కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మరణం గురించిన కొన్ని కల్పిత కథనాల నిశిత పరిశీలన

మరణం గురించిన కొన్ని కల్పిత కథనాల నిశిత పరిశీలన

మరణం గురించిన కొన్ని కల్పిత కథనాల నిశిత పరిశీలన

చరిత్రంతటిలో, మానవుడు నిరాశాపూరితమైన మృత్యు ఛాయను చూసి కలవరపడ్డాడు, ఆందోళన చెందాడు. అగ్నిలో ఆజ్యం పోసినట్లు, దానికి తోడు అబద్ధమత తలంపులు, వ్యాప్తిలో ఉన్న ఆచారాలు, లోతుగా నాటుకుపోయిన వ్యక్తిగత నమ్మకాలు మృత్యుభయాన్ని ఇంకా అధికం చేశాయి. మృత్యుభయం వల్ల వచ్చే సమస్య ఏమిటంటే, అది జీవితాన్ని అనుభవించే సామర్థ్యాన్ని స్తంభింపజేసి, జీవితానికి ఒక అర్థమంటూ ఉందనే నమ్మకాన్ని హరించివేయగలదు.

మరణం గురించి, ప్రాచుర్యంలో ఉన్న అనేక కల్పిత కథనాలను వృద్ధి చేసినందుకు, ప్రజాదరణ పొందిన మతమే ప్రత్యేకించి నిందార్హమైనది. వాటిలో కొన్నింటిని బైబిలు సత్యపు వెలుతురులో పరిశీలించడం ద్వారా, మరణం గురించిన మీ వ్యక్తిగత అభిప్రాయాలేమైనా స్పష్టమవుతాయేమో చూడండి.

కల్పిత కథనం 1: మరణం జీవితానికి సహజమైన ముగింపు.

మరణం​—⁠పెరుగుదలకు అంతిమ స్థాయి (ఆంగ్లం) అనే ఒక పుస్తకం, “మరణం . . . మన జీవితాల్లో ఒక ప్రధాన భాగం” అని చెబుతోంది. ఇలాంటి వ్యాఖ్యానాలు మరణం సాధారణం, సజీవ ప్రాణులన్నింటికీ అది సహజమైన ముగింపు అనే నమ్మకాన్ని ప్రతిబింబిస్తాయి. తత్ఫలితంగా, అలాంటి నమ్మకం చాలామందిలో శూన్యవాదం, అవకాశవాదం అభివృద్ధి చెందేలా చేసింది.

అయితే, మరణం నిజంగానే జీవితానికి సహజమైన ముగింపా? పరిశోధకులందరూ దాన్ని నమ్మడం లేదు. ఉదాహరణకు, మానవుల వృద్ధాప్యంపై అధ్యయనం చేసిన కాల్విన్‌ హార్లే అనే ఒక జీవశాస్త్రవేత్త ఒక ఇంటర్వ్యూలో, మానవులు “మరణించడానికి రూపొందించబడ్డారు” అనే విషయాన్ని తాను నమ్మనని చెప్పాడు. వ్యాధి నిరోధక శాస్త్రవేత్త విలియం క్లార్క్‌, “మరణం జీవితపు నిర్వచనం నుండి వేరుచేయడానికి వీల్లేని విధంగా ఏమీ పెనవేసుకుపోలేదు” అని వ్యాఖ్యానించాడు. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన సేమోర్‌ బెంజర్‌, “వృద్ధాప్యాన్ని ఒక గడియారంలా కాకుండా, మనం మార్చడానికి వీలున్న సంఘటనల పరంపరగా చక్కగా వర్ణించవచ్చు” అని ఆలోచనాపూర్వకంగా అంటున్నాడు.

