దైవభక్తితో జీవించినందుకు ప్రతిఫలం లభించింది
జీ వి త క థ
దైవభక్తితో జీవించినందుకు ప్రతిఫలం లభించింది
విలియమ్ ఐహినోరీయా చెప్పినది
నాకు బాగా పరిచయమున్న నాన్నగారి మూలుగులతో మధ్యరాత్రి మెలకువ వచ్చింది. ఆయన తన కడుపును చేత్తో పట్టుకొని నేలమీద దొర్లుతున్నారు. మా అమ్మ, అక్క, నేను ఆయన చుట్టూ చేరాము. నొప్పి కాస్త తగ్గినట్లు అనిపించగానే, ఆయన లేచి కూర్చుని భారంగా నిట్టూర్చి, “ఈ భూమ్మీద కేవలం యెహోవాసాక్షులకు మాత్రమే సమాధానం ఉంది” అన్నారు. ఆ వ్యాఖ్యానం విని నేను అయోమయంలో పడ్డాను, కానీ అది నామీద చెరగని ముద్ర వేసింది. ఎందుకంటే నేను అంతకు ముందెప్పుడూ యెహోవాసాక్షుల గురించి వినలేదు. ఆయన మాటల అర్థమేమిటా అని ఆలోచించాను.
ఆసంఘటన 1953 లో నాకు ఆరేళ్ళున్నప్పుడు జరిగింది. మేము మధ్యపశ్చిమ నైజీరియాలోని ఈవోసా అనే గ్రామంలో నివసించేవాళ్ళం, అక్కడి ప్రధాన వృత్తి వ్యవసాయం. నాన్నగారికి ముగ్గురు భార్యలు, 13 మంది పిల్లలు. వాళ్ళల్లో రెండవ సంతానమైన నేను మొదటి కుమారుడ్ని. మేమందరం తాతగారి ఇంట్లోనే ఉండేవాళ్ళం. అది రెల్లుగడ్డితో నేసిన కప్పున్న మట్టి ఇల్లు, దానిలో నాలుగు గదులుండేవి. దాంట్లోనే నానమ్మ, నాన్నగారి ముగ్గురు సహోదరులు, వారి కుటుంబాలు కూడా ఉండేవి.
నా చిన్నప్పటి జీవితం చాలా దుఃఖమయం. అందుకు కారణం, నాన్నగారి అనారోగ్యమే. ఆయనకు కడుపు నొప్పి దీర్ఘకాలంగా ఉంది, అది చాలా సంవత్సరాల వరకూ అంటే ఆయన చనిపోయే వరకూ అలాగే ఉంది. అంతుచిక్కని ఆ దీర్ఘకాలిక జబ్బును, ఒక సాధారణ ఆఫ్రికా కుటుంబం భరించగల చికిత్స బాగుచేయలేకపోయింది. అటు మూలికా వైద్యము ఇటు సాంప్రదాయబద్ధమైన వైద్యము రెండూ పని చేయలేదు. ఉదయం కోడికూసే వరకూ నాన్నగారు నొప్పితో నేలమీదపడి దొర్లుతూ ఉంటే మేము ఆయన ప్రక్కన కూర్చుని ఏడుస్తూ ఎన్నో రాత్రులు గడిపాం. ఆయన తన జబ్బును నయం చేసుకోవడానికి అమ్మను తీసుకొని
వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారు, నన్నూ నా తోబుట్టువులనూ మా నానమ్మే చూసుకునేది.పెండలంను, కస్సావా దుంపను, కోలా గింజలను పండించి, వాటిని అమ్మడమే మా కుటుంబ జీవనోపాధి. మాకొచ్చే కొద్దిపాటి రాబడికి కాస్త వేన్నీళ్ళకు చన్నీళ్ళు తోడైనట్లుగా ఉంటుందని కొంత రబ్బర్ టాపింగ్ కూడా చేసేవాళ్ళం. మాకు ముఖ్యాహారం పెండలమే. మేము ఉదయం పెండలం తినేవాళ్ళం, మధ్యాహ్నం కూడా దంచి మెత్తగా చేసిన పెండలాన్ని తినేవాళ్ళం, రాత్రికి మళ్ళీ పెండలాన్నే తినేవాళ్ళం. ఎప్పుడైనా కాస్త మార్పు కోసం, వేయించిన అరటికాయలను తినేవాళ్ళం.
