కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మరణం గురించి మీ దృక్పథం ఏమిటి?

మరణం గురించి మీ దృక్పథం ఏమిటి?

మరణం గురించి మీ దృక్పథం ఏమిటి?

మనమెంత ఆరోగ్యవంతులమైనా భాగ్యవంతులమైనా, దైనందిన జీవితంలో మృత్యు ఛాయ మన వెన్నంటే ఉంటుంది. మనం ఈసారి రోడ్డు దాటేటప్పుడే కావచ్చు, మంచం మీద పడుకొని ఉండగానే కావచ్చు, అది మనమీద ఎప్పుడైనా విరుచుకు పడవచ్చు. 2001 సెప్టెంబరు 11న న్యూయార్క్‌ నగరంలోనూ, వాషింగ్టన్‌ డి.సి.లోనూ తీవ్రవాదులు చేసిన దాడులవంటి విపత్తులు, ‘కడపటి శత్రువు’ మరణము అన్ని వర్గాల వారిని అన్ని వయస్సుల వారిని బలి తీసుకుంటుందనే వాస్తవాన్ని, కొన్నిసార్లయితే కేవలం కొన్ని నిమిషాల్లోనే వేలాదిమంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంటుందనే వాస్తవాన్ని మనం గ్రహించేలా చేస్తాయి.​—⁠1 కొరింథీయులు 15:​26.

అయినప్పటికీ, మరణం ప్రజలను ఆకర్షిస్తున్నట్లు అనిపిస్తుంది. మరణపు వార్తలు, ప్రత్యేకించి భయానకమైన పరిస్థితుల్లో అనేకమంది మరణించడాన్ని గురించిన వార్తలు, వార్తాపత్రికల అమ్మకాన్ని పెంచడానికీ టీవీ ముందరికి ఎక్కువమందిని ఆకర్షించడానికీ ఇతర వాటన్నిటి కంటే ఎక్కువగా దోహదపడుతున్నట్లున్నాయి. మరణం, యుద్ధంవల్లనే అయినా ప్రకృతి వైపరీత్యాలవల్లనే అయినా దౌర్జన్యంవల్లనే అయినా వ్యాధివల్లనే అయినా ప్రజలు మరణపు వార్తలతో విసిగిపోతున్నట్లు మాత్రం ఎప్పుడూ కనబడరు. మరణంపట్ల వీరికున్న ఈ విపరీత వైఖరి పేరుగాంచినవారు, ప్రముఖ వ్యక్తులు చనిపోయినప్పుడు కలగాపులగంగా వ్యక్తం చేయబడే మానసికోద్వేగంలో కనిపిస్తుంది.

మరణంపట్ల ప్రజలు చూపించే భిన్నమైన ఈ ప్రతిస్పందనలన్నీ త్రోసిపుచ్చలేనివే. ప్రజలు మరణమంటే అదీ ఇతరుల మరణమంటే ఇప్పటికీ ఆసక్తి చూపుతారు. అయితే తమ సొంత మరణం గురించి ఆలోచించడానికి మాత్రం బిర్రబిగుసుకుపోతారు. మనలో అత్యధిక శాతం కనీసం ఆలోచించడానికి కూడా ఇష్టపడని విషయాల్లో ఒకటి​—⁠మన సొంత మరణం.

మరణం విషయమై అయోమయంలో పడ్డారా?

మన సొంత మరణం గురించి ఆలోచించడాన్ని మనమెన్నడూ ఇష్టపడము, ఆ ఆలోచన ఎప్పుడూ అయిష్టంగానే ఉంటుంది. ఎందుకలా ఉంటుంది? ఎందుకంటే దేవుడు మనలో నిత్యం జీవించాలనే గాఢమైన కోరికను ఉంచాడు కాబట్టి. ‘ఆయన శాశ్వతకాల జ్ఞానమును [“నిత్యత్వాన్ని” ఏంఖర్‌ బైబిల్‌] నరుల హృదయమందుంచి యున్నాడు’ అని ప్రసంగి 3:⁠11 చెబుతోంది. ఆ కారణంగా, అనివార్యమైన మరణం మానవుల్లో ఒక అంతర్గత సంఘర్షణను, నిరంతరం మెదలాడే అస్తవ్యస్తాన్ని సృష్టించింది. ఈ అంతర్గత సంఘర్షణను కుదుటపరచుకొని, నిత్యం జీవించాలనే సహజమైన కోరికను తీర్చుకోవడానికి, మానవులు అమర్త్యమైన ఆత్మ సిద్ధాంతం నుండి పునర్జన్మ విశ్వాసం వరకు అన్ని రకాల విశ్వాసాలను కల్పించుకున్నారు.

ఏది ఏమైనా, మరణం కలతపరచే, భీతి కలిగించే సంఘటనే, అంతేకాదు ఈ మృత్యుభయం విశ్వవ్యాప్తంగా ఉన్నదే. కాబట్టి సామాన్య మానవ సమాజం మరణాన్ని సవాలుదాయకమైనదిగానే పరిగణించడాన్ని చూసి మనం ఆశ్చర్యపోకూడదు. ఒక విషయమేమిటంటే, ధనాధికారాలను వెంటాడడానికే అంకితమై పోయిన ఒక జీవితపు తుది నిరర్థకతను మరణం బట్టబయలు చేస్తుంది.

