కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అసాధారణమైన పెరుగుదలవల్ల తక్షణ విస్తరణ అవసరమౌతోంది

అసాధారణమైన పెరుగుదలవల్ల తక్షణ విస్తరణ అవసరమౌతోంది

“నా యొద్దకు రండి;నేను మీకు విశ్రాంతి కలుగజేతును”

అసాధారణమైన పెరుగుదలవల్ల తక్షణ విస్తరణ అవసరమౌతోంది

“నాయొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును” అని యేసుక్రీస్తు అన్నాడు. (మత్తయి 11:28) క్రైస్తవ సంఘ శిరస్సు నుండి ఎంతటి మనోల్లాసకరమైన ఆహ్వానమో కదా! (ఎఫెసీయులు 5:23) మనం ఆ మాటలను జాగ్రత్తగా పరిశీలిస్తే, మనలను ఉత్తేజపరిచే అతి ప్రాముఖ్య ఆధారమైన, క్రైస్తవ కూటాల్లో మన ఆధ్యాత్మిక సహోదర సహోదరీల సహవాసాన్ని గ్రహించకుండా ఉండలేము. “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!” అని పాడిన కీర్తనకర్తతో మనం కూడా తప్పకుండా ఏకీభవిస్తాం.​—⁠కీర్తన 133:1.

నిజంగానే, ఆరాధించేందుకు సమకూడే అలాంటి కూటాల్లో మనం కలుసుకొనేవారితో చేసే సహవాసం ఎంతో శ్రేష్ఠమైనది, అక్కడవుండే ఆధ్యాత్మిక వాతావరణం కూడా సురక్షితమైనది, ఆహ్లాదకరమైనది. సహేతుకంగానే ఒక క్రైస్తవ యువతి ఇలా అంది: “నేను దినమంతా స్కూల్లో గడిపి వచ్చేసరికి అలసిపోతాను. కానీ కూటాలు ఎడారిలో నీటి చెలమల్లా ఉంటాయి, మరుసటి రోజు స్కూలుకు వెళ్ళగలిగేంతగా అవి నన్ను పునరుత్తేజపరుస్తాయి.” ఒక నైజీరియన్‌ యువతి ఇలా పేర్కొంది: “యెహోవాను ప్రేమించేవారితో సన్నిహిత సహవాసం కలిగి ఉండడం, ఆయనకు దగ్గరగా ఉండడానికి సహాయపడుతుందని నేను గ్రహించాను.”

యెహోవాసాక్షుల స్థానిక రాజ్యమందిరం, ఆ ప్రాంతంలో జరిగే సత్యారాధనకు ఒక కేంద్రంగా చాలా ఉపయోగపడుతుంది. అనేక స్థలాల్లో, కూటాలు కనీసం వారానికి రెండుసార్లైనా రాజ్యమందిరంలో జరుగుతాయి, పునరుత్తేజాన్నిచ్చే అక్కడి సహవాసం నుండి ప్రయోజనం పొందేందుకు సాధ్యమైనంత త్వరగా హాజరు కమ్మని బైబిలు విద్యార్థులు ప్రోత్సహించబడతారు.​—⁠హెబ్రీయులు 10:​24, 25.

అత్యావశ్యకమైన ఒక అవసరం

అయితే, యెహోవాసాక్షులందరికీ సరైన రాజ్యమందిరాలు లేవన్నది గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైనరీతిలో పెరుగుతున్న రాజ్య ప్రచారకుల సంఖ్య అత్యావశ్యకమైన ఒక అవసరాన్ని సృష్టించింది. ప్రత్యేకించి వర్ధమాన దేశాల్లో ఇంకా వేలాది రాజ్యమందిరాల అవసరముంది.​—⁠యెషయా 54:⁠2; 60:​22.

ఉదాహరణకు: డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో రాజధానిలో ఉన్న 290 సంఘాలకు కేవలం పది రాజ్యమందిరాలు మాత్రమే ఉన్నాయి. ఆ దేశానికి అనేక రాజ్యమందిరాలు అత్యావశ్యకం. అంగోలాలో రాజ్యమందిరాలు చాలా తక్కువగా ఉండడంవల్ల, అనేక సంఘాలు తమ కూటాలను ఆరుబయటే జరుపుకుంటున్నాయి. ఇదేవిధంగా రాజ్యమందిరాల కొరత ఇతర అనేక దేశాల్లో కూడా ఉంది.

