యెహోవా నీతినిబట్టి ఆనందించండి
యెహోవా నీతినిబట్టి ఆనందించండి
“నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును.”—సామెతలు 21:21.
1. నేడు ప్రజలు అనుసరిస్తున్న ఏ మార్గాలు నాశనకరమైన ఫలితాలకు నడిపించాయి?
“ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును.” (సామెతలు 16:25) ఈ బైబిలు సామెత, నేడు అనేకమంది అనుసరించే మార్గాల గురించి ఎంత ఖచ్చితంగా తెలియజేస్తోందో కదా! సాధారణంగా ప్రజలు, తమ దృష్టికి మంచిదనిపించినదాన్ని చేయడానికే ఆత్రపడతారు, అలా చేసేటప్పుడు ఇతరుల ప్రాథమిక అవసరాలను సహితం నిర్లక్ష్యం చేస్తారు. (సామెతలు 21:2) పైకి మాత్రం తమ దేశపు చట్టాలనూ, ప్రమాణాలనూ గౌరవిస్తున్నామని వారు చెప్పుకుంటారు, కానీ వీలైనప్పుడల్లా యుక్తిగా వాటినుండి తప్పించుకోవడానికి చూస్తుంటారు. దాని ఫలితంగానే సమాజం విభజించబడింది, చిందరవందర అయ్యింది, చివరికి సమస్యల వలయంలో చిక్కుకుంది.—2 తిమోతి 3:1-5.
2. మానవాళి ప్రయోజనం కోసం అత్యవసరంగా కావలసింది ఏమిటి?
2 మన ప్రయోజనం కోసం, మొత్తం మానవాళి శాంతి భద్రతలకోసం న్యాయవంతమైన నీతియుక్తమైన ఒక చట్టం లేదా ప్రమాణం మనకు అత్యవసరంగా కావాలి, అది ప్రజలందరూ స్వీకరించడానికీ అనుసరించడానికీ ఇష్టపడేదై ఉండాలి. అయితే, ఏ న్యాయసూత్రమే గానీ ప్రమాణమే గానీ అది ఎంతటి తెలివితేటలు గలవాడూ, యథార్థవంతుడూ రూపొందించినదైనా గానీ ఆ అవసరాన్ని తీర్చలేదని స్పష్టమవుతోంది. (యిర్మీయా 10:23; రోమీయులు 3:10,11, 23) ఒకవేళ అలాంటి ప్రమాణమే గనుక ఉంటే అది ఎక్కడ లభిస్తుంది? అదెలా ఉంటుంది? అతి ప్రాముఖ్యమైన ప్రశ్నేమిటంటే, అలాంటి ప్రమాణం గనుక ఉంటే, దాన్ని బట్టి ఆనందిస్తూ మీరు దానికి లోబడి ఉంటారా?
నీతియుక్తమైన ప్రమాణాన్ని కనుగొనడం
3. ప్రజలందరికీ అంగీకారమైన, ప్రయోజనకరమైన ప్రమాణాన్ని ఇవ్వగల అర్హత ఎవరికి ఉంది, ఎందుకలా చెప్పవచ్చు?
3 ప్రతి ఒక్కరికి అంగీకారమైనదీ ప్రయోజనకరమైనదీ అయిన ప్రమాణాన్ని కనుగొనాలంటే, అన్ని జాతులకూ, సంస్కృతులకూ, రాజకీయ హద్దులకూ అతీతుడై, మానవులవలె కాక ఎంతో దూరదృష్టి కలిగివుండి, పొరపాట్లు చేయని వ్యక్తి దగ్గరకు మనం వెళ్ళాలి. అందుకు సాటిలేని విధంగా అర్హుడు, సర్వశక్తిమంతుడైన సృష్టికర్త అయిన యెహోవా దేవుడే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆయనిలా ప్రకటిస్తున్నాడు: “ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె యెషయా 55:9) అంతేకాదు, యెహోవా “నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు” అని బైబిలు వర్ణిస్తోంది. (ద్వితీయోపదేశకాండము 32:4) మూలభాషలో బైబిలంతటా “యెహోవా నీతిమంతుడు” అనే పదబంధం మనకు కనిపిస్తుంది. అయితే, కొన్ని బైబిలు అనువాదాలలో ఆ పదబంధం “యెహోవా న్యాయవంతుడు” అని అనువదించబడింది. (నిర్గమకాండము 9:27; 2 దినవృత్తాంతములు 12:6; కీర్తన 11:7; 129:4; విలాపవాక్యములు 1:18; ప్రకటన 19:2, ఈజీ-టు-రీడ్ వర్షన్) అవును, అత్యున్నత ప్రమాణం కోసం మనం యెహోవా వైపు చూడవచ్చు, ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు, నీతిమంతుడు.
నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.” (4. “నీతి” అనే పద భావమేమిటి?
4 అయితే ఇతరులకన్నా తామే నీతిమంతులమనో పరిశుద్ధులమనో భావించేవారిని చాలామంది తిరస్కార భావంతో, అలా చెప్పుకోవడానికి వారు తగనివారన్నట్లుగా దృష్టిస్తారు. అయినప్పటికీ, ఒక నిఘంటువు ప్రకారం “నీతిమంతుడు” అంటే న్యాయవంతుడు, యథార్థవంతుడు, సద్గుణవంతుడు, నిర్దోషి, పాపరహితుడు; దేవుని ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలకు లేదా సాధారణ నైతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండేవాడు; ధర్మానుసారంగా లేదా న్యాయానుసారంగా ప్రవర్తించేవాడు. అలాంటి లక్షణాలున్న చట్టాన్ని బట్టి గానీ ప్రమాణాన్ని బట్టి గానీ మీరు ఆనందించరా?
5. బైబిల్లో వ్యక్తం చేయబడిన నీతి అనే లక్షణాన్ని వర్ణించండి.
5 నీతి అనే లక్షణం గురించి ఎన్‌సైక్లోపీడియా జుడైకా ఇలా వ్యాఖ్యానిస్తోంది: “నీతి, సిద్ధాంతపరమైన ఒక తలంపు కాదుగానీ అన్ని సంబంధాల్లోనూ న్యాయవంతమైనదీ యుక్తమైనదీ చేయడం దాంట్లో ఇమిడివుంది.” ఉదాహరణకు దేవుని నీతి, ఆయన పరిశుద్ధత, పవిత్రతల్లా ఆయనలో అంతర్గతంగా ఉన్నదో వ్యక్తిగత లక్షణమో కాదు. దానికి భిన్నంగా, అది యుక్తమైన న్యాయవంతమైన మార్గాల్లో ఆయన నైజం యొక్క వ్యక్తీకరణ. యెహోవా పరిశుద్ధుడు, పవిత్రుడు కాబట్టి, ఆయన చేసేవన్నీ ఆయననుండి కలిగేవన్నీ నీతియుక్తమైనవని చెప్పవచ్చు. బైబిలు చెబుతున్న ప్రకారం, “యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు.”—కీర్తన 145:17.
6. పౌలు తన కాలంలోని కొందరు అవిశ్వాసులైన యూదుల గురించి ఏమన్నాడు, ఎందుకన్నాడు?
6 అపొస్తలుడైన పౌలు రోములోని క్రైస్తవులకు తాను వ్రాసిన ఉత్తరంలో ఈ అంశాన్ని నొక్కి చెప్పాడు. అవిశ్వాసులైన కొంతమంది యూదుల గురించి ఆయనిలా వ్రాశాడు: “వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడ లేదు.” (రోమీయులు 10:3) పౌలు వారిని ‘దేవుని నీతినెరుగనివారు’ అని ఎందుకు సంబోధించాడు? వారికి ధర్మశాస్త్రము అంటే దేవుని నీతియుక్త ప్రమాణాలు ఉపదేశించబడలేదా? నిజానికి వారికవి ఉపదేశించబడ్డాయి. అయినప్పటికీ వారిలో అనేకులు, తాము తోటి మానవులతో వ్యవహరించేటప్పుడు నీతిని, తమను నడిపించే ఒక ప్రమాణంగా దృష్టించే బదులు, మతసంబంధ నియమాలను చాలా కష్టపడుతూ ఎంతో నిష్ఠగా పాటించడం ద్వారా పొందే ఒక వ్యక్తిగత సద్గుణంగా మాత్రమే దృష్టించారు. యేసు కాలంనాటి మత నాయకుల్లాగే వీరు కూడా నీతిన్యాయాల అసలు భావాన్ని తప్పుగా అర్థంచేసుకున్నారు.—మత్తయి 23:23-28.
