యథార్థవంతుల యథార్థత వారిని నడిపిస్తుంది
యథార్థవంతుల యథార్థత వారిని నడిపిస్తుంది
“స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును” అని బైబిలు చెబుతోంది. (యోబు 14:1) మానవుని జీవితంలో బాధ, దుఃఖం సర్వసాధారణమన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే, దైనందిన జీవితం కూడా పూర్తిగా చింతలు, అల్లకల్లోలంతో నిండివుండగలదు! కష్టభరితమైన పరిస్థితులలో విజయవంతంగా మనల్ని ఏది ముందుకు నడిపిస్తుంది? దేవుని ఎదుట నీతియుక్తమైన స్థానాన్ని కాపాడుకొనేందుకు మనకు ఏది సహాయం చేస్తుంది?
ప్రస్తుతం అరేబియాగా పిలువబడుతున్న ప్రాంతంలో, దాదాపు 3,500 సంవత్సరాల క్రితం నివసించిన యోబు అనే సంపన్నుడైన వ్యక్తి మాదిరిని పరిశీలించండి. దైవభయం గల ఈ పురుషునిపైకి సాతాను ఎంతటి విపత్తును తెచ్చాడో కదా! ఆయన తన పశువులన్నింటినీ కోల్పోయాడు, తన ప్రియమైన పిల్లలను మరణంలో పోగొట్టుకున్నాడు. తర్వాత కొద్దికాలానికే సాతాను, యోబుకు అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులయ్యేలా చేశాడు. (యోబు 1, 2 అధ్యాయాలు) తనకు ఈ విపత్తులు ఎందుకు సంభవిస్తున్నాయో యోబుకు తెలియదు. అయినప్పటికీ, “యోబు నోటిమాటతోనైనను పాపము చేయలేదు.” (యోబు 2:10) “మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను” అని ఆయన అన్నాడు. (యోబు 27:5) అవును, యోబు యథార్థత ఆయన కష్టాలలో ఉన్నప్పుడు ఆయనకు త్రోవ చూపించింది.
యథార్థత, నైతిక దృఢత్వం లేక సంపూర్ణత్వం అని నిర్వచించబడింది, దేవుని దృష్టిలో నిష్కళంకంగా, నిర్దోషిగా ఉండడం అనే భావం కూడా దానికి ఉంది. అయితే దానర్థం, దేవుని ప్రమాణాలకు పూర్తి అనుగుణంగా జీవించడం సాధ్యంకాని అపరిపూర్ణ మానవుల మాటల్లో, చర్యల్లో పరిపూర్ణత అని మాత్రం కాదు. బదులుగా మానవ యథార్థత, పూర్తి లేక సంపూర్ణ హృదయంతో యెహోవాపట్ల, ఆయన చిత్తంపట్ల, ఆయన సంకల్పంపట్ల భక్తిపూర్వకంగా ఉండడాన్ని సూచిస్తుంది. అలాంటి దైవభక్తి, యథార్థవంతులకు అన్ని పరిస్థితుల్లోనూ, అన్ని సమయాల్లోనూ మార్గదర్శకాన్ని లేదా నడిపింపును ఇస్తుంది. బైబిలు పుస్తకమైన సామెతలు, 11వ అధ్యాయంలోని మొదటి భాగం, మన జీవితంలోని విభిన్నమైన సందర్భాల్లో మన యథార్థత మనలను ఎలా నడిపించగలదో చూపిస్తుంది, అది ఆ నడిపింపును అనుసరించడంవల్ల లభించే ఆశీర్వాదాల గురించి హామీ ఇస్తుంది. కాబట్టి, అక్కడ వ్రాయబడి ఉన్నదాన్ని మనం శ్రద్ధగా పరిశీలిద్దాం.
