కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవ నైతికతను నేర్చుకొని ఇతరులకు బోధించండి

క్రైస్తవ నైతికతను నేర్చుకొని ఇతరులకు బోధించండి

క్రైస్తవ నైతికతను నేర్చుకొని ఇతరులకు బోధించండి

“ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా?”​—⁠రోమీయులు 2:​21.

1, 2. బైబిలు అధ్యయనం చేయాలని కోరుకోవడానికి మీకున్న కారణాలు ఏమిటి?

దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి మీకు అనేక కారణాలున్నాయి. బహుశా మీరు బైబిలులో ఉన్న వాస్తవాలను అంటే ప్రజల గురించీ సంఘటనల గురించీ స్థలాల గురించీ ఇంకా ఇతర విషయాల గురించీ వాస్తవాలను తెలుసుకోవాలనుకోవచ్చు. త్రిత్వము లేదా నరకాగ్ని వంటి మతసంబంధమైన అబద్ధాలకు భిన్నమైన సిద్ధాంతపరమైన సత్యాన్ని తెలుసుకోవాలనుకోవచ్చు. (యోహాను 8:​32) మీరు యెహోవాలాగే ఉండగలిగేలా, ఆయన ఎదుట నీతియుక్తమైన ప్రవర్తనతో నడుచుకోగలిగేలా ఆయన గురించి కూడా బాగా తెలుసుకోవాలనుకోవచ్చు.​—⁠1 రాజులు 15:⁠4, 5.

2 దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి సంబంధించి ఒక ప్రాముఖ్యమైన కారణమేమిటంటే మీ ప్రియమైనవారికీ మీ పరిచయస్థులకూ చివరికి మీకు పరిచయం లేనివారికి కూడా బోధించడానికి మీరు సన్నద్ధులై ఉండాలన్నదే. ఇది నిజ క్రైస్తవుల ఇష్టానికి వదిలేయబడిన విషయమేమీ కాదు. యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; . . . నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.”​—⁠మత్తయి 28:​19, 20.

3, 4. యేసు ఆజ్ఞాపించిన ప్రకారం బోధించడం మీకెందుకు గౌరవార్హమైనది?

3 ఇతరులకు బోధించాలనే కోరికతో బైబిలు అధ్యయనం చేయడం గౌరవార్హమైనది, అది శాశ్వతమైన సంతృప్తికి మూలం కాగలదు. బోధించడం చాలా కాలం నుండి గౌరవనీయమైన వృత్తిగా ఎంచబడుతోంది. ఎన్‌కార్టా ఎన్‌సైక్లోపీడియా ఇలా పేర్కొంది: “యూదుల్లో చాలామంది పెద్దవాళ్ళు బోధకులను రక్షణకు నడిపించేవారిగా పరిగణించేవారు, తల్లిదండ్రులకంటే ఎక్కువగా బోధకులనే గౌరవించాలని తమ పిల్లలకు ఉద్బోధించేవారు.” బైబిలు అధ్యయనం చేయడం ద్వారా తమకు తాము బోధించుకోవడం ఆ తర్వాత ఇతరులకు బోధించడం ప్రత్యేకించి క్రైస్తవులకు గౌరవార్హమైనది.

4 “ఇతర అనేక వృత్తుల కంటే బోధనా వృత్తినే చాలామంది చేపడతారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల 80 లక్షలమంది స్త్రీపురుషులు ఉపాధ్యాయులుగా ఉన్నారు.” (ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా) చిన్న పిల్లలకు బోధించే బాధ్యత ఒక ఉపాధ్యాయునికి అప్పగించబడుతుంది, తర్వాతి కొన్ని సంవత్సరాల వరకు ఆయన వారిని ప్రభావితం చేయగలడు. అయితే ఇతరులకు బోధించమని యేసు ఇచ్చిన ఆజ్ఞను మీరు శిరసావహించినప్పుడు, అంతకంటే ఎంతో ఎక్కువగా అంటే వారి శాశ్వత భవిష్యత్తునే మీరు ప్రభావితం చేయగలుగుతారు. అపొస్తలుడైన పౌలు తిమోతికి ఉద్బోధించినప్పుడు ఆ విషయాన్నే నొక్కి చెప్పాడు: “నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.” (ఇటాలిక్కులు మావి.) (1 తిమోతి 4:​16) అవును, మీ బోధకు రక్షణకు సంబంధం ఉంది.