ఆ కారణంగా 1999 నుండి, వనరులు పరిమితంగా ఉన్న దేశాల్లో రాజ్యమందిరాల నిర్మాణానికి సహాయం చేసేందుకు వ్యవస్థీకరించబడిన కృషి చేయబడుతోంది. అలాంటి దేశాల్లోని బిల్డింగు ప్రాజెక్టుల్లో సహాయం చేయడానికి అనుభవమున్న సాక్షులు తమ సేవలను స్వచ్ఛందంగా అందిస్తున్నారు. అటువంటి కృషితో ఇష్టపూర్వకమైన స్ఫూర్తి, స్థానిక స్వచ్ఛంద సేవకులు అందుబాటులో ఉండడం తోడైనప్పుడు ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటున్నాయి. తత్ఫలితంగా, స్థానిక సాక్షులు తాము పొందుతున్న శిక్షణనుండి ప్రయోజనం పొందుతున్నారు. ఇవన్నీ ఆయా దేశాల్లో రాజ్యమందిరాల నిర్మాణానికి అవసరమైనవాటిని సమకూర్చడానికి దోహదపడుతున్నాయి.

ఆ విధంగా స్థానిక పద్ధతులను, వస్తువులను ఉపయోగించి చేసే రాజ్యమందిరపు నిర్మాణం మరింత సులభమయ్యేలా ఆచరణాత్మకమైన సహాయం అందించబడుతోంది. దీని లక్ష్యం రాజ్యమందిరాల అవసరం తీర్చడం మాత్రమే కాదు కానీ స్థానిక పరిస్థితులకు తగిన విధంగా ఉండేలా వాటిని కాపాడుకొనే కార్యక్రమం కూడా అందించబడుతోంది.​—⁠2 కొరింథీయులు 8:​14, 15.

ప్రోత్సాహకరమైన అభివృద్ధులు

ఆరాధనా స్థలాలను సమకూర్చడానికి చేయబడిన ఈ ప్రయత్నాలు ఎలాంటి ప్రభావం చూపాయి? 2001 తొలి కాలంలో, మలావీ నుండి ఒక నివేదిక ఇలా తెలియజేసింది: “ఈ దేశంలో సాధించబడింది నిజంగా మనస్సులపై ముద్ర వేసేలా ఉంది. తర్వాతి రెండు నెలల్లో, మేము మిగతా రాజ్యమందిరాలను పూర్తి చేస్తాము.” (1వ, 2వ చిత్రాలు) టోగోలో స్వచ్ఛంద సేవకులు ఇటీవలి నెలల్లో నిరాడంబరమైన అనేక రాజ్యమందిరాలను నిర్మించగలిగారు. (3వ చిత్రం) ఇష్టపూర్వకంగా వచ్చిన స్వచ్ఛంద సేవకులు చేస్తున్న చక్కని పని మెక్సికో, బ్రెజిల్‌లతోపాటు ఇతర దేశాల్లో యుక్తమైన రాజ్యమందిరాలను నిర్మించడానికి కూడా సహాయం చేస్తోంది.

ఒక రాజ్యమందిరం నిర్మించబడినప్పుడు, యెహోవాసాక్షులు ఇక ఇక్కడే ఉంటారని స్థానిక ప్రజలు గ్రహించారని సంఘాలు గమనించాయి. సరైన ఆరాధనా స్థలం లభ్యమయ్యేంతవరకు సాక్షులతో సహవాసం చేయడానికి అనేకమంది వెనుకాడినట్లు కనబడ్డారు. మలావీలోని నఫీసి సంఘం ఇలా చెబుతోంది: “ఇప్పుడు మాకు ఒక చక్కని రాజ్యమందిరం ఉంది గనుక అదొక చక్కని సాక్ష్యంగా పనిచేస్తోంది. ఆ కారణంగా బైబిలు అధ్యయనాలను ప్రారంభించడం సులభమవుతోంది.”