పూర్వీకుల ఆరాధన మా జీవితంలో ప్రాముఖ్యమైన భాగం. మా కుటుంబం, రంగు రంగుల ఆల్చిప్పలను కట్టిన కఱ్ఱలకు ఆహారాన్ని అర్పించేది. నాన్నగారు కూడా దుష్టాత్మలను, మాంత్రికులను దూరంగా ఉంచడానికని ఒక విగ్రహాన్ని ఆరాధించేవారు.
నాకు ఐదేళ్ళున్నప్పుడు, మేము మా గ్రామం నుండి దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ కేంద్రానికి తాత్కాలికంగా మారాము. అక్కడ నాన్నగారికి నారి క్రిముల వ్యాధి సోకడంతో, ఆయనకున్న కడుపునొప్పికి మరింత బాధ తోడయ్యింది. ఆయన పగలు అస్సలు పని చేయలేకపోయేవారు, రాత్రిళ్లు కడుపు నొప్పి ఆయనను చిత్రవధ చేసేది. నాకు జిగర్ లేదా సాండ్‌ఫ్లీ వ్యాధి అంటే ఒక విధమైన సన్నిపాత జ్వరం సోకింది. ఫలితంగా, మేము మా దగ్గరి బంధువులు పెట్టే దయా భిక్షపై జీవనం సాగించాము. మురికి కూపంలో మగ్గిపోయి మరణించకూడదని మళ్ళీ మా గ్రామమైన ఈవోసాకు మేము తిరిగి వచ్చేశాము. తన మొదటి కుమారుడ్నైన నేను కేవలం చాలీచాలని రాబడి వచ్చే రైతుకంటే ఉన్నత స్థాయికి ఎదగాలని నాన్నగారు ఆశించారు. నాకు చదువు చక్కగా అబ్బితే మా కుటుంబం మెరుగుపడుతుందనీ, నేను నా తోబుట్టువులను పెంచడానికి అది సహాయపడుతుందనీ ఆయన భావించారు.
వివిధ మతాలతో పరిచయం
మా గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత, నేను పాఠశాలకు వెళ్ళడం ప్రారంభించాను. దానితో నాకు క్రైస్తవమత సామ్రాజ్య మతాలతో పరిచయం ఏర్పడింది. 1950లలో, వలస రాజ్యాధిపతుల మతాన్ని, పాశ్చాత్య విద్య నుండి వేరు చేయడం ఎవరి తరమూ అయ్యేది కాదు. నేను రోమన్ క్యాథలిక్ ప్రాథమిక పాఠశాలకు వెళ్ళేవాడిని గనుక నేను రోమన్ క్యాథలిక్‌ను కావలసిందే.
నా 19వ ఏట 1966 లో, ఈవోసాకు దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈవోహిమ్నీ పట్టణంలోని పిల్‌గ్రిమ్ బాప్టిస్ట్ సెకండరీ స్కూల్‌లో నన్ను చేర్పించారు. అక్కడ నా మత సంబంధమైన విద్య మారిపోయింది, ఎందుకంటే నేను ఇప్పుడు ప్రొటెస్టెంట్ పాఠశాలకు వెళ్తున్నాను. కాబట్టి క్యాథలిక్ ప్రీస్టులు నన్ను ఆదివారం మాస్‌లో పాల్గొననిచ్చేవారు కాదు.
