అశక్తతలు ఎలా అంతం అవుతాయి?
అశక్తతలు ఎలా అంతం అవుతాయి?
అంధుల కళ్ళు చూడడాన్ని, చెవిటివారి చెవులు ప్రతి శబ్దాన్ని వినడాన్ని, మూగవారి నాలుక ఆనందంతో పాడడాన్ని, కుంటివారి కాళ్ళు స్థిరంగా నడవడాన్ని ఒక్కసారి ఊహించుకోండి! మేమిక్కడ వైద్యశాస్త్రంలో జరుగుతున్న అత్యద్భుతమైన పురోగతుల గురించి మాట్లాడడం లేదు, కానీ దేవుడు మానవజాతి తరఫున కలుగజేసుకోవడం వల్ల వచ్చే ఫలితాల గురించి మాట్లాడుతున్నాము. బైబిలు ఇలా ప్రవచించింది: “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును.” (యెషయా 35:5, 6) అయితే, ఈ అద్భుతమైన ప్రవచనం తప్పకుండా నెరవేరుతుందని మనమెలా నిశ్చయతను కలిగివుండగలము?
మొదటిగా, యేసుక్రీస్తు భూమ్మీద ఉన్నప్పుడు ప్రజలనుభవిస్తున్న అన్ని రకాల వ్యాధులను అశక్తతలను స్వస్థపరిచాడన్నది వాస్తవం. అంతేకాదు, ఆయన చేసిన అద్భుతాల్లో అత్యధికం అనేకమంది సాక్షుల సమక్షంలోనే జరిగాయి, చివరికి ఆయన శత్రువులు కూడా వాటికి ప్రత్యక్షసాక్షులే. నిజానికి ఒకసారైతే, సంశయవాదులైన వ్యతిరేకులు యేసును నిందలపాలు చేయాలని, స్వస్థత పొందిన ఒక వ్యక్తి విషయంలో కూలంకష పరిశోధన చేశారు. చివరికి వారు ఆ అద్భుతం జరగడం వాస్తవమేనని రూఢిపరచడం మినహా ఇంకేమీ చేయలేకపోయారు. (యోహాను 9:1, 5-34) నిరాకరించలేని రీతిలో మరొక అద్భుతాన్ని యేసు చేసిన తర్వాత వారు నిస్పృహతో, “మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచకక్రియలు చేయుచున్నాడే” అని అన్నారు. (యోహాను 11:47) అయితే సామాన్య ప్రజలు అంత స్తబ్ధుగా ఏమీ లేరు, ఎందుకంటే వారిలో అనేకులు యేసునందు విశ్వాసముంచడం ప్రారంభించారు.—యోహాను 2:23; 10:41, 42; 12:9-11.
యేసు చేసిన అద్భుతాలు—భూవ్యాప్త స్వస్థతకు ముంగుర్తు
యేసు చేసిన అద్భుతాలు, యేసు దేవుని కుమారుడైన మెస్సీయాయని నిరూపించడం మాత్రమే కాక, విధేయులైన మానవులు భవిష్యత్తులో స్వస్థత పొందబోతున్నారన్న బైబిలు వాగ్దానాలకు ఆధారాన్ని కూడా ఇచ్చాయి. మొదటి పేరాలో పేర్కొనబడిన, యెషయా గ్రంథం 35వ అధ్యాయంలోని ప్రవచనం కూడా ఆ వాగ్దానాల్లో ఉంది. దైవభయంగల మానవుల భవిష్యత్ ఆరోగ్యం గురించి యెషయా 33:24 ఇలా చెబుతోంది: “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.” అదే విధంగా, ప్రకటన 21:4 ఇలా వాగ్దానం చేస్తోంది: ‘[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు [నేటి శ్రమలు, బాధలు] గతించిపోయెను.’