బెనిన్‌లోని క్రేక్‌ సంఘ సభ్యులు గతంలో చాలా వెక్కిరింతలను సహించారు, అంతకుముందున్న రాజ్యమందిరం కొన్ని చర్చీలతో పోల్చిచూస్తే చాలా ప్రాచీన కాలానిది అవడమే అందుకు కారణం. (4వ చిత్రం) ఇప్పుడు ఆ సంఘానికి ఒక చక్కని క్రొత్త రాజ్యమందిరం ఉంది, అది నిరాడంబరంగానే అయినప్పటికీ గౌరవనీయమైన రీతిలో సత్యారాధనకు ప్రాతినిధ్యంగా ఉంది. (5వ చిత్రం) ఆ సంఘంలో 34 మంది రాజ్య ప్రచారకులు ఉన్నారు, ఆదివారం కూటాలకు హాజరయ్యేవారి సరాసరి సంఖ్య 73, అయితే రాజ్యమందిరం సమర్పణకు 651 మంది హాజరయ్యారు. సాక్షులు అతి తక్కువ సమయంలో రాజ్యమందిరాన్ని నిర్మించుకోగలగడం చూసి ముగ్ధులైన పట్టణ ప్రజలే వారిలో చాలామంది ఉన్నారు. ఈ విషయమై గతంలో జరిగిన అభివృద్ధులను గుర్తుచేసుకొంటూ జింబాబ్వే బ్రాంచి ఇలా వ్రాసింది: “ఒక క్రొత్త రాజ్యమందిరం నిర్మించబడిన నెల లోపలే హాజరయ్యేవారి సంఖ్య సాధారణంగా రెట్టింపు అవుతుంది.”​—⁠6వ, 7వ చిత్రాలు.

అనేక క్రొత్త రాజ్యమందిరాలు అటు సమర్పిత క్రైస్తవులకు, ఇటు ఆసక్తిగల ప్రజలకు ఆధ్యాత్మిక పునరుత్తేజ స్థలాలుగా సహాయపడుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. యుక్రెయిన్‌లోని స్థానిక సంఘం తమ క్రొత్త రాజ్యమందిరాన్ని ఉపయోగించడం ప్రారంభించాక, “మాకెంతో ఆనందంగా ఉంది,” అని ఒక సాక్షి అంది. “యెహోవా తన ప్రజలకు ఎలా సహాయం చేస్తాడన్నది మేము స్వయంగా చూశాం.”

[10, 11వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

ఉదారంగా ఇచ్చే మద్దతు విలువైనదిగా ఎంచబడుతుంది

ప్రపంచమంతటా ఉన్న క్రొత్త రాజ్యమందిరాల అత్యావశ్యక అవసరాన్ని తీర్చడానికి శీఘ్రంగా తీసుకోబడుతున్న చర్యలను చూసి యెహోవాసాక్షులు పులకరించిపోతున్నారు. యెహోవా ఆరాధకుల సంఖ్య స్థిరంగా పెరుగుతున్న వివిధ దేశాల్లో, భవిష్యత్తులో అనేక క్రొత్త రాజ్యమందిరాలు నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే, 2001 సేవా సంవత్సర కాలంలో ప్రతివారం సగటున 32 క్రొత్త సంఘాలు ఏర్పడ్డాయి! అలాంటి సంఘాలు, కూడుకొని ఆరాధించేందుకు స్థలాల అవసరముంది.

కానీ ఒక ప్రశ్న తలెత్తవచ్చు, ‘క్రొత్త రాజ్యమందిరాల నిర్మాణం వంటి ప్రాజెక్టులలో, ప్రత్యేకంగా సహోదరులకు పరిమితమైన ఆర్థిక వనరులున్న దేశాల్లో మనకు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది?’ దాని జవాబులో దేవుని మద్దతు, మానవ ఔదార్యం రెండూ ఉన్నాయి.

