిరమైన నడిపింపుగా ఎలా ఉన్నాయో పరిశీలించండి. “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును” అని పౌలు వ్రాశాడు. (హెబ్రీయులు 13:⁠4) వివాహ భాగస్వాములు ఒకరిపట్ల ఒకరు గౌరవంతోను ప్రేమతోను ఉండాలి: ‘మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను [“తన భర్తను గౌరవించాలి,” ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌].’ (ఎఫెసీయులు 5:​33) ఎలాంటి ప్రేమను ప్రదర్శించాలో 1 కొరింథీయులు 13:4-8 లో వర్ణించబడింది: “ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వతకాలముండును.” ఇలాంటి ప్రేమ ఉన్న వివాహం శాశ్వతకాలం నిలుస్తుంది.

17. మద్యపానీయాల విషయంలో యెహోవా ప్రమాణాలను అనుసరించడం నుండి ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి?

17 యెహోవా ప్రమాణాలు ప్రయోజనకరమైనవనడానికి మరో రుజువు ఆయన త్రాగుబోతుతనాన్ని ఖండిస్తున్నాడన్న వాస్తవంలో ఉంది. ‘మిగుల మద్యపానాసక్తులుగా’ ఉండడాన్ని కూడా ఆయన ఖండిస్తున్నాడు. (1 తిమోతి 3:​3, 8; రోమీయులు 13:​13) ఈ విషయంలో దేవుని ప్రమాణాలను అలక్ష్యం చేసి అతిగా త్రాగడం మూలంగా అనేకమంది అనేక జబ్బుల బారినపడతారు, లేదా వారికి ఉన్న జబ్బులే ఇంకా తీవ్రతరమవుతాయి. మితంగా ఉండాలన్న బైబిలు సలహాను అలక్ష్యం చేస్తూ కొందరు “కాస్త రిలాక్సవడానికి” అన్నట్లు ప్రారంభించి విపరీతంగా త్రాగే అలవాటులో పడిపోయారు. అతిగా త్రాగడం మూలంగా వచ్చే సమస్యలు అనేకం, గౌరవం పోతుంది, కుటుంబ బాంధవ్యాలు పాడవుతాయి లేదా కుటుంబాలు విడిపోతాయి, ఆదాయం వ్యర్థమవుతుంది, ఉద్యోగం కూడా పోతుంది. (సామెతలు 23:​19-21, 29-35) మద్యం విషయంలో యెహోవా ప్రమాణాలు మనకు కాపుదలగా లేవా?

18. దేవుని నియమాలు ఆర్థిక విషయాల్లో ఆచరణీయమేనా? వివరించండి.

18 దేవుని ప్రమాణాలు ఆర్థిక విషయాల్లో సహితం ఆచరణయోగ్యమైనవిగా నిరూపించబడ్డాయి. క్రైస్తవులు నిజాయితీగా ఉండాలని, శ్రద్ధగా పనిచేయాలని బైబిలు ఉద్బోధిస్తోంది. (లూకా 16:​10; ఎఫెసీయులు 4:​27, 28; కొలొస్సయులు 3:​23) ఈ సలహాను పాటించినందుకే అనేకమంది క్రైస్తవులకు పదోన్నతి కలిగింది లేదా ఇతరులు ఉద్యోగాలు కోల్పోయినప్పుడు తమ ఉద్యోగాలను కాపాడుకున్నారు. ఒక వ్యక్తి జూదం, పొగత్రాగడం, మాదకద్రవ్యాల దురుపయోగం వంటి లేఖన విరుద్ధమైన అలవాట్లను, వ్యసనాలను విసర్జించినప్పుడు ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. దేవుని ప్రమాణాల్లోని ఆర్థికపరమైన ఆచరణయోగ్యతకుగల మరిన్ని ఉదాహరణలు మీ మనస్సులోకి వస్తాయనడంలో సందేహం లేదు.

19, 20. దైవిక నియమాలను స్వీకరించి వాటిని అంటిపెట్టుకుని ఉండడం ఎందుకు జ్ఞానయుక్తమైన మార్గం?

19 దేవుని నియమాల నుండి ప్రమాణాల నుండి అపరిపూర్ణ మానవులు చాలా సులభంగా వైదొలుగుతారు. సీనాయి పర్వతంవద్ద నున్న ఇశ్రాయేలీయుల గురించి ఆలోచించండి. దేవుడు వారికిలా చెప్పాడు: “మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు.” అందుకు వారు, “యెహోవా చెప్పినదంతయు చేసెదమని” జవాబిచ్చారు. అయినా, వారు ఎంపిక చేసుకున్న మార్గం ఎంత విరుద్ధంగా ఉంది! (నిర్గమకాండము 19:​5, 8; కీర్తన 106:​12-43) దానికి భిన్నంగా, మనం దేవుని ప్రమాణాలను స్వీకరించి వాటిని హత్తుకుని ఉందాము.

20 జ్ఞానయుక్తమైన, సంతోషదాయకమైన మార్గం ఏమిటంటే, మన జీవితాలను నడిపించుకోవడానికి యెహోవా అందజేసిన అనుపమానమైన నియమాలను అంటిపెట్టుకుని ఉండడమే. (కీర్తన 19:​7-11) అలా చేయడంలో విజయవంతులమవ్వాలంటే మనం దైవిక సూత్రాల విలువను అర్థం చేసుకుని వాటిని అమూల్యంగా ఎంచాల్సిన అవసరం కూడా ఉంది. తర్వాతి ఆర్టికల్‌ చర్చించబోయే విషయం అదే.

[అధస్సూచి]

^ పేరా 6 “క్రీస్తు ధర్మశాస్త్రము” గురించిన వివరణాత్మక చర్చ కోసం కావలికోట, సెప్టెంబరు 1, 1996, 14-24 పేజీలు చూడండి.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

• మనం దేవుని నియమాలు మన ప్రయోజనార్థమేనని ఎందుకు నమ్మగలము?

• మనం యెహోవా నియమాలను ఏ కారణాల వల్ల అమూల్యంగా ఎంచవచ్చు?

• దేవుని నియమాలు ఏ విధాలుగా ప్రయోజనకరమైనవి?

[అధ్యయన ప్రశ్నలు]

[13వ పేజీలోని చిత్రం]

యెహోవా నియమాలకు విధేయత చూపినందుకు అబ్రాహాము బహుగా ఆశీర్వదించబడ్డాడు

[15వ పేజీలోని చిత్రాలు]

నేటి బిజీ జీవితంలోని చింతలు, అనేకమంది దైవిక నియమాలకు దూరంగా వెళ్ళేలా చేస్తాయి

[17వ పేజీలోని చిత్రం]

రాతిబండపై ఉన్న లైట్‌హౌస్‌లా దైవిక నియమాలు స్థిరంగా ఉంటాయి, అవి మారవు