5. క్రైస్తవ బోధ ఎందుకు అత్యున్నత శ్రేణికి చెందినది?

5 మీకు మీరు బోధించుకొని ఇతరులకు బోధించాలని ఇవ్వబడిన అధికారమూ నిర్దేశమూ బోధకు సంబంధించిన అత్యున్నత మూలమైన విశ్వసర్వాధిపతి నుండి వచ్చినవి. ఆ ఒక్క వాస్తవమే ఈ రంగంలోని బోధను అంటే క్రైస్తవ బోధను ఇతర విద్యలన్నింటికంటే, అవి ప్రాథమిక విషయాలకు సంబంధించిన విద్యే గానీ ఉద్యోగ మెలకువలకు సంబంధించిన విద్యేగానీ చివరికి వైద్యపరమైన ప్రత్యేకతలకు సంబంధించిన విద్యే గానీ వాటన్నిటికంటే ఉన్నతమైనదిగా చేస్తోంది. ఒక క్రైస్తవుడు బోధించే దాంట్లో, దేవుని కుమారుడైన క్రీస్తు యేసును అనుకరించడాన్ని విద్యార్థి స్వయంగా నేర్చుకోవడం, అలాగే చేయమని ఆ విద్యార్థి ఇతరులకు బోధించడం ఉంది.​—⁠యోహాను 15:​10.

మీకు మీరు ఎందుకు బోధించుకోవాలి?

6, 7. (ఎ) మొదట మనకు మనం ఎందుకు బోధించుకోవాలి? (బి) మొదటి శతాబ్దపు యూదులు బోధకులుగా ఏ విధంగా విఫలులయ్యారు?

6 మనకు మనం మొదట బోధించుకోవాలని ఎందుకు చెప్పబడింది? ఎందుకంటే ముందుగా మనకు మనం బోధించుకోనిదే ఇతరులకు బోధించలేము. పౌలు తన కాలంలోని యూదులకు చెప్పిన ఆలోచింపజేసే ఒక వృత్తాంతంలో ఈ వాస్తవాన్ని నొక్కి చెప్పాడు, అయితే దాంట్లో ఒక ప్రాముఖ్యమైన సందేశం నేటి క్రైస్తవులకు కూడా ఉంది. పౌలు ఇలా అడిగాడు: “ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్లను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమానపరచెదవా?”​—⁠రోమీయులు 2:​21-23.

7 పది ఆజ్ఞలు సూటిగా పేర్కొన్న రెండు తప్పులను పౌలు అలంకారికమైన ప్రశ్నల ద్వారా ఉదహరించాడు, అవేమిటంటే వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు. (నిర్గమకాండము 20:​14, 15) పౌలు కాలంలోని కొందరు యూదులు తమ దగ్గర దేవుని ధర్మశాస్త్రముందని గర్వపడేవారు. వారు ‘ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందారు, వారే గ్రుడ్డివారికి త్రోవచూపువారని, చీకటిలో ఉండువారికి వెలుగని, బాలురకు ఉపాధ్యాయులని వారికి ధైర్యము చెప్పబడింది.’ (రోమీయులు 2:​17-20) అయితే, వారిలో కొందరు వేషధారులు రహస్యంగా దొంగిలించేవారు లేదా వ్యభిచరించేవారు. అది ధర్మశాస్త్రానికీ దాని పరలోకపు మూలకర్తకూ అవమానాన్ని తెస్తుంది. వారు ఇతరులకు బోధించడానికి ఎంతమాత్రం అర్హులు కాదని మీరు గ్రహించగలరు, వారు చివరికి తమకు తాము కూడా బోధించుకోలేదు.

8. పౌలు కాలంలోని కొందరు యూదులు ఏ విధంగా ‘గుళ్లను దోచుకొని’ ఉండవచ్చు?

