కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విశ్వాసఘాతుక ప్రవర్తనను యెహోవా ద్వేషిస్తాడు

విశ్వాసఘాతుక ప్రవర్తనను యెహోవా ద్వేషిస్తాడు

విశ్వాసఘాతుక ప్రవర్తనను యెహోవా ద్వేషిస్తాడు

“ఒకరియెడల ఒకరు విశ్వాసఘాతుకం చేయకండి.”​—⁠మలాకీ 2:​10, Nw.

1. మనం నిత్యజీవం పొందాలంటే ఏమి చేయాలని దేవుడు కోరుతున్నాడు?

మీకు నిత్యజీవం కావాలా? బైబిల్లో వాగ్దానం చేయబడిన ఆ నిరీక్షణను మీరు నమ్మితే, నిస్సందేహంగా మీరు, ‘తప్పకుండా కావాలి’ అనే అంటారు. అయితే, తన నూతనలోకంలో దేవుడు మీకు నిరంతర జీవితాన్ని అనుగ్రహించాలని మీరు కోరుకుంటే, మీరు ఆయన కోరేవాటికి అనుగుణంగా జీవించాల్సిన అవసరం ఉంది. (ప్రసంగి 12:​13; యోహాను 17:⁠3) అపరిపూర్ణ మానవులను అలా చేయమనడం నిర్హేతుకంగా ఉందా? లేదు, ఎందుకంటే యెహోవా ప్రోత్సాహకరమైన ఈ మాటలు అంటున్నాడు: “నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహనబలులకంటె దేవునిగూర్చిన జ్ఞానము నాకిష్టమైనది.” (హోషేయ 6:⁠6) కాబట్టి, చివరికి పొరపాట్లు చేసే మానవులు కూడా దేవుని ఆదేశాలకు అనుగుణంగా జీవించగలుగుతారు.

2. అనేకమంది ఇశ్రాయేలీయులు యెహోవాతో విశ్వాసఘాతుకంగా ఎలా ప్రవర్తించారు?

2 అయితే, ప్రతి ఒక్కరూ యెహోవా చిత్తాన్ని చేయడానికి ఇష్టపడరు. చాలామంది ఇశ్రాయేలీయులు కూడా యెహోవా చిత్తాన్ని చేయడానికి ఇష్టపడలేదని హోషేయ తెలియజేస్తున్నాడు. ఒక జనాంగముగా, వాళ్ళు దేవుని నియమాలకు విధేయులై ఉండడానికి ఒక నిబంధనలోకి, అంటే ఒక ఒప్పందంలోకి రావడానికి అంగీకరించారు. (నిర్గమకాండము 24:​1-8) కానీ, ఎక్కువ కాలం గడవకముందే వాళ్ళు ఆయన నియమాలను అతిక్రమించడం ద్వారా ‘నిబంధన మీరారు.’ ఆ ఇశ్రాయేలీయులు తనపట్ల ‘విశ్వాసఘాతకులయ్యారు’ అని యెహోవా అందుకే అన్నాడు. (హోషేయ 6:⁠7) అప్పటినుండి అనేకమంది అలాగే చేస్తున్నారు. కానీ యెహోవా తనపట్లగానీ లేక తనను ప్రేమించి, తన సేవచేసేవారిపట్లగానీ చూపే విశ్వాసఘాతుక ప్రవర్తనను ద్వేషిస్తాడు.

3. ఈ అధ్యయనంలో దేనిగురించి విశ్లేషణ జరుగుతుంది?

3 మనం సంతోషకరమైన జీవితం అనుభవించాలని కోరుకుంటే, విశ్వాసఘాతుకతపై దేవుని దృక్కోణాన్ని మనం అంగీకరించవలసిన అవసరముంది, ఆ విషయం గురించి కేవలం హోషేయ మాత్రమే చెప్పలేదు. గత ఆర్టికల్‌లో మనం మలాకీ పుస్తకంలోని మొదటి అధ్యాయంతో మొదలుపెట్టి ఆయన ప్రవచన సందేశాన్ని చాలామటుకు విశ్లేషించాం. మనమిప్పుడు ఆ పుస్తకంలోని రెండవ అధ్యాయాన్ని తెరచి, విశ్వాసఘాతుక ప్రవర్తనపై దేవుని దృక్కోణం, మన శ్రద్ధను మరింత ఎక్కువగా ఎలా ఆకట్టుకుంటుందో చూద్దాం. దేవుని ప్రజలు బబులోను చెర నుండి తిరిగివచ్చిన అనేక దశాబ్దాల తర్వాత ఏర్పడిన పరిస్థితి గురించి మలాకీ చర్చిస్తున్నప్పటికీ, ఈ రెండవ అధ్యాయం నేడు మనకు నిజమైన అర్థాన్ని కలిగివుంది.