వ్యాపారంలో నిజాయితీగా ఉండేలా యథార్థత నడిపిస్తుంది
నిజాయితీ సూత్రాన్ని నొక్కి చెబుతూ ప్రాచీన ఇశ్రాయేలు రాజు సొలొమోను, చట్టపరమైన పరిభాషతో కాకుండా కవిత్వ రూపంలో ఇలా అన్నాడు: “దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము.” (సామెతలు 11:1) తన ఆరాధకులు తమ వ్యాపార వ్యవహారాల్లో నిజాయితీగా ఉండాలని యెహోవా కోరుతున్నాడని సూచించేందుకు త్రాసు, తూనికరాళ్లు అనే పదాల ఉపయోగం సామెతలు పుస్తకంలో కనబడడం ఇది మొదటిసారి, ఆ పదాలు ఈ పుస్తకంలో మొత్తం నాలుగుసార్లు కనబడతాయి.—సామెతలు 16:11; 20:10, 23.
దొంగత్రాసును—లేదా వంచనను—ఆశ్రయించే వారి సంపత్తి మనల్ని ఆశగొలిపేలా ఉండవచ్చు. కానీ మనం అవినీతికరమైన వ్యాపార లావాదేవీల్లో పడిపోయి మంచి చెడులకు సంబంధించిన దేవుని ప్రమాణాలను నిజంగా వదిలేయాలనుకుంటామా? మనం యథార్థత చేత నడిపించబడినట్లైతే అలా అనుకోము. మనం అవినీతికి దూరంగా ఉంటాం, ఎందుకంటే న్యాయమైన తూనికరాళ్లు అంటే ఖచ్చితమైన తూకం నిజాయితీకి సూచన, అది యెహోవాను సంతోషపరుస్తుంది.
“వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది”
సొలొమోను రాజు ఇంకా ఇలా అంటున్నాడు: “అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.” (సామెతలు 11:2) అహంకారం—అది గర్వం రూపంలో, అవిధేయత రూపంలో లేక అసూయ రూపంలో ఎలా వ్యక్తం చేయబడినప్పటికీ—అవమానం పాలుచేస్తుంది. మరో ప్రక్కన, మన పరిమితులను మనం వినయంగా గుర్తించడం జ్ఞానవంతమైన మార్గం. లేఖనాధారిత ఉదాహరణలు ఈ సామెతలోని సత్యాన్ని ఎంత చక్కగా స్పష్టం చేస్తున్నాయో కదా!
కోరహు అసూయపరుడైన ఒక లేవీయుడు. ఆయన, తిరుగుబాటుదారుల ఒక మూకను, యెహోవా నియమించిన సేవకులైన మోషే అహరోనుల అధికారానికి విరోధంగా నడిపించాడు. ఆ అహంకారపు చర్యకు పర్యవసానం ఏమిటి? “భూమి తన నోరు తెరచి,” కోరహుతోపాటు కొందరు తిరుగుబాటుదారులను “మ్రింగివేసెను.” ఇతరులు అగ్నిచేత కాల్చివేయబడ్డారు. (సంఖ్యాకాండము 16:1-3, 16-35; 26:10; ద్వితీయోపదేశకాండము 11:6) ఎంతటి అవమానకరం! నిబంధన మందసం పడిపోకుండా అహంకారంతో ముందుకువెళ్లి పట్టుకున్న ఉజ్జా గురించి కూడా ఆలోచించండి, ఆయన అక్కడికక్కడే మరణించాడు. (2 సమూయేలు 6:3-8) అహంకారానికి దూరంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో కదా!
వినయవిధేయతలుగల వ్యక్తి, పొరపాట్లు చేసినా అవమానానికి గురికాడు. యోబు అనేక విధాలుగా మాదిరికరంగా ఉన్నప్పటికీ, ఆయన కూడా అపరిపూర్ణుడే. ఆయన పడ్డ కష్టాలు, ఆయన ఆలోచనల్లోని కొన్నింటిలో ఉన్న ఒక గంభీరమైన లోపాన్ని బహిర్గతం చేశాయి. తనను నిందిస్తున్న వారికి వ్యతిరేకంగా తనను తాను సమర్థించుకోవడంలో, యోబు తన సమతుల్యతను కొంతమేరకు కోల్పోయాడు. ఆయన చివరికి తాను దేవునికంటే నీతిమంతుడనన్నట్లు కూడా సూచించాడు. (యోబు 35:2, 3) యోబు ఆలోచనను యెహోవా ఎలా సరిదిద్దాడు?