మానవుల నిర్మాణం గురించి శాస్త్రజ్ఞులు అధ్యయనం చేస్తునప్పుడు వారు తికమకపడుతున్నారు. 70 నుండి 80 ఏండ్ల వరకు ఉండే మన జీవితాయుష్షుకు అవసరమైనవాటి కంటే ఎంతో ఎక్కువ శక్తిసామర్థ్యాలు మనలో ఉన్నాయని వారు కనుగొంటున్నారు. ఉదాహరణకు, మానవుని మెదడుకు అపారమైన జ్ఞాపకశక్తి ఉన్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఒక పరిశోధకుడు, “ప్రపంచంలోని అత్యంత పెద్ద గ్రంథాలయాల్లో ఉన్నన్ని అంటే సుమారు రెండు కోట్ల సంపుటాల్లో పట్టేంత సమాచారాన్ని” మన మెదడు నిక్షిప్తం చేసుకోగలదని అంచనా వేశాడు. కొందరు నాడీమండల శాస్త్రవేత్తలు, ఒక వ్యక్తి తన మెదడుకున్న సామర్థ్యం నుండి తన సగటు జీవితకాలంలో కేవలం ఒక్క శాతంలో 1/100వ వంతు (.0001) మాత్రమే వినియోగించుకుంటాడని నమ్ముతారు. అటువంటప్పుడు, మనమిలా ప్రశ్నించడం సముచితమే: ‘మన సగటు జీవితకాలంలో, మన మెదడుకున్న సామర్థ్యం నుండి కేవలం అత్యంత స్వల్పభాగమే వినియోగించుకుంటున్నట్లైతే మరి మనకు అంత గొప్ప సామర్థ్యం ఉన్న మెదడు ఎందుకుంది?’

మానవులు మరణానికి ఎంత అసహజంగా ప్రతిస్పందిస్తారో కూడా గమనించండి! అధికశాతం వ్యక్తుల్లో భార్య గానీ భర్త గానీ పిల్లవాడు గానీ మరణించినప్పుడు ఆ బాధాకరమైన అనుభవం జీవితకాలమంతా ఉండగలదు. తరచుగా తమకు ఎంతో ప్రియమైన వ్యక్తి మరణం తర్వాత, చాలా కాలం వరకు ప్రజల భావోద్వేగ నిర్మాణమంతా కలతతో ఉంటుంది. మరణం మానవులకు సహజమేనని నమ్మే వ్యక్తులు సైతం తమ సొంత మరణం తమ జీవితానికి ముగింపు అని అంగీకరించడం కష్టమని గ్రహిస్తారు. “జీవితానుభవం ఉన్నవారిలో సర్వసాధారణంగా ఉన్న తలంపు ఏమిటంటే తాము సాధ్యమైనంత కాలం జీవించాలని కోరుకోవడమే” అని బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ చెబుతోంది.

మరణం విషయంలో మానవుని సాధారణ ప్రతిస్పందన, అతని అద్భుతమైన జ్ఞాపకశక్తి, నేర్చుకొనే సామర్థ్యం, అతనిలోని నిత్యత్వ కాంక్ష చూసినప్పుడు అతను జీవించడానికే సృష్టించబడ్డాడని స్పష్టమవడం లేదా? నిజానికి, దేవుడు మానవులను నిత్యం జీవించే సాధ్యతతో సృష్టించాడు గానీ మరణంతో జీవితం ముగిసిపోవాలని సృష్టించలేదు. మొదటి మానవ దంపతుల ఎదుట దేవుడు ఎలాంటి భవిష్యత్తును ఉంచాడో గమనించండి: ‘మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి.’ (ఆదికాండము 1:​28) అదెంత అద్భుతమైన, శాశ్వతమైన భవిష్యత్తో కదా!

కల్పిత కథనం 2: దేవుడు ప్రజలను తన దగ్గర ఉంచుకోవడానికి మరణం ద్వారా వారిని తీసుకువెళతాడు.

ముగ్గురు పిల్లలు గల 27 సంవత్సరాలున్న ఒక తల్లి, తాను మరణించడానికి ముందు ఒక క్యాథలిక్‌ సన్యాసినితో, “నేను మరణించడం దేవుని చిత్తమని నాకు చెప్పకు. . . . ఎవరైనా అలా చెబితే నాకు చాలా బాధ కలుగుతుంది” అని అంది. అయితే, మరణం గురించి అనేక మతాలు ఇలాగే బోధిస్తాయి​—⁠దేవుడు తన దగ్గర ఉంచుకోవడానికి ప్రజలను తీసుకువెళతాడు.