నిందార్హులైన యాజకులు

4. యెహోవా యాజకులను ఏమని హెచ్చరించాడు?

4 తన నీతిమార్గాలనుండి వైదొలగినందుకు, యూదా యాజకులను మందలిస్తున్న యెహోవా మాటలతో రెండవ అధ్యాయం ఆరంభమౌతుంది. యాజకులు ఆయనిచ్చిన సలహాను మనస్సుకు తీసుకొని తమ మార్గాలను సరిదిద్దుకోనట్లయితే ఘోర పరిణామాలు తప్పవు. మొదటి రెండు వచనాలను గమనించండి: “యాజకులారా, ఈ ఆజ్ఞ మీకియ్యబడియున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా​—⁠మీరు యాజ్ఞను ఆలకింపకయు, నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండినయెడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును.” వారు ప్రజలకు దేవుని నియమాలను బోధించి, వాటిని పాటించివుంటే, వారు ఆశీర్వదించబడివుండేవారు. దానికి బదులుగా, దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యం చేసినందువల్ల వారికి శాపం కలుగుతుంది. చివరికి యాజకులు పలికిన ఆశీర్వాదాలు కూడా శాపాలుగా మారతాయి.

5, 6. (ఎ) ప్రత్యేకంగా యాజకులు ఎందుకు నిందార్హులు? (బి) యెహోవా యాజకులపట్ల తన తిరస్కారాన్ని ఎలా వెలిబుచ్చాడు?

5 ప్రత్యేకంగా యాజకులే ఎందుకు నిందార్హులు? దాన్ని 7వ వచనం స్పష్టం చేస్తోంది: “యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్రవిధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను.” వెయ్యికంటే ఎక్కువ సంవత్సరాలకు ముందుగా, మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన దేవుని నియమాల్లో ‘యెహోవా ఆజ్ఞాపించిన సమస్త విధులను ఇశ్రాయేలీయులకు బోధించుట’ యాజకుల కర్తవ్యం అని చెప్పబడింది. (లేవీయకాండము 10:​11) కొంతకాలం తర్వాత, విచారకరంగా 2 దినవృత్తాంతములు 15:3ను (ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) వ్రాసిన వ్యక్తి ఇలా నివేదించాడు: “చాలాకాలం ఇశ్రాయేలుకు ఒక నిజమైన దేవుడు లేకుండా వుండిపోయింది. వారు బోధించే యాజకుడు గాని, ధర్మశాస్త్రంగాని లేకుండా వుండిపోయారు.”

6 మలాకీ కాలంలో, అంటే సా.శ.పూ. అయిదవ శతాబ్దంలో యాజకుల పరిస్థితి అలాగే ఉంది. వారు ప్రజలకు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించడంలో విఫలమయ్యారు. కాబట్టి, ఆ యాజకులు లెక్క అప్పజెప్పడానికి పిలువబడడం తగినదే. వారికి విరోధంగా యెహోవా పలికిన తీవ్రమైన మాటలను గమనించండి. మలాకీ 2:3 ఇలా తెలియజేస్తోంది: “మీ ముఖములమీద పేడవేతును, పండుగలలో మీరర్పించిన పశువులపేడ వేతును.” అది ఎంత ఘోరమైన మందలింపు! బలిగా అర్పించిన పశువుల పేడను ఊరవతలకు తీసుకువెళ్ళి కాల్చివేయాలి. (లేవీయకాండము 16:​27) కాని పేడ వారి ముఖాల మీద వేయబడుతుందని యెహోవా చెప్పినప్పుడు, ఆయన వారి బలులపై అయిష్టత చూపిస్తున్నట్లు, వాటిని అర్పించేవారిని తిరస్కరిస్తున్నట్లు అది స్పష్టంగా చూపిస్తోంది.

7. ధర్మశాస్త్ర బోధకులపై యెహోవా కోపంతో ఎందుకు ఉన్నాడు?

