కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా దినమును ఎవరు తప్పించుకొంటారు?

యెహోవా దినమును ఎవరు తప్పించుకొంటారు?

యెహోవా దినమును ఎవరు తప్పించుకొంటారు?

“నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును.”​—⁠మలాకీ 4:⁠1.

1. ఈ దుష్ట విధానాంతాన్ని మలాకీ ఎలా వర్ణించాడు?

మలాకీ ప్రవక్త, సమీప భవిష్యత్తులో జరగబోయే భయోత్పాదకమైన సంఘటనల గురించిన ప్రవచనాలను వ్రాసేందుకు దేవుని చేత ప్రేరేపించబడ్డాడు. ఈ సంఘటనల ప్రభావం భూమ్మీది ప్రతి వ్యక్తి మీద పడుతుంది. మలాకీ 4:1 ఇలా ప్రవచిస్తోంది: “ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును; గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు, వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండ, రాబోవుదినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” ఈ దుష్ట విధానపు నాశనం ఎంత సమగ్రంగా ఉంటుంది? ఎంతగానంటే, మళ్ళీ ఎన్నడూ పెరగకుండా వేర్లతో సహితం నాశనం చేయబడిన చెట్టులా ఉంటుంది.

2. యెహోవా దినమును కొన్ని లేఖనాలు ఎలా వర్ణిస్తున్నాయి?

2 మలాకీ ‘ఏ “దినము” గురించి ప్రవచిస్తున్నాడు?’ అని మీరు ప్రశ్నిస్తుండవచ్చు. యెషయా 13:9వ వచనంలో చెప్పబడిన దినమే అది, అదిలా ప్రకటిస్తోంది: “యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును.” జెఫన్యా 1:⁠15 దానిని ఇలా వర్ణిస్తోంది: “ఆ దినము ఉగ్రతదినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములును గాఢాంధకారమును కమ్ము దినము.”

“మహా శ్రమ”

3. “యెహోవా దినము” అంటే ఏమిటి?

3 మలాకీ ప్రవచనపు గొప్ప నెరవేర్పులో, “యెహోవా దినము,” “మహా శ్రమ” అని వర్ణించబడిన కాలము రెండూ ఒకటే. యేసు ఇలా ప్రవచించాడు: “అప్పుడు మహా శ్రమ కలుగును . . . లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు.” (మత్తయి 24:​20, 21) ఈ లోకం ఇప్పటివరకు, ప్రత్యేకంగా 1914 నుండి చవిచూసిన క్షోభ గురించి ఒక్కసారి ఆలోచించండి. (మత్తయి 24:​7-12) అంతెందుకు, కేవలం రెండవ ప్రపంచ యుద్ధమే 5 కోట్లకంటే ఎక్కువ మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది! అయినా రాబోయే “మహా శ్రమ” ముందు ఇలాంటి సంఘటనలు ఎంతో అల్పమైనవిగా ఉంటాయి. యెహోవా దినమనే ఆ సంఘటన అర్మగిద్దోనుతో ముగుస్తుంది, ఈ దుష్టవిధానపు అంత్యదినాలకు ముగింపును తెస్తుంది.​—⁠2 తిమోతి 3:​1-5, 13; ప్రకటన 7:​14; 16:​14, 15.

4. యెహోవా దినము ముగిసే సమయానికి ఏమి జరుగుతుంది?

4 యెహోవా దినము ముగిసే సరికి, సాతాను లోకము, దాని మద్దతుదారులు నామరూపాల్లేకుండా నాశనం చేయబడతారు. మొదట అబద్ధమతం నిర్మూలించబడుతుంది. ఆ తర్వాత సాతానుకు సంబంధించిన రాజకీయ, ఆర్థిక విధానాలకు విరుద్ధంగా యెహోవా తీర్పు వ్యక్తం చేయబడుతుంది. (ప్రకటన 17:​12-14; 19:​17, 18) యెహెజ్కేలు ఇలా ప్రవచిస్తున్నాడు: “తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని యెంచుదురు, యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించజాలదు.” (యెహెజ్కేలు 7:​19) ఆ దినము గురించి జెఫన్యా 1:14 ఇలా చెబుతోంది: “యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతిశీఘ్రముగా వచ్చుచున్నది.” యెహోవా దినమును గురించి బైబిలు చెబుతున్నదాన్నిబట్టి, మనం దేవుని నీతిసూత్రాలకు అనుగుణంగా జీవించడానికి నిశ్చయించుకోవాలి.

