ఎవరు నిందార్హులు మీరా మీ జన్యువులా?
ఎవరు నిందార్హులు మీరా మీ జన్యువులా?
త్రాగుడుకు, స్వలింగ సంపర్కానికి, విచ్చలవిడి ప్రవర్తనకు, దౌర్జన్యానికి, ఇతర అసాధారణమైన ప్రవర్తనలకే గాక చివరికి మరణానికి కూడా జన్యు సంబంధిత కారణాలను కనుగొనడానికి శాస్త్రవేత్తలు తీవ్రంగా పరిశోధిస్తున్నారు. మన చర్యలకు మనం బాధ్యులం కాదుగానీ మన జన్యు నిర్మాణమే నిందార్హమైనదని తెలుసుకోవడం ఎంతో ఉపశమనాన్నివ్వదా? మన తప్పులకు ఇతరులను లేదా ఇతర విషయాలను నిందించడం మానవ నైజం.
జన్యువులే నిందార్హమైనవైతే, జెనెటిక్ ఇంజినీరింగ్ ద్వారా అవాంఛిత లక్షణాలను తొలగించి, జన్యువులను మార్చే సాధ్యతను శాస్త్రవేత్తలు మన ముందు ఉంచుతారు. మొత్తం మానవ జీనోమ్ మ్యాపింగ్‌లో ఇటీవల లభించిన సఫలత అలాంటి ఆశలకు నూతన ప్రేరణనిస్తోంది.
అయితే ఆ సాధ్యత, మన పాపాలన్నింటికీ తప్పులన్నింటికీ మన జన్యు వారసత్వమే బాధ్యత వహించాలనే ఆలోచనపై ఆధారపడి ఉంది. మన జన్యువులపై కేసు పెట్టేందుకు సరిపడేంత సాక్ష్యాధారాన్ని వైజ్ఞానిక నేరపరిశోధకులు కనుగొన్నారా? దానికి సమాధానం, మనల్నీ మన భవిష్యత్తునూ మనమెలా దృష్టిస్తామనేదాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని స్పష్టమవుతోంది. అయితే సాక్ష్యాధారాన్ని పరిశీలించే ముందు మానవజాతి ఆరంభాన్ని ఒకసారి గమనించడం నిజంగా జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది.
అదంతా ఎలా ప్రారంభమైంది?
ఏదెను తోటలో మొదటి మానవ దంపతులైన ఆదాము హవ్వలు పాపభరితమైన స్థితిలోకి పడిపోవడాన్ని గురించిన వృత్తాంతం చాలామందికి తెలిసే ఉండవచ్చు లేదా కనీసం విని ఉండవచ్చు. మొదటినుండి వారు తమ జన్యువులలో ఏదైనా సహజసిద్ధమైన లోపంతో అంటే వాళ్ళు పాపం చేసేలా, అవిధేయత చూపించేలా వారిని ప్రేరేపించే ఏదైనా నిర్మాణ దోషంతో వారు సృష్టించబడ్డారా?
యెహోవా దేవుడు వారి సృష్టికర్త, ఆయన కార్యాలన్నీ పరిపూర్ణమైనవి, ఆయన తన భూసంబంధమైన తుది సృష్టి గురించి “చాలమంచిదిగ” ఉందని అన్నాడు. (ఆదికాండము 1:31; ద్వితీయోపదేశకాండము 32:4) ఆయన తన పనిని బట్టి సంతృప్తి పొందాడనడానికి మరొక నిదర్శనంగా, మొదటి జంటను ఆశీర్వదించి, ఫలించి భూమిని మానవులతో నింపి భూసంబంధమైన సృష్టి అంతటి గురించి శ్రద్ధ తీసుకోమని ఆయన వారికి ఉపదేశించాడు—ఇవి, తన పని గురించి తనకే నిశ్చయత లేని వ్యక్తి చేసే పనులు ఎంతమాత్రమూ కావు.—ఆదికాండము 1:28.
