ఐగుప్తు సంపదలకంటే గొప్పది
ఐగుప్తు సంపదలకంటే గొప్పది
చారిత్రక వ్యక్తుల్లోని అత్యంత గొప్పవారిలో మోషే ఒకడు. నిర్గమకాండము నుండి ద్వితీయోపదేశకాండము వరకున్న నాలుగు బైబిలు పుస్తకాలు, మోషే నాయకత్వం క్రింద ఉన్న ఇశ్రాయేలీయులతో దేవుడు వ్యవహరించిన విధానం గురించిన వివరాలను దాదాపు పూర్తిగా తెలియజేస్తాయి. మోషే, ఐగుప్తు నుండి విడుదలకు మార్గదర్శకుడయ్యాడు, ధర్మశాస్త్ర నిబంధనకు మధ్యవర్తిత్వం నెరిపాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని వాగ్దాన దేశపు సరిహద్దు వరకు నడిపించాడు. ఆయన ఫరో కుటుంబంలో పెంచబడ్డాడు, దేవుని ప్రజలపై ఆయన ఒక అధిపతిగా మాత్రమే కాక ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా, చివరికి దైవ ప్రేరేపిత రచయితగా కూడా అయ్యాడు. అయినప్పటికీ ఆయన “భూమిమీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.”—సంఖ్యాకాండము 12:3.
మోషే గురించి బైబిలు చెప్పే దాంట్లో ఎక్కువగా ఆయన చివరి 40 సంవత్సరాల జీవితం గురించి అంటే ఇశ్రాయేలీయులు బానిసత్వం నుండి విడుదల పొందినప్పటి నుండి ఆయన తన 120వ యేట మరణించేంత వరకు ఉంది. 40 యేండ్ల వయస్సు నుండి 80 యేండ్ల వయస్సు వరకు ఆయన మిద్యానులో ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. మొదటి 40 సంవత్సరాలు అంటే ఆయన పుట్టినప్పటి నుండి ఐగుప్తు నుండి పారిపోయేంత వరకు, “బహుశా అది ఆయన జీవితంలోని అత్యంత పారవశ్యం కలిగించే కాలం కావచ్చు, అయినా అది అత్యంత అస్పష్టమైన కాలం” అని ఒక గ్రంథం చెబుతోంది. ఆ కాలం గురించి మనం ఏమి తెలుసుకోవచ్చు? మోషే పెంపకం పరిస్థితులు, ఆయన పెరిగిన తర్వాత ఏమయ్యాడో అలా అయ్యేందుకు ఆ పరిస్థితులు ఆయనను ఎలా ప్రభావితం చేసి ఉంటాయి? ఏ ప్రభావాలకు ఆయన గురై ఉంటాడు? ఆయన ఎలాంటి కష్టాలను ఎదుర్కొని ఉంటాడు? ఇదంతా మనకేమి నేర్పించగలదు?
ఐగుప్తులో బానిసత్వం
ఐగుప్తులో స్థిరపడిన ఇశ్రాయేలీయుల సంతతి వేగంగా పెరిగిపోతున్నందుకు ఫరో భయపడడం ప్రారంభించాడని నిర్గమకాండము పుస్తకం చెబుతోంది. ఆయన తాను “యుక్తిగా” ప్రవర్తిస్తున్నాననుకుంటూ, వెట్టి పనులు చేయించే అధికారులను ఇశ్రాయేలీయులపై నియమించి వారితో అధిక భారాలను మోయిస్తూ, జిగటమంటితో పనులు చేయిస్తూ రోజువారీ వాటా ప్రకారం ఇటుకలను చేయిస్తూ వారిని కఠినంగా శ్రమపెడుతుండడం ద్వారా వారి సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నించాడు.—నిర్గమకాండము 1:8-14; 5:6-18.