మరణం మన హృదయాలను బ్రద్దలు చేస్తుందని తెలిసి కూడా, మన సృష్టికర్త నిజంగా మనల్ని నిర్దయగా మరణానికి గురి చేసేంతటి క్రూరుడా? కాదు, బైబిలులోని దేవుడు అలాంటి వాడు కాదు. 1 యోహాను 4:⁠8 ప్రకారం, “దేవుడు ప్రేమాస్వరూపి.” అది, దేవునికి ప్రేమ ఉంది అనో దేవుడు ప్రేమగలవాడు అనో చెప్పడం లేదు కానీ దేవుడు ప్రేమాస్వరూపి అని చెబుతోందన్న విషయాన్ని గమనించండి. దేవుని ప్రేమ ఎంతో బలమైనది, ఎంతో పవిత్రమైనది, ఎంతో పరిపూర్ణమైనది. ఆయన ప్రేమాస్వరూపి అని పిలవబడడం యుక్తమే అనేంత సమగ్రంగా ఆయన వ్యక్తిత్వాన్ని, చర్యలను ఆ ప్రేమ వెల్లడి చేస్తుంది. ప్రజలను తన దగ్గర ఉంచుకోవడానికి వారిని మరణం ద్వారా తీసుకువెళ్ళే దేవుడు కాదాయన.

స్వర్గము, నరకము, పర్గేటరీ (పాపవిమోచన స్థలము), లింబో (బాప్తిస్మానికి ముందే మరణించినవారిని బంధించి ఉంచే స్థలము)​—⁠వీటితోపాటు, అగమ్యగోచరమైనవాటి నుండి అత్యంత భయంకరమైనవాటి వరకు విభిన్నమైన గమ్యస్థానాలు ఉన్నాయంటూ, మరణించిన వారు ఎక్కడుంటారనే దాని గురించీ, వారి పరిస్థితి గురించీ అబద్ధమతం అనేకులను అయోమయంలో పడేసింది. బైబిలు మరో ప్రక్కన, మరణించినవారు అచేతనావస్థలో ఉంటారని మనకు చెబుతోంది; వారు, గాఢ నిద్రావస్థతో పోల్చదగిన స్థితిలో ఉన్నారు. (ప్రసంగి 9:​5, 10; యోహాను 11:​11-15) కాబట్టి, మరణం తర్వాత మనకు ఏమి సంభవిస్తుందనే దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా నిద్రిస్తున్న ఒక వ్యక్తిని చూసి మనం ఏ విధంగా భయపడకుండా ఉంటామో అలా ఉండాలి. యేసు ఒక కాలం గురించి మాట్లాడుతూ, అప్పుడు “సమాధులలో నున్నవారందరు” పరదైసు భూమి మీద నూతన జీవితం కోసం “బయటికి వచ్చెదరు” అని అన్నాడు.​—⁠యోహాను 5:​28, 29; లూకా 23:​43.

కల్పిత కథనం 3: దేవుడు చిన్న పిల్లలను దేవదూతలుగా మార్చడానికి తీసుకువెళ్తాడు.

అంతిమదశలో ఉన్న రోగులపై అధ్యయనం చేసిన ఎలిజబెత్‌ క్యూబ్లర్‌ రాస్‌, మత విశ్వాసుల్లో ఉన్న మరొక సాధారణ తలంపును సూచించింది. ఒక వాస్తవ సంఘటనను వర్ణిస్తూ “తమ్ముడ్ని కోల్పోయిన ఒక చిన్న పాపతో, దేవుడు చిన్న అబ్బాయిలను చాలా ప్రేమిస్తాడు, అందుకే ఆయన చిన్నారి జానీని స్వర్గానికి తీసుకువెళ్ళాడు అని చెప్పడం అవివేకం” అని ఆమె పేర్కొన్నది. అలాంటి వ్యాఖ్యానం దేవునిపై దురభిప్రాయం కలిగేలా చేస్తుందే తప్ప ఆయన వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను వ్యక్తం చేయదు. డాక్టర్‌ క్యూబ్లర్‌ రాస్‌ ఇంకా ఇలా చెబుతోంది: “ఆ చిన్న పాప పెరిగి ఒక స్త్రీ అయిన తర్వాత కూడా దేవుని మీద ఆమెకు కోపం తగ్గలేదు, తత్ఫలితంగా ఆమె మూడు దశాబ్దాల తర్వాత తన చిన్న కుమారుడ్ని కోల్పోయినప్పుడు మానసికంగా తీవ్రంగా కృంగిపోయింది.”

ఒక పిల్లవాడి అవసరం అతని తల్లిదండ్రులకంటే ఎక్కువగా తనకే ఉన్నట్లు, దేవుడు మరొక దేవదూత కోసం ఒక పిల్లవాడిని ఎందుకు లాక్కుంటాడు? దేవుడు పిల్లలను తీసుకువెళ్ళడం నిజమే అయితే, అది ఆయనను ఒక ప్రేమలేని, స్వార్థపరుడైన సృష్టికర్తగా చేయదా? అలాంటి తలంపుకు భిన్నంగా “ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది” అని బైబిలు చెబుతోంది. (1 యోహాను 4:⁠7) అలాంటి ప్రేమగల దేవుడు, కొద్దిపాటి నైతికతగల మానవులే ఏ మాత్రం సహించలేని నష్టాన్ని చేకూరుస్తాడా?

