మీ అడుగులు దైవిక సూత్రాలచేత నడిపించబడనివ్వండి
మీ అడుగులు దైవిక సూత్రాలచేత నడిపించబడనివ్వండి
‘నీకు ప్రయోజనము కలుగునట్లు యెహోవాయే నీకు ఉపదేశము చేయును.’—యెషయా 48:17.
1. సృష్టికర్త మానవులను ఎలా నడిపించాలని ఎంపిక చేసుకున్నాడు?
శాస్త్రజ్ఞులు విశ్వాంతరాళంలోని రహస్యాలను ఛేదిస్తుండగా మన భూగ్రహం చుట్టూ ఉన్న అంతరిక్షంలో ఎంత మహత్తరమైన శక్తి నిబిడీకృతమై ఉందో చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక మధ్యస్థాయి పరిమాణంగల నక్షత్రమైన మన సూర్యుడి నుండి “ప్రతి క్షణం 10,000 కోట్ల హైడ్రోజన్ బాంబులు విస్ఫోటనం చెందినప్పుడు” వెలువడేంత శక్తి విడుదల అవుతుంది. అలాంటి భారీ అంతరిక్ష దేహాలను సృష్టికర్త తనకున్న అపరిమితమైన శక్తి ద్వారా నియంత్రిస్తూ నిర్దేశించగలడు. (యోబు 38:32; యెషయా 40:26) స్వేచ్ఛా చిత్తాన్ని, నైతిక ప్రమాణాలు పాటించే సామర్థ్యాన్ని, తార్కిక శక్తిని, ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని వరంగా పొందిన మానవులమైన మన విషయం ఏమిటి? మనల్ని ఏ విధంగా నడిపించాలని మన సృష్టికర్త ఎంపిక చేసుకున్నాడు? తన పరిపూర్ణమైన నియమాల ద్వారా, ఉన్నతమైన సూత్రాల ద్వారా, వీటికి అనుబంధంగా చక్కగా శిక్షణపొందిన మన మనస్సాక్షి ద్వారా ఆయన మనల్ని ప్రేమపూర్వకంగా నడిపించాలని ఎంపిక చేసుకున్నాడు.—2 సమూయేలు 22:31; రోమీయులు 2:14, 15.
2, 3. యెహోవా ఎలాంటి విధేయతను బట్టి ఆనందిస్తాడు?
2 తనకు విధేయత చూపాలని ఎంపిక చేసుకునే బుద్ధిజీవుల విషయంలో దేవుడు ఎంతో ఆనందిస్తాడు. (సామెతలు 27:11) బుర్రలేని రోబోట్లలా గ్రుడ్డిగా విధేయత చూపేవారిగా మనల్ని ప్రోగ్రామ్ చేయడానికి బదులుగా, సరైనది చేయగలిగేలా అన్ని విషయాలు తెలుసుకుని నిర్ణయాలు తీసుకునేందుకు యెహోవా మనకు స్వేచ్ఛా చిత్తాన్ని ప్రసాదించాడు.—హెబ్రీయులు 5:14.
3 తన తండ్రిని పరిపూర్ణంగా ప్రతిబింబించిన యేసు తన శిష్యులకిలా చెప్పాడు: ‘నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు. . . . ఇక మిమ్మును దాసులని పిలువను.’ (యోహాను 15:14, 15) ప్రాచీన కాలాల్లో దాసుడు తన యజమాని చెప్పింది వినడం తప్ప స్వయంగా ఎంపికలు చేసుకునే స్వేచ్ఛ ఉండేది కాదు. మరోవైపు స్నేహం అనేది హృదయరంజకమైన లక్షణాలను ప్రదర్శించడం ద్వారా ఏర్పడే ఒక బంధం. మనం యెహోవాకు స్నేహితులము కాగలము. (యాకోబు 2:23) ఈ స్నేహం పరస్పర ప్రేమతో ప్రగాఢమవుతుంది. దేవునికి చూపే విధేయతను ప్రేమతో జతపరుస్తూ యేసు ఇలా అన్నాడు: “ఒకడు నన్ను ప్రేమించినయెడల వాడు నామాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును.” (యోహాను 14:23) యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని సురక్షితంగా నడిపించాలని కోరుకుంటున్నాడు గనుక తన సూత్రాలకు అనుగుణంగా జీవించమని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు.