యేసు నేర్పిన మాదిరి ప్రార్థనను మళ్ళీ మళ్ళీ చేస్తున్నప్పుడు ప్రజలు తమకు తెలియకుండానే ఈ ప్రవచనాల నెరవేర్పు మత్తయి 6:9-10) అవును, దేవుని చిత్తంలో ఈ భూమి కూడా, సమస్త మానవాళి కూడా ఇమిడివుంది. వ్యాధులు అశక్తతలు ఒక కారణం మూలంగా అనుమతించబడినా, త్వరలోనే అంతమవుతాయి; అవి దేవుని ‘పాదపీఠాన్ని’ ఎల్లప్పుడూ కళంకితం చేస్తూవుండవు.—యెషయా 66:1. *
కోసమే ప్రార్థిస్తున్నారు; ఆ ప్రార్థనలో కొంతభాగం ఇలా ఉంది: “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” (బాధలేకుండా, ఖర్చులేకుండా స్వస్థత
ప్రజలు అనుభవిస్తున్న వ్యాధులు ఎలాంటివైనా సరే యేసు వారు ఎలాంటి బాధనూ అనుభవించకుండా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఉచితంగా స్వస్థపరిచాడు. దీన్ని గురించిన సమాచారం దావానలంలా వ్యాపించింది, త్వరలోనే “బహు జనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసికొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని స్వస్థపరచెను.” ప్రజలెలా ప్రతిస్పందించారు? ప్రత్యక్షసాక్షి అయిన మత్తయి వ్రాసిన వృత్తాంతం ఇంకా ఇలా కొనసాగుతోంది: “మూగవారు మాటలాడుటయును . . . కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి.”—మత్తయి 15:30, 31.
యేసుచే స్వస్థపరచబడినవారు ఎంపిక చేయబడినవారు కాదని గమనించండి—నేడు మోసగాళ్ళు అలాంటి తంత్రాలనే ఉపయోగిస్తారు. బదులుగా బాధపడుతున్నవారి బంధువులు స్నేహితులు అనేకమంది, వారిని ‘ఆయన [యేసు] పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని స్వస్థపరచెను.’ స్వస్థపరచడంలో యేసుకున్న సామర్థ్యానికి సంబంధించి కొన్ని నిర్దిష్ట ఉదాహరణలను మనమిప్పుడు పరిశీలిద్దాము.
గ్రుడ్డితనము: యేసు యెరూషలేములో ఉన్నప్పుడు ‘పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడికి’ చూపు అనుగ్రహించాడు. ఆ వ్యక్తి ఆ నగరంలో గ్రుడ్డి భిక్షకుడని అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన చక్కగా చూడగలుగుతూ చక్కగా నడుస్తుండడం చూసినప్పుడు ప్రజల్లో రేకెత్తిన అలజడిని మీరు ఊహించుకోగలరు! అయితే, అందరూ సంతోషించలేదు. ప్రముఖమైన, పేరుప్రతిష్ఠలున్న యూదుల తెగ అయిన పరిసయ్యులలో కొందరు సభ్యులు మునుపు ఒకసారి తమ దుష్టత్వాన్ని యేసు బట్టబయలు చేశాడని కోపంతో రగిలిపోతూ యేసు మోసం చేశాడని నిరూపించేలా సాక్ష్యం కోసం వెదుకుతున్నారు. (యోహాను 8:13, 42-44; 9:1, 6-31) అందుకే వారు మొదట స్వస్థపరచబడిన ఆ వ్యక్తిని, తర్వాత ఆయన తల్లిదండ్రులను, తర్వాత మళ్ళీ ఆ వ్యక్తినీ ప్రశ్నించారు. కానీ పరిసయ్యుల ప్రశ్నలు యేసు చేసిన అద్భుతాన్ని రూఢిపరచడం మినహా ఇంకేమీ చేయలేకపోయాయి, దాంతో వారికి మరింత ఉక్రోషం వచ్చింది. ఈ మతవేషధారుల వక్రబుద్ధిని బట్టి తికమకకు గురై స్వస్థపరచబడిన ఆ వ్యక్తి ఇలా అన్నాడు: ‘పుట్టు గ్రుడ్డివాని కన్ను లెవరైన తెరచినట్టు లోకము పుట్టినప్పటినుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కానియెడల ఏమియు చేయనేరడు.’ (యోహాను 9:32, 33) నిష్కపటమైన, తెలివైన ఆ విశ్వాసవ్యక్తీకరణకు పరిసయ్యులు ఆయనను ‘వెలివేశారు;’ ఈ మాట, ఒకప్పుడు గ్రుడ్డివాడైన వ్యక్తిని పరిసయ్యులు సమాజమందిరము నుండి బహిష్కరించారని సూచిస్తోంది.—యోహాను 9:22, 34.