5. యెహోవా నామమునకు భయపడేవారు ఏమి అనుభవిస్తారు?

5 యెహోవా దినము, సాతాను లోకాన్ని ఏమి చేస్తుందో ప్రవచించిన తర్వాత, యెహోవా ఇలా చెబుతున్నట్లుగా మలాకీ 4:2 పేర్కొంటోంది: “నా నామమందు భయభక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.” ఆ “నీతి సూర్యుడు” యేసుక్రీస్తే. ఆయన ఈ “లోకమునకు” ఆధ్యాత్మిక “వెలుగు.” (యోహాను 8:​12) యేసు మొదట, ఆధ్యాత్మిక స్వస్థతా వెలుగును ప్రకాశింపజేస్తాడు, నేడు మనం దాన్ని అనుభవిస్తున్నాము, ఆ తర్వాత నూతనలోకంలో సంపూర్ణమైన శారీరక స్వస్థతా వెలుగును ప్రకాశింపజేస్తాడు. యెహోవా చెబుతున్నట్లుగా, స్వస్థత పొందినవారు, చెరనుండి విడిపించబడినందుకు ఆహ్లాదంతో, ఆనందంతో ‘కొవ్విన దూడల్లా బయలుదేరి గంతులు వేస్తారు.’

6. యెహోవా సేవకులు ఎలాంటి విజయోత్సవం జరుపుకుంటారు?

6 మరి యెహోవా కోరేవాటిని నిర్లక్ష్యం చేసేవారి సంగతేమిటి? మలాకీ 4:3 ఇలా తెలియజేస్తోంది: ‘నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ [దేవుని సేవకుల] పాదములక్రింద ధూళివలె ఉందురు, మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.’ దేవుని సేవకులైన మానవులు సాతాను లోకాన్ని నాశనం చేయడంలో భాగంవహించరు. బదులుగా, యెహోవా దినము తర్వాత జరిగే విజయోత్సవంలో భాగం వహించడం ద్వారా వారు ఆలంకారికంగా ‘దుర్మార్గులను అణగద్రొక్కుతారు.’ ఎర్ర సముద్రంలో ఫరో సైన్యము నాశనమైన తర్వాత గొప్ప విజయోత్సవము జరిగింది. (నిర్గమకాండము 15:​1-21) అలాగే, సాతాను అతని లోకము మహా శ్రమలో నిర్మూలమైన తర్వాత ఒక విజయోత్సవం జరుగుతుంది. యెహోవా దినమును తప్పించుకొన్న యథార్థవంతులు, “ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము” అని ఆనందంతో కేకలు వేస్తారు. (యెషయా 25:​9) యెహోవా సర్వాధిపత్యమే నిజమైనదని నిరూపించబడి, సమాధానకర నివాసస్థలంగా ఉండేందుకు భూమి శుభ్రపరచబడినప్పుడు ఎంత ఆనందోత్సాహంగా ఉంటుందో కదా!

క్రైస్తవమత సామ్రాజ్యం ఇశ్రాయేలును అనుకరిస్తోంది

7, 8. మలాకీ కాలంలోని ఇశ్రాయేలు ఆధ్యాత్మిక పరిస్థితిని వర్ణించండి.

7 యెహోవాను సేవించేవారు ఆయన అనుగ్రహం పొందుతారు, ఆయనను సేవించనివారు పొందరు. మలాకీ తన పుస్తకం వ్రాసినప్పుడు ఇలాగే జరిగింది. బబులోనులో 70 సంవత్సరాల చెరవాసం తర్వాత సా.శ.పూ. 537 లో ఇశ్రాయేలు శేషజనం పునరుద్ధరించబడింది. అయితే, ఆ తర్వాతి శతాబ్దంలో, పునరుద్ధరించబడిన ఇశ్రాయేలు మతభ్రష్టత్వంలోనికి, దుష్టత్వంలోనికి దిగజారడం ఆరంభించింది. అనేకమంది ప్రజలు యెహోవా నామమును అవమానపరుస్తున్నారు; ఆయన నీతియుక్తమైన నియమాలను నిర్లక్ష్యం చేస్తున్నారు; బలి అర్పించేందుకు గ్రుడ్డి, కుంటి, జబ్బున్న జంతువులను తీసికొనిరావడం ద్వారా ఆయన ఆలయాన్ని మలినపరుస్తున్నారు; యౌవనంలో పెండ్లి చేసికొన్న తమ భార్యలకు విడాకులిస్తున్నారు.