8 గుళ్లను దోచుకోవడం గురించి పౌలు ప్రస్తావించాడు. కొందరు యూదులు నిజంగానే అలా చేశారా? పౌలు మనస్సులో ఏమి ఉండి ఉంటుంది? ఈ లేఖనంలో పరిమితంగా ఉన్న సమాచారం దృష్ట్యా, కొందరు యూదులు ఏ విధంగా ‘గుళ్లను దోచుకున్నారు’ అన్నది ఖచ్చితంగా చెప్పలేము. మొదట్లో ఎఫెసు పట్టణపు కరణము పౌలు తోటివారు “గుడి దోచినవారు కారు” అని ప్రకటించాడు, కాబట్టి కనీసం కొందరు యూదులు అలా నిందించబడడానికి అర్హులే అని ప్రజలు భావించారని ఆ వ్యాఖ్యానం సూచిస్తోంది. (అపొస్తలుల కార్యములు 19:​29-37) విజయయోధులు లేదా మతోన్మాదులు అన్యమత గుళ్ళ నుండి దోచుకువచ్చిన విలువైన వస్తువులను వాళ్లేమైనా ఉపయోగించుకుంటున్నారా లేక వాటితో వ్యాపారం చేస్తున్నారా? దేవుని ధర్మశాస్త్రం ప్రకారం, విగ్రహాల మీది వెండి బంగారాలను నాశనం చేయాలి, సొంత ఉపయోగం కోసం వాటిని తీసుకొనకూడదు. (ద్వితీయోపదేశకాండము 7:​25) * దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యం చేసి అన్యమత గుళ్లలోని వస్తువులను ఉపయోగించుకున్న లేదా వాటి నుండి ప్రయోజనం పొందిన యూదులను పౌలు పరోక్షంగా సూచిస్తుండవచ్చు.

9. యెరూషలేములోని మందిరంలో దాదాపు గుడిని దోచుకోవడంతో సమానమైన ఎలాంటి తప్పుడు పనులు జరిగి ఉండవచ్చు?

9 మరో ప్రక్కన జోసిఫస్‌ రోములో జరిగిన ఒక కుట్ర గురించి చెప్పాడు, అది నలుగురు యూదులు కలిసి పన్నిన పన్నాగం, వారి నాయకుడు ధర్మశాస్త్రాన్ని బోధించే ఒక బోధకుడు. వీరు నలుగురు యెరూషలేములోని మందిరానికి విరాళంగా వెండి బంగారాలను, ఇతర విలువైన వస్తువులను తమకు ఇచ్చేలా రోములోని ఒక యూదేతర స్త్రీని నమ్మించారు. వారు ఆమెనుండి వాటిని పొందిన తర్వాత ఆ ధనాన్ని తమ కోసమే వినియోగించుకున్నారు​—⁠అది ఒక విధంగా గుడిని దోచుకున్నట్లే. * ఇతరులేమో దోషపూరిత బలులను అర్పించడం ద్వారా, మందిరాన్ని “దొంగల గుహగా” మారుస్తూ మందిరంలోనే స్వార్థపూరితమైన వ్యాపారాన్ని పెంపొందించడం ద్వారా ఒక విధంగా దేవుని మందిరాన్ని దోచుకున్నారు.​—⁠మత్తయి 21:​12, 13; మలాకీ 1:​12-14; 3:⁠8, 9.

క్రైస్తవ నైతికతను బోధించండి

10. రోమీయులు 2:​21-23 వచనాలలో నమోదైన పౌలు మాటల్లో ఉన్న ఏ ముఖ్యాంశాన్ని మనం తప్పిపోకూడదు?

10 పౌలు ప్రస్తావించిన మొదటి శతాబ్దం నాటి తప్పుడు పనులలో దొంగతనము, వ్యభిచారము, గుళ్లను దోచుకోవడం వంటివి ఏవి ఉన్నా, ఆయన వ్యాఖ్యానాల్లోని ముఖ్యాంశాన్ని తప్పిపోకుండా ఉందాం. ఆయనిలా అడిగాడు: “ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా?” పౌలు లేవదీసిన ఉదాహరణలకు నైతికతతో సంబంధముండడం గమనించాల్సిన విషయం. అపొస్తలుడు ఇక్కడ బైబిలు సిద్ధాంతాలపై గానీ చరిత్రపై గానీ మనస్సు కేంద్రీకరించలేదు. తనకు తాను బోధించుకోవడం, ఇతరులకు బోధించడం అని పౌలు ప్రస్తావించిన దానికి క్రైస్తవ నైతికతతో సంబంధముంది.

11. మీరు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు క్రైస్తవ నైతికతకు ఎందుకు అవధానమివ్వాలి?