దైవిక సూత్రాలు
4. సూత్రాలను మీరెలా నిర్వచిస్తారు?
4 సూత్రాలంటే ఏమిటి? సూత్రము అంటే ఒక సాధారణ లేదా ప్రాథమిక సత్యం; ఒక సంగ్రహమైన ప్రాథమికమైన నియమం, సిద్ధాంతం, లేదా తలంపు; దాని ఆధారంగా లేదా దాని నుండే ఇతర నియమాలు, సిద్ధాంతాలు ఏర్పడతాయి. బైబిలును జాగ్రత్తగా అధ్యయనం చేస్తే జీవితంలోని విభిన్న పరిస్థితులకు, అంశాలకు వర్తించే ప్రాథమిక నిర్దేశాలను మన పరలోకపు తండ్రి మనకు అందిస్తున్నాడని గ్రహిస్తాము. ఆయన మన నిత్య ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని అలా చేస్తాడు. ఇది జ్ఞానియైన సొలొమోను చెప్పినదానికి అనుగుణంగా ఉంది: “నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల నంగీకరించినయెడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. జ్ఞానమార్గమును నేను నీకు బోధించియున్నాను యథార్థమార్గములో నిన్ను నడిపించియున్నాను.” (సామెతలు 4:10, 11) యెహోవా అందించిన కీలకమైన సూత్రాలు, ఆయనతోను తోటి మానవులతోను మనకు గల సంబంధాన్నీ, మన ఆరాధననూ, మన దైనందిన జీవితాలనూ ప్రభావితం చేస్తాయి. (కీర్తన 1:1) ఆ ప్రాథమిక సూత్రాల్లో కొన్నింటిని మనం పరిశీలిద్దాము.
5. ప్రాథమిక సూత్రాలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
5 యెహోవాతో మన సంబంధం గురించి యేసు ఇలా చెప్పాడు: ‘నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను.’ (మత్తయి 22:37) ఆ సూత్రానికి తోడు దేవుడు తోటి మానవులతో మన వ్యవహారాలకు సంబంధించి కూడా సూత్రాలను అందించాడు, వాటిలో ఒకటి బంగారు సూత్రం: “కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.” (మత్తయి 7:12; గలతీయులు 6:10; తీతు 3:2) ఆరాధనకు సంబంధించి మనకిలా ఉద్బోధ చేయబడింది: “సమాజముగా కూడుట మానక, . . . ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” (హెబ్రీయులు 10:24, 25) మన దైనందిన జీవితం గురించి అపొస్తలుడైన పౌలు ఇలా చెబుతున్నాడు: “మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.” (1 కొరింథీయులు 10:31) దేవుని వాక్యంలో అసంఖ్యాకమైన ఇతర సూత్రాలు కూడా ఉన్నాయి.
6. సూత్రాలు నియమాలకు ఎలా వేరుగా ఉంటాయి?
6 సూత్రాలు క్రియాత్మకమైన, ప్రాముఖ్యమైన సత్యాలైవున్నాయి; జ్ఞానులైన క్రైస్తవులు వాటిని ప్రేమించడం నేర్చుకుంటారు. సొలొమోను ఇలా వ్రాసేందుకు యెహోవా ఆయనను ప్రేరేపించాడు: “నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్యకుము నీ హృదయమందు వాటిని భద్రము చేసికొనుము. దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును.” (సామెతలు 4:20-22) సూత్రాలు, నియమాలకు ఏ విధంగా భిన్నంగా ఉన్నాయి? సూత్రాలు నియమాలకు పునాదిగా ఉంటాయి. సాధారణంగా నియమాలు నిర్దిష్టంగా ఉంటాయి, ఏదైనా నిర్దిష్ట సమయానికి లేదా పరిస్థితికి వర్తిస్తాయి, కానీ సూత్రాలు కాలపరిమితి లేనివి. (కీర్తన 119:111) దైవిక సూత్రాలకు కాలదోషం పట్టదు లేదా అవి గతించిపోవు. ప్రవక్తయైన యెషయా ప్రేరేపిత మాటలు వాస్తవం: “గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.”—యెషయా 40:8.