నేను ఈ బాప్టిస్ట్ స్కూల్‌లో ఉన్నప్పుడే మొదటిసారిగా నాకు బైబిలుతో పరిచయం ఏర్పడింది. నేను క్యాథలిక్ చర్చికి వెళ్ళడం కొనసాగించినప్పటికీ, ప్రతి ఆదివారం ఆ చర్చి ఆరాధనా కార్యక్రమం అయిపోయిన తర్వాత నాకు నేనుగా బైబిలు చదువుకునేవాడిని. యేసుక్రీస్తు బోధలు నన్నెంతో ఆకట్టుకున్నాయి, దైవభక్తితో అర్థవంతమైన జీవితాన్ని గడపాలనే కోరికను అవి నాలో రేకెత్తించాయి. నేను బైబిలు చదివేకొద్దీ కొంతమంది మతనాయకుల వేషధారణ, అనేకమంది సామాన్య ప్రజల అనైతిక జీవన విధానము ఎంతో ఏవగింపును పుట్టించాయి. క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారి మధ్య నేను చూసినదానికీ యేసు, ఆయన శిష్యులు బోధించిన, చేసిన దానికీ చాలా తేడా ఉంది.
ప్రాముఖ్యంగా కొన్ని సంఘటనలు నన్ను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఒకసారి నేను జపమాల కొనుక్కోవడానికి ఒక సైనిక దుకాణానికి వెళ్ళినప్పుడు, ఆ దుకాణం గుమ్మానికి పైన ఒక జూజూ తాయెత్తు వ్రేలాడుతుండడాన్ని చూశాను. మరోసారి, బాప్టిస్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ నాపై లైంగికంగా దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఆయన స్వలింగ సంపర్కి అనీ, ఇతరులపై కూడా అలాగే దాడి చేశాడనీ నాకు ఆ తర్వాత తెలిసింది. ఈ విషయాల గురించి ఆలోచిస్తూ నన్ను నేను ఇలా ప్రశ్నించుకునేవాడ్ని, ‘గంభీరమైన పాపాలు చేసినప్పటికీ బాధ్యులుగా ఎంచబడని సభ్యులు, నాయకులు ఉన్న మతాలను దేవుడు ఆమోదిస్తాడా?’
మత మార్పిడి
అయితే, నేను బైబిల్లో చదివినదాన్ని మాత్రం ఎంతో ఇష్టపడేవాడిని, దాన్నలాగే చదువుతూ ఉండాలని నిశ్చయించుకున్నాను. ఈ సమయంలోనే, 15 సంవత్సరాల క్రితం నాన్నగారు చేసిన, “ఈ భూమ్మీద కేవలం యెహోవాసాక్షులకు మాత్రమే సమాధానం ఉంది” అన్న వ్యాఖ్యానం గురించి ఆలోచించడం ప్రారంభించాను. కానీ మా స్కూల్లో ఉన్న సాక్షులు హేళన చేయబడేవారు, కొన్నిసార్లు ఉదయపు ఆరాధనలో పాల్గొననందుకు శిక్షించబడేవారు అందుకే నేను భయపడేవాడిని. పైగా, వారి నమ్మకాల్లో కొన్ని చాలా వింతగా అనిపించేవి. ఉదాహరణకు, కేవలం 1,44,000 మంది మాత్రమే పరలోకానికి వెళతారని విశ్వసించడం నాకు కష్టమనిపించింది. (ప్రకటన 14:3) అయితే పరలోకానికి వెళ్ళాలన్నది నా కోరిక గనుక, బహుశా నేను జన్మించక ముందే ఈ సంఖ్య పూర్తైపోయిందేమోనని నేను ఆలోచించేవాడిని.
సాక్షులు తమ ప్రవర్తనలోనూ వైఖరిలోనూ భిన్నంగా ఉండేవారన్నది మాత్రం స్పష్టం. స్కూల్లోని ఇతర యౌవనస్థుల్లా వారు అనైతికమైన, దౌర్జన్యపూరితమైన కార్యకలాపాల్లో పాల్గొనేవారు కాదు. నా దృష్టికి, వారు నిజంగా లోకం నుండి వేరుగా ఉన్నవారు—నిజమైన మతాన్ని అవలంభించేవారు ఎలా ఉండాలని నేను బైబిలులో చదివానో సరిగ్గా అలాగే వారున్నారు.—యోహాను 17:14-16; యాకోబు 1:27.