మోషే జన్మించిన ఐగుప్తును గురించిన ఈ వర్ణన చారిత్రక రుజువులతో ఖచ్చితంగా సరిపోతుంది. ప్రాచీనకాలానికి చెందిన ఒక రెల్లు కాగితపు ప్రతి, రాతి కట్టడాలపై వేయబడిన చిత్రాలలో కనీసం ఒక చిత్రం, సా.శ.పూ. రెండవ సహస్రాబ్దిలో లేదా అంతకంటె
ముందటి కాలంలో బానిసలు మట్టి ఇటుకలను తయారుచేయడం గురించి తెలియజేస్తున్నాయి. ఇటుకలను పంపిణీ చేసే బాధ్యతగల అధికారులు వందలాది మంది బానిసలను 6 నుండి 18 మందిగల జట్లుగా ఏర్పాటు చేసి వారిని పర్యవేక్షించడానికి ఒక వ్యక్తిని నియమించేవారు. ఇటుకలు చేయడానికి మట్టిని త్రవ్వాలి, గడ్డిని ఇటుకల బట్టీ దగ్గరకు చేరవేయాలి. భిన్న తెగల పనివారు తోడిన నీళ్ళతో, బంకమట్టిని గడ్డిని వారు పారలతో కలిపేవారు. దీర్ఘచతురస్రాకారంలో ఉండే ఇటుకలను వరుసగా పేర్చుకుపోయేవారు. తర్వాత ఎండలో ఎండిన ఇటుకలను పనివారు కావడిలో నిర్మాణ స్థలానికి మోసుకువెళ్ళేవారు, కొన్నిసార్లు ఏటవాలుగా ఉండే బల్లద్వారా జారవేసేవారు. ఐగుప్తు పర్యవేక్షకులు, ఇనుప కమ్మీలను పట్టుకొని కూర్చొనో వారితోనే మెల్లగా నడుస్తూనో పనిని పర్యవేక్షిస్తుండేవారు.ప్రాచీన గణాంకాల ఒక నివేదిక తెలియజేస్తున్నట్లుగా, 602 మంది పనివారు 39,118 ఇటుకలు తయారుచేసేవారు. అంటే ఒక వ్యక్తి ఒకసారికి తాను పనిచేసే కాలంలో సగటున 65 ఇటుకలను తయారుచేసేవాడు. సా.శ.పూ. 13వ శతాబ్దానికి చెందిన ఒక దస్తావేజు ఇలా చెబుతోంది: “మగవారు ప్రతిరోజు తమ వాటా ఇటుకలను . . . తయారుచేసేవారు.” ఇవన్నీ నిర్గమకాండము పుస్తకంలో వర్ణించబడిన, ఇశ్రాయేలీయులతో దబాయించి చేయించుకున్న పనిని బాగా స్ఫురింపజేస్తున్నాయి.
నిరంకుశత్వం, హెబ్రీయుల జనాభాను తగ్గించడంలో విఫలమయ్యింది. దానికి బదులుగా, ‘ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టినకొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల యెడల అసహ్యపడ్డారు.’ (నిర్గమకాండము 1:10, 12) ఆ కారణంగానే ఫరో ఇశ్రాయేలీయులకు పుట్టే ప్రతి మగ శిశువును చంపేయమని మొదట హెబ్రీ మంత్రసానులకూ తర్వాత తన ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు. అలాంటి భయానక పరిస్థితుల్లో అమ్రాము, యోకెబెదులకు ఒక అందమైన బాబు, మోషే జన్మించాడు.—నిర్గమకాండము 1:15-22; 6:20; అపొస్తలుల కార్యములు 7:20.
దాచబడి, దొరికి, దత్తత చేసుకోబడడం
చంపేయమని ఫరో ఇచ్చిన ఆజ్ఞను మోషే తల్లిదండ్రులు ప్రతిఘటించి తమ చిన్నారి బాబును దాచిపెట్టారు. గూఢచారులు, ఇండ్లను వెతికేవారు శిశువుల కోసం అన్వేషిస్తుండగానే వాళ్ళలా చేశారా? లేక ఎప్పుడు చేశారన్నది మనం ఖచ్చితంగా చెప్పలేము. ఏది ఏమైనా మోషే తల్లిదండ్రులు ఆయనను మూడు నెలలకు మించి దాచలేకపోయారు. నిరాశతో మోషే తల్లి ఒక జమ్ము పెట్టెను తయారుచేసి దానిలోకి నీళ్ళు చొరబడకుండా జిగటమన్నును కీలును పూసి తన బిడ్డను అందులో పడుకోబెడుతుంది. ఒక విధంగా యోకెబెదు, హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నైలు నదిలో పారవేయమన్న ఫరో ఆజ్ఞలోని ఉద్దేశానికి అనుగుణంగా కాకపోయినా విధేయత చూపించింది. మోషేకు ఏమి సంభవిస్తుందో చూడడానికి ఆయన అక్క మిర్యాము కాస్త దూరంలో నిలబడింది.—నిర్గమకాండము 1:22-2:4.