చెవిటితనం: యేసు యొర్దాను నదికి తూర్పున ఉన్న ప్రాంతమైన దెకపొలిలో ఉన్నప్పుడు అక్కడి ప్రజలు ‘చెవుడుగల నత్తివాని ఒకని ఆయనయొద్దకు తోడుకొనివచ్చారు.’ (మార్కు 7:31, 32) యేసు ఈ వ్యక్తిని స్వస్థపరచడమే కాక జనసమూహాలున్నప్పుడు ఇబ్బందిపడే చెవిటివారి భావాల విషయంలో లోతైన అవగాహనను కూడా ప్రదర్శించాడు. యేసు చెవిటివానిని “ఏకాంతమునకు తోడుకొని పోయి” ఆయనను స్వస్థపరిచాడని బైబిలు మనకు చెబుతోంది. ఇక్కడ కూడా ప్రత్యక్షసాక్షులు, “ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు; చెవిటి వారు వినునట్లుగాను మూగవారు మాటలాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి.”—మార్కు 7:33-37.
పక్షవాయువు: యేసు కపెర్నహూములో ఉన్నప్పుడు ప్రజలు పక్షవాయువుతో మంచముపట్టి ఉన్న ఒక వ్యక్తిని ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. (మత్తయి 9:2) అక్కడ ఏమి జరిగిందో 6 నుండి 8 వచనాలు వివరిస్తున్నాయి. ‘యేసు పక్షవాయువుగలవాని చూచి—నీవు లేచి నీ మంచ మెత్తికొని నీ యింటికి పొమ్మని చెప్పగా వాడు లేచి, తన యింటికి వెళ్లెను. జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి.’ ఈ అద్భుతం కూడా యేసు శిష్యుల సమక్షంలోను ఆయన శత్రువుల సమక్షంలోను జరిగింది. యేసు శిష్యులు తాము ప్రత్యక్షంగా చూసినదాన్ని బట్టి ‘దేవుని మహిమపరిచారు,’ వారి కళ్ళు ద్వేషంతోను, దురభిమానంతోను మూసుకుపోలేదు.
వ్యాధులు: ‘ఒక కుష్ఠరోగి యేసు యొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూని—నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని మార్కు 1:40-42) యేసు ఈ వ్యక్తిపై చిరాకుపడకుండా, నిజమైన కనికరంతో స్వస్థపరిచాడని గమనించండి. మీరు కుష్ఠరోగి అని ఊహించుకోండి. మీ శరీరాన్ని నెమ్మనెమ్మదిగా విరూపమయ్యేలా చేస్తూ మీరు సమాజం నుండి వెలి వేయబడేలా చేసే భయంకరమైన వ్యాధి నుండి ఏమాత్రం నొప్పి లేకుండా తక్షణమే స్వస్థపరచబడితే మీరెలా భావిస్తారు? అద్భుతంగా స్వస్థపరచబడిన మరో కుష్ఠరోగి యేసుకు “కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,” ఎందుకు ‘ఆయన పాదములయొద్ద సాగిలపడ్డాడో’ అర్థంచేసుకోవడం మీకంత కష్టమేమీకాదు.—లూకా 17:12-16.
