కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఫిలిప్పీన్స్‌లోని పర్వతాల్లో దేవుడ్ని మహిమపరచడం

ఫిలిప్పీన్స్‌లోని పర్వతాల్లో దేవుడ్ని మహిమపరచడం

ఫిలిప్పీన్స్‌లోని పర్వతాల్లో దేవుడ్ని మహిమపరచడం

ఫిలిప్పీన్స్‌ ద్వీపదేశమని మీరనుకుంటుంటే అది వాస్తవమే. అంతేకాక అది ఎత్తైన పర్వతాలున్న దేశం కూడా. నగరాల్లో, పల్లపు ప్రాంతాల్లో ప్రకటించడం యెహోవాసాక్షులకు సాపేక్షికంగా సులభమే, అది ప్రభావవంతంగా కూడా ఉంటుంది. అయితే, పర్వత ప్రాంతాల్లో ప్రకటించడం ఎంతో వేరుగా ఉంటుంది.

ఇసుకతో కూడిన సముద్రతీరాలు, పగడపు దిబ్బలు, జాలర్ల గ్రామాలు, ద్వీప మైదానాల్లోని సందడిగా ఉండే పట్టణాలు, వీటన్నిటికీ పూర్తి భిన్నంగా నిలబడి ఉంటాయి ఆ దేశంలోని ఎత్తైన పర్వతాలు. దేవుని రాజ్య “సువార్త” ప్రకటించడానికి కూడా ఆ పర్వతాలు సవాలుదాయకమైన అవరోధంగానే నిలుస్తాయి.​—⁠మత్తయి 24:​14.

రెండు టెక్టానిక్‌ ప్లేట్స్‌ (విరూపకారక పలకలు) ఒకదానితో ఒకటి ఢీకొనే ప్రాంతంలో ఫిలిప్పీన్‌ ద్వీపాలు నెలకొని ఉన్నాయి. ఈ ప్రాంతంలో, అలా ఢీకొనడం వల్ల ఇరువైపులా ఉన్న నేల ఒకదానిపైకి మరొకటి రావడంతో పెద్ద ద్వీపాల మీద మొనతేలిన పర్వత శ్రేణులు ఏర్పడ్డాయి. ఫిలిప్పీన్స్‌గా రూపొందే 7,100 కన్నా ఎక్కువ ద్వీపాలు “పసిఫిక్‌ అగ్ని వలయం” యొక్క పశ్చిమ వంపు వద్ద ఉన్నాయి. అందుకే ఆ ద్వీపాల్లో అక్కడక్కడా అగ్నిపర్వతాలు ఉన్నాయి, ఇవి కూడా పర్వతాలు ఏర్పడడానికి దోహదపడ్డాయి. అలాంటి ఎత్తుపల్లాలు గల భూ ప్రాంతం, పర్వతాల్లోని ప్రజలను మిగతా ప్రపంచం నుండి దూరం చేసేసింది. అక్కడికి చేరుకోవడం కష్టం, ఎందుకంటే వాహనాలు వెళ్ళేందుకు అనువైన రోడ్లు చాలా తక్కువగా ఉన్నాయి.

ఇలా ఎన్ని అవరోధాలున్నప్పటికీ, యెహోవాసాక్షులు ‘మనుష్యులందరిని’ చేరుకోవలసిన అవసరతను గుర్తిస్తారు. (1 తిమోతి 2:⁠4) కాబట్టి, ఫిలిప్పీన్స్‌లోని సాక్షులు, ఇలా చెబుతున్న యెషయా 42:11, 12 వచనాల స్ఫూర్తికి అనుగుణంగా పనిచేశారు: “సెల నివాసులు సంతోషించుదురు గాక. పర్వతముల శిఖరములనుండి వారు కేకలు వేయుదురు గాక. ప్రభావముగలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురు గాక. ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురు గాక.”

