యెహోవా ప్రేమపూర్వక దయ నుండి ప్రయోజనం పొందడం
యెహోవా ప్రేమపూర్వక దయ నుండి ప్రయోజనం పొందడం
‘బుద్ధిమంతుడైనవాడు యెహోవా కృపాతిశయములను [“ప్రేమపూర్వక దయతో చేసిన కార్యములను,” NW] తల పోయును.’—కీర్తన 107:43.
1. న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్‌లో “ప్రేమపూర్వక దయ” అనే పదం మొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించబడింది, ఆ లక్షణం గురించి ఏ ప్రశ్నలను మనం పరిశీలిస్తాము?
దాదాపు 4,000 సంవత్సరాల క్రితం, అబ్రాహాము సోదరుని కుమారుడు లోతు యెహోవా గురించి ఇలా అన్నాడు: ‘నీ కృపను [“ప్రేమపూర్వక దయను,” NW] ఘనపరిచితివి.’ (ఆదికాండము 19:19) న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్‌లో “ప్రేమపూర్వక దయ” దాదాపు 250 సార్లు ఉంది, అది ఈ లేఖనంలో మొదటిసారి కనబడుతుంది. కానీ తెలుగు పరిశుద్ధ గ్రంథములో ఆ పదం సాధారణంగా “దయ,” “కనికరము,” “ఉపకారము,” “కృప” అని అనువదించబడింది. యాకోబు, నయోమి, దావీదులతోపాటు దేవుని ఇతర సేవకులు కూడా యెహోవా యొక్క ఈ లక్షణం గురించి మాట్లాడారు. (ఆదికాండము 32:10; రూతు 1:8; 2 సమూయేలు 2:6) ఇంతకూ, యెహోవా ప్రేమపూర్వక దయ అంటే ఏమిటి? గతంలో అది ఎవరిపై చూపించబడింది? నేడు మనం దాన్నుండి ఎలా ప్రయోజనం పొందుతాము?
2. “ప్రేమపూర్వక దయ” అని అనువదించబడిన హీబ్రూ పదాన్ని నిర్వచించడం ఎందుకంత కష్టం, దానికి సరైన ప్రత్యామ్నాయ అనువాదం ఏమిటి?
2 లేఖనాల్లో, “ప్రేమపూర్వక దయ” అని అనువదించబడిన హీబ్రూ పదానికి ఎంతో లోతైన భావముంది, దాని పూర్తి భావాన్ని ఖచ్చితంగా తెలియజేసే ఏకైక పదం అత్యధిక భాషల్లో లేదు. అందుకే, “ప్రేమ,” “కనికరము,” “విశ్వసనీయత” అని అనువదించబడిన పదాలు దాని పూర్తి భావాన్ని ఖచ్చితంగా వర్ణించలేవు. అయినప్పటికీ, ఎక్కువగా అవగాహననిచ్చే అనువాదం “ప్రేమపూర్వక దయ,” ఇది “హీబ్రూ పదం యొక్క పూర్తి భావానికి దగ్గరగా ఉంటుంది” అని థియోలాజికల్ వర్డ్ బుక్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్ వ్యాఖ్యానిస్తోంది. అందుకు తగినట్లుగానే, న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్—విత్ రిఫరెన్సెస్ “ప్రేమపూర్వక దయ” అని అనువదించబడిన హీబ్రూ పదానికి, “యథార్థమైన ప్రేమ” అనే పదాన్ని ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తోంది.—నిర్గమకాండము 15:13; కీర్తన 5:7, NW; అధస్సూచి.
ప్రేమా యథార్థతలకు భిన్నమైనది
3. ప్రేమనుండి ప్రేమపూర్వక దయ ఎలా భిన్నమైనది?