7 మలాకీ కాలానికి శతాబ్దాల పూర్వం, గుడారమును, ఆ తర్వాత మందిరమును, దానిలోని పవిత్ర పరిచర్య గురించి శ్రద్ధ తీసికొనేందుకు యెహోవా లేవీయులను నియమించాడు. వాళ్ళు ఇశ్రాయేలు జనాంగానికి బోధకులుగా ఉండేవారు. ఆ నియామకాన్ని నెరవేర్చడం వారికి జీవదాయకమేగాక, వారికి, ఆ జనాంగానికి సమాధానకరం కూడా. (సంఖ్యాకాండము 3:​5-8) అయితే యాజకులు తమకు మొదట్లోవున్న దేవుని భయాన్ని కోల్పోయారు. అందుకే యెహోవా వారితో ఇలా అన్నాడు: ‘మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరచి, లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసియున్నారు. నా మార్గములను అనుసరింపకున్నారు.’ (మలాకీ 2:​8, 9) సత్యాన్ని బోధించడంలో విఫలమవడంవల్ల, సరైన మాదిరిగా ఉండకపోవడంవల్ల, యాజకులు అనేకమంది ఇశ్రాయేలీయులను తప్పుదోవ పట్టించారు. కాబట్టి యెహోవా వారిపై కోపంగా ఉండడం సముచితమే.

దేవుని ప్రమాణాలను పాటించడం

8. మానవులు దేవుని ప్రమాణాలు పాటించాలని అపేక్షించడం మరీ విపరీతమైనదా? వివరించండి.

8 ఆ యాజకులను క్షమించాల్సిందనీ, వారు సానుభూతి పొందడానికి అర్హులనీ, ఎందుకంటే వారు అపరిపూర్ణ మానవులు కాబట్టి, వారు దేవుని ప్రమాణాలను అనుసరించి జీవించాలని అపేక్షించకుండా ఉండాల్సిందనీ మనం అనుకోకుండా ఉందాము. వాస్తవమేమిటంటే మానవులు దేవుని ఆజ్ఞలను పాటించగలరు, ఎందుకంటే మానవులు చేయలేని వాటిని చేయాలని యెహోవా అపేక్షించడు. బహుశా, ఆ కాలంలోని కొందరు యాజకులు దేవుని ప్రమాణాలను పాటించివుంటారు, ఆ తర్వాతి కాలంలో అలా ఖచ్చితంగా పాటించిన ఒక వ్యక్తి విషయంలోనైతే ఎటువంటి సందేహం లేదు, ఆయన గొప్ప “ప్రధానయాజకుడు” అయిన యేసు. (హెబ్రీయులు 3:⁠1) ఆయన గురించి నిజంగా ఇలా చెప్పవచ్చు: ‘సత్యముగల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధ నేమాత్రమును చేయక సమాధానమునుబట్టియు యథార్థతనుబట్టియు నన్ననుసరించి నడచుకొంటూ, దోషమునుండి యనేకులను త్రిప్పాడు.’​—⁠మలాకీ 2:⁠6.

9. మన కాలంలో సత్యాన్ని నమ్మకంగా ఎవరు బోధించారు?

9 ఆ పోలికకు తగినట్లుగానే, పరలోక నిరీక్షణగల క్రీస్తు అభిషిక్త సహోదరులు, “దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా” ఇప్పటికి శతాబ్దంకంటే ఎక్కువకాలం సేవచేశారు. (1 పేతురు 2:⁠5) ఇతరులకు బైబిలు సత్యాలను అందజేయడంలో వారు నాయకత్వం వహించారు. వారు బోధించే సత్యాలను మీరు నేర్చుకొంటుండగా, సత్యముగల ధర్మశాస్త్రమునే వారు బోధించారని మీరు అనుభవపూర్వకంగా గ్రహించలేదా? అనేకమంది మతదోషమునుండి వెనక్కి తిరుగుటకు వారు సహాయం చేశారు, తత్ఫలితంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బైబిలు సత్యాలను నేర్చుకొన్నవారు, నిత్యజీవపు నిరీక్షణగలవారు లక్షలమంది ఉన్నారు. వీరు ఇంకా ఇతర లక్షలమందికి సత్యముగల ధర్మశాస్త్రమును బోధించే ఆధిక్యతను కలిగివున్నారు.​—⁠యోహాను 10:​16; ప్రకటన 7:⁠9.