పర్వతాలపైనున్న ప్రజలకు సాక్ష్యమివ్వడానికి 50 సంవత్సరాల కన్నా ముందే తీవ్రమైన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, ఆ పనికి ప్రోత్సాహాన్నివ్వడానికి మిషనరీలు సహాయం చేశారు. స్థానికుల్లో అనేకులు బైబిలు సత్యాన్ని స్వీకరించి, సుదూరాన పర్వతాలపైనున్న గ్రామాల్లో సత్యాన్ని వ్యాప్తి చేయడానికి సహాయం చేశారు. ఇది, చక్కని ఫలితాలను తెచ్చింది. ఉదాహరణకు, ఉత్తర లూజాన్‌లోని కార్డిల్లెర సెంట్రల్‌ పర్వతాల్లో 6,000 కంటే ఎక్కువమంది సువార్త ప్రచారకులు ఉన్నారు. ఈబలోయి, ఈఫుగావు, మరియు కలింగ ప్రజలతో సహా వారిలో చాలామంది స్థానికులే.

అయితే, పర్వతాల్లో ఇప్పటికీ చేరుకోవడం కష్టమైన స్థలాలు ఉన్నాయి. అలాంటి ప్రదేశాల్లో నివసిస్తున్న ప్రజలను సాక్షులు విడిచిపెట్టెయ్యరు. వారిలో కొందరిని ఎలా చేరుకున్నారు, దానికి ప్రతిస్పందన ఎలా ఉంది?

సాంప్రదాయం స్థానంలో నిజమైన విశ్వాసం

లూజాన్‌ ఉత్తర ద్వీపం మీద, అబ్రా మండలంలోని పర్వత ప్రాంతాల్లో టింగియన్లు నివసిస్తున్నారు. ఈ పేరు, “పర్వతం” అనే భావంగల టింగీ అనే ప్రాచీన మలయ్‌ భాషా పదం నుండి వచ్చి ఉండవచ్చు. అది నిజంగా ఎంతో సముచితమైనదే! ప్రజలు కూడా తమను తాము, అలాగే తమ భాషను ఇట్నెగ్‌ అనే చెప్పుకుంటారు. వారు కాబున్యన్‌ అనే దేవుడ్ని నమ్ముతారు, వారి దైనందిన జీవితం మూఢనమ్మకాలచే ఎంతో ప్రభావితం చేయబడుతుంది. ఉదాహరణకు, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్న వ్యక్తి తుమ్మితే అది అశుభం. ఆ చెడు ప్రభావం పోవడానికి అతడు కొన్ని గంటలపాటు ఆగాలి.

1572 లో స్పెయిన్‌ దేశస్థులు ఇక్కడికి క్యాథలిక్‌ మతాన్ని తీసుకువచ్చారు గానీ టింగియన్లకు నిజమైన క్రైస్తవత్వాన్ని బోధించడంలో విఫలమయ్యారు. క్యాథలిక్కులుగా మారినవారు కాబున్యన్‌పై నమ్మకాన్ని వదులుకోలేదు, స్థానిక ఆచారాలనూ అనుసరించేవారు. యెహోవాసాక్షులు ఆ పర్వతాలలో రాజ్య సందేశాన్ని వ్యాపింపజేయడం మొదలుపెట్టినప్పుడు 1930లలో మొదటిగా, బైబిలును గూర్చిన ఖచ్చితమైన పరిజ్ఞానం వీరిని చేరింది. అప్పటి నుండి యథార్థవంతులైన టింగియన్లు చాలామంది “పర్వతముల శిఖరములనుండి” యెహోవాను మహిమపరచడం ప్రారంభించారు.