8 తత్ఫలితంగా, యెహోవా వారితో ఇలా అన్నాడు: ‘తీర్పు తీర్చుటకై నేను మీయొద్దకు రాగా, చిల్లంగివాండ్రమీదను వ్యభిచారులమీదను అప్రమాణికులమీదను, నాకు భయపడక వారి కూలివిషయములో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేనివారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయువారిమీదను దృఢముగా సాక్ష్యము పలుకుదును, యెహోవానైన నేను మార్పులేనివాడను.’ (మలాకీ 3:​5, 6) అయితే, తమ చెడు మార్గాలను విడనాడేవారిని యెహోవా ఇలా ఆహ్వానిస్తున్నాడు: ‘మీరు నాతట్టు తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదును.’​—⁠మలాకీ 3:⁠7.

9. మలాకీ ప్రవచనాలు మొదట్లో ఎలా నెరవేరాయి?

9 ఆ మాటలు సా.శ. మొదటి శతాబ్దంలో కూడా నెరవేరాయి. యూదుల్లోని ఒక శేషజనం యెహోవాను సేవిస్తూ, ఆత్మాభిషిక్త క్రైస్తవుల ఒక క్రొత్త “జనాంగము”లో భాగమయ్యింది. వారిలో అన్యులు కూడా భాగస్థులయ్యారు. అయితే, సహజ ఇశ్రాయేలులోని అత్యధికులు యేసును నిరాకరించారు. యేసు ఆ కారణంగానే ఇశ్రాయేలు జనాంగంతో ఇలా అన్నాడు: “ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది.” (మత్తయి 23:​38; 1 కొరింథీయులు 16:​22) మలాకీ 4:1 లో ప్రవచించబడినట్లు, సా.శ. 70 లో ‘కాలుతున్న కొలిమిలాంటి ఒక దినము’ సహజ ఇశ్రాయేలీయుల మీదికి వచ్చింది. యెరూషలేము, దానిలోని దేవాలయము నాశనం చేయబడ్డాయి, కరువు, అధికార పోరాటాలు, రోమా సైన్యాల దాడుల కారణంగా దాదాపు 10 లక్షలకు పైగా ప్రజలు చనిపోయారని నివేదించబడింది. అయితే, యెహోవాను సేవించినవారు ఆ శ్రమను తప్పించుకొన్నారు.​—⁠మార్కు 13:​14-20.

10. సాధారణ ప్రజలు, మత నాయకులు మొదటి శతాబ్దపు ఇశ్రాయేలును ఏ విధంగా అనుకరిస్తున్నారు?

10 నేటి మానవాళి, ముఖ్యంగా క్రైస్తవమత సామ్రాజ్యం, మొదటి శతాబ్దపు ఇశ్రాయేలు జనాంగాన్ని అనుకరించింది. క్రైస్తవమత సామ్రాజ్యంలోని నాయకులు, సాధారణ ప్రజలు, యేసు బోధించిన దేవుని సత్యాలకు బదులుగా తమ సొంత మత సిద్ధాంతాలనే కోరుకుంటున్నారు. ప్రత్యేకంగా మత నాయకులే దోషులు. వారు యెహోవా నామమును ఉపయోగించడానికి నిరాకరిస్తున్నారు, చివరికి తమ బైబిలు అనువాదాల్లో నుండి కూడా దానిని తొలగిస్తున్నారు. క్రైస్తవేతర సిద్ధాంతాలైన నరకాగ్నిలో నిత్య హింస, త్రిత్వము, ఆత్మ అమర్త్యత, పరిణామం వంటి లేఖన వ్యతిరేక బోధలతో వారు యెహోవాను అవమానపరుస్తున్నారు. మలాకీ కాలంలోని యాజకులు చేసినట్లుగానే, వారు యెహోవాకు చెందవలసిన స్తుతిని ఆయనకు దక్కకుండా చేస్తున్నారు.

