కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడెవరు?

దేవుడెవరు?

దేవుడెవరు?

“సాధారణంగా విశ్వానికి ఉత్కృష్టమైన మూలాధారానికి, శక్తికి అంటే భక్తిపూర్వకంగా ఆరాధించబడే వ్యక్తికి దేవుడు అనే పేరును ఆపాదిస్తారు,” అని ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా చెబుతోంది. ఒక డిక్షనరీ దేవుడు అనే పదాన్ని అత్యున్నతమైన లేక పరమమైన వాస్తవం అని నిర్వచించింది. సంభ్రమాశ్చర్యాలు కలుగజేసే ఆ వాస్తవం యొక్క నైజం ఏమిటి?

దేవుడు ఒక అశరీరమైన శక్తా లేక ఒక నిజమైన వ్యక్తా? ఆయనకు ఒక పేరుందా? చాలామంది నమ్ముతున్నట్లు ఆయన త్రియేక స్వరూపా, ఒక త్రిత్వమా? మనం దేవుణ్ణి ఎలా తెలిసికోవచ్చు? ఈ ప్రశ్నలకు బైబిలు సత్యవంతమైన, సంతృప్తికరమైన జవాబులను అందిస్తుంది. వాస్తవానికి బైబిలు, “ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు” అని చెబుతూ దేవుణ్ణి వెతకమని మనలను ప్రోత్సహిస్తోంది.​—⁠అపొస్తలుల కార్యములు 17:​26, 27.

ఒక అశరీరమైన శక్తా లేక ఒక నిజమైన వ్యక్తా?

దేవుణ్ణి నమ్మేవారిలో చాలామంది ఆయనను ఒక వ్యక్తిగా కాక ఒక శక్తిగానే నమ్ముతారు. ఉదాహరణకు, కొన్ని నాగరికతల్లో ప్రకృతి శక్తులను దేవుళ్ళని నమ్ముతారు. విశ్వాకృతి గురించి, భూమిపైనున్న జీవ నైజం గురించి చేసిన శాస్త్రీయ పరిశోధన ద్వారా సమకూర్చబడిన ఆధారాలను పరిశీలించిన కొందరు, సమస్తం ఉనికిలోకి రావడానికి ఏదో ఒక కారకం ఉంది అనే ముగింపుకు వచ్చారు. అయితే ఆ కారకానికి ఒక వ్యక్తిత్వాన్ని ఆపాదించడానికి మాత్రం వారు సంకోచిస్తారు.

అయినప్పటికీ, ఆ మొదటి కారకానికి విశిష్టమైన మేధస్సు ఉండి ఉంటుందని ఈ సృష్టిలోని సంక్లిష్టత సూచించడం లేదా? మేధస్సుకు ఒక మనస్సు అవసరముంటుంది. సృష్టి అంతటికీ కారకమైన గొప్ప మనస్సు దేవునికే ఉంది. అవును, దేవునికి శరీరముంది, అది మనకులాంటి భౌతికమైనది కాదు, కానీ ఆత్మ శరీరము ఉంది. అందుకే బైబిలు, “ప్రకృతిసంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరముకూడ ఉన్నది” అని చెబుతోంది. (1 కొరింథీయులు 15:​44) దేవుని నైజం గురించి తెలియజేస్తూ, “దేవుడు ఆత్మ” అని బైబిలు స్పష్టంగా చెబుతోంది. (యోహాను 4:​24) ఒక ఆత్మకు మన నుండి చాలా భిన్నమైన జీవం ఉంటుంది; అది మానవ దృష్టికి అగోచరమైనది. (యోహాను 1:​18) అదృశ్యమైన ఆత్మ ప్రాణులు కూడా ఉన్నాయి. వారు దేవదూతలు​—⁠“సత్య దేవుని కుమారులు.”​—⁠యోబు 1:⁠6; 2:⁠1, NW.

దేవుడు సృష్టించబడని వ్యక్తి, ఆయనకు ఒక ఆత్మ శరీరముంది కాబట్టి, సహేతుకంగానే ఆయనకు ఒక నివాసస్థలం ఉంటుంది. ఆత్మ సామ్రాజ్యాన్ని సూచిస్తూ, ఆకాశము దేవుని ‘నివాసస్థలము’ అని బైబిలు మనకు చెబుతోంది. (1 రాజులు 8:​43) బైబిలు రచయిత పౌలు కూడా ఇలా పేర్కొన్నాడు: “క్రీస్తు . . . మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను.”​—⁠హెబ్రీయులు 9:​24.