11 మనం రోమీయులు 2:​21-23 వచనాల్లోని పాఠాన్ని అన్వయించుకోవడమంటే దేవుని వాక్యం నుండి క్రైస్తవ నైతికతను నేర్చుకొని మనం నేర్చుకొన్న దాని ప్రకారం ప్రవర్తిస్తూ, అలాగే చేయమని ఇతరులకు ఉపదేశించడమని అర్థం. ఆ కారణంగానే, మీరు బైబిలు అధ్యయనం చేసేటప్పుడు నిజమైన క్రైస్తవ నైతికత దేని నుండి సేకరించబడిందో​—⁠యెహోవా యొక్క ఆ ప్రమాణాల సూచికలను​—⁠గ్రహించడానికి అప్రమత్తంగా ఉండండి. బైబిలులో మీరు కనుగొనే ఉపదేశాన్ని, పాఠాలను ధ్యానించండి. తర్వాత మీరు నేర్చుకొన్న వాటిని ధైర్యంగా అవలంబించండి. అలా చేయడానికి ధైర్యమూ కృతనిశ్చయమూ కావాలి. ఒకానొక నిర్దుష్టమైన సంఘటనలో చివరికి క్రైస్తవ నైతికతను వదిలేసే అవకాశమున్న లేదా వదిలేయాల్సిన అవసరమున్న పరిస్థితి ఎదురైనప్పడు అపరిపూర్ణులైన మానవులుగా సాకులను తర్కాలను వెతుక్కోవడం చాలా సులభం. బహుశా పౌలు ప్రస్తావించిన యూదులు, సహేతుకంగా రూఢిచేయడానికి లేదా ఇతరులను తప్పుదారి పట్టించడానికి అలాంటి తర్కాన్ని ఉపయోగించడంలో అనుభవజ్ఞులై ఉండవచ్చు. అయినప్పటికీ, వ్యక్తిగత ఇష్టాయిష్టాలను బట్టి క్రైస్తవ నైతికత విలువను తగ్గించకూడదనీ లేదా నిర్లక్ష్యం చేయకూడదనీ పౌలు మాటలు సూచిస్తున్నాయి.

12. మన మంచి ప్రవర్తన గానీ చెడు ప్రవర్తన గానీ యెహోవాపై ఏవిధంగా ప్రభావం చూపిస్తుంది, ఈ వాస్తవాన్ని మనసులో ఉంచుకోవడం ఎందుకు సహాయకరంగా ఉంటుంది?

12 మీరు బైబిల్లో కనుగొనే నైతికతను నేర్చుకోవడానికి ఆ తర్వాత దాన్ని పాటించడానికి అపొస్తలుడు ఒక కీలకమైన కారణాన్ని నొక్కి చెప్పాడు. యూదుల దుష్ప్రవర్తన యెహోవాకు అపకీర్తిని తెచ్చింది: “ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమానపరచెదవా? . . . మిమ్మునుబట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది?” (రోమీయులు 2:​23, 24) నేడు కూడా మనం క్రైస్తవ నైతికతను నిర్లక్ష్యం చేస్తే, దాని మూలకర్తను అవమానపరచినట్లే అవుతుంది. మరోవైపు మనం దేవుని ప్రమాణాలను దృఢంగా అంటిపెట్టుకొని ఉంటే అది ఆయనకు కీర్తిని తెస్తుంది. (యెషయా 52:⁠5; యెహెజ్కేలు 36:​20) ఈ విషయాన్ని తెలుసుకొని ఉండడం, మీరు శోధనలను గానీ క్రైస్తవ నైతికతను నిర్లక్ష్యం చేయడమే సులభమైన మార్గం లేదా చాలా అనువైన మార్గం అనిపించే పరిస్థితులను గానీ ఎదుర్కొంటే మీ తీర్మానాన్ని బలపరచగలదు. అంతేకాదు, పౌలు మాటలు మనకు మరో విషయాన్ని కూడా నేర్పిస్తున్నాయి. మీ ప్రవర్తన దేవునిపై ప్రభావం చూపిస్తుందని వ్యక్తిగతంగా ఎరిగి ఉండడంతో పాటు, మీరు ఇతరులకు బోధించేటప్పుడు, వారు తాము నేర్చుకొంటున్న నైతిక సూత్రాలను అన్వయించుకున్నప్పుడు అవి యెహోవాపై ఎలా ప్రభావం చూపిస్తాయో గ్రహించడానికి సహాయపడాలి. క్రైస్తవ నైతికత కేవలం సంతృప్తిని ఇవ్వడం, ఒకరి ఆరోగ్యాన్ని కాపాడడం మాత్రమే చేయదు. అది నైతికతను స్థాపించి, దాన్ని పాటించమని ప్రోత్సహిస్తున్న వ్యక్తిపై కూడా ప్రభావం చూపిస్తుంది.​—⁠కీర్తన 74:​10; యాకోబు 3:​17.