7. యెహోవా నీతి ఎలా వ్యక్తం చేయబడింది?
7 దీనికి పూర్తి భిన్నంగా, యెహోవా నీతి ఆయన వ్యవహారాలన్నింటిలోను వ్యక్తపరచబడడమే కాకుండా అది స్పష్టంగా కనబడుతుంది కూడా. ఆయన నీతి, ఆయనను ఉద్దేశపూర్వకంగా ఆజ్ఞలను మీరే వారి పాపాలను ఉపేక్షించని దేవునిగా చేసిననప్పటికీ, భయపడుతూ, దరిచేరనీయని భావరహితునిగా, నిక్కచ్చిగా అడిగే దేవునిగా మాత్రం చేయదు. బదులుగా ఆయన యొక్క నీతియుక్తమైన కార్యాలు మానవాళి ఆయనను సమీపించగలిగేలా, పాపం యొక్క భయంకరమైన దుష్పరిణామాలనుండి రక్షించబడేలా ఒక ఆధారాన్ని ఏర్పాటు చేశాయి. దీన్నిబట్టి యెహోవా ‘నీతిపరుడగు దేవుడు, రక్షించువాడు’ అని వర్ణించబడడం పూర్తిగా సముచితమైనది.—యెషయా 45:21.
నీతి, రక్షణ
8, 9. ధర్మశాస్త్రం దేవుని నీతిని ఏ యే విధాలుగా వ్యక్తం చేసింది?
8 దేవుని నీతికీ ఆయన ప్రేమపూర్వక ఏర్పాటైన రక్షణకూ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకొనేందుకు, ఆయన మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పరిశీలించండి. ఆ ధర్మశాస్త్రం నీతియుక్తమైనదనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మోషే తన చివరి మాటలుగా ఇశ్రాయేలీయులకు ఇలా గుర్తు చేశాడు: “నేడు నేను మీకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్రమంతటిలో నున్న కట్టడలును నీతివిధులునుగల గొప్ప జనమేది?” (ద్వితీయోపదేశకాండము 4:8) శతాబ్దాల తర్వాత, ఇశ్రాయేలు రాజైన దావీదు ఇలా తెలియజేశాడు: “యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి.”—కీర్తన 19:9.
* కానీ నేడు చాలామంది ఫిర్యాదు చేస్తున్నట్లు, ధర్మశాస్త్రంలో తెలియజేయబడినవి అంటే దేవుడు నీతియుక్తంగా అపేక్షించేవి, కఠినమైనవిగా ప్రజలకు బడలిక కలిగించే భారాలుగా ఉండి వారికి స్వేచ్ఛ, సంతోషం లేకుండా చేస్తున్నాయా?
9 ధర్మశాస్త్రం ద్వారా, మంచీ చెడులను గురించిన తన పరిపూర్ణమైన ప్రమాణాలను యెహోవా స్పష్టంగా తెలియజేశాడు. ఆ ధర్మశాస్త్రం మత సంబంధ విషయాల్లో మాత్రమే కాదుగానీ వ్యాపార వ్యవహారాల్లోనూ వైవాహిక సంబంధాల్లోనూ ఆహార నియమాల్లోనూ పారిశుద్ధ్య నియమాల్లోనూ న్యాయ విధుల్లోనూ ఇశ్రాయేలీయులు ఎలా ప్రవర్తించాలో స్పష్టంగా క్షుణ్ణంగా తెలియజేసింది. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే వారికి వ్యతిరేకంగా ఖచ్చితమైన ఆంక్షలు కూడా దానిలో ఉన్నాయి, కొన్ని విషయాల్లోనైతే చివరికి మరణశిక్ష కూడా విధించబడేది.10. యెహోవాను ప్రేమించేవారు ఆయన న్యాయసూత్రాల గురించి ఎలా భావిస్తారు?