3 ప్రేమపూర్వక దయకు లేదా యథార్థమైన ప్రేమకు, ప్రేమ మరియు యథార్థత అనే లక్షణాలతో చాలా సన్నిహిత సంబంధం ఉంది. అయినా, ప్రముఖమైన విధానాల్లో అది వాటికి భిన్నంగా ఉంటుంది. ప్రేమపూర్వక దయ, ప్రేమ ఎలా భిన్నమైనవో పరిశీలించండి. అనుభూతులను, వస్తువులను కూడా ప్రేమించవచ్చు. అందుకే బైబిలు “జ్ఞానమును ప్రేమించువాడు,” అని “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి” అని చెబుతోంది. (సామెతలు 29:3; 1 యోహాను 2:15) కానీ ప్రేమపూర్వక దయ ప్రజలకు మాత్రమే వర్తిస్తుంది, అనుభూతులకు లేక జీవంలేని వస్తువులకు కాదు. ఉదాహరణకు, యెహోవా ‘వెయ్యితరములవరకు కరుణించువాడై [“ప్రేమపూర్వక దయ చూపువాడై,” NW] యున్నాడు’ అని నిర్గమకాండము 20:6 చెబుతున్నప్పుడు అది ప్రజల గురించి చెప్పబడుతోంది.
4. ప్రేమపూర్వక దయ, యథార్థతనుండి ఎలా భిన్నమైనది?
4 అలాగే, “ప్రేమపూర్వక దయ” అని అనువదించబడిన హీబ్రూ పదానికి, “యథార్థత” అనే పదం కంటే కూడా మరింత విస్తృతమైన భావముంది. కొన్ని భాషల్లో, “యథార్థత” తరచుగా తక్కువ స్థాయిలోని ఒక వ్యక్తి తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తికి చూపించవలసిన వైఖరికి ఉపయోగించబడుతుంది. కానీ ఒక పరిశోధకురాలు పేర్కొంటున్నట్లుగా, బైబిలు దృక్కోణంనుండి, ప్రేమపూర్వక దయ, “అతి తరచుగా బాంధవ్యానికి పూర్తి భిన్నమైన దిశను సూచిస్తుంది: శక్తిమంతుడు, బలహీనుడికి లేదా అవసరంలోవున్న వ్యక్తికి లేదా నిస్సహాయుడికి యథార్థంగా ఉంటాడు.” దావీదు రాజు ఆ కారణంగానే యెహోవాను ఇలా వేడుకొనగలిగాడు: ‘నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత [“ప్రేమపూర్వక దయతో,” NW] నన్ను రక్షింపుము.’ (కీర్తన 31:16) అవసరంలోవున్న దావీదు, శక్తిమంతుడైన యెహోవాను ప్రేమపూర్వక దయను లేదా యథార్థమైన ప్రేమను చూపించమని అడిగాడు. అవసరంలోవున్న ఒక వ్యక్తికి శక్తిమంతుడిపై అధికారం ఉండదు కాబట్టి, అలాంటి సందర్భంలో ప్రేమపూర్వక దయ ఇష్టపూర్వకంగా చూపించబడుతుంది, బలవంతంగా కాదు.
5. (ఎ) దేవుని వాక్యంలో, ఆయన ప్రేమపూర్వక దయ యొక్క ఏ విలక్షణాలు ప్రాముఖ్యంగా చెప్పబడ్డాయి? (బి) యెహోవా ప్రేమపూర్వక దయ యొక్క ఏ భావప్రకటనలను మనం పరిశీలిస్తాం?