భూమిని, సముద్రమును, నక్షత్రాలతో నిండివున్న ఆకాశమును, కొన్ని జంతువులతోపాటు సృష్టిలోని ఇతర అద్భుతమైన వాటిని చూపిస్తూ, దేవుని గొప్పతనం ముందు మానవుని అల్పత్వం గురించిన ఒక పాఠం యెహోవా యోబుకు నేర్పించాడు. (యోబు 38-41 అధ్యాయాలు) యెహోవా తన మాటల్లో ఎక్కడ కూడా యోబు కష్టాలను ఎందుకు అనుభవిస్తున్నాడో చెప్పలేదు. చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు. ఎందుకంటే యోబు అణకువగల మనిషి. తనకు దేవునికి, తన అపరిపూర్ణతకు బలహీనతలకు, యెహోవా నీతికి బలానికి మధ్యనున్న గొప్ప వ్యత్యాసాన్ని ఆయన వినయంగా గుర్తించాడు. “నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను” అని ఆయన అన్నాడు. (యోబు 42:6) మందలింపును వెంటనే అంగీకరించేలా యోబు యథార్థత ఆయనను నడిపించింది. మరి మన విషయమేమిటి? మనల్ని కూడా యథార్థత నడిపిస్తుందా, మందలింపుగానీ దిద్దుబాటుగానీ అవసరమైనప్పుడు దాన్ని మనం వెంటనే అంగీకరిస్తామా?
మోషే కూడా వినయవిధేయతలుగల వ్యక్తి. ఆయన ఇతరుల సమస్యలపై శ్రద్ధ చూపిస్తూ సతమతమవుతున్నప్పుడు, ఆయన మామ యిత్రో యోగ్యులైన ఇతరులతో కొన్ని బాధ్యతలను పంచుకోమంటూ ఆయనకు ఒక ఆచరణాత్మకమైన పరిష్కారం చూపించాడు. మోషే తన పరిమితులను గుర్తించి, ఆ సలహాను బుద్ధిపూర్వకంగా అంగీకరించాడు. (నిర్గమకాండము 18:17-26; సంఖ్యాకాండము 12:3) వినయంగల ఒక వ్యక్తి, తన అధికారాన్ని ఇతరులతో పంచుకోవడానికి వెనకాడడు, యోగ్యులైన ఇతరులతో తగిన బాధ్యతలను పంచుకోవడంవల్ల ఏదో ఒకవిధంగా తన అధికారం కోల్పోతానేమోనని భయపడడు. (సంఖ్యాకాండము 11:16, 17, 26-29) బదులుగా ఆయన, వారు ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు సహాయం చేయాలన్న కాంక్షతో ఉంటాడు. (1 తిమోతి 4:15) మన విషయంలోనూ అది నిజం కాదా?
“యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళము చేయును”
యథార్థవంతుణ్ణి అపాయము నుండి లేదా ఆపద నుండి యథార్థత అన్ని వేళలా కాపాడదు అని గుర్తించిన సొలొమోను ఇలా వ్రాశాడు: “యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖస్వభావము వారిని పాడుచేయును.” (సామెతలు 11:3) కష్టమైన పరిస్థితుల్లో కూడా, దేవుని దృష్టిలో సరైనది చేసేలా యథార్థత యథార్థవంతుణ్ణి నిజంగానే నడిపిస్తుంది, చివరికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. యోబు తన యథార్థతను విడిచిపెట్టడానికి ఒప్పుకోలేదు, అందుకే యెహోవా “యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను.” (యోబు 42:12) మోసం చేసేవారు, మరొకరికి నష్టం కలిగిస్తూ తమ పరిస్థితిని మెరుగుపరచుకుంటున్నట్టు భావిస్తుండవచ్చు, కొంతకాలం వర్ధిల్లుతున్నట్లు కూడా కనిపించవచ్చు. కానీ చిట్టచివరికి వారి వంచనే వారిని నాశనం చేస్తుంది.