సూత్రాల ఆధారంగా ఆలోచించి చర్యలు తీసుకోండి
7. సూత్రాల ఆధారంగా ఆలోచించమని చర్యలు తీసుకోమని దేవుని వాక్యం ఎలా ప్రోత్సహిస్తుంది?
7 “మన దేవుని వాక్యము,” సూత్రాల ఆధారంగా ఆలోచించమని చర్యలు తీసుకోమని మళ్ళీ మళ్ళీ మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది. ధర్మశాస్త్ర సారాంశాన్ని చెప్పమన్నప్పుడు యేసు రెండు క్లుప్తమైన వ్యాఖ్యానాలు చేశాడు—వాటిలో ఒకటి యెహోవా పట్ల ప్రేమను నొక్కిచెప్తుంటే, రెండవది తోటిమానవుడి పట్ల ప్రేమను నొక్కిచెప్తుంది. (మత్తయి 22:37-40) మోషే ధర్మశాస్త్రంలోని ప్రాథమిక సిద్ధాంతాల సంక్షిప్త సారాంశాన్ని తెలియజేసిన ద్వితీయోపదేశకాండము 6:4, 5 వచనాలను ఉదాహరిస్తూ యేసు మొదటి వ్యాఖ్యానాన్ని చేశాడు. ఆ వచనాల్లో ఇలా ఉంది: “మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.” లేవీయకాండము 19:18 లో దేవుడిచ్చిన నిర్దేశం కూడా యేసు మనస్సులో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రసంగి పుస్తకానికి స్పష్టమైన, సూటైన, శక్తివంతమైన ముగింపుగా సొలొమోను రాజు పలికిన మాటలు దేవుడిచ్చిన అనేకానేక నియమాలకు క్లుప్తీకరణలుగా ఉన్నాయి: “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.”—ప్రసంగి 12:13, 14; మీకా 6:8.
8. ప్రాథమిక బైబిలు సూత్రాలను సంపూర్ణంగా గ్రహించడం ఎందుకు మనకు కాపుదలనిస్తుంది?
8 అలాంటి ప్రాథమిక సూత్రాలను సంపూర్ణంగా గ్రహించడం, మరింత నిర్దిష్టమైన నిర్దేశాలను అర్థం చేసుకోవడానికీ వాటిని అన్వయించుకోవడానికీ మనకు సహాయపడుతుంది. అంతేగాక, ప్రాథమిక సూత్రాలను పూర్తిగా గ్రహించి స్వీకరించకపోతే మనం జ్ఞానయుక్తమైన నిర్ణయాలను తీసుకోలేకపోవచ్చు, మన విశ్వాసము కూడా చాలా సులభంగా ప్రమాదంలో పడవచ్చు. (ఎఫెసీయులు 4:14) అలాంటి సూత్రాలు మన మనస్సులోను హృదయంలోను గట్టిగా నాటుకునేలా చేసుకుంటే మనం నిర్ణయాలు తీసుకోవడంలో వాటిని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉంటాము. మనం వాటిని వివేకంతో అన్వయించుకుంటే అవి మనకు విజయాన్ని చేకూరుస్తాయి.—యెహోషువ 1:8; సామెతలు 4:1-9.
9. బైబిలు సూత్రాలను వివేచించి అన్వయించుకోవడం ఎల్లప్పుడు ఎందుకు సులభం కాదు?