బైబిలులో “ఆత్మ” అనే పదం మరో భావంతో కూడా ఉపయోగించబడింది. కీర్తనకర్త ప్రార్థనలో దేవుణ్ణి సంబోధిస్తూ ఇలా అన్నాడు: “నీ ఆత్మను పంపినప్పుడు అవి ఉనికిలోకి వస్తాయి.” (కీర్తన 104:​30, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) ఈ ఆత్మ స్వయంగా దేవుడు కాదు, కానీ దేవుడు తాను ఏది చేయాలని కోరుకొంటే అది నెరవేర్చడానికి పంపించే శక్తి లేక ఉపయోగించబడే శక్తి. ఆ శక్తి ద్వారానే దేవుడు భౌతిక ఆకాశములను, భూమిని, సకల ప్రాణులను సృష్టించాడు. (ఆదికాండము 1:⁠2; కీర్తన 33:⁠6) ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ అని పిలువబడుతోంది. దేవుడు, బైబిలు వ్రాసిన వ్యక్తులను ప్రేరేపించడానికి తన పరిశుద్ధాత్మను ఉపయోగించాడు. (2 పేతురు 1:​20, 21) కాబట్టి, పరిశుద్ధాత్మ కంటికి కనిపించని చురుకైన శక్తి, దేవుడు దాన్ని తన సంకల్పాలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకుంటాడు.

దేవునికి ఒక విశిష్టమైన నామముంది

బైబిలు రచయిత ఆగూరు ఇలా అడిగాడు: “తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించినవాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా?” (సామెతలు 30:⁠4) నిజానికి ఆగూరు, ‘వీటిని చేసిన మానవుడెవరైనా ఉంటే అతని పేరుగానీ, వంశంగానీ మీకు తెలుసా?’ అని అడుగుతున్నాడు. ప్రకృతి శక్తులను అదుపుచేసే శక్తి కేవలం దేవునికి మాత్రమే ఉంది. దేవుడు ఉనికిలో ఉన్నాడనడానికి శక్తివంతమైన రుజువును సృష్టి ఇస్తున్నా, ఆయన నామము విషయంలో అది నిశ్శబ్దంగా ఉంది. నిజానికి, దేవుడు స్వయంగా తన నామమును మనకు తెలియజేయనిదే, మనం ఆయన నామమును ఎన్నటికీ తెలుసుకోలేము. ఆయన దాన్ని వెల్లడిచేశాడు. “యెహోవాను నేనే; ఇదే నా నామము” అని సృష్టికర్త చెబుతున్నాడు.​—⁠యెషయా 42:⁠8.

దేవుని విశిష్టమైన నామము యెహోవా, ఇది కేవలం హీబ్రూ లేఖనాల్లోనే దాదాపు 7,000 సార్లు కనబడుతుంది. యేసుక్రీస్తు ఆ నామమును ఇతరులకు తెలియజేసి, వారిముందు దాన్ని స్తుతించాడు. (యోహాను 17:​6, 26) బైబిలులోని చివరి పుస్తకంలో ఆ నామము ‘ప్రభువును [“యెహోవాను,” NW] స్తుతించుడి’ అని అర్థాన్నిచ్చే “అల్లెలూయా” అనే పదంలో భాగంగా కనబడుతుంది. “యా” అన్నది “యెహోవా” అనే మాటకు క్లుప్తరూపం. (ప్రకటన 19:​1-6, అధస్సూచి) అయినా, అనేక ఆధునిక బైబిళ్ళు ఆ నామమును అతి తక్కువగా ఉపయోగిస్తాయి. అవి తరచుగా సాధారణ బిరుదులైన “ప్రభువు,” “దేవుడు” అనే వాటి నుండి భిన్నంగా చూపించేందుకు “ప్రభువు” లేక “దేవుడు” అనే పదాలను ముద్దక్షరాల్లో వ్రాస్తాయి. కొందరు విద్వాంసులు దేవుని నామము యాహ్వే అని ఉచ్ఛరించబడివుండవచ్చు అని సూచిస్తున్నారు.

విశ్వంలోనే మహోన్నతుడైన ఒక వ్యక్తి నామము గురించి ఎందుకు ఇన్ని విభిన్నమైన దృక్కోణాలు ఉన్నాయి? శతాబ్దాల క్రితం, యూదులు లేఖనాలను చదివేటప్పుడు దేవుని నామమును చదవాల్సి వచ్చినప్పుడల్లా మూఢనమ్మకంతో దేవుని నామమును ఉచ్ఛరించడం మానేసి, దానికి బదులుగా “సర్వోన్నతుడైన ప్రభువు” అని అర్థంగల హీబ్రూ పదాన్ని ఎప్పుడైతే ఉపయోగించడం మొదలుపెట్టారో అప్పుడే ఈ సమస్య ప్రారంభమైంది. బైబిలు సంబంధిత హీబ్రూ భాష అచ్చులు లేకుండా వ్రాయబడింది కాబట్టి, మోషే దావీదులతోపాటు ప్రాచీనకాలంనాటి ఇతరులు దేవుని నామమును రూపొందించే ఆ అక్షరాలను ఖచ్చితంగా ఎలా ఉచ్ఛరించారో తెలుసుకోవడం అసాధ్యం. అయినప్పటికీ, తెలుగులో యెహోవా అనే ఉచ్ఛారణ శతాబ్దాలుగా ఉపయోగించబడుతోంది, దీనికి సమానమైనదే నేడు ఇతర భాషల్లోనూ విస్తృతంగా వ్యాప్తిలో ఉంది.​—⁠నిర్గమకాండము 6:⁠3; యెషయా 26:⁠4.