13. (ఎ) నైతికత విషయంలో బైబిలు మనకు ఎలా సహాయం చేస్తుంది? (బి) మొదటి థెస్సలొనీకయులు 4:​3-7 వచనాల్లోని ఉపదేశ సారాంశాన్ని చెప్పండి.

13 నైతికత ఇతర వ్యక్తులను కూడా ప్రభావితం చేస్తుంది. మీరు దాన్ని, దేవుని నైతిక ప్రమాణాలను పాటించడం యొక్క విలువనూ వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే పర్యవసానాలనూ తెలియజేసే, దేవుని వాక్యంలో ఉన్న ఉదాహరణల నుండి తెలుసుకోవచ్చు. (ఆదికాండము 39:​1-9, 21; యెహోషువ 7:​1-25) నైతికత గురించి సూటిగా చెప్పబడిన ఇలాంటి ఉపదేశాన్ని కూడా మీరు కనుగొనవచ్చు: “మీరు పవిత్రులై ఉండవలెననియు భోగవాంఛలకు దూరస్థులై ఉండవలెననియు దేవుడు కోరుచున్నాడు. మీ విషయమున ఇదే ఆయన సంకల్పము. మీలో ప్రతివ్యక్తియు పవిత్రముగ, గౌరవనీయముగ తన శరీరమును అదుపులో పెట్టుకొనుట తెలిసికొనవలెను. దేవుని ఎఱుగని అన్యజనులవలె మీరు వ్యామోహపూరితమగు కాంక్షతో మెలగరాదు. కనుక, ఈ విషయమున ఏ వ్యక్తియు తన సోదరునకు హానిచేయరాదు. అతని హక్కులను భంగము చేయదగదు. . . . అపవిత్రత యందు జీవింపుమని దేవుడు మనలను పిలువలేదు. పవిత్ర జీవనము గడుపుమనియే ఆయన పిలుపు.”​—⁠1 తెస్సలోనిక [థెస్సలొనీకయులు] 4:​3-7, పవిత్ర గ్రంథము క్యాతలిక్‌ అనువాదము.

14. మొదటి థెస్సలొనీకయులు 4:​3-7 వచనాల్లోని ఉపదేశం గురించి మిమ్మల్ని మీరు ఏమని ప్రశ్నించుకోవచ్చు?

14 లైంగిక దుర్నీతి క్రైస్తవ నైతికతను ఉల్లంఘిస్తుందని ఈ వృత్తాంతం నుండి దాదాపు ఎవ్వరైనా చూడగలరు. అయితే మీరు ఈ వృత్తాంతం నుండి ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పొందగలరు. కొన్ని లేఖనాలు అధ్యయనం చేయడానికి ధ్యానించడానికి గణనీయమైన మార్గాలను అందిస్తాయి, తత్ఫలితంగా మీ అంతర్దృష్టి పెరుగుతుంది. ఉదాహరణకు, వ్యభిచారం చేయడం ఒక వ్యక్తి ‘ఈ విషయములో తన సోదరునికి హానిచేసేలా, అతని హక్కులను భంగపరిచేలా’ చేయగలదని పౌలు చెప్పడంలోని భావమేమిటని మీరు ఆలోచించవచ్చు. ఏ యే హక్కులు ఇమిడి ఉన్నాయి? ఈ విషయం గురించిన సరైన అవగాహన మీరు క్రైస్తవ నైతికతను కాపాడుకొంటూ కొనసాగడానికి మిమ్మల్ని మరింతగా ఎలా ప్రేరేపిస్తుంది? అలా చేసిన పరిశోధన ఫలితాలు మీరు ఇతరులకు బోధించేందుకు, వారు దేవుణ్ణి ఘనపరిచేలా సహాయపడేందుకు మీరు మరింత సిద్ధపడి ఉండేలా ఎలా చేస్తాయి?

బోధించేందుకు అధ్యయనం చేయండి

15. వ్యక్తిగత అధ్యయనం ద్వారా మీకు మీరు బోధించుకోవడానికి మీరు ఏ ఉపకరణాలను ఉపయోగించుకోవచ్చు?

