కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

యెహోవా మందిరంలో పవిత్ర సేవ చేస్తున్న “గొప్పసమూహము”ను యోహాను చూసినప్పుడు, వారు మందిరపు ఏ భాగములో సేవ చేస్తున్నారు?​—ప్రకటన 7:​9-15.

యెహోవా గొప్ప ఆధ్యాత్మిక మందిరం యొక్క భూసంబంధ ఆవరణల్లో ఒక దానిలో, ప్రత్యేకంగా సొలొమోను మందిరపు బయటి ఆవరణను పోలివున్న ఒక ఆవరణములో, గొప్పసమూహము సేవ చేస్తోందనడం సమంజసంగా ఉంటుంది.

యేసు కాలంలో ఉన్న అన్యుల ఆవరణకు ఆధ్యాత్మిక సమానార్థమైన, లేక సాదృశ్యమైన ఆవరణలో గొప్పసమూహము ఉందని గతంలో చెప్పబడింది. అయితే మరింత పరిశోధన చేయడంవల్ల ఆ ఆవరణ కాదు అని చెప్పేందుకు కనీసం అయిదు కారణాలు వెల్లడయ్యాయి. మొదటిది, హేరోదు మందిరానికున్న అన్ని విభాగాలకు సాదృశ్యమైనవి, యెహోవా గొప్ప ఆధ్యాత్మిక మందిరానికి లేవు. ఉదాహరణకు, హేరోదు మందిరానికి స్త్రీల ఆవరణ, ఇశ్రాయేలీయుల ఆవరణ ఉన్నాయి. స్త్రీల ఆవరణలో పురుషులు స్త్రీలు కూడా ప్రవేశించవచ్చు, కానీ ఇశ్రాయేలీయుల ఆవరణలోకి పురుషులు మాత్రమే ప్రవేశార్హులు. యెహోవా గొప్ప ఆధ్యాత్మిక మందిరంలోని భూసంబంధ ఆవరణల్లో చేయబడే ఆరాధనలో పురుషులు, స్త్రీలు విడదీయబడలేదు. (గలతీయులు 3:​28, 29) కాబట్టి, స్త్రీల ఆవరణకు, ఇశ్రాయేలీయుల ఆవరణకు సమానమైనవేవీ ఆధ్యాత్మిక మందిరంలో లేవు.

రెండవది, నిర్మాణానికి సంబంధించి దేవుడిచ్చిన సూచనల ప్రకారం నిర్మించబడిన సొలొమోను మందిరంలోగానీ, యెహెజ్కేలు దర్శనంలో చూసిన మందిరంలోగానీ అన్యుల ఆవరణ లేదు; చివరికి జెరుబ్బాబెలు పునర్నిర్మించిన మందిరంలో కూడా ఆ ఆవరణ లేదు. కాబట్టి, ఆరాధనా ఏర్పాటైన యెహోవా గొప్ప ఆధ్యాత్మిక మందిరంలో అన్యుల ఆవరణకు సాదృశ్యమైన ఆవరణ ఉండాలని సూచించడానికి ఎటువంటి ఆధారమూ లేదు, ప్రత్యేకంగా ఈ క్రింది మూడవ అంశాన్ని పరిశీలించినప్పుడు ఏ ఆధారమూ కనబడదు.

మూడవది, అన్యుల ఆవరణ ఎదోమీయుడైన హేరోదు రాజు చేత నిర్మించబడింది, ఆ రాజు తనను తాను గొప్పచేసుకోవడానికి, రోమా ప్రభుత్వం దృష్టిలో మంచిపేరు సంపాదించుకోవడానికి దాన్ని కట్టించాడు. హేరోదు, బహుశా సా.శ.పూ. 18 లేక 17 లో జెరుబ్బాబెలు మందిరం పునర్నిర్మించడాన్ని ఆరంభించివుంటాడు. ది ఏంఖర్‌ బైబిల్‌ డిక్షనరీ ఇలా వివరిస్తోంది: “పడమటి [రోమా] సామ్రాజ్యాధికారుల ప్రామాణికమైన అభిరుచి ఏమిటంటే, . . . తూర్పు పట్టణాల్లో ఉన్న మందిరాలకంటే ఒక పెద్ద మందిరాన్ని కట్టించాలన్నదే.” అయితే, మందిరం అప్పటికే స్థిరమైన కొలతలతో ఉంది. ఆ డిక్షనరీ ఇలా తెలియజేస్తోంది: “ఆ మందిరం, పూర్వము [సొలొమోను, జెరుబ్బాబెలు] కట్టించిన మందిరాల కొలతలతోనే ఉన్నప్పటికీ, ఆలయ పర్వతం మాత్రం ఆ మందిరపు పరిమాణాన్ని పరిమితం చేయలేదు.” తత్ఫలితంగా, ఆధునిక కాలాల్లో అన్యుల ఆవరణ అని పిలువబడుతున్న ఆవరణను అదనంగా కట్టించడం ద్వారా హేరోదు మందిరపు ప్రాంతాన్ని విస్తరింపజేశాడు. అలాంటి నేపథ్యం ఉన్న ఒక కట్టడానికి సాదృశ్యమైనది యెహోవా ఆధ్యాత్మిక మందిరపు ఏర్పాటులో ఎందుకు ఉంటుంది?