నేను దీని గురించి మరింత పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నాను. నేను 1969 సెప్టెంబరులో “నిత్యజీవమునకు నడుపు సత్యము” అనే పుస్తకాన్ని పొందగలిగాను. తర్వాతి నెలలో, ఒక పయినీర్ నాతో అధ్యయనం చేయడం ప్రారంభించాడు, యెహోవాసాక్షుల పుర్తికాల పరిచారకుడ్ని పయినీర్ అని పిలుస్తారు. మొదటి అధ్యయనంతో పురికొల్పబడిన నేను సత్యము పుస్తకాన్ని ఒక శనివారం రాత్రి చదవడం ప్రారంభించి, మర్నాటి మధ్యాహ్నానికల్లా పూర్తిచేశాను. వెంటనే, నేను చదివిన అద్భుతమైన విషయాలను నా తోటి విద్యార్థులకు చెప్పడం ప్రారంభించాను. విద్యార్థులు, ఉపాధ్యాయులు నేను క్రొత్తగా తెలుసుకున్న విశ్వాసం నన్ను వెఱ్ఱివాడ్ని చేస్తోందనుకున్నారు. కానీ నేను వెఱ్ఱివాడ్ని కావడం లేదని నాకు బాగా తెలుసు.—అపొస్తలుల కార్యములు 26:24.
నేనొక క్రొత్త మతాన్ని ప్రకటిస్తున్నానని నా తల్లిదండ్రులకు వార్తలు చేరాయి. అసలు నా సమస్యేమిటో కనుక్కోవడానికి, నన్ను వెంటనే ఇంటికి తిరిగి రమ్మని చెప్పారు. నేను సలహా తీసుకోవడానికి దగ్గర్లో ఎవ్వరూ లేరు, ఎందుకంటే సాక్షులందరూ అప్పుడు జిల్లా సమావేశానికని ఇలెష్షా అనే పట్టణానికి వెళ్ళారు. నేను ఇంటికి తిరిగి వెళ్ళగానే, నా తల్లి, ఇతర బంధువులు నన్ను ప్రశ్నలతో, విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేసేశారు. నేను బైబిలు నుండి తెలుసుకుంటున్నదాన్ని 1 పేతురు 3:15.
సమర్థించుకోవడానికి సాధ్యమైనంత మేరకు ప్రయత్నించాను.—యెహోవాసాక్షులు అబద్ధ బోధకులని నిరూపించడానికి ప్రయత్నించి, సఫలమవ్వలేక మా బాబాయి మరో పద్దతిని ఎన్నుకున్నాడు. ఆయన నన్నిలా బ్రతిమాలాడు: “నువ్వు చదువుకోవడానికి స్కూలుకు వెళ్ళావని గుర్తుంచుకో. నువ్వు చదువు మానేసి ప్రకటించడానికి వెళ్తే, నీ చదువును ముగించలేవు. నీ స్కూలు చదువు అయ్యే వరకు ఈ క్రొత్త మతంలో చేరడాన్ని నువ్వు ఎందుకు వాయిదా వేయకూడదు?” ఆ సమయంలో అది నాకు సహేతుకంగానే అనిపించింది, దానితో నేను సాక్షులతో అధ్యయనం చేయడం మానేశాను.
డిసెంబరు, 1970 లో నేను పట్టభద్రుడ్ని అయిన తర్వాత, నేరుగా రాజ్య మందిరానికి వెళ్ళాను, ఇక అప్పటి నుండి యెహోవాసాక్షుల కూటాలకు వెళ్తూనే ఉన్నాను. 1971 ఆగస్టు 30న, దేవునికి చేసుకున్న సమర్పణకు సూచనగా నేను బాప్తిస్మం తీసుకున్నాను. అది నా తల్లిదండ్రులనే కాదు మొత్తం ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందర్నీ కలచివేసింది. ప్రభుత్వ స్కాలర్‌షిప్ పొందడంలో, ఈవోసాలోనూ ఆ చుట్టుప్రక్కల ప్రాంతమంతటిలోనూ నేను మొట్టమొదటి వాడిని. కాబట్టి చాలామంది నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, నేను మా ప్రాంతాన్ని మెరుగుపరచడానికి నా చదువును ఉపయోగిస్తానని వాళ్ళు ఆశించారు. అందుకే నేను తమను నిరుత్సాహపరిచానని వారందరూ అన్నారు.
