కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దైవిక ఆదేశాలకు అనుగుణంగా జీవించడం యెహోవాను ఘనపరుస్తుంది

దైవిక ఆదేశాలకు అనుగుణంగా జీవించడం యెహోవాను ఘనపరుస్తుంది

దైవిక ఆదేశాలకు అనుగుణంగా జీవించడం యెహోవాను ఘనపరుస్తుంది

“కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను.”​కీర్తన 69:​30.

1. (ఎ) యెహోవా ఘనతపొందడానికి ఎందుకు అర్హుడు? (బి) మనం ఆయనను కృతజ్ఞతాస్తుతులతో ఎలా ఘనపరుస్తాము?

యెహోవా సర్వశక్తిగల దేవుడు, విశ్వసర్వాధిపతి, సృష్టికర్త. కాబట్టి ఆయన నామము, సంకల్పాలు ఘనపరచదగినవి. యెహోవాను ఘనపరచడం అంటే ఆయనను అత్యున్నతంగా గౌరవించడం, మాటల ద్వారా చేతల ద్వారా ఆయనను స్తుతించడం, పొగడడం అని అర్థం. అలా “కృతజ్ఞతాస్తుతులతో” ఘనపరచాలంటే ఆయన మన కోసం ఇప్పుడు చేస్తున్నదాన్నిబట్టి, భవిష్యత్తులో చేయబోయేదాన్నిబట్టి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. మనం చూపించాల్సిన వైఖరిని గురించి ప్రకటన 4:⁠11 లో తెలియజేయబడింది, అక్కడ పరలోకంలోని నమ్మకస్థులైన ఆత్మ ప్రాణులు ఇలా ప్రకటిస్తున్నారు: “ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు.” యెహోవాను మనమెలా ఘనపరచగలం? ఆయన గురించి తెలిసికొని, ఆయన మననుండి కోరేది చేయడం ద్వారా మనం ఆయనను ఘనపరచగలుగుతాం. “నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము” అని చెప్పినప్పుడు కీర్తనకర్త భావించినట్లే మనమూ భావించాలి.​—⁠కీర్తన 143:​10.

2. యెహోవా తనను ఘనపరచేవారితో ఎలా వ్యవహరిస్తాడు, తనను ఘనపరచనివారితో ఎలా వ్యవహరిస్తాడు?

2 యెహోవా తనను ఘనపరచేవారిని విలువైనవారిగా ఎంచుతాడు. అందుకే ఆయన ‘తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడు.’ (హెబ్రీయులు 11:⁠6) ఏమిటా ఫలము? యేసు తన పరలోకపు తండ్రికి చేసిన ప్రార్థనలో ఆ ఫలం గురించి చెప్పాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:⁠3) అవును, ‘కృతజ్ఞతాస్తుతులతో [యెహోవాను] ఘనపరచే’వారు “భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్తన 37:​29) మరొకవైపున, ‘దుర్జనునికి ముందు గతి ఉండదు.’ (సామెతలు 24:​20) ఈ అంత్యదినాల్లో, యెహోవాను ఘనపరచడం అత్యవసరం, ఎందుకంటే అతి త్వరలోనే ఆయన దుష్టులను నాశనం చేసి నీతిమంతులను కాపాడతాడు. “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.”​—⁠1 యోహాను 2:​17; సామెతలు 2:​21, 22.

3. మలాకీ పుస్తకం మీద మనమెందుకు శ్రద్ధ చూపించాలి?