మరి పిల్లలు ఎందుకు మరణిస్తారు? బైబిలు సమాధానంలోని కొంత భాగం ప్రసంగి 9:⁠11 (NW)లో ఇలా పేర్కొనబడింది: “కాలము, అనూహ్య సంఘటనల ప్రభావానికి వారందరు గురవుతున్నారు.” దాంతోపాటు, మనమందరం గర్భంలోనుండే అపరిపూర్ణులము, పాపులము అని కీర్తన 51:5 చెబుతోంది, దాని ఫలితంగానే నేడు మనుష్యులందరూ అనేక విధాలుగా మరణిస్తున్నారు. కొన్నిసార్లైతే గర్భంలోనే మరణించి మృతశిశువులుగా జన్మిస్తారు. ఇతర సందర్భాల్లోనైతే, విపత్కర పరిస్థితుల వల్ల ప్రమాదాల వల్ల పిల్లలు మరణిస్తారు. అలాంటి సంఘటనలకు దేవుడు బాధ్యుడు కాదు.

కల్పిత కథనం 4: మరణించిన తర్వాత కొందరు హింసించబడతారు.

దుష్టులు మండుతూ ఉండే నరకానికి వెళతారనీ అక్కడ శాశ్వతకాలం హింసించబడతారనీ అనేక మతాలు బోధిస్తాయి. ఈ బోధ సహేతుకమైనదేనా? లేఖనాధారమైనదేనా? మానవ జీవితం 70 లేక 80 సంవత్సరాలకే పరిమితం. తన జీవిత కాలమంతా తీవ్రమైన దుష్టత్వానికి పాల్పడిన ఒక దోషికి, నిరంతర హింసను శిక్షగా విధించడం న్యాయమేనా? కాదు. స్వల్పకాలిక జీవితంలో చేసిన పాపాలకు ఒక వ్యక్తిని నిత్యం హింసించడం పూర్తిగా అన్యాయమే అవుతుంది.

మనుష్యులు మరణించిన తర్వాత ఏమి జరుగుతుందన్నది దేవుడు మాత్రమే తెలియజేయగలడు. ఆయన తన లిఖిత వాక్యమైన బైబిలులో దాన్ని తెలియజేశాడు. అదిలా చెబుతోంది: “నరులు చచ్చునట్లు మృగములును చచ్చును; సకల జీవులకు ఒక్కటే ప్రాణము; . . . సమస్తము ఒక్క స్థలమునకే పోవును; సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును.” (ప్రసంగి 3:​19, 20) ఇక్కడ మండుతూ ఉండే నరకం గురించిన ప్రస్తావనే లేదు. వారు చనిపోయినప్పుడు​—⁠ఉనికిలో లేకుండా పోతారు​—⁠మట్టిలో కలిసి పోతారు.

ఒక వ్యక్తి హింసించబడాలంటే, ఆయన స్పృహలో ఉండాలి. మరి చనిపోయినవారు స్పృహలో ఉంటారా? బైబిలు మరోసారి ఇలా జవాబిస్తోంది: “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు.” (ప్రసంగి 9:⁠5) మరణించి ‘ఏమియు ఎరుగని’ స్థితిలో ఉన్నవారు ఎక్కడైనా సరే వేదనను అనుభవించడం అసాధ్యం.

కల్పిత కథనం 5: మరణమంటే మన ఉనికికి శాశ్వతమైన ముగింపు.

మనం చనిపోయినప్పుడు ఉనికిలో లేకుండా పోతాం, అయితే దానర్థం అంతా అయిపోయిందనేమీ కాదు. విశ్వసనీయుడైన యోబుకు తాను మరణించాక పాతాళానికి అంటే సమాధికి వెళ్తానని తెలుసు. కాని ఆయన దేవునికి ఏమని ప్రార్థించాడో చూడండి: “నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతోమేలు నీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచినయెడల ఎంతో మేలు నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరుచున్నాను. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? . . . ఆలాగుండినయెడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను.”​—⁠యోబు 14:​13-15.