5 ‘బుద్ధిమంతుడైనవాడు యెహోవా కృపాతిశయములను [“ప్రేమపూర్వక దయతో చేసిన కార్యములను,” NW] తల పోయును’ అని కీర్తనకర్త అన్నాడు. (కీర్తన 107:43) యెహోవా ప్రేమపూర్వక దయ విడిపిస్తుంది, రక్షిస్తుంది. (కీర్తన 6:4; 119:88, 159) అది ఒక రక్షణ, కష్టాలనుండి ఉపశమనమివ్వడంలో అతి ప్రాముఖ్యమైనది. (కీర్తన 31:16, 21; 40:11; 143:12) ఈ లక్షణం కారణంగా, పాప విమోచన సాధ్యమవుతుంది. (కీర్తన 25:7) అలాంటి కొన్ని లేఖన వృత్తాంతాలను పరిశీలించడం ద్వారా, ఇతర బైబిలు లేఖనాలను గమనించడం ద్వారా యెహోవా ప్రేమపూర్వక దయ (1) నిర్దిష్టమైన చర్యల ద్వారా వ్యక్తం చేయబడుతుంది (2) ఆయన నమ్మకమైన సేవకులు దాన్ని పొందవచ్చు అని మనం తెలిసికొంటాం.
విడుదల—ప్రేమపూర్వక దయ యొక్క భావప్రకటనలలో ఒకటి
6, 7. (ఎ) లోతు విషయంలో యెహోవా తన ప్రేమపూర్వక దయను ఎలా ఘనపరిచాడు? (బి) యెహోవా ప్రేమపూర్వక దయ గురించి లోతు ఎప్పుడు ప్రస్తావించాడు?
6 యెహోవా ప్రేమపూర్వక దయ యొక్క పరిమితిని నిర్ధారించుకోవడానికి, ఈ లక్షణం గురించి మాట్లాడుతున్న లేఖన వృత్తాంతాలను పరిశీలించడమే చక్కని మార్గం. అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతును శత్రువులు పట్టుకుపోయినట్లు ఆదికాండము 14:1-6 వచనాల్లో మనం చూస్తాం. కానీ అబ్రాహాము లోతును రక్షిస్తాడు. లోతు, అతని కుటుంబము నివసిస్తున్న దుష్ట నగరమైన సొదొమను నాశనం చేయాలని యెహోవా నిర్ణయించినప్పుడు లోతు జీవితం మళ్ళీ ప్రమాదంలో పడుతుంది.—ఆదికాండము 18:20-22; 19:12, 13.
7 సొదొమను నాశనం చేయడానికి ముందు, యెహోవా దేవదూతలు లోతును అతని కుటుంబాన్ని నగరము బయటకు భద్రంగా తీసుకువెళతారు. ఆ సమయంలో, లోతు ఇలా అంటాడు: ‘నీ కటాక్షము నీ దాసునిమీద వచ్చినది; నా ప్రాణము రక్షించుటవలన నీవు నాయెడల కనుపరచిన నీ కృపను [“ప్రేమపూర్వక దయను,” NW] ఘనపరచితివి.’ (ఆదికాండము 19:16, 18, 19) ఈ మాటలతో లోతు, యెహోవా తనను రక్షించడం ద్వారా అసాధారణమైన ప్రేమపూర్వక దయను చూపించాడని ఒప్పుకున్నాడు. ఈ సందర్భంలో, దేవుని ప్రేమపూర్వక దయ విడుదల, రక్షణల ద్వారా వ్యక్తం చేయబడింది.—2 పేతురు 2:7.
యెహోవా ప్రేమపూర్వక దయ ఆయన నడిపింపు
8, 9. (ఎ) అబ్రాహాము దాసునికి ఇవ్వబడిన నియామకం ఏమిటి? (బి) ఆ దాసుడు దేవుని ప్రేమపూర్వక దయ కోసం ఎందుకు ప్రార్థించాడు, అతను ప్రార్థించేటప్పుడు ఏమి జరిగింది?
