కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భద్రతాభావం ఇప్పుడూ, ఎల్లప్పుడూ

భద్రతాభావం ఇప్పుడూ, ఎల్లప్పుడూ

భద్రతాభావం ఇప్పుడూ, ఎల్లప్పుడూ

తరచుగా మనం భద్రతను ఎందుకు పొందలేము, ఒకవేళ పొందినా, అది శాశ్వతంగా ఎందుకు ఉండిపోదు? మన భద్రతాభావం, మనం సాధించగలదానిపై కంటే మనం సాధించాలని ఆశించేదానిపై అంటే కేవలం భ్రాంతిపై ఆధారపడి ఉండడమే దానికి కారణమా? అలాంటి భ్రాంతిని స్వప్న జగత్తులో జీవించడమని పిలువవచ్చు.

మన మనస్సు అభద్రతాభావాలుగల జీవిత వాస్తవికతను వదిలి, అందమైన సురక్షితమైన పరిస్థితిలోకి ప్రవేశించి, ఆ కలను పాడుచేసే దేన్నైనా అలక్ష్యం చేసే స్థితినే భ్రాంతి అని చెప్పవచ్చు. అయితే తరచు, వాస్తవ ప్రపంచంలోని సమస్యలు హఠాత్తుగా ఈ స్వప్న జగత్తులోకి చొరబడి, క్షేమంగా ఉన్నామన్న భావనను నిర్దాక్షిణ్యంగా రూపుమాపి, కలలు కనే వ్యక్తిని భయంకరమైన వాస్తవంలోకి మేలుకునేలా చేస్తాయి.

ప్రజలు భద్రతను పొందడానికి ప్రయత్నించే ఒక అంశమైన స్థలం గురించి పరిశీలిద్దాము. ఉదాహరణకు, సుఖాలను, పెద్ద జీతాలను, మంచి వసతిని పొందవచ్చుననే కలలను రేకెత్తిస్తూ పెద్ద నగరాలు ఆశాజనకంగా కనిపించవచ్చు. అవును, అది ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భద్రతను ఇస్తుందనిపించవచ్చు. కానీ ఈ కల వాస్తవమైనదేనా?

స్థలం​—⁠పెద్ద నగరం నిజంగానే భద్రతనిస్తుందా?

వర్ధమాన దేశాల్లో, పెద్ద నగరాలకు వెళ్ళాలన్న కోరిక, ప్రలోభపెట్టే వ్యాపార ప్రకటనల ద్వారా పెంపొందింపజేయబడుతుంది. అలాంటి వ్యాపార ప్రకటనల వెనుకనున్న సంస్థలు మీ భద్రతపట్ల కాదు గానీ తమ అమ్మకాలపట్ల ఆసక్తి కలిగి ఉంటాయి. అవి, వాస్తవ లోకంలోని సమస్యలకు తళుకు బెళుకులు అద్ది భద్రత అందుబాటులో ఉందన్నట్లు చూపిస్తాయి. అలా భద్రత, అవి ప్రచారం చేసే ఉత్పత్తితోనూ, పెద్ద నగరాలతోనూ ముడిపడిపోతుంది.