ఉదాహరణకు, లింగ్బావోన్‌ అనే వ్యక్తి ఆ ప్రాంతంలో మునుపు గౌరవనీయుడైన తెగ నాయకుడిగా ఉన్నాడు. ఆయన టింగియన్‌ సంస్కృతిలో ఎంతో నిమగ్నమై ఉండేవాడు. “నేను టింగియన్‌ సంప్రదాయాలను నమ్మకంగా అనుసరించేవాడిని. ఒక వ్యక్తి చనిపోతే అతడిని భూస్థాపన చేసిన తర్వాత ఒక నృత్యం చేసేవాళ్ళం, జేగంటలు మోగించేవాళ్ళం. జంతువులను కూడా బలి ఇచ్చేవాళ్ళం. మేము కాబున్యన్‌ను నమ్ముకున్నాము, నాకు బైబిలు దేవుడు తెలియదు.” ఆయన పేరుకు క్యాథలిక్‌ మతస్థుడే అయినప్పటికీ అలా ఉండేవాడు.

యెహోవాసాక్షులు ఆ ప్రాంతంలో ప్రకటించడానికి వచ్చారు. వారు లింగ్బావోన్‌ను కలిసి, బైబిలు చదవమని ఆయనను ప్రోత్సహించారు. ఆయనిలా గుర్తు తెచ్చుకుంటున్నాడు: “యెహోవాయే సత్యదేవుడని నన్ను ఒప్పించింది బైబిలే.” అప్పుడు ఒక సాక్షి ఆయనతో బైబిలు అధ్యయనం చేశాడు, లింగ్బావోన్‌ సత్య దేవుడి సేవచేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన తన మునుపటి మార్గాలను, తెగ నాయకుడిగా తన స్థానాన్ని వదిలేశాడు, దానితో స్థానిక ప్రీస్టుకు, లింగ్బావోన్‌ మాజీ సహవాసులకు కోపం వచ్చింది. అయితే, లింగ్బావోన్‌ తాను బైబిలులో కనుగొన్న సత్యాలను అనుసరించాలని నిశ్చయించుకున్నాడు. ఇప్పుడాయన ఒక సంఘ పెద్దగా సేవచేస్తున్నాడు.

ఏడు దినాలు, ఆరు రాత్రులు

అబ్రాలోని కొన్నిభాగాల్లో ఉన్న ప్రజలు ఇప్పుడు సువార్తను క్రమంగా వినగల్గుతున్నప్పటికీ, మిగతా భాగాలు చాలా దూరాన ఉన్నాయి, ఎప్పుడో ఒకసారి మాత్రమే ఆ ప్రాంతాల్లో సాక్ష్యం ఇవ్వబడుతుంది. కొంతకాలం క్రితం, ఈ ప్రాంతాల్లో కొన్నింటిని చేరుకోవడానికి కృషి చేయడం జరిగింది. అబ్రాలోవున్న టినెగ్‌లోని అనియమిత ప్రాంతంలో ప్రకటించడానికి 35 మంది సాక్షుల గుంపు ఒకటి బయలుదేరింది, ఆ ప్రాంతంలో దాదాపు 27 సంవత్సరాలుగా ఎవరూ ప్రకటించలేదు.

ఈ ప్రకటనా యాత్ర కాలినడకన, ఏడు రోజులపాటు సాగింది. ఆహారపదార్థాలను మోసుకు వెళ్తూ, వేలాడే వంతెనలను, లోతైన నదులను దాటుతూ, పర్వతశ్రేణుల మీదుగా గంటల తరబడి నడవడాన్ని ఊహించండి, ఈ ప్రయాసంతా సువార్తను అరుదుగా వినేవారికి ప్రకటించడానికే! ఆ ప్రయాణంలోని ఆరు రాత్రుల్లో, నాలుగు రాత్రులు ఆరుబయట పర్వతాలపై నిద్రించడంతో గడిచిపోయాయి.