10 లేదు, యెహోవాను ప్రేమించే వారు ఆయన నీతియుక్తమైన నియమాలను ఆజ్ఞలను బట్టి ఆనందించారు. ఉదాహరణకు మనం చూసినట్లుగా యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, న్యాయమైనవి అని దావీదు రాజు అంగీకరించడమే కాకుండా వాటిపై హృదయపూర్వకమైన ఇష్టాన్నీ కృతజ్ఞతా భావాన్నీ చూపించాడు. యెహోవా న్యాయసూత్రాల గురించి, న్యాయవిధుల గురించి ఆయనిలా వ్రాశాడు: “అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారుకంటెను కోరదగినవి తేనెకంటెను జుంటి తేనెధారలకంటెను మధురమైనవి. వాటివలన నీ సేవకుడు హెచ్చరిక నొందును వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును.”—కీర్తన 19:7, 10, 11.
11. ధర్మశాస్త్రం ఏ విధంగా ‘క్రీస్తు నొద్దకు నడిపించే బాలశిక్షకుడు’ అయ్యింది?
11 శతాబ్దాల తర్వాత, ధర్మశాస్త్రానికున్న మరింత గొప్ప విలువను పౌలు సూచించాడు. గలతీయులకు వ్రాసిన తన ఉత్తరంలో ఇలా వ్రాశాడు: “మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకు డాయెను.” (గలతీయులు 3:24) పౌలు రోజుల్లో, బాలశిక్షకుడు అంటే పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉండే ఒక సేవకుడు లేదా పనిచేసే వ్యక్తి. పిల్లలను చూసుకోవడం వారిని బడికి తీసుకువెళ్ళడం అతని బాధ్యతగా ఉండేది. అదేవిధంగా, ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయుల చుట్టుప్రక్కలనున్న దిగజారిపోయిన నైతిక, మత అలవాట్లనుండి వారిని కాపాడింది. (ద్వితీయోపదేశకాండము 18:9-13; గలతీయులు 3:23) అంతేకాకుండా ధర్మశాస్త్రం, ఇశ్రాయేలీయులు తమ పాపభరితమైన స్థితిని గ్రహించడమే కాక, తమకు క్షమాపణ, విమోచన అవసరమని గుర్తించేలా చేసింది. (గలతీయులు 3:19) బలిని అర్పించే ఏర్పాట్లు, విమోచనక్రయధన బలి అవసరతను సూచించడంతో పాటు నిజమైన మెస్సీయను గుర్తించడానికి అవసరమైన ఒక ప్రవచన మాదిరిని కూడా ఇచ్చాయి. (హెబ్రీయులు 10:1, 11-13) ఆ విధంగా, ధర్మశాస్త్రం ద్వారా యెహోవా తన నీతిని వ్యక్తం చేసేటప్పుడు, ప్రజల సంక్షేమాన్ని వారి శాశ్వత రక్షణను మనస్సులో ఉంచుకొనే అలా చేశాడు.
దేవునిచేత నీతిమంతులని ఎంచబడినవారు
12. ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా పాటిస్తే ఇశ్రాయేలీయులు ఏమి పొంది ఉండేవారు?
12 యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రం అన్ని విధాలా నీతియుక్తమైనది కాబట్టి, దాన్ని పాటించడం ద్వారా ఇశ్రాయేలీయులు దేవుని ఎదుట నీతియుక్తమైన స్థానాన్ని పొందగలిగేవారు. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించే ముందు, మోషే వారికి ఇలా గుర్తు చేశాడు: “మన దేవుడైన యెహోవా మన కాజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ద్వితీయోపదేశకాండము 6:25) అంతేగాక, యెహోవా వారికి ఇంకా ఇలా వాగ్దానం చేశాడు: “మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటివలన బ్రదుకును; నేను యెహోవాను.”—లేవీయకాండము 18:5; రోమీయులు 10:5.
ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనునప్పుడు మనకు నీతి కలుగును.” (13. తన ప్రజలు నీతియుక్తమైన ధర్మశాస్త్రాన్ని పాటించాలని యెహోవా కోరడం అన్యాయమా? వివరించండి.