నాలుగవది, దాదాపు ఎవరైనా అంటే గ్రుడ్డివారైనా, కుంటివారైనా, సున్నతి పొందని అన్యులైనా అన్యుల ఆవరణలోకి ప్రవేశించవచ్చు. (మత్తయి 21:​14, 15) నిజమే, దేవునికి అర్పణలు ఇవ్వాలని కోరుకొన్న అనేకమంది సున్నతి పొందని అన్యులకు ఆ ఆవరణ ఒక ప్రయోజనకరంగా ఉండేది. ఇక్కడినుండే యేసు కొన్నిసార్లు జనసమూహాలతో ప్రసంగించాడు, తన తండ్రి ఇంటిని అవమానపరిచారని అంటూ రెండుసార్లు, రూకలు మార్చేవారిని, వర్తకులను వెళ్ళగొట్టాడు. (మత్తయి 21:​12, 13; యోహాను 2:​14-16) అయినప్పటికీ, ద జూయిష్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతోంది: “ఖచ్చితంగా చెప్పాలంటే, ఈ బయటి ఆవరణ, మందిరంలోని భాగము కాదు. దీని నేల పవిత్రమైనది కాదు, దీనిలోకి ఎవ్వరైనా ప్రవేశించవచ్చు.”

ఐదవది, అన్యుల ఆవరణను ఉద్దేశిస్తూ ఉపయోగించబడిన “మందిరం,” (హైరోన్‌) అనే గ్రీకు పదం నుండి అనువదించబడింది. అది “మందిరపు భవనాన్ని మాత్రమే కాకుండా మొత్తం భవన సముదాయాన్ని సూచిస్తోంది,” అని బార్క్‌లే ఎమ్‌. న్యూమాన్‌, ఫిలిప్‌ సి. స్టైన్‌లు వ్రాసిన మత్తయి సువార్తపై ఒక చేతిపుస్తకం (ఆంగ్లం) చెబుతోంది. దానికి భిన్నంగా, గొప్పసమూహమునకు సంబంధించి యోహాను చూసిన దర్శనంలోని “మందిరం” అని అనువదించబడిన (నేయోస్‌) గ్రీకు పదం మరింత నిర్దిష్టంగా ఉంది. యెరూషలేము మందిరం విషయంలో, అది సాధారణంగా అతి పరిశుద్ధ స్థలాన్ని, మందిరపు భవనాన్ని లేదా మందిర ప్రాంగణాన్ని సూచిస్తుంది. అది కొన్నిసార్లు ‘గర్భాలయం’ అని అనువదించబడింది.​—⁠యెహాను 2:⁠20

గొప్పసమూహములోని సభ్యులు యేసు విమోచన క్రయధన బలిమీద విశ్వాసముంచుతారు. వారు “గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొని” ఆధ్యాత్మికంగా శుభ్రంగా ఉన్నారు. ఆ కారణంగా, వారు దేవుని స్నేహితులయ్యేందుకేగాక, మహాశ్రమలనుండి కూడా రక్షించబడే ఉత్తరాపేక్షతో నీతిమంతులుగా ప్రకటించబడ్డారు. (యాకోబు 2:​23, 25) అనేక విధాలుగా, వారు ధర్మశాస్త్ర నిబంధనకు లోబడి, ఇశ్రాయేలీయులతో కలిసి ఆరాధించిన మతప్రవిష్టులను పోలి ఉన్నారు.

నిజమే, యాజకులు తమ విధులను నిర్వహించే లోపలి ఆవరణలో ఈ మతప్రవిష్టులు సేవ చేయలేదు. గొప్పసమూహము యొక్క సభ్యులు యెహోవా గొప్ప ఆధ్యాత్మిక మందిరపు లోపలి ఆవరణలో లేరు, ఆ ఆవరణ యెహోవా ‘పరిశుద్ధ యాజకుల’ సభ్యులు భూమిపై ఉన్నప్పుడు కలిగివున్న పరిపూర్ణమైన, నీతియుక్తమైన, మానవ పుత్రత్వ స్థితిని సూచిస్తుంది. (1 పేతురు 2:⁠5) కానీ పరలోకములోని ఒక పెద్ద, యోహానుతో చెప్పినట్లు గొప్పసమూహము నిజంగానే మందిరంలో ఉంది, నిజమైన మందిరం బయట ఉండే అన్యుల ఆధ్యాత్మిక ఆవరణగా భావించబడే ప్రాంతంలో మాత్రం కాదు. ఎంత గొప్ప ఘనత అది! అంతేగాక అది ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక, నైతిక స్వచ్ఛతను అన్నివేళలా కాపాడుకోవాల్సిన అవసరతను ఎంతగా నొక్కి చెబుతోందో కదా!

[31వ పేజీలోని డయాగ్రామ్‌/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

సొలొమోను మందిరం

1. మందిరపు భవనం

2. లోపలి ఆవరణ

3. బయటి ఆవరణ

4. మందిరపు ఆవరణకు వెళ్ళేందుకు మెట్లు