9 బైబిలు సూత్రాలను వివేచించడమూ, వాటిని అన్వయించుకోవడమూ నియమాలను పాటించినంత సులభం కాదు. అపరిపూర్ణ మానవులమైన మనకు, సూత్రాలపై ఆధారపడి తార్కికంగా ఆలోచించడానికి కృషి చేయడం అంతగా రుచించకపోవచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు లేదా ఏదైనా సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు ఒక నియమం ఉండుంటే బావుండునని మనం కోరుకుంటుండవచ్చు. కొన్నిసార్లు పరిణతిచెందిన క్రైస్తవుల నుండి, బహుశా ఒక సంఘపెద్ద నుండి నడిపింపును కోరుతూ, మన పరిస్థితికి అన్వయించే ఒక నియమం వారు చెప్తారని ఆశిస్తుండవచ్చు. అయితే, బైబిలు గానీ లేదా బైబిలు ఆధారిత ప్రచురణలు గానీ ఒక నిర్దిష్టమైన నియమాన్ని ఇవ్వకపోవచ్చు, ఒకవేళ ఇచ్చినా అది అన్ని కాలాలకు అన్ని పరిస్థితులకు వర్తించేది కాకపోవచ్చు. ఒక వ్యక్తి యేసును, “బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలుపంచి పెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని” అడగడం మీకు గుర్తుండివుండవచ్చు. తోబుట్టువుల మధ్య వివాదాలను పరిష్కరించడానికి ఒక నియమాన్ని వెంటనే పేర్కొనడానికి బదులుగా యేసు ఆయనకు ఒక సాధారణమైన సూత్రాన్ని చెప్పాడు: “మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి.” ఆ విధంగా యేసు అటు ఆ కాలంలోను, అలాగే ఇప్పుడూ ఉపయోగపడే ఒక నిర్దేశక సూత్రాన్ని ఇచ్చాడు.—లూకా 12:13-15.
10. సూత్రాలకు అనుగుణంగా ప్రవర్తించడం మన హృదయంలోని ఉద్దేశాలను ఎలా వెల్లడిచేస్తుంది?
10 సణుగుకుంటూ, శిక్షించబడతామేమోనన్న భయంతో నియమాలు పాటించే వ్యక్తులను మీరు చూసే ఉంటారు. సూత్రాల పట్ల గౌరవం అలాంటి వైఖరికి తావివ్వదు. సూత్రాల స్వభావమే ఏమిటంటే, వాటిచే నియంత్రించబడే వ్యక్తులు హృదయపూర్వకంగా ప్రతిస్పందించేందుకు కదిలించబడతారు. నిజానికి చాలా సూత్రాల విషయంలో, వాటికి విధేయత చూపని వారు వెంటనే శిక్షించబడడం జరగదు. మనం యెహోవాకు విధేయత చూపడానికి కారణం ఏమిటో, మన హృదయ ప్రేరేపణ నిజానికి ఏమిటో వెల్లడిచేసేందుకు ఇది మనకొక అవకాశాన్ని ఇస్తుంది. పోతీఫరు భార్య చేసిన అనైతిక ప్రతిపాదనను యోసేపు తిరస్కరించడంలో మనకొక మంచి ఉదాహరణ లభిస్తుంది. వ్యభిచారం చేయవద్దని యెహోవా ఒక లిఖిత నియమావళి అప్పటికింకా ఇవ్వకపోయినా, మరొకరి భార్యతో సంబంధాలు పెట్టుకున్నందుకు ఎలాంటి శిక్షా తెలియజేయబడకపోయినా, వివాహ సంబంధంలో ఉండాల్సిన విశ్వసనీయత విషయంలో దేవుడు విధించిన సూత్రాలు యోసేపుకు తెలుసు. (ఆదికాండము 2:24; ) అలాంటి సూత్రాలు యోసేపును చాలా శక్తివంతంగా ప్రభావితం చేశాయని ఆయన ఇచ్చిన ఈ జవాబును బట్టి మనకు అర్థమవుతుంది: ‘నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును?’— 12:18-20ఆదికాండము 39:9.