మొదటి మానవ జంటను సృష్టించడాన్ని గురించి బైబిలు మనకిలా చెబుతోంది: “దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.” (ఆదికాండము 1:27) అంటే దీని భావం మానవులు శరీరాకృతిలో దేవుని పోలి ఉంటారని కాదు, ఎందుకంటే “దేవుడు ఆత్మ.” (యోహాను 4:24) వాస్తవానికి దాని భావమేమిటంటే, దేవుని లక్షణాలుగల వ్యక్తిత్వం, నైతిక వివేకం అంటే మనస్సాక్షి మానవులకు ఇవ్వబడ్డాయి. (రోమీయులు 2:14, 15) ఒక విషయాన్ని మదింపు చేసుకొని, ఏ చర్య తీసుకోవాలనేది నిర్ణయించుకొనే సామర్థ్యంగల స్వేచ్ఛాచిత్తం కూడా వారికి ఉంది.
ఆదికాండము 2:17) కాబట్టి, నైతికపరమైన ఒక నిర్ణయాన్ని తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు, ఆ సమయంలో తనకు ఉపయోగకరమైనదిగా లేదా లాభదాయకమైనదిగా అనిపించిన దాన్ని ఆదాము ఎంపిక చేసుకొన్నాడని నిదర్శనం సూచిస్తోంది. సృష్టికర్తతో తనకున్న సంబంధాన్ని లేదా తన చర్య వల్ల వచ్చే దీర్ఘకాల పర్యవసానాలను పరిశీలించుకొనే బదులు అతడు తప్పు చేయడంలో తన భార్యను అనుసరించాడు. తర్వాత అతడు, తనకు యెహోవా ఇచ్చిన భార్యే తనను తప్పుదారి పట్టించిందని చెబుతూ యెహోవాపై నిందమోపడానికి కూడా ప్రయత్నించాడు.—ఆదికాండము 3:6, 12; 1 తిమోతి 2:14.
అయితే, మన మొదటి తల్లిదండ్రులు నిర్దేశక సూత్రాలేమీ ఇవ్వకుండా విడిచిపెట్టబడలేదు. బదులుగా తప్పుచేయడం వల్ల వచ్చే పర్యవసానాల గురించి వారు హెచ్చరించబడ్డారు. (ఆదాము హవ్వలు చేసిన పాపానికి దేవుడు ప్రతిస్పందించిన విధానం ద్వారా ఎన్నో విషయాలను తెలిసికోవచ్చు. ఆయన వారి జన్యువులలో ఉన్న ‘నిర్మాణ దోషాన్ని’ సరిచేయడానికి ప్రయత్నించలేదు. దానికి బదులు, వారి చర్యలకు పర్యవసానాలు ఎలా ఉంటాయని ఆయన వారికి చెప్పాడో దాన్నే ఆయన చేశాడు, చివరికి అది వారి మరణానికి దారితీసింది. (ఆదికాండము 3:17-19) చరిత్రారంభంలో జరిగిన ఈ సంఘటన మానవ ప్రవర్తనా నైజాన్ని బాగా అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. *
జీవశాస్త్రానికి వ్యతిరేకంగా సాక్ష్యాధారం
చాలాకాలం నుండి రోగలక్షణాలను తెలియజేసే శాస్త్రానికీ, ప్రవర్తనకూ సంబంధించి జన్యు కారకాలను, చికిత్సలను కనుగొనే బృహత్‌కార్యంతో శాస్త్రవేత్తలు కుస్తీలు పడుతున్నారు. పరిశోధకుల ఆరు బృందాలు పది సంవత్సరాల పాటు పరిశోధన చేసిన తర్వాత, హంటింగ్‌టన్స్ వ్యాధితో సంబంధం ఉన్న జన్యువును గుర్తించడం జరిగింది, అయినప్పటికీ ఆ జన్యువు ఆ వ్యాధిని ఎలా కలిగిస్తుందనేదాని గురించి పరిశోధకులకు ఏమాత్రం తెలియడంలేదు. అయితే, ఈ పరిశోధన గురించి నివేదిస్తూ, “ప్రవర్తనకు సంబంధించిన అవకతవకలకు కారణమైన జన్యువులను కనుగొనడం దాదాపు అసాధ్యం” కాగలదు అని హార్వర్డ్ జీవశాస్త్రజ్ఞుడైన ఈవన్ బాల్బన్ అన్నట్లు సైంటిఫిక్ అమెరికన్ పేర్కొన్నది.
