కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అశక్తతలు అసంఖ్యాకం

అశక్తతలు అసంఖ్యాకం

అశక్తతలు అసంఖ్యాకం

ఒక ఆఫ్రికన్‌ దేశంలో నివసిస్తున్న క్రిశ్చన్‌ను సైనికులు అపహరించుకుపోయి సైన్యంలో చేరేలా బలవంతపెట్టారు. కానీ, బైబిలు శిక్షణ పొందిన తన మనస్సాక్షి మూలంగా ఆయన దానిలో చేరేందుకు నిరాకరించాడు. దాంతో సైనికులు ఆయనను ఒక మిలటరీ శిబిరానికి తీసుకెళ్ళి అక్కడ నాలుగు రోజులపాటు ఆయనను కొట్టారు, వాళ్ళలో ఒకడు ఆయన కాలిలోకి తుపాకి పేల్చాడు. క్రిశ్చన్‌ ఎలాగోలా హాస్పటల్‌కి చేరుకోగలిగాడు, కానీ ఆయనకు మోకాలు క్రింద నుండి తీసేయాల్సి వచ్చింది. మరో ఆఫ్రికన్‌ దేశంలో సాయుధ తిరుగుబాటుదారులు, చిన్న పిల్లలని కూడా చూడకుండా కాళ్ళు చేతులు నరికేశారు. కంబోడియా నుండి బాల్కన్‌ ప్రాంతాల వరకు, అఫ్ఘనిస్తాన్‌ నుండి అంగోలా వరకు, మందు పాతరలు చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరినీ అంగవికలులను చేస్తున్నాయి.

ప్రమాదాలు, డయాబిటీస్‌, పర్యావరణంలోని విషపదార్థాలు వంటివి కూడా ప్రజల్లో అశక్తతలు కలుగజేస్తున్నాయి. ఉదాహరణకు, తూర్పు యూరప్‌లోని ఒక నగర పరిసరాల్లో అనేకమంది పిల్లలు వైకల్యంగల ఒక చేతితో పుట్టారు. మోచేయి క్రింద సగం చేయి పొట్టిగా వ్రేలాడుతుంది. రసాయనిక కాలుష్యం మూలంగా ఏర్పడిన జన్యుపరమైన లోపమే అందుకు కారణమని సాక్ష్యాధారాలు చూపిస్తున్నాయి. అసంఖ్యాకమైన ఇతర ప్రజలకు శరీరావయవాలన్నీ ఉన్నాయి, కానీ పక్షవాయువు మూలంగానో మరితర వ్యాధుల మూలంగానో అశక్తులుగా ఉన్నారు. నిజంగానే అశక్తతలు అసంఖ్యాకంగా ఉన్నాయి.

కారణమేదైనా వైకల్యాలు చాలా వినాశకరంగా ఉంటాయి. జూనియర్‌ తన 20వ ఏట ఎడమకాలు సగం పోగొట్టుకున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “నాకు భావోద్రేక సమస్యలు చాలా ఏర్పడ్డాయి. నా కాలు మళ్ళీ ఇక రాదని నేను ఎంతో ఏడ్చేవాడిని. నాకేం చేయాలో తెలిసేదికాదు. అంతా గందరగోళంగా ఉన్నట్లు భావించేవాడిని.” అయితే కొంతకాలానికి జూనియర్‌ వైఖరి చాలా మారిపోయింది. ఆయన బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించాడు, దాని మూలంగా ఆయన తన అశక్తతతో పోరాడేందుకు సహాయం పొందడం మాత్రమే కాక ఇదే భూమిపై అద్భుతమైన భవిష్యత్‌ నిరీక్షణను కూడా పొందాడు. మీరు అశక్తులైతే, ఆ నిరీక్షణను పంచుకోవడానికి ఇష్టపడతారా?

అలాగైతే, దయచేసి తర్వాతి ఆర్టికల్‌ చదవండి. అక్కడ ఇవ్వబడిన బైబిలు లేఖనాలను మీ సొంత బైబిలు తెరిచి చదవమని మేము ప్రోత్సహిస్తున్నాము, అలా తన సంకల్పాన్ని తెలుసుకుని తమ జీవితాలను దానికి అనుగుణంగా మలచుకునే వారి కోసం సృష్టికర్త ఏమి దాచివుంచాడో మీరే చూడగలుగుతారు.