15 యెహోవాసాక్షులు తమకు తాము బోధించుకోవడానికి గానీ ఇతరులకు బోధించడానికి గానీ చేసే అధ్యయనంలో తలెత్తే ప్రశ్నలను లేదా విషయాలను పరిశోధించేందుకు వారు ఉపయోగించే ఉపకరణాలు వారి దగ్గర ఉన్నాయి. అనేక భాషల్లో లభించే ఒక ఉపకరణం వాచ్‌ టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌. అది మీ దగ్గర ఉంటే యెహోవాసాక్షుల బైబిలు ఆధారిత ప్రచురణల్లోని సమాచారాన్ని గుర్తించడానికి మీరు దాన్ని ఉపయోగించవచ్చు. మీరు విషయాల వారీగా లేదా లేఖనాల వారీగా ఉన్న పట్టికలో వెతకవచ్చు. యెహోవాసాక్షులకు అనేక ముఖ్య భాషల్లో అందుబాటులో ఉన్న మరొక ఉపకరణం వాచ్‌టవర్‌ లైబ్రరీ. కంప్యూటర్‌లో ప్రోగ్రామ్‌ చేయబడిన ఈ సీడీ రామ్‌లో ప్రచురణల్లోనుండి సేకరించబడిన విస్తృతమైన సమాచారం ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉంది. దీని ప్రోగ్రామ్‌ లేఖనాల అంశాలను చర్చలను వెతకడానికి సహాయపడుతుంది. వీటిలో ఒక్కటి లేదా రెండు ఉపకరణాలు మీకు లభ్యమైనట్లైతే, మీరు అధ్యయనం చేసేటప్పుడు అలాగే ఇతరులకు బోధించేటప్పుడు వాటిని క్రమంగా ఉపయోగించండి.

16, 17. (ఎ) మొదటి థెస్సలొనీకయులు 4:​3-7 లో పేర్కొనబడిన హక్కులపై సవివరమైన వ్యాఖ్యానాలు మీకు ఎక్కడ లభిస్తాయి? (బి) వ్యభిచారం ఏయే విధాలుగా ఇతరుల హక్కులకు భంగం కలిగించగలదు?

16 పైన పేర్కొన్న, 1 థెస్సలొనీకయులు 4:​3-7 వచనాల్లోని ఉదాహరణనే తీసుకుందాం. అందులో హక్కుల గురించిన ప్రశ్న తలెత్తింది. ఎవరి హక్కులు? ఆ హక్కులను ఏ విధంగా భంగం కలిగిస్తాడు? బహుశా మీరు ఈ వచనాలను విశదీకరించే అనేక వ్యాఖ్యానాలను పైన పేర్కొన్న అధ్యయన ఉపకరణాలతో కనుగొనవచ్చు, చివరికి పౌలు పేర్కొన్న హక్కుల మీద కూడా వ్యాఖ్యానాలను కనుగొనవచ్చు. మీరు అలాంటి వ్యాఖ్యానాలను లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) సంపుటి 1, 863-4 పేజీల్లో; నిజమైన శాంతిభద్రతలు​—⁠వాటిని మీరెలా పొందగలరు? (ఆంగ్లం) 145వ పేజీలో; కావలికోట, నవంబరు 15, 1989, (ఆంగ్లం) 31వ పేజీలో చదవవచ్చు.