3 ‘ప్రతి లేఖనము దైవావేశమువలన కలిగింది’ కాబట్టి, యెహోవా చిత్తమేమిటో బైబిలులో మనకు కనబడుతుంది. (2 తిమోతి 3:​16) దేవుని ఆ వాక్యంలో, యెహోవా తనను ఘనపరచేవారిని ఎలా ఆశీర్వదిస్తాడో, ఘనపరచనివారికి ఏమవుతుందో తెలియజేసే అనేక వృత్తాంతాలు ఉన్నాయి. ఆ వృత్తాంతాల్లో ఒకటి మలాకీ ప్రవక్త కాలంలో ఇశ్రాయేలులో జరిగినవాటికి సంబంధించినది. దాదాపు సా.శ.పూ. 443వ సంవత్సరం ప్రాంతంలో యూదాదేశములో నెహెమ్యా అధికారిగా ఉంటున్నకాలంలో మలాకీ, తన పేరుతో ఉన్న ఒక పుస్తకం వ్రాశాడు. శక్తివంతమైన, ఉత్తేజవంతమైన ఆ పుస్తకములో, ‘మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన’ సమాచారము, ప్రవచనాలు ఉన్నాయి. (1 కొరింథీయులు 10:​11) మలాకీ చెప్పినవాటిపై శ్రద్ధ చూపించడం, “యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము” కోసం అంటే ఈ దుష్ట విధానాన్ని ఆయన నాశనం చేయబోయే సమయం కోసం మనం సన్నద్ధులమై ఉండడానికి సహాయపడుతుంది.​—⁠మలాకీ 4:⁠5.

4. మలాకీ 1వ అధ్యాయంలో మన దృష్టికి తేబడిన ఆరు అంశాలు ఏవి?

4 ఇరవై ఒకటవ శతాబ్దంలో జీవిస్తున్న మనకు, 2,400 కంటే ఎక్కువ సంవత్సరాలకు పూర్వం వ్రాయబడిన మలాకీ పుస్తకము, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినానికి మనం సిద్ధపడేలా ఎలా సహాయపడుతుంది? మొదటి అధ్యాయం కనీసం ఆరు అంశాలవైపు మన అవధానాన్ని మళ్లిస్తుంది, మనం కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను ఘనపరచడానికి, ఆయన అనుగ్రహమును, నిత్యజీవమును పొందడానికి అవి చాలా ముఖ్యమైనవి: (1) యెహోవా తన ప్రజలను ప్రేమిస్తున్నాడు. (2) పవిత్ర విషయాలను తప్పకుండా విలువైనవిగా ఎంచాలి. (3) మనకున్న దాంట్లో శ్రేష్ఠమైనది తనకు ఇవ్వాలని యెహోవా అపేక్షిస్తాడు. (4) సత్యారాధన దురాశతో కాకుండా నిస్వార్థ ప్రేమతో పురికొల్పబడుతుంది. (5) దేవునికి అంగీకారమైన సేవచేయడం భారమైన లాంఛనం కాదు. (6) మనలో ప్రతి ఒక్కరం దేవునికి తప్పకుండా లెక్క అప్పజెప్పాలి. మలాకీ పుస్తకంపై వ్రాయబడిన మూడు ఆర్టికల్లలోని ఈ మొదటి ఆర్టికల్‌లో, మనం మలాకీ 1వ అధ్యాయాన్ని నిశితంగా చూస్తూ ఆ అంశాల్లో ప్రతిదాన్ని పరిశీలిద్దాం.

యెహోవా తన ప్రజలను ప్రేమిస్తున్నాడు

5, 6. (ఎ) యెహోవా యాకోబును ఎందుకు ప్రేమించాడు? (బి) యాకోబు చూపించినటువంటి విశ్వాసాన్ని మనం అనుకరిస్తే, దేని కోసం నిరీక్షించవచ్చు?

5 మలాకీ ప్రారంభ వచనాల్లో యెహోవా ప్రేమ స్పష్టం చేయబడింది. ఆ పుస్తకం ఈ మాటలతో ఆరంభమౌతుంది: “ఇశ్రాయేలీయులను గూర్చి . . . పలుకబడిన యెహోవా వాక్కు.” దేవుడు ఇంకా ఇలా అంటున్నాడు: “నేను మీయెడల ప్రేమ చూపియున్నాను.” అదే వచనంలో, అందుకొక ఉదాహరణను పేర్కొంటూ, “నేను యాకోబును ప్రేమించితిని” అని యెహోవా అంటున్నాడు. యాకోబు యెహోవాపై విశ్వాసమున్న వ్యక్తి. కొంతకాలం తర్వాత యెహోవా యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చాడు, ఆ తర్వాత యాకోబు ఇశ్రాయేలు జనాంగానికి పితరుడయ్యాడు. యాకోబు విశ్వాసంగల వ్యక్తి కాబట్టి యెహోవా ఆయనను ప్రేమించాడు. ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైతే యెహోవాపట్ల యాకోబులాంటి వైఖరిని చూపిస్తారో వారినికూడా ఆయన ప్రేమిస్తాడు.​—⁠మలాకీ 1:⁠1, 2.