11. లోకంలోని మతాలు తాము ఎవరిని సేవిస్తున్నాయో ఎలా చూపిస్తున్నాయి?

11 అంత్యదినాలు ఆరంభమైనప్పుడు, అంటే 1914 లో, క్రైస్తవులమని చెప్పుకొనే వారి నడిపింపును అనుసరిస్తున్న ఈ లోక మతాలు తాము నిజంగా ఎవరిని ఆరాధిస్తున్నామన్న విషయాన్ని వెల్లడిచేశాయి. రెండు ప్రపంచ యుద్ధ కాలాల్లోను, ఆ మతాలు, వాటి సభ్యులు జాతీయ విభేదాలవల్ల తమ సొంత మతానికి చెందిన ప్రజలనే హతమార్చవలసి వచ్చినప్పటికీ యుద్ధానికి వెళ్ళమని ప్రజలను ప్రోత్సహించాయి. యెహోవాకు లోబడేవారెవరో లోబడనివారెవరో దేవుని వాక్యం స్పష్టంగా గుర్తిస్తుంది: “దీనినిబట్టి దేవుని పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనమొకని నొకడు ప్రేమింపవలెననునది మొదటనుండి మీరు వినిన వర్తమానమేగదా మనము కయీను వంటి వారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను.”​—⁠1 యోహాను 3:​10-12.

నెరవేరుతున్న ప్రవచనం

12, 13. దేవుని సేవకులు మన కాలంలో ఏ ప్రవచనాలను నెరవేర్చారు?

12 మొదటి ప్రపంచ యుద్ధం 1918 లో ముగిసేనాటికి, క్రైస్తవమత సామ్రాజ్యాన్ని, ఇతర అన్ని అబద్ధ మతాలను దేవుడు ఖండించాడని యెహోవా సేవకులు గ్రహించగలిగారు. అప్పటినుండి, యథార్థ హృదయులు ఇలా ఆహ్వానించబడ్డారు: “నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు.” (ప్రకటన 18:​4, 5) యెహోవాను సేవించాలని కోరుకొన్నవారు అబద్ధమత జాడలేవీ లేకుండా శుభ్రపరచుకోవడం మొదలుపెట్టి, ఈ దుష్ట విధాన సమాప్తికి ముందు పూర్తిచేయవలసిన పని, అంటే స్థాపించబడిన రాజ్య సువార్తను ప్రపంచవ్యాప్తంగా ప్రకటించడం ఆరంభించారు.​—⁠మత్తయి 24:​14.

13 “యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును” అన్న మలాకీ 4:5 లోని ప్రవచనం నెరవేర్పుగా అది జరిగింది. ఏలీయా ద్వారా ముందుగా సూచించబడిన బాప్తిస్మమిచ్చు యోహాను పనిలో ఆ ప్రవచనం మొదటిసారి నెరవేరింది. ధర్మశాస్త్రానికి విరుద్ధంగా తాము చేసిన పాపాల విషయమై పశ్చాత్తాపం చూపిన యూదులకు బాప్తిస్మమిచ్చినప్పుడు యోహాను ఏలీయా వంటి సేవ చేశాడు. మరింత ప్రాముఖ్యంగా, యోహాను మెస్సీయకు ముందుగా నడిచాడు. అయితే యోహాను సేవ, మలాకీ ప్రవచనానికి కేవలం తొలి నెరవేర్పు మాత్రమే. యోహానును రెండవ ఏలీయాగా గుర్తిస్తూ, “ఏలీయా” చేసినటువంటి పని భవిష్యత్తులో కూడా జరుగుతుందని యేసు సూచించాడు.​—⁠మత్తయి 17:​11, 12.

14. ఈ విధానాంతానికి ముందే జరగాల్సిన ప్రాముఖ్యమైన పని ఏమిటి?