17 అధ్యయనంలో కొనసాగుతుండగా, పౌలు మాటలు ఎంత నిజమైనవని ఆ ప్రచురణలు చూపిస్తున్నాయో మీరు చూడగలుగుతారు. ఒక వ్యభిచారి దేవునికి విరుద్ధంగా పాపం చేసి, తనను తాను వ్యాధులకు గురి చేసుకుంటాడు. (1 కొరింథీయులు 6:​18,19; హెబ్రీయులు 13:⁠4) వ్యభిచారం చేసే ఒక వ్యక్తి తాను ఎవరితో పాపం చేస్తాడో ఆ స్త్రీ యొక్క అనేక హక్కులకు భంగం కలిగిస్తాడు. ఆమెకు స్వచ్ఛమైన నైతిక స్థానం, మంచి మనస్సాక్షి లేకుండా చేస్తాడు. ఆమె అవివాహిత అయితే, వివాహబంధంలోకి కన్యగా ప్రవేశించేందుకు ఆమెకున్న హక్కును, అలా ఉండాలని కోరుకునేందుకు ఆమె కాబోయే భర్తకున్న హక్కును అతను భంగపరుస్తాడు. ఆమె తల్లిదండ్రులను, ఆమె వివాహిత అయితే ఆమె భర్తను అతడు బాధపెడతాడు. అవినీతికి పాల్పడిన వ్యక్తి తన సొంత కుటుంబం మచ్చలేని మంచి పేరును కలిగి ఉండేందుకు వారికున్న హక్కును పాడుచేస్తాడు. అతను క్రైస్తవ సంఘంలో ఒక సభ్యుడైతే, అతను దానికి అవమానాన్ని తెస్తాడు, ఆ సంఘానికున్న మంచి పేరును పాడు చేస్తాడు.​—⁠1 కొరింథీయులు 5:⁠1.

18. క్రైస్తవ నైతికతను గురించిన బైబిలు అధ్యయనం నుండి మీరెలా ప్రయోజనం పొందుతారు?

18 హక్కులను గురించిన అలాంటి వ్యాఖ్యానాలు ఆ లేఖనాన్ని లోతుగా అర్థం చేసుకునేందుకు మీకు సహాయం చేయడం లేదా? అలాంటి అధ్యయనం నిస్సందేహంగా ఎంతో విలువైనది. మీరు దానిలో కొనసాగుతుండగా, మీకు మీరు బోధించుకుంటారు. దేవుని సందేశపు సత్యసంధతపై, దాని ప్రగాఢమైన ప్రభావంపై మీకున్న అవగాహన పెరుగుతుంది. ఎటువంటి శోధన వచ్చినా క్రైస్తవ నైతికతను కాపాడుకోవాలనే మీ దృఢ నిశ్చయాన్ని మీరు బలపరచుకుంటారు. అంతేకాదు, ఒక బోధకుడిగా మీరు ఇంకా ఎంత ప్రభావం చూపగలరో ఆలోచించండి! ఉదాహరణకు, బైబిలు సత్యాన్ని ఇతరులకు బోధించేటప్పుడు, మీరు 1 థెస్సలొనీకయులు 4:​3-7 లేఖనాల గురించి వారికి వివరించి వారి అవగాహనను, క్రైస్తవ నైతిక విలువను అధికం చేయవచ్చు. ఆ విధంగా, మీ అధ్యయనం దేవుణ్ణి గౌరవించడానికి మీకే కాక ఇంకా అనేకులకు సహాయపడుతుంది. పౌలు థెస్సలొనీకయులకు వ్రాసిన ఉత్తరంలోని కేవలం ఒకే ఉదాహరణను మేమిక్కడ పేర్కొన్నాం. క్రైస్తవ నైతికతకు ఇంకా ఎన్నో పార్శ్వాలు ఉన్నాయి, అదే విధంగా మీరు అధ్యయనం చేసి, అన్వయించుకొని, బోధించగల అనేక ఇతర బైబిలు ఉదాహరణలు, ఉపదేశాంశాలు కూడా ఉన్నాయి.

19. మీరు క్రైస్తవ నైతికతను అంటిపెట్టుకొని ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

19 క్రైస్తవ నైతికతను కాపాడుకోవడంలోని జ్ఞానం గురించి సందేహమే లేదు. యాకోబు 3:⁠17 “పైనుండివచ్చు జ్ఞానము” స్వయంగా యెహోవా దేవుని నుండి వచ్చినది, అది “మొట్టమొదట పవిత్రమైనది” అని చెబుతోంది. దేవుని నైతిక ప్రమాణాలను పాటించాలని అది స్పష్టంగా సూచిస్తోంది. వాస్తవానికి, బైబిలును బోధించే విషయంలో తనకు ప్రాతినిధ్యం వహించేవారు “పవిత్రతలో” మంచి మాదిరిగా ఉండాలని యెహోవా కోరుతున్నాడు. (1 తిమోతి 4:​11,12) పౌలు తిమోతిల్లాంటి తొలి శిష్యులు అలాగే ఉన్నారని వారి జీవిత మాదిరులు నిరూపిస్తున్నాయి; వారు అనైతికతకు దూరంగా ఉన్నారు, పౌలు అయితే ఇలా కూడా వ్రాశాడు: “మీలో జారత్వమేగాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. . . . మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు.”​—⁠ఎఫెసీయులు 5:⁠3, 4.