జాగ్రత్తకు కారణం

10. మనం జాగ్రత్తగా ఉండడానికిగల కారణమేమిటి?

10 ఏదేమైనప్పటికీ, మనం జాగ్రత్తగా ఉండేందుకు కారణముంది. మలాకీ 2:1-9 లో భావగర్భితమైవున్న పాఠాలను మనం గ్రహించలేకపోయే అవకాశముంది. ఎటువంటి దుర్బోధ చేయకుండా వ్యక్తిగతంగా మనం అప్రమత్తంగా ఉన్నామా? ఉదాహరణకు, మనం చెప్పేది మన కుటుంబ సభ్యులు నిజంగా నమ్ముతారా? సంఘంలోని మన ఆధ్యాత్మిక సహోదర సహోదరీలు నమ్ముతారా? పరిభాషలో సరైనవే అయినప్పటికీ ఇతరులను తప్పుదారి పట్టించే గూడార్థాలున్న నిర్దిష్టమైన పదాలతో మాట్లాడే అలవాటును వృద్ధిచేసుకోవడం చాలా సులభం. లేదా ఒక వ్యాపార విషయంలో ఒకరు గోరంతలను కొండంతలుగాచేసి చెప్పవచ్చు లేదా వివరాలను దాచిపెట్టవచ్చు. దాన్ని యెహోవా చూడడా? మనమలాంటి అలవాట్లను అనుసరిస్తే, అయన మన స్తుతియాగమైన జిహ్వాఫలాన్ని అంగీకరిస్తాడా?

11. ప్రత్యేకంగా ఎవరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది?

11 నేడు సంఘాల్లో దేవుని వాక్యాన్ని బోధించే ఆధిక్యతగల వారి విషయానికొస్తే, మలాకీ 2:7 లోని మాటలు వారికొక నిజమైన హెచ్చరికగా ఉండాలి. వారి నోట ‘ధర్మశాస్త్రవిధులు’ ఉండాలి, వారు “జ్ఞానమునుబట్టి బోధింపవలెను” అని అది చెబుతోంది. అలాంటి బోధకులపై గొప్ప బాధ్యతవుంటుంది, ఎందుకంటే వారు ‘కఠినమైన తీర్పు పొందుతారు’ అని యాకోబు 3:1 సూచిస్తోంది. వారు శక్తివంతంగా, ఉత్సాహపూరితంగా బోధించాలి, అయితే వారి బోధ దేవుని లిఖితవాక్యంమీదా, యెహోవా సంస్థ ద్వారా వచ్చే ఆదేశాలమీదా స్థిరంగా ఆధారపడివుండాలి. ఆ విధంగా వారు ‘ఇతరులకు బోధించుటకు సామర్థ్యముగలవారు’ అవుతారు. అందుకే, వారికి ఇలా ఉపదేశించబడింది: “దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము.”​—⁠2 తిమోతి 2:​2, 15.

12. బోధించేవారు ఏ విషయంలో అప్రమత్తంగా ఉండాలి?

12 మనం జాగ్రత్తగా ఉండకపోతే, మనం వ్యక్తిగతంగా ఇష్టపడేవాటిని లేదా మన సొంత అభిప్రాయాలను కలిపి బోధించాలనే ఆశ కలుగవచ్చు. అది ప్రత్యేకించి, తన సొంత ఊహలు యెహోవా సంస్థ బోధిస్తున్నవాటికి భిన్నంగా ఉన్నప్పటికీ తన దృక్కోణమే సరైనదని నమ్మే వ్యక్తికి ప్రమాదకరం కాగలదు. కానీ సంఘంలోని బోధకులు గొఱ్ఱెలను అభ్యంతరపరచగల తమ సొంత ఆలోచనలను కాకుండా, దేవుని పరిజ్ఞానమునే హత్తుకొని ఉంటారని మనం అపేక్షించవచ్చని మలాకీ 2వ అధ్యాయం చూపిస్తోంది. యేసు ఇలా అన్నాడు: “నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు.”​—⁠మత్తయి 18:⁠6.

ఒక అవిశ్వాసిని వివాహం చేసుకోవడం

13, 14. మలాకీ ఎత్తి చూపించిన విశ్వాసఘాతుకమైన ఒక ప్రవర్తన ఏమిటి?

