మీరు తగులుబడిని లెక్క చూసుకుంటారా?
మీరు తగులుబడిని లెక్క చూసుకుంటారా?
యేసుక్రీస్తు తన శిష్యులకు నిత్యజీవ నిరీక్షణను ఇచ్చాడు, అదే సమయంలో క్రైస్తవునిగా జీవించడంలోని తగులుబడిని లెక్క చూసుకొమ్మని కూడా వారిని ప్రోత్సహించాడు. “మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా?” అని ప్రశ్నించడం ద్వారా ఆ విషయాన్ని ఉదాహరించాడు. (లూకా 14:28) యేసు ఏ తగులుబడి గురించి మాట్లాడుతున్నాడు?
క్రైస్తవులందరూ శ్రమలను ఎదుర్కొంటారు, వాటిలో కొన్ని గంభీరమైనవిగా ఉంటాయి. (కీర్తన 34:19; మత్తయి 10:36) కాబట్టి, వ్యతిరేకతను లేక ఇతర సమస్యలను ఎదుర్కొన్నప్పుడు కంగారు పడిపోకుండా ఉండడానికి మనం మానసికంగా, ఆధ్యాత్మికంగా సిద్ధపడి ఉండడం అవసరం. మనకు, పాపమరణాల నుండి విముక్తి అనే ప్రతిఫలం లభిస్తుంది. ఈ ప్రస్తుత విధానం మనకు ఇవ్వగల వాటన్నిటికంటే కూడా ఆ ప్రతిఫలం చాలా విలువైనదని తెలుసుకోవడం ద్వారా, క్రీస్తు శిష్యునిగా ఉండడంలో ఇమిడివున్న తగులుబడిలో భాగంగా అలాంటి సవాళ్ళను ఎదుర్కోవల్సిందేనని మనం గ్రహిస్తాము. అవును, మనం దేవుణ్ణి సేవించడంలో కొనసాగితే, ఆయన అనుమతించేదేది కూడా, చివరికి మరణం కూడా మనకు శాశ్వత హాని కలిగించలేదు.—2 కొరింథీయులు 4:16-18; ఫిలిప్పీయులు 3:8.
మన విశ్వాసం అంతగా ఎలా బలపడుతుంది? మనం సరైన నిర్ణయం తీసుకున్న ప్రతీసారి, క్రైస్తవ సూత్రాల కొరకు స్థిరంగా నిలబడ్డ ప్రతీసారి లేక దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చర్య తీసికొనేలా ఒత్తిడి చేయబడుతున్నప్పటికీ దేవుని చిత్తానికి అనుగుణంగా చర్య తీసికొన్న ప్రతీసారి, మన విశ్వాసం మరింత బలపడుతుంది. మనం అనుసరించిన నమ్మకమైన విధానం మూలంగా మనం వ్యక్తిగతంగా యెహోవా ఆశీర్వాదాలను అనుభవించినప్పుడు, మన విశ్వాసం బలపడుతుంది, అధికమవుతుంది. ఆ విధంగా మనం యేసు మాదిరిని, ఆయన మొదటి శిష్యుల మాదిరిని, యుగయుగాలుగా దేవుని సేవ చేయడానికి వెచ్చించవలసిన ‘తగులుబడిని’ సరిగ్గా ‘లెక్క చూసుకొన్న’ విశ్వాసులైన స్త్రీ పురుషులందరి మాదిరిని అనుకరిస్తాము.—మార్కు 1:16-20; హెబ్రీయులు 11:4, 7, 17, 24, 25, 32-38.