మతమార్పిడి పర్యవసానాలు
నేను నా విశ్వాసాన్ని వదులుకొనేలా నన్ను ఒప్పించడానికి నా కుటుంబం, మా ప్రాంతంలోని పెద్దలు ఒక బృందాన్ని పంపించారు. వారు నన్నలా ఒప్పించడంలో శాపనార్థాలు కూడా పెట్టారు. “నీవు గనుక ఈ మతాన్ని వదిలిపెట్టకపోతే, నీ భవిష్యత్తు నాశనమవుతుంది, నీకు ఉద్యోగం దొరకదు. నీవు నీ సొంత ఇల్లు కట్టుకోలేవు, నీవు పెళ్ళి చేసుకుని కుటుంబాన్ని ఏర్పరచుకోలేవు” అన్నారు.
వాళ్ళ అంచనాలను తారుమారు చేస్తూ, పాఠశాల చదువు ముగించిన పది నెలలకు నాకు ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది. నేను 1972 అక్టోబరులో వెరోనికాను వివాహం చేసుకున్నాను, ఆమె నాకు ప్రియమైన భార్య అయ్యింది. తర్వాత, ప్రభుత్వం నాకు వ్యవసాయ విస్తృత ఏజెంటుగా శిక్షణను ఇచ్చింది. నేను అప్పుడు నా మొట్టమొదటి కారు కొనుక్కున్నాను, ఒక ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టాను. మా మొదటి కుమార్తె విక్టరీ 1973 నవంబరు 5న జన్మించింది, ఆ తర్వాతి సంవత్సరాల్లో మాకు లిడియా, విల్‌ఫ్రెడ్, జోన్‌లు పుట్టారు. మా చివరి కుమారుడు మైకా 1986 లో జన్మించాడు. వాళ్ళంతా రత్నాల్లాంటి పిల్లలుగా, యెహోవా ఇచ్చిన స్వాస్థ్యంగా తమను తాము నిరూపించుకున్నారు.—కీర్తన 127:3.
గతం గురించి ఒకసారి ఆలోచించుకుంటే, మా ప్రాంతంలోని వారు పెట్టిన శాపనార్థాలన్నీ ఆశీర్వాదాలయ్యాయని నేను చెప్పగలను. అందుకే నేను నా మొదటి కుమార్తెకు విక్టరీ (విజయం) అని పేరు పెట్టుకున్నాను. ఇటీవల, మా ప్రాంతంలోనివారు ఉత్తరం ద్వారా నాతో ఇలా అన్నారు: “దేవుడు ఇప్పుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు గనుక దయచేసి నీవు ఇంటికి తిరిగి వచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో భాగం వహించాలని మేము కోరుకుంటున్నాము.”
దేవుని మార్గాల్లో పిల్లలను పెంచడం
దేవుడు మాకిచ్చిన పిల్లల్ని పెంచే బాధ్యతతో, వస్తుసంపదల కోసం పాటుపడడాన్ని జతచేయలేమని నాకూ నా భార్యకూ తెలుసు. కాబట్టి మేము నిరాడంబర జీవితంతో తృప్తిపడడం నేర్చుకున్నాం. మరో విధమైన జీవన విధానాన్ని ఎంచుకోవడం ద్వారా వచ్చే పర్యవసానాలను ఎదుర్కోవడం కంటే, ఈ విధమైన జీవితాన్ని గడపడానికే మేము ఇష్టపడతాము.