8 ఆదికాండము 24వ అధ్యాయంలో, దేవుని ప్రేమపూర్వక దయ లేదా యథార్థమైన ప్రేమకు సంబంధించిన మరొక భావప్రకటన గురించి మనం చదువుతాం. ఆ వృత్తాంతం, అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకు కోసం భార్యను వెతకడానికి తన బంధువుల దేశానికి తన దాసుని పంపించడం గురించి తెలియజేస్తుంది. (2-4 వచనాలు) ఆ పని చాలా కష్టమైనది, కానీ ఆ దాసుడు యెహోవా దేవదూత తనకు నడిపింపునిస్తాడన్న హామీ పొందుతాడు. (7వ వచనం) చివరికి ఆ దాసుడు, “నాహోరు పట్టణము” (హారాను లేదా దాని దగ్గరి ప్రాంతమై ఉండవచ్చు) బయటనున్న ఒక బావి దగ్గరకు, సరిగ్గా నీటికోసం స్త్రీలు వచ్చే సమయానికి చేరుకుంటాడు. (10, 11 వచనాలు) ఆ దాసుడు, స్త్రీలు బావి దగ్గరకు రావడం చూసినప్పుడు, తన లక్ష్యాన్ని సాధించే సంక్లిష్ట సమయం సమీపించిందని గ్రహిస్తాడు. కానీ ఆయన సరైన యువతిని ఎలా ఎంపిక చేయగలడు?
9 తనకు దేవుని సహాయం అవసరమని తెలిసిన అబ్రాహాము దాసుడు ఇలా ప్రార్థిస్తాడు: ‘నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలముచేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము [“ప్రేమపూర్వక దయ,” NW] చూపుము.’ (12వ వచనము) యెహోవా తన ప్రేమపూర్వక దయను ఎలా చూపిస్తాడు? దేవుడు ఎంపికచేసిన యువతిని తాను గుర్తించేందుకు, ఆ దాసుడు ఒక నిర్దిష్టమైన సూచనను అడుగుతాడు. (13, 14 వచనాలు) సరిగ్గా అతను యెహోవాను అడిగిన విధంగానే ఒక యువతి చేస్తుంది. అతని ప్రార్థనను ఆమె విన్నట్లే ప్రవర్తిస్తుంది! (15-20 వచనాలు) ఆశ్చర్యచకితుడైన ఆ దాసుడు, ‘ఆమెను తేరి చూస్తాడు.’ అయినా, కొన్ని ముఖ్యమైన వివరాలను నిర్ధారించుకోవలసి ఉంది. అందంగా కనిపిస్తున్న ఆమె అబ్రాహాము బంధువుల స్త్రీయేనా? ఆమె అవివాహితేనా? అని తెలిసికోవలసి ఉంది. అందుకే ఆ దాసుడు “తన ప్రయాణమును యెహోవా సఫలముచేసెనో లేదో తెలిసికొనవలెనని ఊరకుండెను.”—16, 21 వచనాలు.
10. అబ్రాహాము దాసుడు తన యజమానిపై యెహోవా ప్రేమపూర్వక దయను చూపించాడనే ముగింపుకు ఎందుకు వచ్చాడు?
10 కొంత సమయం తర్వాత, ఆ యువతి తనను తాను ‘[అబ్రాహాము సహోదరుడు] నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తె’గా పరిచయం చేసుకొంటుంది. (ఆదికాండము 11:26; 24:24) ఆ క్షణంలో, యెహోవా తన ప్రార్థనకు జవాబిచ్చాడని ఆ దాసుడు గ్రహించాడు. ఆనందాశ్చర్యాల్లో తలమునకలైన ఆ దాసుడు తన తలవంచి, ‘అబ్రాహామను నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానునికి తన కృపను [“ప్రేమపూర్వక దయను,” NW] తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల యింటికి నన్ను నడిపించెను’ అని అన్నాడు. (26, 27 వచనాలు) అతనికి నడిపింపునివ్వడం ద్వారా, దేవుడు ఆ దాసుని యజమానుడైన అబ్రాహాముపై తన ప్రేమపూర్వక దయను చూపించాడు.
దేవుని ప్రేమపూర్వక దయ ఉపశమనాన్ని రక్షణను తెస్తుంది
11, 12. (ఎ) యోసేపు ఎలాంటి పరీక్షల సమయంలో యెహోవా ప్రేమపూర్వక దయను చవి చూశాడు? (బి) యోసేపు విషయంలో దేవుని ప్రేమపూర్వక దయ ఎలా చూపించబడింది?
