కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడెవరో తెలిసికోవలసిన అవసరం మనకుంది

దేవుడెవరో తెలిసికోవలసిన అవసరం మనకుంది

దేవుడెవరో తెలిసికోవలసిన అవసరం మనకుంది

మేఘాల్లేని ఒక రాత్రి, నిండా నక్షత్రాలు పరచుకున్నట్లున్న నిర్మలమైన ఆకాశాన్ని చూసి మీరు పులకరించిపోరా? రంగురంగుల పువ్వుల పరిమళాలు హర్షదాయకం కావా? గాలి తెమ్మెరలో వినబడే పక్షుల కిలకిలారావాలకు, ఆకుల సవ్వడికి మీరు సంతోషించరా? సముద్రంలో ఉండే శక్తివంతమైన తిమింగలాలు, ఇంకా ఇతర నీటి జంతువులు ఎంతగానో మనలను మంత్రముగ్ధులను చేస్తాయి! అంతేకాదు స్వతహాగా ఉండే మనస్సాక్షి మాత్రమేకాక అత్యంత అద్భుతమైన, సంక్లిష్టమైన మెదడు గల మానవులు కూడా ఉన్నారు. మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన వాటన్నింటి ఉనికి గురించి మీరు ఏమని వివరిస్తారు?

ఇవన్నీ యాదృచ్ఛికంగా ఉనికిలోకి వచ్చాయి అని కొందరు నమ్ముతారు. అదే గనుక నిజమైతే, మానవులకు దేవుని ధ్యాస ఎందుకు ఉంటుంది? విభిన్నమైన రసాయనిక పదార్థాలవల్ల ఏర్పడిన ఒక కాకతాళీయ మిశ్రమం ఆధ్యాత్మిక అవసరం గల జీవులను ఎందుకు ఉత్పత్తి చేస్తుంది?

“మానవనైజంలో మతము చాలా లోతుగా పాతుకుపోవడమేగాక, అన్ని స్థాయిల్లోని ఆర్థిక హోదాలవారు, విద్యాభ్యాస నేపథ్యాలవారు దాన్ని చవిచూశారు.” ఈ వ్యాఖ్యానం, ప్రొఫెసర్‌ అలిస్టర్‌ హార్డీ మానవుని ఆధ్యాత్మిక నైజం (ఆంగ్లం) అనే తన పుస్తకంలో అందజేసిన పరిశోధన గురించి టూకీగా తెలియజేస్తుంది. కొందరు న్యూరోసైంటిస్టులు, మానవులు మతాన్ని అభ్యసించే సామర్థ్యంతో “జన్యువులు రూపొందించబడి” ఉండవచ్చు అని చెప్పేందుకు మెదడు మీద చేసిన ఇటీవలి ప్రయోగాలు నడిపించాయి. దేవుడే ఏకైక వాస్తవమా? (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా వ్యాఖ్యానిస్తోంది: “మతం ద్వారా అర్థాన్ని వెతకడం . . . మానవజాతి ఉనికిలోకి వచ్చినప్పటినుండి ప్రతి నాగరికతలోనూ, ప్రతి యుగంలోనూ సాధారణంగా ఉన్న విషయమే.”

దాదాపు 2,000 సంవత్సరాల క్రితం ఒక విద్యావంతుడు ఎలాంటి ముగింపుకు వచ్చాడో గమనించండి. ఆయనిలా వ్రాశాడు: “ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే.” (హెబ్రీయులు 3:​3, 4) వాస్తవానికి బైబిలులోని మొట్టమొదటి వచనమే ఇలా చెబుతోంది: “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.”​—⁠ఆదికాండము 1:⁠1.

అయితే, ఆ దేవుడు ఎవరు? ఈ ప్రశ్నకు సంబంధించి మానవజాతికి విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. దేవుడెవరు అని అడిగినప్పుడు, జపానుకు చెందిన యోషి అనే ఒక టీనేజ్‌ అబ్బాయి ఇలా జవాబిచ్చాడు: “నాకు ఖచ్చితంగా తెలియదు. నేను ఒక బౌద్ధ మతస్థుడ్ని, దేవుడెవరో తెలుసుకోవలసిన ప్రాముఖ్యత నాకు ఇంతవరకూ కనిపించలేదు.” అయితే చాలామంది బుద్ధుడే దేవుడని అంగీకరిస్తున్నారన్న విషయాన్ని యోషి ఒప్పుకున్నాడు. 60వ పడిలో ఉన్న నిక్‌ అనే ఒక వ్యాపారవేత్తకు దేవునిపై నమ్మకం ఉంది, ఆ దేవుడు బలమైన ఒక శక్తి అని ఆయన భావిస్తున్నాడు. దేవుని గురించి తనకు తెలిసినదాన్ని వివరించి చెప్పమని అడిగినప్పుడు, నిక్‌ చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయి ఆ తరువాత ఇలా జవాబిచ్చాడు: “మిత్రమా, అది చాలా క్లిష్టమైన ప్రశ్న. నేను చెప్పగలిగిందల్లా ఒక్కటే, దేవుడు ఉన్నాడు. ఆయన ఉనికిలో ఉన్నాడు.”

కొంతమంది, “సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి” సేవిస్తారు. (రోమీయులు 1:​25) లక్షలాదిమంది దేవుడు తాము చేరుకోలేనంత దూరంలో ఉన్నాడన్న నమ్మకంతో, మరణించిన తమ పూర్వికులను ఆరాధిస్తారు. హిందూ మతంలో అనేకమంది దేవతలు, దేవుళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు అపొస్తలుల కాలంలో ద్యుపతి, హెర్మేవంటి విభిన్నమైన దేవతలు పూజించబడ్డారు. (అపొస్తలుల కార్యములు 14:​11, 12) క్రైస్తవ మతసామ్రాజ్యపు అనేక చర్చీలు దేవుడైన తండ్రి, దేవుడైన కుమారుడు, దేవుడైన పరిశుద్ధాత్మలు ఇమిడివున్న త్రిత్వమే దేవుడు అని బోధిస్తాయి.

నిజమే, “దేవతలనబడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు” అని బైబిలు చెబుతోంది. అయితే అది ఇంకా ఇలా చెబుతోంది: “మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయన నుండి సమస్తమును కలిగెను.” (1 కొరింథీయులు 8:​5, 6) అవును, నిజమైన దేవుడు ఒక్కడే ఉన్నాడు. కానీ ఆ దేవుడు ఎవరు? ఆయన ఎలా ఉంటాడు? ఈ ప్రశ్నలకు జవాబు తెలిసికోవడం మనకు చాలా ప్రాముఖ్యం. ఆ దేవునికే ప్రార్థిస్తూ, యేసు ఇలా అన్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:⁠3) దాన్నిబట్టి, దేవుని గురించిన సత్యం తెలిసికోవడంపైనే మన శాశ్వత సంక్షేమం ఆధారపడివుందని నమ్మడానికి కారణముంది.

[3వ పేజీలోని చిత్రం]

వీటి ఉనికి గురించి ఏమని వివరించవచ్చు?

[చిత్రసౌజన్యం]

తిమింగలం: Courtesy of Tourism Queensland

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

కవరు: Index Stock Photography © 2002