మరణంవల్ల దూరం చేయబడ్డారా?

గత కాలాల్లో సాధారణంగా, ప్రాణాంతకమైన అనారోగ్యంతో ఉన్న లేదా తీవ్రంగా గాయాలైన వ్యక్తిని ఆయనకు సుపరిచితమైన, ఇష్టమైన సొంత ఇంటి పరిసరాల్లో మరణించడానికి అనుమతించేవారు. బైబిలు కాలాల్లో తరచుగా అలాగే జరిగేది, కొన్ని సంస్కృతుల్లో అది ఇప్పటికీ ఉంది. (ఆదికాండము 49:​1, 2, 33) అటువంటి పరిస్థితుల్లో కుటుంబమంతా సమకూడుతుంది, సంభాషణలో పిల్లలు కూడా పాల్గొంటారు. ఇది, కుటుంబంలోని ప్రతి సభ్యుడికి తాను ఒక్కడే లేదా ఒక్కర్తే దుఃఖించడంలేదనే భావనతోపాటు, తన బాధ్యతను దుఃఖాన్ని పంచుకునేవారున్నారన్న ఓదార్పును ఇస్తుంది.

మరణం చర్చనీయాంశం కాదని భావిస్తూ, అదొక విచారకరమైన విషయమని పరిగణిస్తూ, పిల్లలు “తట్టుకోలేనిది” అని తలంచుతూ వారిని దానికి దూరంగా ఉంచుతున్న సమాజంలో జరిగేదానికి ఇది పూర్తి భిన్నంగా ఉంది. అయితే మరణం సంభవించే విషయంలో అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా ఉంది, ఇప్పుడైతే తరచూ ఒంటరితనంతోనే దాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. చాలామంది తమ కుటుంబ సభ్యుల ప్రేమపూర్వకమైన సేవలు అందుకుంటూ ప్రశాంతంగా ఇంట్లోనే కన్నుమూయాలని కోరుకుంటున్నప్పటికీ, అనేకమందికి ఎదురయ్యే చేదు అనుభవమేమిటంటే, వారు తరచూ ఒంటరిగా బాధననుభవిస్తూ, క్షణక్షణం భయం కలిగించే హై-టెక్‌ పరికరాలతో ఉన్న కనెక్షన్లతో హాస్పిటల్‌లలో మరణిస్తారు. మరోప్రక్కన, కోట్లకొద్ది ప్రజలు జాతి నిర్మూలన, కరవు, ఎయిడ్స్‌, అంతర్గత పోరాటం, లేదా కేవలం కడు బీదరికం వంటివాటికి బలై అనామకుల్లా మరణిస్తారు.

ఆలోచించాల్సిన విషయం

మరణం గురించి ఆలోచించడాన్ని బైబిలు నిరుత్సాహపరచదు. వాస్తవానికి, ప్రసంగి 7:2 మనకిలా చెబుతోంది: “విందు జరుగుచున్న యింటికి పోవుటకంటె ప్రలాపించుచున్నవారి యింటికి పోవుట మేలు; ఏలయనగా మరణము అందరికిని వచ్చును.” కాబట్టి మరణం అనివార్యమైనదన్న నగ్నసత్యం మన ఎదుట నిలవగానే, అప్పుడు మనం మన నిత్యకృత్యాల నుండి లేదా దినచర్యల నుండి వెనక్కి మళ్ళి శేష జీవితంపై దృష్టిని కేంద్రీకరిస్తాం. ఇది శేష జీవితాన్ని నిర్లక్ష్యంగా వెళ్ళబుచ్చకుండా లేదా వ్యర్థం చేసుకోకుండా మరింత అర్థవంతంగా గడపడానికి దోహదపడుతుంది.

మరణం గురించి మీ దృక్పథం ఏమిటి? మీరు మీ జీవితపు ముగింపు గురించిన భావాలను, నమ్మకాలను, నిరీక్షణలను, భయాలను పరిశీలించుకున్నారా?

జీవన్మరణాల నైజం గురించి వివరించడం గానీ వాటిని గ్రహించడం గానీ మానవుని సామర్థ్యానికి మించిన విషయం. ఆ విషయం గురించి మాట్లాడే విశ్వసనీయమైన అధికారం ఉన్నది కేవలం ఒకే ఒక్క వ్యక్తికి, ఆయనే మన సృష్టికర్త. ఆయనలో “జీవపు ఊట” ఉంది, అంతేకాదు ‘మరణమును తప్పించుట’ ఆయన వశములో ఉంది. (కీర్తన 36:⁠9; 68:​20) ఆశ్చర్యమనిపించినప్పటికీ, మరణం గురించిన కొన్ని ప్రఖ్యాతిగాంచిన నమ్మకాలను దేవుని వాక్యపు వెలుతురులో పరిశీలించడం ద్వారా, ఓదార్పు ఉత్తేజము రెండూ పొందగలుగుతాము. మరణం అంటే అంతా అయిపోయిందనేమీ కాదని ఆ పరిశీలన బయలుపరుస్తుంది.

[4వ పేజీలోని బ్లర్బ్‌]

మరణం తథ్యమన్న వాస్తవం, మనం మన జీవితాన్ని మరింత అర్థవంతంగా జీవించేందుకు దోహదపడుతుంది