యోబు, తాను మరణించేంతవరకు విశ్వసనీయంగా ఉంటే సరైన సమయంలో దేవుడు తనను జ్ఞాపకం చేసుకొని తనను పునరుత్థానం చేస్తాడని నమ్మాడు. ప్రాచీన కాలాల్లోని దేవుని సేవకులందరికీ ఇదే నమ్మకం ఉండేది. ఈ నిరీక్షణను యేసు స్వయంగా దృఢపరుస్తూ, మరణించినవారిని లేపేందుకు దేవుడు తనను ఉపయోగించుకుంటాడని చూపించాడు. క్రీస్తు సొంత మాటలు మనకు ఆ నమ్మకాన్ని ఇస్తాయి: ‘దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు [యేసు] శబ్దము విని మేలుచేసినవారు జీవ పునరుత్థానమునకును కీడుచేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.’​—⁠యోహాను 5:​28, 29.

అతి త్వరలో దేవుడు దుష్టత్వాన్ని సమూలంగా తీసివేసి పరలోక పరిపాలన క్రింద ఒక క్రొత్త లోకాన్ని స్థాపిస్తాడు. (కీర్తన 37:​10, 11; దానియేలు 2:​44; ప్రకటన 16:​14, 16) తత్ఫలితంగా భూమి అంతా పరదైసుగా మారి, దేవుని సేవ చేసే వారితో అది నిండిపోతుంది. బైబిల్లో మనమిలా చదువుతాం: ‘అప్పుడు​—⁠ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.’​—⁠ప్రకటన 21:⁠3, 4.

భయం నుండి విముక్తి

పునరుత్థాన నిరీక్షణ గురించి తెలిసికోవడంతోపాటు, ఆ ఏర్పాటుకు మూలమైన వ్యక్తి గురించి కూడా తెలిసికోవడం మీకు ఓదార్పునివ్వగలదు. యేసు ఇలా వాగ్దానం చేశాడు: ‘మీరు సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.’ (యోహాను 8:​31, 32) దాంట్లో భయం నుండి మనల్ని విముక్తులను చేయడం కూడా ఉంది. నిజానికి, వృద్ధులై మరణించే ప్రక్రియను కేవలం యెహోవా మాత్రమే మార్చివేసి మనకు శాశ్వత జీవితాన్ని అనుగ్రహించగలడు. దేవుని వాగ్దానాలను మీరు నమ్మగలరా? తప్పకుండా నమ్మగలరు, ఎందుకంటే దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిజమవుతుంది. (యెషయా 55:​11) మానవాళిపట్ల దేవుని సంకల్పాల గురించి ఇంకా ఎక్కువ తెలిసికొమ్మని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. మీకు సహాయపడేందుకు యెహోవాసాక్షులు ఎంతో ఆనందిస్తారు.

[6వ పేజీలోని బ్లర్బ్‌]

మృత్యుభయంతో ఉన్న సమస్య ఏమిటంటే, అది జీవితాన్ని అనుభవించే సామర్థ్యాన్ని స్తంభింపజేయగలదు

[7వ పేజీలోని చార్టు]

మరణం గురించిన కొన్ని సాధారణ కల్పిత కథనాలు లేఖనాలు ఏమి చెబుతున్నాయి?

మరణం జీవితానికి సహజమైన ముగింపు ఆదికాండము 1:​28; 2:⁠17; రోమీయులు 5:​12

దేవుడు ప్రజలను తన దగ్గర ఉంచుకోవడానికి మరణం ద్వారా వారిని తీసుకువెళతాడు యోబు 34:​15; కీర్తన 37:​11, 29; 115:​16

దేవుడు చిన్న పిల్లలను దేవదూతలుగా మార్చడానికి తీసుకువెళ్తాడు కీర్తన 51:⁠5; 104:⁠1, 4; హెబ్రీయులు 1:⁠7,8, 14

మరణించిన తర్వాత కొందరు హింసించబడతారు కీర్తన 146:⁠4; ప్రసంగి 9:⁠5, 10; రోమీయులు 6:​23

మరణమంటే మన ఉనికికి శాశ్వతమైన ముగింపు యోబు 14:​14, 15; యోహాను 3:​16; 17:⁠3;అపొస్తలుల కార్యములు 24:​14, 15

[8వ పేజీలోని చిత్రం]

మరణం గురించిన సత్యాన్ని తెలుసుకోవడం మనల్ని భయం నుండి విముక్తులను చేస్తుంది

[5వ పేజీలోని చిత్రసౌజన్యం]

Barrators​—Giampolo/The Doré Illustrations For Dante’s Divine Comedy/Dover Publications Inc.