ఒకే స్నానాల గదిని, వంటగదిని, తదితరమైన వాటిని ఇతర కుటుంబాలతో కలిసి పంచుకుంటూ ఒకే భవనంలో నివసించడం మా ప్రాంతంలో సర్వసాధారణమే. కానీ నేను ప్రభుత్వోద్యోగిగా బదిలీ అయ్యే ప్రతి ప్రాంతంలోనూ అన్ని వసతులూ ఉన్న ఇంట్లో అద్దెకు ఉండగలుగుతున్నందుకు మేము సంతోషించేవాళ్ళం. నిజమే, అలాంటి వసతులున్న ఇండ్లకు అద్దె ఎక్కువే, అయితే అలాంటి వాటిల్లో నివసించడం మా పిల్లలపై చెడు ప్రభావాలు పడకుండా కాపాడింది. సంవత్సరాలు గడుస్తుండగా మేము మా పిల్లల్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచగలిగినందుకు నేను యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
అంతేగాక, మా పిల్లలతో ఉండి వారి గురించి శ్రద్ధ తీసుకోవడానికి నా భార్య గృహిణిగానే ఉండిపోయింది. నేను పని ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత, కుటుంబమంతా కలిసి పనులు చేసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళం. ఏది చేసినా మేమందరం కలిసి చేసేవాళ్ళం. అలాంటి వాటిలో కుటుంబ బైబిలు అధ్యయనం, కూటాలకు సిద్ధపడడం, కూటాలకు హాజరవడం, క్రైస్తవ పరిచర్యలో పాల్గొనడం అలాగే సాంఘికపరమైన కార్యకలాపాల్లో భాగం వహించడం కూడా ఇమిడి ఉన్నాయి.
పిల్లలకు కేవలం ఇంట్లోనే కాదుగానీ అవకాశం లభించిన ప్రతీసారి బోధించాలని ద్వితీయోపదేశకాండము 6:6, 7 వచనాల్లో తల్లిదండ్రులకు ఇవ్వబడిన సలహాను అనుసరించడానికి మేము ప్రయత్నించాము. దానివల్ల మా పిల్లలు, సాక్షుల పిల్లలతోనే సహవాసం చేసేవారు. నేనూ, వెరోనికా మా నమ్మకాలను పంచుకోలేని వారితో ఎక్కువ సమయం గడిపేవాళ్ళం కాదు, కాబట్టి మా పిల్లలు మా మాదిరి నుండి దానిని నేర్చుకున్నారు.—సామెతలు 13:20; 1 కొరింథీయులు 15:33.
మా పిల్లల జీవితాలపై అనుకూల ప్రభావాన్ని చూపింది కేవలం మా నడిపింపు, బోధ మాత్రమే కాదు. ఆసక్తిగల క్రైస్తవుల కోసం మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరుచుకొని ఉండేవి, ఇప్పటికీ అవి తెరుచుకొనే ఉన్నాయి. అలా వచ్చేవారిలో ఎక్కువగా యెహోవాసాక్షుల ప్రయాణ పరిచారకులే ఉండేవారు. పరిణతి చెందిన ఈ క్రైస్తవులు మాతో గడిపిన సమయం, వారి స్వయంత్యాగపూరిత జీవన విధానాన్ని గమనించడానికీ దాని నుండి నేర్చుకోవడానికీ మా పిల్లలకు సదవకాశాన్నిచ్చింది. ఇది మా పిల్లలకు మేము చేసే బోధను బలపరిచింది, వాళ్లు బైబిలు సత్యాన్ని తమ సొంతం చేసుకున్నారు.
దైవభక్తికి ప్రతిఫలం లభించింది
నేడు నేనూ నా భార్యా మా నలుగురు పిల్లలతో పాటు పూర్తికాల పరిచర్యలో ఉన్నాము. నేను నా పయినీరు సేవను మొదటిసారి 1973 లో ప్రారంభించాను. సంవత్సరాలు గడుస్తుండగా, ఆర్థిక పరిస్థితుల కారణంగా నేను అప్పుడప్పుడూ పూర్తికాల పరిచర్యను మధ్యలో ఆపవలసి వచ్చింది. అయితే కొన్నిసార్లు యెహోవాసాక్షుల క్రైస్తవ పైవిచారణకర్తలకు తర్ఫీదునిచ్చే రాజ్య పరిచర్య పాఠశాలలో బోధించే ఆధిక్యత కూడా నాకు లభించింది. ప్రస్తుతం ఆసుపత్రి అనుసంధాన కమిటీలోనూ అలాగే ఊహోన్మొరా నగర పైవిచారణకర్తగానూ సేవ చేసే ఆధిక్యత నాకుంది.