వాస్తవానికి, మానవ ప్రవర్తనను నిర్దిష్టమైన జన్యువులతో జతచేసేందుకు చేయబడిన పరిశోధన విజయవంతం కాలేదు. ఉదాహరణకు, సైకాలజీ టుడే అనే పుస్తకంలో, డిప్రెషన్‌ను కలిగించే జన్యు సంబంధిత కారకాలు ఉన్నాయేమో కనుగొనడానికి జరిగిన ప్రయత్నాలపై ఒక నివేదిక ఇలా పేర్కొన్నది: “ప్రధాన మానసిక రుగ్మతలకు సంబంధించిన ఎపిడెమాలజిక్ డేటా, వాటిని పూర్తిగా జన్యు సంబంధిత కారకాలకే పరిమితం చేయలేమని స్పష్టం చేస్తోంది.” ఆ నివేదిక ఒక ఉదాహరణను ఇస్తోంది: “1905కు ముందు జన్మించిన అమెరికన్లలో 75 ఏళ్ళ వయస్సుకల్లా ఒక శాతం మంది డిప్రెషన్‌కు లోనయ్యారు. ఒక అర్థ శతాబ్దం తర్వాత జన్మించిన అమెరికన్లలో 24 ఏళ్ళ వయస్సుకల్లా 6 శాతం మంది డిప్రెషన్‌కు లోనయ్యారు!” కాబట్టి, కేవలం బాహ్య కారకాలు అంటే సామాజిక కారకాలు మాత్రమే అంత తక్కువ సమయంలో అంత విపరీతమైన మార్పులను తీసుకురాగలవని అది నిర్ధారిస్తోంది.
వీటితోపాటూ అసంఖ్యాకమైన మరితర అధ్యయనాలు మనకేమి చెబుతున్నాయి? మన వ్యక్తిత్వాలకు ఒక ఆకృతినివ్వడంలో
జన్యువులు కొంత పాత్రను కలిగివున్నప్పటికీ, ఇతర ప్రభావాలు కూడా ఉన్నాయని స్పష్టమవుతోంది. ఒక ప్రధాన కారకం మన చుట్టూ ఉన్న వాతావరణం, అది ఆధునిక కాలాల్లో విపరీతమైన మార్పులకు గురైంది. నేటి యువత ఆనందించే ప్రజాదరణ పొందిన వినోదం గురించి, బోయ్స్ విల్ బి బోయ్స్ అనే పుస్తకం, “హత్యలు, కాల్పులు, కత్తిపోట్లు, పేగులు బయటికి తీయడం, ముక్కలుగా నరకడం, చర్మం ఒలిచేయడం, లేదా అంగవైకల్యం కలిగించడం వంటివాటితో నిండి ఉండే టీవీ కార్యక్రమాలను, సినిమాలను వేలాది గంటలపాటు చూస్తూ, అలాగే మానభంగాలను, ఆత్మహత్యలను, మాదకద్రవ్యాలను, మత్తుపానీయాలను, మూఢవిశ్వాసాలను గొప్ప చేసే సంగీతాన్ని వింటూ పెరిగే” పిల్లలు ఆరోగ్యదాయకమైన నైతిక సూత్రాలను పెంపొందింపజేసుకుంటారని ఆశించలేమని అంటోంది.“ఈ లోకాధికారి” అయిన సాతాను, మానవుని నీచమైన కోరికలను తృప్తిపరిచే వాతావరణాన్ని సృష్టించాడని స్పష్టమవుతోంది. అలాంటి వాతావరణం మనందరిపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపిస్తుందన్న వాస్తవాన్ని ఎవరు కాదనగలరు?—యోహాను 12:31; ఎఫెసీయులు 6:12; ప్రకటన 12:9, 12.