ఫరో కూతురు స్నానం చేయడానికి ఆ నదికి వచ్చినప్పుడు మోషే ఆమె కంట పడాలని యోకెబెదు ఉద్దేశించిందో లేదో మనకు తెలియదు, కానీ జరిగింది మాత్రం అదే. ఆ శిశువు హెబ్రీయులదేనని ఆ యువరాణి గ్రహించింది. అప్పుడు ఆమె ఏమి చేసింది? తన తండ్రి ఆజ్ఞకు విధేయతగా ఆమె ఆ శిశువును చంపేయమని ఆజ్ఞాపించిందా? లేదు, సహజంగా చాలా మంది స్త్రీలు ప్రతిస్పందించేలాగే ఆమె ప్రతిస్పందించింది. ఆమె కనికరాన్ని చూపించింది.
మిర్యాము వెంటనే ఆమెను సమీపించి, “నీకొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా” అని అడిగింది. కొందరికి ఈ వృత్తాంతంలో గొప్ప నిర్గమకాండము 2:5-9.
వక్రోక్తి కనబడుతుంది. హెబ్రీయులతో “యుక్తిగా” ప్రవర్తించాలని తన సలహాదారులతో కలిసి పథకం వేసిన ఫరోకు భిన్నంగా, మోషే అక్క కూడా తన యుక్తిని మరో విధంగా ఉపయోగించింది. నిజానికి మోషే అక్క యోచనకు యువరాణి అంగీకరించిన తర్వాతే ఆయన సంక్షేమం నిశ్చయమయ్యింది. “వెళ్లుమని” ఫరో కుమార్తె చెప్పగానే మిర్యాము వెంటనే తన తల్లిని పిలుచుకొని వచ్చింది. ఒక గమనార్హ ఒప్పందం క్రింద, యోకెబెదు తన సొంత బిడ్డను రాజ సంరక్షణలో పెంచేందుకు దాదిగా కుదుర్చుకోబడుతుంది.—యువరాణి చూపించిన కనికరం నిస్సందేహంగా ఆమె తండ్రి క్రూరత్వానికి భిన్నమైనది. ఆ శిశువు గురించి ఆమెకు తెలియదనీ కాదు, ఆమె మోసం చేయబడనూ లేదు. ఆయనను దత్తత చేసుకునేందుకు కరుణతో కూడిన జాలి ఆమెను పురికొల్పింది, ఆమె ఒక హెబ్రీ దాదిని నియమించడానికి ఒప్పుకోవడాన్ని బట్టి తన తండ్రికున్నటువంటి దురభిమానాలు ఆమెకు లేవని తెలుస్తోంది.
పెంపకం, విద్య
యోకెబెదు ‘ఆ బిడ్డను తీసికొని పోయి పాలిచ్చి పెంచింది. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసికొని వచ్చింది, అతడు ఆమెకు కుమారుడయ్యాడు.’ (నిర్గమకాండము 2:9, 10) మోషే తన సొంత తల్లిదండ్రులతో ఎంతకాలం కలిసి జీవించాడన్నది బైబిలు చెప్పడం లేదు. కనీసం పాలు మరిచేంతవరకు అంటే రెండు మూడేండ్ల వరకు ఉండి ఉంటాడని కొందరు భావిస్తున్నారు, కానీ అంతకంటే ఎక్కువ కాలమే అయ్యుండవచ్చు. ఆయన తన తల్లిదండ్రుల దగ్గర ‘పెద్దవాడయ్యాడు’ అని మాత్రమే నిర్గమకాండము చెబుతోంది కాబట్టి అది ఏ వయస్సైనా కావచ్చు. ఏది ఏమైనా అమ్రాము యోకెబెదులు తమ కుమారునికి తాను హెబ్రీయులకు పుట్టాడన్న విషయాన్ని తెలియజేయడంలో, యెహోవా గురించి బోధించడంలో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారనడంలో సందేహం లేదు. వారు మోషే హృదయంలో విశ్వాసాన్ని, నీతి పట్ల ప్రేమను నాటడంలో ఎంతగా విజయవంతులయ్యారనేది కాలమే చెబుతుంది.