6 మనం యెహోవాను ప్రేమించి ఆయన ప్రజలను హత్తుకొని ఉంటే, 1 సమూయేలు 12:22 లో ఉన్న మాటలనుండి ఆదరణ పొందగలుగుతాము: “యెహోవా . . . తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను . . . విడనాడడు.” యెహోవా తన ప్రజలను ప్రేమిస్తాడు, చిట్టచివరికి ఆయన వారికి నిత్యజీవమును ప్రతిఫలముగా ఇస్తాడు. అందుకే మనమిలా చదువుతాం: “యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.” (కీర్తన 37:​3, 4) మనం యెహోవాను ప్రేమించడంలో ఇమిడివున్న రెండవ అంశం, మలాకీ 1వ అధ్యాయంలో మన దృష్టికి తేబడింది.

పవిత్ర విషయాలను విలువైనవిగా ఎంచండి

7. యెహోవా ఏశావును ఎందుకు ద్వేషించాడు?

7మలాకీ 1:2, 3 లో యెహోవా, “నేను యాకోబును ప్రేమించితిని” అని అన్న తర్వాత, “ఏశావును ద్వేషించితిని” అని అన్నట్లు మనం చదువుతాం. ఆ భేదం ఎందుకు? యాకోబు యెహోవాను ఘనపరిచాడు, కానీ అతని కవల సోదరుడు ఏశావు ఘనపరచలేదు. ఏశావు ఎదోము అని కూడా పిలువబడ్డాడు. మలాకీ 1:4 లో, ఎదోమీయుల దేశము భక్తిహీనుల ప్రాంతమని పిలువబడింది, దాని ప్రజలు బహిరంగంగా నిందించబడ్డారు. కాస్తంత చిక్కుడుకాయల వంటకము కోసం తన అమూల్యమైన జ్యేష్ఠత్వాన్ని యాకోబుకు అమ్మేసిన తర్వాత ఏశావుకు ఎదోము (“ఎఱుపు” అని అర్థం) అనే పేరు పెట్టబడింది. “ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను” అని ఆదికాండము 25:⁠34 చెబుతోంది. అపొస్తలుడైన పౌలు తోటి విశ్వాసులతో “ఒక పూట కూటికొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను” ఉండకుండా జాగ్రత్త వహించమని అన్నాడు.​—⁠హెబ్రీయులు 12:​14-16.

8. ఏశావును పౌలు ఒక వ్యభిచారితో పోల్చేలా చేసిన కారణమేమిటి?

8 ఏశావు చేసిన చర్యలను పౌలు వ్యభిచారముతో ఎందుకు జోడించాడు? ఎందుకంటే ఏశావులాంటి మనస్తత్వం, ఒక వ్యక్తి పవిత్ర విషయాలను విలువైనవిగా ఎంచడంలో విఫలమయ్యేలా చేయగలదు. తత్ఫలితంగా, అది వ్యభిచారంవంటి గంభీరమైన పాపాలకు పాల్పడేలా చేయగలదు. కాబట్టి, మనలో ప్రతి ఒక్కరం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘ఒక గిన్నెడు చిక్కుడు గింజల వంటకం వంటి అల్పమైన దాని కోసం, నా క్రైస్తవ వారసత్వసంపదైన నిత్యజీవాన్ని పోగొట్టుకొనేలా నేను కొన్నిసార్లు శోధించబడుతున్నానా? బహుశా ఆ విషయాన్ని గ్రహించకుండా పవిత్ర విషయాలను నేను తృణీకరిస్తున్నానా?’ ఏశావులో భౌతిక తృష్ణ తీర్చుకోవాలనే అసహన కోరిక ఉంది. అతను ‘త్వరగా ఆ యెఱ్ఱయెఱ్ఱగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుము’ అని యాకోబుతో అన్నాడు. (ఆదికాండము 25:​30, NW) విచారకరంగా, దేవుని సేవకుల్లోని కొందరు నిజానికి ఇలా అన్నట్లే చేశారు: “త్వరగా! మాననీయమైన వివాహం కోసం ఎదురుచూడడం ఎందుకు?” ఎంతటి మూల్యం చెల్లించయినా లైంగిక తృష్ణ తీర్చుకోవాలనే వారి కోరిక, వారికి ఒక గిన్నెడు చిక్కుడు గింజల వంటకంలాగే అయ్యింది.