13 అయితే, విచారకరంగా యెహోవా ‘సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించడంలో’ ఒక జనాంగంగా ఇశ్రాయేలీయులు విఫలులై, వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలను పొందలేకపోయారు. దేవుని ధర్మశాస్త్రం పరిపూర్ణమైనది, కానీ వారు పరిపూర్ణులు కాదు, కాబట్టి వారు దేవుని ఆజ్ఞలన్నింటినీ పాటించలేకపోయారు. అంటే దేవుడు అన్యాయస్థుడనో అనీతిమంతుడనో దీని భావమా? ఎంత మాత్రమూ కాదు. పౌలు ఇలా వ్రాశాడు: “కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు.” (రోమీయులు 9:14) వాస్తవమేమిటంటే ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందు ఇవ్వబడిన తర్వాత కూడా కొంతమంది వ్యక్తులు అపరిపూర్ణులూ పాపులూ అయినప్పటికీ, దేవునిచే నీతిమంతులుగా పరిగణించబడ్డారు. దేవునియందు భయభక్తులుగల అలాంటి ప్రజల పట్టికలో నోవహు, అబ్రాహాము, యోబు, రాహాబు, దానియేలు ఉన్నారు. (ఆదికాండము 7:1; 15:6; యోబు 1:1; యెహెజ్కేలు 14:14; యాకోబు 2:25) ఇప్పుడు ప్రశ్నేమిటంటే, ఈ వ్యక్తులు దేని ఆధారంగా దేవునిచేత నీతిమంతులుగా ఎంచబడ్డారు?
14. ఒక వ్యక్తి “నీతిమంతుడు” అని బైబిలు అన్నప్పుడు, దానర్థం ఏమిటి?
14 బైబిలు, ఒక వ్యక్తి “నీతిమంతుడు” అని అన్నప్పుడు ఆ వ్యక్తి పాపరహితుడనో పరిపూర్ణుడనో సూచించడం లేదు. బదులుగా, నీతిమంతుడు అంటే దేవుని ఎదుట, మనుష్యుల ఎదుట ఒకరికి ఉన్న బాధ్యతలను నెరవేర్చడమని దాని భావం. ఉదాహరణకు, నోవహు ‘నీతిపరుడు తన తరములో నిందారహితుడు’ అని పిలవబడ్డాడు. ఎందుకంటే ఆయన “దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.” (ఆదికాండము 6:9, 22; మలాకీ 3:18) బాప్తిస్మమిచ్చు యోహాను తల్లిదండ్రులైన జెకర్యా, ఎలీసబెతు, “ప్రభువుయొక్క సకలమైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి.” (లూకా 1:6) ఒక యూదేతరుడు, ఇటలీ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలీ ‘నీతిమంతుడు, దేవునికి భయపడువాడు’ అని వర్ణించబడ్డాడు.—అపొస్తలుల కార్యములు 10:22.
15. నీతికి దేనితో దగ్గరి సంబంధం ఉంది?
15 అంతేకాక, ఒక వ్యక్తి నీతికి కేవలం దేవుడు కోరుతున్న వాటిని చేయడంతో మాత్రమే కాదుగానీ అతని హృదయంలో ఉన్నదానితో అంటే యెహోవాపట్ల ఆయన వాగ్దానాలపట్ల ఉండే విశ్వాస ప్రేమా కృతజ్ఞతలతో చాలా సంబంధముంటుంది. అబ్రాహాము “యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను” అని లేఖనాలు చెబుతున్నాయి. (ఆదికాండము 15:6) దేవుడు ఉనికిలో ఉన్నాడని మాత్రమే కాదుగానీ “సంతానము” గురించి ఆయన చేసిన వాగ్దానముపై కూడా అబ్రాహాము విశ్వాసముంచాడు. (ఆదికాండము 3:15; 12:2; 15:5; 22:18) అలాంటి విశ్వాసం, ఆ విశ్వాసానికి అనుగుణంగా తీసుకొనే చర్యల ఆధారంగానే యెహోవా అబ్రాహాముతోనూ, విశ్వసనీయులైన ఇతరులతోనూ, వారు అపరిపూర్ణులైనప్పటికీ వారితో వ్యవహరించగలిగాడు, వారిని ఆశీర్వదించాడు.—కీర్తన 36:10; రోమీయులు 4:20-22.