సాహసవంతులైన ఈ సాక్షులు తమతో కొంత ఆహారాన్ని తీసుకుని ప్రయాణాన్ని ప్రారంభించినా, మొత్తం ప్రయాణానికి సరిపడేంత తీసుకువెళ్ళలేకపోయారు. అయితే అదేమీ పెద్ద సమస్య కాలేదు, ఎందుకంటే ప్రజలు బైబిలు ఆధారిత ప్రచురణలు తీసుకుని వాటికి బదులుగా ఆహారాన్ని ఎంతో సంతోషంగా ఇచ్చారు. సాక్షులకు ధాన్యము, చేపలు, జింక మాంసం సమృద్ధిగా లభించేవి. కొన్ని అసౌకర్యాలు ఉన్నప్పటికీ, ఆ గుంపు ఇలా చెప్పింది: “మేము చేసిన ఈ త్యాగాలకు తగినవిధంగా, మాకు అవధులు లేని ఆనందం లభించింది.”

ఆ ఏడు రోజుల్లో, ఈ పరిచారకులు పది గ్రామాల్లో సాక్ష్యమిచ్చి, 60 పుస్తకాలు, 186 పత్రికలు, 50 బ్రోషుర్లు, అనేక కరపత్రాలు పంచిపెట్టారు. వాళ్ళు 74 గుంపులకు బైబిలు అధ్యయనాలను ప్రదర్శించి చూపించారు. టినెగ్‌ పట్టణంలో, స్థానిక అధికారులు, కొంతమంది ప్రముఖులైన పౌరులు చేసిన విజ్ఞప్తి మేరకు, ఒక సంఘ కూటము నిర్వహించబడింది, దానికి 78 మంది హాజరయ్యారు. హాజరైనవారిలో చాలామంది ఉపాధ్యాయులు, పోలీసులు ఉన్నారు. ఇంకా ఎక్కువమంది టింగియన్లు, పర్వత శిఖరముల నుండి ‘కేకలు వేస్తూ’ యెహోవాను స్తుతించేవారితో కలుస్తారని ఆశిద్దాము.

బంగారం కన్నా మేలైనది

ఫిలిప్పీన్స్‌లో దక్షిణంగా సుదూరాన కొన్ని ద్వీపాలున్నాయి, స్పెయిన్‌ దేశస్థులు బంగారాన్ని అక్కడే కనుగొన్నారు. అది మిండొరొ అనే పేరును తెచ్చింది, అది స్పానిష్‌ భాషా పదమైన మీనా డె ఓరో యొక్క సంక్షిప్త రూపం, దానికి “బంగారు గని” అని భావం. అయితే, ఆ ద్వీపాల్లో ఇప్పుడు బంగారం కన్నా మేలైనదాన్ని​—⁠సత్య దేవుడైన యెహోవా సేవ చేయాలని కోరుకునే ప్రజలను​—⁠కనుగొనవచ్చు.

మాంగ్యాన్లు అని పిలువబడే దాదాపు 1,25,000 మంది స్థానికులు మిండొరొ అంతర్భాగానవున్న అడవిలో నివసిస్తున్నారు. వాళ్లు చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతారు, బయటి ప్రపంచంతో అంతగా సంబంధాలు పెట్టుకోరు, వారికి తమ స్వంత భాష ఉంది. వారిలో చాలామంది సర్వాత్మవాదులు, బహు దేవతారాధికులు, వారు ప్రకృతిలోని వివిధ ఆత్మలను నమ్ముతారు.

అప్పుడప్పుడు, ఆహారంగానీ ఇతర వస్తువులుగానీ లేనప్పుడు పని వెతుక్కోవడానికి ఒక్కో మాంగ్యాన్‌ తీరప్రాంతాలకు దిగి వస్తాడు. పయీలింగ్‌ అలాగే వచ్చాడు, ఆయన మాంగ్యాన్లలో ఒక ఉపవర్గమైన బంటాన్గాన్‌ అని పిలువబడే వర్గానికి చెందినవాడు. ఆయన పర్వతాల్లోని అడవుల్లో తన ప్రజలతోపాటు పెరిగాడు, బంటాన్గాన్‌ నమ్మకాలను ఆచారాలను అనుసరించాడు. ఆయన సాధారణ వస్త్రధారణ కేవలం నడుముకు కట్టుకునే వస్త్రం మాత్రమే. బంటాన్గాన్‌ సంప్రదాయం ప్రకారం, మంచి పంటలు పండాలంటే ఆరాధకులు ఒక కోడిని చంపి, ప్రార్థనలు చేస్తూ దాని రక్తాన్ని నీళ్ళలోకి బొట్లుబొట్లుగా కార్చేవారు.

