కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పారిపోవడం యుక్తమైనప్పుడు

పారిపోవడం యుక్తమైనప్పుడు

పారిపోవడం యుక్తమైనప్పుడు

ధైర్యప్రదర్శన చేయడం, వ్యతిరేకతను ఎదిరించడం లేక క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడం వంటి స్ఫూర్తి నేటి లోకంలో సాధారణంగా కనిపిస్తుంది. ఏదైనా ఒక పరిస్థితిని ఎదుర్కోకుండా, అక్కడినుంచి పారిపోయే వ్యక్తి, సాధారణంగా బలహీనుడిగా లేక పిరికివాడిగా పరిగణించబడతాడు. ఆయన ఎగతాళికి కూడా గురవ్వవచ్చు.

అయితే, పారిపోవడమనేది కొన్నిసార్లు జ్ఞానయుక్తమైనది, ధైర్యవంతమైనది అని బైబిలు స్పష్టం చేస్తోంది. ఈ బైబిలు సత్యానికి అనుగుణంగా, యేసు తన శిష్యులను పరిచర్యకు పంపించేముందు, “వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి” అని వారికి చెప్పాడు. (మత్తయి 10:​23) అవును, యేసు శిష్యులు తమను హింసించేవారినుండి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించాలి. తమ మతం మార్చుకొనేలా ఇతరులను బలవంతపెట్టడానికి ప్రయత్నిస్తూ ధర్మయుద్ధం లాంటిది ఏదీ వారు చేయకూడదు. వారు శాంతియుతమైన సందేశాన్ని అందజేస్తారు. (మత్తయి 10:​11-14; అపొస్తలుల కార్యములు 10:​34-37) కాబట్టి, క్రైస్తవులు కోపం తెచ్చుకొనే బదులు, రెచ్చగొట్టే మూలం నుండి దూరంగా ఉంటూ అక్కడినుండి పారిపోవలసి ఉండింది. అలా చేయడం ద్వారా వారు మంచి మనస్సాక్షిని, యెహోవాతో తమకున్న అమూల్యమైన సంబంధాన్ని కాపాడుకోగలిగారు.​—⁠2 కొరింథీయులు 4:⁠1, 2.

బైబిలు పుస్తకమైన సామెతలులో దీనికి విరుద్ధమైన ఉదాహరణను మనం చూస్తాం. శోధించబడినప్పుడు, అక్కడినుండి పారిపోవడానికి బదులు, “పశువు వధకు పోవునట్లు” వేశ్య వెనక వెళ్ళిన ఒక యువకుడి గురించి అది చెబుతుంది. దాని ఫలితం? అతని ప్రాణానికే ముప్పు తెచ్చే శోధనకు లొంగిపోయినందుకు విపత్తు సంభవించింది.​—⁠సామెతలు 7:​5-8, 21-23.

మీరు లైంగిక అనైతికతకు పాల్పడే శోధనను ఎదుర్కొంటే లేక ప్రమాదాలకు దారితీయగల ఇతర పరిస్థితులను ఎదుర్కొంటే, అప్పుడేమిటి? దేవుని వాక్యం ప్రకారం, ఆ పరిస్థితులకు దూరంగా వెళ్ళిపోవడమే అంటే వెంటనే అక్కడినుండి పారిపోవడమే సరైన చర్య.​—⁠సామెతలు 4:​14, 15; 1 కొరింథీయులు 6:​18; 2 తిమోతి 2:​22.