మానవజాతి బాధలకు మూలకారణం
మనం ముందే చూసినట్లుగా, మొదటి మానవ జంట పాపం చేసినప్పుడు మానవజాతి సమస్యలు ప్రారంభమయ్యాయి. ఫలితం? ఆదాము చేసిన పాపానికి, తరతరాల ఆదాము వారసులు బాధ్యులు కాకపోయినప్పటికీ వారంతా పాపమరణాలను, అపరిపూర్ణతను పుట్టుకతోనే వారసత్వంగా పొందారు. బైబిలు ఇలా వివరిస్తోంది: “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.”—రోమీయులు 5:12.
మానవుని అపరిపూర్ణత అతనికి ఖచ్చితంగా నష్టాన్ని కలిగిస్తుంది. కానీ అది అతడ్ని అన్ని విధాలైన నైతిక బాధ్యతల నుండి విముక్తుడ్ని చేయదు. జీవాన్ని ఇవ్వడానికి యెహోవా చేసిన ఏర్పాటుపై విశ్వాసం ఉంచి దేవుని ప్రమాణాలకు అనుగుణంగా తమ జీవితాలను మలుచుకునే వారికి ఆయన అనుగ్రహం లభిస్తుందని బైబిలు చూపిస్తోంది. యెహోవా తన ప్రేమపూర్వక దయను బట్టి మానవజాతిని విమోచించడానికి, ఒక విధంగా చెప్పాలంటే, ఆదాము పోగొట్టినదాన్ని తిరిగి కొనడానికి కనికరంతో కూడిన ఒక ఏర్పాటును చేశాడు. అదేమిటంటే ఆయన పరిపూర్ణ కుమారుడైన యేసుక్రీస్తు అర్పించిన విమోచన క్రయధన బలి, యేసు ఇలా చెప్పాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”—యోహాను 3:16; 1 కొరింథీయులు 15:21, 22.
ఈ ఏర్పాటు పట్ల అపొస్తలుడైన పౌలు తన ప్రగాఢమైన మెప్పుదలను వ్యక్తపరిచాడు. ఆయన బాధతో ఇలా అన్నాడు: “అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.” (రోమీయులు 7:24, 25) తాను ఏదైనా బలహీనత వల్ల గనుక పాపం చేస్తే, యేసుక్రీస్తు విమోచన క్రయధన బలి ఆధారంగా దేవుని క్షమాపణ కోసం వేడుకోవచ్చని పౌలుకు తెలుసు. *
మొదటి శతాబ్దంలోలాగే నేడు కూడా, గతంలో ఎంతో అనైతికమైన జీవితాలను గడిపిన లేదా నిరాశాపూరిత పరిస్థితుల్లో ఉన్న అనేకులు బైబిలు సత్యపు ఖచ్చితమైన జ్ఞానాన్ని పొంది, అవసరమైన మార్పులు చేసుకొని దేవుని ఆశీర్వాదాన్ని పొందగల స్థితికి వచ్చారు. వారు చేసుకోవలసిన మార్పులు అంత సులభమైనవేమీ కావు, ఇప్పటికీ అనేకులు హానికరమైన దృక్పథాలతో పోరాడవలసి ఉంది. కానీ దేవుని సహాయంతో, వారు తమ యథార్థతను కాపాడుకొంటూ ఆయన సేవ చేయడంలో ఆనందించగలుగుతున్నారు. (ఫిలిప్పీయులు 4:13) దేవుని అనుగ్రహాన్ని పొందడానికి అనేక మార్పులు చేసుకొన్న ఒక వ్యక్తిని గురించిన ఉదాహరణను పరిశీలించండి.