ఈ ఉదాహరణను పరిశీలించండి. పశ్చిమాఫ్రికాలో ఒక నగరంలోని అధికారులు, పొగత్రాగడాన్ని గురించి తమ దేశపౌరులను హెచ్చరించడానికి చేసే ప్రచారంలో భాగంగా, పొగత్రాగడమంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును తగులబెట్టడమేనని సుస్పష్టంగా చూపించే బోర్డులను తయారుచేసి పెట్టారు. సిగరెట్‌ ఉత్పత్తిదారులూ అమ్మకందారులూ దానికి ఎదురుదాడి చేస్తూ, పొగత్రాగేవారు సంతోషంగా విజయగర్వంతో ఉన్నట్లు చూపించే ఆకర్షణీయమైన దృశ్యాలున్న, యుక్తిగా రూపొందించబడిన బోర్డులను తయారుచేసి పెట్టారు. అంతేగాక, ఒక సిగరెట్‌ కంపెనీ, తన ఉద్యోగుల్లో కొందరికి చక్కని యూనిఫారమ్‌లను, ఆకర్షణీయమైన బేస్‌బాల్‌ కాప్‌లను ఇచ్చి, “ఒక్కసారి త్రాగి చూడండి” అంటూ ఒక్కొక్కరిని ప్రోత్సహిస్తూ వీధుల్లోని యౌవనస్థులకు సిగరెట్లు పంచిపెట్టమని పంపించింది. ఈ యౌవనస్థుల్లో చాలామంది గ్రామాల నుండి వచ్చినవారు, కాబట్టి వ్యాపార ప్రకటనల చాతుర్యం గురించి తెలియని ఈ అమాయకులు మోసపోయారు. వీరు పొగత్రాగడానికి అలవాటు పడిపోయారు. యౌవనస్థులైన ఈ గ్రామీణులు, తమ కుటుంబాలకు మద్దతునివ్వగలిగేలా లేదా ఆర్థికంగా అభివృద్ధి చెందగలిగేలా భద్రతను పొందాలని పెద్ద నగరానికి వచ్చారు. దానికి బదులుగా, మంచి సంకల్పాల కోసం ఉపయోగించగలిగే డబ్బును చాలామేరకు పొగత్రాగడానికి తగులబెట్టేస్తున్నారు.

పెద్ద నగరంలో విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు చూపించే వ్యాపార ప్రకటనలను రూపొందించేది కేవలం వ్యాపారులే కాదు. పెద్ద నగరాలకు తరలి వచ్చి తమ స్వగ్రామానికి తిరిగి వెళ్ళడానికి సిగ్గుపడే ప్రజల నోళ్ళలో నుండి కూడా అలాంటి మాటలు వెలువడవచ్చు. విఫలమైనట్లు కనిపించడానికి ఇష్టపడక, తాము నగరంలో సంపదలు, సాఫల్యాలు పొందామని గొప్పలు చెప్పుకుంటారు. అయితే, వారు తమకున్నదని చెప్పుకుంటున్న హోదాను నిశితంగా పరిశీలిస్తే, ప్రస్తుతం వారికున్న జీవన విధానం వారు మునుపు గ్రామంలో గడిపినదాని కన్నా మెరుగైనదేమీ కాదని తెలుస్తుంది; ఇతర నగర వాసుల్లాగే వారు ఆర్థికంగా ఎన్నో బాధలు పడుతున్నారు.

ప్రాముఖ్యంగా పెద్ద నగరాల్లో, నీతినియమాలు లేని వారికి ఎరగా దొరికేది, భద్రత కోసం క్రొత్తగా నగరాలకు తరలి వచ్చిన వారే. ఎందుకు? ఎందుకంటే సాధారణంగా, సన్నిహిత స్నేహబంధాలను ఏర్పరచుకోవడానికి వీరికి తగినంత సమయం లభించదు, అంతేగాక వారు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు. కాబట్టి, వస్తుదాయకమైన నగర జీవన ఉచ్చులను తప్పించుకోవడానికి సహాయం చేయగల సలహాదారులెవరూ వారికి ఉండరు.

జోజ్యే పొగత్రాగడమనే ఉచ్చులో చిక్కుకోలేదు. అంతేగాక, నగర జీవన విధానం కోరుతున్నవి తన శక్తికి మించినవనీ, వాటిని తాను విజయవంతంగా నిర్వర్తించలేననీ ఆయన గ్రహించాడు. కాబట్టి ఆయన విషయంలో, నగరం ఆయనకు నిజంగా ఇవ్వగలిగిందల్లా నెరవేరని కలలే. నగరంలో తనకు నిజమైన భద్రత లేదని ఆయన గుర్తించాడు; అది ఆయనకు సరైన స్థలం కాదు. అసంతోషము, ఆత్మన్యూనతా భావాలు, విఫలమయ్యాననే భావాలు ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఆయన తనను తాను తగ్గించుకుని, తిరిగి తన గ్రామం చేరాడు.