11 ఇప్పుడు, మనం ఆదికాండము 39వ అధ్యాయం పరిశీలిద్దాం. ఇది ఐగుప్తులో బానిసత్వం చేయడానికి అమ్మబడిన, అబ్రాహాము ముని మనవడైన యోసేపుపై కేంద్రీకరించబడింది. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ, “యెహోవా యోసేపునకు తోడైయుండెను.” (1, 2 వచనాలు) ఐగుప్తీయుడైన యోసేపు యజమాని పోతీఫరు కూడా, యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడని గ్రహించాడు. (3వ వచనము) అయినప్పటికీ, యోసేపు చాలా గంభీరమైన పరీక్షకు గురవుతాడు. ఆయన పోతీఫరు భార్యపై దౌర్జన్యం చేశాడనే అబద్ధ ఆరోపణ మీద చెరసాల పాలవుతాడు. (7-20 వచనాలు) అక్కడ “వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను.”—ఆదికాండము 40:15; కీర్తన 105:18.
12 ప్రత్యేకించి ఆ పరీక్షా సమయంలో ఏమి జరిగింది? ‘యెహోవా యోసేపునకు తోడైయుండి, అతనియందు కనికరపడెను [“ప్రేమపూర్వక దయను చూపించెను,” NW].’ (21ఎ వచనము) ప్రేమపూర్వక దయ యొక్క ఒక ప్రత్యేకమైన చర్యతో ప్రారంభమై, ఆ తర్వాత, ఒక దాని వెంట ఒకటి జరిగిన సంఘటనలు యోసేపు అనుభవిస్తున్న కష్టాలనుండి ఉపశమనానికి దారితీస్తాయి. యెహోవా యోసేపుపై “ఆ చెరసాలయొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను.” (21బి వచనము) తత్ఫలితంగా, ఆ అధిపతి యోసేపును బాధ్యతగల స్థానములో నియమిస్తాడు. (22వ వచనము) అటు పిమ్మట, యోసేపు ఒక వ్యక్తిని కలుస్తాడు, ఆ వ్యక్తి చివరికి యోసేపును ఐగుప్తు పరిపాలకుడైన ఫరో దృష్టికి తీసుకువస్తాడు. (ఆదికాండము 40:1-4, 9-15; 41:9-14) ఆ రాజు యోసేపుకు ఐగుప్తు దేశంపై రెండవ పరిపాలకుడిగా ఉన్నత స్థానం ఇస్తాడు దాని ఫలితంగా, ఐగుప్తు దేశంలో వచ్చిన కరవు సమయంలో ప్రాణాలను కాపాడే కార్యాన్ని యోసేపు నిర్వహించగలుగుతాడు. (ఆదికాండము 41:37-55) యోసేపుకు 17 ఏండ్ల వయస్సులో మొదలైన బాధలు 12 సంవత్సరాలకంటే ఎక్కువ కాలం వరకు కొనసాగుతాయి! (ఆదికాండము 37:2, 4; 41:46) కానీ క్షోభను, దుఃఖాన్ని అనుభవించిన ఆ సంవత్సరాలన్నింటిలోనూ యెహోవా దేవుడు, యోసేపును ఘోరమైన కష్టాలనుండి రక్షించడం ద్వారా, తన సంకల్పంలో ఆధిక్యతగల పాత్ర వహించడానికి ఆయనను సంరక్షించడం ద్వారా తన ప్రేమపూర్వక దయను చూపించాడు.
దేవుని ప్రేమపూర్వక దయ ఎన్నటికీ విఫలమవ్వదు
13. (ఎ) 136వ కీర్తనలో యెహోవా ప్రేమపూర్వక దయను చూపించిన ఏ విధానాలను మనం చూడవచ్చు? (బి) ప్రేమపూర్వక దయ యొక్క నైజం ఏమిటి?