13మలాకీ 2వ అధ్యాయం పదవ వచనంనుండి విశ్వాసఘాతుకతను మరింత సూటిగా ఎత్తి చూపిస్తోంది. మలాకీ రెండు పరస్పర సంబంధిత ప్రవర్తనల మీద దృష్టి సారిస్తూ, వాటి విషయంలో “విశ్వాసఘాతుకం” అనే పదాన్ని పదేపదే ఉపయోగిస్తున్నాడు. మొదట, తన ఉపదేశానికి ముందు మలాకీ ఈ ప్రశ్నలను వేస్తున్నాడని గమనించండి: ‘మనకందరికి తండ్రియొక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఈలాగుండగా ఒకరియెడల ఒకరము ద్రోహము [“విశ్వాసఘాతుకం,” NW] చేయుచు, మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము?’ ఆ పిమ్మట, 11వ వచనం, ఇశ్రాయేలీయుల విశ్వాసఘాతుక ప్రవర్తన ‘యెహోవా పరిశుద్ధ స్థలమును [“పరిశుద్ధతను,” NW]’ అపవిత్రపరచడంతో సమానమని జతచేస్తోంది. వారు చేస్తున్న అంత గంభీరమైన పని ఏమిటి? ఆ వచనం తప్పుడు అలవాట్లలోని ఒకదాన్ని సూచిస్తోంది: వారు “అన్యదేవత పిల్లలను పెండ్లి చేసుకొనిరి.”

14 వేరే మాటల్లో చెప్పాలంటే, యెహోవాకు సమర్పించుకొన్న జనాంగములో భాగమైన కొందరు ఇశ్రాయేలీయులు, ఆయనను ఆరాధించని వారిని పెండ్లి చేసుకొన్నారు. అది ఎందుకంత గంభీరమైన విషయమో అర్థం చేసుకొనేందుకు పూర్వాపర సందర్భం మనకు సహాయంచేస్తుంది. వారి తండ్రి ఒక్కడే అని 10వ వచనం చెబుతోంది. యాకోబో (ఆ తర్వాత ఇశ్రాయేలు అని పిలువబడ్డాడు) లేదా అబ్రాహామో లేదా ఆదామో వారితండ్రి అని దాని భావం కాదు. మలాకీ 1:6 ఆ ‘ఒక్క తండ్రి’ యెహోవాయే అని చూపిస్తోంది. ఇశ్రాయేలు జనాంగానికి ఆయనతో సంబంధముంది, వారి పితరులతో చేయబడిన నిబంధనలో వారు పాలివారైవున్నారు. ఆ నిబంధనలోని ఒక నియమమేమిటంటే: “నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెనియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు.”​—⁠ద్వితీయోపదేశకాండము 7:3

15. (ఎ) ఒక అవిశ్వాసిని పెళ్ళి చేసుకోవడాన్ని కొందరు ఏ విధంగా సమర్థించుకోవడానికి ప్రయత్నించవచ్చు? (బి) పెళ్ళి విషయంలో యెహోవా ఏమని వ్యక్తం చేస్తున్నాడు?

15 నేడు కొందరు ఇలా తర్కిస్తుండవచ్చు: ‘నన్నాకర్షించిన వ్యక్తి చాలా మంచి వ్యక్తి. కొంత కాలానికి అతడు (లేదా ఆమె) బహుశ సత్యారాధనను అంగీకరించవచ్చు.’ అలాంటి ఆలోచనా విధానం, “హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది” అనే ప్రేరేపిత హెచ్చరిక నిజమేనని రుజువుచేస్తోంది. (యిర్మీయా 17:9) ఒక అవిశ్వాసిని పెళ్ళి చేసికొనే విషయంపై దేవుని దృక్కోణం మలాకీ 2:12 లో తెలియజేయబడింది: అలా “చేయువారిని, యెహోవా నిర్మూలము చేయును.” అందుకే, “ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను” అని క్రైస్తవులకు ప్రబోధించబడింది. (1 కొరింథీయులు 7:​39) అయితే క్రైస్తవ ఏర్పాటు క్రింద, ఒక విశ్వాసి ఒక అవిశ్వాసిని పెళ్ళి చేసికొన్నందుకు అలా “నిర్మూలము” చేయబడరు. కానీ, అవిశ్వాసి అవిశ్వాసిగానే ఉండిపోతే, అతి త్వరలో దేవుడు ఈ విధానాన్ని అంతం చేసేటప్పుడు అతనికి లేక ఆమెకు ఏమవుతుంది?​—⁠కీర్తన 37:​37, 38.