పయీలింగ్‌ ఇప్పుడిక ఆ ఆచారాలను అనుసరించడం లేదు. ఎందుకని? ఆయన పల్లపు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు యెహోవాసాక్షుల కుటుంబాల దగ్గర ఆయనకు పని దొరికింది. ఈ కుటుంబాల్లో ఒకరు ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటూ, పయీలింగ్‌కు బైబిలు సత్యాన్ని పరిచయం చేశారు. ఆయన చక్కగా ప్రతిస్పందించి, మానవుని గురించి భూమి గురించి యెహోవాకున్న సంకల్పాన్ని తెలుసుకోవడంలోని విలువను నిజంగా గ్రహించాడు. ఆయన ప్రాథమిక పాఠశాలకు వెళ్ళడానికి, బైబిలు అధ్యయనం చేయడానికి వారు ఏర్పాట్లు చేశారు. పయీలింగ్‌ 24 ఏళ్ళ వయస్సులో యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకున్నాడు. ముఫ్ఫై ఏళ్ళ వయస్సులో ఆయన ఉన్నత పాఠశాల విద్య రెండవ సంవత్సరంలో ఉండి, పాఠశాలనే తన ప్రకటనా క్షేత్రంగా చేసుకున్నాడు. వారు ఇప్పుడాయనను రోలాండో (పల్లపు ప్రాంతాల్లో సాధారణంగా పెట్టుకునే పేరు) అని పిలుస్తున్నారు.

ఇప్పుడు మీరు రోలాండోను కలిస్తే, ఆయన చక్కగా వస్త్రాలు ధరించి, చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తాడు, ఇప్పుడాయన మిండొరొ సంఘాల్లో ఒకదానిలో పరిచర్య సేవకునిగా ఉంటూ, పూర్తికాల సువార్తికునిగా సేవ చేస్తున్నాడు. ఇటీవలనే రోలాండో పర్వత ప్రాంతాలకు తిరిగి వెళ్ళాడు, అయితే బంటాన్గాన్లతో కలిసి వాళ్ళ సాంప్రదాయాలను ఆచరించడానికి కాదు గానీ, బైబిలులో నుండి జీవదాయక సత్యాలను వారితో పంచుకోవడానికే తిరిగి వెళ్ళాడు.

రాజ్యమందిరం కావాలన్న ఆతురత

సెబానో భాషలో “పర్వతాల ప్రజలు” అనే భావంగల బుకిడ్నోన్‌ మండలం మిండనావో దక్షిణ ద్వీపంపై నెలకొని ఉంది. ఇది పర్వతాలు, లోయల్లోని సెలయేర్లు, నదీ లోయలు, పీఠభూములు గల ప్రాంతం. సారవంతమైన నేల మూలంగా అక్కడ పైనాపిల్‌, మొక్కజొన్న, కాఫీ, వరి, అరటి వంటివి పండించబడతాయి. టలాన్డిగ్‌, హిగోనోన్‌ వంటి పర్వతప్రాంతాల తెగలవారు అక్కడ నివసిస్తున్నారు. వీరు కూడా యెహోవా గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇటీవల, టలకాగ్‌ పట్టణం వద్ద చాలా ఆసక్తికరమైన విధంగా దానికి మార్గం సుగమం చేయబడింది.