మోషే ఫరో కుమార్తె దగ్గరకు తిరిగి వచ్చిన తర్వాత “ఐగుప్తీయుల సకల విద్యలను” అభ్యసించాడు. (అపొస్తలుల కార్యములు 7:22) మోషేను ప్రభుత్వాధికారిగా అర్హుడ్ని చేసే విధంగా ఆ శిక్షణ రూపొందించబడిందని అది సూచిస్తోంది. ఐగుప్తులోని విస్తారమైన విద్యలో గణితశాస్త్రం, రేఖా గణితం, భవన నిర్మాణ విజ్ఞానం, నిర్మాణ శాస్త్రంతోపాటు ఇతర కళలు శాస్త్ర విజ్ఞానాలు ఉండేవి. బహుశా రాజ కుటుంబం ఆయన ఐగుప్తు మతంలో ఉపదేశం పొందాలని కోరివుండవచ్చు.
మోషే అందరికీ లభించని తన విద్యాభ్యాసాన్ని, రాజ కుటుంబం నుండి వచ్చిన ఇతర పిల్లలతోపాటు నేర్చుకొని ఉండవచ్చు. అలాంటి ఉన్నత విద్య నుండి ప్రయోజనం పొందేవారిలో “‘నాగరికులుగా’ చేయబడడానికి ఐగుప్తుకు పంపబడిన లేదా నిర్బంధితులుగా తీసుకురాబడిన, విదేశీ పాలకుల పిల్లలు” కూడా ఉండేవారు, వారు ఫరోకు నమ్మకమైన “సామంత రాజులుగా పరిపాలించేందుకు తిరిగి వచ్చేవారు.” (బెట్సీ ఎమ్. బ్రయన్ వ్రాసిన తుట్‌మోస్ IV పరిపాలన, [ఆంగ్లం]) రాజ భవనాలతో సంబంధం కలిగి ఉండే బాల్యగృహాలు యువతను ప్రభుత్వ అధికారులుగా సేవచేయడానికి సిద్ధపరుస్తుండినట్లు అనిపిస్తుంది. * ఐగుప్తు రాజ్యపరిపాలనలోని మధ్య కాలాలకు (11, 12 రాజవంశాలు) క్రొత్త కాలాలకు (18-20 రాజవంశాలు) చెందిన శిలాశాసనాలు ఫరో వ్యక్తిగత సహాయకులు ఉన్నత ప్రభుత్వాధికారులు పెద్దవాళ్ళయ్యాక కూడా “బాల్యగృహమంతటిలోకెల్లా శ్రేష్ఠమైన బాలుడు” అనే గౌరవనీయమైన పేరును కలిగి ఉండేవారని తెలియజేస్తున్నాయి.
రాజగృహంలో జీవితం మోషేను శోధించి ఉండవచ్చు. అది సంపదలు, విలాసాలతోపాటు అధికారాన్ని కూడా అందించింది. నైతిక ప్రమాదాలను కూడా ముందుంచింది. మోషే ఎలా ప్రతిస్పందించాడు? ఆయన ఎవరి పట్ల యథార్థంగా ఉంటాడు? ఆయన నిజంగా యెహోవా ఆరాధకుడా? అణచివేయబడుతున్న హెబ్రీయుల సహోదరుడా? లేక అన్యమత ఐగుప్తు అందించేవాటన్నింటిని ఆశించేవాడా?