9. పూజ్యభావంతో కూడిన యెహోవా భయాన్ని మనం ఎలా కాపాడుకోగలము?

9 పవిత్రతను, యథార్థతను, మన ఆధ్యాత్మిక వారసత్వసంపదను చిన్నచూపు చూడకుండా ఉండడం ద్వారా మనమెన్నడూ పవిత్రవిషయాలను తృణీకరించకుండా ఉందాము. ఏశావులా కాకుండా, విశ్వసనీయుడైన యాకోబులా పవిత్ర విషయాలను అత్యంత విలువైనవిగా ఎంచుతూ, పూజ్యభావంతో కూడిన దేవుని భయాన్ని కాపాడుకుందాం. అదెలా చేయగలము? దేవుడు కోరేవాటిని జాగ్రత్తగా నిర్వర్తించడం ద్వారా అలా చేయగలుగుతాము. ఇది సహేతుకంగానే మలాకీ మొదటి అధ్యాయంలో మన దృష్టికి తేబడిన మూడవ అంశానికి మనల్ని నడిపిస్తుంది. ఏమిటా అంశం?

మనకున్నదాంట్లో శ్రేష్ఠమైనది యెహోవాకు ఇవ్వడం

10. యాజకులు యెహోవా బల్లను ఏ విధంగా నీచపరిచారు?

10 మలాకీ కాలంలో యెరూషలేములోని మందిరములో సేవ చేస్తున్న యూదా యాజకులు, తమకున్నవాటిలో శ్రేష్ఠమైన బలులను యెహోవాకు అర్పించలేదు. మలాకీ 1:​6-8, యిలా చెబుతోంది: ‘కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా; నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యముల కధిపతియగు యెహోవా మిమ్మునడుగుచున్నాడు.’ అందుకు ‘మేము ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమి’ అని యాజకులు అడిగారు. దానికి యెహోవా, ‘నా బలిపీఠముమీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించారు’ అని జవాబిచ్చాడు. దానికి ‘ఏమిచేసి నిన్ను అపవిత్రపరచితిమి’ అని యాజకులు అడిగారు. దానికి “‘యెహోవా బల్ల అపవిత్రమైనది’ అని మీరు అనడం ద్వారా,” (NW)  అని వారికి చెబుతాడు. “దీనిలో దోషమేమీ లేదు,” (NW) అని అంటూ కుంటి, గ్రుడ్డి, జబ్బుగల జంతువులను అర్పించిన ప్రతిసారి, ఆ యాజకులు యెహోవా బల్లను నీచపరిచినట్లు చూపించారు.

11. (ఎ) అనంగీకారమైన బలుల గురించి యెహోవా ఏమని చెప్పాడు? (బి) సాధారణ ప్రజలు ఏ విధంగా దోషులు?