11. క్రైస్తవులు ఏయే రంగాల్లో యెహోవా సూత్రాలచే నడిపించబడాలని కోరుకుంటారు?
11 నేడు సహవాసులను, వినోదాన్ని, సంగీతాన్ని, పఠన సమాచారాన్ని ఎంపిక చేసుకోవడం వంటి వ్యక్తిగత విషయాల్లో క్రైస్తవులు యెహోవా సూత్రాలచే నడిపించబడాలని కోరుకుంటారు. (1 కొరింథీయులు 15:33; ఫిలిప్పీయులు 4:8) మనం పరిజ్ఞానములోను, అవగాహనలోను, యెహోవాపట్ల ప్రేమ విషయంలోను, ఆయన ప్రమాణాలను అమూల్యంగా ఎంచే విషయంలోను అభివృద్ధి చెందుతుండగా మన మనస్సాక్షి, అంటే మనలోని నైతిక భావన, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, చివరికి ఎంతో వ్యక్తిగత విషయాలైనప్పటికీ దైవిక సూత్రాలను అన్వయించుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. బైబిలు సూత్రాలచే నడిపించబడుతూ మనం దేవుని నియమాల్లో లొసుగులు వెదకకుండా ఉంటాము; లేక, ఏదైనా నియమాన్ని నిజానికి ఉల్లంఘించకుండానే ఎంత దూరం వెళ్ళగలమో చూద్దామని ప్రయత్నించేవారిని కూడా అనుకరించము. అలాంటి ఆలోచనా విధానం స్వనాశనకరమని, హానికరమని మనం గుర్తిస్తాము.—యాకోబు 1:22-25.
12. దైవిక సూత్రాలచే నడిపించబడడానికి కీలకం ఏమిటి?
12 దైవిక సూత్రాలను పాటించడానికి కీలకం ఫలాని విషయం గురించి యెహోవా ఎలా భావిస్తాడో తెలుసుకోవాలన్నదేనని పరిణతి చెందిన క్రైస్తవులు గుర్తిస్తారు. “యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి” అని కీర్తనకర్త ఉద్బోధిస్తున్నాడు. (కీర్తన 97:10) చెడు అని యెహోవా వర్గీకరించే కొన్ని విషయాలను పేర్కొంటూ సామెతలు 6:16-19 ఇలా అంటోంది: “యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.” అలాంటి ప్రాథమిక విషయాల గురించి యెహోవా ఎలా భావిస్తాడో, అవే భావాలను ప్రతిబింబించాలన్న కోరిక మన జీవితాలను నిర్దేశిస్తే, సూత్రాలకు అనుగుణంగా జీవించడం అలవాటయిపోతుంది.—యిర్మీయా 22:16.
మంచి ఉద్దేశాలు అవసరం
13. కొండమీది ప్రసంగంలో యేసు ఎలాంటి ఆలోచనా విధానాన్ని నొక్కిచెప్పాడు?
13 సూత్రాలను తెలుసుకోవడం, వాటిని అన్వయించుకోవడం మనల్ని సంప్రదాయబద్ధమైన వ్యర్థ ఆరాధనలో పడిపోకుండా కూడా కాపాడుతుంది. సూత్రాలను పాటించడానికీ, చట్టబద్ధమైన నియమాలను తప్పిపోకుండా వాటిని ఖచ్చితంగా పాటించడానికీ తేడా ఉంది. కొండమీది ప్రసంగంలో యేసు దీన్ని స్పష్టంగా చూపించాడు. (మత్తయి 5:17-48) యేసు శ్రోతలు యూదులని గుర్తుంచుకోండి, కాబట్టి వారి ప్రవర్తన మోషే ధర్మశాస్త్రంచే నియంత్రించబడుతుంది. కానీ నిజానికి వారు ధర్మశాస్త్రం విషయంలో వక్రీకరించబడిన దృక్కోణం కలిగివున్నారు. వారు ధర్మశాస్త్రం యొక్క అసలు భావం కంటే అందులోని ఒక్కొక్క నియమానికే ప్రాముఖ్యతనివ్వడం ప్రారంభించారు. వారు తమ ఆచారాలపై ఎక్కువ అవధానం ఉంచారు, ఆ ఆచారాలకు దేవుని బోధలకన్నా ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. (మత్తయి 12:9-12; 15:1-9) తత్ఫలితంగా, సామాన్య ప్రజలకు సూత్రాల ఆధారంగా ఆలోచించడం నేర్పించబడలేదు.