అతి ప్రాముఖ్యమైన ఒక నిర్ణయం
మోషే పూర్తిగా ఒక ఐగుప్తీయునిగా మారబోయే సమయానికి నిర్గమకాండము 2:11-15; అపొస్తలుల కార్యములు 7:23-29. *
అంటే తన 40వ యేట, ‘తన జనుల భారములను చూడడానికి వారి వద్దకు వెళ్ళాడు.’ ఆయన అక్కడకు వెళ్ళింది కేవలం ఉత్సుకతతో మాత్రం కాదని ఆయన తర్వాతి చర్యలు చూపించాయి; వారికి సహాయం చేయడానికి ఆయన పరితపించిపోయాడు. ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుని కొట్టడం చూసినప్పుడు, ఆయన జోక్యం చేసుకొని అలా కొడుతున్న వ్యక్తిని చంపేశాడు. ఆయన హృదయం తన సహోదరులతో ఉందని ఆ చర్య చూపించింది. చనిపోయిన వ్యక్తి ఒక అధికారి అయ్యుండవచ్చు, అతను తన విధి నిర్వహణలో చంపబడ్డాడు. ఐగుప్తీయుల దృష్టిలో, ఫరోకు యథార్థంగా ఉండాలనడానికి మోషేకు అనేక కారణాలు ఉన్నాయి. కానీ మోషేను కదిలించింది కూడా న్యాయం పట్ల ఉన్న ప్రేమే, మరుసటి రోజు అన్యాయంగా తన తోటి వ్యక్తిని కొడుతున్న ఒక హెబ్రీయుని ఆయన గద్దించినప్పుడు ఆ లక్షణం మరింత వెల్లడయ్యింది. హెబ్రీయులను క్రూరమైన బానిసత్వం నుండి విడిపించాలని మోషే కోరుకున్నాడు, కానీ మోషే ఇక తన పక్షాన లేడని ఫరోకు తెలిసి ఆయనను చంపడానికి ప్రయత్నించాడు, అప్పుడు మోషే బలవంతంగా మిద్యానుకు పారిపోవాల్సి వచ్చింది.—దేవుని ప్రజలను స్వతంత్రులను చేయాలని మోషే కోరుకున్న సమయం, అలా చేయాలని యెహోవా సంకల్పించిన సమయంతో ఒకటి కాలేదు. అయినప్పటికీ ఆయన చర్యలు విశ్వాసాన్ని వ్యక్తపరిచాయి. ‘మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు’ అని హెబ్రీయులు 11:24-26 వచనాలు చెబుతున్నాయి. ఎందుకు? ఎందుకంటే, ‘ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు.’ కొంతకాలం తర్వాత మోషే ఒక ప్రత్యేకమైన నియామకాన్ని యెహోవా నుండి నేరుగా పొందాడన్న భావంలో, “అభిషిక్తుడు” అనే అర్థంగల “క్రీస్తు” అనే అపురూపమైన పద ప్రయోగం మోషేకు సరిగ్గా సరిపోతుంది.
ఒక్కసారి ఊహించండి! కేవలం ఒక ఉన్నత వంశీయుడైన ఐగుప్తీయుడు మాత్రమే పెంచబడే విధంగా మోషే పెంచబడ్డాడు. ఆయన స్థానం ఆయనకు ఒక విశిష్టమైన జీవనశైలిని, ఊహించతగిన ప్రతి ఆనందాన్ని ఇచ్చి ఉండేది, అయినప్పటికీ ఆయన వాటన్నింటినీ తిరస్కరించాడు. ఆయన యెహోవాపట్ల న్యాయంపట్ల తనకున్న ప్రేమవల్ల, క్రూరుడైన ఫరో రాజ గృహంలోని జీవితంతో రాజీపడలేకపోయాడు. తన పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు చేసిన వాగ్దానాలను గురించిన పరిజ్ఞానము, ఆ వాగ్దానాల గురించి ధ్యానించడం దేవుని అనుగ్రహాన్ని కోరుకునేలా మోషేను నడిపించాయి. తత్ఫలితంగా, యెహోవా తన సంకల్పాలను నెరవేర్చుకోవడానికి అత్యంత ప్రాముఖ్యమైన పాత్రలో మోషేను ఉపయోగించుకున్నాడు.
ఏవి అత్యంత ప్రాముఖ్యమైనవో వాటిని ఎంపిక చేసుకోవలసిన పరిస్థితిని మనమందరమూ ఎదుర్కొంటాం. మోషేలాగే, బహుశా మీరు కూడా క్లిష్టమైన నిర్ణయాన్ని తీసుకోవలసిన పరిస్థితిని ఎదుర్కోవచ్చు. మీరు ఏమి త్యాగం చేయవలసి వచ్చినప్పటికీ, ఏది ఏమైనా సరే అని, కొన్ని అలవాట్లను గానీ రాగల ప్రయోజనాలను గానీ వదులుకుంటారా? మీ ఎదుట ఉన్న ఎంపిక అదే అయితే, మోషే ఐగుప్తులోని సంపదలన్నింటి కంటే యెహోవా స్నేహాన్ని ఎక్కువ విలువైనదిగా పరిగణించాడనీ, దానికి ఆయన ఎన్నడూ విచారించలేదనీ గుర్తుంచుకోండి.