14 ఈ గొప్ప ఏలీయా పని, “యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము”కు ముందే జరుగుతుందని మలాకీ ప్రవచనం చూపించింది. వేగంగా వస్తున్న, సర్వశక్తిమంతుడైన దేవుని మహా దినమైన అర్మగిద్దోను యుద్ధంతో ఆ దినము ముగుస్తుంది. అంటే ఈ దుష్ట విధానం అంతమై, సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు అధ్వర్యంలో జరిగే దేవుని పరలోక రాజ్యపు వెయ్యేండ్ల పరిపాలన ప్రారంభం కావడానికి ముందు, ఏలీయా చేసిన పరిచర్యను పోలిన పని జరుగుతుందని దాని భావం. ఈ ప్రవచనం చెప్పినట్లుగానే, ప్రస్తుత దుష్ట విధానాన్ని యెహోవా నాశనం చేయకముందే, ఆధునిక దిన ఏలీయా తరగతి, భూనిరీక్షణగల లక్షలమంది తోటి క్రైస్తవుల సహాయంతో, స్వచ్ఛారాధనను పునరుద్ధరించే పనిని ఉత్సాహవంతంగా కొనసాగిస్తూ, యెహోవా నామమును కొనియాడుతూ, గొఱ్ఱెవంటి ప్రజలకు బైబిలు సత్యాలను బోధిస్తున్నారు.

యెహోవా తన సేవకులను ఆశీర్వదిస్తాడు

15. యెహోవా తన సేవకులను ఎలా గుర్తుంచుకొంటాడు?

15 యెహోవా తనను సేవించేవారిని ఆశీర్వదిస్తాడు. మలాకీ 3:⁠16 ఇలా చెబుతోంది: “అప్పుడు, యెహోవాయందు భయభక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.” హేబెలు కాలం నుండి, నిత్యజీవమివ్వాలనే ఉద్దేశంతో, తాను జ్ఞాపకం ఉంచుకోవాలనుకునే వారి పేర్లను దేవుడు ఒక పుస్తకంలో వ్రాసిపెట్టుకుంటున్నట్లు ఉంది. వారితో యెహోవా ఇలా అంటున్నాడు: ‘నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను.’​—⁠మలాకీ 3:​10.

16, 17. యెహోవా తన ప్రజలను, వారి పనిని ఎలా ఆశీర్వదించాడు?

16 యెహోవా తనను సేవించేవారిని నిజంగానే ఆశీర్వదించాడు. ఏ విధంగా? ఒక విధమేమిటంటే, తన సంకల్పాలపై వారి అవగాహనను అధికం చేయడం. (సామెతలు 4:​18; దానియేలు 12:​10) మరొక విధం, వారి ప్రకటనా పనిలో అద్భుతమైన ఫలితాలనివ్వడం. అనేకమంది యథార్థహృదయులు వారితో సత్యారాధనలో కలిశారు, వీరే ‘ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చిన గొప్ప సమూహము. వారు సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రము అని మహా శబ్దముతో ఎలుగెత్తి చెబుతున్నారు.’ (ప్రకటన 7:​9, 10) ఈ గొప్ప సమూహం, అద్భుతమైన రీతిలో వెల్లడి చేయబడింది, యెహోవా ఆరాధకులు ఇప్పుడు భూవ్యాప్తంగా 93,000 సంఘాల్లో 60 లక్షలకుపైగా ఉన్నారు!

17 చరిత్రంతటిలో మునుపెన్నడూ పంచిపెట్టబడనంత అత్యధికంగా పంచిపెట్టబడుతున్న బైబిలు ఆధారిత సాహిత్యాలను యెహోవాసాక్షులు ప్రచురించడంలో కూడా యెహోవా ఆశీర్వాదాన్ని చూడవచ్చు. ప్రస్తుతం, కావలికోట, తేజరిల్లు! పత్రికలు ప్రతినెల తొమ్మిది కోట్లు ప్రచురించబడుతున్నాయి. కావలికోట 144 భాషల్లో, తేజరిల్లు! 87 భాషల్లో. బైబిలు అధ్యయనం కోసం, 1968 లో ప్రచురించబడిన నిత్యజీవమునకు నడుపు సత్యము అనే పుస్తకం 117 భాషల్లో 10 కోట్ల 70 లక్షలకు పైగా పంచబడింది. మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం 1982 లో విడుదల చేయబడింది, అది 131 భాషల్లో 8 కోట్ల 10 లక్షలకన్నా ఎక్కువ పంచబడింది. నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకం 1995 లో విడుదలైంది, అది ఇప్పటివరకు 154 భాషల్లో 8 కోట్ల 50 లక్షలు ప్రచురితమయ్యింది. దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు? బ్రోషుర్‌ 1996 లో విడుదలైంది, అది ఇప్పటివరకు 244 భాషల్లో 15 కోట్లు పంచబడింది.

18. వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక సమృద్ధిని మనం ఎలా అనుభవించగలుగుతున్నాము?

18 ఈ ఆధ్యాత్మిక సమృద్ధి అంతా సాతాను లోకం నుండి ఎదురైన అతి తీవ్రమైన, దీర్ఘమైన వ్యతిరేకత మధ్యనే జరిగింది. ఇది, యెషయా 54:⁠17 లో “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగుచున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు” అని చెప్పబడినదాని సత్యాన్ని రుజువు చేస్తోంది. “నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయసంపాద్యమై యుందురు” అని చెబుతున్న మలాకీ 3:⁠17 ప్రధానంగా తమపై నెరవేరుతోందని తెలుసుకోవడం యెహోవా సేవకులకు ఎంత ఓదార్పునిస్తుందో కదా!

యెహోవాను ఆనందంగా సేవించడము

19. యెహోవా సేవ చేసేవారికి చేయనివారికి ఎలాంటి వ్యత్యాసముంది?

19 యెహోవా నమ్మకమైన సేవకులకు, సాతాను లోకంలోని వారికి మధ్యగల వ్యత్యాసం సమయం గడుస్తుండగా అంతకంతకూ స్పష్టమౌతోంది. మలాకీ 3:⁠18 ఇలా ప్రవచించింది: “అప్పుడు నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవించనివారెవరో మీరు తిరిగి కనుగొందురు.” అనేక వ్యత్యాసాల్లోని ఒక వ్యత్యాసం ఏమిటంటే యెహోవా సేవ చేసేవారు అత్యంత ఆనందంతో ఆ పని చేస్తారు. అందుకుగల కారణాల్లో ఒకటి, వారికున్న అద్భుతమైన నిరీక్షణ. “ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి” అని చెబుతున్న యెహోవాపై వారికి సంపూర్ణ నమ్మకం ఉంది.​—⁠యెషయా 65:​17, 18; కీర్తన 37:​10, 11, 29; ప్రకటన 21:⁠4, 5.

20. మనం ఎందుకు సంతోషంగల ప్రజలుగా ఉన్నాము?

20 యెహోవా యథార్థ ప్రజలు ఆయన గొప్ప దినమున రక్షించబడి నూతనలోకంలోకి తీసుకువెళ్ళబడతారనే ఆయన వాగ్దానాలందు మనకు గట్టి నమ్మకముంది. (జెఫన్యా 2:⁠3; ప్రకటన 7:​13, 14) నూతనలోకం రావడానికి ముందే కొందరు వృద్ధాప్యం వల్లనో, అనారోగ్యం వల్లనో లేదా ప్రమాదంవల్లనో మరణించినా, నిత్యజీవపు ఉత్తరాపేక్షతో వారిని పునరుత్థానం చేస్తానని యెహోవా మాటిస్తున్నాడు. (యోహాను 5:​28, 29; తీతు 1:⁠2) కాబట్టి మనందరికి సమస్యలు సవాళ్ళు ఉన్నా, యెహోవా యొక్క ఈ దినమును మనం సమీపిస్తుండగా, ఈ భూమ్మీద అత్యధిక సంతోషంగల ప్రజలుగా ఉండేందుకు మనకు ప్రతివిధమైన కారణముంది.

మీరెలా జవాబిస్తారు?

• “యెహోవా దినము” అంటే ఏమిటి?

• ఈ లోకపు మతాలు ప్రాచీన ఇశ్రాయేలును ఏ విధంగా అనుకరిస్తున్నాయి?

• యెహోవా సేవకులు ఏ ప్రవచనాలను నెరవేరుస్తారు?

• యెహోవా తన ప్రజలను ఎలా ఆశీర్వదించాడు?

[అధ్యయన ప్రశ్నలు]

[21వ పేజీలోని చిత్రం]

మొదటి శతాబ్దపు యెరూషలేము ‘కొలిమిలా కాలిపోయింది’

[23వ పేజీలోని చిత్రాలు]

యెహోవా తనను సేవిస్తున్నవారి అవసరాలను తీరుస్తాడు

[24వ పేజీలోని చిత్రాలు]

యెహోవా సేవకులు తమకున్న అద్భుతమైన నిరీక్షణనుబట్టి నిజంగా ఆనందంగా ఉన్నారు