“అడుగంటి పోయిరి”
“అడుగంటి పోయిరి”
“అగాధజలములు వారిని కప్పెను; వారు రాతివలె అడుగంటిపోయిరి.”
ఈమాటలతో మోషే, ఇశ్రాయేలీయులు ఎఱ్ఱసముద్రము గుండా తాము విడుదలవడాన్ని, తమను తరుముకు వస్తున్న ఐగుప్తుకు చెందిన శత్రువులైన ఫరో మరియు అతని సైనికులు నాశనమవడాన్ని పాటగా పాడుతూ వేడుక చేసుకున్నారు.—నిర్గమకాండము 15:4, 5.
ఆ అద్భుతమైన దృశ్యాన్ని కళ్ళారా చూసిన ఎవరికైనా ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది. అదేమిటంటే, యెహోవా అధికారాన్ని సవాలుచేసిన లేదా ఎదిరించిన వారెవరూ బ్రతకరు. అయితే, కేవలం కొన్ని నెలల తర్వాత, కోరహు, దాతాను, అబీరాము, వారి 250 మంది మద్దతుదారులు వంటి ప్రముఖులైన ఇశ్రాయేలీయులు మోషే అహరోనులకు దేవుడిచ్చిన అధికారాన్ని బహిరంగంగా సవాలుచేశారు.—సంఖ్యాకాండము 16:1-3.
యెహోవా నిర్దేశంతో, తిరుగుబాటుదారుల నివాసముల చుట్టుప్రక్కల నుండి తొలగిపొమ్మని మోషే ఇశ్రాయేలీయులను హెచ్చరించాడు. తమ కుటుంబ సభ్యులతోపాటు, దాతాను, అబీరాములు తమ దృక్పథాన్ని మార్చుకోకుండా బహిరంగంగా అవిధేయత చూపించారు. ఆ తర్వాత మోషే, వీరు ‘యెహోవాను అలక్ష్యము చేశారన్న’ విషయాన్ని యెహోవా తన సొంత విధానంలో ప్రజలకు స్పష్టంచేస్తాడని తెలియజేశాడు. ఆ సమయంలో, యెహోవా వారి పాదముల క్రింది నేల నెరవిడిచేలా చేశాడు. “వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళములో కూలిరి; భూమి వారిని మ్రింగివేసెను.” కోరహు, ఇతర తిరుగుబాటుదారుల మాటేమిటి? “యెహోవాయొద్దనుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ రెండువందల ఏబదిమందిని కాల్చివేసెను.”—సంఖ్యాకాండము 16:23-35; 26:10.
యెహోవా అధికారాన్ని, తన ప్రజలకు సంబంధించిన విషయాలపట్ల ఆయనకున్న శ్రద్ధను గుర్తించలేకపోవడంవల్ల ఫరో, అతని సైన్యము, ఆ అరణ్యములో తిరుగుబాటు చేసినవారు నశించిపోయారు. కాబట్టి, ఈ క్లిష్టదినాల్లో యెహోవా కాపుదలను చూసేవారందరూ యెహోవా ‘మహోన్నతుడు,’ ‘సర్వశక్తిమంతుడు’ అని గ్రహించి, ఆయనకు విధేయులై ఉండడం ఆవశ్యకం. అలా చేస్తూ, వారు యెహోవా చెబుతున్న ఈ ధైర్య వచనాలను హృదయంలోనికి తీసుకోవచ్చు: “నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకురాదు. నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు.”—కీర్తన 91:1, 7-9.