కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

చర్చిలో జరిగే అంత్యక్రియలకుగానీ, వివాహానికిగానీ ఒక నిజ క్రైస్తవుడు హాజరవడం సరైనదేనా?

మనం అబద్ధ మతానికి సంబంధించిన దేనిలో పాల్గొన్నా అది యెహోవాకు కోపం తెప్పిస్తుంది, అటువంటి వాటికి ఖచ్చితంగా మనం దూరంగా ఉండాలి. (2 కొరింథీయులు 6:​14-18; ప్రకటన 18:⁠4) చర్చిలో జరిగే అంత్యక్రియలు మతానికి సంబంధించినవి, వాటిలో ఆత్మ అమర్త్యమైనది, మంచి వాళ్ళందరూ పరలోకానికి వెళతారు అనే లేఖనవిరుద్ధమైన భావాలను సమర్థించే ప్రసంగం ఉండవచ్చు. అంతేగాక సిలువ గుర్తు వేసుకోవడం, ప్రీస్టుతో లేదా పాదిరితో కలిసి ప్రార్థనలో పాల్గొనడం వంటి ఆచారాలు కూడా వాటిలో ఉండవచ్చు. ప్రార్థనలు, బైబిలు బోధకు విరుద్ధమైన ఇతర మత సంబంధమైన చర్యలు కూడా చర్చిలో లేదా మరెక్కడైనా జరిగే మతపర వివాహ లాంఛనాల్లో భాగమై ఉండవచ్చు. ఒక గుంపు అబద్ధ మతానికి సంబంధించిన ఒక చర్యలో పాల్గొంటుండగా, వారితోనే ఉంటూ ఆ చర్యలో మాత్రం పాల్గొనకుండా ఉండడం ఒక క్రైస్తవుడికి ఇబ్బందిగా ఉండవచ్చు. ఒక వ్యక్తి తనను తాను అలాంటి ఒత్తిడికి గురిచేసుకోవడం ఎంత మూర్ఖత్వమో కదా!

చర్చిలో జరిగే అంత్యక్రియలకుగానీ, వివాహానికిగానీ హాజరు కావడం తన బాధ్యత అని ఒక క్రైస్తవుడు భావించినప్పుడు ఎలా? ఉదాహరణకు, అటువంటి ఒక సందర్భంలో అవిశ్వాసియైన భర్త, తన భార్యను తనతో రమ్మని పట్టుబడుతుండవచ్చు. కేవలం ప్రేక్షకురాలిలా మాత్రమే ఆమె ఆయనతో వెళ్ళవచ్చా? ఆమె తన భర్త కోరికను మన్నిస్తూ, అక్కడ జరిగే మతసంబంధమైన ఎలాంటి లాంఛనాల్లోనూ పాల్గొనకూడదని నిర్ధారించుకొని, ఆయనతో వెళ్ళడానికి నిర్ణయించుకోవచ్చు. మరో ప్రక్కన, అక్కడి పరిస్థితులు తనపై కలిగించే మానసిక ఒత్తిడిని తను తట్టుకోవడం కష్టం, బహుశా దేవుని సూత్రాలతో రాజీపడాల్సి వస్తుందేమోనని భావించినప్పుడు, వెళ్ళకూడదని కూడా ఆమె నిర్ణయించుకోవచ్చు. తుది నిర్ణయం ఆమెదే. ఆమె నిబ్బరమైన హృదయంతో, స్వచ్ఛమైన మనస్సాక్షితో ఉండాలని తప్పకుండా కోరుకుంటుంది.​—⁠1 తిమోతి 1:​19.

సందర్భం ఏదైనా, మతసంబంధమైన ఎటువంటి ఆచారాల్లోనూ పాలుపంచుకొనేందుకు లేక భజనలో కలిసి పాడేందుకు లేక ప్రార్థించేటప్పుడు తలవంచుకునేందుకు తన మనస్సాక్షి ఒప్పుకోదని తన భర్తకు వివరించి చెప్పడం ఆమెకే ఉపయోగకరంగా ఉంటుంది. ఆమె వివరించిన దాని ఆధారంగా, తన భార్య అక్కడికి రావడం వల్ల తనకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుండవచ్చు అనే ముగింపుకు ఆయన రావచ్చు. ఆయన తన భార్యమీది ప్రేమతో, ఆమె విశ్వాసాలను గౌరవిస్తూ లేదా తనకు అసంతృప్తి కలిగించే పరిస్థితికి గురికాకూడదనే ఉద్దేశంతో తనొక్కడే వెళ్ళడానికి ఇష్టపడవచ్చు. అయితే తనతో రమ్మని ఆయన ఒకవేళ పట్టుబడితే, కేవలం ప్రేక్షకురాలిగా ఆమె ఆయనతో వెళ్ళవచ్చు.

మతానికి సంబంధించిన ఒక భవనంలో మనం దేనికైనా హాజరవడంవల్ల, అది మన తోటి విశ్వాసులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా ఆలోచించాలి. అది కొందరి మనస్సాక్షికి హాని కలిగిస్తుందా? విగ్రహారాధనకు దూరంగా ఉండాలని వారు చేస్తున్న ప్రతిఘటనను బలహీనపరుస్తుందా? “క్రీస్తుదినం వరకూ నిష్కపటులై, ఏ అభ్యంతరమూ కలిగించనివారై ఉండేలా ఏవి శ్రేష్టమో వాటినే” వివేచించమని అపొస్తలుడైన పౌలు ఉద్బోధించాడు.​—⁠ఫిలిప్పీయులు 1:​10, 11, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.

ఆ సందర్భం ఒకవేళ చాలా దగ్గరి బంధువుకు సంబంధించినదైతే, కుటుంబంనుండి అదనపు ఒత్తిళ్ళు రావచ్చు. ఏదేమైనా, ఒక క్రైస్తవుడు దాంట్లో ఇమిడివున్న వాస్తవాలన్నింటిని జాగ్రత్తగా పరిశీలించి బేరీజు వేసుకోవాలి. కొన్ని పరిస్థితుల్లో ఆయన లేక ఆమె చర్చిలో జరిగే అంత్యక్రియలకుగానీ వివాహానికిగానీ కేవలం ప్రేక్షకులవలె హాజరవడంవల్ల సమస్యలేమీ తలెత్తవని తలంచవచ్చు. అయితే, అలా హాజరవడం వల్ల కలిగే ప్రయోజనాల కంటే, హాజరైన వ్యక్తి యొక్క మనస్సాక్షికి లేదా ఇతరుల మనస్సాక్షికి కలిగే హానే ఎక్కువగా ఉండవచ్చు. పరిస్థితి ఎటువంటిదైనా, తను తీసుకొనే నిర్ణయం దేవుని ముందుగానీ ప్రజల ముందుగానీ తన మంచి మనస్సాక్షిని కాపాడుకొనడంలో భంగం వాటిల్లకుండా ఆ క్రైస్తవుడు/రాలు నిర్ధారించుకోవాలి.