14. తన శ్రోతలు సూత్రాల ఆధారంగా ఆలోచించడానికి యేసు వారికెలా సహాయం చేశాడు?
14 దానికి విరుద్ధంగా, యేసు కొండమీది ప్రసంగంలో మత్తయి 5:28.
నైతికతకు సంబంధించి ఐదు రంగాల్లో సూత్రాలను పేర్కొన్నాడు: కోపం, వివాహం మరియు విడాకులు, వాగ్దానాలు, పగతీర్చుకోవడం, ప్రేమ మరియు ద్వేషం. ఒక్కొక్క రంగంలో ఒక సూత్రాన్ని పాటించడంలోని ప్రయోజనాన్ని యేసు చూపించాడు. ఆ విధంగా ఆయన తన అనుచరుల నైతిక ప్రమాణాలను హెచ్చించాడు. ఉదాహరణకు, వ్యభిచారం విషయంలో ఆయన మన చర్యలను మాత్రమే కాక మన ఆలోచనలను మన కోరికలను కూడా కాపాడే ఒక సూత్రాన్ని ఇచ్చాడు: “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.”—15. చట్టబద్ధమైన నియమాలకే అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వాటినే పాటించాలని ప్రయత్నించే ఎలాంటి వైఖరినైనా మనం ఎలా నివారించగలము?
15 మనం యెహోవా సూత్రాల ఉద్దేశాన్ని, వాటిలోని అసలు భావాన్ని ఎన్నడూ విస్మరించకూడదని ఈ ఉదాహరణ చూపిస్తోంది. నైతిక వ్యక్తులమని పైపైన నటిస్తూ దేవుని అనుగ్రహాన్ని సంపాదించడానికి మనమెంతమాత్రం ప్రయత్నించకూడదు. దేవుని కనికరము ప్రేమలను నొక్కిచెబుతూ యేసు అలాంటి వైఖరిలో ఉన్న పొరపాటును బట్టబయలు చేశాడు. (మత్తయి 12:7; లూకా 6:1-11) బైబిలు సూత్రాలను పాటిస్తే మనం, బైబిలు బోధలను మించిపోతూ, “ఇలా చేయండి” “ఇలా చేయవద్దు” అని చెప్పే విస్తృతమైన కఠినమైన నియమాలు పాటించడానికి ప్రయత్నించము (ఇతరులూ అలాంటి వాటిని పాటించాల్సిందేనని బలవంతపెట్టము). మనం ఆరాధన పైరూపం విషయంలో కన్నా ప్రేమ సూత్రాల విషయంలోను, దేవునికి విధేయత చూపే విషయంలోను మరింత ఎక్కువగా శ్రద్ధచూపుతాము.—లూకా 11:42.
సంతోషకరమైన ఫలితాలు
16. బైబిలులోని కొన్ని నియమాల వెనుకనున్న సూత్రాలకు ఉదాహరణలివ్వండి.