నా కుమార్తెలైన విక్టరీ, లిడియాలు ప్రశస్తమైన క్రైస్తవ పెద్దలను పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉన్నారు. వాళ్ళూ, వాళ్ళ భర్తలు నైజీరియాలోని ఈగేడూమాలో ఉన్న యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో సభ్యులుగా సేవ చేస్తున్నారు. మా పెద్ద కుమారుడు విల్‌ఫ్రెడ్ పరిచర్య సేవకుడిగా సేవచేస్తున్నాడు, మా చిన్న కుమారుడు మైకా అప్పుడప్పుడూ సహాయ పయినీరుగా సేవచేస్తుంటాడు. జోన్ 1997 లో తన ప్రాథమిక పాఠశాల విద్యను ముగించుకొని, క్రమ పయినీరు సేవ ప్రారంభించింది.
నా జీవితంలోని అత్యంత ప్రతిఫలదాయకమైన అనుభవాల్లో ఒకటి యెహోవా దేవుని సేవ చేయడానికి ఇతరులకు సహాయం చేయడం. నేనలా సహాయం చేసినవారిలో మా బంధువులు కూడా కొందరు ఉన్నారు. మా నాన్నగారు యెహోవా సేవ చేయడానికి కృషిచేశారు, కానీ ఆయనకు ఎక్కువమంది భార్యలుండడం ఆయన అభివృద్ధిని ఆటంకపరిచింది. నాకు చిన్న వయస్సు నుండే ప్రజలపట్ల ప్రేమ ఉంది. ఇతరుల బాధలను చూసినప్పుడు, నా సమస్యలు చాలా చిన్నవన్నట్లు అనిపిస్తుంది. వారికి సహాయం చేయాలన్న యథార్థమైన నా కోరికను వారు గ్రహించడమే నాతో మాట్లాడడం వారికి సులభమయ్యేలా చేస్తుందనుకుంటా.
దేవుని సంకల్పాలను గురించిన పరిజ్ఞానాన్ని పొందడానికి నేను సహాయం చేసిన వారిలో ఒక వ్యక్తి మంచానికి పరిమితమై ఉండేవాడు. ఆయన ఎలక్ట్రిసిటీ కంపెనీలో పనిచేసేవాడు, ఒకరోజు పనిలో ఉన్నప్పుడు కరెంట్ షాక్ కొట్టి, ఛాతి నుండి క్రిందకి పక్షవాతం వచ్చింది. ఆయన బైబిలు అధ్యయనం చేయడానికి అంగీకరించి, తాను నేర్చుకొంటున్న దానికి క్రమంగా ప్రతిస్పందించడం మొదలుపెట్టాడు. మా ఇంటి దగ్గరున్న వాగులో, 1995 అక్టోబరు 14న ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు, 15 సంవత్సరాల్లో తన పక్క మీది నుండి కదలడం అదే మొదటిసారి. అది తన జీవితంలోకెల్లా ఆనందకరమైన దినమని ఆయన అన్నాడు. సంఘంలో ఇప్పుడాయనొక పరిచర్య సేవకుడు.
దాదాపు 30 సంవత్సరాల క్రితం యెహోవా సమర్పిత ప్రజలతో కలిసికట్టుగా ఆయన సేవ చేయాలని నిర్ణయించుకున్నందుకు ఎటువంటి నిరుత్సాహాలూ కలగలేదని చెప్పాలి. నిజమైన ప్రేమను వారి మధ్య నేను కార్యరూపంలో చూశాను. యెహోవా తన నమ్మకమైన సేవకులకు తానిచ్చే ప్రతిఫలంలో నిత్యజీవ నిరీక్షణ ఒక భాగం కాకపోయినప్పటికీ, నేను దైవభక్తిగల జీవితాన్నే కోరుకుంటాను. (1 తిమోతి 6:6; హెబ్రీయులు 11:6) ఆ దైవభక్తే నా జీవితానికి నిర్దేశాన్ని, స్థిరత్వాన్ని ఇచ్చి, నాకూ నా కుటుంబానికీ ఆనందాన్ని, సంతృప్తిని, సంతోషాన్ని తీసుకువస్తున్నది.
[25వ పేజీలోని చిత్రం]
నా భార్యా పిల్లలతో 1990 లో
[26వ పేజీలోని చిత్రం]
నా భార్యా, పిల్లలు, ఇద్దరు అల్లుళ్ళతో