11 అప్పుడు యెహోవా అలాంటి అనంగీకారమైన బలుల గురించి వారితో ఇలా తర్కించాడు: “అట్టివాటిని నీయధికారికి నీవిచ్చినయెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా?” లేదు, అలాంటి బహుమానానికి వారి అధికారి సంతోషించడు. అలాంటప్పుడు, లోపమున్న అర్పణలను విశ్వసర్వాధిపతి ఎలా అంగీకరిస్తాడు! దానికి కేవలం యాజకులు మాత్రమే నిందార్హులు కారు. నిజానికి, వారు బలులను అర్పించే పని చేయడంద్వారా యెహోవాను అవమానపరిచారు. అంటే సాధారణ ప్రజలు నిర్దోషులనా? ఎంతమాత్రం కాదు! నిజం చెప్పాలంటే, గ్రుడ్డి, కుంటి, జబ్బుగల జంతువులను ఎంపికచేసికొని, బలి అర్పించమని యాజకుల వద్దకు తీసుకువచ్చింది ఆ ప్రజలే. అదెంత పాపభరితమోగదా!

12. మనకున్నవాటిలోని శ్రేష్ఠమైనదాన్ని యెహోవాకు ఇవ్వడానికి మనకెలా సహాయం చేయబడుతుంది?

12 మనం ఇవ్వగలవాటిలో శ్రేష్ఠమైనదాన్ని యెహోవాకు ఇవ్వడమే, మనమాయనను నిజంగా ప్రేమిస్తున్నామని చూపించే ఒక మార్గం. (మత్తయి 22:​37, 38) మలాకీ కాలంనాటి బాధ్యతారహిత యాజకుల్లా కాకుండా, యెహోవా సంస్థ నేడు, దైవిక ఆదేశాలను అనుసరించి జీవించడం ద్వారా కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను ఘనపరచడానికి మనకు సహాయంచేసే చక్కని లేఖనాధారిత ఉపదేశాన్ని అందిస్తోంది. మలాకీ మొదటి అధ్యాయంనుండి వెలికితీయగల నాల్గవ ముఖ్యమైన అంశం దీనికి సంబంధించినదే.

సత్యారాధన ప్రేమతో పురికొల్పబడుతుంది, దురాశతో కాదు

13. దురాశచేత పురిగొల్పబడ్డారని చూపే ఏ చర్యలను యాజకులు చేస్తుండేవారు?

13 మలాకీ కాలంనాటి యాజకులు స్వార్థపరులు, ప్రేమలేనివారు, ధనాపేక్షగలవారు. ఆ విషయం మనకెలా తెలుసు? మలాకీ 1:10 ఇలా చెబుతోంది: “మీలో ఒకడు బలిపీఠము మీద నిరర్థకముగా రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండినయెడల మేలు; మీ యందు నాకిష్టము లేదు, మీచేత నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” అవును, దురాశపరులైన ఆ యాజకులు ఏమంత కష్టంకాని ఆలయసేవలు చేయడానికి రుసుము చెల్లించాలని అధికారంతో అడిగేవారు. వాకిండ్లను మూయడానికి, బలిపీఠపు అగ్నిరాజబెట్టడానికి సహితం ప్రతిఫలం అడిగేవారు! వారుచేసే అర్పణలకు యెహోవా సంతోషించలేదంటే అందులో ఆశ్చర్యం లేదు!

14. యెహోవాసాక్షులు ప్రేమతో పురికొల్పబడ్డారని మనం ఎందుకు చెప్పగలము?

14 దేవుని వాక్యం ప్రకారం, లోభులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరనే విషయాన్ని, ప్రాచీన యెరూషలేములోని పాపభరిత యాజకుల దురాశ, స్వార్థము మనకు సరిగానే గుర్తు చేస్తుండవచ్చు. (1 కొరింథీయులు 6:9,10) ఆ యాజకుల స్వార్థపూరిత విధానాల గురించి ఆలోచించడం, యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న ప్రకటనా పనిపట్ల మన ప్రశంసను అధికంచేస్తుంది. అది స్వచ్ఛందసేవ; మన పరిచర్యలో దేనికి కూడా మనం డబ్బు వసూలు చేయము. పౌలువలె, మనలో ప్రతి ఒక్కరం నిజంగానే ఇలా చెప్పగలం: ‘మీకు దేవుని సువార్తను ఉచితముగా ఆనందముగా ప్రకటించాను.’ (2 కొరింథీయులు 11:​7, NW) పౌలు ‘సువార్తను ఆనందముగా ప్రకటించాడు’ అన్నది గమనించండి. అది మలాకీ 1వ అధ్యాయంలో మన దృష్టికి తీసుకురాబడిన ఐదవ అంశాన్ని సూచిస్తుంది.