తమ జతను కించపరచడం

16, 17. కొందరు చేస్తున్న విశ్వాసఘాతుకము ఏమిటి?

16 ఆ తర్వాత మలాకీ రెండవ విశ్వాసఘాతుకాన్ని ప్రస్తావిస్తున్నాడు: తమ జతను కించపరచడం, ప్రత్యేకంగా అన్యాయంగా విడాకులివ్వడం ద్వారా కించపరచడం. 2వ అధ్యాయంలోని 14వ వచనం ఇలా చెబుతోంది: “యౌవన కాలమందు నీవు పెండ్లిచేసికొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షియాయెను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా.” తమ భార్యలతో విశ్వాసఘాతుకంగా ప్రవర్తించడం ద్వారా, యూదా భర్తలు యెహోవా బలిపీఠం “కన్నీళ్లతో” తడవడానికి కారకులయ్యారు. (మలాకీ 2:​13) బహుశా యౌవనులైన స్త్రీలను లేదా అన్యమత స్త్రీలను వివాహమాడేందుకు కావచ్చు, తాము యౌవనంలో పెండ్లి చేసికొన్న భార్యలను అన్యాయంగా వదిలేస్తూ, అధర్మమైన రీతుల్లో విడాకులు పొందుతున్నారు. భ్రష్టులైన యాజకులు దాన్ని సమ్మతించారు! కానీ మలాకీ 2:⁠16 ఇలా తెలియజేస్తోంది: “భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ యని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” ఆ తర్వాత, లైంగిక దుర్నీతి కారణంగా మాత్రమే, నిర్దోషి అయిన భాగస్వామి విడాకులు పొందవచ్చుననీ అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చనీ యేసు చెప్పాడు.​—⁠మత్తయి 19:⁠9.

17 మలాకీ మాటలు మన హృదయాల్లో దయానుభూతులను ఎలా పురికొల్పుతాయో వాటి గురించి గంభీరంగా ఆలోచించి చూడండి. ‘నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు, నీ పెండ్లి భార్య’ అని ఆయన సూచిస్తున్నాడు. ఇక్కడ చెప్పబడిన ప్రతి పురుషుడు తోటి ఆరాధకురాలైన ఒక ఇశ్రాయేలీయ స్త్రీని తన ప్రియమైన తోటి సహవాసిగా, తన జీవిత భాగస్వామిగా ఎంచుకొని వివాహం చేసికొన్నాడు. బహుశ అది వారిరువురు యౌవనస్థులుగా ఉన్నప్పుడు చేసుకున్న పెండ్లే కావచ్చు, అంతమాత్రాన గడిచేకాలంగానీ, పైబడే వయస్సుగానీ వారు చేసికొన్న నిబంధనను, అంటే వివాహ ఒప్పందాన్ని విలువలేకుండా చేయదు.

18. విశ్వాసఘాతుకం విషయంలో మలాకీ ఇచ్చిన సలహా నేడు ఏ యే విధాలుగా వర్తిస్తుంది?

18 ఆ అంశాలకు సంబంధించి ఇవ్వబడిన సలహా నేడు కూడా అదే విధంగా అన్వయిస్తుంది. ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసికోవాలనే నిర్దేశాన్ని కొందరు తృణీకరించడం శోచనీయం. కొందరు తమ వైవాహిక బంధాన్ని బలంగా ఉంచుకొనేందుకు కృషి చేయడంలో కొనసాగకపోవడం కూడా శోచనీయమే. బదులుగా, వేరొకరిని పెళ్ళి చేసికోవడానికి, సాకులు చెబుతూ, లేఖనాధారాలేమీ లేకుండానే విడాకులు పొందడం ద్వారా దేవుడు ద్వేషించే మార్గాన్ని అనుసరిస్తున్నారు. అలాంటి పనులు చేసి, వాళ్ళు ‘యెహోవాను ఆయాసపెట్టారు.’ మలాకీ కాలంలో, దేవుని సలహాను నిర్లక్ష్యం చేసినవారు చివరికి యెహోవా దృక్కోణాలు అన్యాయంగా ఉన్నాయని భావించేందుకు కూడా సాహసించారు. నిజానికి వారు “న్యాయకర్తయగు దేవుడు ఏమాయెను?” అని అన్నారు. ఎంతటి కుటిలమైన ఆలోచన! మనం ఆ ఉచ్చులో పడకుండా ఉందాం.​—⁠మలాకీ 2:​17.

19. భర్తలు, భార్యలు దేవుని ఆత్మను ఎలా పొందగలరు?

19 అనుకూల పక్షాన చూస్తే, కొందరు భర్తలు తమ భార్యలతో విశ్వాసఘాతుకంగా ప్రవర్తించడంలేదని మలాకీ సూచిస్తున్నాడు. వారు ‘కొంచెముగానైనను దైవాత్మను పొందారు.’ (15వ వచనం) సంతోషకరంగా, దేవుని సంస్థలో నేడు ‘తమ భార్యలను సన్మానించే’ పురుషులు ఎంతోమంది ఉన్నారు. (1 పేతురు 3:⁠7) వారు తమ భార్యలను శారీరకంగా లేదా మాటల ద్వారా బాధపెట్టరు, జుగుప్సాకరమైన లైంగిక క్రియలలో పాల్గొనమని బలవంతపెట్టరు, ఇతర స్త్రీలతో సరసాలాడడం ద్వారాగానీ అశ్లీల చిత్రాలను చూడడం ద్వారాగానీ తమ భార్యలను అవమానించరు. యెహోవా సంస్థలో దేవునికి, దేవుని నియమాలకు విధేయంగా ఉండే యథార్థవంతులైన భార్యలు ఎంతోమంది ఉండడం ఆనందదాయకమే. అలాంటి స్త్రీపురుషులకు దేవుడు ఏమి ద్వేషిస్తాడో తెలుసు, కాబట్టి వారు దానికి అనుగుణంగానే ఆలోచిస్తారు, ప్రవర్తిస్తారు. కాబట్టి ‘దేవునికే లోబడుతూ’ ఆయన పరిశుద్ధాత్మతో ఆశీర్వదింపబడుతూ, వారిలాగే ఉండడంలో కొనసాగండి.​—⁠అపొస్తలుల కార్యములు 5:​29.

20. సర్వమానవాళికి ఎలాంటి సమయం సమీపిస్తోంది?

20 అతి త్వరలో, ఈ లోకమంతటికీ యెహోవా తీర్పు తీరుస్తాడు. ప్రతి ఒక్కరు తమ నమ్మకాల గురించి, చర్యల గురించి ఆయనకు లెక్క అప్పజెప్పాలి. “మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.” (రోమీయులు 14:​11, 12) కాబట్టి ఇక్కడ ఆసక్తి రేకెత్తించే ప్రశ్నేమిటంటే, యెహోవా దినమున ఎవరు రక్షించబడతారు? ఈ పరంపరలో మూడవది చివరిది అయిన ఆర్టికల్‌ దాన్ని ముఖ్యాంశంగా చర్చిస్తుంది.

మీరు వివరించగలరా?

• యెహోవా ఇశ్రాయేలులోని యాజకులను మందలించడానికిగల ప్రధానమైన కారణమేమిటి?

• దేవుని ప్రమాణాలు మానవులు పాటించలేనంతటివి ఎందుకు కాదు?

• నేడు మనం బోధించే విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?

• యెహోవా ఏ రెండు ప్రవర్తనలను ప్రాముఖ్యంగా ఖండించాడు?

[అధ్యయన ప్రశ్నలు]

[15వ పేజీలోని చిత్రం]

మలాకీ కాలంలో యాజకులు యెహోవా మార్గాలను అనుసరించనందుకు మందలించబడ్డారు

[16వ పేజీలోని చిత్రం]

యెహోవా మార్గాలను బోధించేటప్పుడు, వ్యక్తిగతంగా మనం ఇష్టపడేవాటిని కలిపి బోధించకుండా జాగ్రత్తగా ఉండాలి

[18వ పేజీలోని చిత్రాలు]

తమ భార్యలను అన్యాయంగా వదిలేసి అన్య స్త్రీలను పెళ్ళి చేసికొన్న ఇశ్రాయేలీయులను యెహోవా ఖండించాడు

[18వ పేజీలోని చిత్రం]

క్రైస్తవులు నేడు తమ వివాహ ఒప్పందాన్ని గౌరవిస్తారు