ప్రాచీన హీబ్రూలో దేవుని నామమును ఎలా ఉచ్ఛరించేవారో ఖచ్చితంగా తెలియకపోయినప్పటికీ, దాని అర్థం పూర్తిగా తెలియనిదేమీ కాదు. ఆయన నామమునకు అర్థం “తానే కర్త అవుతాడు.” దాన్నిబట్టి యెహోవా దేవుడు తనను తాను గొప్ప సంకల్పకర్తగా తెలియజేసుకొంటున్నాడు. ఆయన ఎల్లప్పుడూ తన సంకల్పాలు, వాగ్దానాలు నిజమయ్యేలా చేస్తాడు. అలా చేసే శక్తిగల సత్య దేవునికి మాత్రమే ఆ నామం ఉండడం తగినది.​—⁠యెషయా 55:​11.

యెహోవా నామము, ఇతర దేవుళ్ళందరి నుండి సర్వోన్నతుడైన దేవుణ్ణి ప్రత్యేకపరచేందుకు ఉపయోగపడుతుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అందుకే ఆ నామము బైబిలులో చాలా తరచుగా కనబడుతుంది. అనేక అనువాదాలు దేవుని నామమును ఉపయోగించడంలో విఫలమైనప్పటికీ, కీర్తన 83:⁠18 స్పష్టంగా ఇలా చెబుతోంది: ‘యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవు.’ యేసుక్రీస్తు తన పరిచర్య కాలంలో, తన అనుచరులకు ఇలా బోధించాడు: “కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి​—⁠పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక.” (మత్తయి 6:⁠9) కాబట్టి, మనం ప్రార్థన చేసేటప్పుడు, ఆయన గురించి మాట్లాడేటప్పుడు, ఇతరుల ముందు ఆయనను స్తుతించేటప్పుడు ఆయన నామమును ఉపయోగించాలి.

యేసు దేవుడా?

యెహోవా దేవుడు స్వయంగా తన కుమారుని గుర్తింపు విషయంలో ఎటువంటి సందేహాలు లేకుండా చేశాడు. యేసు బాప్తిస్మం పొందిన తర్వాత, “ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను” అని మత్తయి సువార్త వృత్తాంతం చెబుతోంది. (మత్తయి 3:​16, 17) యేసుక్రీస్తు దేవుని కుమారుడు.

అయినా, కొందరు దైవభక్తిగలవారు యేసే దేవుడు అని అంటారు. మరికొందరు దేవుడు త్రిత్వము అంటారు. ఈ బోధ ప్రకారం, “తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అయినా ముగ్గురు వేర్వేరు దేవుళ్ళు కాదు కానీ ఒకే దేవుడు.” ఈ ముగ్గురు “నిత్యులు, సమానులు” (ద క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా) అని విశ్వసించబడుతోంది. ఇలాంటి దృక్కోణాలు సరైనవేనా?

యెహోవా గురించి ప్రేరేపిత లేఖనాలు ఇలా చెబుతున్నాయి: “యుగయుగములు నీవే దేవుడవు.” (కీర్తన 90:⁠2) ఆయన ఆరంభముగానీ అంతముగానీ లేని ‘సకల యుగములలో రాజు.’ (1 తిమోతి 1:​17) మరో ప్రక్కన యేసు, ‘సర్వసృష్టికి ఆదిసంభూతుడు,’ “దేవుని సృష్టికి ఆది.” (కొలొస్సయులు 1:​13-15; ప్రకటన 3:​14) దేవుణ్ణి తన తండ్రిగా సంబోధిస్తూ, “తండ్రి నాకంటె గొప్పవాడు” అని యేసు అన్నాడు. (యోహాను 14:​28) కొన్ని విషయాల గురించి తనకుగానీ, దేవదూతలకుగానీ తెలియదు, అయితే దేవునికి మాత్రం తెలుసు అని కూడా యేసు స్పష్టంగా చెప్పాడు. (మార్కు 13:​32) అంతేగాక, యేసు తన తండ్రికి ఇలా ప్రార్థించాడు: “నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక.” (లూకా 22:​42) ఆయన ప్రార్థించింది తన కంటే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తికి కాక మరెవరికి? యేసును మరణం నుండి పునరుత్థానం చేసింది దేవుడే, యేసు తనను తాను పునరుత్థానం చేసుకోలేదు.​—⁠అపొస్తలుల కార్యములు 2:​32.