ఆయనతో చెప్పి, ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి, చెయ్యిచాపి వానిని ముట్టి—నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను.’ (గాయాలు: యేసును బంధించడానికి కొంచెం ముందు ఆయన చేసిన చివరి అద్భుతంలో ఆయన గాయాన్ని మాన్పాడు. యేసును బంధించడానికి వచ్చిన వారిమీదికి అపొస్తలుడైన పేతురు ఒక్క ఉదుటున దాడిచేసి తన దగ్గర “కత్తియుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగనరికెను.” (యోహాను 18:3-5, 10) లూకా సువార్తలో, ఈ సంఘటన గురించే తెలియజేసే వృత్తాంతం, యేసు “వాని చెవి ముట్టి బాగుచేసెను” అని చెబుతోంది. (లూకా 22:50, 51) మరోసారి, మానవతా దృక్పథంతో తీసుకున్న ఈ చర్య యేసు స్నేహితుల సమక్షంలో అలాగే ఆయన శత్రువుల సమక్షంలో అంటే ఈ సందర్భంలో, ఆయనను బంధించడానికి వచ్చినవారి సమక్షంలో జరిగింది.
అవును, యేసు చేసిన అద్భుతాలను మనమెంత దగ్గరగా పరిశీలిస్తామో అవి ప్రామాణికమైనవనడానికి రుజువులను కూడా అంతే స్పష్టంగా గ్రహిస్తాము. (2 తిమోతి 3:16) మునుపు పేర్కొన్నట్లుగా అలాంటి అధ్యయనం, విధేయులైన మానవులను స్వస్థపరుస్తానన్న దేవుని వాగ్దానంపై మన విశ్వాసాన్ని బలపర్చాలి. క్రైస్తవ విశ్వాసం “నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది” అని బైబిలు నిర్వచిస్తోంది. (ఇటాలిక్కులు మావి.) (హెబ్రీయులు 11:1) గ్రుడ్డిగా నమ్మేయడాన్ని లేదా తమ నిరీక్షణలు నెరవేరితే బావుండునని కోరుకోవడాన్ని కాదుగాని రుజువులపై ఆధారపడిన విశ్వాసాన్ని దేవుడు ప్రోత్సహిస్తున్నాడని స్పష్టమవుతోంది. (1 యోహాను 4:1) మనం అలాంటి విశ్వాసాన్ని సంపాదించుకుంటుండగా మనం ఆధ్యాత్మికంగా మరింత బలంగా, మరింత ఆరోగ్యంగా, మరింత సంతోషంగా తయారవుతున్నట్లు మనమే గ్రహిస్తాము.—మత్తయి 5:3, NW; రోమీయులు 10:17.
మొదటి స్థానం ఆధ్యాత్మిక స్వస్థతకే!
శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న చాలామంది అసంతోషంగా ఉన్నారు. కొందరైతే, భవిష్యత్తు గురించి ఎలాంటి నిరీక్షణా లేనందున, లేదా సమస్యలు తమను ముంచెత్తుతున్నట్లు భావిస్తుండడం వల్ల ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వారు ఆధ్యాత్మికంగా అశక్తులుగా ఉన్నారు—ఇది దేవుని దృష్టిలో శారీరక అశక్తత విషయంలో ఉన్న పరిస్థితి కన్నా ఎంతో గంభీరమైన పరిస్థితి. (యోహాను 9:41) మరోవైపు, శారీరకంగా అశక్తులుగా ఉన్న అనేకులు, ఉదాహరణకు ముందటి ఆర్టికల్‌లో పేర్కొనబడిన క్రిశ్చన్, జూనియర్ వంటి వారు, సంతోషదాయకమైన సంతృప్తికరమైన జీవితాలను గడుపుతున్నారు. కారణం? వారు ఆధ్యాత్మికంగా స్థిరులుగా ఉన్నారు గనుక, బైబిలుపై ఆధారపడిన నిశ్చితమైన నిరీక్షణతో వారు శక్తిమంతులయ్యారు గనుక.
మానవులుగా మనకున్న విశేషమైన అవసరాన్ని సూచిస్తూ యేసు ఇలా అన్నాడు: “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును.” (మత్తయి 4:4) అవును, జంతువుల విషయంలోలా కాక, మానవులకు శారీరక పోషణ మాత్రమే కాదు, అంతకు మించినది కావాలి. దేవుని “స్వరూపమందు” సృష్టించబడినవారిగా మనకు ఆధ్యాత్మిక ఆహారం అవసరం—దేవుని గూర్చిన ఆయన సంకల్పాల్లో మన పాత్రను గూర్చిన పరిజ్ఞానం అవసరం, అలాగే ఆయన చిత్తాన్ని చేయడం అవసరం. (ఆదికాండము 1:27; యోహాను 4:34) దేవుని గురించిన పరిజ్ఞానం మన జీవితాల్లో అర్థాన్ని ఆధ్యాత్మిక శక్తిని నింపుతుంది. అది పరదైసు భూమిపై నిత్యజీవానికి ఆధారాన్ని కూడా ఇస్తుంది. “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము” అన్నాడు యేసు.—యోహాను 17:3.
యేసు సమకాలీనులు ఆయనను “స్వస్థపరిచేవాడు” అని కాక “బోధకుడు” అని పిలిచారన్న విషయం గమనార్హం. (లూకా 3:12; 7:40) వారెందుకలా పిలిచారు? ఎందుకంటే, మానవజాతి సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని గురించి యేసు ప్రజలకు బోధించాడు—ఆ పరిష్కారం దేవుని రాజ్యమే. (లూకా 4:43; యోహాను 6:26, 27) యేసుక్రీస్తు ఆధీనంలోని ఆ పరలోక ప్రభుత్వం, భూమినంతటినీ పరిపాలిస్తుంది, నీతిమంతుల సంపూర్ణమైన నిత్యమైన పునఃస్థాపన గురించీ వారి భూ గృహ పునఃస్థాపన గురించీ బైబిలు చేసిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తుంది. (ప్రకటన 11:15) అందుకనే యేసు మాదిరి ప్రార్థనలో దేవుని రాజ్యం రావడాన్ని ఆయన చిత్తం భూమ్మీద నెరవేరడంతో జతచేశాడు.—మత్తయి 6:9, 10.
అశక్తులుగా ఉన్న అనేకమంది ప్రేరణాత్మకమైన ఈ నిరీక్షణను గురించి తెలుసుకోవడం మూలంగా బాధతో కూడిన అశ్రువులకు బదులు ఆనంద బాష్పాలు రాల్చారు. (లూకా 6:21) నిజానికి, దేవుడు వ్యాధులను అశక్తతలను నిర్మూలించడం మాత్రమే కాదు, మానవ బాధలకు కారణమైన పాపాన్నే రూపుమాపుతాడు. మునుపు పేర్కొనబడిన యెషయా 33:24, మత్తయి 9:2-7 వచనాలు వ్యాధులను మన పాపభరిత స్థితికి జతచేస్తున్నాయి. (రోమీయులు 5:12) పాపంపై విజయం సాధించబడిన తర్వాత, మానవజాతి ఎట్టకేలకు “దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము” పొందుతుంది, ఆ స్వాతంత్ర్యములో మనస్సు శరీరము పరిపూర్ణతకు చేరుకోవడం ఉంది.—రోమీయులు 8:20-21.
ఇప్పుడు కాస్త ఆరోగ్యంగా ఉన్నవారు తమ ఆరోగ్యకరమైన స్థితిని అల్పంగా ఎంచే అవకాశం ఉంది. కానీ అశక్తతలతో బాధపడుతున్న వారి విషయం అలా కాదు. ఆరోగ్యము, జీవము ఎంత అమూల్యమైనవో, పరిస్థితులు ఎంత అకస్మాత్తుగా అనూహ్యంగా మారగలవో వారికి బాగా తెలుసు. (ప్రసంగి 9:11) కాబట్టి, మా పాఠకుల్లో వైకల్యతగలవారు, బైబిల్లో నమోదు చేయబడిన దేవుని అద్భుత వాగ్దానాలకు ప్రత్యేక అవధానాన్నిస్తారని మేము ఆశిస్తున్నాము. ఆ వాగ్దానాలను నెరవేర్చేందుకు యేసు తన ప్రాణాన్నే ఇచ్చాడు. అంతకన్నా గట్టి హామీ మనకు ఏమి లభించగలదు?—మత్తయి 8:16, 17; యోహాను 3:16.
[అధస్సూచి]
^ పేరా 6 దేవుడు బాధలను ఎందుకు అనుమతించాడన్న దాని గురించిన వివరణాత్మక చర్చ కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? అనే బ్రోషుర్ చూడండి.