చల్లని వాతావరణంగల పర్వత ప్రాంతాలకు వెళ్ళిన సాక్షులకు స్నేహపూర్వకమైన ఆహ్వానం లభించింది. స్థానిక ప్రజలు సర్వశక్తిగల దేవుడైన తండ్రిని నమ్ముతున్నామని చెప్పుకుంటారు, కానీ ఆయన పేరేమిటో వాళ్ళకు తెలియదు. వాళ్ళు చాలా సమయం అడవిలోనే గడుపుతారు గనుక, వాళ్ళు యెహోవాసాక్షులను కలిసింది ఇదే మొదటిసారి. దేవుని పేరు, దానితోపాటు రాజ్యం సంబంధంగా ఆయనకున్న అద్భుతమైన సంకల్పం వారికి తెలియజేయబడ్డాయి. ప్రజలు ఎంతో సంతోషించారు, కాబట్టి గ్రామాన్ని మళ్ళీ సందర్శించాలని నిర్ణయించడం జరిగింది.

అలా చాలాసార్లు సందర్శించడం జరిగింది. ఫలితంగా, స్థానికులు యెహోవాసాక్షుల “గృహం” కోసం ఒక స్థలాన్ని ఇస్తామన్నారు. సాక్షులు దాన్ని ఆనందంగా స్వీకరించారు. ఆ స్థలం ఆ ప్రాంతంలోని కొండలన్నిటిలోకి ఎత్తైన దానిపై ఉంది, అక్కడి నుండి క్రింద రోడ్డు కనిపిస్తుంటుంది. కలప, వెదురు, ఈతాకులు ఉపయోగించి ఆ హాలు నిర్మించబడింది. దానికి మొత్తం మూడు నెలల పది రోజులు పట్టింది. ఆ హాలు ముందు భాగంలో “యెహోవాసాక్షుల రాజ్యమందిరం” అనే బోర్డు ప్రముఖంగా కనిపిస్తుంటుంది. ఒక్కసారి ఆలోచించండి, సంఘం ఏర్పడక ముందే రాజ్యమందిరం నిర్మించబడింది!

ఆ తర్వాత, పూర్తికాల పరిచారకుడైన ఒక సంఘ పెద్ద, ఒక పరిచర్య సేవకుడు అక్కడికి వచ్చారు. ఇరుగుపొరుగు ప్రాంతాల్లోని సాక్షులతో కలిసి వారు ఒక సంఘాన్ని ఏర్పరచడానికి కృషిచేశారు. దానితో, 1998 ఆగస్టులో ఒక చిన్న సంఘం ఏర్పడింది. పర్వత ప్రాంతాల ప్రజలు బైబిలు సత్యాలను తెలుసుకునేందుకు సహాయం చేస్తూ, ఆ సంఘం ఇప్పుడు ఆ రాజ్యమందిరాన్ని చక్కగా ఉపయోగించుకుంటోంది.

నిజంగా, చేరుకోవడం కష్టమైన పర్వత ప్రాంతాలకు కూడా రాజ్య సత్యాన్ని వ్యాప్తి చేయడానికి, సుముఖత గల తన సేవకులను యెహోవా గొప్పగా ఉపయోగించుకున్నాడు. ‘సువర్తమానము ప్రకటించుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి’ అని చెబుతున్న యెషయా 52:7వ వచనం మనకు గుర్తు చేయబడుతోంది.

[11వ పేజీలోని మ్యాపులు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

అబ్రా

మిండొరొ

బుకిడ్నోన్‌

[చిత్రసౌజన్యం]

భూగోళం: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

[10వ పేజీలోని చిత్రాలు]

పర్వతాల్లో ప్రకటించడానికి ఎత్తుపల్లాలుగల ప్రాంతాల్లో గంటలతరబడి కాలినడకన ప్రయాణించవలసి ఉంటుంది

[10వ పేజీలోని చిత్రం]

పర్వత ప్రాంతంలోని వాగులో బాప్తిస్మం