తన వాగ్దానం ప్రకారం, యెహోవా తన సేవకులపై తన పరిశుద్ధాత్మను కుమ్మరించి, వారు ‘మేలుచేయువారును, సత్‌క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండేలా’ చేస్తాడు. (1 తిమోతి 6:​18) యెహోవాసాక్షులు క్రైస్తవ కార్యకలాపాలకు తమ సమయాన్ని, బలాన్ని, శారీరక శ్రమను ఇతర వనరులను అంకితం చేస్తూ, రాజ్య ప్రకటనా పనికి అన్ని విధాలుగా మద్దతునిచ్చేలా దేవుని ఆత్మ వారిని ప్రేరేపిస్తుంది.

విస్తరణకు, నిర్మాణపు పనికి ఆర్థికపరంగా సహాయం చేసేలా ఉదారగుణం సాక్షులను, ఇతరులను పురికొలుపుతుంది. వారు స్థానిక సంఘంలో మామూలుగా ఉండే ఖర్చులకు సహాయపడడంతోపాటు, ఇతర భూభాగాల్లో నడుస్తున్న నిర్మాణపు పనికి కూడా విరాళాలను ఇస్తున్నారు.

ప్రతి సంఘంలోనూ, “ప్రపంచవ్యాప్త పని కోసం చందాలు​—⁠మత్తయి 24: 14” అని స్పష్టంగా వ్రాసివున్న పెట్టెలు ఉంటాయి. ఇష్టపడేవారు తమ స్వచ్ఛంద విరాళాలను వాటిలో వేయవచ్చు. (2 రాజులు 12:⁠9) చిన్న మొత్తాలైనా పెద్ద మొత్తాలైనా విరాళాలన్నీ విలువైనవిగానే ఎంచబడతాయి. (మార్కు 12:​42-44) రాజ్యమందిరాల నిర్మాణంతోపాటు, అవసరాన్నిబట్టి ఆ విరాళాలు పలు విధాలుగా ఉపయోగించబడతాయి. ఆ విరాళాలు, కార్యనిర్వాహకులకు వేతనాలుగా ఉపయోగించబడవు, ఎందుకంటే యెహోవాసాక్షుల్లో అలా వేతనాలు తీసుకొని పనిచేసేవారెవ్వరూ లేరు.

ప్రపంచవ్యాప్త పనికి ఇవ్వబడుతున్న ఆర్థిక విరాళాలు వారి ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాయా? అవును, నెరవేరుస్తున్నాయి. అంతర్గత పోరాటాల్లో ధ్వంసమైన లైబీరియా దేశంలోని బ్రాంచి, స్థానిక సాక్షుల్లో అధికభాగం నిరుద్యోగ సమస్యను, తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని నివేదిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఆ దేశంలోని యెహోవా ప్రజలు తగిన ఆరాధనా స్థలాలను ఎలా పొందగలరు? “ఇతర దేశాల్లోని సహోదరులు ఔదార్యంతో ఇచ్చిన విరాళాలు ఆ పనికి అయ్యే ఖర్చుకోసం ఉపయోగించబడతాయి” అని ఆ బ్రాంచి కార్యాలయం తెలియజేస్తోంది. “ఎంత చక్కని, వివేకవంతమైన, ప్రేమపూర్వకమైన ఏర్పాటో కదా!”

స్థానిక సహోదరుల ఆదాయాలు పరిమితంగానే ఉన్నప్పటికీ వాళ్ళు కూడా విరాళాలిస్తారు. ఆఫ్రికాలోని సియర్రా లియోన్‌ అనే దేశం ఇలా నివేదిస్తోంది: “స్థానిక సహోదరులు రాజ్యమందిరాల నిర్మాణానికి బాసటగా నిలిచి, తమ శారీరక శ్రమను, సాధ్యమైనంత మేరకు ఆర్థిక విరాళాలను ఇవ్వడానికి సంతోషిస్తున్నారు.”

చిట్టచివరికి ఈ నిర్మాణాలకు సంబంధించిన కృషి యెహోవాకు ఘనతను తెస్తుంది. లైబీరియాలోని సహోదరులు ఎంతో ఉత్సాహంగా ఇలా అంటున్నారు: “దేశమంతటా నిర్మించబడిన ఆరాధనకు అనువైన స్థలాలు, ఈ దేశంలో సత్యారాధన శాశ్వతంగా ఉంటుందని చూపిస్తాయి, మన దేవుని గొప్ప నామమును ఘనపరుస్తాయి, మహిమపరుస్తాయి.”