అందరూ తనను హేళన చేస్తారేమోనని కాస్త భయపడ్డాడు. కానీ ఆయన కుటుంబ సభ్యులు, నిజమైన స్నేహితులు హృదయపూర్వకంగా ఆయనకు ఆహ్వానం పలికారు. కుటుంబంలోని ఆప్యాయత, గ్రామంలోని సుపరిచిత పరిసరాలు, క్రైస్తవ సంఘంలోని స్నేహితుల ప్రేమ, వీటన్నిటి మూలంగా ఆయన త్వరలోనే, అనేకుల కలలు పీడకలలుగా మారే పెద్ద నగరంలో కంటే అక్కడే ఎక్కువ భద్రతను అనుభవించాడు. తన తండ్రితో కలిసి పొలాల్లో కష్టపడి పనిచేయడం మూలంగా తనకు, తన కుటుంబానికి లభించిన మొత్తం, నగరంలో తాను సంపాదించి ఉండగల నికర ఆదాయం కన్నా ఎంతో ఎక్కువే ఉండడం ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

డబ్బు​—⁠అసలు సమస్య ఏమిటి?

డబ్బు మీకు భద్రతా భావాన్నిస్తుందా? కెనడాకు చెందిన లిజ్‌ ఇలా చెబుతోంది: “యౌవనస్థురాలిగా నేను, డబ్బు అన్ని చింతలను తొలగిస్తుందని విశ్వసించాను.” ఆర్థికంగా బాగా ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తిని ఆమె ప్రేమించింది. త్వరలోనే వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు. ఆమె భద్రతా భావాన్ని అనుభవించిందా? లిజ్‌ ఇలా కొనసాగిస్తోంది: “నేను పెళ్ళి చేసుకున్నప్పుడు, మాకు అందమైన ఇల్లు, రెండు కార్లు ఉండేవి, మా ఆర్థిక స్తోమత, వస్తుపరంగా, ప్రయాణాల విషయంలో, వినోదం విషయంలో దాదాపు ఏదైనా ఆనందించే స్వేచ్ఛనిచ్చింది. అయినప్పటికీ చిత్రమైన విషయమేమిటంటే, నేను డబ్బు గురించి ఆందోళనపడుతుండేదాన్ని.” దానికి కారణమేమిటో ఆమె ఇలా వివరిస్తోంది: “మాకు కోల్పోవడానికి చాలా ఉంది. ఎంత ఎక్కువ ఉంటే భద్రతా భావం అంత తక్కువగా ఉంటుందని అనిపిస్తుంది. డబ్బు చింతలను లేదా వ్యాకులతను తొలగించలేకపోయింది.”

భద్రత కలిగి ఉండడానికి కావలసినంత డబ్బు మీ దగ్గర లేదని మీకు అనిపిస్తే, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘అసలు సమస్య ఏమిటి? డబ్బు లేకపోవడమా లేక ఉన్న డబ్బును జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోలేకపోవడమా?’ తన గతం గురించి ఆలోచిస్తూ, లిజ్‌ ఇలా అంటోంది: “నా చిన్నతనంలో మా కుటుంబానికి ఉన్న సమస్యలకు మూలం, డబ్బును జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోలేకపోవడమని ఇప్పుడు నేను గ్రహిస్తున్నాను. మేము అప్పు చేసి ఖర్చుపెట్టే వాళ్ళం, అందుకే మేము ఎప్పుడూ బాకీలు కడుతూనే ఉండాల్సి వచ్చేది. అది వ్యాకులతకు కారణమైంది.”

అయితే నేడు లిజ్‌, ఆమె భర్త ఇద్దరూ కూడా తమ దగ్గర తక్కువ డబ్బే ఉన్నప్పటికీ, సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నారు. వాళ్ళు దేవుని వాక్య సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, డబ్బు గురించి చెప్పబడే ఆకర్షణీయమైన విషయాల గురించి వినడం మానేసి, “నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును” అనే మాటలతో సహా, దేవుని జ్ఞానము చెబుతున్న దాన్ని వినడం మొదలుపెట్టారు. (సామెతలు 1:​33) తమ జీవితాలు, పెద్ద బ్యాంకు మొత్తం ఇవ్వగల దానికంటే ఎక్కువ అర్థాన్ని కలిగి ఉండాలని వారు కోరుకున్నారు. ఇప్పుడు, దూరదేశంలో మిషనరీలుగా లిజ్‌, ఆమె భర్త, యెహోవా దేవుడు త్వరలోనే భూ వ్యాప్తంగా నిజమైన భద్రతను తీసుకువస్తాడని గొప్పా బీదా తేడా లేకుండా అందరికీ బోధిస్తున్నారు. ఈ పని, ఆర్థిక లాభం నుండి కాక శ్రేష్ఠమైన సంకల్పం నుండి, ఉన్నతమైన విలువల నుండి, ఉత్పన్నమయ్యే ప్రగాఢమైన సంతృప్తిని, స్థిరత్వాన్ని వాళ్ళకు ఇస్తుంది.

ఈ ప్రాథమిక సత్యాన్ని గుర్తుంచుకోండి: వస్తుపరంగా ధనికులమై ఉండడం కంటే దేవుని దృష్టిలో ధనికులమై ఉండడం ఎంతో అమూల్యమైనది. పరిశుద్ధ లేఖనాలన్నిటిలోనూ, వస్తుసంపదలను సంపాదించుకోవడానికి కాదుగానీ యెహోవా ఎదుట మంచి స్థానాన్ని కలిగి ఉండడానికి అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వబడుతోంది, దీన్ని మనం విశ్వాసంతో దైవిక చిత్తాన్ని చేయడంలో కొనసాగడం ద్వారా కాపాడుకోవచ్చు. ‘దేవునియెడల ధనవంతులై ఉండి, పరలోకమందు ధనమును’ సమకూర్చుకొనమని యేసుక్రీస్తు మనల్ని ప్రోత్సహించాడు.​—⁠లూకా 12:​21, 33.

హోదా​—⁠అసలు మీరెక్కడికెళుతున్నారు?

సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటే భద్రత లభిస్తుందని భావించేలా మీరు శోధించబడుతుంటే, మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘ఉన్నత స్థానంలో ఉన్న ఎవరు నిజమైన భద్రతను సంపాదించుకోగలిగారు? దాన్ని పొందడానికి నేను ఎంత ఎత్తుకి ఎదగాలి?’ ఉన్నత స్థానానికి చేరుకోవడం, నిరాశకు లేదా అంతకంటే ఘోరంగా నాశనకరమైన పతనానికి నడిపిస్తూ మనకు బూటకపు భద్రతా భావాన్ని ఇవ్వవచ్చు.

మనుష్యుల ఎదుట మంచి పేరు సంపాదించుకోవడం కన్నా దేవుని ఎదుట మంచి పేరును సంపాదించుకోవడం మరింత భద్రతను ఇస్తుందని వాస్తవ అనుభవాలు చూపిస్తున్నాయి. యెహోవా మాత్రమే మానవులకు నిత్యజీవ బహుమానాన్ని ఇవ్వగలడు. మన పేరును ఏదో ప్రముఖుల పేర్ల పట్టికలో కాదుగానీ దేవుని జీవగ్రంథములో వ్రాయడం కూడా దానిలో ఇమిడివుంది.​—⁠నిర్గమకాండము 32:​32; ప్రకటన 3:⁠5.

మీరు మీ ఆశాపూరిత ఆలోచనా విధానాన్ని ప్రక్కన పెడితే, మీ ప్రస్తుత పరిస్థితిని మీరెలా మదింపు చేసుకుంటారు, భవిష్యత్తులో ఏమి లభిస్తుందని మీరు యథార్థంగా ఆశించగలరు? ఎవరికీ అన్నీ ఉండవు. జ్ఞానవంతుడైన ఒక క్రైస్తవుడన్నట్లుగా, “జీవితమంటే ‘ఇది అలాగే అది’ కాదు గానీ, ‘ఇది లేక అది’ మాత్రమేనని నేను నేర్చుకోవలసి వచ్చింది.” ఒక్క క్షణం ఆగి, “బెనిన్‌లో చెప్పబడింది” అనే బాక్సును చదవండి.

ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి: నా జీవితంలో ప్రాముఖ్యమైన గమ్యం లేక లక్ష్యం ఏమిటి? దాన్ని చేరుకోవడానికి అతి సూటియైన మార్గం ఏది? నేను సుదీర్ఘమైన, అసురక్షితమైన పెడమార్గంపై ఉన్నానా, నాకు నిజంగా కావలసినదాన్ని, వాస్తవంగా పొందగలిగినదాన్ని తక్కువ సంక్లిష్టమైన మార్గం ద్వారా పొందడం సాధ్యమేనా?

ఆధ్యాత్మిక విషయాలకున్న విలువతో పోలిస్తే వస్తుపరమైన వాటికి ఉన్న సాపేక్షమైన విలువ గురించి ఉపదేశించిన తర్వాత యేసు, కంటిని “తేటగా” ఉంచుకొమ్మని చెప్పాడు. (మత్తయి 6:​22) ఆధ్యాత్మిక విలువలూ, దేవుని నామముపై ఆయన రాజ్యంపై కేంద్రీకృతమై ఉండే లక్ష్యాలూ జీవితంలో ప్రధానమైనవని ఆయన స్పష్టంచేశాడు. (మత్తయి 6:​9, 10) ఇతర విషయాలు అంత ప్రాముఖ్యమైనవి కాదు.

నేడు అనేక కెమేరాలు సమీపంలో ఉన్న వాటిపైన, దూరంలో ఉన్న వాటిపైన యాంత్రికంగా ఫోకస్‌ చేయగలుగుతాయి. మీరు కూడా అలా దృష్టి నిలుపుతారా? మీరు దృష్టి నిలిపేదంతా ప్రాముఖ్యమైనదేనా, కోరుకొనదగినదేనా, కొంత ఆశాభావంతో, సాధించగలిగినదేనా? అది కొంతమేరకు నిజమే అయినా కూడా, క్రైస్తవులకు ప్రాముఖ్యమైనదైన రాజ్యం, మీ అవధానాన్ని పొందడానికి పోటీపడుతున్న ఇతర రూపాల వల్ల సులభంగా మరుగున పడిపోగలదు. యేసు ఇచ్చిన శక్తివంతమైన హెచ్చరిక ఏమిటంటే: “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.”​—⁠మత్తయి 6:​33.

ఇప్పుడూ, ఎల్లప్పుడూ భద్రత

మనకు, మనకు ప్రియమైనవారికి మంచి జరగాలని మనమందరం కలలు కనవచ్చు. అయితే వాస్తవమేమిటంటే మనం అపరిపూర్ణులం, అపరిపూర్ణ లోకంలో జీవిస్తున్నాం, మనకు పరిమితమైన జీవితాయుష్షు మాత్రమే ఉంది, కాబట్టి మనం వాస్తవికంగా సాధించాలని ఆశించేవాటన్నిటినీ సాధించలేము. వేల సంవత్సరాల క్రితం ఒక బైబిలు రచయిత ఇలా వివరించాడు: “మరియు నేను ఆలోచింపగా సూర్యునిక్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు; బలముగలవారు యుద్ధమునందు విజయ మొందరు; జ్ఞానముగలవారికి అన్నము దొరకదు; బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు; తెలివిగలవారికి అనుగ్రహము దొరకదు; ఇవియన్నియు అదృష్టవశముచేతనే కాలవశము చేతనే అందరికి కలుగుచున్నవి.”​—⁠ప్రసంగి 9:​11.

కొన్నిసార్లు మనం, అలసట పుట్టించే దైనందిన కార్యకలాపాల్లో ఎంతగా మునిగిపోతామంటే, మనమెవరం, నిజమైన భద్రతాభావం కలిగి ఉండడానికి మనకు వాస్తవంగా అవసరమైనదేమిటి అనే మరింత ప్రాముఖ్యమైన విషయాలను ఆలోచించడం కూడా మరిచిపోతాము. ఈ ప్రాచీన జ్ఞానవచనాలను పరిశీలించండి: “ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తినొందడు, ధనసమృద్ధి నపేక్షించువాడు దానిచేత తృప్తినొందడు. ఇదియు వ్యర్థమే. కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధనసమృద్ధిచేత నిద్రపట్టదు.” (ప్రసంగి 5:​10, 12) అవును, మీకు భద్రతనిచ్చేది ఏది?

మీ పరిస్థితి కూడా కొంతమేరకు జోజ్యే యొక్క అవాస్తవికమైన స్వప్నంలానే ఉంటే, మీరు మీ పథకాలను మార్చుకోగలరా? జోజ్యే కుటుంబ సభ్యులు, క్రైస్తవ సంఘంలోని స్నేహితుల్లానే, మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు మీకు మద్దతునిస్తారు. నగరంలో, మీ నుండి ప్రయోజనం పొందాలని చూసేవారి మధ్య కన్నా, నిరాడంబరమైన పరిసరాల్లో, మిమ్మల్ని ప్రేమించేవారి మధ్య మీరు గొప్ప భద్రతను కనుగొనవచ్చు.

లిజ్‌కు, ఆమె భర్తకు ఉన్నట్లుగా మీకు ఇప్పటికే సమృద్ధిగా ఉంటే, నిజమైన భద్రతను పొందడానికి మూలమైన రాజ్యం గురించి తెలుసుకోవడానికి గొప్పా బీదా తేడా లేకుండా ప్రజలకు సహాయం చేయడానికి మీరు మరింత సమయాన్ని, శక్తిని వెచ్చించగలిగేలా మీ జీవన విధానంలో మార్పులు చేసుకోగలరా?

మీరు సమాజంలో ఉన్నత హోదాను పొందడానికి ప్రయత్నిస్తుంటే, మిమ్మల్ని ప్రేరేపిస్తున్నదేమిటో మీరు యథార్థంగా ఆలోచించాలనుకోవచ్చు. నిజమే, మీకు మరిన్ని సౌకర్యాలుంటే మీ జీవితం ఆనందభరితమవుతుంది. అయినప్పటికీ, శాశ్వత భద్రతను పొందడానికి మూలమైన రాజ్యంపై మీరు మీ దృష్టిని కేంద్రీకరించగలుగుతున్నారా? “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అని చెప్పిన యేసు మాటలు గుర్తు తెచ్చుకోండి. (అపొస్తలుల కార్యములు 20:​35) మీరు క్రైస్తవ సంఘంలో వివిధ కార్యకలాపాల్లో నిమగ్నమైతే, మీరు ప్రతిఫలదాయకమైన భద్రతను అనుభవిస్తారు.

యెహోవాపై, ఆయన రాజ్యంపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండేవారు, ఇప్పుడు హృదయోత్తేజకరమైన భద్రతను అనుభవిస్తారు, భవిష్యత్తులో సంపూర్ణమైన భద్రతను పొందడానికి ఎదురు చూస్తారు. కీర్తనకర్త ఇలా చెప్పాడు: “సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరముకూడ సురక్షితముగా నివసించుచున్నది.”​—⁠కీర్తన 16:⁠8, 9.

[6వ పేజీలోని బాక్సు/చిత్రం]

బెనిన్‌లో చెప్పబడింది

ఈ కథ అనేక మార్పులతో వేలసార్లు చెప్పబడింది. ఇటీవల, పశ్చిమాఫ్రికాలో ఉన్న బెనిన్‌లోని ఒక వృద్ధ గ్రామీణుడు ఈ క్రింది కథను కొంతమంది యౌవనస్థులకు చెప్పాడు.

ఒక జాలరి తన తెడ్లపడవలో ఇంటికి తిరిగి వస్తాడు, ఈ వర్ధమాన దేశంలో పనిచేస్తున్న ఒక విదేశీ వ్యాపార నిపుణుడు ఆ జాలరిని కలుస్తాడు. ఇంత త్వరగా తిరిగివచ్చావేమని ఆ నిపుణుడు జాలరిని అడుగుతాడు. ఇంకా ఎక్కువసేపు ఉండగలిగేవాడే గానీ తన కుటుంబానికి అవసరమైనన్ని చేపలు పట్టుకున్నానని జాలరి జవాబిస్తాడు.

“అసలు నీవు నీ సమయమంతా ఏం చేస్తుంటావు?” అని నిపుణుడు అడుగుతాడు.

“కాసేపు చేపలు పడతాను. నా పిల్లలతో ఆడుకుంటాను. కాస్త ఎండ ఎక్కాక మేమంతా కాస్సేపు కునుకు తీస్తాము. సాయంకాలం, అందరం కలిసి భోజనం చేస్తాము. ఇక ఆ తర్వాత, స్నేహితులమందరం కలిసి ఆటలూ పాటలూ” అంటూ సమాధానమిస్తాడు జాలరి.

నిపుణుడు మధ్యలో కల్పించుకుని ఇలా అంటాడు: “ఇదిగో చూడు, నాకు విశ్వవిద్యాలయ పట్టా ఉంది, ఈ విషయాలను నేను అధ్యయనం చేశాను. నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను. అదేమిటంటే నీవు ఇంకా ఎక్కువసేపు చేపలు పట్టాలి. అప్పుడు నీవు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించుకుని, త్వరలోనే ఈ తెడ్లపడవ కంటే పెద్ద నావ కొనుక్కోగలుగుతావు. పెద్ద నావతో నీవు ఇంకా ఎక్కువ సంపాదించుకుని, త్వరలోనే నీవు చేపలు పట్టే అనేక ఓడలను సమకూర్చుకోగలుగుతావు.”

“ఆ తర్వాత?” అని వాకబు చేస్తాడు జాలరి.

“ఆ తర్వాత, మధ్యవర్తి ద్వారా చేపలు అమ్మే బదులు, నీవు ఫ్యాక్టరీతోనే సూటిగా సంప్రదింపులు జరపగలుగుతావు లేదా చివరికి నీవు నీ స్వంతగా ఒక మత్స్య పరిశ్రమ ప్రారంభించగలుగుతావు. నీవు నీ గ్రామాన్ని వదిలి కోటనూకు లేదా పారిస్‌కు లేదా న్యూయార్క్‌కు వెళ్ళి, అక్కడి నుండే నీ వ్యాపారాన్ని చూసుకోగలుగుతావు. నీవు నీ వ్యాపారాన్ని స్టాక్‌మార్కెట్‌లో పెట్టి కోట్లు సంపాదించుకోవడం గురించి కూడా ఆలోచించవచ్చు.”

“దానికంతటికి ఎంతకాలం పడుతుంది?” అని అడుగుతాడు జాలరి.

“బహుశా 15 నుండి 20 సంవత్సరాలు” అని నిపుణుడు సమాధానమిస్తాడు.

“మరి ఆ తర్వాత?” అని జాలరి కొనసాగిస్తాడు.

“జీవితం ఆసక్తికరంగా మారేది అప్పుడే. ఇక నీవు రిటైర్‌ కావచ్చు. అప్పుడిక నీవు ఈ రణగొణ ధ్వనుల హడావుడిని విడిచి సుదూర గ్రామానికి వెళ్ళవచ్చు” అని నిపుణుడు వివరించాడు.

“ఆ తర్వాత?” జాలరి ప్రశ్న.

“అప్పుడు నీకిక కొద్దిసేపు చేపలు పట్టడానికి, నీ పిల్లలతో ఆడుకోవడానికి, ఎండ ఎక్కిన తర్వాత కాస్త కునుకు తీయడానికి, కుటుంబంతో కలిసి భోజనం చేయడానికి, స్నేహితులతో కలిసి ఆటపాటలకు సమయం ఉంటుంది.”

[7వ పేజీలోని చిత్రాలు]

పదోన్నతి భద్రతనిస్తుందా?

[8వ పేజీలోని చిత్రాలు]

మీ తోటి క్రైస్తవులు మీ భద్రత పట్ల నిజంగా ఆసక్తి కలిగివున్నారు