20, 21. అపొస్తలుడైన యోహాను 1 యోహాను 5:⁠3 లో వ్రాసినదానితో మీరు ఎందుకు ఏకీభవిస్తారు?

20 దేవుని వాక్యంలో తెలియజేయబడిన నైతిక ప్రమాణాలు స్పష్టమైనవి, నిర్దిష్టమైనవి అయినప్పటికీ అవి క్రుంగదీసే భారాలవంటివి కావు. అపొస్తలులందరిలోకి ఎక్కువ కాలం జీవించిన అపొస్తలుడైన యోహాను విషయంలో ఇది స్పష్టమైంది. తన దశాబ్దాల జీవిత కాలంలో తాను గమనించిన దాని ఆధారంగా, క్రైస్తవ నైతికత హానికరమైనది కాదని ఆయనకు తెలుసు. దానికి భిన్నంగా, అది నీతియుక్తమైన ప్రయోజనకరమైన ఒక ఆశీర్వాదంగా రుజువయ్యింది. యోహాను ఇలా వ్రాస్తూ ఆ విషయాన్ని నొక్కి చెప్పాడు: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.”​—⁠1 యోహాను 5:⁠3.

21 అయితే, క్రైస్తవ నైతికతను పాటించడం ద్వారా దేవునికి విధేయత చూపించడమే శ్రేష్ఠమైన మార్గం, ఎందుకంటే అది మనల్ని సమస్యల నుండి దుష్ఫలితాల నుండి కాపాడుతుంది అని యోహాను చెప్పడం లేదన్న విషయం గమనించండి. క్రైస్తవ నైతికత ద్వారా యెహోవా దేవునికి విధేయత చూపించడం మన ప్రేమకు ఒక వ్యక్తీకరణ అనీ, ఆయనపై మనకున్న ప్రేమను వ్యక్తం చేయడానికి గల ఒక అమూల్యమైన అవకాశం అనీ మొదట అంగీకరించడం ద్వారా ఆయన దేవునికి విధేయత చూపడాన్ని గురించిన సరైన దృక్పథాన్ని స్పష్టంగా వ్యక్తం చేశాడు. నిజమే దేవుణ్ణి ప్రేమించాలని మనకు మనం బోధించుకోవాలన్నా ఇతరులకు బోధించాలన్నా ఆయన ఉన్నతమైన ప్రమాణాలను ముందుగా మనం అంగీకరించి వాటిని పాటించాలి. అవును దానర్థం క్రైస్తవ నైతికతను మనకు మనం బోధించుకోవడం ఇతరులకు బోధించడమే.

[అధస్సూచీలు]

^ పేరా 8 యూదులు అపచారం చేయలేదన్నట్లు చూపిస్తూ, జోసిఫస్‌ దేవుని ధర్మశాస్త్రాన్ని ఈ విధంగా తిరిగి పేర్కొన్నాడు: “ఎవ్వరు కూడా ఇతర పట్టణాలు ఆరాధించే దేవుళ్ళను దూషించకుండా, అన్య గుళ్లను దోచుకొనకుండా, ఏ దేవుని పేరునైన సమర్పించబడిన సంపదను తీసుకోకుండా ఉందురుగాక.” (ఇటాలిక్కులు మావి.)​—⁠జూయిష్‌ ఆంటిక్విటీస్‌, 4వ పుస్తకం, 8వ అధ్యాయం, 10వ పేరా.

^ పేరా 9 జూయిష్‌ ఆంటిక్విటీస్‌, 18వ పుస్తకం, 3వ అధ్యాయం, 5వ పేరా.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

• ఇతరులకు బోధించడానికి ముందుగా మనకు మనం బోధించుకోవడానికి ఎందుకు అధ్యయనం చేయాలి?

• మన ప్రవర్తన యెహోవాకు కీర్తిని గానీ అపకీర్తిని గానీ ఎలా తీసుకురాగలదు?

• ఒక వ్యభిచారి ఎవరి హక్కులను భంగపరచవచ్చు?

• క్రైస్తవ నైతికత గురించి మీ స్థిర నిశ్చయం ఏమిటి?

[అధ్యయన ప్రశ్నలు]

[22వ పేజీలోని చిత్రం]

“ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు”