కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అవసరంలో ఉన్నవారిపై ప్రేమపూర్వక దయ చూపించండి

అవసరంలో ఉన్నవారిపై ప్రేమపూర్వక దయ చూపించండి

అవసరంలో ఉన్నవారిపై ప్రేమపూర్వక దయ చూపించండి

‘ఒకరియందొకరు కరుణావాత్సల్యములు [“ప్రేమపూర్వక దయ,” Nw] కనపరచుకొనుడి.’​—⁠జెకర్యా 7:9.

1, 2. (ఎ) ప్రేమపూర్వక దయను మనం ఎందుకు చూపించాలి? (బి) మనం ఏ ప్రశ్నలను పరిశీలిస్తాం?

యెహోవా దేవుని వాక్యం ‘కనికరమును [“ప్రేమపూర్వక దయను,” NW అధస్సూచి]’ ప్రేమించమని ప్రోత్సహిస్తోంది. (మీకా 6:⁠8) మనమెందుకు ప్రేమించాలో కారణాలను కూడా అది తెలియజేస్తోంది. ఒక కారణమేమిటంటే, “దయగలవాడు [“ప్రేమపూర్వక దయగలవాడు,” NW] తనకే మేలు చేసికొనును.” (సామెతలు 11:​17) అదెంత నిజమో కదా! ప్రేమపూర్వక దయ లేదా యథార్థమైన ప్రేమ చూపడంవల్ల ఇతరులతో శాశ్వతమైన స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. తత్ఫలితంగా, మనకు యథార్థవంతులైన స్నేహితులు లభిస్తారు​—⁠అది నిజంగా అమూల్యమైన మేలే కదా!​—⁠సామెతలు 18:​24.

2 అంతేగాక, లేఖనాలు మనకిలా చెబుతున్నాయి: ‘నీతిని కృపను [“ప్రేమపూర్వక దయను,” NW] అనుసరించువాడు జీవమును పొందును.’ (సామెతలు 21:​21) అవును, ప్రేమపూర్వక దయను అనుసరించడం దేవుడు మనల్ని ఇష్టపడేలా చేస్తుంది, నిత్యజీవంతోపాటు భవిష్యత్తులో ఇతర ఆశీర్వాదాలను అనుభవించేలా చేస్తుంది. కానీ మనం ప్రేమపూర్వక దయను ఎలా చూపించవచ్చు? ఎవరిపైన చూపించాలి? ప్రేమపూర్వక దయకు, సాధారణంగా చూపే మానవత్వానికి లేదా దయకు తేడా ఉందా?

మానవత్వం, ప్రేమపూర్వక దయ

3. ప్రేమపూర్వక దయకు, మానవత్వానికి ఎలాంటి తేడా ఉంది?

3 మామూలుగా చూపించే మానవత్వానికి, ప్రేమపూర్వక దయకు ఎంతో తేడా ఉంది. ఉదాహరణకు, మానవత్వం చూపించేవారు తాము దయతో ప్రవర్తించే వ్యక్తులతో ఎటువంటి సన్నిహితమైన, వ్యక్తిగత సంబంధం లేదా బంధుత్వం లేకున్నా తరచుగా వారిపై మానవత్వాన్ని చూపిస్తారు. అయితే మనం ఒకరిపట్ల ప్రేమపూర్వక దయను చూపిస్తున్నామంటే ఆ వ్యక్తితో ప్రేమపూర్వక సాన్నిహిత్యాన్ని కలిగివుంటాం. బైబిలులో, మానవుల మధ్య వ్యక్తంచేయబడిన ప్రేమపూర్వక దయ, అప్పటికే వారి మధ్య ఉన్న బంధాలపై ఆధారపడి ఉండవచ్చు. (ఆదికాండము 20:​13; 2 సమూయేలు 3:⁠8; 16:​17) లేదా అంతకుముందు ప్రేమపూర్వక దయతో తమకు చేసిన కార్యాలవల్ల ఏర్పడిన సంబంధాలపై ఆధారపడి ఉండవచ్చు. (యెహోషువ 2:​1, 12-14; 1 సమూయేలు 15:⁠6; 2 సమూయేలు 10:​1, 2) ఈ వ్యత్యాసాన్ని స్పష్టం చేయడానికి, మానవుల మధ్య మానవత్వం చూపించబడినదొకటి, ప్రేమపూర్వక దయ చూపించబడినదొకటి రెండు బైబిలు ఉదాహరణలను పోల్చిచూద్దాం.

4, 5. ఇక్కడ పేర్కొన్న రెండు బైబిలు ఉదాహరణలు మానవత్వానికి, ప్రేమపూర్వక దయకు మధ్య ఉన్న తేడాను ఏ విధంగా స్పష్టం చేస్తున్నాయి?

4 మానవత్వం చూపించబడిన ఒక ఉదాహరణ, ఓడ పగిలిపోయి ప్రాణాపాయంలోపడ్డ అపొస్తలుడైన పౌలుతోపాటు ఒక సమూహానికి సంబంధించినది. వారు మెలితే ద్వీప తీరానికి చేరుకున్నారు. (అపొస్తలుల కార్యములు 27:⁠37-28:⁠1) మెలితే ద్వీపవాసులకు, నీటిలో చిక్కుబడిన ఈ ప్రయాణికులతో అంతకుముందు ఎటువంటి ఒప్పందం లేదా సంబంధం లేకున్నా, ఆ ద్వీపవాసులు ఈ అపరిచితులను ఆదరంగా ఆహ్వానించి, “అసాధారణమైన మానవత్వం” చూపించారు. (అపొస్తలుల కార్యములు 28:​2, 7, NW) వారి ఆతిథ్యం దయాపూర్వకమైనది, అయితే అది ఆకస్మికమైనది, అపరిచితులపై చూపబడినది. కాబట్టి, అది మానవత్వం.

5 వీరి ఆతిథ్యాన్ని, దావీదు రాజు తన స్నేహితుడైన యోనాతాను కుమారుడు మెఫీబోషెతుకు చూపించిన ఆతిథ్యంతో పోల్చి చూడండి. దావీదు మెఫీబోషెతుతో ఇలా అన్నాడు: ‘నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనము చేయుదువు.’ తాను ఆ ఏర్పాటు ఎందుకు చేస్తున్నాడన్నది వివరిస్తూ, దావీదు ఆయనతో ఇలా చెప్పాడు: ‘నీ తండ్రియైన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము [“ప్రేమపూర్వక దయ,” NW] చూపెదను.’ (2 సమూయేలు 9:​6, 7, 13) దావీదు ఎడతెగకుండా చూపించిన ఆతిథ్యం, కేవలం మానవత్వం కాదుగానీ ప్రేమపూర్వక దయ యొక్క వ్యక్తీకరణల్లో ఒకటిగా పేర్కొనడం యుక్తమే, ఎందుకంటే అది తమ మధ్య ఏర్పడిన ఒక సంబంధానికి, ఆయన చూపించిన యథార్థతకు నిదర్శనాన్నిస్తోంది. (1 సమూయేలు 18:⁠3; 20:​14, 15, 42) అదేవిధంగా నేడు, దేవుని సేవకులు సాధారణ ప్రజలపై మానవత్వం చూపిస్తారు. అయితే, తాము దైవాంగీకార సంబంధాన్ని ఎవరితో పంచుకుంటారో వారిపై ప్రేమపూర్వక దయను లేదా యథార్థమైన ప్రేమను ఎడతెగకుండా చూపిస్తారు.​—⁠మత్తయి 5:​45; గలతీయులు 6:​10.

6. మానవుల మధ్య చూపించబడిన ప్రేమపూర్వక దయ యొక్క ఏ ప్రత్యేకతలు దేవుని వాక్యంలో విశిష్టంగా కనబడతాయి?

6 ప్రేమపూర్వక దయకున్న కొన్ని అదనపు ప్రత్యేకతలను గుర్తించడానికి, ఈ లక్షణం కనిపించే మూడు బైబిలు వృత్తాంతాలను మనం క్లుప్తంగా పరిశీలిద్దాం. వీటినుండి, మానవులు చూపించే ప్రేమపూర్వక దయ (1) నిర్దిష్టమైన చర్యల ద్వారా, (2) ఇష్టపూర్వకంగా, (3) ప్రత్యేకించి అవసరంలో ఉన్నవారిపై చూపించబడుతుందని మనం గుర్తిస్తాం. అంతేకాదు, ఈ వృత్తాంతాలు నేడు మనం ఈ ప్రేమపూర్వక దయను ఎలా చూపించవచ్చో కూడా వివరిస్తాయి.

ఒక తండ్రి ప్రేమపూర్వక దయను చూపిస్తాడు

7. అబ్రాహాము దాసుడు బెతూయేలుకు, లాబానుకు ఏమని చెబుతాడు, ఆయన ఏ అంశాన్ని ఎత్తి చూపుతాడు?

7ఆదికాండము 24:​28-67 వచనాలు దీని ముందటి ఆర్టికల్‌లో ప్రస్తావించబడిన అబ్రాహాము దాసుని మిగతా కథను తెలియజేస్తాయి. ఆ దాసుడు రిబ్కాను కలిసిన తర్వాత, ఆమె తండ్రి బెతూయేలు ఇంటికి ఆహ్వానించబడతాడు. (28-32 వచనాలు) అక్కడ ఆయన, అబ్రాహాము కుమారునికి భార్య కోసం అన్వేషిస్తున్నానని వివరంగా చెబుతాడు. (33-47 వచనాలు) తాను అప్పటి వరకు పొందిన సఫలతను యెహోవా నుండి వచ్చిన ఒక సూచనగా దృష్టిస్తున్నట్లు ఆయన ఇలా నొక్కి చెబుతాడు: “నా యజమానునియొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసికొనునట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను.” (48వ వచనం) ఆ సంఘటన గురించిన వివరాలను హృదయపూర్వకంగా చెప్పడం వల్ల, బెతూయేలుకు ఆయన కుమారుడు లాబానుకు ఆ కార్యం వెనుక యెహోవా ఉన్నాడన్న నమ్మకం కలగాలని, ఆ దాసుడు నిరీక్షించాడనడంలో సందేహం లేదు. ముగింపులో ఆ దాసుడు ఇలా అన్నాడు: ‘నా యజమానునియెడల మీరు దయను [“ప్రేమపూర్వక దయను,” NW] నమ్మకమును కనుపరచినయెడల అదియైనను నాకు తెలియచెప్పుడి, లేనియెడల అదియైనను తెలియచెప్పుడి; అప్పుడు నేనెటు పోవలెనో అటు పోయెదను.’​—⁠49వ వచనం.

8. రిబ్కాకు సంబంధించిన విషయాలకు బెతూయేలు ఎలా ప్రతిస్పందించాడు?

8 యెహోవా అబ్రాహాముపై అప్పటికే ప్రేమపూర్వక దయను చూపించాడు. (ఆదికాండము 24:​12, 14, 26, 27) అబ్రాహాము దాసునితో వెళ్ళేందుకు రిబ్కాను అనుమతించడం ద్వారా బెతూయేలు కూడా ప్రేమపూర్వక దయను చూపించడానికి ఇష్టపడతాడా? దేవుని ప్రేమపూర్వక దయ యొక్క ఉద్దేశం పూర్తిగా నెరవేరేందుకు మానవులు చూపిన ప్రేమపూర్వక దయ దానికి అనుబంధంగా ఉంటుందా? లేక ఆ దాసుని సుదీర్ఘ ప్రయాణం నిష్ఫలం అవుతుందా? లాబాను, బెతూయేలు, “ఇది యెహోవావలన కలిగిన కార్యము” అని అన్న మాటలు అబ్రాహాము దాసునికి తప్పకుండా ఎంతో ఓదార్పునిచ్చి ఉంటాయి. (50వ వచనం) ఈ విషయంలో యెహోవా హస్తముందని వారు గుర్తించి, నిస్సంకోచంగా ఆయన నిర్ణయాన్ని అంగీకరించారు. ఆ తర్వాత, బెతూయేలు ఇలా అంటూ తన ప్రేమపూర్వక దయను వ్యక్తం చేశాడు: “ఇదిగో రిబ్కా నీ యెదుట నున్నది, ఆమెను తీసికొని పొమ్ము; యెహోవా సెలవిచ్చినప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాక.” (51వ వచనం) రిబ్కా అబ్రాహాము దాసునితో ఇష్టపూర్వకంగా వెళ్ళింది, ఆ తర్వాత అనతి కాలంలోనే ఆమె ఇస్సాకుకు ప్రియమైన భార్య అయ్యింది.​—⁠49, 52-58, 67 వచనాలు.

ఒక కుమారుడు చూపించిన ప్రేమపూర్వక దయ

9, 10. (ఎ) యాకోబు తన కుమారుడు యోసేపును తన కోసం ఏమి చేయమని అడిగాడు? (బి) యోసేపు తన తండ్రిపై ప్రేమపూర్వక దయను ఎలా చూపించాడు?

9 అబ్రాహాము మనవడు యాకోబు కూడా ప్రేమపూర్వక దయను పొందాడు. ఆదికాండము 47వ అధ్యాయం తెలియజేస్తున్నదాని ప్రకారం, అప్పుడు ఐగుప్తులో నివసిస్తున్న యాకోబుకు, ‘చావవలసిన దినములు సమీపించాయి.’ (27-29 వచనాలు) దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన దేశం బయట చనిపోబోతున్నానని ఆయనకు దిగులుగా ఉంది. (ఆదికాండము 15:​18; 35:​10, 12; 49:​29-32) యాకోబు తాను ఐగుప్తులో పాతిపెట్టబడడానికి ఇష్టపడలేదు, అందుకే ఆయన తన శవాన్ని కనాను దేశానికి తీసుకువెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తాడు. ఆయన కోరికను నెరవేర్చగల చక్కని స్థానంలో ప్రాబల్యం గల తన కుమారుడు యోసేపు తప్ప ఇంకెవరున్నారు?

10 ఆ వృత్తాంతం ఇలా చెబుతోంది: ‘అతడు [యాకోబు] తన కుమారుడైన యోసేపును పిలిపించి​—⁠నా యెడల నీకు కటాక్షమున్న యెడల దయచేసి, నా యెడల దయను [“ప్రేమపూర్వక దయను,” NW] నమ్మకమును కనుపరచుము; ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము. నా పితరులతో కూడ నేను పండుకొనునట్లు ఐగుప్తులోనుండి నన్ను తీసికొనిపోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుము.’ (ఆదికాండము 47:​29, 30) ఆ కోరికను నెరవేరుస్తానని యోసేపు వాగ్దానం చేస్తాడు, తర్వాత కొద్దికాలానికే యాకోబు మరణిస్తాడు. యోసేపుతోపాటు యాకోబు ఇతర కుమారులు, ‘కనాను దేశమునకు అతని శవమును తీసికొనిపోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి. ఆ పొలమును అబ్రాహాము కొనెను.’ (ఆదికాండము 50:​5-8, 12-14) యోసేపు ఆ విధంగా తన తండ్రిపై ప్రేమపూర్వక దయను చూపించాడు.

ఒక కోడలు చూపించిన ప్రేమపూర్వక దయ

11, 12. (ఎ) రూతు తన ప్రేమపూర్వక దయను నయోమిపై ఎలా చూపించింది? (బి) రూతు “వెనుకటి” సందర్భంలో చూపించిన ప్రేమపూర్వక దయ, “మునుపటి” సందర్భంలో చూపించిన దానికంటే ఏ విధంగా శ్రేష్ఠమైనది?

11 రూతు పుస్తకం, మోయాబీయురాలైన తన కోడలు రూతు విధవరాలే అయినా ఆమెనుండి విధవరాలైన నయోమి ప్రేమపూర్వక దయను ఎలా పొందిందో తెలియజేస్తుంది. యూదాలోని బేత్లెహేముకు వెళ్ళాలని నయోమి నిర్ణయించుకున్నప్పుడు, రూతు ఇలా అంటూ ప్రేమపూర్వక దయను, దృఢ నిశ్చయాన్ని చూపించింది: “నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు.” (రూతు 1:16) ఆ తర్వాత నయోమి సమీప బంధువైన వృద్ధ బోయజును పెళ్ళి చేసుకోవడానికి తన ఇష్టాన్ని తెలియజేయడం ద్వారా రూతు తన ప్రేమపూర్వక దయను వ్యక్తం చేసింది. * (ద్వితీయోపదేశకాండము 25:​5, 6; రూతు 3:​6-9) ఆయన రూతుతో ఇలా అన్నాడు: ‘నా కుమారీ, యెహోవాచేత నీవు దీవెన నొందినదానవు; కొద్దివారినే గాని గొప్పవారినే గాని యౌవనస్థులను నీవు వెంబడింపక యుండుటవలన నీ మునుపటి సత్‌ప్రవర్తనకంటె [“ప్రేమపూర్వక దయకంటె,” NW] వెనుకటి సత్‌ ప్రవర్తన [“ప్రేమపూర్వక దయ,” NW] మరి ఎక్కువైనది.’​—⁠రూతు 3:​10.

12 రూతు తన ప్రజలను వదిలిపెట్టి నయోమితో నిలిచి ఉన్నప్పటి సందర్భంలో ఆమె “మునుపటి” ప్రేమపూర్వక దయ కనబడుతుంది. (రూతు 1:​14; 2:​11) రూతు బోయజును పెళ్ళి చేసుకోవడానికి చూపిన ఇష్టత ద్వారా చూపించిన “వెనుకటి” ప్రేమపూర్వక దయ మొదటిదాన్ని మించిపోయింది. రూతు ఇప్పుడు, పిల్లలను కనలేని వయస్సులోవున్న నయోమికి ఒక వంశాంకురాన్ని అందించగలుగుతుంది. పెళ్ళి అవుతుంది, ఆ తర్వాత రూతు ప్రసవించినప్పుడు, బేత్లెహేములోని స్త్రీలు ‘నయోమికొరకు కుమారుడు పుట్టెను’ అని కేకలు వేశారు. (రూతు 4:​14, 17) రూతు నిజంగానే ‘యోగ్యురాలు,’ అందుకే యేసుక్రీస్తుకు పూర్వీకురాలయ్యే అద్భుతమైన ఆధిక్యతను యెహోవా ఆమెకు ప్రతిఫలంగా ఇచ్చాడు.​—⁠రూతు 2:​12; 3:​11; 4:​18-21; మత్తయి 1:⁠1, 5, 6.

చర్యల ద్వారా చూపించబడుతుంది

13. బెతూయేలు, యోసేపు, రూతు తమ ప్రేమపూర్వక దయను ఎలా చూపించారు?

13 బెతూయేలు, యోసేపు, రూతులు తమ ప్రేమపూర్వక దయను ఎలా చూపించారో మీరు గమనించారా? వారు దయాపూర్వక మాటలతోనే కాదుగానీ, నిర్దిష్టమైన చర్యల ద్వారా తమ ప్రేమపూర్వక దయను చూపించారు. బెతూయేలు “ఇదిగో రిబ్కా నీ యెదుట నున్నది” అని అనడం మాత్రమే కాదుగానీ వాస్తవానికి ఆయన రిబ్కాను ‘సాగనంపాడు.’ (ఆదికాండము 24:​51, 59) యోసేపు ‘నేను నీ మాట చొప్పున చేసెదను’ అని ఊరుకోలేదు, కానీ ఆయన, ఆయన సహోదరులు, యాకోబు “వారి కాజ్ఞాపించినట్లు చేశారు.” (ఆదికాండము 47:​31; 50:​12, 13) రూతు కేవలం “నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను,” అని మాత్రమే అనలేదు, కానీ ఆమె తన ప్రజలను వదిలేసి నయోమితో కలిసివెళ్ళింది, ఆ విధంగా ‘వారు బేత్లెహేమునకు వచ్చిరి.’ (రూతు 1:​16, 19) యూదాలో కూడా, రూతు మళ్ళీ “తన అత్త ఆజ్ఞాపించిన దంతయు చేసెను.” (రూతు 3:⁠6) అవును, రూతు కూడా తన ప్రేమపూర్వక దయను, ఇతరుల్లాగే చర్యల్లో వ్యక్తం చేసింది.

14. (ఎ) ప్రస్తుత కాలపు దేవుని సేవకులు ప్రేమపూర్వక దయను చర్యల ద్వారా ఎలా చూపిస్తున్నారు? (బి) మీ ప్రాంతంలోని క్రైస్తవులు చేస్తున్న ఎలాంటి ప్రేమపూర్వక చర్యల గురించి మీకు తెలుసు?

14 నేడు దేవుని సేవకులు తమ ప్రేమపూర్వక దయను చర్యల్లో వ్యక్తం చేయడాన్ని ఎలా కొనసాగిస్తున్నారో చూడడం మనోల్లాసం కలిగిస్తుంది. ఉదాహరణకు, అనారోగ్యంతోవున్న, కృంగిపోయివున్న, దుఃఖంలోవున్న తోటి విశ్వాసులకు స్థిరంగా మానసిక ధైర్యాన్నిచ్చే వారి గురించి ఆలోచించండి. (సామెతలు 12:​25) లేదా వారపు సంఘ కూటాలకు హాజరయ్యేందుకు వృద్ధులను రాజ్యమందిరానికి తీసుకువెళ్ళే అనేకమంది యెహోవాసాక్షులను గమనించండి. 82 ఏండ్ల అన్నా, కీళ్ళనొప్పులతో బాధపడుతోంది, ఆమె ఇలా అంటున్నప్పుడు ఇతరులనేకుల భావాలను వ్యక్తం చేస్తోంది: “నన్ను కూటాలన్నింటికి తీసుకువెళ్తున్నారంటే అది యెహోవా ఇచ్చిన ఆశీర్వాదం. నాకు ఇలాంటి ప్రేమపూర్వకమైన సహోదర సహోదరీలను ఇచ్చినందుకు నేనాయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.” మీరు మీ సంఘంలో అలాంటి క్రియలే చేస్తున్నారా? (1 యోహాను 3:​17, 18) అలా చేస్తున్నట్లైతే, మీ ప్రేమపూర్వక దయ విలువైనదిగా ఎంచబడుతోందని నమ్మకంతో ఉండండి.

ఇష్టపూర్వకంగా చూపించబడుతుంది

15. మనం పరిశీలించిన మూడు బైబిలు వృత్తాంతాల్లో, ప్రేమపూర్వక దయ యొక్క ఏ విశిష్టత గురించి ప్రధానంగా చూపించబడింది?

15 మనం పరిశీలించిన బైబిలు కథనాలు, ప్రేమపూర్వక దయ ఉచితంగా, ఇష్టపూర్వకంగా చూపబడింది గానీ బలవంతంగా కాదని కూడా తెలియజేస్తున్నాయి. బెతూయేలు అబ్రాహాము దాసునికి ఇష్టపూర్వకంగా సహకరించాడు, రిబ్కా కూడా అలాగే సహకరించింది. (ఆదికాండము 24:​51, 58) యోసేపు తన ప్రేమపూర్వక దయను ఇతరుల ప్రేరేపణ లేకుండానే చూపించాడు. (ఆదికాండము 50:​4, 5) రూతు, నయోమితో వెళ్ళడానికి తాను “పట్టుదల”తో ఉన్నట్లు చూపించింది. (రూతు 1:​18, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) బోయజు వద్దకు వెళ్ళమని నయోమి, రూతును సూచించినప్పుడు, ఆ మోయాబీయురాలు ఇలా ప్రకటించడానికి ఆమెను ప్రేమపూర్వక దయే కదిలించింది: ‘నీవు సెలవిచ్చినదంతయు చేసెదను.’​—⁠రూతు 3:​1-5.

16, 17. బెతుయేలు, యోసేపు, రూతులు చూపించిన ప్రేమపూర్వక దయను ప్రత్యేకంగా అర్థవంతమైనదిగా చేసిందేమిటి, ఆ లక్షణాన్ని చూపించేందుకు వారిని ఏమి కదిలించింది?

16 బెతూయేలు, యోసేపు, రూతులు చూపించిన ప్రేమపూర్వక దయ ప్రత్యేకంగా గుర్తించతగినది. ఎందుకంటే అబ్రాహాము, యాకోబు, నయోమి తమ పనులు చేయించుకోవడానికి ఎదుటివారిపై ఒత్తిడి తెచ్చే స్థితిలో లేరు. బెతూయేలు తన కూతురును పంపించడానికి ఆయనపై చట్టబద్ధమైన బాధ్యత ఏదీ లేదు. ‘కష్టపడి పనిచేసే నా కూతురును అంత దూరం పంపించడం నాకిష్టం లేదు’ అని ఆయన అబ్రాహాము దాసునితో సులభంగా అనగలిగేవాడు. (ఆదికాండము 24:​18-20) అదేవిధంగా, యోసేపుకు తన తండ్రి కోరిన దాని ప్రకారం చేయాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి స్వతంత్రం ఉంది, ఎందుకంటే యాకోబు మరణించాక, తన మాట నిలబెట్టుకొమ్మని యోసేపును నిర్బంధం చేయగల స్థితిలో ఉండడు. రూతు కావాలనుకుంటే మోయాబులో ఉండిపోవచ్చని నయోమి తానే స్వయంగా సూచించింది. (రూతు 1:⁠8) వయస్సు పైబడిన బోయజుకు బదులుగా ‘యౌవనస్థులలో’ ఒకరిని పెళ్ళి చేసుకొనే స్వేచ్ఛ కూడా రూతుకు ఉంది.

17 బెతూయేలు, యోసేపు, రూతులు ప్రేమపూర్వక దయను ఇష్టపూర్వకంగా చూపించారు, అలా చేయడానికి వారు హృదయపూర్వకంగా కదిలించబడ్డారు. తమతో సంబంధమున్నవారిపై ఆ లక్షణాన్ని చూపించేందుకు తమపై ఒక నైతిక బాధ్యత ఉందని వారు భావించారు. అదేవిధంగా దావీదు రాజు కూడా మెఫీబోషెతు విషయంలో ప్రేమపూర్వక దయను వ్యక్తం చేయడం తన బాధ్యతగా భావించాడు.

18. (ఎ) క్రైస్తవ పెద్దలు మందను ఏ దృక్పథంతో ‘కాస్తారు’? (బి) తోటి విశ్వాసులకు సహాయం చేయడం గురించి ఒక పెద్ద తన భావాలను ఎలా వ్యక్తం చేశాడు?

18 ఇప్పటికీ ప్రేమపూర్వక దయ దేవుని ప్రజలకు ఒక గుర్తింపు చిహ్నమే, వారిలో దేవుని మందను కాసే కాపరులు కూడా ఉన్నారు. (కీర్తన 110:⁠3; 1 థెస్సలొనీకయులు 5:​12) అలాంటి పెద్దలు లేక పైవిచారణకర్తలు, తమ నియామకం ద్వారా తమ మీద ఉంచబడిన నమ్మకానికి తగినట్లు జీవించాల్సిన బాధ్యత తమపై ఉన్నట్లు భావిస్తారు. (అపొస్తలుల కార్యములు 20:​28) వారు తమ కాపరి పనిని, సంఘం తరఫున చేసే ప్రేమపూర్వక దయతోకూడిన ఇతర చర్యలను, “బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగా” చేస్తారు. (1 పేతురు 5:⁠2) బాధ్యతా, చేయాలన్న కోరికా రెండూ ఉన్నాయి కాబట్టే ఆ పెద్దలు మందను కాస్తారు. క్రీస్తు మందపై ప్రేమపూర్వక దయను చూపించడం తమ కర్తవ్యం కాబట్టి, అలా చూపించాలని కోరుకుంటున్నారు కాబట్టి వారు ప్రేమపూర్వక దయను చూపిస్తారు. (యోహాను 21:​15-17) “సహోదరులను వారి ఇండ్లలో కలుసుకోవడానికి లేదా వారికి ఫోను చేయడానికి నేను నిజంగా ఇష్టపడతాను, అది నేను వారిని గురించి ఆలోచిస్తున్నానని చూపించడానికే తప్ప అందుకు వేరే కారణమేమీ లేదు,” అని “సహోదరులకు సహాయం చేయడం నాకు గొప్ప సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది!” అని ఒక క్రైస్తవ పెద్ద అంటున్నాడు. ప్రతిచోట ఉన్న శ్రద్ధగల పెద్దలు దీన్ని హృదయపూర్వకంగా అంగీకరిస్తారు.

అవసరంలో ఉన్నవారిపై ప్రేమపూర్వక దయ చూపించండి

19. ఈ ఆర్టికల్‌లో చర్చించిన బైబిలు వృత్తాంతాలు ప్రేమపూర్వక దయ గురించిన ఏ వాస్తవాన్ని ప్రధానంగా చూపిస్తున్నాయి?

19 మనం చర్చించిన బైబిలు వృత్తాంతాలు, తమకు తాముగా అవసరాలను తీర్చుకోలేని స్థితిలో ఉన్నవారిపై ప్రేమపూర్వక దయను చూపించాల్సిన ప్రాధాన్యతను కూడా చూపించాయి. తన వంశావళిని కొనసాగించుకోవడానికి అబ్రాహాముకు బెతూయేలు సహకారం అవసరమైంది. తన శవాన్ని కనానుకు తీసుకువెళ్ళడానికి యాకోబుకు యోసేపు సహాయం అవసరమైంది. ఒక వంశాంకురానికి జన్మనిచ్చేందుకు నయోమికి రూతు సహాయం అవసరమైంది. అబ్రాహాముగానీ, యాకోబుగానీ, నయోమిగానీ ఇతరుల సహాయం లేకుండా ఆ అవసరాలను తీర్చుకోలేరు. అదేవిధంగా నేడు ప్రత్యేకంగా, అవసరంలో ఉన్నవారిపై ప్రేమపూర్వక దయ చూపించాలి. (సామెతలు 19:​17) పూర్వీకుడైన యోబును మనం అనుకరించాలి. ఆయన “మొఱ్ఱపెట్టిన దీనులను తండ్రి లేనివారిని సహాయములేనివారిని” మాత్రమే కాదు, “నశించుటకు సిద్ధమైయున్నవారి” మీద కూడా శ్రద్ధ చూపించాడు. అంతేకాదు యోబు, ‘విధవరాండ్ర హృదయాలను సంతోషపెట్టాడు,’ ‘గ్రుడ్డివారికి కన్నులయ్యాడు కుంటివారికి పాదములయ్యాడు.’​—⁠యోబు 29:​12-15.

20, 21. మన ప్రేమపూర్వక దయను పొందవలసిన అవసరంలో ఎవరున్నారు, మనలో ప్రతి ఒక్కరం ఏమి చేయాలని దృఢంగా నిశ్చయించుకోవాలి?

20 నిజానికి, ప్రతి క్రైస్తవ సంఘంలో ‘మొఱ్ఱపెట్టే దీనులు’ ఉన్నారు. ఒంటరితనం, నిరుత్సాహం, అయోగ్యులమనే భావం, ఇతరుల విషయమై అసంతృప్తి, తీవ్రమైన అనారోగ్యం లేక ప్రియమైనవారి మరణం వంటివి అందుకు కారణం కావచ్చు. కారణమేదైనా, అలాంటి ప్రియమైనవారందరూ అవసరంలో ఉన్నారు, అది మన ఇష్టపూర్వకమైన, అవిరామమైన ప్రేమపూర్వక దయతో కూడిన చర్యల ద్వారానే తీర్చబడుతుంది, తీర్చబడాలి.​—⁠1 థెస్సలొనీకయులు 5:​14.

21 కాబట్టి, ‘విస్తారమైన కృపాసత్యములుగల [“ప్రేమపూర్వక దయగల,” NW] దేవుడైన యెహోవాను’ అనుకరించడంలో కొనసాగుదాం. (నిర్గమకాండము 34:⁠6; ఎఫెసీయులు 5:⁠1) మనం ప్రత్యేకంగా అవసరంలో ఉన్నవారి తరఫున, ఇష్టపూర్వకంగా నిర్దిష్టమైన చర్యను తీసుకోవడం ద్వారా కొనసాగవచ్చు. మనం ‘ఒకరియందొకరం కరుణావాత్సల్యములు [“ప్రేమపూర్వక దయ,” NW] కనపరచుకోవడంలో’ కొనసాగుతుండగా యెహోవాను గౌరవించిన వారమవుతాము, దానితోపాటు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తాం.​—⁠జెకర్యా 7:⁠9.

[అధస్సూచి]

^ పేరా 11 ఇక్కడ జరిగిన పెళ్ళి విధానం గురించిన వివరాలకు, యెహోవాసాక్షులు ప్రచురించిన లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) సంపుటి 1, 370వ పేజీ చూడండి.

మీరెలా జవాబిస్తారు?

• ప్రేమపూర్వక దయ, మానవత్వం నుండి ఎలా భిన్నమైనది?

• బెతూయేలు, యోసేపు, రూతుల ద్వారా ప్రేమపూర్వక దయ ఏయే విధాల్లో కనబరచబడింది?

• ప్రేమపూర్వక దయను మనం ఏ దృక్పథంతో చూపించాలి?

• మన ప్రేమపూర్వక దయ పొందవలసిన అవసరంలో ఎవరున్నారు?

[అధ్యయన ప్రశ్నలు]

[18వ పేజీలోని చిత్రం]

బెతూయేలు ప్రేమపూర్వక దయను ఎలా చూపించాడు?

[21వ పేజీలోని చిత్రం]

రూతు యథార్థమైన ప్రేమ నయోమికి ఒక దీవెన అయ్యింది

[23వ పేజీలోని చిత్రాలు]

మానవుల ప్రేమపూర్వక దయ అవసరంలో ఉన్నవారిపై ఇష్టపూర్వకంగా నిర్దిష్టమైన చర్య తీసుకోవడం ద్వారా చూపించబడింది