కాబట్టి, లేఖనానుసారంగా యెహోవా సర్వోన్నతుడైన దేవుడు, యేసు ఆయన కుమారుడు. యేసు భూమిపైకి రావడానికి ముందుగానీ, ఆయన భూలోక జీవిత సమయంలోగానీ వారిద్దరు సమానులు కారు; పునరుత్థానం చేయబడి పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా యేసు తన తండ్రికి సమానుడు కాలేదు. (1 కొరింథీయులు 11:⁠3; 15:​28) మనం చూసినట్లుగా, త్రిత్వములోని మూడవ వ్యక్తి అని చెప్పబడే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి కాదు. కానీ, అది ఒక శక్తి, దేవుడు తాను కోరుకొన్నదాన్ని నెరవేర్చడానికి దాన్ని ఉపయోగిస్తాడు. అలాంటప్పుడు, త్రిత్వము లేఖనానుసారమైన బోధ కాదు. * “మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా” అని బైబిలు చెబుతోంది.​—⁠ద్వితీయోపదేశకాండము 6:⁠4.

దేవుణ్ణి మరింత బాగా తెలిసికోవడం

దేవుణ్ణి ప్రేమించడానికి, ఆయనకే చెందాల్సిన సంపూర్ణ ఆరాధనను ఆయనకు చెల్లించడానికి, మనం ఆయన నిజంగా ఎలాంటివాడో తెలిసికోవలసిన అవసరం ఉంది. మనం దేవుణ్ణి మరింత బాగా ఎలా తెలిసికోవచ్చు? “ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి” అని బైబిలు చెబుతోంది. (రోమీయులు 1:​20) దేవుని గురించి మరింత బాగా తెలిసికొనేందుకు ఒక మార్గమేమిటంటే, ఆయన సృష్టించిన వాటిని గమనిస్తూ, కృతజ్ఞతతో ఆలోచించడం.

అయితే, దేవుని గురించి తెలిసికోవలసిన వాటన్నింటి గురించి సృష్టి మనకు చెప్పదు. ఉదాహరణకు, ఆయన ఒక విశిష్టమైన నామమున్న నిజమైన ఆత్మ ప్రాణి అని గ్రహించడానికి, మనం బైబిలులోకి చూడాల్సిన అవసరం ఉంది. నిజానికి, దేవుణ్ణి మరింతగా తెలిసికోవడానికి బైబిలు అధ్యయనం చక్కని మార్గం. యెహోవా తాను ఎలాంటి దేవుడననే విషయం లేఖనాల్లో మనకు మరింత బాగా చెబుతాడు. ఆయన తన సంకల్పాలను కూడా మనకు బయలుపరుస్తాడు, తన మార్గాల గురించి మనకు బోధిస్తాడు. (ఆమోసు 3:⁠7; 2 తిమోతి 3:​16, 17) మనం దేవుని ప్రేమపూర్వకమైన ఏర్పాట్ల నుండి ప్రయోజనం పొందగలిగేలా మనం “సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగల” వారమై ఉండాలని కోరుకుంటున్నందుకు మనమెంత సంతోషించాలి! (1 తిమోతి 2:⁠4) కాబట్టి, యెహోవా గురించి మనకు సాధ్యమైనదంతా తెలుసుకోవడానికి ప్రతి ప్రయత్నం మనం చేద్దాం.

[అధస్సూచి]

^ పేరా 19 ఈ అంశంపై వివరణాత్మకమైన పరిశీలన కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన త్రిత్వమును మీరు నమ్మవలయునా? అనే బ్రోషురును చూడండి.

[5వ పేజీలోని చిత్రాలు]

దేవుడు ఈ భూమిని సృష్టించడానికి, బైబిలు వ్రాసేందుకు మనుష్యులను ప్రేరేపించడానికి తన పరిశుద్ధాత్మను ఉపయోగించాడు

[5వ పేజీలోని చిత్రం]

ఆకాశమునుండి ఒక శబ్దము ఇలా వినబడింది: “ఈయనే నా ప్రియ కుమారుడు”

[7వ పేజీలోని చిత్రం]

యేసు తనకంటే ఉన్నతుడైన వ్యక్తికి అంటే దేవునికి ప్రార్థించాడు

[7వ పేజీలోని చిత్రం]

దేవుని నామమును యేసు ఇతరులకు తెలియజేశాడు

[7వ పేజీలోని చిత్రాలు]

దేవుణ్ణి మనం మరింత బాగా తెలిసికోవచ్చు