దేవున్ని సేవించడం భారమైన ఒక లాంఛనం కాదు

15, 16. (ఎ) బలులను అర్పించే విషయంలో యాజకులు ఎలాంటి దృక్కోణం చూపించారు? (బి) యెహోవాసాక్షులు తమ బలులను ఎలా అర్పిస్తారు?

15 ప్రాచీన యెరూషలేములోని విశ్వాసంలేని యాజకులు, బలులర్పించడాన్ని ప్రయాసకరమైన ఒక ఆచారంగా దృష్టించారు. అది వారికి భారంగావుంది. మలాకీ 1:13 లో వ్రాయబడినట్లుగా, దేవుడు వారితో యిలా చెప్పాడు: ‘అయ్యో, యెంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారు.’ ఆ యాజకులు దేవుని పవిత్ర విషయాలను తృణీకరించారు లేదా తిరస్కరించారు. మనం వ్యక్తిగతంగా అలా ఎన్నడూ చేయకుండా హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం. బదులుగా, మనం అన్ని సందర్భాల్లో 1 యోహాను 5:3 లోని మాటల స్ఫూర్తిని కనపరచుదాం: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.”

16 దేవునికి ఆధ్యాత్మిక బలులు అర్పించడంలో మనం ఆనందిస్తూ, అదొక భారమని ఎన్నడూ భావించకుండా ఉందాం. ఈ ప్రవచనపు మాటలపై శ్రద్ధ చూపించుదాం: ‘మీరు [యెహోవాతో] చెప్పవలసినదేమనగా​—⁠మా పాపములన్నిటిని పరిహరింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి.’ (హోషేయ 14:⁠2) ‘ఎడ్లకు బదులుగా మా పెదవులను’ అనే మాట ఆధ్యాత్మిక బలులను అంటే యెహోవాను గురించి, ఆయన సంకల్పాలను గురించి స్తుతితో కూడిన మన మాటలను సూచిస్తున్నాయి. ‘[యేసుక్రీస్తు] ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వఫలము అర్పించుదము’ అని హెబ్రీయులు 13:15 చెబుతోంది. మన ఆధ్యాత్మిక బలులు కేవలం లాంఛనప్రాయమైనవి కాదుగాని, దేవుని యెడల మనకున్న ప్రేమకు మన హృదయపూర్వక నిదర్శనాలైనందుకు మనమెంత సంతోషిస్తున్నామో కదా! మలాకీ 1వ ఆధ్యాయం నుండి నేర్చుకోగల ఆరవ అంశానికిది నడిపిస్తుంది.

ప్రతి ఒక్కరు లెక్క అప్పజెప్పాలి

17, 18. (ఎ) యెహోవా ‘వంచకుణ్ణి’ ఎందుకు శపించాడు? (బి) వంచకులు ఏ విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు?

17 మలాకీ కాలంలో జీవించిన వ్యక్తులు తమ క్రియలకు వ్యక్తిగతంగా తామే బాధ్యులైవున్నారు, మన విషయంలో కూడా అది నిజం. (రోమీయులు 14:​11, 12; గలతీయులు 6:⁠5) తదనుగుణంగా మలాకీ 1:14 ఇలా అంటోంది: ‘తనమందలో [లోపం లేని] మగదియుండగా యెహోవాకు మ్రొక్కుబడిచేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు.’ ఎవరిదగ్గరయినా మందవుందంటే, అతని దగ్గర ఎంపిక చేసే అవకాశం లేని ఒక్క జంతువే, అంటే ఒకే ఒక్క గొర్రె మాత్రమే ఉందని కాదు. బలి అర్పించడానికి అతడు గ్రుడ్డి, కుంటి, లేదా జబ్బుగల జంతువును ఎంచుకోవాల్సిన అవసరం ఉండదు. అతడు లోపమున్న జంతువును ఎన్నుకున్నాడంటే, అతడు యెహోవాచేసిన బలి ఏర్పాటును తృణీకరించినట్టే, ఎందుకంటే మంద ఉన్న వ్యక్తి దగ్గర, అలాంటి లోపాలు లేని ఒక జంతువు తప్పకుండా ఉంటుంది!