ఒక ప్రోత్సాహకరమైన అనుభవం
“నేను బోర్డింగ్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు, నేను స్వలింగ సంపర్కినని ఎప్పుడూ అనుకోకపోయినా, స్వలింగ సంపర్కంలో పాల్గొనేవాడిని. నా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు, వారి ప్రేమానురాగాల కోసం నేను ఎంతో తపించిపోయాను కానీ వాటిని పొందలేకపోయాను. పాఠశాల చదువు ముగించిన తర్వాత నేను నిర్బంధ సైనికసేవలో చేరాను. నేనుంటున్న సైనిక శిబిరం ప్రక్కనున్న శిబిరంలో కొంతమంది స్వలింగ సంపర్కులు ఉండేవారు. వాళ్ళ జీవన విధానాన్ని చూసి నేను చాలా అసూయపడేవాడిని, దానితో నేను
వాళ్ళతో సహవసించడం మొదలుపెట్టాను. వాళ్ళతో దాదాపు ఒక సంవత్సరం పాటు సహవసించిన తర్వాత, నన్ను నేను స్వలింగ సంపర్కిగానే పరిగణించుకోవడం మొదలుపెట్టాను, నేనిలా అనుకున్నాను: ‘నేనున్నది ఇలాగే, దీని విషయమై నేనింకేమీ చేయలేను.’“నేను లింగో (స్వలింగ సంపర్కుల భాష) నేర్చుకోవడం, మాదకద్రవ్యాలు మత్తుపదార్థాలు ఉచితంగా లభించే స్వలింగ సంపర్కుల క్లబ్బులకు వెళ్ళడం మొదలుపెట్టాను. పైకి అంతా ఎంతో ఉత్తేజకరంగా ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, వాస్తవానికి అది చాలా జుగుప్సాకరంగా ఉండేది. ఈ విధమైన సంబంధం అసహజమైనదనీ, దానికి ఎటువంటి భవితవ్యమూ లేదనీ నాకు అంతరాంతరాళాల్లో అనిపించేది.
“ఒక చిన్న పట్టణంలో, నాకు యెహోవాసాక్షుల రాజ్యమందిరం కనిపించింది, ఆ సమయంలో అక్కడ ఒక కూటం జరుగుతోంది. నేను లోపలికి వెళ్ళి, భవిష్యత్తులో రాబోయే పరదైసు పరిస్థితుల గురించి అక్కడ ఇవ్వబడుతున్న ప్రసంగం విన్నాను. ఆ తర్వాత నేను కొంతమంది సాక్షులను కలిశాను, వాళ్ళు నన్ను ఒక సమావేశానికి ఆహ్వానించారు, దానికి వెళ్ళాను. అది నాకు నిజంగా కనువిప్పు కలిగించింది—ఆనందంగా ఉన్న కుటుంబాల్లోని సభ్యులందరూ కలిసి ఆరాధించడాన్ని అక్కడ చూశాను. నేను సాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించాను.
“నేను బైబిలు నుండి నేర్చుకుంటున్నదాన్ని నా జీవితంలో ఆచరణలో పెట్టడానికి ఎంతో పోరాడవలసి వచ్చినప్పటికీ నేను వాటిని ఆచరణలో పెట్టడం మొదలుపెట్టాను. నా చెడు అలవాట్లన్నింటినీ మానుకోగలిగాను. నేను 14 నెలలపాటు అధ్యయనం చేసిన తర్వాత, నా జీవితాన్ని యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మం తీసుకున్నాను. జీవితంలో మొట్టమొదటిసారిగా నాకు నిజమైన స్నేహితులు లభించారు. ఇతరులు బైబిలు నుండి సత్యం నేర్చుకోవడానికి సహాయం చేయగలిగాను, ఇప్పుడు నేను క్రైస్తవ సంఘంలో పరిచర్య సేవకుడిగా సేవచేస్తున్నాను. యెహోవా నన్ను నిజంగా ఆశీర్వదించాడు.”