16. విమోచన క్రయధనంపై విశ్వాసముంచడం వల్ల కలిగే ఫలితమేమిటి?
16 చివరిగా, మానవుల నీతి యేసుక్రీస్తు విమోచనక్రయధన బలియందలి విశ్వాసంపై ఆధారపడివుంది. అందుకనే మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు పౌలు ఇలా వ్రాశాడు: ‘కాబట్టి నమ్మువారు ఆయన [దేవుని] కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.’ (రోమీయులు 3:24) పౌలు ఇక్కడ పరలోక రాజ్యములో క్రీస్తుతో పాటు సహ వారసులుగా ఎన్నుకోబడిన వారి గురించి మాట్లాడుతున్నాడు. కానీ యేసు విమోచనక్రయధన బలి, ఇతర లక్షలాదిమందికి దేవుని ఎదుట నీతియుక్తమైన స్థానాన్ని పొందే అవకాశాన్ని కూడా ఇచ్చింది. అపొస్తలుడైన యోహాను ఒక దర్శనంలో “యెవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహము, . . . తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, . . . సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి” ఉండడాన్ని చూశాడు. తెల్లని వస్త్రములు దేవుని యెదుట వారి స్వచ్ఛతను, నీతిని సూచిస్తున్నాయి. ఎందుకంటే వారు “గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.”—ప్రకటన 7:9, 14.
యెహోవా నీతినిబట్టి ఆనందించండి
17. నీతిని అనుసరించడంలో తప్పకుండా తీసుకోవలసిన చర్యలు ఏవి?
17 మానవులు తన ఎదుట నీతియుక్తమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి మార్గంగా యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రేమపూర్వకంగా ఇచ్చినప్పటికీ, ఆ స్థానం ఊరకే లభించదు. ఒక వ్యక్తి విమోచనక్రయధనబలిపై తప్పకుండా విశ్వాసముంచాలి, దేవుని చిత్తానికి అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకోవాలి, యెహోవాకు సమర్పించుకొని దాన్ని నీటి బాప్తిస్మం ద్వారా సూచించాలి. ఆ తర్వాత, నీతితోపాటు ఇతర ఆధ్యాత్మిక లక్షణాలను కూడా అలవరచుకుంటూ ఆ వ్యక్తి ముందుకుసాగాలి. బాప్తిస్మం పొందిన, పరలోక నిరీక్షణ కలిగి ఉన్న క్రైస్తవుడైన తిమోతికి పౌలు ఇలా ప్రబోధించాడు: “నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము.” (1 తిమోతి 6:11; 2 తిమోతి 2:22) ‘కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి [“వెదకుతుండండి” NW]’ అని చెప్పినప్పుడు నిరంతరం ప్రయత్నించాల్సిన అవసరాన్ని యేసు కూడా నొక్కి చెప్పాడు. దేవుని రాజ్య ఆశీర్వాదాలను పొందడం కోసం మనం బాగా కృషి చేస్తుండవచ్చు, మరి యెహోవా నీతియుక్తమైన మార్గాలను అనుసరించడానికి కూడా అదేవిధంగా కృషి చేస్తున్నామా?—మత్తయి 6:33.
