కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒక కుమారుడు తన తండ్రికి సహాయం చేసిన విధానం

ఒక కుమారుడు తన తండ్రికి సహాయం చేసిన విధానం

ఒక కుమారుడు తన తండ్రికి సహాయం చేసిన విధానం

ఇంగ్లాండ్‌లో ఉన్న జేమ్స్‌ 30వ పడి ఆరంభంలో ఉన్నాడు. ఆయనకు తీవ్ర మానసిక అశక్తత, కొంచెం స్వయంశ్లాఘన అనే వ్యాధి ఉంది. అయినా ఆయన తన తల్లి, అక్కలతోపాటు యెహోవాసాక్షుల కూటాలకు అనేక సంవత్సరాలుగా హాజరవుతున్నాడు. అయితే, ఆయన తండ్రి మాత్రం వారి విశ్వాసాల్లో ఎన్నడూ ఆసక్తిని కనపరచలేదు. ఒకరోజు సాయంత్రం, క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు పరిచయస్థులను ఎలా ఆహ్వానించాలో తెలియజేసే ప్రదర్శన చూపించబడిన కూటం తర్వాత, జేమ్స్‌ ఇంటికి వచ్చి హడావుడిగా తన గదిలోకి వెళ్ళాడు. ఆయన తల్లి కంగారుపడుతూ ఆయన వెనకే వెళ్ళి చూస్తే, ఆయన పాత కావలికోట, తేజరిల్లు! పత్రికలు వెదకడం కనిపించింది. వెనుక పేజీపై జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రం ముద్రించబడి ఉన్న ఒక పత్రికను తీసుకుని తన తండ్రి దగ్గరికి పరుగెత్తాడు. ఆయన మొదట చిత్రంవైపు ఆ తర్వాత తండ్రి వైపు వేలెత్తి చూపించి, “మీరు!” అన్నాడు. జేమ్స్‌ తండ్రిని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానిస్తున్నాడని గ్రహించి ఆ తల్లిదండ్రులు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. ఆయన తండ్రి చూద్దాంలే అన్నాడు.

జ్ఞాపకార్థ ఆచరణ జరిగే సాయంకాలం జేమ్స్‌ తన తండ్రి బట్టల బీరువా దగ్గరికి వెళ్ళి ఒక మంచి ప్యాంటు చూసి తీసుకుని తన తండ్రికిచ్చి వేసుకోమని సైగ చేశాడు. తను రావట్లేదని తండ్రి సమాధానమిచ్చాడు. దాంతో జేమ్స్‌ తన తల్లితోపాటు రాజ్యమందిరానికి వెళ్ళిపోయాడు.

అయితే కొంతకాలానికి, జేమ్స్‌ తల్లి కూటాలకు వెళ్ళడానికి జేమ్స్‌ను తయారుచేస్తుంటే ఆమెకు సహకరించడం మానేశాడు, ఇంట్లోనే తన తండ్రి దగ్గరే ఉండిపోతాననేవాడు. ఒకరోజు ఆదివారం ఉదయం కూడా జేమ్స్‌ కూటాలకు వెళ్ళడానికి తయారవడంలో తల్లికి సహకరించడంలేదు. కానీ జేమ్స్‌ తండ్రి, “జేమ్స్‌, నేను కూటానికి వస్తే నీవు కూడా వస్తావా?” అని అడగడంతో ఆమె ఆశ్చర్యపోయింది. జేమ్స్‌ ముఖం వెలిగిపోయింది. ఆయన వెంటనే తండ్రిని కౌగిలించుకుని, “వస్తాను!” అన్నాడు, అలా ముగ్గురూ రాజ్యమందిరానికి వెళ్ళారు.

ఆ రోజు మొదలుకొని జేమ్స్‌ తండ్రి ప్రతి ఆదివారం కూటానికి హాజరవడం కొనసాగించాడు, కొంతకాలానికి, తాను పురోభివృద్ధి సాధించాలంటే ఇతర కూటాలకు కూడా హాజరుకావలసి ఉంటుందని అన్నాడు. (హెబ్రీయులు 10:​24, 25) ఆయన తన మాట నిలబెట్టుకున్నాడు. రెండునెలల తర్వాత ఆయన క్రమంగా బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. చాలా త్వరితగతిన పురోభివృద్ధి సాధించి, తన జీవితంలో అవసరమైన మార్పులు చేసుకుని, కొద్దికాలానికే రాజ్య ప్రకటనా పనిలో పాల్గొనడం ప్రారంభించాడు. బైబిలు అధ్యయనం ప్రారంభించిన ఒక సంవత్సరం తర్వాత ఆయన యెహోవాకు తన జీవితాన్ని సమర్పించుకుని నీటి బాప్తిస్మం ద్వారా ఆ సమర్పణను సూచించాడు. ప్రస్తుతం ఆయన తన సంఘంలో పరిచర్యా సేవకుడిగా సేవచేస్తున్నాడు. ఇప్పుడు కుటుంబంలో అందరూ ఐక్యంగా యెహోవాను సేవిస్తున్నారు.