13 యెహోవా, ఇశ్రాయేలీయులపై ఒక జనాంగంగా తన ప్రేమపూర్వక దయను పదే పదే చూపించాడు. తన ప్రేమపూర్వక దయతోనే ఆయన వారికి విడుదలను (10-15 వచనాలు), నడిపింపును (16వ వచనం), సంరక్షణను (17-20 వచనాలు) అనుగ్రహించాడని 136వ కీర్తన తెలియజేస్తోంది. దేవుడు తన ప్రేమపూర్వక దయను వ్యక్తిగతంగా ఒక్కొక్కరిపై కూడా చూపించాడు. తోటి మానవులపై ప్రేమపూర్వక దయను చూపించే ఒక వ్యక్తి, వారి అత్యవసరాన్ని తీర్చాలన్న ఉద్దేశంతో ఇష్టపూర్వకమైన చర్యల ద్వారా దాన్ని చూపిస్తాడు. ప్రేమపూర్వక దయ గురించి ఒక బైబిలు రిఫరెన్స్ గ్రంథం ఇలా స్పష్టంగా వ్యక్తంచేస్తోంది: “ఇది జీవితాన్ని సంరక్షించే లేక క్షేమాభివృద్ధి కలుగజేసే చర్య. ఆపదలోవున్న లేదా దుఃఖాన్ని అనుభవిస్తున్న ఒక వ్యక్తికి మద్దతునిచ్చేందుకు తీసుకొనే చర్య.” ఒక విద్వాంసుడు “ప్రేమ చర్యలోకి అనువదించబడింది” అని ప్రేమపూర్వక దయను వర్ణిస్తున్నాడు.
14, 15. లోతు దేవుని ఆమోదం పొందిన ఒక సేవకుడని మనం నమ్మకంగా ఎందుకు చెప్పవచ్చు?
14 ఆదికాండములో మనం పరిశీలించిన వృత్తాంతాలు, యెహోవా తనను ప్రేమించేవారిపై తన ప్రేమపూర్వక దయను చూపించడంలో ఎన్నడూ ఉపేక్షించడని చూపిస్తున్నాయి. లోతు, అబ్రాహాము, యోసేపులు వేర్వేరు పరిస్థితుల్లో జీవించారు, పూర్తిగా విభిన్నమైన పరీక్షలను ఎదుర్కొన్నారు. వారు అపరిపూర్ణ మానవులే అయినా వారు యెహోవా ఆమోదం పొందిన సేవకులు, దేవుని సహాయం వారికి అవసరమైంది. అటువంటి వ్యక్తులపైన మన ప్రేమగల పరలోకపు తండ్రి తన ప్రేమపూర్వక దయను చూపిస్తాడని తెలిసికోవడం మనకు ఎంతో ఓదార్పునిస్తుంది.
15 లోతు తీసుకున్న కొన్ని అవివేకమైన నిర్ణయాలు ఆయనను కష్టాల పాలుజేశాయి. (ఆదికాండము 13:12, 13; 14:11, 12) అయినప్పటికీ, ఆయన ప్రశంసించదగిన లక్షణాలను కనబరుస్తాడు. దేవుని దూతలు ఇద్దరు సొదొమకు వచ్చినప్పుడు, లోతు వారికి అతిథిసత్కారాలు చేస్తాడు. (ఆదికాండము 19:1-3) ఆయన విశ్వాసంతో, సొదొమకు జరగబోయే నాశనం గురించి తన అల్లుళ్ళను హెచ్చరిస్తాడు. (ఆదికాండము 19:14) లోతుపైన దేవునికున్న దృక్పథం 2 పేతురు 2:7-10 లో కనబడుతుంది, అక్కడ మనమిలా చదువుతాం: ‘[యెహోవా] దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, తాను చూచినవాటినిబట్టియు వినినవాటినిబట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. భక్తులను శోధనలోనుండి తప్పించుటకు ప్రభువు సమర్థుడు.’ అవును, లోతు ఒక నీతిమంతుడు. ఇక్కడి ఈ మాటలు ఆయన దైవభక్తిగలవాడని కూడా సూచిస్తున్నాయి. మనం “పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను” ఉంటే, లోతులాగే మనం కూడా దేవుని ప్రేమపూర్వక దయను అనుభవిస్తాము.—2 పేతురు 3:11, 12.