“ఉగ్రతదినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణమునుండి రక్షించును” అని జ్ఞానియైన రాజు చెబుతున్నాడు. (సామెతలు 11:4) వస్తుసంపదలను పొందడం కోసం బాగా కష్టపడుతూ, దేవునిపై మన ప్రేమను ప్రగాఢం చేసే మరియు ఆయనపై మన భక్తిని బలపరచే వ్యక్తిగత అధ్యయనం, ప్రార్థన, కూటాలకు హాజరవడం, క్షేత్ర పరిచర్య వంటివాటికి సమయం లేకుండా చేసుకోవడం ఎంత అవివేకమో కదా! ఎంత సంపదైనా సరే రాబోతున్న మహాశ్రమ నుండి మనల్ని తప్పించదు. (మత్తయి 24:21) యథార్థవంతుని యథార్థత మాత్రమే తప్పిస్తుంది. (ప్రకటన 7:9, 14) అలాంటప్పుడు, మనం జెఫన్యా చేసిన ఈ విన్నపమును లక్ష్యపెట్టడం వివేకవంతమైనది: ‘యెహోవా ఉగ్రతదినము రాకమునుపే కూడిరండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించుడి.’ (జెఫన్యా 2:2, 3) ఈ లోగా, ‘మన ఆస్తిలో భాగమును [“విలువైన వాటిని,” NW] ఇచ్చి యెహోవాను ఘనపరచుటను’ మన లక్ష్యంగా చేసుకుందాం.—సామెతలు 3:9.
నీతిని అనుసరించడంలోని విలువను ఇంకా ప్రాముఖ్యంగా తెలియజేస్తూ, దుష్టునికి లభించే ప్రతిఫలానికీ యథార్థవంతునికి లభించే ప్రతిఫలానికీ మధ్యనున్న తేడా గురించి, సొలొమోను ఇలా చెబుతున్నాడు: “యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనతచేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశవలననే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలాఢ్యులైనవారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధనుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును.” (సామెతలు 11:5-8) యథార్థవంతుడు తన మార్గాల్లో పడిపోడు, తన వ్యవహారాల్లో ఇరుక్కుపోడు. ఆయన మార్గం సరాళమైనది. యథార్థవంతులు చివరికి బాధనుండి తప్పించబడతారు. దుష్టులు బలాఢ్యులుగా కనబడుతుండవచ్చు, కానీ విడుదలలాంటిదేమీ వారికి ఉండదు.
“పట్టణమునకు సంతోషకరము”
యథార్థవంతుల యథార్థతతోపాటు, చెడుచేసే వారి దుష్టత్వం కూడా ఇతరులపై ప్రభావం చూపిస్తుంది. “భక్తిహీనుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనము తెప్పించును, తెలివిచేత నీతిమంతులు తప్పించుకొందురు” అని ఇశ్రాయేలు రాజు అంటున్నాడు. (సామెతలు 11:9) అపనిందలు, హానికరమైన పుకార్లు, బూతులు, ఊసుపోని కబుర్లు లాంటివి ఇతరులకు హాని చేసేవి కావు అని ఎవరనగలరు? మరోప్రక్కన, ఒక యథార్థవంతుని మాటలు బాగా ఆలోచించి పలికినవి, స్వచ్ఛమైనవి, శ్రద్ధాపూరితమైనవి. పరిజ్ఞానం ద్వారా ఆయన రక్షించబడతాడు, ఎందుకంటే తనను నిందించేవారు అబద్ధం చెబుతున్నారని చూపించడానికి అవసరమైన రుజువును ఆయన యథార్థత సమకూరుస్తుంది.
“నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము,” అని చెబుతూ రాజు ఇంకా ఇలా అంటున్నాడు, “భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును.” (సామెతలు 11:10) సాధారణంగా నీతిమంతులు ఇతరులచేత ప్రేమించబడతారు, వాళ్ళు తమ పొరుగువారికి సంతోషం కలిగిస్తారు అంటే వారికి ఆనందం, ఉత్సాహం కలిగేలా చేస్తారు. “దుష్టులను” ఎవ్వరూ నిజంగా ప్రేమించరు. దుష్టులు చనిపోయినప్పుడు వారికోసం సాధారణంగా ప్రజలు సంతాపపడరు. యెహోవా ‘భక్తిహీనులను [“దుష్టులను,” NW] దేశములో నుండకుండ నిర్మూలం చేసినప్పుడు, విశ్వాసఘాతకులను దానిలోనుండి పెరికివేసినప్పుడు,’ ఎలాంటి దుఃఖము ఉండదనడంలో సందేహం లేదు. (సామెతలు 2:21, 22) దానికి బదులుగా, అక్కడ ఎంతో ఆనందం ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఇకపైన దుష్టులు కనబడరు. కానీ మన విషయం ఏమిటి? మనం ప్రవర్తించే తీరు ఇతరులకు సంతోషం కలిగించే విధంగా ఉందా లేదా అని మనం పరిశీలించుకోవడం మంచిది.
“పట్టణమునకు కీర్తి కలుగును”
ఒక సమాజం మీద యథార్థవంతులు చూపించే ప్రభావానికి, దుష్టులు చూపించే ప్రభావానికి మధ్యనున్న తారతమ్యాన్ని తెలియజేస్తూ సొలొమోను ఇంకా ఇలా అంటున్నాడు: “యథార్థవంతుల దీవెనవలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును.”—సామెతలు 11:11.
యథార్థమైన మార్గమును అనుసరించే పట్టణ ప్రజలు, శాంతి సంక్షేమాలను పెంపొందింపజేసి సమాజంలోని ఇతరుల ఉన్నతికి దోహదపడతారు. ఆ విధంగా పట్టణానికి కీర్తి కలుగుతుంది—అది వర్ధిల్లుతుంది. నిందించేవారు, మనసును గాయపరిచే మాటలను, తప్పుడు విషయాలను మాట్లాడేవారు అశాంతికి, విషాదానికి, అనైక్యతకు, కలతకు కారకులవుతారు. ముఖ్యంగా, ఇలాంటి వ్యక్తులు ప్రముఖ స్థానాల్లో ఉంటే అలా జరుగుతుంది. అలాంటి పట్టణం అలజడికి, అవినీతికి గురవుతుంది. నైతికంగా, బహుశా ఆర్థికంగా కూడా దిగజారిపోతుంది.
యెహోవా ప్రజలు పట్టణాలలాంటి తమ సంఘాల్లో ఒకరితో ఒకరు సహవాసం చేస్తున్నప్పుడు కూడా సామెతలు 11:11 లో పేర్కొన్న సూత్రం వర్తిస్తుంది. ఇతరులపై ప్రభావం చూపించే ఆధ్యాత్మిక ప్రజలున్న—యథార్థత చేత నడిపించబడే యథార్థవంతులున్న—ఒక సంఘం, సంతోషభరితులైన, క్రియాశీలురైన, సహాయకరమైన ప్రజల సముదాయం, అది దేవునికి ఘనతను తెస్తుంది. యెహోవా అలాంటి సంఘాన్ని ఆశీర్వదిస్తాడు, అది ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతుంది. అప్పుడప్పుడు, బహుశా అసంతుష్టితో అసంతృప్తితో ఉండే కొందరు, కార్య నిర్వహణా విధానం గురించి విమర్శించేవారు, మొదట్లో ప్రభావితులు కాని ఇతరులకు విషాన్ని వ్యాపింపజేసి విషపూరితం చేయగలిగే “చేదైన వేరు” వంటివారు. (హెబ్రీయులు 12:15) అలాంటివారు తరచుగా మరింత అధికారాన్ని, ప్రముఖ స్థానాన్ని కోరుకుంటారు. సంఘంలో లేదా పెద్దలలో అన్యాయముందని, జాతి భేదాలు లేదా అలాంటివి ఇంకేవో ఉన్నాయని పుకార్లు పుట్టిస్తారు. నిజానికి వారి నోరు, సంఘంలో విభజనకు కారణం కాగలదు. వారి మాటలు వినకుండా, సంఘంలో శాంతి ఐక్యతలకు దోహదపడే ఆధ్యాత్మిక ప్రజలుగా ఉండడానికి మనం కృషి చేయవద్దా?