మనమే బాధ్యులం
మన తప్పుడు ప్రవర్తన అంతటికీ నిందను కేవలం జన్యువులపై వేయడానికి ప్రయత్నించడం సమస్యకు పరిష్కారం కాదు. సైకాలజీ టుడే పేర్కొంటున్నట్లుగా, అలా చేయడమన్నది, మన సమస్యలను పరిష్కరించుకోవడానికి లేదా వాటిని అధిగమించడానికి సహాయం చేసే బదులు “మన సమస్యల్లో అనేకమైన వాటికి మూలకారణమైన నిస్సహాయతను మనకు బోధిస్తుండవచ్చు. అది, సమస్యలు తలెత్తడాన్ని తగ్గించే బదులు అవి అధికమవ్వడానికి దోహదపడుతుందనిపిస్తోంది.”
మన సొంత పాపభరిత దృక్పథాల సహాయంతో, దేవునికి విధేయత చూపించకుండా మనల్ని అడ్డగించడానికి సాతాను చేస్తున్న ప్రయత్నాలతో సహా ప్రధానమైన ప్రతికూల శక్తులతో మనం పోరాడవలసి ఉందన్నది నిజమే. (1 పేతురు 5:8) మన జన్యువులు కూడా మనపై వివిధ రకాలుగా ప్రభావం చూపిస్తాయన్నది కూడా నిజమే. కానీ మనం మాత్రం నిస్సహాయ స్థితిలో లేము. నిజ క్రైస్తవులకు యెహోవా, యేసుక్రీస్తు వంటి శక్తిమంతులైన మిత్రులేగాక దేవుని పరిశుద్ధాత్మ, ఆయన వాక్యమైన బైబిలు, క్రైస్తవ సంఘము వంటి శక్తివంతమైన సహాయకాలు కూడా ఉన్నాయి.—1 తిమోతి 6:11, 12; 1 యోహాను 2:1.
ఇశ్రాయేలు జనాంగం వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి ముందు, దేవుని ఎదుట ప్రజలకు ఉన్న బాధ్యతను మోషే వారికి జ్ఞాపకం చేస్తూ ఇలా అన్నాడు: ‘నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుట ఉంచియున్నాను. నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి.’ (ద్వితీయోపదేశకాండము 30:19, 20) అలాగే నేడు, తన చర్యలకు నైతికంగా బాధ్యతవహించే ప్రతి వ్యక్తి దేవుని సేవచేస్తూ ఆయన కోరేవాటికి అనుగుణంగా జీవించడం గురించి వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత కలిగి ఉన్నాడు. కాబట్టి ఎంపిక మీదే.—గలతీయులు 6:7, 8.
[అధస్సూచీలు]
^ పేరా 10 తేజరిల్లు! అక్టోబరు 8, 1996, 3-8 పేజీలు చూడండి.
^ పేరా 19 యెహోవాసాక్షులు ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంలోని 62-9 పేజీలను చూడండి.
[9వ పేజీలోని చిత్రాలు]
ఆదాము హవ్వలు తమ జన్యువులలో ఏదో లోపం ఉన్నందున, పాపం చేసేలా ప్రేరేపించబడ్డారా?
[10వ పేజీలోని చిత్రాలు]
ప్రతి వ్యక్తి తాను తీసుకొనే నిర్ణయాలకు తానే బాధ్యత వహించాలా?
[చిత్రసౌజన్యం]
మత్తుపదార్ధాలు తీసుకొంటున్న వ్యక్తి: Godo-Foto
[11వ పేజీలోని చిత్రం]
మానవ ప్రవర్తనకు జన్యు కారకాలను కనుగొనడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు
[12వ పేజీలోని చిత్రం]
బైబిలు చెబుతున్న దాన్ని ఆచరణలో పెట్టడం, మార్పులు చేసుకోవడానికి యథార్థవంతులకు సహాయం చేయగలదు