16. అబ్రాహాము, యోసేపుల గురించి బైబిలు ఎలాంటి ప్రశంసనీయమైన పరిభాషలో మాట్లాడింది?
16ఆదికాండము 24వ అధ్యాయము అబ్రాహాముకు యెహోవాతో ఉన్న సన్నిహిత అనుబంధాన్ని స్పష్టంగా చూపిస్తుంది. మొదటి వచనం “అన్ని విషయములలోను యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను” అని తెలియజేస్తోంది. అబ్రాహాము దాసుడు యెహోవాను ‘నా యజమానుడగు అబ్రాహాము దేవుడు’ అని పిలిచాడు. (12, 26, 27 వచనాలు) శిష్యుడైన యాకోబు అబ్రాహాము ‘నీతిమంతుడిగా తీర్పు పొందాడు’ అనీ, “దేవుని స్నేహితుడని అతనికి పేరుకలిగెను” అనీ అన్నాడు. (యాకోబు 2:21-23) యోసేపు విషయంలోనూ దాదాపు అలాగే జరిగింది. యెహోవా యోసేపుల మధ్యనున్న సన్నిహిత సంబంధం ఆదికాండము 39వ అధ్యాయమంతటా నొక్కిచెప్పబడింది. (2, 3, 21, 23 వచనాలు) అంతేగాక, యోసేపు గురించి శిష్యుడైన స్తెఫను, ‘దేవుడతనికి తోడై ఉండెను’ అని అన్నాడు.—అపొస్తలుల కార్యములు 7:9.
17. లోతు, అబ్రాహాము, యోసేపుల మాదిరులనుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
17 మనమిప్పటివరకు పరిశీలించిన ఈ వ్యక్తులు దేవుని ప్రేమపూర్వక దయను పొందినవారు, వీరు యెహోవా దేవునితో సత్సంబంధాలను కలిగివుండి, ఆయన సంకల్పానికి పలు విధాలుగా తోడ్పడ్డారు. వారు ఎదుర్కొన్న ఆటంకాలను స్వయంగా అధిగమించగలిగేవారు కాదు. లోతు జీవము, అబ్రాహాము వంశావళి, యోసేపు పాత్ర ప్రమాదంలో పడ్డాయి. దైవభక్తులైన ఈ మనుష్యుల అవసరాలను యెహోవా మాత్రమే తీర్చగలడు, వారికి మద్దతుగా ప్రేమపూర్వక దయతో కూడిన చర్యల ద్వారా ఆయన అలాగే చేశాడు. యెహోవా దేవుని ప్రేమపూర్వక దయను మనం ఎల్లప్పుడూ అనుభవించాలంటే, మనకు కూడా ఆయనతో సన్నిహిత సంబంధం ఉండాలి, మనం ఆయన చిత్తం చేయడంలో తప్పకుండా కొనసాగాలి.—ఎజ్రా 7:28; కీర్తన 18:50.
దేవుని సేవకులు అనుగ్రహించబడ్డారు
18. యెహోవా ప్రేమపూర్వక దయ గురించి పలు బైబిలు లేఖనాలు ఏమి సూచిస్తున్నాయి?