18. (ఎ) నీతిని అనుసరించడం ఎందుకు సులభం కాదు? (బి) లోతు ఉదాహరణ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
18 నీతిని అనుసరించడం అంత సులభమైన విషయమేమీ కాదు. ఎందుకంటే మనమందరం అపరిపూర్ణులమే, కాబట్టి సహజంగా మనం అవినీతి వైపుకు మ్రొగ్గుచూపుతాము. (యెషయా 64:6) అంతేకాక, యెహోవా నీతిమార్గాలను అంతగా పట్టించుకోని ప్రజల మధ్య మనం జీవిస్తున్నాం. మన పరిస్థితులు చాలామట్టుకు లోతు పరిస్థితుల్లాంటివే, ఆయన దుష్టత్వానికి పేరుపొందిన సొదొమ పట్టణంలో నివసించాడు. రాబోయే నాశనం నుండి లోతును రక్షించడం సబబేనని యెహోవా ఎందుకు అనుకున్నాడో అపొస్తలుడైన పేతురు వివరించాడు. ఆయన ఇలా అన్నాడు: “ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, తాను చూచినవాటినిబట్టియు వినినవాటినిబట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను.” (2 పేతురు 2:7, 8) అందుకే మనలో ప్రతి ఒక్కరం ఇలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘నా చుట్టుప్రక్కల ఉన్న అవినీతికరమైన అలవాట్లను నేను నా మనసులో ఆమోదిస్తున్నానా? ప్రఖ్యాతిగాంచిన దౌర్జన్యపూరిత వినోదాన్ని గానీ క్రీడలను గానీ కేవలం ఇష్టంలేనివిగా మాత్రమే భావిస్తున్నానా? లేక అలాంటి అవినీతికరమైన కార్యాలను బట్టి లోతులాగే నేనూ వేదన చెందుతున్నానా?’
19. దేవుని నీతినిబట్టి ఆనందిస్తే మనం పొందగల ఆశీర్వాదాలు ఏవి?
కీర్తన 15:1, 2) దేవుని నీతిని అనుసరిస్తూ, ఆ నీతినిబట్టి ఆనందించడం ద్వారా మనం ఆయనతో మంచి సంబంధాన్ని కొనసాగించగలం, నిరంతరం ఆయన అనుగ్రహాన్నీ ఆశీర్వాదాన్నీ పొందగలం. అప్పుడు మన జీవితంలో సంతృప్తి, ఆత్మ గౌరవము, మనశ్శాంతి ఉంటాయి. “నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును” అని దేవుని వాక్యం చెబుతోంది. (సామెతలు 21:21) అంతేకాక, మన ప్రయత్నాలన్నింటిలో ఏది న్యాయమైనదో ఏది నీతియుక్తమైనదో దాన్నే చేయడానికి మనకు సాధ్యమైనంతా కృషి చేస్తే, నైతికంగానూ ఆధ్యాత్మికంగానూ సంతోషకరమైన వ్యక్తిగత సంబంధాలు గల ఒక శ్రేష్ఠమైన జీవితాన్ని గడుపుతాం. కీర్తనకర్త ఇలా తెలియజేశాడు: “న్యాయము ననుసరించువారు ఎల్లవేళల నీతి ననుసరించి నడుచుకొనువారు ధన్యులు.”—కీర్తన 106:3.
19 అపాయకరమైన, అనిశ్చలమైన ఈ రోజుల్లో యెహోవా నీతినిబట్టి ఆనందించడం రక్షణా భద్రతలకు మూలం. “యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగినవాడెవడు?” అనే ప్రశ్నకు దావీదు రాజు ఇలా సమాధానం ఇచ్చాడు: “యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించు . . . వాడే.” ([అధస్సూచి]
^ పేరా 9 మోషే ధర్మశాస్త్రపు విస్తృతి గురించిన వివరాల కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) 2వ సంపుటిలో 214-20 పేజీల్లోని “ధర్మశాస్త్ర నిబంధనలోని కొన్ని అంశాలు” అనే ఆర్టికల్‌ను చూడండి.
మీరు వివరించగలరా?
• నీతి అంటే ఏమిటి?
• రక్షణకు దేవుని నీతికి మధ్య ఎలాంటి సంబంధం ఉంది?
• మానవులు నీతిమంతులని పరిగణించడానికి దేవునికి ఉన్న ఆధారం ఏమిటి?
• యెహోవా నీతినిబట్టి మనం ఆనందాన్ని ఎలా పొందగలం?
[అధ్యయన ప్రశ్నలు]
[15వ పేజీలోని చిత్రాలు]
దావీదు రాజు దేవుని న్యాయసూత్రాలపై తన హృదయపూర్వక ఇష్టాన్ని వ్యక్తం చేశాడు
[16వ పేజీలోని చిత్రాలు]
నోవహు, అబ్రాహాము, జెకర్యా, ఎలీసబెతు, కొర్నేలీలు దేవునిచేత నీతిమంతులుగా పరిగణించబడ్డారు. ఎందుకో మీకు తెలుసా?