సొలొమోను ఇంకా ఇలా అంటున్నాడు: “తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావముగలవాడు సంగతి దాచును.”—సామెతలు 11:12, 13.
సరైన వివేచనలేని వాని ద్వారా లేదా ‘బుద్ధిలేనివాని’ ద్వారా ఎంత విపరీతమైన హాని కలుగుతుందో కదా! అతను విచ్చలవిడిగా మాట్లాడుతూ తన మాటలతో నిందిస్తుండవచ్చు లేదా దూషిస్తుండవచ్చు. నియమించబడిన పెద్దలు అటువంటి చెడు ప్రభావాన్ని నిలిపివేయడానికి వెంటనే చర్య తీసుకోవాలి. ‘బుద్ధిలేనివాని’ వలె కాకుండా, వివేకమున్న వ్యక్తికి ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసు. నమ్మకద్రోహం చేయకుండా ఆయన విషయాన్ని దాచిపెడతాడు. వివేకమున్న ఒక వ్యక్తి, అదుపులేని నాలుక చాలా హాని చేయగలదని గ్రహించి “నమ్మకమైన స్వభావము” కలిగి ఉంటాడు. ఆయన తన తోటి విశ్వాసులపట్ల యథార్థంగా ఉంటాడు, వారిని ప్రమాదంలో పడవేసే ఆంతరంగిక విషయాలను బట్టబయలు చేయడు. యథార్థవంతులైన అలాంటి వారు సంఘానికి ఎంత ఆశీర్వాదకరమో కదా!
యథార్థవంతులు నడిచే మార్గంలో నడిచేందుకు మనకు సహాయం చేయడానికి, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ నిర్దేశములో సిద్ధం చేయబడిన ఆధ్యాత్మిక ఆహారాన్ని యెహోవా సమృద్ధిగా అందిస్తున్నాడు. (మత్తయి ) పట్టణాలలాంటి మన సంఘాల్లోని క్రైస్తవ పెద్దల ద్వారా కూడా మనం ఎంతో వ్యక్తిగత సహాయాన్ని పొందుతాం. ( 24:45ఎఫెసీయులు 4:11-13) మనం నిజంగానే వారికి కృతజ్ఞులమై ఉన్నాం, ఎందుకంటే “నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము.” (సామెతలు 11:14) ఏమి జరిగినా, ‘యథార్థతతో ప్రవర్తించాలని’ దృఢంగా నిశ్చయించుకుందాం.—కీర్తన 26:1.
[26వ పేజీలోని బ్లర్బ్]
వస్తుసంపదల కోసం బాగా కష్టపడుతూ దైవపరిపాలనా కార్యకలాపాలను నిర్లక్ష్యం చేయడం ఎంత అవివేకం!
[24వ పేజీలోని చిత్రాలు]
యోబు తన యథార్థత చేత నడిపించబడ్డాడు, యెహోవా ఆయనను ఆశీర్వదించాడు
[25వ పేజీలోని చిత్రం]
ఉజ్జా తన అహంకారం వల్ల మరణించాడు