18 యెహోవా ప్రేమపూర్వక దయతో ‘భూమి నిండియున్నది,’ దేవుని ఈ లక్షణానికి మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలి! (కీర్తన 119:64) కీర్తనకర్త మళ్ళీ మళ్ళీ చెబుతున్న ఈ మాటలకు మనం హృదయపూర్వకంగా ప్రతిస్పందిస్తాము: ‘ఆయన కృపనుబట్టియు [“ప్రేమపూర్వక దయనుబట్టి,” NW] నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.’ (కీర్తన 107:8, 15, 21, 31) యెహోవా తాను ఆమోదించిన తన సేవకులలో ప్రతి ఒక్కరిపై వ్యక్తిగతంగా గానీ, ఒక గుంపుగా గానీ వారందరిపై తన ప్రేమపూర్వక దయను చూపిస్తాడని తెలిసి మనమెంతో ఆనందిస్తాం. దానియేలు ప్రవక్త తన ప్రార్థనలో యెహోవాను, ‘ప్రభువా, మాహాత్మ్యము గలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారియెడల నీ నిబంధనను నీ కృపను [“ప్రేమపూర్వక దయను,” NW] జ్ఞాపకము చేయువాడా,’ అని సంబోధించాడు. (దానియేలు 9:4) దావీదు రాజు ‘నిన్ను ఎరిగినవారియెడల నీ కృపను [“ప్రేమపూర్వక దయను,” NW] ఎడతెగక నిలుపుము’ అని ప్రార్థించాడు. (కీర్తన 36:10) యెహోవా తన సేవకులపై ప్రేమపూర్వక దయను చూపిస్తున్నందుకు మనమెంత కృతజ్ఞులమై ఉన్నామో కదా!—1 రాజులు 8:23; 1 దినవృత్తాంతములు 17:13.
19. దీని తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏ ప్రశ్నలను పరిశీలిస్తాము?
19 నిజమే, యెహోవా ప్రజలుగా మనం ఆయన అనుగ్రహం పొందాం! సాధారణ మానవాళిపై దేవుడు చూపిన ప్రేమనుండి ప్రయోజనం పొందడంతోపాటు, మనం మన పరలోకపు తండ్రి ప్రేమపూర్వక దయ లేదా యథార్థమైన ప్రేమనుండి ప్రత్యేక ఆశీర్వాదాలను అనుభవిస్తాము. (యోహాను 3:16) ప్రత్యేకంగా మన అవసరకాలంలో, యెహోవా అమూల్యమైన ఈ లక్షణం నుండి మనం ప్రయోజనం పొందుతాం. (కీర్తన 36:7) కానీ యెహోవా దేవుని ప్రేమపూర్వక దయను మనం ఎలా అనుకరించగలం? విశిష్టమైన ఈ లక్షణాన్ని మనం వ్యక్తిగతంగా కనబరుస్తున్నామా? వీటితోపాటు వీటికి సంబంధించిన ఇతర ప్రశ్నలు దీని తర్వాతి ఆర్టికల్‌లో చర్చించబడతాయి.
మీరు జ్ఞాపకం చేసుకోగలరా?
• “ప్రేమపూర్వక దయ”కు మరో లేఖనాధారిత పదం ఏమిటి?
• ప్రేమపూర్వక దయ ప్రేమనుండి, యథార్థతనుండి ఎలా భిన్నంగా ఉంటుంది?
• లోతు, అబ్రాహాము, యోసేపులపై యెహోవా తన ప్రేమపూర్వక దయను ఏయే విధాలుగా చూపించాడు?
• యెహోవా తన ప్రేమపూర్వక దయను వ్యక్తంచేసిన పూర్వపు అనుభవాల నుండి మనం ఎలాంటి హామీని పొందవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
[13వ పేజీలోని చిత్రం]
లోతుపై దేవుడు తన ప్రేమపూర్వక దయను ఎలా చూపాడో మీకు తెలుసా?
[15వ పేజీలోని చిత్రాలు]
యెహోవా తన ప్రేమపూర్వక దయతో అబ్రాహాము దాసుని నడిపించాడు
[16వ పేజీలోని చిత్రాలు]
యెహోవా యోసేపును సంరక్షించడం ద్వారా తన ప్రేమపూర్వక దయను వ్యక్తం చేశాడు