18 సరైన పశువు తనదగ్గరున్నప్పటికీ, బహుశా బలవంతంగా లాక్కురావలసిన గ్రుడ్డి, కుంటి లేదా జబ్బుగల పశువును బలి అర్పించడానికి యాజకుని వద్దకు తీసుకువచ్చిన వంచకుణ్ణి యెహోవా మంచి కారణంతోనే శపించాడు. ఇంత జరిగినా, అలాంటి దోషంగల జంతువులు అంగీకృతంకావు అని యాజకుల్లో ఏ ఒక్కరైనా ధర్మశాస్త్రంనుండి ఎత్తి చూపినట్లు ఒక్క సూచన కూడా లేదు. (లేవీయకాండము 22:​17-20) తమ అధిపతికి అలాంటి బహుమానం గనుక ఇవ్వజూపితే తమకెంతటి చెడు జరుగుతుందో తార్కిక జ్ఞానమున్న వ్యక్తులకు తెలుసు. కాని వాస్తవానికి మానవాధిపతులందరికంటే ఎంతో గొప్పవాడు, విశ్వ సర్వాధిపతి అయిన యెహోవాతో వారు వ్యవహరిస్తున్నారు. మలాకీ 1:14 ఆ విషయాన్ని ఇలా చెబుతోంది: “నేను ఘనమైన మహారాజునైయున్నాను; అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.”

19. మనం దేని కోసం ఆశతో ఎదురుచూస్తాం, మనం ఏమి చేస్తుండాలి?

19 దేవుని యథార్థ సేవకులుగా మనం, యావత్‌ మానవజాతి మహారాజగు యెహోవాను పూజించే రోజు కొరకు ఆశగా ఎదురుచూస్తాము. ఆ కాలంలో, “సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.” (యెషయా 11:9) ఈ మధ్య కాలంలో, “కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను” అని పలికిన కీర్తనకర్తను మనం అనుకరిస్తూ యెహోవా కట్టడలకు అనుగుణంగా జీవించేందుకు కృషి చేద్దాం. (కీర్తన 69:​30) దాన్ని సాధించడానికి, మలాకీ దగ్గర ఎంతో ప్రయోజనకరమైన సలహాలు ఇంకా ఉన్నాయి. అందువల్ల, తర్వాతి రెండు ఆర్టికల్‌లలో, మలాకీ పుస్తకంలోని ఇతర భాగాలను శ్రద్ధగా పరిశీలిద్దాం.

మీకు జ్ఞాపకముందా?

• యెహోవాను మనం ఎందుకు ఘనపరచాలి?

• మలాకీ కాలంలోని యాజకుల బలులు యెహోవాకు ఎందుకు అనంగీకారమైనవి?

• మనం యెహోవాకు స్తుతియాగమును ఎలా అర్పిస్తాము?

• సత్యారాధనకు ఏది ప్రేరణగా ఉండాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[9వ పేజీలోని చిత్రం]

మలాకీ ప్రవచనం మన కాలాన్ని సూచిస్తోంది

[10వ పేజీలోని చిత్రం]

ఏశావు పవిత్ర విషయాలను విలువైనవిగా ఎంచలేదు

[11వ పేజీలోని చిత్రం]

యాజకులు, ప్రజలు అనంగీకారమైన బలులను అర్పించారు

[12వ పేజీలోని చిత్రం]

ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులు స్తుతియాగాలను ఉచితంగా అర్పిస్తున్నారు