16 మనం యెహోవాకు విధేయత చూపడానికి కృషిచేస్తుండగా ఆయన నియమాలు ప్రాథమిక సూత్రాలపైనే ఆధారపడివున్నాయని గుర్తించడం ప్రాముఖ్యం. ఉదాహరణకు, క్రైస్తవులు విగ్రహారాధన, లైంగిక అనైతికత, రక్తాన్ని దుర్వినియోగపరచడం వంటి వాటికి దూరంగా ఉండాలి. (అపొస్తలుల కార్యములు 15:28, 29) ఈ వివాదాంశాల విషయంలో క్రైస్తవుల వైఖరికి ఆధారాలేమిటి? దేవునికి అనితర భక్తిని చెల్లించాలి; వివాహ భాగస్వామికి విశ్వసనీయంగా ఉండాలి; జీవప్రదాత యెహోవా అన్నవే వారికున్న ఆధారాలు. (ఆదికాండము 2:24; నిర్గమకాండము 20:5; కీర్తన 36:9) మూలాధారాలైన ఆ సూత్రాలను అర్థం చేసుకోవడం, తత్సంబంధిత నియమాలను స్వీకరించి వాటిని అనుసరించడాన్ని సులభతరం చేస్తుంది.
17. బైబిలు సూత్రాలను గ్రహిస్తూ వాటిని అన్వయించుకోవడం నుండి ఎలాంటి మంచి ఫలితాలు లభించగలవు?
17 మూలాధారాలైన సూత్రాలను మనం వివేచిస్తూ వాటిని అన్వయించుకుంటుండగా అవి మన శ్రేయస్సు కొరకేనని మనం గ్రహిస్తాము. దేవుని ప్రజలు అనుభవించే ఆధ్యాత్మిక ఆశీర్వాదాలకు తోడుగా కొన్నిసార్లు స్పష్టంగా కనిపించే ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఉదాహరణకు, పొగత్రాగడం మానుకునేవారు, నైతిక జీవితాలు గడిపేవారు, రక్తం యొక్క పవిత్రతను గౌరవించేవారు కొన్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడబడతారు. అదే విధంగా, దైవిక సత్యానికి అనుగుణంగా జీవించడం ద్వారా మనకు ఆర్థిక, సామాజిక, లేదా కుటుంబసంబంధ ప్రయోజనాలు లభిస్తాయి. స్పష్టంగా కనిపించే అలాంటి ప్రయోజనాలేవైనా, యెహోవా ప్రమాణాలు ఎంత అమూల్యమైనవో, నిజంగా ఎంత ఆచరణయోగ్యమైనవో రుజువు చేస్తాయి. కానీ దేవుని సూత్రాలను అన్వయించుకోవడానికి అలాంటి ఆచరణాత్మకమైన ప్రయోజనాలను పొందడం మాత్రమే ప్రధాన కారణం కాదు. నిజ క్రైస్తవులు యెహోవాను ప్రేమించబట్టే, తమ ఆరాధనకు ఆయన అర్హుడు కాబట్టే, విధేయత చూపడం సరియైనది కాబట్టే ఆయనకు విధేయత చూపిస్తారు.—ప్రకటన 4:10, 11.
18. మనం ఫలవంతమైన క్రైస్తవులముగా అవ్వాలనుకుంటే మన జీవితాలను ఏది నిర్దేశించాలి?
18 మన జీవితం బైబిలు సూత్రాలచే నడిపించబడడానికి అనుమతించడం, మనం అత్యుత్తమమైన జీవితం జీవించేందుకు నడిపిస్తుంది; తత్ఫలితంగా అది ఇతరులను దేవుని మార్గం వైపుకు ఆకర్షిస్తుంది. అన్నింటికన్నా ప్రాముఖ్యంగా మన జీవన విధానం యెహోవాకు ఘనతను తెస్తుంది. యెహోవా నిజంగా మన మేలు కోరే ప్రేమగల దేవుడని మనం గ్రహిస్తాము. బైబిలు సూత్రాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని, యెహోవా మనల్ని ఆశీర్వదించే విధానాన్ని చూసినప్పుడు మనం ఆయనకు మరింత దగ్గరయినట్లు భావిస్తాము. అవును, మనం మన పరలోకపు తండ్రితో ప్రేమపూర్వక సంబంధాన్ని మరింతగా పెంపొందించుకుంటాము.
మీకు జ్ఞాపకమున్నాయా?
• సూత్రం అంటే ఏమిటి?
• సూత్రాలకు నియమాలకు తేడా ఏమిటి?
• సూత్రాల ఆధారంగా ఆలోచించడం, చర్యలు తీసుకోవడం మనకు ఎందుకు ప్రయోజనకరం?
[అధ్యయన ప్రశ్నలు]
[20వ పేజీలోని బాక్సు]
విల్సన్, ఘానాలో ఒక క్రైస్తవుడు, తాను మరికొద్ది రోజుల్లో ఉద్యోగం నుండి తొలగించబడతాడని ఆయనకు చెప్పబడింది. ఉద్యోగస్థలంలో చివరిరోజున ఆ కంపెనీ మ్యానేజింగ్ డైరెక్టరు కారు కడిగే పని ఆయనకు అప్పగించబడింది. విల్సన్‌కి కారులో డబ్బు కనబడింది, ఆ రోజున ఉద్యోగం కోల్పోతున్నాడు కాబట్టి దేవుడే ఆ డబ్బు పంపాడని విల్సన్ పై అధికారి ఆయనతో అన్నాడు. అయితే, నిజాయితీ విషయంలో బైబిలు సూత్రాలను అన్వయించుకుంటూ విల్సన్ ఆ డబ్బును డైరెక్టరుకి తిరిగి ఇచ్చేశాడు. ఆయన ఆశ్చర్యపోయాడు, అంతేకాక విల్సన్ నిజాయితీకి చాలా ముగ్ధుడయ్యాడు. ఆ డైరెక్టరు విల్సన్‌కి వెంటనే పర్మినెంటు ఉద్యోగం ఇవ్వడమేకాక కంపెనీలో సీనియర్ ఉద్యోగిగా ప్రమోషన్ కూడా ఇచ్చాడు.—ఎఫెసీయులు 4:27, 28.
[21వ పేజీలోని బాక్సు]
రుకీయా, 60వ పడిలో ఉన్నది, ఆమె అల్బేనియా దేశస్థురాలు. కుటుంబంలో ఏదో అభిప్రాయ భేదం వచ్చినందున ఆమె తన అన్నతో 17 సంవత్సరాలకు పైగా మాట్లాడడం మానేసింది. ఆమె యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించి, నిజ క్రైస్తవులు ఇతరులతో శాంతిసమాధానాలతో ఉండాలనీ, విద్వేష భావాలకు తావివ్వకూడదనీ నేర్చుకుంది. ఆమె రాత్రంతా ప్రార్థించింది, మరుసటి ఉదయం గుండె దడదడ కొట్టుకుంటుండగా తన అన్న ఇంటివైపు నడిచింది. అన్న కూతురు తలుపు తెరిచింది. ఆశ్చర్యంతో ఆమె రుకీయాను, “ఏమిటి ఎవరైనా చనిపోయారా? ఇక్కడికి ఎందుకొచ్చారు?” అని అడిగింది. రుకీయా తన అన్నను చూడాలని చెప్పింది. బైబిలు సూత్రాలను గురించీ యెహోవాను గురించీ నేర్చుకోవడం మూలంగా తాను తన అన్నతో శాంతి సంబంధాలను నెలకొల్పుకోవాలనే పురికొల్పును పొందానని ఆమె నెమ్మదిగా వివరించింది. ఆనందాశ్రువులు రాలుస్తూ, ఒకరినొకరు కౌగిలించుకుంటూ వారు ఆ అపూర్వమైన పునఃకలయికను పండుగగా జరుపుకున్నారు.—రోమీయులు 12:17, 18.
[23వ పేజీలోని చిత్రం]
[23వ పేజీలోని చిత్రం]
[23వ పేజీలోని చిత్రం]
[23వ పేజీలోని చిత్రం]
“ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యు లాయనయొద్దకు వచ్చిరి. అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను.”