[అధస్సూచీలు]
^ పేరా 17 ఈ విద్య దానియేలు, ఆయన అనుచరులు బబులోనులో ప్రభుత్వ అధికారులుగా సేవ చేయడానికి పొందిన విద్యను పోలి ఉండవచ్చు. (దానియేలు 1:3-7) యెహోవాసాక్షులు ప్రచురించిన దానియేలు ప్రవచనానికి అవధానమివ్వండి! అనే పుస్తకంలోని (ఆంగ్లం) 3వ అధ్యాయంతో పోల్చి చూడండి.
^ పేరా 20 తాను శరణార్థిగా ఉంటున్న మిద్యానులో గొర్రెలను కాస్తున్న నిస్సహాయ యువతులను దౌర్జన్యం నుండి కాపాడడం ద్వారా మోషేకు న్యాయం పట్ల ఆసక్తి ఉందన్న విషయం మరింతగా స్పష్టం అవుతుంది.—నిర్గమకాండము 2:16, 17.
[11వ పేజీలోని బాక్సు]
దాదుల ఒప్పందాలు
సాధారణంగా తల్లులే తమ పసిబిడ్డలకు పాలిచ్చేవారు. అయితే, బ్రెవర్డ్ చైల్డ్స్ అనే విద్వాంసుడు జర్నల్ ఆఫ్ బిబ్లికల్ లిటరేచర్ అనే పుస్తకంలో, “[మధ్య ప్రాచ్య] ఉన్నత వంశీయుల కుటుంబాలు కొన్ని నిర్దిష్టమైన పరిస్థితుల్లో ఒక దాదిని జీతానికి కుదుర్చుకొనేవారు. తల్లి తన బిడ్డను పోషించలేనప్పుడు లేదా తల్లి ఎవరో తెలియనప్పుడు కూడా సాధారణంగా ఇలా చేసేవారు. దాది తాను ఒప్పందం కుదుర్చుకున్న కాలంలో ఆ బిడ్డను పెంచడం, పాలివ్వడం తన బాధ్యతగా తీసుకునేది.” ప్రాచీన మధ్య ప్రాచ్య ప్రాంతాల్లో లభించిన, దాదులకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాలు వ్రాయబడివున్న రెల్లుతో తయారు చేయబడిన కాగితాలు అనేకం ఇప్పటికీ ఉన్నాయి. ఈ దస్తావేజులు ఐగుప్తులో సుమేరియన్ కాలం నుండి హిల్లెనీయుల కాలం చివరి భాగం వరకు వ్యాప్తిలో ఉండిన అలవాటును ధ్రువీకరిస్తున్నాయి. ఈ దస్తావేజుల్లో సాధారణంగా ఉండే అంశాలేమిటంటే, ఆ ఒప్పందం ఎవరి మధ్యన జరిగిందో ఆ ఇరువురి వ్యాఖ్యానాలు, ఆ ఒప్పంద కాల పరిమితి, చేయవలసిన పనికి సంబంధించిన షరతులు, పోషణకు సంబంధించిన నిర్దిష్ట వివరాలు, ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే విధించబడే జరిమానాలు, వేతనాలు, అవి చెల్లించబడే విధానం వంటివి. సాధారణంగా, “పోషణ రెండు నుండి మూడు సంవత్సరాలపాటు జరిగేది” అంటూ చైల్డ్స్ వివరిస్తున్నారు. “శిశువు దాది ఇంట్లోనే పెంచబడుతుంది, కానీ అవసరమైనప్పుడు పెంపకం ఎలా జరుగుతోందో చూసుకోవడం కోసం ఆ శిశువును సొంత ఇంటికి తిరిగి పంపించాల్సి ఉంటుంది.”
[9వ పేజీలోని చిత్రాలు]
ప్రాచీన చిత్రాలు చూపిస్తున్నట్లుగా మోషే కాలంలో, ఐగుప్తులో ఇటుకలు చేసే విధానానికీ నేడు ఇటుకలు చేసే విధానానికీ ఏమంత తేడా లేదు [చిత్రసౌజన్యం]
పైన: Pictorial Archive (Near Eastern History) Est.; క్రింద: Erich Lessing/Art Resource, NY